విధ్య తల్లి చిన్నప్పుడే చనిపోయింది.విధ్యకి తండ్రే గురువు , దైవం,తల్లి, స్నేహితురాలు అన్నీ! ఇంటి భాద్యత పది పన్నేండేళ్ళ వయసులోనే స్వీకరించింది.తండ్రి గారాబం వల్ల ప్రతి విషయం లోనూ తానే స్వయం నిర్ణయం చేయటం, అనుకున్నది ఆచరించటం బాగా అలావాటైపోయింది. చదువు అనేది స్త్రీ పురుషుల్లో ఎవరికైనా పెళ్ళికాక ముందు వరకే వుండాలి. పెళ్ళైనతరువాత ఇక చదువు ప్రసక్తి ఉండకూడదు అన్నది విద్య బలీయమైన అభిప్రాయం.ఏం.ఏ పాసై పి. హెచ్.డి చేయటం ఆశయం.విద్యకి కాలేజి, యిల్లు,తండ్రి,మ్యూజిక్,పుస్తకాలు ఇదే లోకం.కాని ఒకే ఒక బలహీనత పట్టరాని కోపం రావటం.
యశ్వంత్ ను పిల్లలు లేని మేనత్త , మామయ్య పెంచుకొని అమెరికా తీసుకెళుతారు.రెండు మూడేళ్ళకొకసారి వచ్చి తల్లి తండ్రులను చూసి వెళుతుంటాడు.యం.బి.యే పూర్తి అయ్యింది.మేనమామ బిజినెస్ చూసుకుంటున్నాడు.తల్లి అరోగ్యం బాగాలేకపోవటంవల్ల ఆమెను చూసేందుకు ఇండియా వచ్చాడు.పెంచిన తల్లి అతనిని అమెరికా లోనే వుండమని, కన్నతల్లి ఇండియా వచ్చెయ్యమని పోరుతుంటారు. ఇద్దరికీ న్యాయం చేయాలని ఆరాటపడుతుంటాడు.ఇద్దరికీ ఆసరా అవటం తన ధర్మం అనుకుంటాడు. ఎవరికీ ఎదురు చెప్పడు. ఇద్దరు తండ్రుల వ్యాపారాలు, ఆర్ధిక సమస్యలు, భాద్యతలు అతని మీద వున్నాయి. బద్దకస్తుడు కాదు. కష్టపడి పని చేస్తాడు.స్నేహానికి ప్రాణం ఇస్తాడు.
ఇద్దరూ ఒక రైలు ప్రయాణం లో తటస్తపడతారు. అనుకోకుండా రైలు ఆగిపోతుంది. యశ్వంత్ పర్స్ ఎవరో కొట్టేస్తారు. యశ్వంత్ విద్య ను ఇరవైరూపాయలు అప్పు అడగటం తో వారికి పరిచయం అవుతుంది.ఆ పరిచయం పెరిగి ఒకరికొకరు నచ్చి వివాహం చేసుకుంటారు.పెంపుడుతల్లి వలన ఇద్దరిలో అపోహలు చోటు చేసుకుంటాయి. విధ్యకున్న కోపం బలహీనత వలన అతనిని విడిచివెళ్ళిపోతుంది.కొడుకు పుడతాడు. వంటరిగా వుండి చదువుకొని ఉద్యోగము లో చేరుతుంది.కొడుకు రవి ని హాస్టల్ లో వుంచి చదివిస్తుంది.రవి ని కాలేజీ లో చేర్చినప్పుడు తన దగ్గరకే తెచ్చుకుంటుంది.చాలా సంవత్సరాల తరువాత అనుకోని పరిస్థితులలో రవి క్లాస్మేట్ రేఖ తండ్రి గా యశ్వంత్ ను చూస్తుంది. రేఖ , రవి స్నేహంగా వుండటం ,వారి స్నేహాన్ని యశ్వంత్ ప్రోత్సహించటం సహించలేకపోతుంది. ఆ స్నేహాన్ని ఎలా ఎదుర్కుంది? ఒకే తండ్రి కడుపున పుట్టిన పిల్లలమని వారికి తెలుస్తుందా? యశ్వంత్, విద్య కలుసుకుంటారా? ఆ ప్రశ్నలకు సమాధానం యద్దనపూడి సులోచనారాణి వ్రాసిన “ఋతువులు నవ్వాయి”చదివి తెలుసుకోవలసిందే!
ఈ ప్రశ్నలకు ఆ నవల చదవకుండానే సమాధానాలు చెప్పెయ్యొచ్చా ? ఐనా ఏముంది ఇందులో ఓ ప్రేమ కథ అంతే.ఒక సమస్య లేదు. ఒక సస్పెన్స్ లేదు. భీభత్సం, రక్తపాతం లేదు.తరువాత ఏమవుతుందో అని ప్రాణాలు ఉగ్గబట్టుకొని చదవక్కరలేదు.కరుడుగట్టిన టెరరిస్ట్ లు, స్మగ్లర్ లు, సి.బి.ఐ , రా ఏజెంట్ ల వెనుక గుండె గుప్పిట్లో పెట్టుకొని పరిగెత్తక్కరలేదు. మంత్రాలూ తంత్రాలూ లేవు.ఉన్నదల్లా ఆత్మాభిమానం వున్న అమ్మాయి, సమర్ధుడైన అబ్బాయి.ఇంకేముంది!
కథాపరం గా చూస్తే ఓ అమ్మాయి, అబ్బాయి ప్రేమించుకోవటం , పెళ్ళి చేసుకోవటం, అపార్ధాల తో విడిపోవటం లాంటి మాములు కథే కాని, నవల చదవటం మొదలు పెట్టాక చివరి వరకూ చదివించే మృదుమధురమైన శైలి యద్దనపూడి సులోచనారణిది.ఎటువంటి ఆందోళనాలేకుండా హాయిగా చదువుకోవచ్చు.చదవటము పూర్తి ఐన తరువాత ఓ చల్లని పిల్ల తెమ్మెర పలకరించినట్లుగావుంటుంది.కొద్దిసేపు ఓ ఉహాప్రపంచం తలుపులు తెరిచి ఆహ్వానించి సేదతీర్చుకోమంటుంది.మనకో , మన చుట్టుపక్కలనో నిత్యమూ ఏదో ఒక సమస్య, చిరాకూ వుంటూనే వుంటాయి. కొద్దిసేపు వాటిని మరిపించే ఫీల్ గుడ్ నవలలు యద్దనపూడివి.అందుకే ఆవిడ నవలాప్రపంచపు రారాణి అయ్యింది.
– మాలా కుమార్
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~