స్నేహ బంధం(కథ) -కనకదుర్గ

Kanaka Durga

Kanaka Durga

“సంధూ! నిన్న నాకు ఒక కల …..ఊహు కల కాదు అది నా కళ్ళ ముందు నిజంగా జరిగినట్టుగా అనిపించింది. నా కళ్ళ ముందు ఇంకా కదలడుతూనే వుంది తెలుసా…”
’ఏమిటే అను నీ గోల? కల అంటావు, కల కాదు నిజంగా జరిగింది అంటావు, ముందు నువ్వు కామ్ డౌన్ అవ్వు ప్లీజ్.” అంది సంధ్య.
“నేను కామ్ గానే వున్నాను. నేను చాలా ఎక్సైటడ్ గా వున్నాను….ముందు నే చెప్పేది విను. నా చుట్టురా ఒక సూర్యగోళంలా వెలిగిపోతున్న పెద్ద వలయాకారం దాని మధ్యలో నా ప్రాణం వుంది….” సంధ్యని సందూ అని పిలవడం ఇష్టం అనురాగిణికి.
“అంటే నీ గుండె కాయేనా?” అడిగింది సంధ్య.
“అబ్బా మధ్యలో ఆపకు మళ్ళీ నాకు గుర్తుండదు, చెప్పడానికి రాదు. ఆ వలయాకారంలో ఎంత బాధ వుందో, ప్రపంచంలో ఎంత ఎక్కువ నొప్పి వుంటుందో అంతా అక్కడే వుంది. ఆ వలయాకారం దాటి వెళితే పచ్చటి గడ్డి, పూల చెట్లు, ఆనందం అంతా అక్కడ పోగయినట్టుగా వుంది. నా ప్రాణం ఆ వలయాకారం నుండి బయట పడితే అంతా ఆనందమే…..”
“అంటే నువ్వు చనిపోవడమన్న మాట….అను ఏం మాట్లాడుతున్నావు?”
“మళ్ళీ అడ్డు పడింది. కాసేపు నోరు మూసుకుని వినలేవా? అదే కదా నేను చెప్పుతుంది. ఈ బాధ, నొప్పి, ఈ కిమోధెరపీలు, వాటి సైడ్ ఎఫెక్ట్స్ ఇవ్వన్నింటినుండి విముక్తి లభిస్తుంది కదా! అలా బయటికి వెళ్ళకుండా ఇంకా ఆ ప్రాణం అంత బాధ తట్టుకుంటూ అందులోనే వుంది. ఇదంతా నా కళ్ళ ముందర జరుగుతున్నట్టుగా వుంది, నేనేమో బయటకెళితే ఈ బాధ వుండదు కదా ఇంకా ఈ పిచ్చి ప్రాణం ఈ వలయాకారంలోనే కొట్టుకుంటూ ఎందుకు వుంది అని ఆలోచిస్తున్నాను. అంటే నా ప్రాణం అంత గట్టిదన్నమాట తెలిసిందా? అదే నీకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నానే మొద్దు నీకేమో తొందరెక్కువ. నేనెక్కడ చచ్చిపోవాలనుకుంటున్నానో అని ఆదుర్ధా పడతావు.” అని వూపిరి పీల్చుకుంది అనురాగిణి.
“నాకు తెల్సు నా అను అస్సలు ధైర్యం కోల్పోదు. నువ్వు చాలా గట్టిదానివి, ఈ జబ్బుని ఎంత నిర్భయంగా ఎదుర్కుంటున్నావో అలాగే కంటిన్యూ చెయ్యి అదే నిన్ను, నీ పట్టుదల, విల పవర్ ని, ఆత్మవిశ్వాసాన్ని చూసి పారిపోతుంది బంగారం.” అంది సంధ్య.
” నాకింకా జరిగిన ఈ అనుభవం కళ్ళ ముందే తిరుగుతుంది. నేను ఎన్నిసార్లు అనుకున్నానో బయటికి వెళ్ళిపోతే ఈ సఫరింగ్ అంతా వుండదు కదా! ఎందుకు వెళ్ళడం లేదు అని. కానీ ఇప్పుడు నాకు ఒకటి అర్ధం అయ్యింది. ప్రాణం పోయినా పెద్దగా బాధ పడాల్సింది ఏమీ లేదు ఎందుకంటే అటు వైపు అంతా ఆనందమే వుంది అంతగా భయపడాల్సింది ఏమీ లేదు అని……”
“కావొచ్చు ఇక్కడ కూడా బాధలొక్కటే కాదు నీకు తెల్సు నీకు బాగున్నప్పుడు ఒక్క నిముషం కూడా వేస్ట్ చేయవు. నీ కిష్టమయిన పనులు చేస్తూనే వుంటావు. ఈ కల కానీ అనుభవం కానీ నీ శక్తి ఏమిటో నీకు తెలియడానికి జరిగింది. అందుకని నీ కాన్ఫిడెన్స్ ఇంకా ఎక్కువవుతుంది కంగారు పడకు అని నేను నీకు చెప్పక్కర్లేదు. నీ బాధని పక్కన పెట్టి ఎవరికయినా చిన్న ప్రాబ్లెమ్ అది ఆరోగ్య సమస్య కానీ వేరే సమస్య కానీ వాళ్ళకి నువ్వే ధైర్యం చెప్పేస్తావు. నోట్లో పొక్కులు వచ్చాయన్నావు, తగ్గాయా, ఏమన్నా తింటున్నావా? ఇంకా జ్యూస్ లే తాగుతున్నావా?” అని ఆ విషయం నుండి అనురాగిణి మనసు మరల్చడానికి ప్రయత్నించింది సంధ్య.
“కొద్దిగా తగ్గింది. సాఫ్ట్ ఫుడ్ తింటున్నాను, జ్యూస్ లు తాగుతున్నాను.  సందూ నాకు డాక్టర్ ఆఫీస్ నుండి కాల్ వస్తుంది. మళ్ళీ తర్వాత మాట్లాడతాను, బై,” అని డిస్ కనెక్ట్ చేసింది అను.

సంధ్య పని చేసుకుంటూ అనురాగిణి గురించి ఆలోచిస్తుంది. వీరిద్దరి మాటలు, గంటలు గంటలు ఫోనుల్లో మాట్లాడుకోవడం, ఇద్దరి మధ్య చనువు, ఒకరితో మరొకరు అన్నీ షేర్ చేసుకోవడం చూస్తే అందరూ చిన్ననాటి స్నేహితులో, లేక ఎన్నో ఏళ్ళుగా స్నేహితులనుకుంటారు కానీ ఇద్దరికీ పరిచయం జరిగింది ఒక రెండేళ్ళ క్రితం మాత్రమే. సంధ్యకి మరో ఫ్రెండ్ ద్వారా, ’నీ లాగే బాగా పట్టుదల వున్న వ్యక్తి, ఏ బాధ వచ్చినా కృంగిపోదు, ఎప్పుడు అవకాశం దొరికితే ఏదో ఒకటి నేర్చుకుంటూనే వుంటుంది. న్యూజెర్సీలో వుంటుంది తనూ ఇండియాలో పేద పిల్లలకి ఏదైనా చేయాలని కోరిక, మీ ఇద్దరికీ బాగా కుదుర్తుంది స్నేహం,’ అని చెప్పి అనురాగిణి ఫోన్ నెంబర్ ఇచ్చింది.
“సంధ్యా, తనకి క్యాన్సర్ వచ్చి ట్రీట్మెంట్ అయిపోయి ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. నీకూ యాక్సిడెంట్ అయ్యి పోరాటం చేసి ప్రాణాలతో బయట పడ్డావు. కానీ నీ జీవితం అంతా తల్లకిందులయ్యింది కానీ నీ పోరాటం ఇంకా సాగుతూనే వుంది. తనూ నీలాగే ఆరోగ్య సమస్యలతో బాధ పడ్తుంది. ఇద్దరు ఒకరికొకరు అండగా వుండొచ్చు. నాకు తెల్సు ఎవరికయినా బాగాలేదంటే నువ్వు నీకు వీలయినంత సాయం చేయడానికి ప్రయత్నిస్తావు ముఖ్యంగా స్నేహ హస్తాన్ని అందిస్తావు. అందుకే మీరిద్దరు మంచి స్నేహితులవ్వాలని కోరుకుంటున్నానని,” చెప్పింది సంధ్య ఫ్రెండ్ స్వరూప.
సంధ్య మొదటిసారి ఫోన్ చేసినపుడు అనురాగిణి కార్లో వర్క్ నుండి ఇంటికి వెళ్తుంది. సంధ్య తనని పరిచయం చేసుకోగానే, ” ఓ మీరా? ఇట్స్ వెరీ నైస్ టు టాక్ టు యూ అండీ. స్వరూప మీ గురించి చాలా చెప్పింది. మీరు చాలా పెద్ద యాక్సిడెంట్ నుండి బయటపడి చాలా ధైర్యంగా మీ జీవితాన్ని గడుపుతున్నారని చెప్పింది. మీరెప్పుడూ ఇతరులకు సాయం చేయడానికి ప్రయత్నిస్తుంటారని చెప్పింది. మీరు ఏమి అనుకోనంటే అస్సలు యాక్సిడెంట్ ఎలా జరిగిందో అడగొచ్చా?”
” ఇందులో అనుకోవడానికేముందండీ. నేను వర్క్ నుండి ఇంటికి వస్తుంటే జరిగింది. తాగి డ్రైవింగ్ చేయవద్దని ఎంత చెప్పినా విననివాళ్ళ వల్ల నా లాంటి వాళ్ళు ఎంత మంది బలవుతున్నారో నన్ను చూస్తే తెలుస్తుంది. చక్కగా నడిచి ఎన్నో పనులు చేసుకునే నేను, డాన్స్ అంటే ఇష్టమని ఇక్కడ మా పాపతో పాటు నేర్చుకునేదాన్ని. యాక్సిడెంట్ లో నాకు రెండు కాళ్ళు పోయాయి. ప్రాణం కూడా పోయేదే కానీ బాగా పోరాడాల్సి వచ్చింది, ఎన్నో సర్జరీలు జరిగాయి, అన్నీ మొదటినుండి నేర్చుకోవాల్సి వచ్చింది, మాట్లాడటం, కాళ్ళు లేకుండా బ్రతకడం, వీల్ చేయిర్ కి అలవాటు పడటం, ఆర్టిఫిషియల్ కాళ్ళు పెట్టించుకోవడానికి ప్రయత్నిస్తున్నాను కానీ చాలా డబ్బు ఖర్చవుతుంది. మీకు తెలుసు కదా, ఎంత ఇన్స్యూరెన్స్ లున్నా చాలా వరకు మనం పెట్టుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ చూస్తుంటే, అందరినీ ఇంత అవస్థ పెడుతూ బ్రతకడం కంటే ఆ యాక్సిడెంట్ లో ప్రాణం పోతే బావుండు అనిపించిన రోజులున్నాయి. కానీ నా పాప కోసం, నేను ఎలా వున్నా సరే కళ్ళముందు నవ్వుతూ కనిపిస్తే చాలు అనుకునే నా వాళ్ళని బాధ పెట్టడం కంటే ఇంతకంటే భయంకరమైన పరిస్థితిలో వున్న వాళ్ళు ధైర్యంగా బ్రతుకుతుండగా నేను బ్రతకలేనా అనిపించింది. ఇంకా మెదడు పని చేస్తుంది, మనసు అన్నింటికి స్పందిస్తుంది చేతులున్నాయి కళ్ళు, చెవులు, గొంతు అన్నీ పని చేస్తున్నాయి. ఆరోగ్యంగా కనిపిస్తాను. ఎవరికైనా చెబితే కానీ తెలీదు నేను ఇవన్నీ భరించానని, మృత్యువుకి దగ్గరగా వెళ్ళి తిరిగి వచ్చానని అలాంటపుడు నిరాశలో మునిగి బ్రతకడంలో అర్ధం లేదు అని అందరితో కలిసి ముందుకు సాగుతున్నాను. కానీ నాకు మీలాంటి వారిని చూస్తే ఎంతమందికి స్ఫూర్తినిస్తూ ముందుకు వెళ్తున్నారో కదా అనిపిస్తుంది.” అని చెప్పింది సంధ్య.
ఇదంతా విన్న అనురాగిణి సంధ్య పడిన బాధని అర్ధం చేసుకోవడమే కాదు తన మనస్థయిర్యానికి అబ్బుర పడింది.
ఆ రోజు అలా వాళ్ళిద్దరూ ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటూనే వున్నారు సమయం ఎంతయింది అన్నది అస్సలు చూసుకోలేదు.
అప్పుడే వారిద్దరి మధ్యన ఒక తెలియని బంధం చాలా గట్టిగా ముడిపడిపోయింది. ఆ తర్వాత రోజుకొకసారి ఇద్దరూ పలకరించుకోవడం చేసేవారు.
అప్పుడు బాగానే వుంది అనురాగిణి. కీమో ధెరపీల నుండి కోలుకుంది, ఆరోగ్యం కుదుట పడగానే జీవితాన్ని వీలయినంతవరకు సంతోషంగా గడపాలని నిర్ణయించుకుంది. క్యాన్సర్ రావడంతో అపస్మారక స్థితి నుండి తెలివిలోకి వచ్చినట్టయింది. జీవితం అన్నది చాలా చిన్నది బ్రతికి వున్నంత కాలం అందరితో సంతోషంగా వుండాలని అలాగే తనకు సంతోషాన్నిచ్చే పనులు కూడా చేయాలని నిర్ణయించుకుంది. అనురాగిణి అంతకు ముందు సంతోషంగా బ్రతకలేదని కాదు. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ వుండేది.
కొన్ని పనులు తర్వాత, తర్వాత అంటూ బద్ధకిస్తూ వస్తున్నవన్నీ చేసేయాలని నిర్ణయించుకుంది. బంగారం లాంటి తన ఇద్దరమ్మాయిలతో, కూచిపూడి నేర్చుకోవడం మొదలు పెట్టింది, చిన్నప్పటి నుండి వీణ అంటే చాలా ఇష్టం వుండేది కానీ నేర్చుకునే అవకాశం రాలేదు. ఇండియానుండి పుట్టింటి నుండి వీణ తెప్పించుకుంది. తల్లి వాయించేది. తల్లి, తండ్రి ఇద్దరూ డాక్టర్లు కావడంతో తల్లికి ఎక్కువ వాయించే సమయం వుండేది కాదు. తల్లి హార్ట్ అటాక్ తో రెండేళ్ళ క్రితం పోయింది.
వీణ నేర్చుకోవడం, శాస్త్రీయ సంగీతం చిన్నప్పుడు నేర్చుకున్నది, మళ్ళీ మొదలుపెట్టింది, ఎప్పుడూ తన కమ్మని గొంతుతో సంగీతం, లలిత సంగీతం పాడుతూనే వుండేది. పిల్లలతో కరాటే నేర్చుకుని అతి తక్కువ సమయంలో బ్లాక్ బెల్ట్ సంపాదించుకున్నది. అలాగే పియానో నేర్చుకున్నది, పిల్లలు చిన్నప్పటినుండి నేర్చుకుంటున్నా చాలా త్వరగా వారి లెవెల్ని దాటిపోయి బీతోవెన్, మొజార్ట్, బాక్ లాంటి క్లాసికల్ పియానో ప్లేయర్స్ పీసెస్ ఎంతో మధురంగా వాయించడం నేర్చుకున్నది.
చిన్నప్పట్నుండి లెక్కల్లో చాలా చురుకుగా వుండడంతో ఇంజనీరింగ్ చేసి, డాక్టరేట్ కూడా చేసింది. సాప్ట్ వేర్ ఇంజనీర్ గా వర్క్ చేసేది, అంతకు ముందు టీచింగ్ అంటే ఇష్టం వుండడంతో రట్ గర్స్ యునివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేసింది. సాహిత్యం అంటే అభిమానం, అన్ని రకాల బుక్స్ చదవడం అంటే ఇష్టం. లెక్కల్లో మునిగితేలే వారికి కవిత్వం అన్నా, రాయడం అన్నా ఇష్టం వుండదనుకుంటారు కానీ అనురాగిణి సరస్వతీ కటాక్షం వున్న అదృష్టవంతురాలనిపిస్తుంది. మంచి కవితలు తెలుగులో, ఇంగ్లీషులో రాసేది. ఎప్పుడో, ఎక్కడో కానీ ఇలాంటి మనుషులు కనిపించరు. ఎవ్వరయినా బాధ పడ్తూ, నిరాశలో మునిగిపోయి వున్నవారు మనస్ఫూర్తిగా ఎంతో ఆత్మీయంగా నవ్వే అనురాగిణిని చూస్తే చాలు సగానికి పైగా డిప్రెషన్ పోయేది. ఆ తర్వాత తను వారితో అనురాగం, ఆప్యాయత కలగలిపి మాట్లాడే తీరుకి వారి మనసు మారిపోయేది.
ఎవ్వరిపై ఆధారపడడం తనకిష్టం వుండేది కాదు. క్యాన్సర్ వున్నప్పుడు కీమోధెరపీకి కూడా తనే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళేది. వచ్చేపుడు ఎవరైనా పికప్ చేసుకునేవారు.
మల్లెపూవులాంటి స్వచ్చమైన ఆమె నవ్వు చూస్తే చాలు ఎడారిలో చిరుజల్లు కురిసినట్టుగా వుంటుంది.
గల గలా మాట్లాడే అనురాగిణితో కొద్దిసేపు వుంటే చాలు మనసు దూది పింజలా తేలిపోతుంది.
ఒకోసారి తను ఆలోచించి ఒక్క నిముషం వృధా చేయకుండా సమయాన్ని ఎలా వాడుకోవాలో చెబుతుంటే ఆమె అబిమానులమై పోయి విని మనం తను చెప్పినట్టు తప్పకుండా చేయాలని నిశ్చయించేసుకుంటాము.
అనురాగిణి జీవితాన్ని జీవించే తీరు చూస్తే అంత ఉల్లాసంగ ఎలా వుండగలదో అనిపిస్తుంది. ఆమె ఆత్మవిశ్వాసం, ఆత్మభిమానం, ఆత్మస్థయిర్యం, ఎదుటివారికి తను పంచే స్నేహం, ప్రేమాభిమానాలు ఇట్టే కట్టి పడేస్తాయి ఎవరినైనా.
పెద్ద కూతురు శ్రావ్య డిగ్రీ అయిపోయి గ్రాడ్యుయేట్ అవుతుంది ఈ సంవత్సరం. చిన్న కూతురు మెడిసన్ ఫస్ట్ ఇయర్ లో వుంది.
పిల్లలకి తను కూర్చోపెట్టుకుని ఏది నేర్పించక్కరలేదు, తను గడిపే జీవితం చూస్తేనే చాలు వాళ్ళకి అన్నీ అర్ధం అయిపోతాయి.
క్యాన్సర్ తగ్గి పిల్లలతో సమయం గడుపుతూ చాలా ఆనందంగా వుంది అనురాగిణి. కూతురు చదువు ఈ ఏడాది అయిపోతే తను గ్రాడ్యూయేషన్ చూడడానికి వుంటుంది అనుకుంటేనే ఎంతో ఆనందంగా వుంది.
కీమోధెరపీ తీసుకునేపుడు, సర్జరీలు జరిగి రోజులు రోజులు స్పృహ లేకుండా పడి వున్న రోజులు తల్చుకుంటే పిల్లలు జీవితంలో సెటిల్ కావడం ఈ జన్మలో చూడలేననుకున్నది. చిన్న కూతురు మెడిసన్ ఫస్ట్ ఇయర్ లో వుంది.
ఫస్ట్ టైమ్ క్యాన్సర్ అని తెలిసినపుడు అనురాగిణి అందరిలానే ఆ మాట తన జీవితంలో వినాల్సి వస్తుందనుకోలేదు. కానీ వెంటనే తనని తాను తమాయించుకుంది, భయపడడం వల్ల వచ్చే లాభం ఏమిటో అర్ధం కాలేదు. ఏం ట్రీట్ మెంట్స్ వున్నాయి, ఎలా తీసుకోవాలి, ఎలా కేర్ తీసుకోవాలి అన్న విషయాల పైనే దృష్టిని కేంద్రీకరించింది. సర్జరీలు చేసారు, ఎంతో కఠినమైన కీమోధెరపీలు తీసుకుంది. రికవర్ అయ్యింది, డాక్టర్స్ ఇంక 5 ఏళ్ళు రాకుండా వుంటే చాలు క్యాన్సర్ ఫ్రీ అని చెప్పారు. తను మళ్ళీ ఆరోగ్యంగా అయిపోయింది. ఒక ఏడాది ఏ సమస్యల్లేకుండా తన కిష్టమయిన పనులు చేస్తూ, మళ్ళీ జాబ్ లో జాయిన్ అయ్యింది. అప్పుడే సంధ్య, అనురాగిణిల మధ్య పరిచయం కలిగింది.
* * * * * * * * *
సంధ్య ఒక రోజు హై స్కూల్ లో త్రాగి, సెల్ ఫోన్లు పట్టుకుని మాట్లాడ్తూ, టెక్స్ట్ లు చేస్తూ డ్రైవింగ్ చేయడం వల్ల ఏం జరుగుతుందో, ఎంత మంది ప్రాణాలు పోతున్నాయో స్పీచ్ ఇవ్వడానికి వెళ్ళడానికి రెడీ అవుతుంది.
ఫోన్ రింగయ్యింది. డిసేబుల్డ్ వాన్లోకి వీల్ చేర్ తో జాగ్రత్తగా ఎక్కిస్తున్నారు సంధ్య భర్త, డ్రైవర్. ఫోన్ ఆన్ చేసింది సంధ్య. “హాయ్ మై డియర్ ఫ్రెండ్ ఎలా వున్నావు?” అనురాగిణి ఫోన్ చేసింది.
“నేను బాగానే వున్నాను….నువ్వెలా….?”
“నా ప్రియమైన ఫ్రెండ్ నన్ను ముప్పు తిప్పలు పెట్టిన డియర్ క్యాన్సర్ నన్ను వదిలి పెట్టి వుండలేనని వచ్చేసింది. ప్రస్తుతానికి నా అండాశయంలో చిన్న గోళికాయంత వుంది, కానీ ఇది చాలా త్వరగా పెరిగే క్యాన్సర్ అట…”
“హే అను ఆర్ యు సీరియస్, జోక్ చేస్తున్నావా?”
“ఇది జోక్ చేసే విషయమా? టెస్ట్ కెళ్ళే టైమ్ కదా, వెళ్ళాను. నాకు ఏ బాధ లేదు, ఏ లక్షణాలు లేవు కాబట్టి అంతా నార్మల్ గా వస్తుందనుకున్నాము అందరం. కానీ అప్పుడే గోళీ కాయంత వుంది, ప్రతి నిమిషం పెరిగుతూనే వుంటుంది కాబట్టి ఎంత త్వరగా సర్జన్ ని వెతికి పట్టుకోవాలి, దాన్ని తీసేయడానికి. అది తీసాక నేను బ్రతికి వుంటే మళ్ళీ కీమోధెరపీ ఇస్తారట.” చాలా మామూలు విషయమైనట్టుగా చెప్పింది.
“డాక్టర్ ని వెతికి పట్టుకోవడం ఏంటే..”
“ఇది చాలా తక్కువగా వస్తుందట. దేశం మొత్తంలో చాలా కొంత మంది సర్జన్స్ మాత్రమే ఇలాంటి సర్జరీలు చాలా జాగ్రత్తగా చేయగలరట. సో వేట మొదలయ్యింది. నువ్వు కూడా చూస్తూ వుండు, నీకు కూడా సర్జన్స్ తెల్సు కదా!”
” అది కాదు అను అంతా క్లియర్ అయిపోయింది ఇంక ఏమీ లేదు అని చెప్పారు కదా! ఇప్పుడేమిటి ఇలా అయ్యింది? నాకు చాలా భయంగా ఉంది.”
“ఏం చేస్తాం భయపడితే అది పెరగడం ఆగుతుందా? సమయానికి డాక్టర్ దొరికితే సరే లేకపోతే ఇంకేం చేస్తాం చెప్పు. మనం కొంచెం ఎక్కువగానే రిలాక్స్ అయినట్టున్నాం. చూద్దాం ఏం జరుగుతుందో, సరే మళ్ళీ చేస్తాను. ఇంట్లో మళ్ళీ భయపడుతున్నారు.
వాళ్ళని కొంచెం కామ్ డౌన్ చేయాలి.”
“అనూ ప్లీజ్ కాస్త జాగ్రత్తగా వుండే!” సంధ్య కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి.
అను చెప్పినట్టుగానే ఆ క్యాన్సర్ త్వర త్వరగా పెరిగి అది కాస్తా ఒక పెద్ద బాల్ సైజ్ అయ్యి కూర్చుంది. డాక్టర్లని వెతకడంలో అందరూ ప్రయత్నిస్తున్నారు.
ఇంత జరుగుతున్నా కూడా అను మాత్రం జాబ్ కి వెళ్ళి వస్తూనే వుంది. సంధ్య చూడడానికి వెళ్ళింది. అంతా హడావిడిగా వుంది. శ్రావ్య, కావ్యలు కూడా వచ్చారు.
“ఏం జరుగుతుందే అను? ఎవరన్నా చెప్పండే నాకు చమటలు పోస్తున్నాయి….”
“ఫిట్స్ బర్గ్ లో సర్జన్ వున్నాడు ఆయనకి రిపోర్ట్స్ అన్నీ ఫార్వర్డ్ చేసాము. ఆయన డైరెక్ట్ గా ఆపరేషన్ కే వచ్చేయమన్నాడు. అక్కడికే వెళ్తున్నాము. పిల్లల్ని కూడా తీసుకెళ్తున్నాను చాలా రిస్క్ తో కూడిన సర్జరీ ఒకవేళ సీరియస్ అయితే వాళ్ళు నా దగ్గర వుంటారు కదా!”
“అనూ నువ్వలా మాట్లాడకే, నాకు భయమేస్తుంది. నీకేమి అవ్వదు, నేను కూడా వస్తానే నీతో.”
అను ఎప్పుడూ గల గలా మాట్లాడ్తూ వుండేది ఒక్కసారిగా కామ్ గా అయిపోయింది. గొంతులో బాధ తొణికిసలాడింది,”సంధూ, మనం ఫ్రెండ్సయ్యి ఎన్ని రోజులయ్యింది? ఇంత త్వరగా ఎంత క్లోజ్ గా అయ్యామో! నీ ధైర్యమే నాకు స్ఫూర్తినిస్తూ వుంటుంది. నాకు ఏమి అవ్వదు. నువ్వు కంగారు పడకు. నేను త్వరగా తిరిగొస్తాను, అప్పుడు మనం ఇద్దరం చాలా కబుర్లు చెప్పుకుందాము సరేనా?”
సంధ్య గుండెల్లో దిగులు, అనుని వదలాలంటే చాలా బాధగా వుంది. వెళితే తిరిగి వస్తుందో రాదో అని భయం వేస్తుంది. కానీ అను ధైర్యం చూస్తుంటే తనకేం అవ్వదు, సర్జరీ అయిపోతుంది, తిరిగొస్తుంది అనిపిస్తుంది.
పిట్స్ బర్గ్ వెళ్ళి సర్జరీ చేయించుకుని వారం కాగానే తిరిగొచ్చారు. సర్జరీ రోజు సంధ్య మనసంతా అను దగ్గరే వుంది, సరిగ్గా ఏ పని చేయలేకపోయింది.
సర్జరీ చాలా జాగ్రత్తగా చేసి సర్జన్స్ అమెరికన్ ఫుట్ బాల్ సైజ్ అంత పెరిగిన ట్యూమర్ ని తీసేసారు. సర్జరీ తర్వాత కొద్దిగా కీమో ధెరపీ కూడా ఇచ్చారు.
ఇంటికి వచ్చింతర్వాత అందరూ వెళ్ళి చూసి చాలా సేపు సమయం గడిపి వచ్చారు. సంధ్యా వాళ్ళు
ఆ తర్వాత రోజు ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నారు. కొన్నాళ్ళు బాగానే వుంది. డాక్టర్లు కీమో ఇవ్వాలా, వద్దా అనే మీమాంసలో పడ్డారు. కొన్ని నెలల తర్వాత మళ్ళీ లక్షణాలు కనిపించగానే కీమో ధెరపీ మొదలు పెట్టారు.
పిల్లలకి క్రిస్మస్ సెలవులకి వాళ్ళ బావగారి ఫ్యామిలితో అనురాగిణి ఫ్యామిలీ కూడా ఫ్లోరిడా ట్రిప్ కి వెళ్ళారు రెండు వారాలు కీమోధెరపీ మానేసి. వెళ్ళేపుడు సంధ్య అడిగింది, కీమో అలా మధ్యలో ఆపేస్తే పర్వాలేదా అని, ఏం పర్వాలేదన్నారు. అని చెప్పింది అనురాగిణి.
వెళ్ళి బాగా ఎంజాయ్ చేసి వచ్చారు. వచ్చింతర్వాత ఫోన్ చేస్తే రెండు మూడు రోజులు కలవ లేదు. అల్సిపోయి వుంటుంది అని వూరుకుంది సంధ్య.
ఇక ఆగలేక మెసేజ్ పెట్టింది కంగారుగా వుంది ఎలా వున్నావని.
“ఏంటే కంగారు సంధూ! హాస్పిటల్ కి వెళ్ళాను. కొన్ని టెస్ట్ లు చేయాలన్నారు ఎందుకంటే నాకు మెడ దగ్గర నొప్పి మొదలయ్యింది. ఇంతవరకు ఎక్కువ నొప్పి లేదు, వెన్నెముకలో ప్రాకిపోయిందని అనుమానపడుతున్నారు, రిపోర్ట్స్ రేపు వస్తాయి.”
“అంటే క్యాన్సర్ అన్ని భాగాలకి ప్రాకిపోతుందా అనూ? వెన్నెముకకి ప్రాకితే మంచిది కాదంటారు కదే,” సంధ్య గొంతులో కంగారు, భయం.
“ప్లోరిడాలోనే మొదలయ్యిందే కానీ అక్కడ పిల్లలతో మంచి మెమొరీస్ చేసుకోవాలనిపించింది. అన్నట్టు నీకు ఒక విషయం చెప్పాలే అక్కడ ఒక వేప మొక్క దొరికింది. అది క్యాన్సర్ కి మంచిదంటారు కదా! ఆ మొక్క తేవడానికి ప్లయిట్లో కష్టం అవుతుందన్నారు. కానీ మొత్తానికి తీసుకొచ్చాము తెలుసా!”
ఇలాగే రోజులు గడుస్తున్నాయి. అనురాగిణి క్యాన్సర్ తగ్గడానికి ఏ పూజయినా, ఏ శ్లోకాలు చదువుకుంటే మంచిదో, మెడిటేషన్ చేస్తే మంచిదని చెబితే తనకి వీలైనవి చేస్తుంది. తనకిష్టమయిన బుక్స్ చదువుకుంటుంది, వీణ వాయించుకుంటుంది.
కూతురు గ్రాడ్యుయేషన్ కి వుంటానని, పిల్లలు జీవితాల్లో సెటిల్ అవ్వడం చూస్తానని మురిసిపోయిన అనురాగిణికి భయం పట్టుకుంది అప్పటివరకైనా వుంటానో లేదా అని. కీమో ధెరపీతో కడుపులో అంతా అప్ సెట్ గా అయ్యింది మళ్ళీ కీమో మొదలు పెట్టాలంటే
ఎండోస్కోపి చేయాలన్నారు డాక్టర్లు. వొంట్లో ఎముకలన్నీ చాలా డెలికేట్ గా అవుతున్నాయి. గట్టిగా పట్టుకుంటే అవి విరిగిపోయే అవకాశం వుంది.
అందుకని అనురాగిణి తన పరిస్థితి అందరికీ తెలియదు కాబట్టి ఆ టెస్ట్ చేసేపుడు మొరటుగా చేతులు, కాళ్ళు, ఎక్కడైనా ఎముకల్ని పట్టుకుని లాగితే సమస్య అవుతుందని ఒక పేపర్ మీద పెద్ద అక్షరాలతో రాసి,” హ్యాండిల్ విత్ కేర్ బికాస్ మై బోన్స్ ఆర్ డెలికేట్ యాస్ ది క్యాన్సర్ ఈజ్ స్ప్రెడింగ్,” హాస్పిటల్ గౌన్ పై అతికించుకుని వెళ్ళింది. అనురాగిణి ఆ జబ్బు ఎంత మొండిగా విసిగిస్తే తనూ అంతే మొండిగా పోరాడుతుంది. కడుపులో అంతా బాగానే వుంది కీమో ఇయొచ్చు అని రిపోర్ట్ వచ్చింది.
ఇంటికి వచ్చాక ఈ విషయాలన్నీ సంధ్యకి చెప్పేది. అనురాగిణి తెలివికి హ్యాట్స్ ఆఫ్ అనుకున్నది సంధ్య.
“ఇలాంటి సమస్యలున్నప్పుడు బుర్ర పనిచేయడమే మానేస్తుంది చాలా మందికి, నీకు ఈ ఐడియాలన్నీ ఎలా వస్తాయి తల్లీ,” అని ఆశ్చర్యపోయేది.
“బుర్రకి సమస్యలొచ్చినప్పుడే పని చెప్పాలి, లేకపోతే అది వుండి ఏం లాభం చెప్పు. మాకు ఇంజనీరింగ్ చేసెపుడు ట్రైనింగ్ ఇస్తారు. నేను ఎక్కిన లిఫ్ట్ లోనే మా కంపెనీ ప్రెసెడెంట్ ఎక్కాడనుకో, అతను నన్ను ఏ ప్రాజెక్ట్ లో వర్క్ చేస్తున్నావని అడగొచ్చు. మనకి వుండేది కొన్ని నిమిషాల సమయమే. ఆ కొన్నినిమిషాల్లో ఆయనకి మా ప్రాజెక్ట్ గురించి అర్ధం అయ్యేలా చెప్పాలి. అందుకని మేము చేసే ప్రాజెక్ట్ గురించి క్లాస్ లో ప్రాక్టీస్ చేయిస్తారు. మొదటిసారి అది పది పేజీలొస్తుంది, ఇంక అక్కడ్నుండి అది రెండు, మూడు నిమిషాల్లో వచ్చేదాక వూరుకోరు. ఆ ట్రయినింగ్ కేవలం ఆఫీస్ ప్రాబ్లమ్స్ కే అనుకుంటే పొరపాటు. జీవితంలో సమస్య ఎప్పుడొస్తుందో తెలియదు అందుకని మన మెదడుకి పదును పెడుతూనే వుండాలి అప్పుడే అది మనకి కావాల్సినపుడు పని చేస్తుంది.” అని ఎంతో ఎనర్జిటిక్ గా చెప్పింది.
ఇలాంటి విషయాలు విన్నప్పుడు అనురాగిణి అసమానమైన తెలివితేటలకి సంధ్య అబ్బుర పడేది. అందరూ చదువుకుంటున్నారు, ట్రైనింగ్ లు చేస్తున్నారు. కానీ సమస్య వస్తే ఎంత మంది వారు నేర్చుకున్నదాన్ని నిజ జీవితంలో అమలులో పెడుతున్నారు, అందుకే అనురాగిణి అంత ప్రత్యేకమైనది అనుకున్నది సంధ్య.
అలాంటి స్నేహితురాలు దొరికినందుకు పొంగిపోని రోజు లేదు. ఈ స్నేహం ఇలాగే ఎప్పటికీ కొనసాగాలని మనసారా కోరుకుంటూ వుంటుంది సంధ్య.
సంధ్య ఎప్పటికప్పుడు అడిగేది, ” ఈ రోజు నీకెలా అనిపిస్తుంది? డాక్టర్లేమంటున్నారు?” అని.
” ఈ రోజే నేను చచ్చిపోతున్నట్టుగా అయితే అనిపించడం లేదు. డాక్టర్లు, ఇంకో ఆర్నెల్లు అంటున్నారు!”
“అదేమిటే మొన్నే ఏమి లేదు నేనే దాన్ని ముప్పు తిప్పలు పెట్టి నన్ను వదిలిపెట్టేలా చేస్తాను చూడు అన్నావు, డాక్టర్లు నిజంగా అలా చెప్పారా?” అని ఆదుర్ధాగా అడిగితే, ” అదేం లేదే, ఒకోసారి కొన్ని క్రానిక్ అవుతాయట. అలాంటపుడు. కొన్నాళ్ళు ట్రీట్మెంట్, కొన్నాళ్ళు ఫ్రీడం ఫ్రమ్ కీమో అన్నమాట.” అని చెప్పింది.
వేళ్ళు నొప్పి పెడతాయని మాత్రం వీణ వాయించడం, పియానో వాయించడం మాత్రం మానలేదు.
ఒకరోజు అనురాగిణి నాన్నగారు ఫోన్ చేసి,”అమ్మా, ఇక్కడ డాక్టర్లు ఇంక మా వల్ల కాదు అని చేతులు ఎత్తేసారు. మేము మాయో (MAYO CLINIC, Minnesota) కి తీసుకెళ్తున్నాము. నువ్వు (PENN) పెన్న్ హాస్పిటల్ కి వెళ్తావు కదా! అక్కడెవరైనా మంచి అన్ కాలజిస్ట్ వున్నారేమో కనుక్కో,” అని చెపితే సంధ్య షాక్ తో నోట మాట రాక అలా వుండిపోయింది.
ఆ రోజే చూడడానికి వెళ్ళింది. ఇంట్లో ఎవ్వరు లేరు. బుక్ చదువుకుంటూ పడుకుని వుంది. సంధ్య, ” ఇదేమిటే ఇలా జరిగింది?” అంటే, ” ఇప్పుడేమయిందని అలా కంగారు పడుతున్నావు. వీళ్ళ వల్ల కాదన్నారు, అది పెద్ద హాస్పిటల్ ఇంకా వేరే ట్రీట్మెంట్స్ వుంటాయి అందుకని వెళ్తున్నాను అంతే కానీ, ఇప్పుడే అంతా అయిపోయినట్టు మాట్లాడతావేమిటి? మా నాన్న కూడా చాలా ఎమోషనల్ గా అయ్యారు అందుకే మా బాబాయి గారింటికి పంపించేసాను, నేను వీణ వాయించుకోవాలి, బోలెడు పుస్తకాలు చదువుకోవాలి, నువ్వు ఏడుస్తుంటే నేనేమి చేయలేను అని పంపించేసాను,”
చాలా సేపు కబుర్లు చెప్పుకున్నారు ఇద్దరు స్నేహితురాళ్ళు హాస్పిటల్స్, మంచి డాక్టర్లు, కొంచెం పొగరున్న డాక్టర్లు, పేషంట్ మాట వినకుండా వాళ్ళకిష్టమొచ్చినట్టు చేసేవాళ్ళ గురించి. హాస్పిటల్ లో పని చేసే అందరి గురించి, కొంతమంది పేషంట్లకి చేయడానికే పుట్టారన్నట్టుగా వుంటారు మరికొంతమంది ఇష్టం లేకున్నా అది ఒక జాబ్ లాగ చేస్తారు కాబట్టి పేషంట్లని మనుషుల్లాగ కాక కేవలం జబ్బు చేసిన శరీరాల్లాగ చూసేవాళ్ళుంటారని మాట్లాడుకున్నారు. వచ్చేసెపుడు ఎందుకో కొంచెం బెంబేలు పడుతున్నట్టుగా మాట్లాడింది అనురాగిణి.
“మనం ఇంత చిన్న వయసులోనే ఎందుకు ఇలాంటి సమస్యలను అనుభవించాల్సి వచ్చిందో? నీకు యాక్సిడెంట్ అయ్యి దాని వల్ల ఇంకా బాధ పడుతున్నావు కానీ నువ్వు ధైర్యంగా జీవిస్తున్నావు నేను అలాగే వుండాలి, సాధించాలి. నాకు శ్రావ్య గ్రాడ్యూయేషన్ చూస్తానో లేదో అనిపిస్తుంది.”
సంధ్య అను మొహం చేతుల్లోకి తీసుకుని, “అదేంటీ ఇలా మాట్లాడేది మా అనుయేనా? ఇదొక్కటే కాదు నీ పిల్లల పెళ్ళిళ్ళు చూస్తావు, వాళ్ళు అన్నిట్లో విజయవంతమవ్వడం కూడా చూస్తావు, తెలిసిందా? ఇలా బెరుకుగా మాట్లాడదు మా అను. నాకు వంద శాతం నమ్మకం వుంది నీకు బాగయిపోతుంది. మనద్దరి పుట్టినరోజులొక్కటే కదా! అందుకే మన ఇద్దరికీ ఎన్నో విషయాల్లో అభిప్రాయాలు, ఇష్టాయిష్టాలు కలుస్తాయని నువ్వే అనే దానివి కదా! నాకు ప్రాణ గండం తప్పింది నీకు కూడా తప్పిపోయి హయిగా నవ్వుతూ, తుళ్ళుతూ వుంటావు సరేనా?”
“అదే నిజమయితే బావుండు సంధ్యా! నాకూ ఇంకా చెయ్యాల్సిన పనులు చాలా వున్నాయి, నాకేదైనా అయితే కుటుంబంలో వాళ్ళు ఎలా తట్టుకుంటారో ఏమో అని అన్పిస్తుంది.”
“ఏమిటే ఈ బేలతనం బంగారం. నువ్వు చాలా స్పెషల్ మనిషివి. నీకు త్వరగా ఎదుటి వాళ్ళ బాధ తెలుస్తుంది, బాధలో వున్నవారిని అర్ధం చేసుకోవడమే కాదు వారికి సాయం చేస్తావు కూడా. ప్రపంచానికి నీ అవసరం చాలా వుంది. మనం ఈ మధ్యనే ఒకావిడ కోమాలో వున్నప్పుడు ఎలా చనిపోయిన తన తల్లి తండ్రులు, ఆమె స్నేహితులు కలిసిఆమెకి ధైర్యం చెప్పారు, ఆమె ఇంక ఒకటి రెండ్రోజుల్లో పోతుంది అనుకున్నావిడ ఎలా బ్రతికి బయట పడింది ఇప్పుడు క్రానిక్ జబ్బులు, క్యాన్సర్ లాంటి మహమ్మారితో బాధ పడేవారికి ప్రపంచం నలుమూలలకి వెళ్ళి ఎలా స్ఫూర్తిని, ఆశని కలిగిస్తుందో చదవలేదా? నీకూ అలాగే అవుతుందని నాకు చాలా నమ్మకం వుంది. నీ కలలో అమ్మ ఎన్నిసార్లు వచ్చి నీతో మాట్లాడలేదు చెప్పు. నువ్వు ధైర్యాన్ని వీడొద్దు బంగారం.” అని గట్టిగా గుండెలకి హత్తుకుంది. సంధ్య భర్త వారిద్దరిని అలాగే ఫోటో తీసాడు.
అనురాగిణి మాయో క్లినిక్ లో వున్నా ఇద్దరూ ఫోన్లో మాట్లాడటం, టెక్స్ట్ పంపించుకోవడం చేసుకునేవారు. దూరం అవ్వడంతో వెళ్ళి చూడలేకపోయింది సంధ్య.
ఎప్పుడు అడిగినా టెస్ట్స్ చేసారు, రిపోర్ట్స్ రాలేదు అని చెప్పేది. తనకి దొరికిన క్యాన్సర్ సమాచారం అంతా ఒక వెబ్ సైట్ లో పెట్టసాగింది, సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఏం చేయాలి, కొత్తగా జరుగుతున్న రిసెర్చ్ లు, వాటిలో సైంటిస్ట్స్ ఎంత వరకు ముందుకి వెళ్ళారు. అలోపతి ట్రీట్మెటే కాకుండా వేరే పద్దతులు అంటే ప్రకృతి చికిత్స వల్ల ఎలాంటి లాభం వుంటుంది, ఎలాంటి పోషకాహరం తీసుకోవాలి, ఎంత రెస్ట్ తీసుకోవాలి, మనసుని ఉల్లాసంగా వుంచుకోవడానికి వారికిష్టమయిన పనులు ఎలా చేయాలి, యోగా, ధ్యానం ఎలా సాయం చేస్తాయి, అమెరికాలో ఎక్కడెక్కడ మంచి క్యాన్సర్ ట్రీట్మెంట్ సెంటర్స్ వున్నాయి లాంటి విషయాలన్నీ పోస్ట్ చేసేది. ముఖ్యంగా ధైర్యంగా వుండడం, విల్ పవర్, మనస్థయిర్యం ఎంత అవసరమో ఈ జబ్బుతో పోరాటం చేయడానికి అనే విషయాలు ఆర్టికల్స్ రాసేది. మృత్యువు అంటే భయపడాల్సిన విషయం కాదని, అందరూ ఎప్పుడో ఒకప్పుడు పోయేవారని ఒకరు ముందు ఒకరు తర్వాత అంతే! దీని గురించి చాలా లోతుగా ఆలోచించి రాసింది.
అది చదివి సంధ్య అడిగింది, “చదవడానికి బావుంది, అందులో ప్రతి విషయం ఒప్పుకుంటాను. కానీ నువ్వు ఇక నీ వల్ల కాదని ఆశని వదిలేస్తున్నావా?”
” అలా ఎందుకనుకుంటున్నావు? ఒక్కసారి మనసులోని ఆ భయాన్ని జయిస్తే ఆ తర్వాత ఇంకా గట్టిగా పోరాటం చేయడానికి వీలవుతుందని అలా అన్నాను. నేను ఆశని వదిలిపెట్టలేను సంధూ?”
“ఎప్పుడొస్తావే? చాలా రోజులవుతుంది, నిన్ను చూడాలని వుందే?”
ఇలా మాట్లాడిన రెండు రోజులకే అను వాళ్ళ నాన్నగారి దగ్గరనుండి ఈమేయిల్ వచ్చింది. ” మా బంగారు తల్లి, మా కన్న కూతురిగా మాకు ఎన్నో సంతోషాలను పంచి పెట్టిన నా చిన్నారి తల్లి, మాకే కాదు ఎంతో మందికి ప్రేమానురాగాలను పంచిన నా చిట్టి తల్లిని ఇక్కడి డాక్టర్లు కూడా కాపాడలేమని చెప్పారు. నిన్న రాత్రి నుండి అపస్మారక స్థితిలో వుంది మా అనురాగిణి, అంటే ఎంతో విలువైనది అని అర్ధం. నా తల్లి పేరుకి తగ్గట్టుగా ఎన్నో విలువైన పనులు చేసింది. అలాంటి మనిషి, అంత ప్రేమానురాగాలున్న మనిషి,
తన నవ్వుతో అందరినీ ఇట్టే ఆకట్టుకునే నా తల్లి, అందరిలో మంచినే చూడాలనేది. చెడు ఆలోచనలు, చెడు పనులంటేనే తనకి తెలియవు. ఇంకో రెండ్రోజుల్లో ఇంటికి తీసుకొస్తున్నాము. మీరొచ్చి ఆఖరి సారి మీ స్నేహితురాలిని చూసుకుని వెళ్ళండి. ” అని మేల్ పంపించారు.
సంధ్య కుప్పకూలి పోయింది. ఇలా జరుగుతుందేమో అని భయం వున్నా, అనురాగిణి అమితమైన పోరాడే శక్తి పై నమ్మకం, ఏదో అధ్బుతం జరిగి ఆ జబ్బు అనూని వదిలేసి వెళ్ళి పోతుందని తనని తాను మభ్య పెట్టుకుంటూ అదే నిజం అని నమ్ముకుంటూ వచ్చింది. అనూ కూడా తన మనసుని బాధ పెట్టకూడదని ఎక్కువగా ఈ విషయం మాట్లాడేది కాదు, ఇద్దరూ తప్పకుండా ఒక అద్బుతం జరగాలని, జరుగుతుంది అని నమ్మకం పెట్టుకున్నారు, అది అవ్వదని అనుకోవడానికి కూడా ఇష్టపడలేదు.
మాయో క్లినిక్ లో కూడా పియానో వాయిస్తుంటే మిగతా పేషంట్స్ అందరూ వచ్చి నిల్చుని ఎంతో ఆశ్చర్యంగా చూసేవారు, వీణ తనతో పాటు తీసుకెళ్ళి తనివి తీరా వాయించుకున్నది. పుస్తకాలు మొదలు పెట్టినవన్నీ చదివేసింది. నొప్పి ఎక్కువయినప్పటినుండి పిల్లల్ని పిలిపించుకుని తన దగ్గరే వుంచుకుంది.
తండ్రిని తన ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమని, తన పిల్లల్ని కూడా చూసుకోవాలని చెప్పింది. ఇండియా నుండి తోబుట్టువు అన్న, వదిన వచ్చి తనతో సమయం గడిపి వెళ్ళారు
సంధ్యకే ఏ చివరి మాటలు చెప్పలేదు. తమ అనుబంధం అలాగే వుండాలని అనుకుందేమో తెలీదు.
పిల్లలు అమ్మతో కబుర్లు చెబుతూ, నవ్విస్తూ, సంతోషంగా వుంచడానికి ప్రయత్నించారు.
ఎంతో ఇష్టంగా పెద్ద ఇల్లు కొనుక్కుంది, పెద్ద తోట పెట్టుకోవలనుకుంది, ఇంతలో జబ్బు చేసింది. తర్వాత పిల్లలతో సమయం గడపడం అందమైన జ్ఞాపకాలను వారు గుర్తుంచుకునేలా ఏమేమి చేయాలో అన్నీ చేసింది.
ఇంటికి తీసుకొచ్చారు. సంధ్య ప్రతి నిమిషం గల గల పారే సెలయేరులా, నవ్వితే పున్నమి వెన్నెల విరిసిందేమో అన్పించేలా, తన వ్యక్తిత్వంతో అందరినీ ఆకట్టుకున్న తన అనూ, తను ఎంత బాధలో వున్నా కూడా సంధ్యకి క్రానిక్ అయిన నొప్పి వస్తే ఎన్నో జాగ్రత్తలు చెప్పేది – అలాంటి అనూని అపస్మారక స్థితిలో ఇప్పుడో, అప్పుడో ఈ లోకం వదిలి వెళ్ళిపోతున్న పరిస్థితిలో చూడలేననుకుంది.
ఇద్దరి పరిచయం రెండేళ్ళకన్నా తక్కువే, ఐనా జీవితాంతం మర్చిపోలేని అనుబంధాన్ని, అనుభవాలని పంచుకున్నారు. సంధ్యకి అనురాగిణితో పరిచయం అయినప్పట్నుండి తను మాట్లాడిన ప్రతి మాట, చెప్పిన కథలు, పంచుకున్న అనుభవాలు, అన్నీ గుర్తున్నాయి. వెన్నెల లాంటి ఆమె నవ్వు మాయోకి వెళ్ళే ముందు ఇద్దరు కల్సి తీసుకున్న ఫోటో, చెప్పుకున్న కబుర్లు అన్నీ మదిలో పదిలంగా వున్నాయి. చూడడానికి వెళ్ళలేక పోయింది, అప్పుడే ఆమె భర్తకి విపరీతమైన జ్వరం వచ్చింది.
అనురాగిణి ఫ్యామిలికి కాల్ చేసి చెబితే అర్ధం చేసుకున్నారు.
ఆమె అంత్యక్రియలకి వెళ్ళింది. తండ్రి గిల గిల లాడిపోతున్న తండ్రిని చుస్తే ఎలా ఓదార్చాలో కూడా తెలియలేదు. తల్లి తండ్రుల ముందు పిల్లలు పోకూడదమ్మా, అంతకన్నా నరకం ఇంకోటి లేదు అని ఆయన బాధతో మెలికలు తిరుగుతుంటే ఏమి చేయలేని అసహాయ స్థితిలో అలా వుండిపోయింది కన్నీరు కారుస్తూ సంధ్య.
అన్న, వదిన వచ్చారు, తండ్రికి వారే ధైర్యం చెబ్తూ చూసుకుంటున్నారు.
అక్కడ వచ్చిన వాళ్ళని చూసి, ఆమెతో పెరిగిన ఫ్రెండ్స్, బంధువులని చూసిన తర్వాత వాళ్ళంతా ఎంత అదృష్టవంతులనిపించింది.
తన చిన్ననాటి విషయాలు, తను చేసిన అల్లరి పనులు, తను స్కూల్లో ఎలా వుండేది, తన వ్యక్తిత్వం ఎలా రూపు దిద్దుకుంది వాళ్ళందరికీ చూసే అవకాశం వచ్చింది, కానీ తనకి ఆ అవకాశం రాలేదు అని అనిపించింది.
కానీ తమ ఇద్దరి మధ్య పెనవేసుకున్న ఆ స్నేహ బంధం చాలా ప్రత్యేకమైంది అది ఎప్పటికీ మనసులో ఎప్పటికీ చెక్కు చెదరకుండా వుంటుంది.

రోజు తనతో మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది, కానీ ఒకోసారి వీణ మీటినట్టు పలికే ఆమె మాటని, ఒకోసారి ఏదైనటెస్ట్ కి వెళ్ళి వస్తే అక్కడ ఏదైనా జరిగితే ఎంతో ఆవేశంగా, మాట్లాడే ఆమె మాటలు మాత్రం ప్రతినిత్యం మిస్ అవుతున్నది సంధ్య.
ఫోన్ చేస్తే అనూ మెసేజ్ పెట్టిన వాయిస్ వుంటే అది రికార్డ్ చేసి వుంచుకుంది.
తననీ, అనురాగిణి అనే అతి విలువైన తన నేస్తాన్ని కలిపి తీసిన ఫోటోని ఎప్పుడు ఎదురుగా కనిపించేట్టుగా వుంచుకుంది.
తనున్నంత వరకు అనురాగిణి అనే ప్రాణ నేస్తం తనతో పాటు వుంటుంది అనుకుంది.
బయట చిన్న గార్డెన్ లో పూసిన పూలను చూస్తూ రాకింగ్ చేయిర్ లో కూర్చుని అనూకిష్టమయిన మ్యూజిక్ పెట్టుకుని వింటూ కూర్చుంది సంధ్య.

-కనకదుర్గ

(ఈ కథ నా ప్రియాతి ప్రియమైన స్నేహితురాలు అనురాగమయికి అంకితం ఇస్తున్నాను! తను ఈ లోకం వదిలి పెట్టి ఏడాది అయ్యింది కానీ నా హృదయంలో ఆమె, తన జ్ఞాపకాలు పదిలంగా వున్నాయి, వుంటాయి.)
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కథలు, , , , , Permalink

11 Responses to స్నేహ బంధం(కథ) -కనకదుర్గ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో