ప్రేమ పాశం – (కథ ) శ్రీ మీలో ఒకడు

v

(తొలి కథ)

వెచ్చటి స్పర్శ బుగ్గలని తాకుతున్నట్లు అనిపిస్తుంటే కళ్ళు తెరచి చూసాను, అంతే భయంతో ఒక్క వుదుటున ఉన్నచోటే లేచి కూర్చొన్నాను. అప్పటిదాకా నా బుగ్గలు నాకుతున్న కుక్కపిల్ల ఒకటి కొంచం వెనక్కి వెళ్ళి కుయ్ కుయ్ మంటూ నేనేమి చేస్తానో చూద్దామన్నట్లు ఆగింది. దాని కళ్ళు ఆ కారు చీకట్లో మెరుస్తుంటే మరింత భయం వేసింది.నాకసలే చిన్నప్పటినుండి కుక్కలంటే భయం. నేను కదిలితే మీదకొస్తుందేమోనని నేను బిగుసుకుపోయి దానికేసే భయం భయంగా చూస్తున్నాను. మనుషులకన్నా జంతువులే మన స్థితిని బాగా అర్ధం చేసుకుంటాయేమో, ఎన్నడూ నా మొహం చూడని ఆ కుక్క కూడా భయపడద్దన్నట్లు తోకాడిస్తూ నా కేసే చూస్తోంది. చుట్టూ చిమ్మ చీకటి, పైగా దట్టమైన పొగమంచు రెండడుగుల దూరంలో ఏముందో కనపడటంలేదు. వంటిమీద ఏ ఆచ్చాదనా లేకపోవడంతో ఉండుండి వీస్తున్న గాలి మరింత చలిపుట్టించడంతో స్పృహలోకి వచ్చి నా బట్టలకోసం చూసాను .చీకటి వల్ల కనపడలేదు ,చేతులతో అటూ ఇటూ తడుముతుంటే చేతికి తగిలాయి ,తీసుకొని భయంగా లేచి నుంచుని వేసుకున్నాను. ఆ కుక్క నాకేసే చూస్తోంది ముందుకు రావాలా వద్దా అన్నట్లు. నాతో ఏమీ అపాయంలేదనుకుందేమో నెమ్మదిగా దగ్గరకొచ్చి నా పాదాలను వాసన చూస్తూ నాకడం మొదలుపెట్టింది.నాకు కొంచం భయం పోయింది, దాని తలమీద చేతితో రాస్తూ అక్కడే కూర్చున్నా, నాకు జరిగినదంతా సినిమా రీళ్ళలా కళ్లముందు తిరగడం మొదలయ్యింది.

పంజాబ్ లో పనిచే స్తున్న నేను,’ అమ్మకి ఆరోగ్యం బాగాలేదు ఒక వారం వచ్చి వెళ్ళు’ అన్న నాన్న మాట కాదనలేక బయలుదేరాను, రైలు ఆలస్యంగా నడుస్తున్నందువల్ల రాత్రి 8గం|| చేరవలసిన రైలు రాత్రి 2 గం|| కి గానీ చేరదు, మీరు నా కోసం ఈ చలిలో ఎదురు చూడకండి ఇంట్లోనే వుండండి నేను వచ్చెయ్యగలను అని నాన్నకి చెప్పడం గుర్తుంది. తీరా 2గం||కి నాతో బాటు ఇద్దరో ముగ్గురో దిగారు, వాళ్ళు 5నెంబర్ ప్లాట్ ఫార్మ్ వైపు వెళ్ళారు నేను ఒకటో నెంబర్ ప్లాట్ ఫార్మ్ నుండి బయటకు నడిచాను.స్టేషన్ అంతా నిర్మానుష్యంగా వుంది, బహుశా చలి వల్ల కావొఛ్ఛు అనుకొంటూ ముందుకు కదిలాను,పోలీస్ హెల్ప్ డెస్క్ దగ్గర పోలీసులు కునికిపాట్లు పడుతూ కనిపించారు.స్టేషన్ బయటకు వస్తుంటే ఒక కానిస్టేబుల్ ఎదురయ్యి , ఒక్కతివేనా అనడిగాడు, అతనివైపు చూసి అవును అన్నాను. ఈ సమయం లో అసలే బయట పొగమంచు దట్టంగా వుంది ఆటోలు కూడా తియ్యరేమో , వెయిటింగ్ రూం లో ఉండి తెల్లవారేక వెళ్ళొచ్చుగా అన్నాడు. అతని మాటల్లో వెటకారం కనపడింది, పరవాలేదు వెళ్లగలను అన్నాను.ఇంకేమనలేక సరే మీ ఇష్టం అన్నాడు. ఆటో స్టాండ్ లో ఎవరూ లేరు. రోడ్డు మీదకొచ్చాను చల్ల గాలి మొహానికి తగులుతూ మరింత చలి పుట్టిస్తోంది. దూరంగా ఒక టీ షాప్ దగ్గర ఒక ఆటో ఆగి వుంది, నన్ను చూడగానే ఆ ఆటో కుర్రాడు పరిగెట్టుకొచ్చాడు.ఎక్కడికి మేడం అన్నాడు, చెప్పాను.రెండు వందలు కావాలన్నాడు. సరే ఇంక చేసేది లేక ఆటో తియ్యమన్నాను.బహుశా ముస్లిం అనుకుంటాను, మనిషి మాత్రం చాలా అందంగా బలిష్టంగా ఉన్నాడు.స్టేషన్ కి మా ఇంటికీ కనీసం 10 కిలోమీటర్లు ఉంటుంది. తల చుట్టూ మఫ్లర్ కట్టుకొని ఆటో స్టార్ట్ చేసి కూచోమన్నాడు.ఏరోజు లేదు ఈ రోజు పొగమంచు బాగావుందండి అంటున్నాడు.నేను బేగ్ పక్కనపెట్టుకొని కూర్చున్నాను.కొంచం దూరం వెళ్ళేసరికి అతనన్నది నిజమేనని అర్ధం అయ్యింది ఆటో లైట్ పడుతున్నంతవరకే రోడ్డు కనపడుతోంది ఎదరనుండి ఏమివచ్చినా తెలియదన్నట్లు వుంది.కొంచం రోడ్డు పక్కకి వెడితే దేన్నన్నా గుద్దుకోవడం ఖాయం.

అసలే నెమ్మదిగా నడుపుతున్నాడని చిరాగ్గా వుంటే మధ్యలో ఆటో ఆపి తీరిగ్గా దిగి సీటు కిందనుండి ఒక గుడ్డ , వాటర్ బాటిల్ తీసి తడిపి ఎదర అద్దం తుడుస్తున్నాడు.నాకెందుకో అనుమానం వచ్చింది , నా ఒంటరితనాన్ని అలుసుగా తీసుకొని అతనేమన్నా వేషాలేద్దామనుకొంటున్నాడేమో, ఏమన్నా చేస్తాడా అని మనసులో ఆందోళన మొదలయ్యింది. తనకేమీ పట్టనట్టు మళ్ళీ ఆటో పోనిచ్చాడు. ఆ పోలీసు మాటవిని వుంటే ఇంత టెన్షన్ వుండి వుండకపోయేదేమో, వీడు ఇంటిదాక సరిగ్గా తీసుకెడతాడా లేదా అని ఆలోచిస్తూ, ఒకవేళ అలా ఏమన్నా ప్రవర్తిస్తే ఎలా తప్పించుకోవాలా అని చుట్టూ ఏమున్నాయో చూస్తున్నా,ఇంతలో మళ్ళీ ఆటో ఆపాడు. చిరాగ్గా అన్నా కొంచం గట్టిగానే మళ్ళీ ఎందుకాపేవు అన్నాను, అతను బయటకి చెయ్యి చూపించి తను జేబులు వెతుక్కుంటున్నాడు.చూస్తే ఇద్దరు పోలీసులు నుంచుని వున్నారు. పోనీలే కనీసం రాత్రి పడుకోకుండా వీళ్ళు ఇలా తిరిగితే నా లాంటి వాళ్ళకి భయం వుండదు, ఈ ఆటో వాళ్ళకి భయం వుంటుంది అనుకొని కొంచం స్థిమితంగా సర్దుకు కూర్చున్నా. తను కిందకి దిగి సీట్ పైకిలేపి పేపర్స్ తీసి చూపించాడు. ఆ ఇద్దరిలో ఒక పోలీసు లోపలికి తలపెట్టి ఎక్కడికి అనడిగాడు, ముక్కుపుటాలు అదిరిపోయేలా ఆల్కహాల్ వాసన , నేను కర్చీఫ్ తీసి ముక్కుకి అడ్డం పెట్టుకుంటూ చెప్పాను. అతనే మళ్ళీ ఇంతరాత్రి ఎక్కడనుండి వస్తున్నావు ఒక్కతివీ అంటూ వెకిలి నవ్వు నవ్వాడు, నాకు కంపరం వచ్చింది రైలు లేట్ అని చెప్పాను.సరే పో అన్నారు.అతను ఆటో ఎక్కి ముందుకి పోనిచ్చాడు.

ఆటో కొంచం ముందుకి కదలగానే వెనకనుండి ఆ పోలీసులు ఆపమన్నట్లు అరిచారు.ఆటో ఆపి అతను కిందకి దిగాడు మళ్ళీ ఏమిటన్నట్లు. ఏరా నిజంగా రైల్వే స్టేషన్ నుండి వస్తున్నారా లేక హొటల్ నుండి తీసుకొస్తున్నావా నిజం చెప్పు అన్నాడు.మాకెందుకో మీ ఇద్దరు వ్యాపారం చేస్తున్నారని అనుమానంగా వుంది చెప్పు అన్నాడు గద్దిస్తున్నట్లు.ఆటో అతనికి కోపంవచ్చింది విసురుగా ‘కావాలంటే, ఆవిడ టికెట్ చూసుకోండి అనవసరంగా నోరుజారడమెందుకు’ అన్నాడు చిరాగ్గా.ఏంటిరోయ్ అంత ఫీలయిపోతున్నావు అన్నాడా పోలీసు. ఆటో అతను నాకేసి తిరిగి మేడం మీ టికెట్ చూపించండి వీళ్ళకి అన్నాడు. నేను అవమానంగా ఫీల్ అవుతూ హాండ్ బేగ్ తెరవబోయాను,వద్దులే మా వాడికి అనుమానం అంతే మా ఇద్దరినీ కొంచం ఎదర వదిలెయ్యి అందుకే ఆపాము అన్నాడు రెండో పోలీసు. ఆటో అతను ఏమనుకున్నాడో ఇద్దరిని తనకి చెరో వైపూ కూర్చోమన్నాడు. ఏం ఆ పిల్ల పక్కన కూర్చుంటే శీలం ఫోతుందా అన్నాడు ముందు వెకిలివాగుడు వాగినవాడు.సార్ ఆవిడ నా కస్టమర్. కస్టమర్స్ కి ఇబ్బంది లేకుండా చూడ్డం మా బాధ్యత, మీరు ఇలా మాట్లాడడం బాగోలేదు అన్నాడు.రెండో పోలీసతను ఎమనుకున్నాడో సర్లేరా మనకెందుకు ముందుకే కూచో అని ఇద్దరూ చెరో వైపూ కూర్చున్నారు.ఆటో ముందుకి కదిలింది. కొంత దూరం పోయాక రోడ్డుకి ఎడమవైపుకి పోనిచ్చి మమ్మల్ని అక్కడ దింపి , ఆవిడని ఇంటి దగ్గర దింపు అన్నారు. ఆలస్యం అవుతుంది ఇక్కడే దిగండి అన్నాడు ఆటో అతను.మళ్ళీ తిట్లపురాణం అందుకున్నాడు ఆ పోలీసు. ఆటో వాడు నా వైపు చూసాడు, నేనేమంటానో అన్నట్లు సరే వాళ్ళు చెప్పినట్లే చెయ్యి అన్నాను. అటువైపు ఆటో పోనిచ్చాడు ఆ సందులో కొంతదూరం పోయాక ఆపమని ఇద్దరూ దిగారు. ఇష్టం వచ్చినట్లు వాగుతున్న పోలీసు , రేయ్ ఒక వంద తియ్యి అన్నాడు, ఆటో వాడు సార్ ఏభై తీసుకోండి నాకు ఇదే రెండో బేరం ఈ రోజు నేను సంపాదించలేదు అన్నాడు. ఏరా ముష్టి వేస్తున్నావా ఏభై అంటున్నావు మళ్ళీ ఒక బూతు తిట్టు బయటకొచ్చింది.గతిలేక జేబులోనుండి వంద తీసి అతని చేతిలో పెట్టాడు.మళ్ళీ ఆటోలో కూర్చుంటుండగా నిజం చెప్పరా ఇద్దరూ కలిపి వ్యాపారం చేస్తునారు కదా అన్నాడు.నాకు మనస్సు చివుక్కుమంది, ఈ సారి ఆటో అతనికి కోపం వచ్చినట్లుంది కొంచం గట్టిగానే బుద్ధిలేకుండా ఆమాటలేమిటండి అని అడిగాడు.

ఏరా వళ్ళు బాగా బలిసిందా మా మీదే అరుస్తున్నావు ఎక్కువ వాగేవంటే మీ ఇద్దరూ వ్యాపారం చేస్తున్నారని కేస్ పెట్టి లోపలేస్తాము అంటూ ఆటో అతని జబ్బ పట్టుకొని బయటకి లాగబొయాడు.వాళ్ళతో ఎందుకులే పద అన్నాను.కానీ అప్పటికే ఆటో అతనికి కోపం వచ్చి కిందకి దిగాడు ఏమి చేస్తారన్నట్లు.అంతే లాఠీతో కాళ్ళమీద కొట్టాడా పోలీస్.ఇంక వూరుకోదలచుకోలేదనుకుంటా లాగి చెంప పగిలేలా కొట్టాడు ఆటో అతను.ఆ దెబ్బకి పోలీస్ వెనక్కి తూలగానే అప్పటిదాకా ప్రతిదానికి సర్దిచెప్తున్న రెండో పోలీస్ కూడా లాఠీతో విజ్రంభించాడు ఆటో అతనిమీద ,ఎక్కడ తగులుతోందో చూడకుండా గొడ్డుని బాదినట్లు కొడుతున్నారు, నేను కిందకి దిగి వాళ్ళని ఆపడానికి వదిలెయ్యమని చేతులు పట్టుకుంటే నా చేతులు విదిలించుకొని బూతులు తిడుతూ బాదడంతో ఎక్కడ తగిలిందో ఏమో ఒక్కసారిగా కుప్పకూలిపోయి కదలికలేకుండా పడిపోయాడు.నాకు భయం వేసి బిగుసుకుపోయాను. ఇంతలో దీని సంగతి చూద్దాం అన్న మాటతో ఉలిక్కిపడి పారిపోవడానికన్నట్లు వెనక్కి తిరిగాను, వెంటనే బలంగా లాఠీ దెబ్బ నడుం మీద పడింది ఎక్కడికి పోతావే ము|| అంటూ, విలవిల్లాడాను. నా స్కార్ఫ్ లాగి మూతికి కట్టి ఇద్దరూ నన్ను పక్కన పొదల్లోంచి ఈడ్చుకుంటూ పోతున్నారు, నేను గింజుకొంటున్నాను.కానీ వాళ్ళ బలం ముందు నా బలం పనిచెయ్యలేదు. ఆ చీకట్లో నా శరీరాన్ని గాయపరుస్తూ ఇష్టం వచ్చినట్లు అనుభవించారు, ఆ నరకయాతనకి నెమ్మది నెమ్మదిగా స్పృహతప్పుతున్నట్లు తెలుస్తోంది.

వెంటనే నాకు ఆటో అతను గుర్తొచ్చాడు , ఏమై వుంటాడు బహుశా ప్రాణాలు పోయాయేమో అనుకోగానే నా వళ్ళు జలదరించింది. వంట్లో శక్తినంతా కూడగట్టుకొని, ఆ చీకట్లో ఎటు వైపు వాళ్ళు లాక్కొచ్చారో , ఎటు వెళ్ళాలో తెలియక నెమ్మదిగా అడుగు ముందుకు వేస్తూ కదిలాను, నా వెనుకే ఆ కుక్క కూడా అనుసరించింది. ఎలాగైతే ఆటో కనపడింది. దానికి కొంచం దూరంలో అతను పడివున్నాడు. దగ్గరికెళ్ళి ముక్కు దగ్గర చెయ్యపెట్టి చూసాను వూపిరి ఆడుతోంది, అంటే ప్రాణాలు పోలేదు.కొంచం ధైర్యం వచ్చింది.ఆటో లో ఉన్న నా బేగ్ నుండి వాటర్ బాటిల్ తీసి అతని మొహం మీద నీళ్ళు కొట్టాను, కొంతసేపటికి నెమ్మదిగా మూలుగుతూ కదిలాడు, ఇంకొంచం నీళ్ళు కొట్టి కుదిపితే స్పృహలోకి వచ్చాడు.తలమీద గాయం అయ్యింది , రక్తం కారుతోంది. ఎలాగో బాధను భరిస్తూ పైకి లేస్తూ తూలిపడబోయాడు, నేను పట్టుకున్నాను.సర్దుకొని లేచి నుంచున్నాడు. దుమ్ము కొట్టుకు పోయిన నా మొహం, పగిలిన పెదాలనుండి కారిన రక్తం మరకలు చూసి అతనికి జరిగినదేమిటో అర్ధం అయ్యిందనుకుంటా ,తల విదిలించాడు.ఈ లోగా బాటిల్ లో మిగిలిన నీళ్ళతో నేను మొహం కడుక్కొని స్కార్ఫ్ కట్టుకున్నాను నెమ్మదిగా టైం ఎంతయ్యింది అన్నాడు నేను నా సెల్ చూసి ఐదున్నర అన్నాను,ఏదో గొణుగుతున్నట్లు మూడు గంటలు పడున్నాను అన్నాడు. ఆటో నడపగలవా అన్నాను, నడుపుతాను కూర్చోండి అని తను ఆటో స్టార్ట్ చేసాడు. నేను మాట్లాడకుండా కూర్చున్నాను.ఆలోచనలు చుట్టుముడుతున్నాయి, దుఖం తన్నుకొస్తోంది. ఇంతలో దిగండి అన్న అతని పిలుపుతో ఈ లోకంలోకి వచ్చి కిందకి దిగి డబ్బులివ్వబోతే , వద్దు నేను తీసుకోను అన్నాడు.పరవాలేదు తీసుకో అన్నాను.లేదు వద్దు అని అంతే వేగంగా ఆటో స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయాడు.నేను నెమ్మదిగా వెళ్ళి డోర్ బెల్ కొట్టాను , నాన్న వచ్చి తలుపు తీసారు, మొహనికి స్కార్ఫ్ ఉండడం వల్లో, నాన్న నిద్రలో లేవడంవల్లో నన్ను గమనించలేదు ఏంటమ్మా ఇంత లేటు అయ్యింది రైలు అని సర్లే వెళ్ళి కాసేపు పడుకో రాత్రంతా నిద్రలేకుండా వుండివుంటావు అన్నారు.చెప్పాలా వద్దా జరిగింది అని ఆలోచిస్తూ నా రూమువైపు నడిచాను. ఏమీచెయ్యలేని పరిస్థితి, జరిగింది చెప్తే వాళ్ళిద్దరూ ఎంతబాధపడతారో అని ఆలోచిస్తూ మంచం మీద వాలాను. వళ్ళంతా హూనం అవడంవల్ల పరుపుమీద పడుకోగానే నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాను. .

తలుపు కొట్టిన శబ్దంతో మెళుకువ వచ్చింది, బయటనుండి నాన్న అమ్మా నీకోసం ఎవరో కుర్రాడొచ్చాడు, పేరు సలీం అట ,తలమీద కట్టువుంది చూడు హాల్లో ఉన్నాడు నేను మీ అమ్మకి మందులువేస్తున్నాను అంటున్నారు. నాన్న వెనక్కి వెళ్ళిన అలికిడి తెలిసింది.నేను బహుశా ఆటో అతనే అయ్యుంటాడు ఎందుకొచ్చాడా అనుకొంటూ వాష్ రూంలోకి వెళ్ళి మొహం కడుక్కొని హాల్లోకి వచ్చా. అక్కడే నుంచుని ఉన్నాడు, సొఫాలో కూర్చోమన్నాను. ఏమిటి అనడిగాను.రాత్రి జరిగినదాని కి పోలీస్ కేస్ పెట్టదలచుకున్నాను , మీరు తొందరగా తయారయ్యి రండి అన్నాడు. లోపలినుండి అప్పుడే బయటకొస్తున్న నాన్న పోలీస్ కేస్ ఏమిటంటూ కంగారుగా అడిగారు. నీ మొహం నిండా ఆ గాట్లేమిటీ అంటూ నాన్న కంగారుగా రాత్రి ఏమయ్యింది అన్నారు. ఆయన్ని కూర్చోమని జరిగినదంతా చెప్పాను. పోలీస్ కేస్ అదీ పోలీసులమీద నీకేమన్నా పిచ్చిపట్టిందా అన్నారు అతన్ని చూసి.అదేమి పట్టనట్టు అవును పోలీసులమీద కేస్ పెట్టాలి, ఇందులో నాకు జరిగినదానికన్నా మీ అమ్మాయికి జరిగిన అన్యాయం ఎక్కువ. మేమంటే ఆటో డ్రైవర్లం, ఈ రోజు కొట్టినా మాకు ఇబ్బంది లేదు కానీ వాళ్ళలాంటి కామాంధులని మాత్రం వదలకూడదు అన్నాడు. నాన్న చూడు బాబూ, ఇది నలుగురికి తెలిస్తే పోయేది మా పరువు.చుట్టుపక్కలవాళ్ళు మాకేసి చూసే చూపులకి, వెనుక అనే మాటలకి తట్టుకునే అంత ధైర్యం మాకులేదు అన్నారు.అందులోను ఈ పోలీస్ స్టేషన్ల చుట్టూ , ఈ కోర్టుల చుట్టూ తిరిగే ఓపిక , సమయం మాకులేవు.అదీగాక అది పెళ్ళికావలసిన పిల్ల , ఇది బయటకి తెలిస్తే దాన్ని చేసుకునేది ఎవరు మాకొద్దు బాబు ఈ గొడవలు , దయచేసి ఈ విషయం ఎవరితోను అనకు, ఈ కాస్త పుణ్యం చెయ్యి, మా ఖర్మ ఎలావుంటే అలా జరుగుతుంది అని ఏడుపు దిగమింగుకుంటూ అతనికి చెప్పారు.

అతను అన్నీ నిర్ణయించుకునే వచ్చినట్లున్నాడు.సార్ మీరు చదువుకున్నవాళ్ళు , మీరే ఇలా అంటే ఎలా మీరు బాధపడకండి , నేను అన్నీ చూసుకుంటాను.నాతో చదువుకున్న స్నేహితుడు పోలీస్ డిపార్ట్మెంట్ లో మంచి పోస్ట్ లో వున్నాడు ఈ వూళ్ళోనే వున్నాడు. వాడు నాకు అన్ని విధాలా సహయం చేస్తాడు.మీరు, మీ అమ్మాయిని తీసుకొస్తే అతని దగ్గరకే వెడదాం అతను అన్నీ చూస్తాడు.డబ్బు కూడా మీరు ఖర్చుపెట్టొద్దు , మొత్తం నేనుపెట్టుకుంటాను అని నచ్చచెప్పబోయాడు.నాన్న వద్దని అతన్ని వెళ్ళిపొమ్మని అన్నారు.అయినా అతను వదల్లేదు, సార్ నేను ఎంతో కొంత చదువుకున్నాను.ఈ రోజుల్లో ఇలా ఆలోచించక్కరలేదు.పైగా నా ప్రాణస్నేహితుడు సహాయంగా వున్నప్పుడు మీకు ఏరకమైన ఇబ్బందీ రాకుండా నేను చూసుకుంటాను.నేను మాత్రం మీరు ఒప్పుకుంటేగానీ ఇక్కడి నుండి కదలనని ఖచ్చితంగా చెప్పాడు.దోషులకి శిక్షపడాల్సిండే, ఈ రోజు మీరు వూరుకుంటే రేపు మరో అమ్మాయి బలయ్యిపోతుంది.దయచేసి నన్నర్ధం చేసుకోండి అని నచ్చచెప్పటం మొదలుపెట్టాడు.

అలా అతను నాన్నకి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు, నాకు గుండెలమీదనుండి భారం కొంచం తగ్గినట్లయ్యింది, కిచెన్ లోకి వెళ్ళి కాఫీ కలిపి తీసుకొచ్చి అతనికి, నాన్నకి అందించాను, ఈలోగా అమ్మని లేచినట్లు అలికిడైతే లోపలకెళ్ళి అమ్మ పక్కన పడుకున్నాను,అమ్మ ఏమైంది రాత్రి అతనెవరు అని అడిగింది , అప్పటిదాక దిగమింగుకుంటున్న దుఖం కట్టలు తెంచుకుంది , అమ్మని పట్టుకొని ఏడుస్తూ అంతా చెప్పాను.అంతా విని అమ్మ కాసేపు చలనం లేనట్లు ఉండిపోయింది, పక్షవాతం వల్ల చెయ్యి కదపలేకపోవడం , నన్ను పట్టుకొని ఓదార్చాలనుకున్నా తన స్థితి సహకరించక మౌనంగా కన్నీరు కారుస్తోంది. నేనే కొంచం తేరుకొని బాధపడకమ్మా ఈ రోజుల్లొ ఏ ఆడపిల్ల కీ లేని రక్షణ నాకు మాత్రం ఎలా దొరుకుతుంది, మన ఖర్మ అనుకుందాము అని ఓదార్చాను.ఇప్పుడే వస్తాను ఉండు అని హాల్లోకి వచ్చాను.అతనింకా నాన్నను ఒప్పించే ప్రయత్నం లోనే వున్నాడు. ఇంక అలసిపోయారేమో నాన్న సరే నువ్వింతగా చెప్తున్నవు కాబట్టి మా అమ్మాయి అభిప్రాయం అడుగుతాను , అది సరేనంటే అప్పుడు చూద్దాం అంటున్నారు, అదిగో ఆవిడకూడా వచ్చారు అడగండి అన్నాడతను.ఏమ్మా తల్లీ నీ ఉద్దేశ్యం ఏమిటీ, మరి కేస్ అంటూ వేస్తే నువ్వు కొన్నాళ్ళు ఇక్కడే ఉండాలి, నీ ఉద్యోగం సంగతి ఆలోచించుకో, అలాగే నీకు వాళ్ళు చేసే పరీక్షలగురించి కూడా ఆలోచించు అన్నారు.ఎందుకో అతని వాదనే నాకు నచ్చింది.కేస్ పెడదాం నాన్నా అన్నాను.సరే నీ ఇష్టమే నా ఇష్టం తల్లీ అయితే తయారవ్వు ఈ లోగా మీ అమ్మకి కావలసినవి చూసి, అమ్మకి చెప్పి వస్తాను అన్నారు నాన్న.
ఇలాంటి కేసుల గురించి తెలుసో లేక తన స్నేహితుడిని అడిగి వచ్చాడో, రాత్రి వేసుకున్న బట్టలు మార్చక పోతే వాటితోనే రండి అన్నాడు, మార్చినట్లయితే అవి వేరే బేగ్ లో తీసుకురండి, ముందు మనం నా స్నేహితుడి దగ్గరకెళదాం అతను చెప్పేదాన్ని బట్టి చేద్దాం అన్నాడు.ఈలోగా నాన్న వచ్చారు , నేను లోపలికి వెళ్ళి అమ్మతో చెప్పాను, మంచిపని వెళ్ళిరా అని దీవించింది.ముగ్గురం అతని ఆటోలోనే డిప్యూటి సూపెరింటండెంట్ కార్యాలయానికి వెళ్ళాము. ఆటో అతను సారుకి సలీం వచ్చాడని చెప్పండి అన్నాడు తలుపు దగ్గర కూర్చున్న ఆర్డెర్లీతో , కానిస్టేబుల్ వెళ్ళి చెప్పగానే లోపలికి పంపమని కబురొచ్చింది. లోపలికి వెళ్ళి చూస్తే అతను చెప్పిన స్నేహితుడే ఆ ఆఫీసర్ , ఒక ఆటో డ్రైవర్ కి ఒక ఉన్నతాధికారికి ఉన్న స్నేహం. శ్రద్ధగా సలీం చెప్పినవన్ని విని వెంటనే బెల్ కొట్టి టీలు తెమ్మని మనిషికి చెప్పాడు, తరువాత ఫో న్లో ఎవరినో అడిగాడు అక్కడ రాత్రి డ్యూటీ ఎవరిదని, సమాధానం విని, సరే గాంధినగర్ పోలీస్ స్టేషన్ ఎస్సై ని ఆ కానిస్టే బుళ్ళిద్దరిని ఇంటినుండి తీసుకొని తన ఆఫీస్ కి తక్షణం రావలసిందిగా చెప్పమని ఫోన్ పెట్టేసాడు.

నాన్న కొన్ని అనుమానాలు వ్యక్తం చేసారు . అతను మీరు దేనికీ భయపడవలసిన అవసరం లేదు మీకు ఇంకా భయంగా వుంటే చెప్పండి మీ ఇంటి దగ్గర కూడా పోలీసులను కాపలా పెట్టించే ఏర్పాట్లు చెయ్యగలను అని అభయం ఇచ్చాడు. ఈలోగా టీలు తీసుకొచ్చాడు ఒక ఆర్డెర్లీ. అవి తాగడం పూర్తయ్యే సమయానికి మళ్ళీ ఆర్డెర్లీ లోనికొచ్చి గాంధినగర్ యెస్సై గారొచ్చారు అని చెప్పాడు.ఆవిడని లోపలకి రమ్మను అని చెప్పాడు ఆ ఆఫీసర్ , ఆవిడ లోపలికి వచ్చి సెల్యూట్ కొట్టగానే వచ్చి కూర్చోమన్నారు.ఆవిడకి ఆయన ఉపోద్ఘాతమంతా చెప్పి, బెల్ కొట్టి ఆ కానిస్టేబుల్స్ ఇద్దరిని లోపలకి తీసుకురమ్మన్నారు , వాళ్ళులోపలికొచ్చి ఆయనకి సెల్యూట్ కొట్టి ఏమీ ఎరగనట్టు నుంచున్నారు. ఆయన కోపంగా ఆటో అతన్ని చూపి ఇతనుతెలుసా మీకు అనడిగారు.లేదు సార్ అని ఇద్దరూ ముక్తకంఠంతో అన్నారు.అలాగా పోనీ ఈ అమ్మాయిని చూసారా ఎక్కడైనా అని అడిగారు.వెంటనే వారిలో ఒకడు సార్ తప్పయిపోయింది మమ్మల్ని క్షమించండి అని ఏడవడం మొదలుపెట్టాడు అంతే ఆ లేడీ యెస్సై లేచివెళ్ళి ఇద్దరిని రెండు చెంపలు వాయించి , సార్ ఇద్దరిని బుక్ చేస్తాను అనగానే ఆయన మళ్ళీ బెల్ కొట్టి వేరే కానిస్టేబుళ్ళని పిలవమన్నాడు. వాళ్ళు వచ్చి చేతులకి బేడీలు వేసి వాళ్ళిద్దరితో బాటు మమ్మల్ని రమ్మన్నారు. ఆ ఆఫీసర్ వెళ్ళండి,ముందు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రాసిచ్చాక హాస్పటల్ కి తీసుకువెడతారు, సలీం అవసరం అయితే నాకు ఫోన్ చెయ్యి వాళ్ళకి కూడా నా నెంబర్ ఇవ్వు అని చెప్పారు.

అక్కడినుండి మమ్మల్ని వాళ్ళ జీపులోనే తీసుకొచ్చి ముందు పోలీస్ స్టేషన్లో మా వాంగ్మూలాలు తీసుకొని సంతకాలు అవీ అయ్యాక గవర్నమెంట్ హాస్పటల్ కి తీసుకొచ్చారు. మా మెడికల్ చెకప్స్ అవీ అయ్యేసరికి ఆలస్యం అవుతుందనేసరికి ,అమ్మ ఒక్కతీ ఇంట్లో కంగారుపడుతూ వుంటుంది మీరు ఇంటికి వెళ్ళండి నాన్నా అన్నాను.సలీం కూడా నేను ఉన్నానుకదా సార్ మీరు వెళ్ళండి అమ్మగారిని చూసుకోండి అమ్మాయిగారిని నేను తీసుకొస్తాను అన్నాడు. ఇంచుమించు మూడు నాలుగు గంటల తరువాత హాస్పటల్ వాళ్ళు నాతో మళ్ళీ రేపు మీరు రావలసివుంటుంది అన్నారు. సలీం నేనూ వస్తాను మీతో రేపు ఉదయం అన్నాడు.అలా రెండో రోజుకూడా పరీక్షలు అవీచేసి నన్ను ఇంక వెళ్ళొచ్చు అన్నారు.

ఆ తరువాత కేస్ బుక్ అవ్వడం , వాళ్ళిద్దరినీ పోలీస్ కస్టడీకి ఇవ్వడం జరిగిపోయాయి.ఇద్దరూ ముందు ఒప్పుకోలేదుగానీ ఆ తరువాత అన్నిటికీ ఒప్పుకున్నారు. నేనుపెట్టింది 10రోజులు శెలవు , సరిగ్గా వారం కాగానే సురేష్ కి మెయిల్ పంపాను ,ఒక నెలదాకా శెలవు ఎక్స్టెండ్ చెయ్యడానికి పర్మిషన్ ఇమ్మని.ఒక్క పావుగంటలో సురేష్ దగ్గరనుండి ఫోన్ , ఏమిటీ, ఏమయ్యిందీ, మీ అమ్మగారికి బాగానేవుంది కదా లే కపోతే ,’సారీ సురేష్ మా అమ్మ నాన్న వేరే సంబంధం చూసారు ఇంక నన్ను మర్చిపో’ అని సినిమా డైలాగులు చెప్తావా కొంపదీసి, అసలు విషయం ఏమిటి అని గడగడా అడిగెస్తూ ఏమిటీ నేను ఇన్ని అడుగుతున్నా నీ నోట్లోంచి మాటరావట్లేదు అన్నాడు. నన్ను మాట్లాడనిస్తే కదా సమాధానం ఇచ్చేది, అవేమీ కాదుగానీ అని అగాను ఎలా చెప్పాలో తెలియక, అసలు చెప్పాలా వద్దా?.ఎందుకంటే అలా ఎప్పుడూ నవ్విస్తూ నవ్వుతూ నా మనసుని దోచుకున్నవాడు, నన్ను ఎంతగానో కోరుకుంటున్నవాడు.చెప్తే ఎలా రిసీవ్ చేసుకుంటాడో అన్నట్లుగా,మళ్ళీ అటునించి తనే హెలో ఉన్నావా ఫోన్ పక్కనపెట్టివెళ్ళిపోయావా అన్నాడు నవ్వుతూ.లేదు చిన్న కేస్ ఒకటి వేసాను దానికోసం అగాల్సి వస్తోంది అన్నాను,ఇంక చెప్పలా వద్దా అన్న మీమాంస లో ఉండి.చీమల్ని చంపడానికే భయపడేదానివి నువ్వు కేస్ వెయ్యడమేమిటి , ఏమన్న ప్రోబ్లమా లేక నాకు చెప్పకూడదా అన్నాడు.ఒక నిర్ణయానికి వచ్చినట్లు చిన్నగా దగ్గి ఆరోజు రాత్రి జరిగిన సంఘటన వివరించి సలీం, పోలీస్ ఆఫీసర్ చేస్తున్న హెల్ప్ కూడా చెప్పాను.అప్పటిదాకా వింటున్నవాడు జాగ్రత్త ఏమన్నా అవసరం అయితే కాల్ చెయ్యి, బాస్ కాల్ చెస్తున్నాడు మళ్ళీ మాట్లాడతాను టేక్ కేర్ అని, నేను మళ్ళీ మాట్లాడేలోగానే కాల్ కట్ చేసాడు.

ఒక మూడు రోజులు గడిచాయి, సలీం అడపా దడపా ఇంటికొచ్చి ఎలావున్నాను కనుక్కొని వెడుతున్నాడు, ఒక సాయంత్రం అతనొస్తే నాన్న అడిగారు నీకు అంతపెద్ద ఆఫీసర్తో స్నేహం ఎలాగవచ్చిందీ అని, నా మనసులోనూ అదే ప్రశ్న వచ్చింది చాలా సార్లు కానీ అడిగే అవకాశం రాలేదు.అప్పుడు చెప్పాడు తన తండ్రి ఒక ప్రయివేట్ కంపనీలో మంచి ఉద్యోగమే చేసేవాడు, అందుకే తనని మంచి స్కూల్లోనే చదివించేవాడు, ఆ ఆఫీసరు, తనూ ఒకే క్లాస్ లో చదివేవాళ్ళం అనుకోకుండా తండ్రి కంపెనీలో జరిగిన యాక్సిడెంట్లో చనిపోతే వెనక ఎవరూలేని కారణంగా 12 క్లాస్ మధ్యలో వదిలేసి కుటుంబ బాధ్యతలు తీసుకోవలసి వచ్చింది అని చెప్పాడు.ఆ ఆఫీసర్ తండ్రే ఆటో కొనడానికి సహాయం చేసాడు, ఇప్పటికీ తనకేమి అవసరం వచ్చిన వాళ్ళే చూస్తున్నారు అని అందుకే మీరుకూడా ఏమీ భయపడాల్సిన అవసరం లేదు.తనుకూడా ఒక సారి మీ ఇంటికి వస్తాను అంటున్నాడు అని నాన్న ఏమంటారో అని చూస్తున్నాడు. మాకు అభ్యంతరం ఏముంది నీ మాటతో అతను మాకు సహాయం చేస్తున్నాడు తప్పకుండా తీసుకురా అన్నారు నాన్న.

ఈలోగా అమ్మకి బాగాలేకపోతే హస్పిటల్ లో పెట్టడంవల్ల నాకూ చాలా రోజులు సమయం దొరకలేదు, హటాత్తుగా ఒక రోజు మా బాస్ కాల్ చేసి ఏమిటీ పదిరోజులని నెల దాటుతున్నా రాలేదు అనడిగాడు. ఆశ్చర్యపోవడం నా వంతయ్యింది నేను వెంటనే సర్ నేను సురేష్ కి మెయిల్ పెట్టాను మీకు ఇంఫార్మ్ చెస్తానన్నాడు అన్నాను మీకు చెప్పలేదా అన్నట్లు. భలేదానివే నీకు తెలియదా సురేష్ అర్జంట్ అని చెప్పి ఉద్యోగం వదిలేసి వెళ్ళిపోయాడు,నిన్ను కాంటాక్ట్ చెయ్యలేదా, నీకు క్లోజ్ గా వుంటాడు కదా అన్నాడు. లేదు సర్ నాకు చెప్పలేదు ,నేను మా మదర్ హెల్త్ బాగోపోవడంవల్ల రాలేకపోతున్నా ఇంకొన్నాళ్ళు శెలవు కావాలి అన్నాను.చూడు సురేషు లేక నువ్వూ లేక నా పనులు ఆగిపోతున్నాయి ఇలా అయితే నువ్వు వేరే జాబ్ చూసుకోవలసిరావచ్చు ,కానీ మీ మదర్ హెల్త్ అంటున్నావు కాబట్టి ఇంకొంతకాలం చూస్తాను అని ఆయన ఫోన్ పెట్టేసారు.
నాకు దుఖం తన్నుకొచ్చింది, ఇప్పుడు ఇదికూడా అమ్మా వాళ్ళకి తెలిస్తే ఇప్పుడిప్పుడే కొలుకొంటున్న అమ్మ మరింత నీరసించిపోతుంది , ఇలా అన్నీ ఒక్కసారే నాకు తగులుతున్నాయేమిటి అనుక్కొంటూ నా రూంలోకి వెళ్ళి మౌనంగా రోదిస్తూ ఆలోచిస్తున్నాను.ఇలా ఎందుకు చేసాడు ,ఆరోజు ఏమన్నా అవసరం అయితే కాల్ చెయ్యి అన్నాడు,తరువాత కాల్ చేస్తానని మళ్ళీ చెయ్యలేదు.సరిగ్గానే రిసీవ్ చేసుకున్నడనుకొంటే ఇంత పిరికివాడిలా పారిపోతాడా అని సురేష్ మీద అసహ్యం వేసింది.పోనీ నెంబర్ మార్చలేదేమొ చూద్దాం అని కాల్ చేసాను ఏమి చెప్తాడో విందామని, నా ఆశ అత్యాసే అయ్యింది ‘దిస్ నెంబర్ డస్ నాట్ ఎక్సిస్ట్ ‘ అనివస్తోంది అంటే నెంబర్ కూడా మార్చేసాడన్నమాట.కనీసం సారీ నేను ఈ పరిస్థితులలో నిన్ను చేసుకోలేను అని చెప్పినా ఇంత బాధపడేదాన్ని కాదేమో.ఎలాగూ పెళ్ళి చేసుకుందామనుకున్నాము కాబట్టి శారీరిక సంబంధానికి నేను అడ్డుచెప్పలేదు,అటువంటిది ఇప్పుడేదో కొత్తగా శీలం కోల్పోయినట్లు వెన్ను చూపించి పారిపోయాడు.

మగజాతి అంతా ఇలాగే వుంటారేమో.కాసేపటికి అమ్మకి భోజనంపెట్టాలని గుర్తొచ్చి వాష్ రూంలోకి వెళ్ళి మొహం కడుక్కొని వచ్చాను.అప్పటికీ అమ్మ అడిగింది ఏమయ్యిందమ్మా అలావున్నావని , ఏమీలేదు అన్నాను పొడిగా.మళ్ళీ అమ్మే రోజూవున్నట్టులేవు ఈరోజు అంది లేదమ్మా మా బాస్ కాల్ చేసి తొందరగా రా అంటున్నారు అంతకన్నా ఏమీలేదు అని అబద్ధం ఆడాను.ఆ రాత్రి నాకు నిద్దరపట్టలేదు అన్నీ సురేష్ తో తిరిగిన రోజులు మేము మాట్లాడుకున్న విషయాలే, ఎంత చెరిపేద్దామనుకున్నా మర్చిపోలేకపోతున్నాను. తెల్లవారుతోందనగా నిద్దరపట్టింది.

రోజులు గడిచాయి ఈ లోగా కేస్ హియరింగ్ కి వస్తోంది, ఇంతవేగంగా కేస్ వాదోపవాదాలకి రావడంతో ఇన్నాళ్ళు సినిమాల్లో చూసినదంతా వట్టిదేమో అనిపించింది. అమ్మా బాగా కోలుకొంది .తన పనులు తను చేసుకోగలుగుతోంది.
ఇంక కేస్ పూర్తికావడానికి వస్తోందనగా ఒక రోజు సాయంత్రం ఆ ఆఫీసర్ మా ఇంటికొచ్చాడు.క్షేమ సమాచారాలు అన్నీ అయ్యాక , ఇంక ఒకటి రెండు వాయిదాలలో కేస్ పూర్తయ్యి దోషులకి శిక్ష పడుతుందని చెప్పాడు బహుశా ఇద్దరికీ యావజ్జీవం పడొచ్చు అన్నాడు. వెళ్ళేముందు మరి తరువాత ఏమి చేద్దా0 అనుకొంటున్నారు అని అడిగాడు.
నాన్న ఇంక మేము అక్కడ ఉద్యోగం వదిలేసి ఈ వూళ్ళోనే ఏదో ఒకటి చూసుకోమని చెప్తున్నాం బాబు అన్నారు. మీరన్నదీ బాగానే ఉంది కానీ ఆవిడేమనుకొంటున్నారో అన్నాడు నా వైపు చూస్తూ. నేనింకా ఏమీ అలోచించలేదన్నాను.
అనుకోని విధంగా అతను మీకు అభ్యంతరంలేక పోతే ఒకమాటడుగుతాను అంటుంటే నాన్న పరవాలేదు మీరు మాకింత సహాయం చేస్తున్నారు మొహమాటమెందుకు అడగండి అన్నారు, మీకెవరికీ అభ్యంతరంలేకపోతే మీ అమ్మాయిని నేను పెళ్ళిచేసుకోవాలనుకొంటున్నా అన్నాడు.

నాన్న వెంటనే నీలాంటి వాడు ఏరికోరి చేసుకుంటాను అంటే మాకు అభ్యంతరాలు లేవు గానీ ,ఇలా జరిగిన అమ్మాయిని చేసుకున్నారని మీ కుటుంబంలో లేక బంధుత్వాలలో ఏమన్నా గొడవలు అవీ వస్తాయేమో అవన్నీ చర్చించి ఆలోచించుకోండి, తొందరపడి తీసుకునే నిర్ణయాలవల్ల ఇద్దరూ సుఖంగా వుండలేరు.ముందే ఆలోచించుకుంటే బాగుంటుంది ఒక తండ్రిగా చెప్తున్నాను.ఈలోగా నా కూతురికీ సమయం దొరుకుతుంది తనూ ఆలోచించుకు చెబుతుంది తన అభిప్రాయం అన్నారు. సరే మా వాళ్ళతోకూడా మాట్లాడి ఆ తరువాతేవస్తాను ఈలోగా మీ అమ్మాయిని ఆలోచించమండి అని చెప్పి వెళ్ళిపోయాడు. నాన్న చెప్పిన సమాధానం నాకు చాలా నచ్చింది.అసలు అతనడుగుతాడని వూహించని పరిణామం. నాన్నని తరువాత అలా ఎందుకన్నారు అంటే చెప్పారు ఏమీలేదమ్మా ఇవి ఈ రోజు కుర్రవాళ్ళ ఆదర్శాలు, కానీ కొంతమంది తల్లితండ్రులు పిల్లల మాట కాదనలేక ఒప్పుకున్నా , తరువాత అతని ముందొకలాగ , వెనుక మరొకలాగా చూడొచ్చు, అదే వాళ్ళని అడిగి చేసుకుంటే కన్న బిడ్డలా చూసుకుంటారు నా స్వార్ధం అదే అన్నారు.

కేస్ ఫైనల్ అయ్యి రేపు తీర్పు ఇస్తారనగా ఆ సాయంత్రం సలీం ఫోన్ చేసి మీరు రేపు ఉదయం రెడీగా వుండండి నేను వచ్చి తీసుకెడతాను కోర్ట్ కి అని చెప్పాడు.సరే రా అని చెప్పి ఫోన్ పెట్టేసా. ఆ రాత్రి భోజనలయ్యాక టీవీ లో నా కేస్ విషయం తీసుకొని ఏదో చర్చాకార్యక్రమం లైవ్ పెట్టారు.వక్తలు శిక్షల గురించి , ఎలా అపాలి అన్న దానిగురించీ మాట్లాడుతున్నారు , ఇంతలో యాంకర్ ఇప్పుడు చూడండి కొంతమంది అభిప్రాయాలు అని అనగానే పక్కన వున్న సిటీ పేరు సైడ్ స్క్రోలింగ్ లో కనపడుతోంది ఒకమ్మాయి మార్కెట్ సెంటర్ లొ కొంతమందిని ఆపి మీరు అత్యాచారానికి గురయిన అమ్మాయిని పెళ్ళి చేసుకొందుకు సిద్ధమేనా అనీ, పెద్దవాళ్ళయితే మీ ఇంటికి కోడలిగా తెచ్చుకుంటారా అని అడుగుతోంది కొంతమంది మేము అలాంటివాటికి ఒప్పుకోమని , కొంతమంది పెద్దవాళ్ళు ఒప్పుకుంటే మాకు అభ్యంతారలు లేవని , కొంతమంది అందులో వాళ్ళతప్పు లేదుకదా అది ఒక ఆక్సిడెంట్ అనుకోవాలి అని ఇలా రకరకాలుగా చెప్తున్నారు. ఇంతలో టీవీ తెరమీద సురేష్ కనపడ్డాడు, నేను అప్రయత్నంగా అతని పేరుని పైకే పలికాను ,అమ్మ నీకు తెలుసా అంది అవున్నన్నట్టు తలూపి, మాట్లాడద్దని చెతితో సైగ చేసి తను చెప్పేది వింటున్నాను. సురేష్ ఆ అమ్మాయిని పట్టుకొని మీకసలు బుద్ధి వుందా వాళ్ళేమన్నా ఎందుకూ పనికిరాని వాళ్ళనుకొంటున్నారా ఏమిటీ ఈ పిచ్చిప్రశ్నలు జరిగినదానికి వాళ్ళు ఎంత బాధననుభవిస్తున్నారో మీకు తెలుసా , పైగా వాళ్ళేదో పనికిరానివాళ్ళు అన్నట్లు మీరే క్రియేట్ చేస్తూ అడుగుతారా అని దులపడం మొదలుపెట్టాడు. ఏమీ తోచని ఆ అమ్మాయి సమాధానం లేకుండా వేరే వాళ్ళని అడగడం మొదలుపెట్టింది. నాన్న , అమ్మా నీ స్నేహితుడు బాగా దులిపేసాడమ్మా అన్నారు, నేను వెంటనే ఏమీ లేదు టీవీ కెమేరా కనపడేటప్పటికి ప్రతివాడు హీరో అయిపోదామనుకొంటున్నారు. వాడు మోసగాడు అన్నాను.అదేమిటీ అంటే అప్పుడు చెప్పాను అతని గురించి, తనూ నేను కలిసి ఒకే చోట పనిచెయ్యడం, అతనితో నా స్నేహం, ప్రేమ అన్నీ.అవి విని అంతేనమ్మ నువ్వన్నది కరెక్ట్ ఎవర్నీ నమ్మడానికి లేదు, ఇంకోపక్క ఆ ఆఫీసర్ ని చూడు,ఒక పక్క వీడిని చూడు అని వాళ్ళు సురేష్ ని చీదరింపుగా చూసారు.తనని చూడగానే మళ్ళీ మనసు వికలం అవడంతో, నేను పడుకొంటున్నానని చెప్పి నా రూం వైపు నడిచాను. కాసేపటికి నిద్రపడుతుంటే హాల్ లో లాండ్ లైన్ రింగ్ వింపడింది నాన్న తీసి మాట్లాడుతున్నారు,నిద్రమత్తులో సరిగ్గా వినపడటంలేదు, నాన్న మరి మీ అమ్మా, నాన్నా అంటున్నారు,నేను బహుశా ఆ ఆఫీసరే చేసివుంటాడు అనుకొని నిద్రలోకి జారుకున్నా.

మర్నాడు ఉదయం లేచిన తరువాత కాఫీ తాగుతుంటే ,నాన్న అన్నారు ఒకవేళ ఆ ఆఫీసర్ కోర్ట్ కి వచ్చినట్లయితే అతను అడిగినా నీకు ఇప్పుడే పెళ్ళి ఇష్టం లేదని చెబుతాను అన్నారు.అలా ఎందుకంటున్నారన్నట్లు చూసాను.ఏమీ లేదు వాళ్ళ అంతస్థులు వేరు మన అంతస్థు వేరు, నీ మంచికే చెబుతున్నాను అన్నారు.నేను సరే అన్నాను.9:30 కి సలీం రావడం మేము కోర్ట్ కి వెళ్ళాము. కోర్ట్ ఆ రోజు కిక్కిరిసి వుంది దగ్గర దగ్గర రెండు నెలలో జడ్జిమెంట్ వస్తున్న కేస్ ఇదే ఏమో.మీడియా వాళ్ళ హడావిడీ ఎక్కువగానే ఉంది కోర్ట్ ఆవరణలోకి వెళ్ళగానే చుట్టుముట్టి ప్రశ్నల వర్షం కురిపించటం మొదలుపెట్టారు , మీరు ఏమి శిక్షపడాలని కోరుకొంటున్నారు, ఉరి శిక్షా, లేక యావజ్జీవ కారాగారమా? వారికి శిక్షపడితే మీకు న్యాయం చేకూరినట్టు భావిస్తారా లేదా? మీరు ఆడపిల్లలకి లేక ఈ సమాజానికి ఏమన్నా సందేశం ఇస్తారా? ఇలా నేను ముక్తసరిగా ముందు కోర్టు ని తన పని తనని చెయ్యనివ్వండి ఆ తరువాత తీరిగ్గా మీ ప్రశ్నలకి సమాధానం చెబుతానని వడి వడిగా కోర్ట్ హాల్లోకి వెళ్ళి కూర్చున్నాము.కాసేపటికి న్యాయమూర్తి రావడము, తన నిర్ణయం చదివి వినిపించారు.ఇద్దరికీ 30సం|| కఠిన కారాగారవాసం , ఒకొక్కరికీ 10వేలు చొప్పున జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.అంతే వాళ్ళిద్దరి భార్యాలు ఏడుపులు లంగించుకున్నారు. తరువాత జడ్జ్ గారు సలీం నీ, పోలీస్ వారిని, నన్ను అభినందించారు.మనస్సుకు ఎంతో వూరటకలిగిన అనుభూతితో నాన్న,నేను, సలీం బయటకు నడిచాము.అంతే ఒక్క సారిగా మీడియావాళ్ళూ ప్రశ్నలు కురిపించటం, ఏదో కప్పదాటుగా సమాధానాలు చెబుతూ బయటకి వస్తుంటే, ఒక విలేకరి నాకు సలీం కి ఏమన్నా సంబంధం వుందా అని అడిగాడు, దాంతో చిర్రెత్తుకొచ్చింది మాకు, ఇంతలో సలీం ఆ విలేకరి మీదకెళ్ళబోతుంటే ఎవరో అతనిని బలవంతంగా పట్టి ఆపారు.మళ్ళీ అతనే ఆమెకి నాతో తప్పితే వేరెవరితోనూ సంబంధంలేదు, ఆమెకి కాబోయే భర్తని అని తనకి తాను పరిచయం చేసుకుంటుంటే ఆశ్చర్యపోయి ఎవరా అని చూస్తే సురేష్ నాకేసి చూస్తూ నవ్వుతున్నాడు.

నాకు చిర్రెత్తుకొచ్చి లేదు ఇతనెవరో నాకు తెలియదని చెబుదామనిపించి ముందుకు కదలబోయాను,వెనకనుండి నాన్న నా భుజం అదిమిపెట్టేరు ఆగమన్నట్లు,నాన్నకేసి ఏమిటన్నట్టు చూస్తుంటే నవ్వుతూ రాత్రి తను నాకు ఫోన్ చేసాడు.నీకోసమే వచ్చాడు అన్నారు. ఏయ్ ఏమిటీ బొమ్మలా చూస్తున్నావు పద ఇంటికెడదాం అటుంటే నాన్న నువ్వు అమ్మాయి కార్ లో వెళ్ళండి నేను సలీం తో వస్తాను అన్నారు.ఏమీ అర్ధం కానిదానిలా వెళ్ళి సురేష్ తో కార్లో కూర్చున్నాను.దారిలో అన్నీ చెప్పాడు, మంచి ఆఫర్ కానీ వాళ్ళు టైం ఇవ్వకపోవడం తో వెంటనే జాయిన్ అవ్వడం , వాళ్ళూ ట్రైనింగ్ కి సింగపూర్ పంపడం,నిన్ననే వెనక్కు రావడం, వచ్చాక సర్ప్రైజ్ చేద్దామనుకోవడం. నేను, ఇంకొక రోజు ఆలస్యం అయ్యుంటే అప్పుడు తెలిసేది నీకన్నాను, ఏమి అన్నాడు ఆ ఆఫీసర్ నన్ను అడగడం చెప్పాను, అప్పుడు రావణాసురిడిలా నిన్ను ఎత్తుకుపోయివుండేవాడినినని నవ్వేసాడు. ఇంటికి వచ్చాక అమ్మని పరిచయం చేస్తే కాళ్ళకి దణ్ణంపెట్టి ఇంక మీకు చింతలేదండి మీ అమ్మాయిని నేను తీసుకుపోతాను అన్నాడు.నీ లాంటి మంచి మనసున్నవాడు మళ్ళీ తిరిగి దొరకడం అది చేసుకున్న అదృష్టం అని అమ్మ అంటే , అబ్బే అదేమీ లేదండి మీ అమ్మాయి విసిరిన ప్రేమ పాశం యమ పాశం కన్నా డేంజెర్ దాన్ని తప్పించు కోవడం నాలాంటి అల్పుడికి ఎలా కుదురుతుందండీ అన్నాడు నవ్వుతూ.ఈలోగా నాన్నా సలీం వచ్చారు , సలీం కి సురేష్ ని పరిచయం చేసాను. మళ్ళీ ఆ ఆఫీసర్ పెళ్ళివిషయం ఎత్తలేదు.మేమే ఇంటికివచ్చాక అతనికి ఫోన్ చేసి వివరాలు చెప్పి అతని సహాయానికి కృతజ్ఞతలు తెలియజేసాం.

 – శ్రీ మీలో ఒకడు

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కథలు, తొలి కథPermalink

12 Responses to ప్రేమ పాశం – (కథ ) శ్రీ మీలో ఒకడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో