“మనుచరిత్ర”–ఆదర్శదాంపత్యపు విలువలు – డా.పి.వి.లక్ష్మణరావు,

“మనుచరిత్ర” (హంసి చక్రవాక సంవాదం) –ఆదర్శదాంపత్యపు విలువలు

తెలుగు పంచమహాకావ్యాలలో ప్రథమ ప్రబంధం మనుచరిత్ర. మార్కండేయ పురాణంలోని ఒక చిన్న కథను తీసుకొని తన అద్భుత కవితాప్రావీణ్యంతో ఒక రసవత్కావ్యం సృష్టించి తెలుగు కవిత్వ ప్రేమికులకు వెలకట్టలేని మధురాతి మధురమైన కానుకనిచ్చాడు పెద్దన. ఒక వరణా ద్వీపవతీ తరంగిణిని, ఒక అరుణాస్పద పురాన్ని, ఒక ప్రవరుని ఒక వరూధినిని, ఒక స్వరోచిని, ఒక మనోరమను సృష్టించి పాఠకుల హృదయాలలో ఒక అలౌకిక దివ్య ప్రపంచాన్ని ఆవిష్కరించాడు.
‘మనుచరిత్ర’ అనే కావ్యప్రపంచంలో అడుగుపెట్టిన వారందరికీ- సిద్ధుని రాక, ప్రవరునికి పాద లేపం ఇవ్వడం, ఆ లేపన ప్రభావంతో ప్రవరుడు హిమాలయాలకు వెళ్ళడం, మధ్యాహ్నం కావడం, పాద లేపనం కరిగిపోవడం, అతిలోక లావణ్యవతి వరూధినిని చూడడం, వరూధినీ ప్రవరుల సంవాదం, వరూధిని మనసు విప్పి తన కోర్కెను వెల్లడించడం, ప్రవరుడు నిర్దాక్షిణ్యంగా తిరస్కరించడం, అగ్ని దేవుని ప్రార్ధించి అతడు తన నగరానికి వెళ్ళిపోవడం, మాయా ప్రవరుడు మాయమాటలతో వరూధినిని నమ్మించి ఆమెతో సంగమించడం, స్వరోచి జననం- ఈ ఘట్టాలన్నీ పాఠక హృదయాలపై గాఢమైన ముద్ర వేస్తాయి. మానవుల్లోని ప్రవృత్తి మార్గానికీ, నివృత్తి మార్గానికీ మధ్య పోరాటమే మను చరిత్ర కథా వస్తువు. భోగలాలసతకు, ఇంద్రియ నిగ్రహానికీ జరిగిన సంగ్రామమే ఈ ఇతివృత్తం.

ఇకపోతే ఆదర్శ దాంపత్యం అంటే ఎలా ఉండాలి? అనే విషయాన్ని ఓ రెండు పక్షుల మాటల్లో మనుచరిత్రలో పెద్దన ఎంతో అందంగా, సందేశాత్మకంగా వివరించి చెప్పాడు. స్త్రీలౌల్యాన్ని ఆనాడే నిరసించిన మనుచరిత్రలోని హంసి చక్రవాక పక్షి సంవాదాన్ని విశ్లేషించడమే ప్రస్తుత వ్యాసోద్ధేశం.

ఆదర్శ దాంపత్యం మంచి సమాజానికి పునాది:
భారతీయ సమాజంలో వివాహ వ్యవస్థకు ఒక ప్రధాన స్థానముంది. భార్యాభర్తలుగా స్త్రీ, పురుషులు కలసి మెలసి జీవిస్తూ తమ స్వార్థం కోసమే కాక సామాజిక శ్రేయస్సు కోసం పాటుపడాలని ఒక్కోసారి ఎంతటి కష్టాన్నైనా సహించా లనేది మన వివాహధర్మం. అలాంటి వివాహ ధర్మాన్ని కొందరు బంధం అంటారు… బంధనం అనుకుంటారు మరి కొందరు, నూరేళ్ల పంట అంటారు కొందరు.. నూతిలోని కప్పబతుకు అనుకుంటారు మరికొందరు, ఇద్దరు మనుష్యుల్ని కాదు మనసుల్ని కలపడమెలాగో తెలిస్తే… దీనిపై వాదనలుండవని కొంతమంది భావిస్తారు.

నూరేళ్ల పంటను పచ్చని సిరులతో పండించుకుంటున్న ఆదర్శదంపతులు మంచి సమాజానికి పునాది. దాంపత్యం అనేది పార్వతీపరమేశ్వరుల్లా (అర్థనారీశ్వరుల్లా) ఉండాలని పెద్దలు ఆశీర్వది స్తుంటారు. కాళిదాసు వీరిని వాక్కు, అర్థంలా కలిసి ఉన్నారని ‘వాగర్థావివ సంపృక్తౌ వాగార్థ ప్రతి పత్తయే! జగత: పితరౌ వన్దే పార్వతీ పరమేశ్వరౌ!!’ అంటూ వర్ణించాడు. వాక్కుకి అర్థం ఉండి తీరుతుంది. అర్థం లేని వాక్కు ఉండదు. అంటే దంపతులు సైతం పరస్పరానురాగం కలిగి ఉండాలి. అంతే కాదు భారతీయ సంప్రదాయంలో గృహస్థాశ్రమానికి కూడా ప్రాముఖ్యం ఎక్కువగా ఉంది. గృహస్థ ధర్మాలతో పాటు గృహస్థు లక్షణాలు కూడా మన సాహిత్యంలో విశిష్టంగా చెప్పబడి ఉన్నాయి. ధర్మార్థ కామ పురుషా ర్థాలను మానవుడు సాధించవలసిన విధానం మన ప్రాచీన సాహిత్యంలో చక్కగా పేర్కొనబడి ఉంది.

హంసి చక్రవాక సంవాదం – భార్యాభర్తల బంధం యొక్క విశిష్టత, స్త్రీ లౌల్య నిరసన:

ప్రకృతి నుండి మనం ఎన్నో విషయాలు నేర్చుకుంటాం. అతి చిన్నజీవి అయిన చీమ నుండి కూడా మంచి నడవడికను నేర్చుకోవచ్చు. చీమలు క్రమశిక్షణ, పరిశ్రమ అనే విషయాలను అందిస్తున్నాయి. అలాగే పశుపక్ష్యాదులు కూడా మానవజాతికి మంచిమార్గాన్ని ప్రబోధిస్తున్నాయి. ఏనాడో మార్కండేయ పురాణంలో చెప్పబడిన స్వరోచి కథని ఆధారంగా చేసుకొని రాయబడిన ‘మనుచరిత్ర’ ఈనాటి వారిక్కూడా ఆచరణ యోగ్యమైన నైతిక విలువలతో కూడిన ఒక జీవన సూత్రంలా కనిపిస్తోంది. స్త్రీలౌల్యాన్ని నిరసిస్తూ, ఆదర్శదాంపత్యం అంటే ఎలా ఉండాలి? అనే విషయాన్ని రెండు పక్షుల మాటల్లో ఎంతో అందంగా, సందేశాత్మకంగా చక్కటి సందేశాన్ని ఆ రోజుల్లోనే మానవాళికి అందించాడు అల్లసాని పెద్దన. మనుచరిత్ర ఆరో ఆశ్వాసంలో హంసి చక్రవాక సంవాదం అనే ఓ కథ ఉంది. ఇందులో చక్రవాక పక్షి హంసి (ఆడ హంస)కి భార్యాభర్తల బంధం యొక్క విలువను ఎంతో చక్కగా తెలియజెప్పింది.

పూర్వం స్వరోచి అనే రాజు ఉండేవాడు. ఆయన విద్యావంతుడు, బుద్ధిమంతుడై ఉండి ధర్మ బద్ధంగా పరిపాలన చేస్తుండేవాడు. అలాంటి స్వరోచి ఓ సంఘటనలో ఒకేసారి ముగ్గురిని పెళ్ళాడాల్సి వచ్చింది. తొలిగా మనోరమను, ఆ తర్వాత ఆమె స్నేహితురాళ్ళయిన విభావసి, కళావతి అనే మరో ఇద్దరు కన్యలను వివాహమాడాడు. మనోరమను వివాహమాడినందుకు ఆమె తండ్రి నుంచి ఆయుర్వేద విద్యను, విభావసి వల్ల మృగ, పక్షి జాతుల సంభాషణలను తెలుసుకొనే విద్యలను, కళావతి వల్ల సర్వ అభీష్టాలు తీర్చే పద్మినీ అనే విద్యను పొందాడు స్వరోచి. పద్మినీ విద్య ప్రభావంతో సంవృద్ధిగా అన్న పానీయాలు, వస్త్రాభరణాలు తరగని సర్వసంపదలను సొంతం చేసుకున్నాడు. నిరంతర సుఖ జీవనం ఆయనకు ప్రాప్తించింది.

నిత్యం తన భార్యలను తీసుకొని గంగానది ఒడ్డున ఉన్న అందమైన ఇసుక తిన్నెల మీద పూల తోటల్లో సరోవర తీరాలలోనూ హాయిగా విహరిస్తుండేవాడు. ఇలా విహరిస్తున్న రోజుల్లో ఓ రోజున స్వరోచి అందమైన చందన వృక్షాల సమీపంలో ఉన్న ఒక సరస్సు ఒడ్డుకు చేరుకున్నాడు. ఆ సరస్సులో ఆనందంగా విహరిస్తున్న ఓ ఆడహంస అక్కడికి సమీ పంలో విహరిస్తున్న ఆడ చక్రవాక పక్షిని తన వద్దకు రమ్మని రహస్యంగా పిలిచింది. స్వరోచిని.. అతడి భార్యలను చూపించింది. ఇలా ఏ భేదమూ లేకుండా ముగ్గురు స్త్రీలు ఒక పురుషుడితో జత కూడి వినోదించటమంటే ఎంత అదృష్టమోగదా, వారు పూర్వజన్మలలో ఎంత గొప్ప తపస్సు చేశారో కదా అని అంది.

“మెలcతకుc బతిపైనైనను
మెలcతుకపై పతికినైన మెలగు టెందున్
గలయది మెలcతకుc బతికిన్
వలపు సమంబగుట జన్మవాసన చెలియా!” (మనుచరిత్ర, షష్ట్యా,66 వ ప..)

అలాగే భార్యకు భర్తపైన, భర్తకు భార్యపైన వలపు కలగటం లోకసామాన్యమైన విషయమే కానీ భార్యాభర్తలిద్ద రికీ ఒకరిమీద మరొకరికి కొద్దిగా కూడా తేడా లేకుండా వలపు సమానంగా ఉండటం మాత్రం పూర్వజన్మ పుణ్యఫలమని నేను భావిస్తున్నానన్నది. ఇంకా

“కావున వీరియందు నధికంబగు కూరిమి గల్గియుండు నీ
భూవలయాధినాధునకుబొల్పుగ నీ విభునందు నగ్గలం
బీవనజాయతాక్షులకు నిచ్చc బ్రియంబంది గానc బూవునన్
దావియుcబోలె జాలc బ్రమదంబొనరించిరి నాకు నెచ్చెలీ!” (మనుచరిత్ర, షష్ఠ్యా,67 వ ప..)

ఈ ముగ్గురు స్త్రీల మీద రాజుకు ప్రేమ ఉన్నట్లే ఆ రాజుపై కూడా స్త్రీలకు సమాన ప్రేమ ఉంది. పువ్వు, పరిమళం పరస్పరం కలిసి ఉన్నట్టే వీరి ప్రేమానురాగాలు నాకు కనిపిస్తున్నాయి అని అంది ఆ హంసి. అప్పుడు చక్రవాకం హంసికి వాస్తవం ఏంటో నిర్మొహమాటంగా తెలియజెప్పాలనుకొని ఇలా అంది.

“ముదముననమ్మహీశుదొకముద్దియచూడcగనొక్క కాంతతో
సదమదమై కడంగి రతి సల్పుట తెల్లమిగా నెఱింగియున్
మది వివరించి రోయకభిమానము దక్కిన వీరికూరుముల్
వదలక పెద్ద సేసెదవు వందిగతిన్ దగవీ విచారముల్” (మనుచరిత్ర, షష్ఠ్యా,69 వ ప..)

చూడు హంసి!పైకి కన్పిస్తున్న ఈ భోగాల మెరుగులు చూసి ఇవన్నీ గత జన్మపుణ్యఫలాలని అనుకోవటం నాకు వింతగా అనిపిస్తుంది. ఈ రాజు ఒక స్త్రీతో మిగిలిన ఇద్దరిముందూ రమిస్తున్నా ఆ ఇద్దరూ వారిని ఏవగించటం, కోపగిం చటం ఏమీ చేయటం లేదు. వీళ్ళు ఆత్మగౌరవాన్ని వదిలి ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి ప్రేమను నీవు కూడా సమర్థిస్తూ స్తుతిం చటం ఏమీ బాగాలేదు. ఇలాంటిది కపట ప్రేమ తప్ప మరేమీ కాదు.

“పలువురయందునొక్కనికి బ్రాతియు నొక్కని యందు జూడ న
గ్గలమగు ప్రేమ పల్వురకుc గల్గుట యద్భుతమట్లు గాన ని
వ్వెలదుల యందుc గూర్మి పస వీనికి నేమియు లేదు వీనియం
దలవడనc గల్గదీ జలరుహాక్షులకున్ బ్రియమెవ్విధంబునన్!” (మనుచరిత్ర, షష్ఠ్యా,70 వ ప..)

ఒక పురుషుడికి అనేకమంది స్త్రీల మీద, అనేకమంది స్త్రీలకు ఒక పురుషుడి మీద అనురాగం కలగటంలో ఎప్పుడూ పారదర్శకత ఉండదు. స్వరోచికి అతడి భార్య మీదకానీ, భార్యలకు స్వరోచిపై కానీ నిజమైన ప్రేమ కొంచెం కూడా లేదన్నది నా భావన. దీనికి ఒక ఉదాహరణ చెబుతాను విను. రాజు తనను సేవించే పరివారం అందరితో అనుకూ లంగానే మాట్లాడినా అందరి మీదా అతడికి స్వచ్ఛమైన అనురాగం ఉండదు. అలాగే ఎంతమంది భార్యలున్నా మగవాడికి ఆ అందరి మీద గాఢానురాగం ఉండదు. ఇక్కడ చక్రవాక పక్షి మాటల్లో స్త్రీలోలత్వ నిరసన తెలుస్తున్నది.

తన భర్త మరొక స్త్రీని తన ఎదుటే కలిస్తే ఏ స్త్రీ కూడా ఆ భర్తపై మమకారంతో మెలగదు. ఇది అక్షర సత్యం. కనుక ఈ స్త్రీలకు రాజుమీద అభిమానం, మమకారం అనేవి ఉండనే ఉండవు. మరి ఎందుకిలా కలిసి ఉన్నారంటావా? అదంతా ధనాన్ని ఆశించి మాత్రమే. దాసదాసీ జనం ధనవంతుడిని చేరినట్లే వీరూ అలా చేరారు. అందుకనే వీరి దాంపత్యాన్ని నేను గొప్ప దాంపత్యం అని అనడం లేదు.
“తగులు నెవ్వc డొక్క తరుణికి నొకనికి
మెలత వలచునదియు మేలనంగ
వచ్చుc గాని పెక్కువనితలపైc గూర్మి
గలుగు ననుట బొంకు గాదె తరుణి!” (మనుచరిత్ర, షష్ఠ్యా,74 వ ప..)

ఒక పురుషుడికి ఒక స్త్రీ మీద, ఒక స్త్రీకి ఒక పురుషుడి మీద మాత్రమే కలిగిన అనురాగం శ్రేష్టమైంది. స్త్రీలలో నేను, పురుషుల్లో నా భర్త ఈ వాస్తవాన్ని గ్రహించి అలా మెలుగుతున్నాం కనుకనే మాది ఆదర్శ దాంపత్యం అయింది. ఎవరైనా ఎప్పుడైనా ఇలా ఉంటేనే అన్ని విధాలా శ్రేయోదాయకం’ అని ఆడచక్రవాక పక్షి హంసితో చెప్పింది. ఆదర్శ దాంపత్య లక్షణాలను ఇక్కడ చక్రవాక పక్షి మాటల్లో ఆనాడే సమాజానికి హితబోధ చేసిన తీరు అద్భుతంగా ఉంది. నీతిబోధని పక్షుల ద్వారా చేయడమనేది మరొక విశేషం. అందునా ప్రత్యేకించి చక్రవాక పక్షితోనే ఇలాంటి హితబోధ చేయడానికి కూడా కారణముంది. అదేంటంటే నిజమైన భార్యాభర్తల బంధానికి చక్రవాక పక్షుల జంటే నిదర్శనం కాబట్టి. ఆ విషయం వాల్మీకి రామాయణ రచనకు కారణమైన “మా నిషాథ! ప్రతిష్ఠాం త్వమగమశాశ్వతీ స్సమా: యత్క్రౌంచ మిథునాదేక మవధీ: కామమోహితమ్!!” అనే శ్లోకం ద్వారా తెలుస్తున్న కథలో మగపక్షి చావుతో తన ప్రాణాన్ని కూడా త్యజించిన ఆడపక్షి త్యాగం ద్వారా తెలుస్తుంది.

ఈ ‘హంసి చక్రవాక సంవాదాన్ని’ విన్న రాజధర్మాన్ని మరచిపోయి వ్యక్తిగత సుఖాలకి అలవాటుపడిపోయిన స్వరోచి లజ్జతో తలదించుకొని ఉస్సురుమన్నాడు. కానీ మానలేని తమకంతో తన భార్యలతో మరొక వంద సంవత్సరాల కాలం పాటు కామకేళీ విలాసాలతో సుఖమయ జీవితాన్ని అనుభవించాడు. ఆ తర్వాత మరొక సంఘటన జరిగింది. ఒక మగలేడిని చాలా ఆడలేళ్ళు వెంబడించగా ఆ మగలేడి

హుంకారం బొనరించి వే తలcగుcడోహో నేను స్వారోచినే
పంకేజాక్షులతొడ నెల్లపుడు దర్పస్ఫూర్తిc గ్రీడింప ల
జ్జాంకూరం బడcగించినారు తలపోయన్ నాకు రోcతయ్యెమీ
రింకన్ బోయివరింపుc డొక్కరుని భోగేచ్ఛన్ నివారించితిన్” (మనుచరిత్ర, షష్ఠ్యా,79 వ ప..)

తనను వెంబడిస్తున్న ఆడలేళ్లపై కోపించి కలకాలం స్త్రీలతో కలిసి రమించడానికి నేను స్వరోచిని కాదు. మీరు లజ్జను త్యజించి విహరించుచున్నారు. మీ ప్రవర్తన నాకు అసహ్యాన్ని కల్గిస్తున్నది. కాబట్టి మీ ద్వారా సౌఖ్యాన్ని పొందడానికి నాకు ఇష్టం లేదు కావాలంటే మీరు మరొక మగలేడిని చూసుకోండి పొమ్మని అన్నది. ఇక్కడ మగలేడి యొక్క తిరస్కార భావం ద్వారా బహుభార్యత్వం/ఒక పురుషుడు అనేకమంది స్త్రీల పట్ల ఆసక్తి కలిగి ఉండటం/ఒక పురుషున్ని అనేక మంది స్త్రీలు కోరుకోవడం లాంటి వాటిని నిర్మొహమాటంగా వ్యతిరేకించినట్లు తెలుస్తున్నది. ఇంకా

‘బరువనకింతులం దనకుc బల్వురc గూర్చుట భోగవాంఛcగా
కరయcగ నొండు గాదు ధనమన్న ధ్రువంబుగ నంగనాజనో
త్కారసముపార్జితం బటులుగావున వీనికి లేదిహంబునుం
బరమును నన్ను నట్ల పఱుపంబనిలేదిది చెప్పనేటికిన్’ (మనుచరిత్ర, షష్ఠ్యా,80 వ ప..)

మగవాడు తనకు కలిగిన కష్టాన్ని ఆలోచించకుండా సుందరీమణులైన ఆడవాళ్ళను కోరు కోవడం రతి కాంక్ష చేతనే కాని ఇంకొక దానితో కాదు. ఈ స్వరోచి భాగ్య సంపద తన భార్యల వలనే ఆర్జించబడింది. ఇది నిశ్చయమైన మాట. ఆలోచించడానికి మరేమీ లేదు. కాబట్టి ఈ రాజు ఇహము పరముల గురించి ఆలోచించదలచటం లేదు. ఇతని లాగే నన్ను కూడా ఎందుకూ పనికి రాని వాడిగా భావించవద్దు. ఈ స్వరోచి లాగా స్త్రీలకు లొంగిపోయి తిరగడానికి నేను పిచ్చివాడను కాను. నా యందు గల ప్రేమను వీడి మరలిపొండి అని అనగా ఆ ఆడలేళ్ళు ఆలస్యం చేయక బయలుదేరి పోయినవి.

మొదట స్వరోచి తన ముగ్గురి భార్యలతో ఉద్యానవనాల్లో విహరించే సమయంలో హంసికి చక్రవాక పక్షికి జరిగిన సంవాదాన్ని విన్నాడు. కానీ ఏమాత్రం మార్పు రాకపోగా మరొక 100 సంవత్సరాల కాలం పాటు భార్యలతో కామకేళీ విలాసాలలో మునిగి పోయాడు. ఆ తర్వాత మరొక సంఘటన జరిగింది. ఆ సంఘటనలో ఒక మగలేడిని చాలా ఆడలేళ్ళు వెంబడించడం, ఆ మగలేడి తిరస్కారభావంతో పలికిన మాటలు విన్న స్వరోచి మనసుకి కొంత బాధ కలిగింది. అయినప్పటికీ చెంచలమైన చిత్తంతో ఆడవాళ్ళు రోతలకు పుట్టినిల్లు అని మనసులో అనుకొంటూనే, తన కోరికలను జయించలేని వాడై అవివేకంగా 600 సంవత్సరాల కాలం పాటు తన భార్యలతో సుఖమయజీవితాన్ని గడిపాడు.

ఇలా జరిగిన మొదటి సంఘటనలో స్వరోచికి భోగపరమైన విషయాల్లో కొంతమేరకు విముఖత కల్గింది. రెండవ సన్నివేశంతో అతనిలో ఉన్న స్త్రీవాంఛ కొంతమేరకు తగ్గినది. కానీ అతను ఏమాత్రం ఇంద్రియ నిగ్రహం లేని వాడు కావడం వల్ల అలా ప్రవర్తించాడు. ఆ తరువాత తన ముగ్గురు భార్యల ద్వారా ముగ్గురు కుమారులను పొంది వారిని వేర్వేరు రాజ్యాలకు పట్టాభిషిక్తులను గావించి తన మనసులోని కామాన్ని కూడా క్రమంగా జయించగలగసాగాడు.

అలాంటి సమయంలో ఒకరోజు వేటకు వెళ్ళి అరణ్యంలో ఒక వరాహాన్ని వేటాడబోగా, ఒక ఆడలేడి మనుష్య భాషలో ఈ వరాహం నీకేమి అపకారం చేసింది? చేయలేదు కదా! దాని మీద కోపం చూపించడం ఎందుకు? అని ప్రశ్నించి, ఆ వరాహాన్ని వదిలి వేసి తనను చంపమని కోరింది. నీవు లేడివి కదా. నేనెలా నీ కోరికను తీర్చగలుగుతాను. అని స్వరోచి ప్రశ్నింపగా తనను అనురాగంతో కౌగిలించుకుంటే చాలునని కోరింది ఆ వరాహం. దానితో స్వరోచి ఆ ఆడ లేడిని కౌగిలించుకోగా అది ఒక మనోహర సౌందర్యం కలిగిన స్త్రీగా మారిపోయి నేను ఈ వనదేవతను! దేవతలు నన్ను నీ వలన మనువుని పొందమని నిర్దేశించగా వచ్చాను నన్ను పరిగ్రహించుము అని కోరింది. దానికి

“అట్లకాకని యయ్యంబుజాయతాక్ష
నేక చిత్తంబుతోడ నంగీకరించె
బాలయిట్లు సుఖాంబుద్ధిc దేలు చుండి
యంత గర్భిణియై శుభంబగు దినమున” (మనుచరిత్ర, షష్ఠ్యా,98 వ ప..)

ఈ పద్యాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే స్వరోచిలో ఎలాంటి కామభావమూ లేదని తెలుస్తుంది. అతనిలో కామవాంఛ లేదని స్పష్టం చేయడానికే ‘బాలయిట్లు సుఖాంబుధిc దేలినదని’ పలికెనే కాని ‘ఉభయులునూ సుఖాంబుధిc దేలినట్లు’ గా తెలుపలేదు. క్రమంగా కామవాంఛలను నశింపజేసుకొని, సంపూర్ణ సద్గుణములతో పరిణతి నొందిన ఆ స్వరోచికి వనదేవత ద్వారా స్వారోచిష మనువు జన్మించెను.

ఇకపోతే సమకాలీన సామాజిక పరిస్థితులలో, కలియుగ ప్రోత్సాహమైన ధర్మం ఒంటికాలు కూడా కుంటువడ డంతో, సంక్షుభిత ఆర్థికరంగ ప్రభావంతో ‘ధర్మేచ..’ నిరర్ధకమైపోతున్నది, ”అర్ధేచ…” వ్యర్ధపదమైపోయింది. ఈప్సితాల, ఆకాంక్షల పర్యాయ పదమైన ”కామేచ” కామాంధ తమసాలు క్రమ్ముకోవడంతో, కేవలం శారీరక లైంగిక వాంఛకే పరిమి తమై, పరమ ధర్మార్థ మైన దాంపత్య భక్తిలో, నిబిడమైన కాంతి జేగీతని కోల్పోయింది. ధర్మేచ, అర్ధేచ, కామేచ…” అన్న పూర్వీకులు నిజంగా గడుసువాళ్ళు కనుకనే, ‘వెూక్షేచ..’ అని కూడా అనకుండా అంతటితో సరిపెట్టేశారు. ప్రాపంచిక జీవనంలోనే బెడిసికొట్టి, పటాపంచలై తునాతునకలై విడాకులై కుక్కలు చింపిన విస్తర్లు అయిపోతున్న దాంపత్యాలు ఆధ్యాత్మిక జీవనరధ్యలో, పయనించి, ఆముష్శిక లక్ష్యం సాధించలేవన్న ముందు చూపుతోనే ‘వెూక్షేచ..’ అనలేదేమో? ఆ విజ్ఞులైన పూజ్యులు.

అందుకే ఇలాంటి పరిస్థితిలో ఉన్న నేటితరానికి కూడా ఏనాడో పెద్దన చేతుల్లో రూపొందిన ‘మనుచరిత్ర’ ఆచరణయోగ్యమైన నైతిక విలువలతో కూడిన ఒక జీవన సూత్రం కనిపిస్తోంది. స్త్రీలౌల్యాన్ని నిరసిస్తూ రెండు పక్షుల మాటల్లో అల్లసాని పెద్దన ఇంత చక్కటి సందేశాన్ని మానవాళికి అందించాడు. ఆదర్శదాంపత్యం మంచి సమాజానికి పునాది. మంచి సమాజం ఉన్ననాడు గొడవలు, పొరపచ్చాలు ఉండవు. అలా ఉన్ననాడు అందరూ పార్వతీపరమేశ్వరులే, అందరూ సీతారాములే, అందరూ చిలకాగోరింకలే.

– డా.పి.వి.లక్ష్మణరావు,

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

సాహిత్య వ్యాసాలు ​Permalink

One Response to “మనుచరిత్ర”–ఆదర్శదాంపత్యపు విలువలు – డా.పి.వి.లక్ష్మణరావు,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో