వివాహం-2 – కె. వరలక్ష్మి (ఆత్మ కథ )

కె.వరలక్ష్మి

కె.వరలక్ష్మి

మధ్యలో ఆడపెళ్లివారింటికి మగపెళ్లివారెళ్లినా,అబ్బాయి ఇంటికి ఆడపెళ్లివారెళ్లినా కులపెద్దల్ని తీసుకునే వెళ్లాలి. పెళ్లికి ముహూర్తం పెట్టిన వెంటనే కులపెద్దలకి చెప్పాలి. పెళ్లి వారం రోజులుందనగా ముందు పెద్దగొల్లతో మొదలుపెట్టి కులం వాళ్లందర్నీ పిలవాలి. పెళ్లికి ముందు ఒకసారి, వంటలు పూర్తయ్యాక ఇంకోసారి మొత్తం మూడూసార్లు పిలవాలి. ఏ ఒక్కసారి ఎవర్ని మరచిపోయినా కులం వాళ్లంతా కట్టుకట్టి భోజనాలకి, పెళ్లికి రావడం మానేస్తారు.

మొదట్నుంచీ మోహన్ కుటుంబం వాళ్లు అన్నిటికీ ఆనవాయితీ లేదని చెప్తుండడం వల్ల కుల పెద్దల ప్రమేయం పెద్దగాలేకుండా పోయింది. పెళ్లిపిలుపులకి రెండుసార్లు మా నాన్న వెళ్లి పిలిచి, మూడోసారి పెళ్లిసందట్లో వెళ్ళలేక ఎవర్నో పంపిస్తే వాళ్ళెవర్నో మరచిపోతే అందరూ కలిసి కట్టడి చేసి మసీదు వరకూ వచ్చి ఆగిపోయేరట. వాళ్ళు వెనక్కెళ్ళిపోతే వండిందంతా వొలకబోసుకోవాల్సిందే. విషయం తెలిసి మా నాన్న పరుగెత్తి వాళ్ళని కాళ్ళావేళ్ళా పడి బతిమిలాడి పిల్చుకొచ్చేరు. అప్పటివాళ్ళు పెళ్లికి పావలాలు, అర్థరూపాయిలు కూడా చదివించేవారు. రూపాయంటే గొప్పే.

కులం వాళ్ళతో ఈ పాట్లల్లో ఉండగా ఉదయం తొమ్మిదిగంటలవేళ మగపెళ్ళివాళ్ళొచ్చేరు. నన్ను రోజూలాగే ఉదయాన్నే పెళ్ళి కూతుర్ని చేసేసి మా పడకగదిలో బందీని చేసేశారు. బైటికి రావద్దని. మగపెళ్ళివాళ్ళు బస్సుదిగి దగ్గరే కాబట్టి మాపుంతవైపు వీధిలోకి నడుచుకుంటూ వచ్చేరట. మోహన్ తల్లిగారు, ఆవిడ నలుగురు చెల్లెళ్ళు, వాళ్ళా భర్తలు పిల్లలూ అంతే. అందులో కొందరు రాలేదట. మా అమ్మ వంటలదగ్గర ఏవో అందిస్తూ కబురు తెలిసి వీధిలోకి పెరుగెత్తి అలా రండి అలా రండి అని మా ఇంటి పక్కనుంచి విడిదిల్లు ఉన్న వీధివైపు చూపించిందట. మధ్యాహ్నం భోజనాల దగ్గర ఆవకాయ వడ్డిస్తున్న వాళ్ళని అంతంత వేసెయ్యకండి అందట. మధ్యాహ్నం వండిన బూర్లు పులిహారనే రాత్రికి కూడా వడ్డించారట. విడిది ఇంట్లో సబ్బులు, పౌడర్లు సరిపడా పెట్టలేదట. విడిదిల్లు గలావిడ సాయంకాలానికి వీళ్ళని బైటకి పంపించేసిందట. అప్పుడు వచ్చి మా చిన్నింట్లో ఉండవలసి వచ్చిందట. ఆ తర్వాత వాళ్ళింట్లో పెళ్ళిళ్ళు ఆ మాత్రం కూడా జరగకపోయినా క్రితం సంవత్సరం ఆవిడ పోయేవరకూ గుర్తొచ్చినప్పుడల్లా తల్చుకుని “మర్యాద తెలియని మనుషులు” అని కోపం తెచ్చుకునేవారు. తర్వాత కాలంలో మా అమ్మ పోయినా, నాన్న పోయినా ఆవిడ మాత్రం మరచిపోకుండా మా పిల్లల దగ్గర కూడా అంటుండేవారు మా అత్తగారు.

పెళ్ళినాడు సాయంకాలం ఆరుగంటలకి ప్రధానం జరగవలసి ఉంది. ఇప్పట్లగా అన్నన్ని రకాల స్వీట్లు ఇచ్చేపద్ధతి అప్పటికింకా రాలేదు. ఓ బెల్లం అచ్చు అరటి గెల, పసుపు, కుంకుమ పెళ్ళికూతురుకి చీర, జాకెట్టు తెచ్చేవారు. మంచి ముదురునీలం జానెడు వెడల్పు జరీఅంచు పట్టుచీర తెస్తారని మా అమ్మ ఊహించుకున్నట్టుంది. వాళ్ళేమో అతిలేతనీలం కాశ్మీరుసిల్కు (దాన్నిప్పుడు ప్యూర్ సిల్కు అంటున్నాం) మడత పైనంతా మాపు వచ్చేసిన చీర తెచ్చేరు. మోహన్ తల్లిగారు అప్పటికే క్రిస్టియానిటీ లోకి కన్వర్టు అయ్యారట. అందువల్ల బొట్టుపెట్టడం లాంటివన్నీ వాళ్ళ చెల్లెలు చేత చేయించారు. ఆవిడ చీర నా చేతిలో పెట్టగానే మా అమ్మ “ అయ్యో వదినగారూ! ముదురురంగు కొనవలసింది” అంది వియ్యపురాలితో. వెంటనే ఆవిడ “నోరు మూసుకో” అంది. ఆవిడ చెల్లెలి కూతురు మోహన్ వయసుదే. ఇంకా పెళ్ళికాలేదు. ఆ అమ్మాయి అందుకుని “నోరు ముయ్యకపోతే పళ్ళు రాలకొడతాం” అంది. అంతవరకూ తలవంచుకుని కూర్చున్న నేను ఆశ్చర్యపోయి తలెత్తేసరికి వాళ్లందరిమొహాలూ ధుమధుమలాడుతూ ఉన్నాయి. వీధిలోని పేరంటాళ్ళంతా విస్తుపోయి చూస్తున్నారు. మా అమ్మ దెబ్బతిన్న పక్షిలా ఏడ్చుకుంటూ పక్కగదిలోకి వెళ్ళిపోయింది. నేను బిత్తరపోయి ఏడుపు ఆపుకొంటూ ఉండగానే నా మెడలో గుప్పెడు పసుపులో ముంచిన దారపుపోగులు దండగా వేసి ఎవరో బంగారం పెట్టాలి అంటే పళ్ళురాలగొట్టే ఆవిడ వేలికి ఉన్న అరిగిపోయిన అణా ఎత్తు నీలపురాయి ఉంగరం తీసి నా వేలికి తొడిగి మూడోరోజు వాళ్ళింటీకి వెళ్ళగానే తీసేసుకున్నారు.

పెళ్ళికొడుక్కి విడిగా మా గేటుపక్కనే ఉన్న నా క్లాస్‍మేట్ గుల్లల సత్యనారాయణ వాళ్ళింట్లో ముందుగది విడిదిగా ఇచ్చేరు. అక్కడి నుంచి మోహన్ చిన్న చిన్న స్లిప్పులు రాసి మా లీల చేతో, జి.వి.బి చేతో పంపించడం,  ఆ స్లిప్పులు ప్రదానంలో మా అమ్మకు జరిగిన అవమానాన్ని నేను మరచి పోయేలా చేసాయి. మా పెళ్ళిళ్ళల్లో అగ్నిహోత్రం ఉండదు కాబట్టి ఆ రోజుల్లో పెళ్ళి జరిగే ప్రదేశంలో పెళ్ళరుగు వేసేవారు. రాత్రికి పెళ్ళనగా సాయంకాలం ఇటుకలు మెత్తనిమట్టిని ఉపయోగించి జానెడు ఎత్తు పెళ్ళరుగు నిర్మించి పేడతో అలికి ముగ్గులు వేసి ఉంచేవారు. ఆ అరుగు మీదే పెళ్ళి జరిగేది. మా మేనమామల భార్యలు చక్కని పెళ్ళరుగు వేసేరు. మంగళస్నానానికి తీసుకెళ్ళేముందు ఆ పెళ్లరుగు దగ్గర పీటలమీద కూర్చోబెట్టి మా ముందు రోట్లో పోసిన ధాన్యాన్ని పసుపు పూసి, పసుపు దారాల్తో పసుపు కొమ్ములు కట్టిన రోకళ్ళతో దంచుతూ కులపెద్దలు

“అల్లో నారాయణల్లో
అల్ల నేరేడు కింద సల్లని సలవా” అంటూ పాడుతూ మూడుసార్లు మాకిద్దరికీ కడుపులకి తాకించి ఆశీర్వదించేరు. తర్వాత మంగళ్ళు జరిపించే కాలిగోళ్ళ సంబరం ముగిసింది. అందరూ మా తలల చుట్టూ తిప్పి దిష్టి తీసిన చిలర డబ్బుల్ని మంగలి గిన్నెలో వేసేరు. స్నానం కోసం కూర్చోబెట్టిన చోట పక్కనుంచి మురిక్కాలవ ప్రవహిస్తోంది. దాన్లోంచి నల్లని బురద తీసి మోహన్ నా చెంపలకి పూసేడు . ఇదేం మోటు సరసం అని చికాకన్పించింది కాని తలపైకి ఎత్తకూడదు కాబట్టి అలాగే ఉండిపోయాను.
అప్పటికి సప్లై కంపెనీలు షామియానాలు లాంటివి లేవు. పచ్చని పందిట్లో పెళ్ళి జరగడమే. మా వెంకన్న పంతులుగారొచ్చి నా చేత విఘ్నేశ్వర పూజ గౌరీపూజ చేయించి శాస్త్రోక్తంగా వివాహం జరిపించడానికి ఉపక్రమించారు. పెళ్ళి అరుగుకి నాలుగువైపులా నాటిన పచ్చని అరటి చెట్ల చుట్టూ ఏడుసార్లు దారాన్ని చుట్టి ఏడడుగులూ నడిపించాలని చూస్తే నా వెనక అరివేణి లోంచి వసంతపు ముంతను పట్టుకుని మా పిన్ని సిద్ధంగా ఉంది కాని పెళ్ళి కొడుకు తరపు వాళ్ళెవరూ (పిల్లలు తప్ప) పందిట్లో లేరు. మగపెళ్ళి వారు మధుపర్కాలు తేలేదని అంతకుముందే తెలిసి మా నాన్న గారు పరుగులు పెట్టీ కొట్టు తెరిపించి తెచ్చేరట. చివరికి పెళ్ళికొడుకు తరపున మా పెద్దత్తమ్మ నడిచింది. కాళ్ళు కడిగి కన్యాదానం చేసిన తల్లిదండ్రులకి ఇవ్వాల్సిన బట్టలు కూడా వాళ్ళు ఇవ్వలేదు. ఇక హైస్కూల్లో చదువుతున్న పిల్లలు (మోహన్ పెద్దపిన్ని కొడుకులు ) పంతులు గారి పిలకకి దారం కట్టి లాగడం, వాకిట్లోని మట్టిని ఆయన నెత్తిన చల్లడం చిన్న రాళ్ళని గురి చూసి ఆయన మీదకి విసరడం లాంటి అల్లరి చాలా చేశారు. మా నాన్న చేతులు జోడించి వేడుకోవడం వలన ఆయన చాలా సహనంతో పెళ్ళి జరిపించారు. బాసికాలు, కంకణాలు, సూత్రధారణ, తలంబ్రాలు, ఉంగరాలు దేవించడం, అరుంధతీ నక్షత్రదర్శనం అన్నీ ముగిసేసరికి తూర్పు తెల్లబడింది. మా ఊళ్ళో అప్పటికి ఫోటోస్టూడియో లేదు. మగపెళ్లివాళ్ళు కెమేరా గాని, ఫోటోగ్రాఫర్ని గాని తేలేదు. దాంతో మా పెళ్ళిఫోటోలు లేవు.
వాళ్ళ పెద్దలకి పాదనమస్కారాలు చేయించడానికి విడిదింట్లోకి తీసుకొచ్చారు. ఇద్దరం వంగి మా అత్తగారు కనకమ్మగార్కి నమస్కరించబోగా ఆవిడ మోహన్ చెంప చెళ్ళుమనిపించారు. జుట్టూపట్టుకుని వంచి దబదబా బాదడం మొదలుపెట్టారు. ముందురోజంతా పెళ్ళిముందు ఏం తినకూడదని కేవలం పాలుతాగి ఉండడం వలన నాకు కళ్ళూ తిరిగిపోయాయి. భయంతో ఏడుపొచ్చేసింది. కొంగు ముడి విప్పుకొని మా ఇంట్లోకి పారిపోవాలన్పించింది. మా వాళ్ళెవరో నా భుజం చుట్టూ చెయ్యివేసి ఊరడిస్తూ నేను పడిపోకుండా కాపాడేరు.

పూర్తిగా తెల్లవారేసరికి వాళ్ళ పనిమనిషి రామయ్యమ్మని మాత్రం వదిలేసి మగపెళ్ళివాళ్ళంతా వెళ్ళిపోయారు. కొంగుముళ్ళు విప్పగానే మా ఇంట్లోకి వెళ్ళిపోయి బట్టల గుట్టలమీద పడి నిద్రపోయాను. పదకొండుగంటలవేళ ఎవరో లేపితే మెలకువ వచ్చింది. అప్పటికే చిన్నింట్లో మోహన్ చుట్టూ నా స్నేహితులూ మా చెల్లెళ్ళు తమ్ముళ్ళు చుట్టాల పిల్లలు చేరి ఉన్నారు. స్నానం చేసి వచ్చి నేను కూడా వాళ్ళతో చేరిపోయాను. రోజంతా అందరం రకరకాల పాటలు పాడుకున్నాం. మోహన్ నేను మూగమనసులు సినిమా పాటలు పాడేం.

మోహన్ తల్లిగారి కోపానికి కారణం తర్వాతెప్పుడో తెలిసింది. పెళ్ళికిముందు సాయంకాలం మళ్ళీ కట్నాల ప్రసక్తి వచ్చిందట. పెళ్ళికి ముందు మా నాన్న నాలుగు కాసుల బంగారం కొని పెళ్ళి కొడుక్కి చుట్టు ఉంగరం నాకొక రాళ్ళనెక్లెస్ ఒక అందె ఉంగరం చేయించారు. నా చెవులకి అరకాసు రింగులు ముందే ఉన్నాయి. అప్పటికి కాసు (8గ్రా) యాభై రూపాయలు ఉందట. బట్టలకే అయిదువందలు తీసుకున్నారు. మా అమ్మాయి బట్టలకి ఇవ్వాల్సిన వెయ్యి ఇవ్వలేదు. మధుపర్కాలు వగైరా ఖర్చులన్నీ మా చేతే పెట్టించారు. కాబట్టి అన్నీ కలిపి వెయ్యినూటపదహార్లు కట్నంగా భావించుకోండి అన్నారట మా నాన్న. దాంతో ఆవిడకి బాగా కోపం వచ్చేసిందట. పెళ్ళివదిలేసి రమ్మంటే వినే కొడూకు కాదాయె. ఏతల్లికైనా అది నిస్సహాయస్థితే కదా! పోనీ ముందు అనుకున్నట్టు పదికాసుల బంగారం కోడలికి పెట్టేసి కట్నం అడుగుదామంటే ఆవిడ దగ్గర పది కాసులు కాదు కదా చిన్నమెత్తు బంగారం కూడా లేదు. అలా మొత్తానికి వాళ్ళు పెడతామన్న బంగారం పెట్టకుండా వీళ్ళు రాస్తామన్న భూమి రాయకుండా పెళ్ళి జరిగిపోయింది. మోహన్ కి తెలుసేమో కాని నాకైతే బంగారం ధరకాని, భూమిరేటుకాని ఆర్థికపరమైన విషయాలేవీ తెలీవు అప్పటికి. కేవలం పుస్తకాలు, చదువు ,మంచితనం మూర్తీభవించిన మనుషులు నిండిన ఊహాప్రపంచం నాది .

– కె. వరలక్ష్మి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ఆత్మ కథలు, నా జీవన యానంలో...Permalink

One Response to వివాహం-2 – కె. వరలక్ష్మి (ఆత్మ కథ )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో