జోగిని ( ధారావాహిక ) – వి . శాంతి ప్రబోధ

           

santhi prabodha

santhi prabodha

ఇగజూడు.. కాళికాదేవోలె మా అమ్మ కాల్ల గజ్జేలు తీసి ఆ పోరగాల్ల మీదకు ఇసిరి కొట్టింది. ” ఎవడ్రా.. నా బిడ్డకు ఆడుమనేది. ముందుగాల్ల మీ ఇంట్ల మీ అవ్వతోని ఆడిపిచ్చి, మీ అక్కతోని ఆడిపిచ్చు, నీ ఆలితోని ఆడిపిచ్చు. గజ్జేకట్టిపిచ్చున్రి. ఆల్లందరాడ్తే అటెనుక నా బిడ్డ గజ్జే గడ్తది. ఆడ్తది” అని అమ్మోరి లెక్క ఉరుమిరిమి జూసింది. మీది మీదికి బోయింది.

            నన్ను తోల్కోని ఆటలేదు. పాటలేదని ఇంటికొచ్చింది.

            గప్పుడు సూడాలె.. నా సావిరంగా. జనం మొకాల్ల నెత్తురు బొట్టు లేదంటే ఒట్టు. ఎర్రెర్రని అవ్వ కండ్లు జూసి జనం పరేశానయిన్రు. కొందరు దీనికి దయ్యం బట్టిందన్నరు. ఇంకొందరు కాదు అమ్మోరు మీదికొచ్చింది. గందుకే అట్ల జేసిందన్నరు. మరి కొందరు ‘అమ్మ’ తాటికి బోయినంక జోగోల్ల కండ్లు నెత్తిమీన  కొచ్చినయ్‌ అన్నరు. ఇగ… అంత ఖతం అయింది. ఊరు సత్తెనాశనం అయిపోతాంది. ఎన్నడన్న గిట్ల ఉన్నదా…? జోగుదాని ఆట లేకుండా పీనుగు లేసిందా..? ఊరందరి నోట్ల ఇదే ముచ్చట. కచేరి కాడ చేరిన పెద్దోల్లు సుతం గిదే ముచ్చట జేసిన్రట. అమ్మోరు మీన ఉండబట్టే గిట్లయింది. అమ్మోరికి కోపమయింది. గావట్టి ఈ కాడికెల్లి ఊర్ల జోగోల్ల ఆట బందుబెట్టాలన్నని కచేరి కాడ పెద్దలు సెప్పుకున్నరట.. చెప్పుకొచ్చింది సబిత.  

            ఏళ్ళ తరబడి, తరాల తరబడి కొనసాగుతున్న ఓ అనాచారానికి దొరలు అదుపాజ్ఞల్లో, అజమాయిషీలో ఉండాల్సిన ఓ మాదిగది.. ఆడది. అందునా ఓ జోగిని ఈ విధంగా తిరుగుబాటు ప్రకటిస్తుందని వాళ్ళు ఏనాడూ తలచి ఉండరు. కలలోనైనా ఊహించి ఉండరు. అసలు వాళ్ళు ఈ సంఘటనని ఎలా జీర్ణించుకో గలిగారు. తమ కాళ్ళ క్రింద భూమి కదిలిపోతున్నట్లు, తమకేదో జరగరానిది జరిగిపోయినట్లు భావించలేదా..? ఎందుకు భావించరూ… అక్షరాలా అలాగే భావించారు. ఈ పరిస్థితి ఇక్కడితో ఆపాలి ఎలా…? అని మల్ల గుల్లాలు పడ్డారు. తర్జన భర్జనలు చేశారు. అయినా వారిలో సన్నని వణుకు ఆరంభమయింది. తమ అజమాయిషీకి, ఆధిపత్యానికి ఎక్కడ భంగం కలుగుతుందోనని తమ గౌరవ మర్యాదలు ఎక్కడ మంట కలుస్తాయోనని.

            మొక్కై వంగనిది మానై వంగునా అన్నట్లూ ఈ మొక్క థలోనే తుంచెయ్యాలని ఈ సంఘటనతో ఆగ్రహంతో దహించుకుపోతున్న అగ్రవర్ణాలవారు, భూస్వామ్య పెత్తందారులూ తీర్మానించుకున్నారు. అయితే వెంటనే చర్య తీసుకొనే ధైర్యం చేయలేకపోయారు. కారణం, లింగంపేట వైపు దళితులంతా సంఘం అయ్యారని, అన్నలతో మిలాఖత్‌ అవుతున్నారని, అగ్రవర్ణాలు, పెత్తందారుల మాట ఖాతరు చేయడం లేదనీ, అన్నల భయానికి ఊర్లల్లో పెద్దలంతా ఇల్లు వాకిల్లు ఒదిలి ప్రాణం గుప్పెట్లో పెట్టుకొని పట్నం వలస పోతున్నారనీ వారు విని ఉన్నారు. నాగిరెడ్డి పేటలో దళితుల్ని హింసిస్తూ, వారికున్న కొద్దిపాటి భూముల్ని కాజేసి వాళ్ళతో వెట్టి చేయించుకుంటున్న మల్‌రెడ్డిని అన్నలు ఖతం చేశారు. వెట్టి నుండి వాళ్లకి స్వతంత్రం ప్రకటించారు. ఊళ్ళోపెత్తనం చేసే కుటుంబాలు ఐదారుకి మించవు. మిగిలిన వాళ్ళలో చిన్న, సన్నకారు రైతులు, వృత్తి పనుల వారూ, ఏమీ లేని ఊరికి వెట్టి చేస్తూ బతికే దళితులు అయినా అందరూ పోశవ్వదే తప్పనుకున్నారు. అంతలోనే అమ్మోరు అలా చేయించిందన్న పుకారు లేవడంతో లెంపలేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే కక్కాలేకా మింగా లేక ఉన్న పెద్దలు పోశవ్వను పిలిపిస్తే ఏమౌతుందోనని భయపడ్తున్నారు. దానికి తోడు కొన్నేళ్ళ క్రితం పోలీసుల భయంతో నక్సలైట్‌గా అన్యాయంగా ముద్రవేయబడ్డ వీరయ్య అన్నల్లో ఉన్నాడన్న వార్తలు ఆనోటా, ఈ నోటా విని ఉన్నారు. ఎటు పోతే ఏమవుతుందోనన్న పెద్దలు చివరికి పోశవ్వకి అమ్మోరు వచ్చిందన్న పుకారు లేపి జనాన్ని నమ్మించారు.

            పోశవ్వనే ఆశ్చర్యంగానూ, సంభ్రమంగానూ చూస్తూ ‘ ఇది నిజమా..? అంటున్న విద్యను చూసి.

            ” అవును నిజం అక్కా… నాకు అంత ధైర్నం ఎట్ల అచ్చిందో ఏమో గనీ, అది మొదలు నేను తలొంచుకొని తప్పుజేసినోల్ల లెక్క బతుకుడులే, గులాంగిరి బతుకు లే… నీ కాల్మొక్త నీ బాంచన్‌ బత్కులేదు. నాకు ‘అమ్మ’ ఉన్నదన్న ధైర్నంతోని ఉన్న. ఎవల్లన్న ఓసే… అసే… జోగుదానా… మాద్గిదానా… అంటే ఊకుంటలేను. నన్ను జూస్తే ఫికర్‌ జేస్తున్నారు…” చెప్పింది పోశవ్వ. ఇంకా ఆశ్చర్యంగానే ఉంది విద్యకి. పోశవ్వ రెబల్‌లా కన్పించినా ఆమె తిరుగుబాటు తత్వం, కసి, అంతా తన జీవితాన్ని కాలరాసిన రాజాగౌడ్‌ మీద మాత్రమే అనుకుంది ఇదివరలో. కానీ, ఇప్పుడామె వ్యక్తి మీద కాదు. వ్యవస్థ మీద తిరగబడింది. ఒక దురాచారాన్ని కాలదన్నింది. కాదన్న వాళ్ళకి సవాల్‌ విసిరింది. అంటే… అమ్మ ప్రభావం అంత ఉందా..? తమ వెనక ఒకరున్నారు. తమకూ అండ ఉందన్న విషయం మనిషిలో అంత ఆత్మవిశ్వాసం కల్గించడం నిజంగా చాలా గొప్ప విషయం. తమకు వెన్ను దన్నుగా నిలిచే వాళ్ళు లేకపోవడంతో దళితులు అణగారే బ్రతుకుతూ ఉంటే, అధికారం, పలుకుబడి, కులం, డబ్బు అన్నీ కలిసిన వాళ్ళు అంత అహంభావంతోనూ మితిమీరిన ఆత్మ విశ్వాసంతోను విర్రవీగుతున్నారు. ఏదో ఒక రోజు పరిస్థితి మారకపోదు. ఇప్పటికే చిన్న కదలిక ఆరంభమైనట్లే… అయితే జనం ఆమె చైతన్యాన్ని గుర్తించకుండా ఉండడం కోసం ఆమెకో శక్తి ఉందనీ, అమ్మోరు వచ్చిందని ప్రచారం చేశారు.

            ”ఓహ్‌ా… నాకిప్పటికీ ఆశ్చర్యంగానే ఉంది పోశవ్వా… నీ ధైర్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను.

            నిన్ను చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది” అంటూ ఆమె భుజం తట్టి మనస్ఫూర్తిగా అభినందించింది.

            తమ అగ్రకుల అహంకారాన్ని దెబ్బతీయకుండా ఉండడం కోసం, తమ ఆధిపత్యం ఏం తగ్గలేదని తెలుపుకోవడం కోసం, తాము ఓడిపోలేదని స్పష్టం చేసుకోవడం కోసం జనం ఇంకా తమ తొత్తుల్లాగే తమ అదుపాజ్ఞల్లోనే, కనుసన్నలలోనే ఉంచుకోవడం కోసం పోశవ్వ మీద అమ్మోరు పూనిందన్న ప్రచారం చేశారు. అమ్మోరిని ఏమన్నా అంటే ఊరు ఏమౌతుందోనన్న భయంతో పోశవ్వని ఏమనకుండా శిక్ష లేకుండా వదిలేసిన ఫీలింగ్‌ ఇచ్చారు. జనం అదే నిజమనుకున్నారు.         ఇది వరకు ఎప్పుడూ లేని ధైర్యం అసలు నీకు ఎలా వచ్చింది..? అడిగిన ప్రశ్నే అయినా మళ్లీ అడిగింది.

        ”నీ బాంచెన్‌ దొర కాల్మొక్త దొర.. గులాపోల్లం అన్కుంట దొరలు, పెద్ద కులపోల్లు, పటేండ్లు, ఊరోల్లు సెప్పినట్టు యిన్నాల్ననీ, ఖాతర్‌ సేయకుంటే. ఈ గులాపోల్ల బతుకులు సర్వనాశ్నం అయితయని మా చిన్నప్పటికెల్లి పెద్దోల్లు మాకు సుద్దులు సెప్పబడ్తిరి. ఎందుకు…? ఏంది? ఎట్ల గిన అడ్గద్దంటిరి. అడ్గితే కండ్లు బోతయంటిరి. కడుపుల ఎంత తక్లీబున్నగా బాధ అట్లనే మాలోపట్లే అదిమి పెట్టుకోని బతికితిమి. ఆడుమన్నట్టు ఆడితిమి. మా వోల్లు ఎంత జేసిన ఇంత మడి చెక్క లేకుండె. గప్పుడు నాకు నెత్తి లేకుండె. జోగోల్లకు సర్కారు సేను ఇత్తాందని తెల్సి ఎల్లారెడ్డి కాడ ఆఫీసులకు బోయి కాయిదం తెచ్కపో అని ఐలపురం ఎల్లక్క జెప్పె. నాకు ఆఫీసులు ఎర్కలేదాయే. నాది ఎన్నడన్న అటు దిక్కు పోయిన మొకమా కాకపోయే. మా మావ తీస్కపోయిండు ఎల్లారెడ్డికి, నువు ఈడనే ఉండు గిప్పుడే అస్తనని ఆఫీసు ముంగట చెట్టు కింద నిలబెట్టిండు. ఇగో రాకపోయే, అగో రాకపోయె, బెల్లంగొట్టిన రాయోలె అట్లన నిలబడ్తి. ఆఫీసులకు మస్తుమంది అచ్చెటోల్లు అచ్చుడే, పోయెటోల్లు పోవుడె. కొందరు నడుసుకుంటా అస్తిరి. గొందరు సైకిలు మీన, మోటరు బండ్లమీన రాబడ్తిరి. గని మా మేనమావ రాకపాయె. పొద్దటికెల్లి రాయోలె అట్లనే నిలవడ్డ నన్ను ఎట్లనో జూస్కుంట పోవడ్తిరి. పొద్దుగల్ల నేనాడకు బోయినంక జరసేపటికి జీపుల ఒక్క సారు అచ్చిండు. పగలు పోయిండు. పొద్దు మల్ల బట్టె, ఆసారు మల్ల అచ్చి బోయెతందుకు బైటికొచ్చిండు.

        చెట్టు నీడ తోని అటు ఇటు కొద్దిగా జరుక్కుంట ఆడనే ఉన్న నన్ను జూసిండు. లోపలికి పోయిండు చెప్రాసితోని నాకు కబురు బెట్టిండు.

        లోపల బోయినంక ఎవరు నువ్వు? ఏ వూరు. నీ పేరేంది..? ఎందుకొచ్చినవ్‌? అని అడిగిండు. పొద్దున నేను వచ్చేటప్పటికే వచ్చిన దానివి లోపలికి రాలేదేం అడిగిండు గా పెద్దసారు. అట్లడ్గంగనే ఎన్నులకెల్లి సలితన్నుకొచ్చె. గాబారా అయ్యే ఫిర్‌బీ. ఏం జేత్త? అట్లనే నా పానం అంత జమాయించుకుంట అచ్చినపని చెప్పిన. పొద్దుగాల్ల ఏడుగొట్టంగ అచ్చిన. కడుపుల ఎట్లనో అయితాంది. మా మావ రాలె. యాడికి బోయిండో ఎర్కలేకపాయే. ఎమ్మార్వో సాబ్‌తోని మాటాడాలె. జోగోల్లకు సర్కారు భూములిత్తరట. ఆ కాయిదం ఈడ యిత్తరట. దాని కోసం అచ్చిన నీ కాల్మొక్త అని చెప్తి.

        ”ఓహో… నీ పేరేంటి?

        ”జోగు పోశవ్వంటరు నీ బాచంన్‌”

        ”పోశవ్వా ఇన్ని గంటలసేపు ఉలుకూ పలుకూ లేకుండా, తిండి తిప్పలు లేకుండా రాని మీ మావకోసం ఎదురు చూస్తున్న నిన్ను చూస్తేనే నీ వెంత అమాయకురాలివో అర్థమయింది. కాలం మారింది. మారుతున్న కాలంతో పాటు మీరూ మారాలి. తెలివిగా ఉండాలి” ఎమ్మార్వో ఆమె మొహంలోకే చూస్తూ.

        ”నీ కాల్మొక్త సారూ గట్లనా…? నీ బాంచెన్‌ గులాపోల్లం” ఆయనకు రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ అంది పోశవ్వ. ఇంకెప్పుడూ ఇన్ని గంటలు పడిగాపులు పడకు, ఇప్పుడే కాదు. ఎక్కడైనా, ఎప్పుడైనా నీవు ధైర్యంగా ఆఫీసుకు రావచ్చు. నీవు వచ్చిన పనేమిటో చెప్పవచ్చు. నీకు కావల్సింది ధైర్యంగా అడిగి చేయించుకు వెళ్ళవచ్చు. గులాంగాళ్ళం మా బతుకు ఇంతే అని మిమ్మల్ని మీరే చిన్న చూపు చూసుకుంటున్నారు. అణచి వేసుకుంటున్నారు. మీరు అలా ఉంటే, మిమ్మల్ని అలాగే ఇంకా అణచివేయాలని చూస్తారు కొందరు. ఈ విషయం గుర్తుపెట్టుకో.. ఎప్పుడూ భయపడుతూ బతక్కు. మీలాంటి వాళ్ళకు సహాయం చేయడానికే మేం ఇక్కడ ఉన్నది. మేం జీతాలు తీసుకుంటున్నది. అంటూ ధైర్యం చెప్పాడు. నీవు తప్పు చేయనంత వరకూ ఎప్పుడూ, ఎక్కడా తల వంచాల్సిన పనిలేదు. నీవు నీవుగా బతకడం, నీవు నీవుగా ఆలోచించడం నేర్చుకో” అని చెప్పి ఎవర్నో పిలిపించాడు. ఆయన నా గురించి అడ్గి రాస్కున్నాడు. రేపొచ్చి తీస్కుపొమ్మన్నాడు.

            ”మనోహర్‌ రేపు కాదు. ఇప్పుడే తయారు చేసి ఇచ్చి పంపండి” చెప్పిండు పెద్దసారు. ఇంటికి వెళ్దామని లేచిన మనోహర్‌ ఇప్పుడే తయారు చేసి ఇమ్మన్న బాస్‌ ఆజ్ఞతో మొహం కందగడ్డలా పెట్టుకొని గొణుక్కున్నాడు. జరసేపైనంక ఓ కమ్మ తీస్కచ్చి పెద్దసారు ముందట పెట్టిండు. ఆయన నిశాని ఏసినంక ముద్ర కొట్టి నాకు ఇచ్చిన్డు.

            ”దండాలు సారు.. పోయస్త” అని చెప్పి బయటకు అడుగు వేయబోతున్న పోశవ్వతో… పోశవ్వా ఎవర్నీ జోగినిగా ఉండకూడదనీ, జోగినిగా చేయకూడదనీ సర్కారు ఖానూను చేసింది. జోగిని అంటే నీవు ఊర్కోకు, నీకు ఒక పేరుందని గుర్తుంచుకో, ఎవరికైనా పోశవ్వ అని చెప్పు. జోగు పోశవ్వ అని చెప్పకు. నీ కులం పేరు పెట్టి అవమానకరంగా పిలిస్తే ఊర్కోకు, అలా పిలిచిన వాళ్ళ మీద, నిన్ను అవమానించిన వాళ్ళ మీద చర్య తీసుకోవచ్చు. జైల్లో పెట్టించవచ్చు. బోధన్‌ దగ్గర ‘అమ్మ’ ఆఫీసు ఉంది. అక్కడికి వెళ్ళు. నీకు చాలా విషయాలు తెలుస్తాయి. నీవు నీవుగా బ్రతకడం నేర్చుకుంటావు.” అని సుద్దులు చెప్పిండు. ధైర్నం ఇచ్చిండు.

            జీపుల్ల తిర్గేటి సర్కారు సార్లు, పెద్ద సార్లు గింత  మంచిగ మా అసోంటోల్ల తోని గింత మంచిగ మాటాడ్తరని, మమ్ముల కాతర చేత్తరని అనుకోలె. మా తప్పులెంచి మమ్ముల అంత దూరం బెట్టి మా మీన లేని కేసులు బనాయించేటోల్లను జూసినంగని… దొరల దిక్కు, ఆల్లతోనే మాట్లాడ్తరనుకుంటి. అవ్‌… గా సారన్నట్టు జమానా మారబట్టింది. ఊర్ల అంత ” ఒసే… జోగుదాన… అసే మాద్గిలం….’ అని పిలిస్తే గా పట్నం అక్కలెక్క గీ సారు బీ పోశవ్వ అని నిండుగ పిల్సె. తరీఖతోని పిల్సె. గౌరవం ఇచ్చె. మంచి సుద్దులు జెప్పె అనుకుంట ఇంటికి బయలెల్లిన. పెద్ద సారు చెప్పిన సుద్దులే మల్ల మల్ల నా చెవులల్ల ఇనబడవట్టె. గా సారు చెప్పిన సుద్దులన్ని సమజ్‌ కాకున్న నాకు మేలు జేసేటియని అనుకున్న.గా మాటలు చిత్రంగా, గమ్మత్తుగ ఇనబడబట్టె. మమ్ముల అదిలించేటి.. మాటలే గాని గిట్ల మంచిగ సెప్పెటోల్లు బీ ఉంటరు అనుకుంటి. అమ్మ ఆఫీసు ముచ్చట జోగు లాలవ్వ చావుకు బొమ్మన్‌దేవ్‌ పల్లికి పోయినప్పుడు ఆడ పెద్ద మావ బిడ్డ చెప్పిన ముచ్చట యాదికొచ్చింది. ఎట్లన్న జేసి ‘అమ్మ’ తాటికి పోవాలనుకుంటున్న పోశవ్వ నడకలో కొత్తదనం… ఆమె ఆలోచనలో నూతనత్వం… పోశవ్వ జీవితంలో ఆనాడు ఎమ్మార్వో చెప్పినమాటలు ఒక టర్నింగ్‌ పాయింట్‌ అవుతాయని ఆనాడు ఎమ్మార్వోగానీ, పోశవ్వగానీ ఎవరూ ఊహించి ఉండరు…!

        ఆ రోజు నుండి ఎమ్మార్వో చెప్పిన మాటలు ఆమెలో ఎప్పుడూ ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. ఆమెలో ఆలోచనల పరంపర కొనసాగుతూనే ఉంది.

        అదే సమయంలో ” అమ్మ” ఆఫీసు నుండి పిలుపు. అప్పటికే ‘అమ్మ’ గురించి విని ఉన్న పోశవ్వ తానూ ‘అమ్మ’ దగ్గరకు వెళ్ళాలనీ, అక్కడ తన పేరూ రాయించుకోవాలనీ అనుకుంటూనే ఉంది.

        ‘అమ్మ’ సంస్థ కార్యకర్తలు ఈ మధ్యే పిట్లం, ఎల్లారెడ్డి, నిజాంసాగర్‌, లింగంపేట్‌, నాగిరెడ్డిపేట్‌ మండలాలకు కూడ తమ జోగినీ దురాచార నిర్మూలన, పునరావాస కార్యక్రమాలను విస్తరించారు. అందులో భాగంగానే ఆ సంస్థ సబ్‌ ఆఫీసు పెట్టారు. ఈ ఐదు మండలాల్లో జోగినీల సర్వే చేశారు. జోగినీ అక్క చెల్లెలందరినీ ఎల్లారెడ్డి ఆఫీసుకు వచ్చి కలవమని ఆహ్వానించారు. ముత్తెమ్మనీ, సాయమ్మనీ, సబితనీ తీసుకుని వెళ్ళింది పోశవ్వ.

        ‘అమ్మ’ నిజంగా అమ్మే

        అమ్మ మాట్లాడుతూ

        ” ఎవరు చేశారమ్మా నిన్నిలా…

        వెన్నెలా నీ బతుకు నల్లనీ రేతిరల్లే

        వెన్నెలా నీ బతుకు వాడినా జోగిలా

        ఓ పోసాని చెల్లీ, లచ్చవ్వ తల్లీ!! అంటూ పాడుతుంటే.

        పోశవ్వ కళ్ళమ్మట నీళ్ళుధారలు కట్టాయి. ఎన్నో వందలు ఏళ్ళ నుండి ఆడపిల్లల్ని జోగినిగా మార్చే ఆచారం ఉంది. ఎల్లమ్మ పేరు మీదో, ‘పోశమ్మ’ పేరు మీదో మరో పేరు మీదో, ఆడపిల్లను, ఆడదేవతకే అంకితం చేసి ఊరుమ్మడి ఉంపుడు గత్తెగా మార్చారు. దారిద్య్రం, అజ్ఞానం, అంటరానితనం, అమాయకత్వంలో ఉన్న ఆడపిల్లలు తమ నుదుట అదే రాసి పెట్టి ఉందని, తమ బతుకు ఇంతేనని, ఇది దేవుని ఆజ్ఞ అని నమ్మడంతో తమకు జరిగే అవమానాన్ని, అన్యాయాన్ని అమానుషాన్ని తెలుసుకోలేక పోతున్నారు.

        ఈ ‘జోగిని’ ఆచారం అంటరానివారని పిలువబడే మాల వారిలోనూ, మాదిగ వారిలో మాత్రమే ఉంది. ఎందుకని? ఇతర కులాల ఆడవాళ్లకి ఈ ఆచారం లేదెందుకని? అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకున్నారా? ఎప్పుడైనా..?  లేదు.

        మీకు పుట్టిన బిడ్డలకు తండ్రెవరు? తండ్రి గురించి మీ పిల్లలు అడిగే ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పగలరా…? వారికి మీరు తండ్రి ప్రేమ తెచ్చివ్వగలరా..? ఆ పిల్లలు చేసిన తప్పేమిటి? మీ పిల్లలు కావడమేనా…?

        అందమైన అమ్మాయిపై కళ్ళు పడ్డ మీ ఊరి దొర సాంప్రదాయం పేరుతోనో, ఆచారం పేరుతోనో లేకపోతే ఏదో సాకు చూపించి మీ ఆడపిల్లని ‘జోగిని’గా మార్చమంటే మీరు కాదనగలరా..? అతని వల్ల పుట్టిన బిడ్డకి అతనే తండ్రి అని చెప్పగలరా? మిమ్మల్నిమీ బిడ్డల్ని కూడా చీకట్లో వాడుకున్న వ్యక్తులే తెల్లవారి మిమ్మల్ని, మీ బిడ్డల్ని కూడా కులం పేరుతో అంటరాని వాళ్ళుగా చీదరించుకుంటూ, మిమ్మల్ని దూరంగా ఉంచుతుంటే మీకు అవమానంగా అన్పించదా..? ఎంతో దుర్భరంగా సాగిపోతున్న మీ బతుకుల్లో వెలుగులు నింపాలనే ‘అమ్మ’ లా అక్కున చేర్చుకుని మీ అందరికీ కొత్త జీవితాన్ని అందివ్వాలనేదే ‘అమ్మ’ సంకల్పం. ఎన్ని అవరోధాలు ఎదురైనా ఎన్ని అడ్డంకులు వచ్చినా వాటిని ఎదుర్కొంటూ ముందుకు వెళ్తోంది. ‘అమ్మ’ ప్రారంభమయ్యాక బోధన్‌ ప్రాంతంలోని చుట్టుపక్కల జోగినీలు తరతరాల సంకెళ్ళను తెంచి అవతల పడేశారు. ఎల్లమ్మ పేరు మీదో పోశమ్మ పేరు మీదో, లచ్చవ్వ పేరు మీదో, లేక మరొకరి పేరు మీదనో జోగినిగా చేసి  పట్టం కట్టిన గుర్తుగా వున్న తోలుబిళ్ళను (సూత్రం) తెంచేశారు.

        ఇన్నాళ్ళూ బతికిన బానిస బతుకులు ఇంకానా… వద్దు. వద్దు అంటూ జోగినీలు అంతా ఒట్టేసి చెప్పారు. ఇక ఈ ఆచారం సాగనీయం అన్నారు.

        ”స్త్రీ శక్తి కిలలో సాటియే లేదమ్మ

        ఎవరెదురు నిల్చినా రుద్రమూర్తిలా

        నిప్పులే చెరుగమ్మ చెల్లెలా

        జోగియాచారమ్ము బుగ్గి బుగ్గైపోవ

        నిప్పులే చెరుగమ్మ చెల్లెలా…” అంటూ

అమ్మ ముగించారు.

        ఏభై మందికి పైగా ఉన్న ఆ జోగినిల ఆలోచనలో ఒక కదలిక ప్రారంభమైంది. ‘అమ్మ’ మాట్లాడిన విషయాలన్నీ నిజమే… తమ జీవితాల్నే అద్దంలో చూపిస్తున్నట్లు తోచింది పోశవ్వకి. ఆఖరున అమ్మ పాడిన నాట బాగా నచ్చింది.

        ” జోగు యాచారమ్ము బుగ్గి బుగ్గైపోవ

        నిప్పులే చెరుగమ్మ చెల్లెలా…”

మళ్ళీ మళ్ళీ మననం చేసుకుంది. లోలోపలే.

        ‘అమ్మ’లో అందరూ జోగినీ అనకుండా ‘చెల్లమ్మా…’ అన్న మర్యాద పూర్వకమైన, గౌరవం కల్గించే పిలుపు.. వారిలో ఒక ధైర్యాన్ని నింపింది. ఒక చైతన్యం కల్గించింది.

        ఒసే… పోశీ… జోగుదానా.. అసేయ్‌…అంటూ అదిలింపులు, విదిలింపులతో ఎవడిష్టం వచ్చినట్లు వాడు పిలిచే తనను మొదట మంచిగా అమ్మ పెట్టిన పేరుతోని పిలిచింది పట్నం అక్క. ఆ తర్వాత ఎల్లారెడ్డి ఆఫీసులో పెద్దసారు. ఇక వీళ్ళయితే చెల్లమ్మా అనడంతో ఆమెలో ‘అమ్మ’ సంస్థ అంటే అపారమైన అభిమానం కల్గింది. ‘అమ్మ’ నిజంగా అమ్మే. కన్న తల్లే తెల్సో తెలీకో కన్నబిడ్డని జోగినిగా చేసి అవమానాల పాల్జేసింది. కానీ ఈ అమ్మ, అవమానాలు నీవెందుకు పడాలి.? నీవూ ఒక మనిషివే అంది. నిజమే పెద్ద కులాల ఆడోళ్ళలో ఎవర్నన్నా జోగిని చేశారా లేదే… తమనే ఎందుకు చేశారు…? కన్న బిడ్డకు తండ్రి ఎవరంటే ఏం చెప్తారు…? అన్నది అమ్మ. నిజమే. ఏం జెప్పాలె… నా తండ్రే.. నీకు తండ్రి అని, అయినా ఆయనకు మన శరీరాలు కావాలె.. మన మనసు ఎవరికి కావాలె..? అవసరం ఉన్నప్పుడూ అందరికీ కావల్సింది శరీరమే.. కానీ.. నాకూ, నా పిల్లలకూ ఏమన్నా ఒస్తే ఆల్లకు మేం ఏమీ కాము. మమ్మల్ని ఎవడు కానడు అనుకొంది. అలా ఎన్నెన్నో ఆలోచనలు రేగుతుండగా ఇంటిదారి పట్టారు అంతా.

            దారిలో ఎవరికి వాళ్ళు ఆలోచనలలో మునిగిపోవడంతో ఎవరూ మాట్లాడ్డం లేదు.

            ”అమ్మా… నేను జోగినిగ ఉండ.. రాజక్క లెక్క లగ్గం చేసుకుంట అంటూన్న 11 ఏళ్ళ సబిత మొహంలోకి, ఓ సారి తల్లి వైపూ చూసింది పోశవ్వ.

            ”ఓసేయ్‌…లగ్గం జేస్కుంవా..? ఎవడే నిన్ను జేస్కునేటోడు. పిచ్చి పిచ్చిగ మాట్లాడకు … ఊరంతా అల్లకల్లోలమైతది అంది గతం గుర్తొచ్చి భయం భయంగా… పోశవ్వ తల్లి సాయమ్మ

            ”అవ్వా… ఇంక నువ్వేం జెప్పకు….” విసురుగా అంది పోశవ్వ. పోశీ… మీ అవ్వ అట్లనే అంటది గానీ నా మాటిని సంటిది అడిగినట్టు దానికి లగ్గం చేసేయ్‌. ఏమయితే అయితది కానీ… ఈ దిక్కుమాలిన బతుకు దానికి వద్దే’ అంది సాయవ్వ మేనత్త ముత్తెమ్మ.

            ”ఆల్ల నౌకరీల కోసం ఏదో ఏదో చెప్తరు. ఆల్లు చెప్పిందంత మనం ఇంటే రేపు మనం ఊర్ల బతకద్దా అంటూ సాయవ్వా వాదించింది. గతం కళ్ళ ముందు మెదిలి తన కూతురు భవిష్యత్తు గూర్చి స్థిర నిర్ణయం చేసుకొని ఉన్న పోశవ్వ మౌనంగా ముందుకు సాగింది మిగతా వారితో కల్సి.

            పోశవ్వ, సబితలు చెప్పింది విన్న తర్వాత ”అమ్మ” ఆఫీసుకు వెళ్ళడంతో పాటు జిల్లాలో ఉన్న మిగతా జోగినీలను వీలైనంత ఎక్కువ మందిని కలవాలని నిర్ణయించుకుంది విద్య. తను అమెరికా నుండి తిరిగి వచ్చేటప్పుడు సబిత వాళ్ళ, కోసం తెచ్చిన బహుమతులు అందించింది.

            సబితా మీ ఆయి దగ్గరకు, ముత్తెమ్మ దగ్గరకు పోయి వద్దామా..? అయ్యో… ఆయి ఇంకెక్కడి ఆయి అది పోయి ఏడాది పైనానే అయింది… అంటూ సాయవ్వ ఓ రాగం తీసింది.

(ఇంకా వుంది)

– శాంతి ప్రబోధ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
ధారావాహికలు, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో