జోగిని (ధారావాహిక ) – శాంతి ప్రబోధ

 

                                         సూరీడు సరికొత్త రంగుల కాన్వాసుతో పడమట దిక్కుకు వెళ్ళిపోతూ…

shaanthi prabodha

మరుసటి రోజు కోసం సమాయత్తమౌతూ……
సౌందర్యాన్ని ఆస్వాదించగలిగే దృష్టి, కుతూహలం ఉండాలే కానీ మనకి కొత్త ప్రపంచం ప్రతి రోజూ కన్పిస్తుంది. ప్రకృతి ఆవిష్కరించే కొత్త దనాన్ని అందుకోవాలనీ, ఆస్వాదించాలనీ, అందులోని ఆహ్లాదాన్ని అనుభవించాలనీ మన మనసు తహతహలాడుతుంది” భావోద్వేగాలను కలబోసుకుంటూ ముందుకు కదలుతూన్న వారి నడక మోకాళ్ళ పర్వతం నుండి నెమ్మదించింది.

అయినా 8 గంటల కల్లా కొండమీదకి చేరారు. సుప్రభాత సమయంలో బయలుదేరడం వల్లనేమో అలసటే అన్పించలేదు.
టికెట్‌ తీసుకుని స్పెషల్‌ క్యూ ద్వారా త్వరగా దర్శనం చేసుకుందామని అంది వలసమ్మ.
వద్దు అలా వెళ్తే అసలు సరదానే ఉండదు. సర్వ దర్శనం చేసుకుందాం అన్నారు కవిత, సరస్వతి.
దర్శనం చేసుకోవడం కన్నా కొండమీద ప్రకృతిని ఆస్వాదించాలనుకుంది విద్య ఆ మాటే మిగతా వాళ్ళతో చెప్పింది.
”ఇంత దూరం వచ్చి దర్శనం చేసుకోకుండానా…! రష్‌ ఎక్కువ లేదు కదా… గంటలోనే దర్శనం అవుతుందిలే పద… ఆ తర్వాత నీవు ఎక్కడికంటే అక్కడికి తిరుగుదాం” అంది కవిత.
సరేనంటే సరే అనుకున్నారు.

సర్వదర్శనం క్యూలో నిల్చున్నారు. వీళ్ళున్న క్యూ కాంప్లెక్స్‌లో వాళ్ళని వదులుతున్నారు దర్శనానికి. తమ ముందు ఉన్న వారిని వెనక్కి నెడ్తూ వీళ్ళు ముందుకు వెళ్ళడం భలే సరదాగా అన్పించింది వాళ్ళకి. వెనక బడిన వాళ్ళు గొణుక్కుంటున్నా పట్టించుకోలేదు. ఒకావిడ ”మౌసిమా ఓ మౌసిమా” అంటూ మరాఠీలో అంటే వీళ్ళకేం అర్థం కాలేదు. ఆవిడను చూసి కామెంటు చేసి నవ్వుకుంటూ ముందుకు నడిచారు. అలా ప్రధాన ద్వారం దగ్గరికి చేరారు. చాలా త్వరగా.
అదే విధంగా ముందుకు వెళ్ళబోతున్న వీళ్ళని దాటి ముందుకు వెళ్ళారు ముగ్గురు యువకులు.
వీళ్ళకి ఒళ్ళు మండిపోయింది.

వాళ్ళను దాటుకుంటూ ముందుకు వెళ్ళబోతూ వాళ్ళ మొహంలోకి చూసింది విద్య. అందులో ఒకతన్ని ఎక్కడో చూసిన జ్ఞాపకం… ఎక్కడ..? ఓహ్‌ా…! ఆ చిన్ని కళ్ళను మిల మిల మెరిపిస్తూ చిరునవ్వుతో పలకరింపుగా, రైల్లో ప్రొఫెసర్‌ గారితో చూసిన యువకుడు. అవును అతనే. అతనితో మరో ఇద్దరు. ఇక ముందుకు కదలలేకపోయింది. ఇందాకటిలాగ. తెలియని ప్రదేశంలో ఎంతైనా అల్లరి చేస్తూ, తమనెవరూ గమనించడం లేదనే ధీమాతో ఉండి ఏ మాత్రం తెల్సిన వాళ్ళు కన్పించినా ముడుచుకు పోతారెందుకో…? విద్యకి, ఆ అనుభవం తనకే రావడంతో తనూ అందుకు భిన్నంగా ఏ మాత్రం ప్రవర్తించలేకపోయింది.

దైవ సన్నిధిలోకి వచ్చాక అల్లరి చేయొద్దు. బుద్ధిగా ఉందామని మిత్రులతో నెమ్మదిగా చెప్పి దర్శనం చేసుకుని బయట పడింది విద్య.
”నేచురల్‌ ఆర్చ్‌ చూసొద్దామా…?” తన కోరికను వెల్లడించింది కవిత.
”ఓ.. తప్పకుండా… నేను అసలు చూడనే లేదు” చెప్పింది వలసమ్మ. గుడికి పడమటి వైపు ఉన్న రోడ్డులో కదిలారు.
”తిరుపతి కొండల ఎత్తు ఎంత ఉంటుండవచ్చు!” నడుస్తూనే ప్రశ్నించింది వలసమ్మ విద్యకేసి చూస్తూ.
” దాదాపు 2500 అడుగులు” విద్య. తమ వెనకే వస్తున్న ఆ ముగ్గురినీ గమనించింది. వాళ్ళలోంచి ఒకరు ” ప్రపంచంలోని అత్యంత పురాతన పర్వతశ్రేణుల్లో ఒకటైన తూర్పు కనుమల లోగిళ్ళు అటు ఆధ్యాత్మిక పరంగానూ, శాస్త్రపరంగానూ విశేష ఔన్నత్య స్థలాలు. వేంకటాచలం చుట్టు పక్కల 112 తీర్థాలున్నాయని చెప్పుకుంటారు. ఈ తీర్థాలలో ” యుద్ధగళ” చాలా ప్రాశస్త్యం గలది అంటారు. దాన్ని దర్శిస్తే భక్తి, రక్తి, ముక్తి సిద్ధిస్తాయని నమ్ముతారు. 15 వేల సంవత్సరాల నాటి శిలాయుగం చిత్రాలు అక్కడ చూడొచ్చునట అన్నాడు అతను.

ఆ విశేషాలు చెబుతున్నదెవరా అని ఓరగా చూసింది విద్య. అతనే ఆ ట్రైన్‌ కుర్రాడు. వీళ్ళేంటి తమ వెంట పడుతున్నారా? లేక వాళ్ళూ చూడ్డానికేనా? విద్య మనసులో సందేహం. అతను చెప్పేది విద్య బృందం కూడా శ్రద్ధగా వింది.
”అదే ఇలాంటి ప్రదేశం వేరే దేశంలో ఉంటే ఎంత అభివృద్ధి చేసేవారో కదా…?ి ఇక్కడ ఉన్న మనకే వాటి గురించి తెలీదు” కవిత
”నిజమే మన వాళ్ళు ఇప్పుడిప్పుడే పర్యాటక రంగం వైపు దృష్టి సారిస్తున్నారు. తిరుపతి కేంద్రంగా గల అడ్వంచర్‌ క్లబ్‌ ఉత్సాహం ఉన్న వారితో ట్రెక్కింగ్‌ నిర్వహించింది.
ప్రపంచ వ్యాప్తంగా 60కి పైగా దేశాల్లో బ్రాంచీలు ఉన్న యూత్‌ హాస్టల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా వారి భవనం తిరుపతిలో ఉంది.

అక్కడ సభ్యులకు, పర్వతారోహకులకు అతి తక్కువ ఖర్చుతో లాడ్జింగ్‌, బోర్డింగ్‌ సౌకర్యం లభిస్తుంది” వీళ్ళతో పాటే నడుస్తూ చెప్పాడతను కవితకు జవాబుగా అన్నట్లుగా..
అతను చెప్పేది ఆసక్తిగా వింటున్న ఆ అమ్మాయిలు నలుగుర్లో విద్య తప్ప మిగతా వాళ్ళంతా అతను తమ జట్టులో వాడు కాదనీ, అపరిచితుడనీ అనే విషయమే మర్చిపోయారు.
” ఏయ్‌ మిష్టర్‌… ఏమిటి సంగతి? ఇందాకట్నించి చూస్తున్నా… మా వెనకే మీరు?” కోపంగా విద్య.
” ఏంటండీ… మా దారి కడ్డు తగుల్తూ” ఆ ట్రైన్‌ కుర్రాడు.

” ఇన్ని విషయాలు చెప్తున్నారు మీరు ఏం చేస్తుంటారు” వారి సంభాషణని పట్టించుకోకుండా ప్రశ్నించింది వలసమ్మ.
అతను నవ్వి సమాధానం చెప్పకుండా ” మొన్న ట్రైన్‌లో మీరే కదూ…” ఆర్థోక్తిలో ఆగాడు విద్యకేసి చూస్తూ..
” ఎస్‌, నేనే, నా పేరు విద్య. పద్మావతీ యూనివర్శిటీలో ఎం.ఎ ఉమెన్‌ డెవలప్‌మెంట్‌ స్టడీస్‌ అయిపోయింది. వీళ్ళు నా ఫ్రెండ్‌ కవిత, ఆమె ఫ్రెండ్‌ సరస్వతి ఇద్దరు ఎమ్‌సిఎ ఫైనల్‌కి వచ్చారు. ఈవిడ వలసమ్మ. ఉమెన్‌ డెవలప్‌మెంట్‌ స్టడీస్‌లో పి.హెచ్‌.డి చేస్తున్నారు అంటూ అందర్నీ పరిచయం చేసింది నడుస్తూనే. ఇంకా ఏమన్నా డీటెయిల్స్‌ కావాలా…?” సూటిగా చూస్తూ అడిగింది మళ్ళీ తానే.

” నాపేరు నవీన్‌. ఎం.టెక్‌ పూర్తయింది. ఇక్కడే… ఎస్వీ ఇంజనీరింగ్‌ కాలేజీలోనే. వీళ్ళిద్దరూ నాఫ్రెండ్స్‌ ప్రతాప్‌రెడ్డి, చెంగల్రాయుడు” పరిచయం చేశాడు అతను.
విద్య మిత్ర బృందం చాలా ఆశ్చర్యపోయింది.

” ఏమిటీ మీరు చదివింది ఎం.టెక్‌ అయితే ఈ విశేషాలన్నీ ఇంతగా ఎలా చెప్పగలుగుతున్నారు?” ఆశ్చర్యంగా అడిగింది విద్య.
ట్రైన్‌లో ప్రొఫెసర్‌ గారితో విద్య డిస్కషన్‌ గుర్తొచ్చిన అతను ” ఉమెన్స్‌ డెవలప్‌మెంట్‌ స్టడీస్‌’లో ఉన్న మీరు మతాలు, మత విశ్వాసాలు గురించి ఎలా మాట్లాడగలుగుతున్నారు? ఎదురు ప్రశ్నించాడు.
వీళ్ళిద్దరి మాటలు కవితకి ఏం అర్థం కాక విద్య భుజం గిల్లింది. ఏమిటి అన్నట్లుగా. అదే పరిస్థితిలో నవీన్‌ ఫ్రెండ్రూ….
”అవుటాఫ్‌ ఇంట్రెస్ట్‌” అంది విద్య
నవ్వుతూ ”నాకూ అంతే” నవీన్‌
అంతలో… ”ప్రధాన ఆలయానికి ఉత్తర దిశలోని పుష్కరిణి ఆవరణలో ఉన్న ఓ చిన్న ఆలయాన్ని చూపించి ఇది ఏ దేవునిది” అడిగింది వలసమ్మ అతన్ని.

”వరహాలస్వామి ఆలయం. నిజానికి తిరుమలేశుని దర్శించే ముందుగా వరహాల స్వామిని దర్శించాలట. తమ తిరుమల యాత్ర సంపూర్ణం కావాలన్నా, మోక్షం సిద్ధించాలన్నా ప్రతి భక్తుడు మొదట వరహాలస్వామి వారి ఆశీస్సు తీసుకున్న తర్వాతే శ్రీవారి దర్శనం చేయాలట. అందుకేనేమో, పుణ్య ప్రాప్తి కోసమేనేమో దేవస్థానం వారు ముందుగా నైవేద్యం వరహాల స్వామి వారికి నివేదించిన తర్వాతే శ్రీనివాసునికి నైవేద్యం పెట్టడం ఆనవాయితీగా వస్తోందట” అంటూ వివరించాడు నవీన్‌.
” తిరుపతి కొండలు చాలా ప్రశస్తమైనవని విన్నాను. మీరు ఈ కొండల్లో ఏమైనా చూశారా? చూస్తే వాటి గురించి చెప్పండి” ఉత్సాహంగా అడిగింది సరస్వతి.

సరస్వతి ఉత్సాహం గమనించిన నవీన్‌ మరింత ఉత్సాహంతో తాను చూసిన ‘ సున్నపురాతి కోన’ గురించి అద్భుతంగా వర్ణించి చెప్పడం ఆరంభించాడు.

%

ధారావాహికలు, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , Permalink

Comments are closed.