
Mercy Margaret
నాలుగు గోడల మధ్య తన చిన్న సామ్రాజ్యంలో
తిరిగి జవాబివ్వని ప్రజల్లా
పాత్రలు డబ్బాలు
ఫ్రిడ్జ్ బిందెలు
గిన్నెలూ , గ్లాసులు కత్తులు మిక్సీ గిరగిరలు
హై , సిం ఫ్లేం అంటూ స్టవ్ మూతిని మూస్తూ
అమ్మ కనబడని పది చేతులతో
మా కోసం ఎంత శ్రేష్టంగా వండేదో
పప్పు కుక్కర్లో వేసాను
ఉల్లిపాయలు క్యాప్సికం తరిగాను
మసాలా కోసం పల్లీ కొబ్బరి గసగసాలు వేయించి దించుతుంటే
చేయి కాలింది
కుక్కర్ విసిల్స్ వేస్తూ తరుముతుంటే కాలిన చేతిని ఏం చేయను?
కన్నీళ్ళోచ్చాయి
ఇంకెంతసేపని? ఆయన అరుస్తున్నాడు
పసుపుకు డబ్బాకు మాటలొచ్చి
-“అమ్మ గుర్తొచ్చిందా “? అని అడిగితే
గుర్తొచ్చాయి ఎన్నో సార్లు అమ్మకాల్చుకున్న చేతులు
రుచినే చూసి అమ్మ చేతుల్ని చూడని సమయాలు
ఆయన మళ్ళీ అరిచాడు
-“మీ అమ్మ నుంచి ఫోన్ లైన్ లో ఉంది “
ఇవ్వాళా
నేను మా అమ్మ లాగే వంటచేస్తాను
– మెర్సీ మార్గరెట్
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
3 Responses to మరో పాత్రలోకి మారినప్పుడు…