ఈ యుద్ధ పర్యావసానం ఎలా వుంటుందో తెలియదు. అతడితో ఏకాంతంగా సంభాషించగోరి క్రొత్త పెళ్లికూతురు ఉత్తర అతడిని చాటుకు పిలిపించి ఎంత హృద్యమైన పద్యమో చూడండి.
చిన్నది విరటుని కూతురు ఉత్తర (ఉత్తరా నక్షత్రం వుంది కదా) నక్షత్రకులావతంశుడు చుక్కలరేడు వంశశిరోభూషన అభిమన్యుడిని నక్షత్రమునకు మూల చాటుకు (మూల నక్షత్రం పిలచిందట) కొత్త పెండ్లి కొడుకు అభిమన్యుడు కాళ్ళ పారాణి ఆరకుండానే కదన రంగానికి తరలవలసి వచ్చింది. నూతన వధువు ఉత్తర భర్తకు వీడ్కోలు చెప్పగోరి నలుగురిలో మాట పెగలక చాటుకు రమ్మని సైగ చేసింది కాబోలును. ఒక విజ్ఞాన ఖనిలో ఎంతటి సాహితీ ప్రవీణ్యత వుందో చూడండి. పురుషోత్తంగారు నయాగరా జలపాతం వంటి వారి ఉపన్యాస రaరితో ఆర్షధర్మ విశిష్టతనీ సర్వులకూ ఆర్షధర్మాన్ని పాటించవలసిన ఆవశ్యకతనీ చాటి చెప్పేవారు. సత్యనారాయణగారు ప్రపంచ యుద్దం కారణంగా దేశంలో ఏర్పడుతున్న దుస్థితినీ, ద్రవ్యోల్పణాన్ని అరికట్టవలసిన ఆవశ్యకతనీ వివరించే వారు. ఆధునిక కవిపుంగవులు నాడు దేశంలో వికసిస్తున్న భావ కవిత్వాన్ని, వంగ భాషా సాహిత్యపు అనువాదాల మాధుర్యాన్ని సుమధుర శైలిలో సభ్యులకు పరిచయం చేసేవారు. వారం రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాన్ని కళాశాల సిబ్బంది, విద్యార్థులు ఎంతో దక్షతతో నిర్వహించేవారు.
బ్రహ్మ మత ప్రభావం వలన మూఢాచారాలకు వ్యతిరేకులైన సీతా అనసూయలు సంప్రదాయానికి మాత్రం వ్యతిరేకులు కారు. మన సంప్రదాయాలపై వారికి విశేష మక్కువ. స్వగ్రామంలో కాకినాడలో జరిగే సంప్రదాయ వేడుకలలో, దేవతా ఉత్సవాలలో, దేవాలయోత్సవాలలో జాతరలలో నోములూ, వ్రతాలలో వారు ఎంతో ఆసక్తితో పాల్గొనేవారు. వానిలోని సహజ సౌందర్యానికీ మనోజ్ఞతకు ముగ్థులైన వారు వాటిని పాటించి ప్రచారం చేయడానికి నిశ్చయించుకున్నారు. పెళ్ళిళ్ళలో పాడే వరుస పాటలనెన్నో వారు మధురంగా పాడేవారు. తరువాతి కాలంలో ఆ సోదరీమణులు ఆ పాటలకు విశేష ప్రచారాన్ని కలుగజేసారు. అనసూయ గారు స్త్రీల సంప్రదాయపు పాటలు అనే పేరుతో ఎన్నో నోము పాటలు సంకలనం చేసారు. వాటిలో శ్రావణ మంగళవారం పాట, శ్రావణ శుక్రవారపు పాటలతో పాటు కొన్ని అరుదైన పాటలు కూడా వున్నాయి. సీతగారు జానపద గేయ సాహిత్యంలో విశేష కృషి చేసి ఎన్నో పాటల్ని ఆలిండియా రేడియో ద్వారా ప్రచారం చేసారు. చిన్న నాటి వారి స్వగ్రామంలోనూ, పిఠాపురంలోనూ, కాకినాడలోనూ ఉత్సవాలలో సంప్రదాయపు వేడుకల్లో విన్న ఎన్నో పాటలను సంస్కరించి ప్రచారం చేసారు. ‘అన్నాడే వస్త నన్నాడే నా నేస్తము విడువలే నన్నాడే.
20వ శతాబ్ధపు ప్రథమార్ధం ముగిసే వరకూ నోములు, వ్రతాలు హిందూ స్త్రీల జీవితంలో ప్రముఖ స్థానం వహించాయి. ఆరోగ్యాన్ని కలిగించే కొన్ని అలవాట్లు అలవరచుకోవడానికీ, బాలికలలో అధ్యాత్మిక భావాన్నీ, ఆత్మ స్థైర్యాన్ని కలిగించడానికీ నోములు ఉద్దేశింపబడ్డాయి. సావిత్రీ, గాయత్రీ, సరస్వతులు సంధ్యావందన వేళ ఉపాసింపబడే సంధ్యాధిష్ఠాన దేవతలు ‘సవితురపత్యం సావిత్రీ’’ ఈ సావిత్రీ దేవి ఆది పరాశక్తి అంశ. ఈ సావిత్రి వరం వల్ల పుట్టిన అశ్వపతి అనే రాజు కూతురు మన కథలోని సావిత్రి గౌరీదేవి. తన ఆత్మ శక్తితో యముని మెప్పించి అల్ఫాయుష్కుడైన భర్తను దీర్ఘాయురోపేతుని చేసుకున్నది ఆమె. నన్నయ గారి భారతంలో సావిత్రి యముని మెప్పించిన తీరు హృద్యంగా చిత్రించబడిరది. ఆ పద్యాలు వేద ఋక్కులులా పవిత్ర భావాన్ని కలిగిస్తూ వేద ఋక్కులకు భాష్యాలలా వుంటాయి.
సంక్రాంతి పండుగ మూడు రోజులూ అయ్యాక నాలుగవ రోజు ముక్కనుమ. ఆనాడు సావిత్రీ గౌరీదేవి వ్రతం ప్రారంభం అవుతుంది. ఈ వ్రతం తొమ్మిది సంవత్సరాలు ఏటా తొమ్మిది రోజుల పాటు నియమ నిష్ఠలతో ఆచరించాలి. వ్రత దీక్షలో భంగం కలిగితే మరో ఏడాది ఈ వ్రతం ఆచరించాలి. ముక్కనుమనాడు ఉదయాన్నే నూతనంగా వివాహమైన బాలికలు బొమ్మల నోము పడతారు. ఉదయాన్నే తలంటు స్నానం చేసి, మడిగా ఆర వేసిన పట్టు చీరలు ధరించి నోము పట్టే వారింటికి పూజా ద్రవ్యాలతో నైవేద్యాలతో చేరుతారు. అక్కడ ఒక సావిడి శుభ్రంగా బూజులు దులిపి, అలికి ముగ్గులు పెట్టి, గడపలకు పసుపు కుంకాలు అలది, గుమ్మాలకు మామిడాకుల తోరణాలు కట్టి సిద్ధం చేసి ఉంచుతారు ఆ ఇంటి వారు గది మధ్యలో ఉయ్యాల గొలుసులు గట్టిగా అమర్చి ఓ నలు చదరపు పెద్ద సైజు పీటకు పసుపు పూసి, కుంకుమ, వరిపిండి, పసుపుతో పద్మాలు పెట్టి ఉయ్యాల ఏర్పరుస్తారు. బల్ల క్రింద సారవంతమైన పుట్ట మన్ను తెచ్చి పోసి నీటితో తడిపి పదును చేసి వుంచుతారు. సావిడిలో ఈశాన్యపు మూల గాలి తగలని చోట ఓ పెద్ద మట్టిమూకుడులో అఖండజ్యోతి వెలిగిస్తారు. ఈ జ్యోతి నోము తొమ్మిది రోజులు అహోరాత్రాలూ ఆరిపోకుండా వెలగాలి. ఇంటిలోని వృద్ధ ముత్తయిదువులు ఈ అఖండజ్యోతిని శ్రద్ధాభక్తులతో సంరక్షిస్తారు. నోము పట్టే ముత్తయిదువులు మంగళ వాయిద్యాలతో బయలుదేరి దేవాలయ ప్రాంగణంలో బొమ్మలతో నిరీక్షించే కుమ్మరివాని వద్దకు వెడతారు. బంకమట్టితో స్థూపాకారంగా బొమ్మలను తయారు చేస్తాడు కుమ్మరి. మధ్య మధ్య నొక్కులతో ఉన్న ఈ సావిత్రి గౌరీ దేవి ప్రతిమల్ని నోము పట్టే ముత్తైదువులంతా తలో ఐదు తెచ్చుకొంటారు. కుమ్మరి వానికి పారితోషికం చెల్లించి సావిత్రీ గౌరీ దేవిని కీర్తిస్తూ ఈ బొమ్మల్ని నోము పట్టే ఇంటికి తెచ్చుకొనే సరికి అయ్యవారు ( పూజ చేయించే పురోహితుడు) వచ్చి సిద్ధంగా వుంటారు.
ఉయ్యాల చుట్టూత నేల మీద నోము పట్టే ముత్తయిదువులంతా తడి చేత్తో అలికి వరి పిండితో తలో 9 పద్మాలు పెట్టుకొంటారు. ఆ పద్మాలపై పసుపూ కుంకుమ అక్షతలూ, పూలు జల్లుతారు. తొమ్మిది పోగులు కల వత్తిని ఆవు నేతితో తడిపి ఆ కుందెలో వుంచి బల్లపై వుంచుతారు మంత్రయుక్తంగా బొమ్మలలో సావిత్రి గౌరీ దేవిని ఆవాహన చేసి బల్లపై వేంచేపు చేయిస్తారు. పసుపు, కుంకుమలతోనూ, పూలతోనూ వీటిని అలంకరించాక వ్రతం నిర్విఘ్నంగా కొనసాగటానికి విఘ్నేశ్వరుని పూజించి ఉద్వాసన చెప్పాక నవ ధాన్యాలను పాలతో తడిపి బల్ల క్రింద సిద్ధంగా వున్న పుట్ట మట్టిలో వీటిని అంకురారోపణ చేస్తారు. గోధుమ, వరి, బొబ్బర్లు, ఉలవలు, శనగలు, కందులు, నువ్వులు, మినుములు, పెసలు, నవధాన్యాలు, సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, రాహువు, కేతువు అను వారు నవగ్రహాలు. ఈ నవగ్రహాలకు ప్రీతికరమైన ఈ నవధాన్యాలు నవగ్రహాల ఆనుకూల్యం కోసం మంత్రయుక్తంగా చల్లి మొలకెత్తింప చేస్తారు. సారవంతమైన పుట్ట మట్టిలో ముత్తయిదువుల సంరక్షణలో ఈ మొక్కలు ఏపుగా పెరిగి నయనానందకరంగా వుంటాయి. మూడవ నాటి నుంచి నోము ముగిసే వరకూ. శ్రీ సూక్త విధిగా సావిత్రీ గౌరీ దేవికి అర్చన జరుగుతుంది. నైవేద్యాలకు కూడా ఓ ప్రత్యేకమైన విధానం వుంది. ఆ ప్రకారం తొమ్మిది రోజులూ తొమ్మిది రకాల దినుసులు నైవేద్యం చేయాలి. తరువాత వారు ముత్తయిదువులకు వాయనం ఇవ్వాలి. ఈ వాయనం అందుకోవడం మహాఫలప్రదమని భావించి 9 మంది పెద్ద ముత్తయిదువులు మడి కట్టుకొని సిద్ధంగా వుంటారు. పూజ ముగిసాక నోము నోచే ముత్తయిదువులు ఎదురుగా కొన్ని బియ్యం పోసుకొని సావిత్రీ గౌరీదేవి ఎదుట నేలపై కూర్చొంటారు. రెండు ముంజేతులనూ ఒక దానిపై ఒకటి వుంచి ఆ గుప్పెళ్లలో బియ్యాన్ని తీసుకొని వాటిని కొద్ది కొద్దిగా క్రిందకు వదులుతూ తల్లి దండన, తండ్రి దండన, అత్త దండన, మామ దండన, పురుషదండన, పుత్ర దండన సావిత్రి గౌరీ దేవమ్మా! తల్లీ! ఏ దండనా లేకుండా చూడు అని సావిత్రీ దేవిని ప్రార్థిస్తారు. ఈ కార్యక్రమాన్ని దండనాలు అంటారు. తన సమీప బంధువులంతాతన పట్ల సహృదయంతో వుండాలని ఆ నూతన వధువు సావిత్రీ గౌరీదేవిని ప్రార్థిస్తుందన్నమాట. కర్పూర హారతి వెలిగించి, ఆ స్త్రీలంతా ఈ విధంగా పాడతారు.
ప॥ హారతులివ్వరే అంగనలందరు ఆనందము తోడన్।
నీరజ నేత్రికి సావిత్రీ దేవికి సత్యవంతుని ప్రియ సతికీ॥
చ॥ మంగళ వాద్యముల్ మండపమందున`మగువలు ప్రాణ ప్రతిష్టల్
బంగారు పళ్లెములో అంగనలందరు ` ఆవాహనాక్షంత లిడగన్ ॥హారతు॥
- కూరిమితోడుత కుంకుమ పసుపులు ` కోమలులందరు ఒసగన్
నిమ్మరాజు వేంకటరమణయ్యకు నీరజ నేత్రికి సావిత్రీ దేవికి ॥హారతు॥
- పూజలు చేయుచు పూబోణులందరు`పుట్టిన రోజున పుల్గం
మధురాన్నంబు రాజాన్నంబు` రమణికీ చలిమిడి రమణులొసంగ ॥హారతు॥
- మూడవ రోజున ముద్ద కుడుములు `హోహనాంగికి వొసగన్
నాల్గవ రోజున నానబ్రాలు మహానైవేద్యంబులిడగన్ ॥హారతు॥
- ఐదవ రోజున ఆరగింపుసేయ` అతివలు అప్పాల్ సావిత్రి దేవికి
ఐదవ తనమిమ్మని శాశ్వతముగ ఆరవనాడు గారెల్ ॥హారతు॥
- ఆరున్నొక్కో రోజున అట్లు అవసర నైవేద్యంబులిడగన్
నిమ్మరాజు వెంకటరమణయ్యకు` నీరజ నేత్రికి సావిత్రి దేవికి ॥హారతు॥
- ఎనిమిదవ రోజున ఏలకులు ద్రాక్షా ఎన్నో వేసి చేసిన పరమాన్నం
నీరజనేత్రికి సావిత్రి దేవికి`మహానైవేద్యం బులిడగన్ ॥హారతు॥
- తొమ్మిదవ రోజున తోడి తెండి కలగాయ పులుసులను
పిండి వంటలతో సావిత్రి దేవికీ `మహా నైవేద్యంబులిడగన్ ॥హారతు॥
- పేరంటాండ్రందరు భోంచేసి` పెరుగూ అటుకులు ప్రసాదముంచీ
ఊరేగింపుతో వాలలాడి వచ్చి`లాలయూచెదరు ॥హారతు॥
తొమ్మిది రోజులు పూజా విధి. నైవేద్యాలు ఈ పాటలో చెప్పారు కదా. నానవాలు అంటే బియ్యం కడిగి తడి ఓడ్చి వాటిలో తరిగిన బెల్లం పొడి కలుపుతారు. ఇది బలవర్థకమని ఆ రోజుల్లో కొద్దిగా తినేవారు. కలగాయపులుసు అంటే గుమ్మడి, ఆనప, వంగ, బెండ, పొట్ల, మునగ, చిలగడదుంప మొదలైన తొమ్మిది రకాల ముక్కలతో తయారు చేసే పులుసు. ఈ పులుసు గౌరీ దేవికి ప్రీతికరమని మహానివేదనలో సమర్పించేవారు. ఎత్తుగా వున్న ఊయల బల్లపై పసుపు, కుంకుమలతో రంగు రంగుల సువాసనలు వెదజల్లే పూలతో, దీప ధూపాలతో గౌరీదేవి నేత్ర పర్వం చేస్తుంటే బల్ల క్రింద మొలకెత్తిన నవధాన్యాల మొక్కలు, పద్మాలు, ఓ వారగా అఖండ దీపం రంగు రంగుల పట్టు చీరల్లో అలంకారాలతో నోము నోచే వనితలు, పార్వతీదేవి ప్రతి రూపాల్లాంటి పూజలో సహాయం చేయడానికి, వాయినాలు అందుకోవడానికి వచ్చిన నడివయస్సు ముత్తయిదువులు ఆహా! ఆ నాటి ఆ దృశ్యం నేత్ర పర్వం కదా. ‘‘సావిత్రీ గౌరీ దేవమ్మ నీకు సాటి ఎవ్వరూ లేరే కొమ్మా అని (కొమ్మ అనగా స్త్రీ) మంగళ హారతి ఇదిగో మహారాజ రాజపుత్రీ । సావిత్రీ వరమునాను పుట్టినా దానవమ్మా। అని హారతీ గైకొనుమా అంబ సావిత్రీ దేవి కోరిన వరములిచ్చే కోమలాంగిరోవేగ’’ అని వనితలు సావిత్రీ దేవిని కొనియాడుతూ పాటలు పాడుతారు. మంగళ శుక్రవారాల్లో సాయం వేళ సావిత్రీ దేవికి హారతి ఇచ్చే కార్యక్రమం వుంటుంది. నోము నోచుకునే స్త్రీలో వారి సమీప బంధువులో సావిత్రీ గౌరీ దేవికి హారతి ఇచ్చుకుంటాం రమ్మని తెలిసిన ముత్తయిదువులందర్ని బొట్టు పెట్టి పిలుస్తారు. వారు శుభ్రంగా స్నానం చేసి, మంచి చీరలు, నగలు, పూలు దాల్చి పళ్ళేలతో పసుపు, కుంకుమ, పూలు, పళ్లు, సావిత్రీ దేవికి కానుకలు తీసుకొని పూజ జరిగే చోటుకు వెడతారు. తాము తెచ్చిన పూజా ద్రవ్యాన్ని నోము నోచే వారి పూజా ద్రవ్యాలతో కలపమని కోరుతారు. శ్రీసూక్త విధితో పూజ చేసి, లలితా సహస్రం, లక్ష్మీ సహస్రం చదివి పురోహితుడు పూజ చేయిస్తాడు. కర్పూర హారతులిస్తూ మత్తయిదువులంతా సావిత్రీ గౌరీదేవిని కొనియాడుతూ పాటలు పాడుతారు. పూజ చూడటానికి వచ్చిన ముత్తయిదువులందరిని సావిత్రీ గౌరీదేవికి ప్రతిరూపాలుగా భావించి పసుపు కుంకుమలతోనూ ప్రసాదాలతోనూ సత్కరిస్తారు. ఈ విశేష పూజ జరిగిన రోజు రాత్రి నోమునోచిన వారు భోజనం చేయరాదు. ఏదైనా ఫలహారం చేస్తారు.
యముడంతటి వాడిని మెప్పించిన ఈ వ్రతానికి నియమాలు కొంచెం కఠినంగానే వుంటాయి. బాలికలు అంతక్రితం తినే చల్దిఅన్నం ఆ తొమ్మిది రోజులు తినరాదు. అప్పుడప్పుడే వస్తున్న కాఫీ కూడా పూజ ముగిసే వరకూ సేవించరాదు. పూజ నైవేద్యాలు, వాయనాలు ముగిసే వరకూ ద్రవ పదార్థాలు కూడా ఏమి తీసుకోరాదు. ఆ తొమ్మిది రోజులూ బ్రహ్మచర్య వ్రతం పాటించకపోతే నోము బెడిసి కొడుతుంది. (కీడు జరుగుతుంది) అని నమ్మేవారు. నోము పట్టిన రోజు కాని, తొమ్మిదవ రోజున గాని ఆశౌచం ఏర్పడితే నోము మరో సంవత్సరం ఆచరించాలి. మిగతా రోజుల్లో విఘ్నం జరిగితే ఆయా నైవేద్యాలు, వాయనాలు మరో రోజున తీర్చాలి. తొమ్మిదవ రోజు వేడుక చెప్పతరం కాదు. పేరంటాళ్ళంతా భోజనాలు చేసి, ఇంచుక విశ్రమించి చక్కగా తలలు దువ్వుకొని, పూలు ముడిచి, ముఖం కడుగుకొని, కాటుక, బొట్టు పెట్టుకొని, చక్కని చీరలు రవికలూ తాల్చి, తమకు వున్న నగలన్నీ అలంకరించుకొని తయారవుతారు. పళ్ళేలలో బుక్క బుగ్గుండ అనే లేత గులాబీ రంగు పొడి, పెరుగులో నానబెట్టుకొనిన అటుకులు కల గిన్నె ఓ చేతా పట్టుకొని సావిత్రి గౌరి దేవమ్మ కొలువై వున్న ఇంటికి చేరుతారు. మంగళ వాద్యాలతో ఊయల బల్లను క్రిందకు దింపి అయ్యవారు మంత్రయుక్తంగా పూజ చేయించాక ఉద్వాసన చెప్పి, ఎవరి బొమ్మలను వారు పళ్ళాలలో పెట్టుకొని ఊరి మధ్యగా వున్న చెరువుకో, నదీ తీరానికో అంతా చేరుకుంటారు. అక్కడ బుక్కా బుగ్గుండా చల్లి, తాము తెచ్చిన పెరుగు, అటుకులూ నివేదన చేసి దేవిని ఓలలాడిస్తారు. (వాలాలు అనగా జల క్రీడలు) పూజా ప్రతిమల్ని జల నిమజ్జనం చేస్తారు. పవిత్ర భావంతో పూజించిన దేవతా ప్రతిమల్ని ఎవరూ పొరపాటున తాకడం, త్రొక్కడం చేయకుండా జల నిమజ్జనం చేయడం ఆచారం. నోము పట్టినందుకు గుర్తుగా రెండు బొమ్మల్ని పళ్లెంలో పెట్టి ఇంటికి తెచ్చుకుంటారు. నోము పట్టే రోజున వాలాడిరపు రోజునా మంగళ వాద్యాలు డోలు సన్నాయి ఏర్పాటు చేసుకుంటారు. జలాశయంలో నీటిని చేత్తో చరుస్తూ, చూస్తి చూస్తి, ఏమి చూస్తి, దేవి దేవరలను చూస్తి దేవీ దేవరలు ఏమి చేస్తున్నారు. రత్నాలు, ముత్యాలు జూదమాడుతున్నారు. అందు ఎవరు గెలిచారు.? ఎవరు ఓడారు? ఇద్దరు ఒకటే సమం. అందుకు ఎవరు సాక్షి? నంది సాక్షి, నాగుమయ్య సాక్షి, ఎడనున్న ఎల్లమ్మ సాక్షి, కడనున్న గంగమ్మ సాక్షి సావిత్రి గౌరి దేవమ్మ తల్లీ నాకు నువ్వు సాక్షీ నీకు నేను సాక్షీ. అని చెప్పు కొంటారు. ముల్లోకాలకూ తల్లీ తండ్రులైన ఆది దంపతుల రహః క్రీడ ఈ ముగ్థ యువతి చూసిందట. లోక సామాన్యమైన దాపంత్యాల్లా కాకుండా వారు మహా విషయాల్లోనూ ఆట పాటల్లోనూ అన్నిటా కూడా సమ ఉజ్జి. దాన్ని చూచారు నందికేశుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు ఎల్లమ్మ, గంగమ్మ ఊరి పొలి మేరల్లో వుండే గ్రామ దేవతలు కాబోలును. ‘‘ఇసుకలో పుట్టావు, ఇసుకలో పెరిగావు. పసుపాడ పోదాము రావే శ్రీ గౌరీ అనేది సావిత్రీ గౌరీ దేవిని వాలాలాడిరచే మరో పాట. వాలాడిరపు కార్యక్రమం అయ్యాక సావిత్రీ గౌరీ దేవిని తిరిగి నోము పట్టేఇంటికి తెచ్చి ఊయల బల్లపై వుంచి పాటలు పాడుతారు ముత్తైదువులు. అక్కడకు ఆ యేటి నోము సాంగం, సంపూర్ణం అయినట్లే. రాత్రి వేళ స్నానం చేయరాదు కనుక ముత్తయిదువులు మర్నాటి ఉదయం వరకూ ఆ బుక్కతోనే వుంటారు.
సీత బొమ్మల నోము పట్టి తొమ్మిది సంవత్సరాలు నియమ నిష్ఠలతో ఆచరించింది.
సీత మూడవసారి గర్భం ధరించింది. తగినంత వ్యవధి వుండడం వలన ఈ సరికి సీత ఆరోగ్యం బాగా పుంజుకుంది. శాస్త్రి గారు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఆమెను సంరక్షిస్తున్నారు. 3వ పురుడు కనుక ఈ సారి పుట్టినింటి వారు తీసుకొని వెళ్లకూడదు. నెలతప్పిన నాటి నుంచి ఇంటి పనుల్లో తోడు పడటానికి వదిన గార్ని, పిల్లల్ని రప్పించారు. తోడల్లుడు వచ్చి దింపి 4 రోజులు వుండి వెళ్లాడు. వదినగారు తన కుమారుడికి చదువు పోతుందంటే అతడిని సంత చెఱువు వద్ద గల బడిలో చేరిపించారు. ఆసుపత్రి పరిచారకుడు రోజు ఉదయం ఆ బాలుని పాఠశాలలో దింపి, మధ్యాహ్నం 11 గంటలకు ఇంటికి తీసుకొని వచ్చేవాడు. 5 ఏళ్ళ బాలుడు అవటంవలన మధ్యాహ్నం స్కూలు వుండదు. అక్కగారు సీతకు ధైర్యం చెబుతూ తగిన సలహాలు ఇస్తూ వుండేది. పురిటి సమయానికి తల్లిదండ్రులు కూడా వచ్చారు. సుశిక్షితురాలైన మిడ్‌వైఫ్ పర్యవేక్షణలో పురుడు సక్రమంగా జరిగింది. ఆడపిల్ల కలిగింది. పిల్ల ఆరోగ్యంగా వుంది. శాస్త్రిగారి పర్యవేక్షణలో బిడ్డ పుష్టిగా పెరిగింది. పచ్చనిచాయలో చూడచక్కని పిల్ల. బంధుమిత్రులు, శాస్త్రి దంపతులు ధన్యులయ్యారని భావించారు. పిల్లకు 10వ నెల వచ్చింది. ఒక సారి తమ ఇంటికి తీసుకొని వెడతామని సీత తల్లిదండ్రులు కోరారు. పంపడం శాస్త్రిగారికి ఇష్టం లేదు. కాని మర్యాదగా వుండదని పంపారు. ఒక్క రెండు రోజులు వుండి వచ్చేయ్ దాన్ని వదిలి నేను వుండలేను అన్నారు పసిపిల్లను ఉద్దేశించి. తిరుగు ప్రయాణం చాలా కష్టమయ్యింది. నరసాపురం నుంచి కాకినాడ మీదుగా వచ్చే రైలు లేదు. నిడదవోలులో సామర్లకోటలో రెండు చోట్ల రైలు మారాలి. రైళ్లు సకాలానికి రాక ప్యాసింజర్ రైళ్లలో జనంరద్దీ వలన పసిపిల్ల పోరుపెట్టి ఏడవసాగింది. వెంట వచ్చిన అన్నగారు, సీత కూడా పిల్లను ఊరుకోబెట్టలేకపోయారు. ఏదో విధంగా ఇల్లు చేరారు. 4 రోజులు గడిచేసరికి పిల్ల పూర్వంలా చురుకుగా లేదని శాస్త్రి దంపతులు గుర్తించారు. కొంత వైద్యం చేసి చూచాక ప్రముఖ వైద్యులు వేదాంతం కృష్ణయ్య గారిని తీసుకొని వచ్చి చూపించారు శాస్త్రి. ఆయన పిల్లను పరీక్షించి శాస్త్రి గారికి పరిస్థితి వివరించారు. నేను ఏమి హామీ ఇవ్వలేను. అయినా వైద్యం జరుపుతా అన్నారు. కొంత వైద్యం జరిగాక ఆ పిల్ల చేయి జారిపోయింది. దుఃఖసాగరంలో మునిగిపోయారు శాస్త్రి దంపతులు. పుట్టుగొడ్డు వాళ్ళని వుంటారు. వాళ్ళకి పిల్లలు పుడతారు గాని దక్కరు అని బంధువులు, తెలిసిన వాళ్లు సీతను నిందించసాగారు. ఇది గొడ్రాలికన్నా బాధకరమైన విషయం. నేటి వరకూ అదృష్ట వంతురాలనీ సీతను పొగిడే వాళ్లంతా నిందించ సాగారు. ఆమె ఉత్సాహమంతా అణగిపోయి, ఆ స్థానంలో అంతులేని నిర్వేదం చోటు చేసుకుంది. శాస్త్రి గారికి కూడా మానసిక ప్రశాంతత తొలిగిపోయింది. ఆయన ఆత్మవిమర్శ చేసుకోసాగారు. తాను ఉన్న వాడు వుండక పెళ్ళి ఎందుకు చేసుకున్నట్లు, ఈ బెడద అంతా ఎందుకు తెచ్చుకొన్నట్టు ఆయన మళ్ళీ స్థిమితపడ్డారు. అన్ని ఆశ్రమాలకు ఆధారం గృహస్థాశ్రమమే. సాంబసదాశివుని దయ ఏ విధంగా వుంటే ఆ విధంగా జరుగుతుంది. ‘త్వయా హృషికేశ హృదిస్థితేన యధానియుక్తోస్మి తథాకరోమి’ అని ఆయన కొంత స్థిమిత పడ్డారు. తమ వంతు ప్రయత్నంగా కోటిగాయత్రీ, కోటి నమఃశివాయ జపం చేయ నిశ్చయించి ఉభయసంధ్యల్లో నమఃశివాయ, గాయత్రీ తలోలక్ష జపించసాగారు. సీత ఈ సరికి సీతమ్మ అయ్యింది లోకులకు. ఆమె కనిపించిన రాయికీ రప్పకు మ్రొక్కుతుంది సంతానార్థం తెలిసిన వారు ఏడుకొండల వేంకటేశ్వరునికి బిడ్డ కలిగితే ఆయన పేరు పెట్టుకొంటానని, పెద్ద తిరుపతికి వచ్చి దర్శనం చేసుకుంటామని మ్రొక్కుకోమని సలహా చెప్తే ఆ ప్రకారం చేసింది ఆమె భర్త అనుమతితో. ప్రతి ఏకాదశికి రాగి డబ్బు ముడుపు కడుతుంది.
స్వంత ఇల్లు వుండవలసిన అగత్యం ఆ దంపతులకు అవగతం కాసాగింది. తమ ఇంట్లో తాము పడి వుండటం వేరు కష్ట కాలంలో. అంతంక్రితమల్లా సీతామహాలక్ష్మి అని ఆమెను సంభావించే వారంతా ఉదయం లేవగానే ఆమె కనపడితే ముఖం వికారంగా పెట్టుకొని గొడ్రాలు అని సణుక్కుంటూ తొలగి పోయేవారు. ఇది వరకూ అంతగా పట్టింపుకు రాని చిన్న చిన్న ఇబ్బందులు ఇప్పుడు గోరంతలు కొండంతలుగా తోచసాగాయి. తల్లి ప్రోద్బలంతో ఏమయినా సరే స్వంత ఇల్లు కొంటే గాని వీలులేదని సీత పట్టుబట్టింది. ఇప్పటికి కుటుంబ అవసరాలు తీరాయి. ఓ రూపాయి వెనుక వేసుకొనే రోజుల్లో మళ్లీ ఖర్చే అన్నారు శాస్త్రి. ఏడుకొండల రాయుడు శ్రీనివాసునికి కుబేరుని వద్ద పత్రం వ్రాసి అప్పు తెచ్చి పెళ్లి చేసుకొన్నాక మనసెరిగి మందిరం కట్టి ఇచ్చే మామగారు దొరికాడు. శాస్త్రి అత్త వారికే ఆయన సహాయం చేయాలాయె. నా నగలు వున్నాయి కదా అవి అమ్మండి అంది సీత. అవును నాయనా అవసరానికి అక్కరకు వస్తాయని అనాడు నేను అడిగాను. ఇన్నాళ్ళు అది పెట్టుకుంటే కనులారా చూచి సంతోషించా. ఇప్పుడు అవసరానికి వాడుకోండి అంది. అతగాడు ఆడదాని సొమ్ము వాడుకొన్న వాడు అధముడు. నేను ఏదో తంటాలు పడి డబ్బు తెస్తా. ఇల్లు కొందాం అన్నారు శాస్త్రి. ఇంటి కోసం అన్వేషణ ప్రారంభం అయ్యింది.
అన్ని విధాల అనుకూలమైన ఇంటికోసం వెదకసాగారు. వారు వున్న ఇంటికి వెనుక వీధిలో ఓ ఇల్లు వున్నట్టుగా తెలిసింది. సీతను ఆమెకు తోడుగా వచ్చిన ఆమె పెదతల్లిని ఇల్లు చూచి రమ్మని పంపారు శాస్త్రి. వారికి ఇల్లు బాగున్నట్లు తోచింది. ఇరుగు పొరుగు వారు సహృదయులు. ఆ యింటి యజమాని ఇంకా భార్య పిల్లల్ని తెచ్చుకోలేదు. వారు సొంత ఊరిలోనే వున్నారు. ఇతడే మధ్య మధ్య వచ్చి చూసుకొని వెడుతున్నాడు మంచి ప్రదేశంలో విశాలమైన గృహం వాస్తు లక్షణయుక్తంగా సరసమైన ధరకు వుందని ఆయన అనుకొన్నాడు. గ్రంథాల నుండి అనేక వ్రత విధులను సేకరించి స్త్రీల వ్రతాల కథలు అనే గ్రంథాన్ని మూడు సంపుటాలుగా వెలువర్చారు. సీతమ్మ గారు ఆ పుస్తకం కొనుక్కున్నారు. బాలాది వారాలు, బాగ్యాదివారాలు, తరగనాదివారాలు అన్నవి సూర్యదేవుని అనుగ్రహం చేకూర్చే వ్రతాలు. రథసప్తమి నాడు కాని, మహాశివరాత్రి నాడు కాని కర్మసాక్షి సూర్యదేవునికి ప్రీతిగా పాలు పొంగించి, ఈ వ్రతాలుపట్టి కథ చదువుకొని అక్షతలు శిరస్సుపై ధరించాలి. వ్రతంలో చెప్పిన విధంగా ఆచరించాలి. బాలాది వారాలు, భాగ్యాధివారాలకు ఆదివారం ఉదయమే తలార స్నానం చేసి గౌరీ దేవిని, సూర్యునీ ఆరాధించి కథ చెప్పి అక్షతలు వేసుకోవాలి. రాత్రి ఏకభుక్తం చేయాలి. ఓ ఏడాదిపాటు ఆ విధంగా చేయాలి. ఉద్యాపన 5 శేర్ల పాలలో 5 సోలల బియ్యం పరమాన్నం వండాలి. ఆ పరవాన్నం అడుగట్టూపై అట్టు తాను వుంచుకొని మధ్య పరమాన్నం దక్షితాంబూలాదులతో బ్రాహ్మణునికి వాయనం ఇవ్వాలి. తరగనాది వారాల నోము చిత్రమైనది. ‘‘తరుగు తరుగనరాదు, తరగరాదు, తరిగిన కూర తినరాదు’ అన్నది తరగనాదివారాల నోము కథ. ఏడాది పాటు ప్రతి ఆదివారం ఎవరినీ కూడ తరగమని చెప్పరాదు. తాను కూర తరగరాదు. తరిగిన కూరలు తినరాదు. వీరి అవసరం గ్రహించి, ఎవరైనా కూర తరిగి పెడితే ఆమె వండవచ్చు. ఈ విధంగా చేస్తే సంతానం బ్రతికి కడుపు చలవకలుగుతుందట. పొట్ట విచ్చని గౌరీదేవి లేక కడుపు చెదరని గౌరీదేవి అని ఓ నోము. 5 శేర్ల బియ్యం నూక విసరాలి. 5 కొబ్బరి కాయలు కొట్టి బెల్లం కలిపి లస్కోరా చేయాలి. శేరు పిండికి ఓ వుండ్రం చొప్పున పూర్ణం వుండ్రాలు 5 తయారు చేయాలి. వాటిని జాగ్రత్తగా ఆవిరిపై వుడకబెట్టాలి. అలా ఉడికేటప్పుడు అవి విచ్చిపోకుండా జాగ్రత్త వహించాలి. ఆ ఉండ్రాళ్లు ముత్తయిదువుకు ఒకటి చొప్పున 5గురికి వాయినం ఇవ్వాలి. నందికేశ్వరుడి నోము కథ ఈ విధంగా వుంటుంది.
ఓ రోజున కైలాసంలో పార్వతీదేవి శివునికి పాదసంవాహం చేస్తూంది. ఫక్కున నవ్వాడాయన. ఎందుకు నవ్వుతున్నారు అందామె. ఇంత త్రిలోక సుందరివే నీ అరచేతులు ఎంత గరుగ్గా వున్నాయ్ అన్నాడాయన. వచ్చిన ఉక్రోషాన్ని తమాయించుకొని ఈ చేతులు మెత్తబడే మార్గం ఏదో మీరే చెప్పండి అంది భార్య. నీవు కాశీ పోయి అక్కడ గంగ ఒడ్డున పొయ్యి పెట్టి వేడి నీళ్లు కాస్తూ గంగా స్నానానికి వచ్చిన వారందరికీ తలంటు పోయి అన్నాడు పెనిమిటి. నిత్యం వెన్న కాని, నూనె కాని మర్దనా చేస్తుంటే చర్మం మెత్తబడుట అనూచవైక వేద్యం తలంటు ఐశ్యర్యప్రదం. అందులో జగన్మాత చేతుల మీదుగా ఇంకేముంది గంగా స్నానానికి వచ్చిన వారంతా మహదైశ్వర్యవంతులౌతున్నారు. ఓ పేదరాలు చినిగిన బట్టలతో, నలుగురు పిల్లలతో గంగా స్నానానికి వచ్చి బెదురు చూపులతో దూరంగా నిలిచి వుంది. పార్వతీ దేవి ఆమెను దగ్గరకు పిలిచి తలంటు పోసింది. ఆమెకు సర్వైశ్యర్యాలు సిద్ధించాయి. కొన్నాళ్లు గడిచాయి. తాను తలంటు పోసిన స్త్రీ ఎలా వుందో చూద్దామని స్వయంగా బయలుదేరింది పార్వతి. ఆమె ఒక భవనంలో ఊగుటుయ్యాలపై ఊగుతూంది. పట్టుచీర కట్టి, ఒంటి నిండా బంగారు ఆభరణాలు ధరించి వుంది. గుమ్మం వారగా నిలిచి చూస్తోంది పార్వతీదేవి ఆమెను గుర్తించని ఇల్లాలు, అమ్మా! పొయ్యి మీద పాలు పొంగుతున్నాయి. ఓ నీళ్ల చుక్క చిలకరించి వెడుదూ అంది. పట్టరాని కోపం వచ్చింది పార్వతికి నాకు పని చెప్పే పాటి దానివయ్యావా? అనుకుంటూ గిర్రున తిరిగి వెళ్లిపోయింది. ఇల్లు చేరి పెద్ద కొడుకును పిలిచి అబ్బాయి భూలోకంలో ఓ గర్విష్టి వుందిరా! నీవు వెళ్లి దాని ఐశ్వర్యం ఊడబీకిరా! అంది. పరుగున వెళ్ళాడు బొజ్జ గణపయ్య, బ్రాహ్మణి అతడిని చూస్తూనే ఐదు శేర్ల బియ్యంతో ఉండ్రాళ్ళు వండి పెట్టింది. గణపతి సంతోషించి, దీవించి రెట్టింపు ఐశ్వర్యం ఇచ్చి వెళ్లాడు. పార్వతి నందికేశుణ్ణి పంపింది. ఆమె ఐదు శేర్ల శనగలు నానబెట్టి పెట్టింది. హరునికి అప్పాలు, కాలభైరవుడికి గారెలు, గౌరీదేవికి అట్లు, చంద్రునికి చలిమిడి. నాగేంద్రుడికి చిమ్మిలి, సూర్యునికి పరమాన్నం, వండి పెట్టింది. వీరంతా సంతుష్టులై ఆమెకు మరిన్ని ఐశ్వర్యాలు ఇచ్చారు. ఈ సారి పార్వతే మళ్ళీ వచ్చింది. ఆమెను గుర్తించిన బ్రాహ్మణి, పసుపు, కుంకుమలతో పూజించి 5 శేర్ల బియ్యం, పులగం వండి పెట్టింది. పార్వతీ దేవి ప్రసన్నురాలై ఆమెకు వరాలు ఇచ్చింది. ఈ నోము కథలో చెప్పిన తొమ్మిది దినుసులు, రకానికి 5 శేర్లు చొప్పున తయారు చేసి, ఆయా దేవతలను పూజించి నివేదన చేసి బ్రాహ్మణులను ఇంటికి పిలిచి తృప్తిగా భుజింప చేయాలి. పదార్థాలు గడపదాటించరాదు. సూర్యాస్తమయంలోగడ సరుకు చెల్లిపోవాలి. దానికి ఉద్యాపన వడుగులో వటువుకు నాందీ ముఖం వేళ 5 శేర్ల పెసరపప్పు నానబెట్టి ఓ ఇత్తడి పాత్రలో పోసి క్రొత్త పట్టు పంచ వాసెన కట్టి బంగారు నంది, వెండి నంది, దక్షిణ తాంబూలాలు ఇవ్వాలి. పెదతల్లి సీతమ్మ గారి చేత ఈ నోము పట్టించింది. ఈ విధంగా రోజూ ఓ నోముతో ఇరుగు పొరుగు వారికి విందులు జరిగేవి.
( ఇంకా ఉంది )
– కాశీచయనుల వెంకట మహా లక్ష్మి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
251
5 Responses to గౌతమీ గంగ