గోసంగుల వివాహ విధానం ` పరిచయం : భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించాక భారతదేశంలో దళితులను ఎస్.సి, ఎస్.టి లుగా గుర్తించి, వారికి రాజ్యాంగంలో ప్రత్యేక మినహాయింపులు, ప్రోత్సాహకాలు యివ్వడం జరిగింది. గోసంగి కులాన్ని షెడ్యూలు కులంలో ఉపకులంగా ఇరవైఐదు సంఖ్యగా చేర్చినారు. వీరు దక్షిణ భారతదేశమంతా వ్యాపించి ఉన్నారు. గోసంగి కులంవారి పెళ్ళిళ్ళు చాలా విచిత్రంగా జరుగుతాయి. వీరు ఇటు ఆర్య సంప్రదాయం పాటింపక, అటు ద్రవిడ సంప్రదాయాన్ని గ్రహింపక ఒక విచిత్రమైన, విభిన్నమైన వివాహ వ్యవస్థను కలిగి ఉన్నారు.
బాల్య వివాహాలు : చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేస్తారు. కులంవారితోనే వివాహం చేయడానికి మక్కువ చూపుతారు. వేరే కులానికి చెందిన వారిని పెళ్ళి చేసుకున్న వారిని కులం నుంచి వెలివేస్తారు. ప్రస్తుత కాలంలో ఒకటి రెండు చోట్ల కులాంతర వివాహాలు జరిగినా కూడా అందరు కుల అంతర్వివాహానికి ప్రాముఖ్యతనిస్తారు.
జీవిత భాగస్వామి ఎంపిక : తల్లిదండ్రులు ముందుగా వెళ్లి అమ్మాయి తల్లిదండ్రుల ఇంటిముందు ఈత చాపను వేసివస్తారు. అమ్మాయి తల్లిదండ్రులకు ఆ సంబంధం నచ్చినట్లయితే దానిని అలాగే ఉంచుతారు. కొద్ది సేపటికి అబ్బాయి తల్లిదండ్రులు, కుల పెద్దలు వచ్చి మాట్లాడుతారు. అబ్బాయి గుణగణాలు వివరిస్తారు. అమ్మాయి తల్లిదండ్రులకు ఇష్టం లేనట్లయితే ఆ ఈత చాపను వారి ఇంటిముందు నుండి తీసివేస్తారు. ఈవిధంగా తల్లిదండ్రుల ఇష్ట పూర్వకంగానే జీవిత భాగస్వామి ఎంపిక జరుగుతుంది.
నాడు అమ్మాయి ఇష్టానికి ప్రాముఖ్యత ఇచ్చేవారు కారు. నేడు కూడా కొన్ని చోట్ల తల్లిదండ్రులు ఇష్టపూర్వకంగానే వివాహాలు జరిగినా, కొన్ని చోట్ల అమ్మాయి ఇష్టానికి ప్రాధాన్యత యివ్వడం జరుగుతుంది. వివాహంలో ఆర్థిక వ్యవహారాలు : ఈకులంలో వారికి వరకట్నం నిషేదం ఉంటుంది మరియు కన్యాశుల్క విధానం కూడా ఉండదు. వీరిలో అబ్బాయికి మూడొంతులు అనగా డెబ్బైఐదు శాతం ఖర్చు, అమ్మాయికి ఒకవంతు ఇరవైఐదు శాతం ఖర్చు ఉంటుంది. పెళ్ళి తంతు పూర్తి అయ్యేంతవరకు ఆర్థిక విధాన వ్యవహారాలు విషయం ఇలాగే ఉంటుంది.
వివాహంలో పాటించే ఆచారాలు : అబ్బాయిని విడిది ఇంటినుంచి ఆంజనేయస్వామి గుడిదగ్గరకు తీసుకువెళ్తారు. అక్కడ వధూవరులను కూర్చొబెట్టి ఇరువైపులా పెద్దలు పూజ చేయించి వారిపై దీవెనగా అక్షింతలు చల్లి అక్కడినుండి వరుడిని విడిది ఇంటికి తీసుకువెళ్తారు. వధువును ఆమె తల్లిదండ్రులు తమ ఇంటికి తీసుకువెళ్తారు. వివాహానికి కొద్దిసమయం ముందు మంగళహారతులతో వరుణ్ణి తీసుకుని వస్తుంటారు. వరుడుని మధ్యలో ఉంచి ముందు ఇద్దరు మగవాళ్ళు వెనక ఇద్దరు మగవాళ్ళు ఉంటారు. వీరు వరుడికి శాలువాను పైనుండి పట్టుకుంటారు. వరుడు తన తలకు తగలకుండా దానిని మధ్యలో నుంచి తళ్వారుతో ఎత్తుకుంటారు.
ఏ కుల వ్యవస్థలో లేని పద్ధతులు వీరిలో ఉన్నాయి. ఆంజనేయస్వామి గుడిలో అక్షింతలు వెయ్యడం అంటే పెండ్లి కుమారుడికి, పెండ్లి కూతురికి వీరిద్దరికి ధైర్య సాహసాలు యివ్వమని దైవప్రార్థన చేయడం. వరుడు తళ్వారు పట్టుకోవడం అనే ఆనవాయితీ చూస్తుంటే వీరు పూర్వకాలంలో క్షాత్ర ధర్మాన్ని పాటించినట్లు తెలుస్తుంది. వండె బియ్యానికి సుంకించే పద్ధతి : పందిట్లో ఈత చాప వేసి వరుడి తరఫున మూడువంతుల బియ్యం అమ్మాయి తరఫున ఒకవంతు బియ్యం పోసి ఐదు కట్టెలను తీసుకుని వాటికి కంకణాలు కట్టి ఐదుగురు ముత్తైదువులు బియ్యం చుట్టూ తిరుగుతూ సుంకిస్తూ పాటలు పాడుతారు. వంట చెయ్యక ముందు ఆ బియ్యానికి పూజచేసే సంప్రదాయం వీరిలో ఉంది. బియ్యానికి పూజ చేయడం వలన ‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’ అన్న దృష్టితో పూజలు చేస్తారు. పందిట్లో పూజ చేయడం వల్ల వివాహం చేసుకునే వధూవరులకు జీవితాంతం అన్న పానీయాలకు ఎటువంటి లోటు ఉండవద్దని పూజలు చేయడం.
సుంకించు ` అనే పదం ` సుఖ`ఇంచు అనే పదాల కలయిక. అంటే సుఖ, సంతోషాలు కలగాలని దీని అర్థం. ఇదే క్రమంలో వాడుకగా ‘సుంకించు’ గా మారింది. సు`మంచి, ఇంచు`ఇవ్వడం. మంచి ఇవ్వటం అనే అర్థంలో కూడా వాడుతారు.
(బియ్యంలో సుంకించె సమయంలో ఈ క్రింది పాటపాడుతారు)
॥ పాట ॥
సువ్వి సువ్వెన్నాలలో సువ్వెన్నాలలో
సువ్వి అని పాడెరో శ్రీరామనెల్లో రగురామనెల్లో
నెల్లుకూర బొద్దికూర మెమండినాము సువ్వెన్నాలలో
నెల్లూరి యాదవలంత వచ్చెమాజాడో, పోయ్యేమాజాడో
సువ్వెన్నాలలో సువ్వెన్నాలలో
కాకరి చెట్టుకు కాయలందమా తీగెలందమా
చిన్నయ్య కాటమరాజుకు పోగులందమా, తీగెలందమా
సువ్వెన్నాలలో సువ్వెన్నాలలో
చిక్కుడు చెట్టుకు పువ్వులందమా కాయలందమా
సువ్వెన్నాలలో సువ్వెన్నాలలో
పోలమరాజుకు పోగులందమా తీగెలందమా
సువ్వి సువ్వెన్నాలలో సువ్వెన్నాలలో సువ్వెన్నాలలో
సువ్వి అనే పదంలో ‘శుభము’ అనే అర్థం గోచరిస్తుంది.
శివ అనే అర్థాన్ని కూడా తీసుకోవచ్చు. వీరిలో శివభక్తులు, రామభక్తులున్నారు. (ఉదా : శ్రీరామనెల్లో రగురామనెల్లో) వీరికి శివ కేశవ భేదం లేదు. శివమతానికి, వైష్ణవమతానికి సంబంధించిన వివరాలు ఈ పాటలో కనిపిస్తున్నాయి.
నెల్లుకూర, బొద్దికూర, ఆకుకూరలను, కూరగాయలను పేర్కొనడం జరుగుతుంది. అలాగే వివాహ సమయంలో పదహారు రోజులవరకు శాఖాహారము మాత్రమే వాడతారు. నెల్లూరి యాదవులను మరియు కాటమరాజు, పోలమరాజు వీరు వేసుకునే నగలను చెట్లపువ్వుల, కాయలతో, తీగెలతో పోల్చడం జరిగింది. నెల్లూరి యాదవులంతా వీరి దగ్గరకు రావడం వివాహ విందు భోజన పంక్తి గావించి వెళ్ళడం. కాటమరాజును, పోలమరాజును కీర్తించడం. కాటమరాజు కాలంలో గోసంగుల సామంతరాజులుగా, యుద్ధవీరులుగా కొనసాగారని కాటమరాజు కథలో తంగిరాల సుబ్బారావు పేర్కొనడం జరిగింది. అందుకే శతాబ్దాల నుండి ఇప్పటివరకు వివాహ సమయంలో ఈ పాటలను పాడుతారు. కాటమరాజును స్మరించుకుంటారు. ఈవిధంగా పాటపాడుతూ సుంకించిన బియ్యంలోంచి ఐదుకిలోల బియ్యం తీసి వధువు కొంగులో కడతారు. వీటినే ఒడిబియ్యం అంటారు. ఈ బియ్యాన్ని వధువు వివాహం అయి అత్తవారింటికి వెళ్ళేవరకు మోస్తుంది. అత్తవారింటికి వెళ్ళిన తర్వాత తీస్తారు. బియ్యం వధువు కొంగులో కట్టడం వెనక ఆమె ఆ బియ్యాన్ని సహనంతో ఓపికగా మోసే బాధ్యతను నేర్పడం, వధువు మున్ముందు ఇంటిల్లిపాదికి వంటిపెట్టడంలో ఆమె తన నేర్పరితనానికి నిదర్శనం.
ఈ బియ్యం కట్టిన తర్వాత వివాహతంతు ప్రారంభమవుతుంది. కులపెద్దలిద్దరు పెళ్ళి కార్యక్రమాలు పూర్తిచేస్తారు. వరుడు తాళి కట్టేముందు అత్తమామలతో చెప్పడం. మామ శనార్తి పుస్తె కడుతున్న, కులం పెద్దలకు శనార్తి అని చెప్పి పుస్తె (తాళి) కడతాడు. వారందరి దగ్గరనుండి అనుమతి తీసుకోవడం శనార్తి`శరణGఆర్తిR శరణార్తి` రాను రాను శనార్తిగా మారింది. శరన్ అనే పదానికి అర్థం దండాలు, అర్తి అనే పదానికి అర్థం అడగడం. మీ అందరికి దండాలు పెట్టి అడుగుతున్నాను. ఈ వధువు మెడలో తాళి కట్టడానికి అనుమతి ఇవ్వమని అర్థం. వరుడు తాళి కట్టేముందు అత్తమామలకు చెప్పడం వలన మీ అమ్మాయి బాధ్యత ఇకనుంచి నాది, నా భార్య అని ఇకనుంచి ఈమె బరువు, బాధ్యతలు అన్ని నావే అని చెప్పడం దీని ఆంతర్యం. పెళ్ళిలో వేదమంత్రాలుండవు. బ్రాహ్మణులు పెండ్లి చేయడం ఉండదు. కులపెద్దలే వివాహ కార్యక్రమాన్ని జరిపిస్తారు.
భోజనాల ఏర్పాట్లు : భోజనాలు వండేముందు నేల పొయ్యిలను ఏర్పాటుచేస్తారు. మట్టితో గణపతిని చేస్తారు. గణపతికి పూజ చేసిన తర్వాత వండడం మొదలు పెడతారు. ఈవిధంగా ఐదురోజుల వరకు పొయ్యికి గణపతికి పూజలు చేస్తుంటారు. మిగతా కులాలవారి వివాహాలు చూసినట్లయితే బ్రాహ్మణుడు పెళ్ళి సమయంలో మాత్రమే విఘ్నేశ్వరున్ని పూజించే ఆచారం వుంది. కానీ గోసంగి వారిలో పెండ్లిలో చేసే వంట దగ్గరనుంచే గణపతిని పూజించడం. ఈ ఆచారం వీరిలోనే కనిపిస్తుంది. గణపతిని పూజించడంలో నిగూఢార్థం. పెండ్లి భోజనాలలో ఎటువంటి విపత్తు రాకుండా కాపాడమనే భావన. వివాహ శుభకార్యం దగ్గరనుండి పదహారు రోజులవరకు మాంసాహారాన్ని భుజింకుండా నియమాన్ని పాటిస్తారు. వీరు మాంసాహార ప్రియులైనా వివాహ సమయంలో ఈ పద్ధతిని ఖచ్చితంగా పాటిస్తారు. పప్పు, కూరగాయల భోజనానికే ప్రాధాన్యత ఇస్తారు. కన్యాదాన కార్యక్రమం : వివాహంలో కాళ్ళు కడగడం అనే సంప్రదాయం ఉండదు. వివాహం అయిన తర్వాత అప్పగింతల సమయంలో వధూవరులను పెండ్లి పందిరి నుంచి కొద్ది దూరంలో నిల్చోబెట్టి ఒక వెడల్పాటి ఇత్తడి పళ్ళెంలో కాళ్ళు కడుగుతారు. తల్లిదండ్రులు, అన్నదమ్ములు, బంధువులందరు కడిగిన తర్వాత వారి ముందు అడ్డంగా నీటిధారను పోస్తారు. వధూవరులను నీటి దారను దాటించిన తర్వాత వధువుని ఎత్తుకుని వరుడు ఆంజనేయస్వామి గుడి వరకు లేదా ఐదు అడుగులు నడుస్తాడు. మిగతా కులాల్లో పెండ్లి సమయంలో మేనమామ కాళ్ళు కడుగుతారు. గోసంగులలో వివాహం అయిన తర్వాత అప్పగింతల సమయంలో తల్లిదండ్రులు, బంధువులు, అన్నదమ్ములు అందరు కడుగుతారు. నీటిధారను పోయడంలో అర్థమేమంటే ఇకనుంచి వధువు యోగక్షేమాలన్ని కూడా నీ ఆధీనంలోకి వస్తున్నాయి అని.
వరుడు వధువును ఎత్తుకుని ఆంజనేయుని గుడివరకు లేదా ఐదు అడుగులు నడవడంలో అర్థమేంటంటే ఇకనుంచి అమ్మాయి బరువు, బాధ్యతలు మోయాలని అర్థం వచ్చే విధానంలో వీరు ఒక మాట అంటారు. ఆ సమయంలో ‘చేసుకున్నవాడే మోసుకోవాలని’ భార్య బాధ్యతలను శిరసావహించడం. (ఈ సందర్భంలో ఒక పాట పాడుతారు.)
॥ పెండ్లి పాట ॥
పల్లవి : కాకి తిన్న పండు కల్లెంలవెట్టి తుమ్మెదాలో
శ్రీరామ రగురామ తుమ్మెదాలో ॥ శ్రీరామ ॥
చ.1. చిలుక తిన్న పండు సిక్కెముల వెట్టి తుమ్మెదాలో
శ్రీరామ రగురామ తుమ్మెదాలో ॥ శ్రీరామ ॥
చ.2. వడవిలో రామన్న వారధి కట్టె తుమ్మెదాలో
శ్రీరామ రగురామ తుమ్మెదాలో ॥ శ్రీరామ ॥
చ.3. వారది కిందనె పచ్చని పందిరిలె తుమ్మెదాలో
శ్రీరామ రగురామ తుమ్మెదాలో ॥ శ్రీరామ ॥
చ.4. పందిర్ల కిందనే వలుకులె జల్లి తుమ్మెదాలో
శ్రీరామ రగురామ తుమ్మెదాలో ॥ శ్రీరామ ॥
చ.5. వలుకులె మీదనె సిరిముగ్గులేసి తుమ్మెదాలో
శ్రీరామ రగురామ తుమ్మెదాలో ॥ శ్రీరామ ॥
చ.6. సిరిముగ్గులో మీద సిరిసాపలేని తుమ్మెదాలో
శ్రీరామ రగురామ తుమ్మెదాలో ॥ శ్రీరామ ॥
చ.7. సిరిపాపల మీద బోలుపీఠలే తుమ్మెదాలో
శ్రీరామ రగురామ తుమ్మెదాలో ॥ శ్రీరామ ॥
చ.8. బోలు పీఠాల మీద బాలలిద్దరె తుమ్మెదాలో
శ్రీరామ రగురామ తుమ్మెదాలో ॥ శ్రీరామ ॥
చ.9. బాలుడి పేరేమో బాలపేరేమో తుమ్మెదాలో
శ్రీరామ రగురామ తుమ్మెదాలో ॥ శ్రీరామ ॥
చ.10. బాలుడు రామన్న బాల సీతమ్మ తుమ్మెదాలో
శ్రీరామ రగురామ తుమ్మెదాలో ॥ శ్రీరామ ॥
వివాహానంతరం ఆడిరచే ఆటలు : తమలపాకును పొడవుగా చుట్టి దానిని వధువు నోట్లోపెట్టి వరుడిని అందుకోమనడం. వరుడు అందుకునే సమయంలో వధువు అందకుండా ఆటపట్టించడం. వరుడు అందుకోవడానికి ప్రయత్నాలు చేస్తాడు. వరుడు తమలపాకును అందుకున్న తర్వాత ఇప్పుడు వరుడు నోట్లో తమలపాకు పొడవుగా చుట్టి పెడతారు. వధువు అందుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఎండు కొబ్బరిని పొడవుగా కోసి వధూవరుల నోట్లో పెట్టి ఆడిస్తారు. లగ్గం పోకలను కూడా పండ్ల (దంతముల) మధ్యన పెట్టి ఒకరినొకరు అందుకోమనడం లాంటి ఆటలను ఆడిస్తారు.
ఈవిధంగా చేయడానికి కారణం వీరు సంచారజీవులు, అప్పటివరకు వధువు వరుల పరిచయాలుండవు. పెద్దలు కుదిర్చిన వివాహం అయిన దంపతుల మధ్య బిడియం, భయం ఉండకూడదనే ఈ ఆటలను ఆడిస్తారు. బిందెలో బియ్యం కడిగిన నీళ్ళు బిందెనిండా పోసి దానిలో రాగి ఉంగరం లేదా పగడాల హారం వేసి వధువును వరుడిన వెదకమంటారు. ఎవరికి దొరికితే వారి తరఫు వారు గెలుపు ఆనందాన్ని పొందుతారు.(కార్యేషు దాసి, కరణేషు మంత్రి, శయనేషు రంభ, భోజ్యేషుమాత, క్షమయా ధరిత్రి). బియ్యానికి పూజ చేయడానికి ఐదు కర్రలను ఉపయోగించడం. ఐదుగురు స్త్రీలు పాటపాడటం, వినాయకుడి పూజ ఐదు రోజులు చేయడం. ఆకు వక్కలను ఐదుసార్లు అందుకోవడం ఇలా ఐదు అనే అంకెకు చాలా ప్రాముఖ్యతనిస్తారు. పై శ్లోకాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ విధానం పాటిస్తారు. ఇటువంటి పద్ధతి ఎవరి పెండ్లిలోను ఉండదు. బియ్యం కడిగిన నీళ్ళకు ప్రాధాన్యత ఇవ్వడానికి ‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’ అని వీరు భావిస్తారు.
పైటమార్పిడి (కొంగు మార్పిడి) : వివాహంలో వరుడి ఇంటి ఆచారాన్ని బట్టి వధువుపైటను మార్చడం` ఈ పద్ధతి వధువుకు ఇడం పెట్టినపుడు (పూలు పండ్లు పెట్టడం`నిశ్చితార్థం) అదేరోజున మార్చడం జరుగుతుంది. వరుడి తరఫు ఆచారాన్ని బట్టి ఎడమవైపు ఉంటే కుడి వైపు వేయిస్తారు. కుడివైపు ఉంటే ఎడమవైపు వేయిస్తారు. దీనినే కుడి ఎడమలకు మార్చడం అంటారు.
పైటమార్పు వలన ఈ అమ్మాయికి నిశ్చితార్థం అయ్యిందని తమ కులంలో తాము నివసించే గూడెంలో తెలియడం కోసం పెట్టుకున్న ఆచారం. ఈ నియమంలో వేరే ఇంకెవరు ఆ అమ్మాయిని అడగకుండా ఉండడానికి. అదేవిధంగా వీరిలో పాత బట్టల మీదనే వివాహం జరిగేది. కన్యాదాన కార్యక్రమానికి ముందుగా కొత్త వస్త్రాలను ధరింపజేసేవారు. నాటి పరిస్థితులకు, ఆర్థిక స్థితిగతులకు అనుకూలంగా మార్చుకున్న ఆచారం.
వరుడింటికి చేరిన తర్వాత చేసే కార్యక్రమాలు :
దృష్టి దోషము : వధూవరుల మీదనుంచి పసుపు, కుంకుమ కలిపిన అన్నం ముద్దను తింపి కుడి ఎడమలకు పడవేస్తారు. వధూవరులను లోపలికి రానియ్యకుండా తలుపులోపల గడియ పెట్టుకుని ఆ ఇంటి ఆడబిడ్డ లోపల ఉంటుంది. వరుడు, వధువు తలుపు తియ్యమని పాటరూపంలో అడుగుతారు.
॥ పాట ॥
చిట్టెడు చిట్టెడు ముత్యాలిస్తా
చిన్ని పువ్వుల దండలిస్తా
హారాలిస్తా సారాలిస్తా అక్క రాంబాయి
తలుపు తియ్యవే తలుపు తియ్యవే
ఎక్కే ఏనుగులిస్తా ఏలే రాజ్యాలిస్తా
కూర్చుండే పీటలిస్తా కూర్మ గంగాళమిస్తా
అక్క రాంబాయి తలుపు తియ్యవే
॥ పాట ॥ (ఆడబిడ్డ పాడే పాట)
హారాలద్దు సారాలద్దు ఎక్కే ఏనుగులొద్దు
నీకు పుట్టే బిడ్డనిస్తావా తమ్ముడు రామయ్య
వధూవరులిద్దరు తమలో తాము చర్చించుకొని తమకు పుట్టిన బిడ్డను ఇస్తామని మాట ఇవ్వగానే ఆడబిడ్డ లోపలికి ఆహ్వానిస్తుంది. ముత్యాలు, హారాలు, నగలు, చీరెలు, ఏనుగులు, రాజ్యాలు ఇస్తాను అనడంలో కొన్ని చారిత్రకాంశాల ఆధారంగా వీరు సామంతులుగా రాజ్యాధికారం కలిగిఉండి ఉంటారు. ఇదే విషయాన్ని పాటరూపంలో వెలువరించడం జరిగింది.
తమ్ముడి బిడ్డను కోరడంలో ముందుగానే మేనరిక సంబంధం కొరకు ఒప్పందం చేసుకోవడం, సంబంధ బాంధవ్యాలను కాపాడుకోవడం కనిపిస్తుంది. వధూవరుల చేత పూజలు`బోనాలు : వివాహ సమయంలో వధువు కొంగులో కట్టిన బియ్యాన్ని తీసి ఆ బియ్యాన్ని వండి ఆ వండిన ఆహార పదార్థాలను గంపలో వాటన్నింటిని పెట్టి వధువు తలమీద పెడతారు. వరుడు నీటి కడవను పట్టుకుంటాడు. ఇద్దరిని ఊరి గ్రామదేవతలైన మైసమ్మ, ఎల్లమ్మ, పోశమ్మ మొదలగు దేవతలకు పూజలు చేయించి బోనాలు సమర్పిస్తారు. వధువు నెత్తిమీద గంప ఎత్తుకోవడం, వరుడు నీటి కడవను ఎత్తుకోవడం వలన వారు శారీరక శ్రమకు అలవాటు పడాలని, దేవతలు ఆశీర్వదించాలని పూజ జరిపిస్తారు.
మాతృస్వామిక వ్యవస్థ : వివాహం కుదుర్చుకునే సమయంలోనే ఒక ఒప్పందం వీరి సంప్రదాయంలో ఉంటుంది. ఆ ఒప్పందాన్ని ‘మేర’ అని అంటారు. ‘మేర’ అంటే వారు విధించే నిబంధన ‘హద్దు’. వరుడు వేరే ఇంటికి సంబంధించిన వాడు కాబట్టి అతని గుణగణాలు తెలియాలంటే వధువు తల్లిదండ్రుల వద్ద ఒక బిడ్డ జన్మించేవరకు లేదా ఒక సంవత్సరం లేదా ఆరునెలలు వారి వద్ద ఉండి తన ప్రవర్తనతో వారిని మెప్పించగలగాలి. ఈవిధంగా ‘మేర’ నిబంధనకు ఒప్పుకున్నట్లు అయితే వివాహము జరిపిస్తారు. ఇందులో ఒక నిగూడ అర్థం దాగిఉంది. ‘వెయ్యి అబద్దాలు ఆడి ఒక పెండ్లి చెయ్యమంటారు’ ఇటువంటి విపత్తు ఏమైనా ఉంటుందో ఏమో అని వీరు పెట్టుకున్న ఆచారం.
ఒక సామెత ప్రకారం : ఆరునెలల సహవాసము చేస్తే వారు వీరు అవుతారు. ఆవిధంగా ఆలోచించి ఒక సంవత్సరం అని, ఆరునెలలు అని వ్యవధి పెట్టుకున్నారు. ఎటువంటి అబద్ధాలు ఆడడానికి ఇక్కడ ఆస్కారం ఉండదు. కుల పంచాయతీలకు దారితీస్తుంది. కుల పంచాయితీలు : ఆర్థికంగా కష్టాలు తెచ్చేవి కుల పంచాయితీలు. వీరి పంచాయితీలకు కుల పెద్దలు సభ్యులుగా ఉంటారు. ఈ పంచాయితీలో ఇతర కులాల వారి దగ్గర ఆహార పానీయాలను స్వీకరించడం, వివాహ సమయంలో చేసిన బాసలు నిర్వర్తించక పోవడం, అప్పులు కట్టకపోవడం, భార్యాభర్తల విడాకులు మొదలగునవి కులపంచాయితీలో కులపెద్దల ముందు విన్నవించుకున్నవారికి తప్పు ఒప్పులను తెలుసుకొని న్యాయం చేస్తారు. కుల పంచాయితీ పెట్టేముందు అందరికి బీడీలు పంచుతారు. కుల పంచాయితీలో ఇరువర్గాలవారు కూర్చున్నప్పుడు ముచ్చిలిక విరవడం (అంటే ఒక పుల్లను తీసుకుని విరిచి పంచాయితి పెద్దల ముందు అన్ని విషయాలు చెప్పుకుంటారు.)
విడాకుల విధానం : స్త్రీకాని పురుషుడు కాని తమకు ఇష్టంలేదని విడాకులు కోరుతారో కులపెద్దలు నిర్ణయించిన ధనాన్ని యివ్వాలి. అప్పుడు స్త్రీని తూర్పుదిక్కుగా నిలబెట్టి ఒక రూపాయి కొంగులో కట్టి పుస్తె (తాళి)ని వెనకనుంచి తెంపివేసి, వెనక వైపునుండే వెళ్లిపోతాడు. ‘తూర్పుతిరిగి దండం పెట్టు’ అనే సామెత ఈ ఆచారం నుంచే మొదలై ఉంటుంది.
పెండ్లి సమయంలో పాడేపాటలు మరియు గ్రామ దేవతల పాటలు :
॥ పెండ్లిలో వయిరాడ్ల పాట ॥
పల్లవి : ఇద్దరి యారడ్లమచ్చినామె
మేము రెండు జోళ్ళ అచ్చింతాలు దెచ్చినామె
చ.1. పట్టరయ్య అచ్చింతాలు పట్టరయ్య
మాచేతికి వయిరాడ్లు యియ్యరయ్య
చ.2. ముగ్గురం యారడ్ల మచ్చినామె
మేము మూడు జోళ్ళ అచ్చింతాలు దెచ్చినామె
పట్టరయ్య వచ్చింతాలు పట్టరయ్య
మా చేతికి వయిరాడ్లు యియ్యరయ్యచ.3. నల్గురం యారడ్ల మచ్చినామె
మేము నాల్గు జోళ్ల అచ్చింతాలు దెచ్చినామె
పట్టరయ్య వచ్చింతాలు పట్టరయ్య
మాచేతికి వయిరాడ్లు యియ్యరయ్య
చ.4. ఐదుగురం యారడ్లం మచ్చినామె
మేము ఐదుజోళ్ల అచ్చింతాలు దెచ్చినామె
పట్టరయ్య వచ్చింతాలు పట్టరయ్య
మాచేతికి వయిరాడ్లు యియ్యరయ్య
॥ సాగనంపు పాట (నాగెల్లిలో) ॥
పల్లవి : ముత్యాల పందిట్లో నీముగురన్నలు సారా సీరాలు దెచ్చిరే
చెల్లెలా సీత `సారాసీరాలు దెచ్చిరే చెల్లెలా సీత
చ.1. సారా సీరాలు దెచ్చి నిన్ను సాగదోలంగ
ఎలా లేని దు:ఖామోచ్చెనో చెల్లెలా సీత ॥ ఎలా ॥
చ.2. పచ్చని పందిట్లో నీనల్గురన్నాలు
పయిలమని జెప్పిరే చెల్లెలాసీత ॥ ఏయి ॥
చ.3. వదునాల పందిట్లో నీ ఐదుగురన్నాలు
అంగి దండాలు వెట్టిరే చెల్లెలా సీత ॥ అంగి ॥
సారా సీరాలు దెచ్చి నిన్ను సాగ దోలంగ
ఎలాలేని దు:ఖామోచ్చెనే చెల్లెలా సీత ॥ సారా ॥
॥ ఇతర పాటలు ॥
పుట్టినాటి సంది పువ్వోలె వెంచి
పులికి అప్పగిస్తివె నన్నుగన్నతల్లి ॥ పుట్టినాటి ॥ 2 ॥
కన్ననాడు నన్ను గర్వనా వెంచి
కలికి అప్పగిస్తివె ఓకన్నతల్లి ॥ పుట్టినాటి ॥ 2 ॥
వడ్లు దంచె పొట్టు సిరిపెంట నిండె
వత్మగల్ల బిడ్డ వల్లుండ్ల పాలె ॥ పుట్టినాటి ॥ 2 ॥॥ పాట ॥
పల్లవి : ఏప చెట్టు ఏపవనం ఒప్పినాదే నీగుడినిండ
ఒప్పినాదే నీగుడినిండ ఒప్పినాదే నీగుడినిండ ॥ ఏపచెట్టు ॥
చ.1. నిగుడియ గుగ్గిలాయె పోష
గుడినిండ గుగ్గిలాయె పోష ॥ ఏపచెట్టు ॥
చ.2. గడముంత గండదీపం
నీగుడి గొబ్బిందె పోష ॥ ఏపచెట్టు ॥
చ.3. గవ్వలాట గజ్జిలాట
వాడుకుంట నువ్వురాయె పోష
పాడుకుంట నువ్వురాయె పోష ॥ ఏపచెట్టు ॥
చ.4. తెల్లజీర వద్దాల రెయిక కట్టుకొని నువ్వురాయె పోష
తొడుక్కొని నువ్వురాయె పోష ॥ గవ్వలాట ॥
చ.5. ఎర్రజీర వద్దాల రెయిక కట్టుకొని
నువ్వురాయె పోష, తొడుక్కొని నువ్వురాయెపోష ॥ గవ్వలాట ॥
చ.6. పచ్చజీర వద్దాల రెయిక కట్టుకొని
నువ్వురాయె పోష, తొడుక్కొని నువ్వురాయె పోష ॥ గవ్వలాట ॥
చ.7. పట్టుజీర వద్దాల రెయిక కట్టుకొని
నువ్వురాయె పోష తొడుక్కొని నువ్వురాయె పోష ॥ గవ్వలాట ॥
॥ పోశవ్వ పాట ॥
పల్లవి : అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో అల్లల్ల నేరెడి అల్లో నేరడల్లో
పోశవ్వ రూపాన నెరల్లు జెరె అల్లో నేరడల్లో
చ.1. చెట్టు చెట్టు తిరిగి చెమలల్ల తిరిగి
మేలైన సిరికొండ మేడలల్ల తిరిగి అల్లో నేరడల్లో
చ.2. ఏదారి దెచ్చెనె నెరెడి కొమ్మ
అల్లో నేరడల్లో ` అల్లల నెరెడి అల్లో
చ.3. పెదపోసు దూపాయే నెరెల్లు కోరె
అల్లో నేరడల్లో ` అల్లల నెరెడి అల్లో
చ.4. ముత్యాలవ్వ దూపాయే నెరెల్లు కోరె
అల్లో నేరడల్లో ` అల్లల నెరెడి అల్లో
చ.5. లస్మవ్వ దూపాయే ` నెరెల్లు కోరె
అల్లో నేరడల్లో ` అల్లల నెరెడి అల్లో
చ.6. నల్లపోసవ్వ దూపాయే` నెరెల్లు కోరె
అల్లో నేరడల్లో ` అల్లల నెరెడి అల్లో
చ.7. పోతులింగుకు దూపాయే ` నెరెల్లు కోరే
అల్లో నేరడల్లో ` అల్లల నెరెడి అల్లో
ముగింపు : ఆచారము, సంప్రదాయం. వివిధ కులాల మతాలను బట్టి ఏర్పరుచుకున్న అలవాట్లు. గోసంగుల వివాహము అనేది ఇతర జాతులు, కులాల, మతాల వారికంటే భిన్నమైనటువంటిది. నేటికి కొనసాగుతూనే ఉంది.
– గంధం విజయ లక్ష్మి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
One Response to గోసంగుల వివాహ పద్ధతులు(వ్యాసం ) – గంధం విజయ లక్ష్మి