అమ్మా !నువ్వు అనుకున్నావు!
నేను రచయిత్రిని కావాలని
పేద ప్రజల ఆక్రందనలే
నా రచనా విషయాలుగా రాయాలని ,
నేను
వంటగత్తె నయ్యాను
రుచికరమైన వంటలతో
అందరినీ మెప్పించటానికి ఆరాటపడ్డాను!
నువ్వు అనుకున్నావు!నేను పంతులమ్మను కావాలని
అక్షర జ్ఞానంలేని ప్రజలకు ఆదర్శంగా చదువు చెప్పాలని
నేను పంతులమ్మనైతే అయ్యాను
కానీ ఆర్ధిక
లాభాపేక్షే ధ్యేయంగా విద్యాదానం సాగించాను!
నువ్వు అనుకున్నావు!నేను లాయర్ను కావాలని
న్యాయం,ధర్మం నా మార్గాలుగా ఉండాలని
నేను బిడ్డల తల్లి నయ్యాను
బిడ్డల పెంపకంలో
భర్త సేవల తో తరించి పోయాను !
నువ్వు అనుకున్నావు!స్త్రీ సమస్యల సాధనకై నేను
పోరాడాలని!
నేను మాతృమూర్తి నయ్యాను
భార్యగా
పిల్లలకు తల్లిగా, నా పరిధులను పరిమితం చేసుకున్నాను!
నువ్వు అనుకున్నావు!స్త్రీల అభివృద్దే నా లక్ష్యం కావాలని
నేను నా భర్త అభివృద్దే నా లక్ష్యం అనుకున్నాను
కనీస గుర్తింపైనా ఇవ్వకపోతాడాని ఎదురు చూసాను !
నువ్వు అనుకున్నావు!సమాజం కేంద్ర బిందువు కావాలని
సామాజిక స్థతులను నేను అధ్యయనం చెయ్యాలని
నాకు కుటుంబం
కేంద్ర బిందువయ్యింది
భర్త గుర్తించే భార్యగా ఉండాలని తపన పడ్డాను!
నువ్వు అనుకున్నావు! పోరాటం నా మార్గంగా ఉండాలని
ప్రజల హక్కుల కోసం పోరాడాలని,
నేను నా కుటుంబంలో
కనీస హక్కుల కోసం అనుక్షణం,అహర్నిశలు పోరాడాను!
అమ్మా ! ఇప్పుడు నువ్వు అనుకున్నవన్నింటినీ సాధించే క్రమంలో
నా జీవితాన్నే సవాలు చేస్తూ మున్ముందుకే వెళుతున్నాను !
– కవిని ఆలూరి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
6 Responses to నువ్వు అనుకున్నావు (కవిత ) – కవిని ఆలూరి