బెంగుళూరు నాగరత్నమ్మ

వి.శ్రీరామ్

వి.శ్రీరామ్

జనం అంతా ఒక్కక్షణం ఊపిరి బిగబట్టి, వెంటనే ఆగకుండా చప్పట్లు కొట్టారు. ఆమె చేసిన పోరాట ఫలితం ఆ విజయం.

                1942 ఆరాధన కూడా ఇలాగే విరాళాల కోసం మద్రాసులో కచేరీలు, ఆర్భాటంగా ప్రారంభోత్సవం, పెద్ద ఎత్తున 5రోజుల ఆరాధనోత్సవాలతో జరిగింది. సమాధి దగ్గర త్యాగరాజు ప్రశంసగా నాగరత్నమ్మ పాడిన ప్రార్థనా గీతంతో ఉత్సవాలు మొదలయ్యాయి.

                1942లో మరో రకమైన సవాలు నెదుర్కొంది నాగరత్నమ్మ నగలు అమ్ముకోవడం, పరిస్థితుల మార్పులతో ఆస్తి గురించి కథలు పుట్టాయి. ఒక రాత్రి దొంగలు పడి మిగిలిన నగలన్నీ ఎత్తుకు పోవడంతో పాటు ఆమెని గాయపరిచారు కూడా. దాంతో ఆమె వణికి పోయింది. రాత్రులు ఒంటరిగా నిద్రపోవడానికి భయపడి పోయింది. ఆ ఆపత్సమయంలో తన మాతృభాష కన్నడం మాట్లాడే వాళ్ళ కోసం వెదికింది. అరవం, తెలుగు మాత్రమే మాట్లాడేవాళ్ళున్న తిరువయ్యారు ఆమెకి హఠాత్తుగా పరాయి ప్రదేశంగా తోచింది. కాని త్యాగరాజు మిద వున్నప్రేమ ఆమెని ఆ ఊరు వదలనియ్యలేదు. కొన్ని వీధుల అవతల వున్న రామారావు అనే కన్నడిగుడికి కబురు పెట్టింది. కొద్దికాలం వాళ్ళింట్లో వుంటే ఆయనకిగానీ, ఆయన కుటుంబానికి గాని అభ్యంతరమా అని ఆమె అడిగింది. ఆయన భార్య సగుణాబాయి ఒకప్పటి మైసూరు దివాను వి.పి. మాధవరావు వంశీకురాలు. భార్యాభర్తలు ఆమెని సహృదయంతో ఆహ్వానించారు. ‘భట్‌ గోస్వామి గృహం’ అనే పేరున్న ఆ ఇల్లు ఒక వీధిని ఆక్రమించింది. వాళ్ళకి చాలా భూములుండేవి. వాళ్ళకి లెక్కలేనన్ని గుర్రపుబళ్ళు వుండడంతో దాన్ని ‘గాడీఖానా’ అనేవాళ్ళు. నాగరత్నమ్మ వాళ్ళింట్లో ఆరునెలలుంది. వాళ్ళ పిల్లలకి త్యాగరాజు కృతులు నేర్పేది. మొదట్లో తన వంటతనే వండుకునేది గాని క్రమంగా వాళ్ళతో కలిసి పోయింది.

                యుద్ధ భయానికి చాలా మంది మద్రాసు వదిలి తంజావూరు జిల్లాకి వచ్చేస్తున్నారు. అలా వచ్చిన వాళ్ళలో నాగరత్నమ్మ శిష్యురాలు, ఆమెస్నేహితురాలు శకుంతలా సేతురామన్‌ చెల్లెలు జానకి కూడా వుంది. జానకి, ఆమె తల్లి, రామారావు ఇంట్లో అద్దెకి వుండేవారు. ఆమె నాగరత్నమ్మ దగ్గర చాలా కృతులు నేర్చుకుంది.

                ఈ లోపు వైలిన్‌ విద్వాంసుడు శివసుబ్రమణ్య అయ్యర్‌కి నాగరత్నమ్మ ఇంట్లో దొంగలు పడిన సంగతి తెలిసింది. వెంటనే ఆయన తిరువయ్యారు వచ్చి తన మేనల్లుడు సీతాపతిని ఆమె ఇంటి వరండాలో ప్రతి రాత్రీ పడుకునే ఏర్పాటు చేశాడు. దీంతో ధైర్యం చిక్కి ఆమె తన ఇంటికి తిరిగి వచ్చింది. ఆర్నెల్లు గడిచినా దొంగలు గానీ, వాళ్ళు ఎత్తుకెళ్ళిన నగల జాడగాని  తెలియలేదు. ఆమె నగల గురించి బెంగపడలేదు. త్యాగరాజు ఇచ్చిన ఆ నగలు ఆయనే తీసుకెళ్ళి పోయాడంది.

                1943 మొదట్లో కలరా వచ్చింది. జనం గుంపులుగా వుంటే సమస్య మరింత పెద్దదవుతుందని జిల్లా కలెక్టరు ఆరాధనని ఒప్పుకోలేదు. తిరువయ్యారులో అసంతృప్తి చెలరేగింది. మళ్ళీ మళ్ళీ మహజర్లు పెట్టుకున్నా ఫలితం లేకపోయింది. నాగరత్నమ్మ మాత్రం చెక్కుచెదరలేదు. అంతా త్యాగరాజే చూసుకుంటాడని  ధీమాగా వుంది. విచిత్రంగా అలాగే జరిగింది. మూడు రోజుల ఆరాధనకి అంగీకరించారు. రేడియో ప్రసారాలు విని జనం మరింతగా వస్తారని, ఆ ప్రసారాల్ని మాత్రం  నిరాకరించారు. దాంతో ఆ సంవత్సరం ఆరాధన చిన్న ఎత్తున జరిగింది. ఆరాధన జరగడమే నాగరత్నమ్మకి కావలసింది. ముసిరి చాలా ఉత్తరాలు రాయడంతో శూలమంగళం కాస్తమెత్తబడ్డాడనీ, ఆరాధనకి వస్తున్నాడని పుకార్లు బయల్దేరాయి,  కానీ అప్పటికే మధుమేహంతో ఆయన నీరసించి పోవడంతో కొడుకులు ఆయన్ని ప్రయాణం మానుకొమ్మని సలహాయిచ్చారు.

                1943 అక్టోబరులో వైద్యనాథ భాగవతార్‌ తను ఇంక ఎంతోకాలం బతకనని అనుకున్నాడు. త్యాగరాజులాగా సన్యాసాశ్రమం తీసుకున్నాడు. మూడు రోజుల్లో అక్టోబరు 24న చనిపోయాడు. ఆ ఊళ్ళోనే గౌరవ మర్యాదలతో అంత్యక్రియలు జరిపారు. అక్కడే సమాధి కట్టారు.

                త్యాగరాజు ఆరాధన జరిపిన ముగ్గురిలో  నాగరత్నమ్మే మిగిలివుంది. తిరువయ్యారులో ఆమె ప్రత్యేక ఆకర్షణ అయింది. ఆ ఊరువచ్చిన ప్రతివాళ్ళు ఆ ఊరిదేవాలయం, త్యాగరాజు సమాధి చూసిన తర్వాత ఆమె ఇంటికి బారులు కట్టి నుంచునే వారు. ఆమె వాళ్ళతో  మాట్లాడుతూనో, ఆపల్లె పిల్లలకు సంగీతం నేర్పుతూనో ఉండేది. ఆమెకి త్యాగరాజ కీర్తనలు ప్రచారం చెయ్యడమే అత్యున్నత లక్ష్యం. పిల్లలని హుషారు చేసేందుకు ఒక మంచి పథకం వేసింది. ఒక పెద్ద పడక్కుర్చీలో కూర్చుని వాళ్ళతో పాటు పాడేది. కుడి చేతికి తగిలించుకున్న సంచిలోనుంచి. గుప్పెడు నాణాలు తీసి అందరికీ పంచేది. దాంతో ఆమె పాఠాలు బాగా సాగేవి. పిల్లలు కూడా నెమ్మదిగా సంగీతం అంటే ఇష్టపడేవారు. ఊళ్ళో అందరికీ ఆమె అంటే అభిమానం. ఆమె వంటకోసం బజారుకి వెళ్ళిన సీతాపతికి పోటీల మీద తక్కువ ధరకి వర్తకులు సరుకులు ఇచ్చేవాళ్లు.  చాలా మంది కూరగాయలు ఉచితంగా ఇచ్చేవారు. ఆమె పంచిపెట్టే పసుపూ కుంకుమ దేవుడి వరాలుగా భావించి స్త్రీలు తీసుకు వెళ్ళేవాళ్ళు.22            

                హరికథలకీ, నాటకాలకి త్యాగరాజు జీవిత చరిత్ర ఎప్పుడూ మంచి  కథావస్తువే అందుకని  సినిమారంగం కూడా త్యాగరాజు పట్ల ఆసక్తి చూపింది. దాని మీద ఒక మూకీ సినిమా రావడం ఆశ్చర్యం. టాకీలు వచ్చాక ఒక సినిమా తీశారుగాని అది అంతగా విజయవంతం కాలేదు. 1944లో ప్రసిద్ధనటుడు వి. చిత్తూరు నాగయ్య కూడా తెలుగులో సినిమా తీయడం ప్రారంభించాడు. ఎక్కువ భాగం తిరువయ్యారులోనే తీసిన ఆ సినిమాకి సంగీత పరంగా ఎందరో సంగీతకారులు సాయంచేశారు.  నాగరత్నమ్మని గౌరవ సలహాదారు గా తీసుకున్నారు.23  1946లో విడుదలైన ఆ సినిమా బాగా విజయవంతం అయ్యింది. ఔదార్యానికి మారుపేరైన నాగయ్య నాగరత్నమ్మని ఏదో ఒక బహుమానం కోరుకోమన్నాడు, ఆమె తనకేమీ ఒద్దంది. ఆమె అద్దె ఇంట్లో వుందని తెలిసి సొంత ఇల్లు కొనుక్కునేందుకు సాయం చేశాడు. దాంతో తిరువయ్యారులో దక్షిణంవేపు పెద్దవీధిలో చిన్న ఇల్లు ఆమెదయింది. కానీ ఆమె దాన్ని సమాధికి సంబంధించిన అతిధి గృహంగానే భావించింది. త్యాగయ్యకి అంజలి ఘటించేందుకు వచ్చే యాత్రికులెవరైనా అక్కడ బసచేయవచ్చుననీ, ఆయన కీర్తనలు తనదగ్గర నేర్చుకోవడానికి వచ్చే వారెవరైనా కూడా అక్కడ వుండవచ్చునని ఆమె స్పష్టం చేసింది.

                ఈ సినిమాతో ఆరాధనకి మరింత ప్రాచుర్యం వచ్చింది.  జనం తండోప తండాలుగా రావడంతో నిర్వాహకులకి ఒత్తిడి పెరిగింది. కచేరి చేసేవారికి సమయం మరింత తక్కువయ్యేది. కల్కి కృష్ణమూర్తి అన్నట్టు ఒక సంగీతకారుడు వేదిక ఎక్కి కూర్చునే లోపే, తర్వాతి వారికోసం దిగి పోవలసి వచ్చేది. నిర్వాహకులతో పైరవీలు చేసి అనుభవం, అర్హతలేని వారు కూడా పాడడంతో సంగీతస్థాయి దిగజారి పోయిందని చాలామంది  అభిప్రాయ పడ్డారు25 నాగరత్నమ్మతో సహా మరి కొందరు నిరుత్సాహపడ్డారు. ఆరాధన విషయంలో వాళ్ళ అసంతృప్తిని ప్రకటించదలచుకున్నారు.

          ఈ సమావేశం ప్రతీకాత్మకంగా శూలమంగళంలో వైద్యనాధభాగవతార్‌ ఇంట్లో జరిగింది. ఆ ముసలాయన ఆనాడు దిగజారుతున్న స్థాయిగురించి ఎందుకు ఆందోళన చెందాడో వాళ్ళకి ఇప్పుడర్థమయ్యింది. సంగీతపరమైన  సంఘటన ‘అధికార ఉత్సవం’ గా మారడానికి ఆయన బాధపడ్డాడు కూడా. 1947, ఫిబ్రవరి 24న జరిగిన ఆ సమావేశంలో పల్లడం సంజీవరావుని తమనాయకుడిగా ఎన్నుకున్నారు. ఆరాధనని రాజకీయ, వ్యాపార రంగ ప్రముఖులు ప్రారంభించడానికి ఉద్వాసన చెప్పాలని నిర్ణయించారు. ఆరాధన కార్యవర్గంలో సంగీతకారులే వుండాలనేది మరో తీర్మానం. సంగీతానికి మరీ తక్కువ సమయం కేటాయించడాన్ని గర్హించారు. ఈ మూడు తీర్మానాలనీ కమిటీ ముందు పెట్టారు. కాని చెవిటి వాడి ముందు శంఖం వూదినట్లయింది. తర్వాత్తర్వాత కూడా అలాగే కొనసాగింది.

          భారత స్వాతంత్య్ర పోరాటం గురించి నాగరత్నమ్మ అభిప్రాయం ఏమిటో తెలీదు. ఆమెకి దానిగురించి తెలిసివుండకపోదు. దేవదాసీల్లో చాలా మంది దాన్లో పాల్గొన్నారు. స్వాతంత్య్రం గురించి గ్రామ ఫోను రికార్డు ఇచ్చిన మొదటి కర్ణాటక కళాకారిణి మద్రాసు లలితాంగి.  తంజావూరు కముకణ్ణామ్మాళ్‌ కాంగ్రెసు పార్టీ పక్షాన పట్టుదలగానిలబడింది.   పోరాటంలో పాల్గోవడం కోసం పద్మాసినీ బాయి  హరికథారంగం వదిలేసింది.   కానీ నాగరత్నమ్మ తర్వాత ఒక వ్యాసంలో వలసపాలన గురించి తీవ్రంగా రాసింది.

          ” సుమారు 300 ఏళ్ళకి పూర్వం ఇంగ్లండు నుంచీ ఈస్టిండియా కంపెనీ వాళ్ళు ఇక్కడికి వచ్చారు. మత్తుపానీయాలు, ఇతరప్రలోభాలు చూపించి స్థానిక పాలకుల్ని లొంగదీసుకున్నారు. వాళ్ళ వేషభాషలు, తిండి అలవాట్ల మోజులో పడేసి మన అమూల్యమైన మణి మాణిక్యాలు కొల్లగొట్టుకుపోయారు. వాటి బదులు చౌకబారు గాజుపాత్రలు, సిగరెట్లు, ఇతర మాదకద్రవ్యాలు, రకరకాల పనికి మాలిన బిస్కట్లు ఇచ్చి, మనవాళ్ళని బానిసలు చేసి, వాళ్ళతో పాపాలు చేయించారు. ”  ఘాటైన ఈ పదజాలం చూస్తే 1947లో స్వాతంత్య్రం వచ్చాక ఆమె ఆనందించిందనుకోవడానికి అర్థముంది. ఆతరం వాళ్ళకి రాజాశ్రయం, ఆదరణ పోయాయి.

          ఆరాధన నిర్వహణ గురించి అసంతృప్తివున్నా, త్యాగరాజుపట్ల ఆమెభక్తి మాత్రం చెక్కుచెదరలేదు. తిరువయ్యారులో మైసూరు పేరుతో ఒక సత్రం కట్టించాలని నాగరత్నమ్మ కోరిక. అందుకని చివరి సారిగా మైసూరుకి ప్రయాణం కట్టింది. ఇంతకంటే ఇక మంచి సమయం దొరకదు. ఆమె ఆరోగ్యం అంతగా బాగోవడంలేదు. మైసూరు సంస్థానం ఇండియన్‌  యూనియన్‌లో చేరేందుకు ఆగస్టులో అంగీకరించింది. కాని రాచరిక పాలనే కొనసాగుతుందేమోనని కాంగ్రెసు వాళ్ళు అనుమానించారు. అందువల్ల తమకి అధికారంలో వాటా వుండక పోవచ్చని భయపడ్డారు. దాంతో హర్తాళ్ళు, నిరసనలు, ప్రదర్శనలు, పెద్దఎత్తున అరెస్టులు జరిగాయి.32 ఇప్పుడది నాగరత్నమ్మకి తెలిసిన ప్రశాంత మైసూరు నగరం కాదు. దివాను సర్‌ ఎ. రామస్వామి మొదలియార్‌ అతి కష్టం మిద కొన్ని కచేరీలు ఏర్పాటు చేయగలిగాడు. తక్కువ సొమ్ము పోగవడంతో ఆమెచాలా నిరాశచెందింది. ఇదే మద్రాసులో అయితే ఇంకా ఎక్కువ డబ్బువచ్చేదని ఎవరో సూచించారు. కాని గాగరత్నమ్మ ఒప్పుకోలేదు. కన్నడిగుల డబ్బుతో తిరువయ్యారులో సత్రం కట్టాలని ఆమె ఆకాంక్ష. దాని కోసం కన్నడేతరుల సాయం తీసుకోవడం ఆమెకిష్టంలేదు. 

          తిరిగివెనక్కి వచ్చేటప్పుడు బెంగుళూరులో గాయని తారాబాయి ఇంట్లో వుంది. అక్కడవున్నకొద్దిరోజుల్లోనే సంగీత పాఠాలు చెప్పేందుకు కొందరు విద్యార్థులని పోగు చేసింది. డి. వి. గుండప్ప అనే రచయిత ఆమెని చూసేందుకు వచ్చాడు. అప్పుడు ఆవిడ మైసూరు సదాశివరావుది కష్టమైన కీర్తన నేర్పుతోంది. సాహిత్యం బాగా తెలియడం కోసం పదాలు విడగొట్టి వాళ్ళకి, బాగా అర్థమయ్యేలా చెప్తోంది. ‘అంత కష్టమైన కీర్తనలు ఎందుకు నేర్పడమని అడిగాడు గుండప్ప ‘మన గురువులు రాసిన ఈ కృతులు తర్వాత తరాలకి అందించ వలసిన బాధ్యత మనదే. మనం సులువైన కీర్తనల మిదే దృష్టిపెడితే ఇలాంటి గొప్పకృతులు ఏమైపోతాయి? అని జవాబిచ్చింది.

          గుండప్ప చిన్న తనంలో వేశ్యావ్యతిరేకి. కాని ఆమె వ్యక్తిత్వం పట్ల అతను ఆకర్షితుడయ్యాడు. దాంతో ఆమెదగ్గరికి తరుచువచ్చేవాడు. ఒకసారి అతను వచ్చినప్పుడు ఆమెకి తలనొప్పిగా వుంది. దాన్ని తగ్గించడానికి ఆమె సాధించిన విజయాల గురించి మాటాడ్లాడతను ”వాటి గురించి ఎందుకు? నా పేరు నాగరత్నం. నేను భోగరత్నాన్ని అయ్యాను. ఇప్పుడు రోగరత్నాన్ని మాత్రమే” అని పక్కదారి పట్టించింది. అయినా అతను ఆగకుండా ”ఇప్పుడు రాగరత్నం, త్యాగరత్నం కూడా” అన్నాడు. ఆమెని అభినయించమన్నాడు. అరగంటసేపు ఆమె చేసిన అభినయానికి అతను చలించి పోయాడు. ‘యాహి మాధవ’ అనే జయదేవ అష్టపదిని కూర్చునే అభినయించింది.

          1947లో ఆమెకి సుఖదుఃఖాలు ఎదురయ్యాయి. మద్రాసు ప్రధాని టి. ప్రకాశం ‘రాధికా సాంత్వనము’ మిద నిషేధం ఎత్తివేయడంతో వావిళ్ళ వారు కొత్తగా ప్రచురించారు.  దేవదాసీల సత్తా చాటడానికి ఇది ఒక అవకాశమయింది. దేవదాసి వ్యవస్థ మిద నిషేధంగురించి ఆమెచేసిన పోరాటం ఓడిపోయింది. 1947 నవంబరు 26న మద్రాసు దేవదాసి బిల్లు (అంకితాన్ని నిలుపుచేస్తూ)ని మద్రాసు శాసన మండలి చట్టం చేసింది. అన్ని ఆలయాల్లోనూ స్త్రీలని దేవుడికి అంకితం ఇవ్వడం, కుంభారతి ఇవ్వడం నిషేధించారు. వృత్తి కొనసాగించే దేవదాసీలు తగ్గిపోయారు. శాస్త్రీయ నృత్యాన్ని పవిత్రంగా, ప్రార్ధనలాగా భావించి బ్రాహ్మణ స్త్రీలు నేర్చుకోవడం మొదలయింది. అవన్నీ ఒకప్పుడు దేవదాసీలు అభినయించిన పాటలే. సినిమాల వల్ల అంతకంటే నీచమైన ప్రభావంపడుతోంది. కానీ ఎవ్వరూ దాన్ని గమనించలేదు. దేవదాసీల మిద నిషేధం అలాగే వుండిపోయింది. టి. బాలసరస్వతి లాంటి అతికొద్ది మంది మాత్రం ధైర్యంగా శాస్త్రీయ నృత్యం చేస్తూనేవున్నారు. కానీ నాగరత్నమ్మ, బాలసరస్వతి లాంటి వాళ్ళు అరుదు. చాలామంది తాము  దేవదాసీలమని చెప్పుకోవడం మానేశారు. దాంతో వాళ్ళు నేర్చుకున్నగొప్ప సంగీతనాట్య పద్ధతులు అంతరించి పోయాయి. కళాప్రపంచానికి అదొక పెద్దలోటు.

          ఆరాధనకి సమాధి దగ్గర పూజ చేసినప్పుడు త్యాగరాజుకి అంజలి ఘటిస్తూ సంగీతకారులందరూ కలిసి పాడాలని 1949లో ఆరాధన సంఘం నిర్ణయించింది. నాట, గౌళ, ఆరభి, వరాళి, శ్రీరాగాల్లో త్యాగరాజు కృతులని పంచరత్నాలు అంటారు. మొట్టమొదట నాగరత్నమ్మ తాను రాసిన త్యాగరాజు అష్టోత్తరం పాడే ముందు కుంభారతి ఇచ్చింది.  ఏ దేవదాసి అయినా ఆలయంలో అదే చేస్తుంది. నాగరత్నమ్మ ఏ గుడికీ అంకితం కాకపోయినా ఇవాళ అదే పద్ధతిలో త్యాగరాజ ఆలయంలో పూజ చేసింది. ఆ వ్యవస్థని ప్రభుత్వం నిషేధించినా, తాను స్వయంగా కట్టించిన ఆలయంలో ఆమె చేసే పూజని ఎవరూ ఆపలేకపోయారు. వెంటనే పల్లడం సంజీవరావు భైరవిరాగంలో ‘చేతులార’ అనే త్యాగరాజకృతి వేణువు మిద వాయించాక, అందరూ కలిసి పంచరత్నాలు పాడారు.

                                                                              

                                ” తొలి జన్మములను జేసిన పూజా

                                  ఫలమో లేక నీదు కటాక్ష

                                  బలమో నీ వాడను నేనని లోకులు

                                  బల్కగా ధన్యుడనైతిని”

                (త్యాగరాజు: ”సీతామనోహర”, మనోహరిరాగం, ఆదితాళం)

                                1948 నాటికి నాగరత్నమ్మ ఆరోగ్యం బాగా పాడయ్యింది. ఆమె ఆస్తికీ, నగలకి వారసులు    ఎవరవుతారా అని వూహాగానాలు మొదలయ్యాయి. సమాధి, దాని చుట్టుపక్కల భూములు తమకే దక్కాలని త్యాగబ్రహ్మ మహోత్సవ సభవారు భావించారు. త్యాగరాజు ఇంటిని ఇప్పటికే వాళ్ళు తీసేసుకున్నారు. కానీ నాగరత్నమ్మ ఆలోచనలు వేరుగా వున్నాయి.

                మద్రాసులో సావుకారుపేటలో వున్న సబ్‌రిజిస్ట్రారు ఆఫీసులో 1949 జనవరి 4న విల్లు సమర్పించారు. మర్నాడు రిజిష్టరు అయ్యింది. ఆ దస్తావేజుని జాగ్రత్తగా వుంచే బాధ్యత సి. వి. రాజగోపాలా చారిదే అయినా దాన్లోవున్న ఆలోచనలు, ప్రణాళికలు ఆమెవే.

                తను హగ్గడ దేవణ్ణ కొత్త పుట్ట లక్ష్మీ అమ్మాళ్‌ వైష్ణవి కూతురినని గర్వంగా మొదటి వాక్యంతో ప్రకటించింది. క్లుప్తంగా ఆరాధన చరిత్ర, సమాధిని పునరుద్ధరించడంలో ఆమె పాత్ర, దాన్ని త్యాగరాజు స్మారక చిహ్నంగా మలచడంలో తను చేసిన త్యాగాలు వివరించింది. చివరగా, అందరూ కలిసి ‘శ్రీత్యాగబ్రహ్మ మహోత్సవ సభ’ గా రూపొందడం, ”ఒక గొప్ప లక్ష్యం కోసం అందరూ ఏకమైనందుకు”సంగీతకారులందరినీ అభినందించింది ” ఇదే స్ఫూర్తితో ఐకమత్యంగా మనదేశపు ఈజాతీయ సంగీత ఉత్సవాన్ని భవిష్యత్తులో కూడా జరపాలని తన ఆకాంక్ష”, ప్రార్థన అని ఆమె వెలిబుచ్చింది. ఈ విల్లు ప్రకారం నాగరత్నమ్మ మరణానంతరం సమాధి చుట్టు పక్కల ప్రాంతం సభకి చెందదు. ఆమె తన ”సొంత సొమ్ముతో కొనుక్కున్న” స్థిర చరాస్తులన్నీ ట్రస్టుకి చెందుతాయి. దానిపేరు ‘విద్యాసుందరి బెంగుళూరు నాగరత్నమ్మ’. సి.వి. రాజగోపాలాచారి, టి.ఎ.రామచంద్రరావు, వి. మినాక్షిసుందరం దాని ధర్మకర్తలు. మద్రాసు తొండై మండలం స్కూలు టీచరు మినాక్షిసుందరం. నాగరత్నమ్మ మద్రాసులో ఒంటరిగా ఇబ్బందులు పడుతున్నప్పుడు ఆయన అండదండగా నిలిచాడు.

          త్యాగబ్రహ్మ మహోత్సవ సభ ఆరాధన చేసినన్నాళ్ళు సమాధి దగ్గర స్థలం వాళ్ళకి అందుబాటులో వుండాలి. ఒకవేళ సభ నిలిచిపోతే ఆరాధన చేసే వ్యక్తికి గాని సంస్థకిగాని అందుబాటులో వుండాలి అని ఆమె ప్రకటించింది. దీనికి ఒక మినహాయింపు-” దేవదాసీలతో సహా స్త్రీ కళాకారులను వేదిక మిద పాడనివ్వక పోతే మాత్రం సభకి ఆ అవకాశం వుండదని” నిష్కర్షగా చెప్పింది.

          భవిష్యత్తులో భూమిధర పెరుగుతుందనీ, సమాధి ఎదుటవున్న భూమిని వ్యాపార ప్రయోజనాలకి వాడతారేమోనని అక్కడ ఎలాంటి భవన నిర్మాణం జరగకూడదని ఆనాడే ఆమె దూరదృష్టితోషరతు పెట్టింది. ఆ స్థలానికి వున్న పవిత్రత, ప్రశాంతత చెడిపోతుందని ఆమె భయం. సమాధి దగ్గర  హిందూ ధర్మం ప్రకారం మంత్రోచ్చారణ, భజనలు, కచేరీలు ఎవరైనా చెయ్యొచ్చు. అయితే రోజు వారీ పూజ రాముడు భాగవతార్‌, అతని వంశీయులే చెయ్యాలని ప్రకటించింది. కాని వాళ్ళు ధిక్కరించినా, సరిగా ప్రవర్తించక పోయినా వాళ్ళని తీసెయ్యాలని స్పష్టంచేసింది. అలా జరిగితే వాళ్ళ బదులు మరేదైనా తెలుగు బ్రాహ్మణ కుటుంబం పూజచెయ్యాలని చెప్పింది. ఎవరూ దొరక్క పోతే తమిళ పురోహితుడు చెయ్యాలని చెప్పింది.

          మద్రాసు ప్రెసిడెన్సీలో కొన్ని చోట్ల నాగరత్నమ్మ ఆర్థిక సాయం అందించే రకరకాల ధార్మిక సంస్థల వార్షిక పూజల జాబితా ఆ విల్లులో వుంది. మద్రాసులోనూ, మైసూరులోను వివిధ ఆలయాల్లో ప్రత్యేకమైన రోజుల్లోనూ, తల్లి వర్థంతి నాడు చేయాల్సిన పూజలు ఆ జాబితాలో వున్నాయి. వీటి జమా ఖర్చులు ఎలా వుండాలో ఆమె నిర్ణయించింది. ప్రతి సంవత్సరం ట్రస్టు ధర్మకర్తలు వాటిని నిర్వహించాలి. మైసూరులో తీసుకున్న దేవతల పటాలు, తను రోజూపూజ చేసుకునే విగ్రహాలు అన్నీ సమాధి దగ్గర చేసే పూజలో పెట్టింది. అక్కడ ఆచరించాల్సిన పూజా విధానం, పెట్టాల్సిన నైవేద్యం గురించి స్పష్టంగా వివరించింది.

          విల్లులో చివర తన ఆస్తుల, నగల జాబితాఇచ్చింది. తన తదనంతరం అవి ట్రస్టుకి చెందాలని రాసింది.

          విల్లు రాయడం అయిపోయాక నాగరత్నమ్మ తిరువయ్యారులో ప్రశాంతంగా గడిపింది. త్యాగరాజు ఉంఛవృత్తి చేస్తూ నడిచిన ఆవీధుల్లో నడుస్తూ ఆయనవున్న ఇంటిని, ఆయన స్నానం చేసిన నదిని చూస్తూ, ఆయన కీర్తనలు పాడుతూ, ఆయన సమాధి దగ్గర పూజలు చెయ్యడం-ఇవిచాలు ఆమెకి. జీవితంలో మరే  ఆపేక్షలూలేవు. ఎప్పుడైనా మద్రాసు, నవరాత్రికి వెంకటగిరి వెళ్ళడం తప్ప మిగిలినప్పుడు ఇంట్లోనే వుండేది. కాని త్యాగరాజుకి సంబంధించిన కార్యక్రమమేదైనా వుంటే శక్తి పుంజుకుని మరీ అక్కడికి వెళ్ళేది. అలా ఆమె మధురై ఆరాధనోత్సవానికి, ఆరోగ్యం బాగోకపోయినా వెళ్ళింది(1948). బిడారం కృష్ణప్ప దగ్గర తనతో పాటు సంగీతం నేర్చుకున్న ప్రముఖ వయొలినిస్ట్‌ టి.చౌడయ్యతో పాటు అధ్యక్షత వహించింది. ఆ సందర్భంగా పోటీల్లో గెలిచిన చిన్నకుర్రాడికి వాళ్ళిద్దరూ తంబుర బహూకరించారు. అతనే తర్వాతికాలంలో పేరుపొందిన గాత్ర విద్వాంసుడు మధురై జి.ఎస్‌. మణి.

          సంగీతకారులు, భక్తులు ఆమె ఇంటికి వస్తూనే వుండేవారు. వాళ్ళందరికీ త్యాగరాజు పటాలు బహూకరించేది. వారిలో ఆమె శిష్యురాలు జానకి కూడా వుంది. కొండి జాతిలో చివరిది పి. ఆర్‌. తిలగం కూడా అలా వచ్చింది. చిన్నతనంలో, తిరువారూరులో దేవుడి ఎదట కొండిలు నాట్యంచేసే పారంపర్యపుహక్కుని నాగరత్నమ్మ సవాలు చేసింది. అవి ఆమె దేన్నీ లెక్కచెయ్యని యవ్వనంలోవున్న రోజులు. కుట్టి అమ్మాళ్‌ మనుమరాలిగా తిలగం తననితాను భయంభయంగా పరిచయం చేసుకుంది. కానీ నాగరత్నమ్మకి ఇప్పుడు ఎవరి మిదా వ్యతిరేకత లేదు. తిలగం ఒక గొప్ప వంశం నుంచి వచ్చిందని ప్రశంసాపూర్వకంగా చెప్పింది. 

          స్త్రీలు సాధించిన ఏ విజయమైనా ఆమెకి అమితానందం ఇచ్చేది. బాగా పాడిన చిన్నపిల్లలని ఆశీర్వదించేది. కె.యం. సౌందర్యవల్లి అనే గృహిణి తను త్యాగరాజు మిద రాసిన కొన్ని రచనలు నాగరత్నమ్మకి పంపినప్పుడు ఆమె ఆనందానికి హద్దుల్లేవు. ఆమెని మెచ్చుకుంటూ జాబురాసింది.5  అప్పటికింకా చిన్నవాడైన వాగ్గేయకారుడు ఓగిరాల వీరరాఘవశర్మ రచనలనికూడా ఆమె ప్రశంసించింది.

          సమాధికోసం ఆమె చేసిన సేవకి కూడా గుర్తింపు వచ్చే సమయం ఆసన్నమయింది. మహిళల పత్రిక ‘గృహలక్ష్మి’ ని స్థాపించిన డా|| కె.ఎన్‌. కేసరి ఏటా సాహిత్యం, కళలలో ఘనత సాధించిన స్త్రీలకి స్వర్ణకంకణం బహూకరించేవాడు. సాహిత్య సాంస్కృతిక రంగాలలో ‘గృహలక్ష్మి’ కకంకణ బహుమతి చాలా ప్రతిష్టాత్మకంగా భావించేవారు. రాయపేటలో కేసరి కుటీరంలో 1949, మార్చి 16న విజయనగరం మహారాణి విద్యావతీదేవి అధ్యక్షతన నాగరత్నమ్మకి స్వర్ణకంకణ బహుమతీ ప్రధానం జరిగింది. ఈ సందర్భంలోనే మద్రాసు మహిళలు ఇచ్చిన ‘త్యాగసేవాసక్త’ బిరుదు, స్వర్ణకంకణం కన్నా ఆమెకి ఎక్కువ ఆనందాన్నిచ్చి వుంటుంది. కేసరితో సహా మిగిలిన వక్తలు ఆమె జీవితంలో ముఖ్యఘట్టాలని ప్రస్తావిస్తూ ఆమె సాధించిన విజయాలని ప్రశంసించారు. ఆరోజు ఆమెకి మధుర జ్ఞాపకంగా మిగిలి పోయింది. ఒకప్పుడు గాయనిగా రూపు దిద్దుకోవడానికి తను ప్రోత్సహించిన వై.ము. కొత్తైనాయకి ఇప్పుడు ‘జగన్మోహిని’ అనే స్త్రీల పత్రికకి సంపాదకురాలు, ప్రచురణకర్తగా ప్రఖ్యాతి పొందింది. ఆమె ఈ సభకి వచ్చింది. అప్పుడప్పుడే కర్ణాటక సంగీత విద్వాంసురాలిగా, సినీ నేపథ్యగాయనిగా పేరులోకి వస్తూన్న ఎం.ఎల్‌. వసంతకుమారి ప్రార్థనాగీతం పాడింది.

          తిరువయ్యారు నుంచీ నాగరత్నమ్మ స్నేహితురాళ్ళు ఒక సందేశం పంపారు. ”శ్రీరాముడినీ, శ్రీకృష్ణుడిని ఎవరూ చూడలేదు. కొద్దిమంది వాళ్ళ భక్తుడు త్యాగయ్యని చూశారు. నాగరత్నమ్మ వల్ల ఆయన భక్తిని దర్శించే భాగ్యం మనకి కలిగింది”

          ఎప్పటిలాగా ”గృహలక్ష్మి” స్వర్ణకంకణాన్ని నాగరత్నమ్మ త్యాగరాజు సమాధికి సమర్పించలేదు. ‘శారదానికేతన్‌, అనే వితంతువుల పునరావాస కేంద్రానికి ఇచ్చేసింది. 1949 ‘గృహలక్ష్మి’ సంచికలో ఆమె గురించి చాలా వ్యాసాలు రాశారు.

          మళ్ళీ తిరువయ్యారులో ఆమె జీవితం యధావిధిగా కొనసాగింది. తన శిష్యురాలు జానకి పెళ్ళికి మాత్రం మద్రాసు వెళ్ళింది. పెళ్ళిఅయాక జానకి బీహారు వెళ్ళిపోతుంది. హరికాంభోజిరాగంలో ‘దినమణివంశ’అనే త్యాగరాజకృతి పాడి నాగరత్నమ్మ కొత్త దంపతుల్ని దీవించింది.

          1951 నాటి ఆరాధన వచ్చింది, పోయింది. ఆమె దాన్లో కచేరి చెయ్యలేదు. కానీ ఎప్పటిలాగేపంచరత్నాలకి ముందు సంగీత శ్రద్ధాంజలి ఘటించింది. అప్పటి భారత ప్రభుత్వపు హోంమంత్రి సి.రాజగోపాలాచారి ఉత్సవాలని ప్రారంభించాడు. తన ప్రసంగంలో నాగరత్నమ్మ ఒక సన్యాసిని అనీ, మనం ఆ యోగిని లక్ష్యాలని అనుసరించాలని కోరాడు. 1940లో తను వచ్చినప్పుడుకూడా సంగీతకారులు ఆమె దగ్గరకి భయభక్తులతో రావడం గమనించానని అన్నాడు.8  అది విని ఆమె ఎగతాళిగా నవ్వింది. ఆయనా కాంగ్రెసు పార్టీ సభ్యుడే. ఆపార్టీ సభ్యులే దేవదాసీ వ్యవస్థ నిర్మూలన కోసం పోరాడారు. వాళ్ళు వేశ్యలతో సమానమని కూడా అన్నారు. ” నేను కేవలం ఒక దేవదాసీనే అని ఆయనకి చెప్పండి” అంది.  ఈ ఉత్సవాన్ని గురించి రాయడానికి వచ్చిన ‘హిందూ’ విలేఖరి తో ఆమె సంభాషిస్తూ ఉత్సవం ఘనంగా జరుగుతున్నా దాన్లో పవిత్రత, నిబద్ధత కన్నా ఆడంబరం, ప్రదర్శన ఎక్కువ కనిపిస్తోందంది. చాలా మంది సంగీతకారులు  ఆసందర్భానికి వున్న ప్రత్యేకతని పక్కకి పెట్టి, తమ విద్వత్తుని మాత్రమే ప్రదర్శిస్తున్నారని ఆమె బాధ. త్యాగరాజు ఆలయానికీ, సంగీత సభావేదికకీ మధ్యవున్న స్పష్టమైన భేదం చూపించాలి. మైకులూ, స్పీకర్లు పెట్టడం వల్ల సమాధి దగ్గర ప్రశాంతతకి భంగంకలుగుతుందని ఆమె ఆక్షేపణ. ఆలయంలో కళాకారులకి కనీసం రెండేసి గంటలు పాడేందుకు అవకాశమివ్వాలని ఆమె కోరిక. త్యాగరాజ సంగీతాన్ని ప్రచారం చేసేందుకు మరింత మంది స్త్రీలు ముందుకురావాలనేది ఆమె కల. తిరువయ్యారులో సంగీత పాఠశాలలూ, ఆశ్రమాలూ, భజన మందిరాలూ, గ్రంథాలయాలు స్థాపించాలి. అప్పుడు ఆ ఊరు విద్యాకేంద్రంగా రూపు దిద్దుకుంటుందని ఆమె ఆశించింది.  ఇప్పుడు తిరువయ్యారులో ఆరాధన పేరుతో జరుగుతున్న అవకతవకలు ఆమెకి చాలా చికాకు. అందరూ కలిసి చెయ్యడంతో ఇంత గోలా గందరగోళం జరుగుతోందేమోనని ఆమె బాధపడి వుంటుంది.

          ఆరాధన పూర్తికావడంతో మళ్ళీ తిరువయ్యారులో ప్రశాంతత నెలకొంది. ఆరాధన జరుగుతున్నన్నాళ్ళూ తెలివిగా వాటికి దూరంగావున్న త్యాగరాజు కూడా తిరిగి తన సమాధికి చేరుకున్నాడని ఒక తుంటరి వ్యాఖ్యానం. అక్కడున్న వాళ్ళల్లో నాగరత్నమ్మే నిక్కమైన భక్తురాలు. తను కోరుకున్నంత సేపు సమాధి దగ్గర కూర్చుని త్యాగరాజు కీర్తనలు పాడుకునేది. ఆమె గాత్రం మాత్రం ఎప్పటిలాగే గంభీరంగా వుంది. దారినపోయే వాళ్ళు ఆగి ఆమె పాటలు వినేవారు. పాటకి తాళం వేస్తున్నట్టుగా గాలికి ఊగుతూన్న ఆకులు, గలగలమని ప్రవహించే నది అలలు ఒక దివ్యానుభూతిని కలిగించేవి.

– వి.శ్రీరాం
అనువాదం:టి.పద్మిని

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
ఈ పుస్తకాన్ని ప్రచురించడానికి అనుమతించిన హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారికి , గీతా రామస్వామి గారికి కృతజ్ఞతలు .
Gita Ramaswamy,
Plot No. 85, Balaji Nagar, Gudimalkapur,
Hyderabad 500 006

ధారావాహికలు, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో