జోగిని

santhi prabodha

santhi prabodha

సూరీడు సరికొత్త రంగుల కాన్వాసుతో పడమట దిక్కుకు వెళ్ళిపోతూ…

మరుసటి రోజు కోసం సమాయత్తమౌతూ……సౌందర్యాన్ని ఆస్వాదించగలిగే దృష్టి, కుతూహలం ఉండాలే కానీ మనకి కొత్త ప్రపంచం ప్రతి రోజూ కన్పిస్తుంది. ప్రకృతి ఆవిష్కరించే కొత్త దనాన్ని అందుకోవాలనీ, ఆస్వాదించాలనీ, అందులోని ఆహ్లాదాన్ని అనుభవించాలనీ మన మనసు తహతహలాడుతుంది” భావోద్వేగాలను కలబోసుకుంటూ ముందుకు కదలుతూన్న వారి నడక మోకాళ్ళ పర్వతం నుండి నెమ్మదించింది. అయినా 8 గంటల కల్లా కొండమీదకి చేరారు. సుప్రభాత సమయంలో బయలుదేరడం వల్లనేమో అలసటే అన్పించలేదు. టికెట్‌ తీసుకుని స్పెషల్‌ క్యూ  ద్వారా త్వరగా దర్శనం చేసుకుందామని అంది వలసమ్మ.  వద్దు అలా వెళ్తే అసలు సరదానే ఉండదు. సర్వ దర్శనం చేసుకుందాం అన్నారు కవిత, సరస్వతి.

దర్శనం చేసుకోవడం కన్నా కొండమీద ప్రకృతిని ఆస్వాదించాలనుకుంది విద్య ఆ మాటే మిగతా వాళ్ళతో చెప్పింది. ”ఇంత దూరం వచ్చి దర్శనం చేసుకోకుండానా…! రష్‌ ఎక్కువ లేదు కదా… గంటలోనే దర్శనం అవుతుందిలే పద… ఆ తర్వాత నీవు ఎక్కడికంటే అక్కడికి తిరుగుదాం” అంది కవిత.

సరేనంటే సరే అనుకున్నారు.

సర్వదర్శనం క్యూలో నిల్చున్నారు. వీళ్ళున్న క్యూ కాంప్లెక్స్‌లో వాళ్ళని వదులుతున్నారు దర్శనానికి. తమ ముందు ఉన్న వారిని వెనక్కి నెడ్తూ వీళ్ళు ముందుకు వెళ్ళడం భలే సరదాగా అన్పించింది వాళ్ళకి. వెనక బడిన వాళ్ళు గొణుక్కుంటున్నా పట్టించుకోలేదు. ఒకావిడ ”మౌసిమా ఓ మౌసిమా” అంటూ మరాఠీలో అంటే వీళ్ళకేం అర్థం కాలేదు. ఆవిడను చూసి కామెంటు చేసి నవ్వుకుంటూ ముందుకు నడిచారు. అలా ప్రధాన ద్వారం దగ్గరికి చేరారు. చాలా త్వరగా.

అదే విధంగా ముందుకు వెళ్ళబోతున్న వీళ్ళని దాటి ముందుకు వెళ్ళారు ముగ్గురు యువకులు. వీళ్ళకి ఒళ్ళు మండిపోయింది.వాళ్ళను దాటుకుంటూ ముందుకు వెళ్ళబోతూ వాళ్ళ మొహంలోకి చూసింది విద్య. అందులో ఒకతన్ని ఎక్కడో చూసిన జ్ఞాపకం… ఎక్కడ..? ఓహ్‌ా…! ఆ చిన్ని కళ్ళను మిల మిల మెరిపిస్తూ చిరునవ్వుతో పలకరింపుగా, రైల్లో ప్రొఫెసర్‌ గారితో చూసిన యువకుడు. అవును అతనే. అతనితో మరో ఇద్దరు. ఇక ముందుకు కదలలేకపోయింది. ఇందాకటిలాగ. తెలియని ప్రదేశంలో ఎంతైనా అల్లరి చేస్తూ, తమనెవరూ గమనించడం లేదనే ధీమాతో ఉండి ఏ మాత్రం తెల్సిన వాళ్ళు కన్పించినా ముడుచుకు పోతారెందుకో…? అనుకొనే విద్యకి, ఆ అనుభవం తనకే రావడంతో తనూ అందుకు భిన్నంగా ఏ మాత్రం ప్రవర్తించలేకపోయింది.

దైవ సన్నిధిలోకి వచ్చాక అల్లరి చేయొద్దు. బుద్ధిగా ఉందామని మిత్రులతో నెమ్మదిగా చెప్పి దర్శనం చేసుకుని బయట పడింది విద్య.

”నేచురల్‌ ఆర్చ్‌ చూసొద్దామా…?” తన కోరికను వెల్లడించింది కవిత.

”ఓ.. తప్పకుండా… నేను అసలు చూడనే లేదు” చెప్పింది వలసమ్మ. గుడికి పడమటి వైపు ఉన్న రోడ్డులో కదిలారు. ”తిరుపతి కొండల ఎత్తు ఎంత ఉంటుండవచ్చు!” నడుస్తూనే ప్రశ్నించింది వలసమ్మ విద్యకేసి చూస్తూ. ” దాదాపు 2500 అడుగులు” విద్య. తమ వెనకే వస్తున్న ఆ ముగ్గురినీ గమనించింది.  వాళ్ళలోంచి ఒకరు ” ప్రపంచంలోని అత్యంత పురాతన పర్వతశ్రేణుల్లో ఒకటైన తూర్పు కనుమల లోగిళ్ళు అటు ఆధ్యాత్మిక పరంగానూ, శాస్త్రపరంగానూ విశేష ఔన్నత్య స్థలాలు. వేంకటాచలం చుట్టు పక్కల 112 తీర్థాలున్నాయని చెప్పుకుంటారు. ఈ తీర్థాలలో ” యుద్ధగళ” చాలా ప్రాశస్త్యం గలది అంటారు. దాన్ని దర్శిస్తే భక్తి, రక్తి, ముక్తి సిద్ధిస్తాయని నమ్ముతారు. 15 వేల సంవత్సరాల నాటి శిలాయుగం చిత్రాలు అక్కడ చూడొచ్చునట అన్నాడు అతను.

ఆ విశేషాలు చెబుతున్నదెవరా అని ఓరగా చూసింది విద్య. అతనే ఆ ట్రైన్‌ కుర్రాడు. వీళ్ళేంటి తమ వెంట పడుతున్నారా? లేక వాళ్ళూ చూడ్డానికేనా? విద్య మనసులో సందేహం. అతను చెప్పేది విద్య బృందం కూడా శ్రద్ధగా వింది.”అదే ఇలాంటి ప్రదేశం వేరే దేశంలో ఉంటే ఎంత అభివృద్ధి చేసేవారో కదా…?ి ఇక్కడ ఉన్న మనకే వాటి గురించి తెలీదు” కవిత”నిజమే మన వాళ్ళు ఇప్పుడిప్పుడే పర్యాటక రంగం వైపు దృష్టి సారిస్తున్నారు. తిరుపతి కేంద్రంగా గల అడ్వంచర్‌ క్లబ్‌ ఉత్సాహం ఉన్న వారితో ట్రెక్కింగ్‌ నిర్వహించింది.  ప్రపంచ వ్యాప్తంగా 60కి పైగా దేశాల్లో బ్రాంచీలు ఉన్న యూత్‌ హాస్టల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా వారి భవనం తిరుపతిలో ఉంది. అక్కడ సభ్యులకు, పర్వతారోహకులకు అతి తక్కువ ఖర్చుతో లాడ్జింగ్‌, బోర్డింగ్‌ సౌకర్యం లభిస్తుంది” వీళ్ళతో పాటే నడుస్తూ చెప్పాడతను కవితకు జవాబుగా అన్నట్లుగా..అతను చెప్పేది ఆసక్తిగా వింటున్న ఆ అమ్మాయిలు నలుగుర్లో విద్య తప్ప మిగతా వాళ్ళంతా అతను తమ జట్టులో వాడు కాదనీ, అపరిచితుడనీ అనే విషయమే మర్చిపోయారు.” ఏయ్‌ మిష్టర్‌… ఏమిటి సంగతి? ఇందాకట్నించి చూస్తున్నా… మా వెనకే మీరు?” కోపంగా విద్య. ” ఏంటండీ… మా దారి కడ్డు తగుల్తూ” ఆ ట్రైన్‌ కుర్రాడు. ” ఇన్ని విషయాలు చెప్తున్నారు మీరు ఏం చేస్తుంటారు” వారి సంభాషణని పట్టించుకోకుండా ప్రశ్నించింది వలసమ్మ.

అతను నవ్వి సమాధానం చెప్పకుండా ” మొన్న ట్రైన్‌లో మీరే కదూ…” ఆర్థోక్తిలో ఆగాడు విద్యకేసి చూస్తూ.. ” ఎస్‌, నేనే, నా పేరు విద్య. పద్మావతీ యూనివర్శిటీలో ఎం.ఎ ఉమెన్‌ డెవలప్‌మెంట్‌ స్టడీస్‌ అయిపోయింది. వీళ్ళు నా ఫ్రెండ్‌ కవిత, ఆమె ఫ్రెండ్‌ సరస్వతి ఇద్దరు ఎమ్‌సిఎ ఫైనల్‌కి వచ్చారు. ఈవిడ వలసమ్మ. ఉమెన్‌ డెవలప్‌మెంట్‌ స్టడీస్‌లో పి.హెచ్‌.డి చేస్తున్నారు అంటూ అందర్నీ పరిచయం చేసింది నడుస్తూనే. ఇంకా ఏమన్నా డీటెయిల్స్‌ కావాలా…?” సూటిగా చూస్తూ అడిగింది మళ్ళీ తానే. ” నాపేరు నవీన్‌. ఎం.టెక్‌ పూర్తయింది. ఇక్కడే… ఎస్వీ ఇంజనీరింగ్‌ కాలేజీలోనే. వీళ్ళిద్దరూ నాఫ్రెండ్స్‌ ప్రతాప్‌రెడ్డి, చెంగల్రాయుడు” పరిచయం చేశాడు అతను.విద్య మిత్ర బృందం చాలా ఆశ్చర్యపోయింది. ” ఏమిటీ మీరు చదివింది ఎం.టెక్‌ అయితే ఈ విశేషాలన్నీ ఇంతగా ఎలా చెప్పగలుగుతున్నారు?” ఆశ్చర్యంగా అడిగింది విద్య. ట్రైన్‌లో ప్రొఫెసర్‌ గారితో విద్య డిస్కషన్‌ గుర్తొచ్చిన అతను ” ఉమెన్స్‌ డెవలప్‌మెంట్‌ స్టడీస్‌’లో ఉన్న మీరు మతాలు, మత విశ్వాసాలు గురించి ఎలా మాట్లాడగలుగుతున్నారు? ఎదురు ప్రశ్నించాడు.

వీళ్ళిద్దరి మాటలు కవితకి ఏం అర్థం కాక విద్య భుజం గిల్లింది. ఏమిటి అన్నట్లుగా. అదే పరిస్థితిలో నవీన్‌ ఫ్రెండ్రూ…. ”అవుటాఫ్‌ ఇంట్రెస్ట్‌” అంది విద్య

నవ్వుతూ ”నాకూ అంతే” నవీన్‌ అంతలో… ”ప్రధాన ఆలయానికి ఉత్తర దిశలోని పుష్కరిణి ఆవరణలో ఉన్న ఓ చిన్న ఆలయాన్ని చూపించి ఇది ఏ దేవునిది” అడిగింది వలసమ్మ అతన్ని.

”వరహాలస్వామి ఆలయం. నిజానికి తిరుమలేశుని దర్శించే ముందుగా వరహాల స్వామిని దర్శించాలట. తమ తిరుమల యాత్ర సంపూర్ణం కావాలన్నా, మోక్షం సిద్ధించాలన్నా ప్రతి భక్తుడు మొదట వరహాలస్వామి వారి ఆశీస్సు తీసుకున్న తర్వాతే శ్రీవారి దర్శనం చేయాలట. అందుకేనేమో, పుణ్య ప్రాప్తి కోసమేనేమో దేవస్థానం వారు ముందుగా నైవేద్యం వరహాల స్వామి వారికి నివేదించిన తర్వాతే శ్రీనివాసునికి నైవేద్యం పెట్టడం ఆనవాయితీగా వస్తోందట” అంటూ వివరించాడు నవీన్‌.

” తిరుపతి కొండలు చాలా ప్రశస్తమైనవని విన్నాను. మీరు ఈ కొండల్లో ఏమైనా చూశారా? చూస్తే వాటి గురించి చెప్పండి” ఉత్సాహంగా అడిగింది సరస్వతి. సరస్వతి ఉత్సాహం గమనించిన నవీన్‌ మరింత ఉత్సాహంతో తాను చూసిన ‘ సున్నపురాతి కోన’ గురించి అద్భుతంగా వర్ణించి చెప్పడం ఆరంభించాడు. నా దృష్టిలో అసలు ఆ ప్రయాణమే ఒక మహాద్భుతం. భయ విభ్రమాల మధ్య సాగిన ప్రయాణం. దారీ తెన్నూ లేని నడక నడివేటి గడ్డ మీదుగా… ఒకటి రెండు సార్లు నా పని అయిపోయింది ఈ భూమి మీద నూకలు చెల్లిపోయాయి అనుకున్నాను. మృత్యువు అంచుల్లోకి వెళ్లి తిరిగొచ్చాను. మా గైడ్‌ మునిరత్నం. అతనికీ తిరుమల తిరుపతి శేషాచలం కొండలు, వెంకటాచలం కొండలూ కొట్టినపిండి.

ఈ అడవుల్లో ఆయన తిరగని ప్రదేశం, చూడని చోటు లేదేమో!

మేం కోనలోకి వెళ్తుంటే నేనున్నది ఎక్కడా… మానవలోకంలోనా… దేవ లోకంలోనా… అని ఓ సందేహం. సున్నపురాయి నిక్షేపాలున్న సన్నని దారి ఉన్న గుహలో ప్రయాణం నడుము వంచుకునే… మధ్య మధ్యలో నీటి చుక్కలు మా మీద పడ్తూండగా ఆ నీటి చుక్కలు పడడంవల్లనేమో దారి అంతా పాచిపట్టింది. ఎలాగైతేనేం చివరికి కోనలోకి చేరుకున్నాం. టెర్రకోట మట్టి బానలు మాకు స్వాగతం పలుకుతారు. అక్కడికి తొట్టి ఎలా వచ్చిందో… ఎపుడు పెట్టారో… ఎందుకో గానీ సిమెంటు తొట్టి కన్పించింది. అటవీ శాఖ వారికీ, పోలీసు శాఖ వారికి, ఎక్సైజ్‌ శాఖ వారికీ తెలీకుండా దొంగ సారా కాసేవారని మునిరత్నం చెప్పాడు. రవికిరణాలు కోనను తాకినప్పుడల్లా రాతి గోడలు బంగారు రంగులో ధగ ధగ మెరిసిపోతూ… జీవితంలో ఒక్కసారైనా ఆ మహాద్భుతమైన కోనను చూసి తరించాల్సిందే. దాని గురించి ఎంత చెప్పినా తక్కువే…ఎవరి కళ్ళతో వాళ్ళు చూసి అనుభూతిస్తే తప్ప..” ట్రాన్స్‌లో ఉన్నట్లు చెప్పుకొచ్చాడు నవీన్‌. అతను చెప్తున్న తీరు వింటున్న అందరిలోనూ ఆ కోన చూడాలన్న తపన కల్గించింది.

అలా మాటల్లో ‘ సహజశిలాతోరణం’ చేరుకున్నారు. ”ఇదిగో ఇదే సహజ శిలాతోరణం. ఇది ప్రపంచంలోనే రెండవదట. మొదటిది అమెరికాలోని ఆరిజోనా ప్రాంతంలో ఉంది. తిరుమలకు పశ్చిమాన ఉన్న ఈ పర్వతం పేరు నారాయణగిరి. శ్రీ మహా విష్ణువు వైకుంఠం నుండి ఈ పర్వత శిఖరాగ్రం మీదనే పాదం మోపాడట. దీనికి నిదర్శనంగా అక్కడ ఆయన పాదముద్రలు కూడా ఉన్నాయి.” అంటూ ఉత్తరం వైపు చూపించాడు నవీన్‌. అంతా అటుకేసి నడుస్తూండగా ఇక్కడే మహా విష్ణువు నివసించాడట. ఇటు చూడండి తిరునామాల శంఖు, చక్రం వరద హస్తం ఆకృతులు, ఇవి సహజంగా ఏర్పడ్డాయట. దాదాపు 250 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడి ఉంటాయని శాస్త్రజ్ఞులు అంచనా. ఇక్కడికి ఉత్తరం వైపుకి వెళ్తే మూడు కిలో మీటర్ల దూరంలో వేద విజ్ఞాన పీఠం ఉంది.

మాటల మధ్యలో మరో రెండ్రోజుల్లో ” బూచోళ్ళ వేటు” ప్రయాణం పెట్టుకున్నానని నవీన్‌ చెప్పాడు.నవీన్‌తో కలిసి మిగతా వాళ్ళు ” బూచోళ్ళ వేటు” చూడాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడతను వారికి కొత్త వ్యక్తిలా అన్పించడంలా… ఎప్పటి నుండో తెల్సి ఉన్న ఆత్మీయుడిలా.. మంచి స్నేహితుడిలా… కవితని, సరస్వతిని పంపడానికి వార్డెన్‌ ఒప్పుకోలేదు. హాస్టల్‌లో కొందరు మిత్రులు విషయం తెల్సుకొని నవీన్‌తో వెళ్ళవద్దన్నారు. మగవాళ్ళు మన ఆసక్తిని గమనించి, మనని ఆ దారి నుండి తమ ట్రాప్‌లోకి లాగాలని చూస్తారు. వెళ్ళ వద్దు వాళ్ళతో అని సలహా ఇచ్చారు. ఆ ఊరూ పేరూ లేని వాళ్ళతో మీరు వెళ్ళేది కొండల్లోకి కోనల్లోకి అంటున్నారు. ఆడవాళ్ళం అన్న సంగతి మర్చిపోయారా? ఎగతాళిగా అంది ఓ సుందరాంగి.

అయినా విద్య, వలసమ్మ ఏమీ పట్టించుకోలేదు. వాళ్ళు బయలుదేరేది నవీన్‌ ఒక్కడితోనో, అతని ఫ్రెండ్స్‌తోనో మాత్రమే కాదు కాబట్టి. ట్రెక్కింగ్‌లో పాల్గొనే వాళ్ళు మొత్తం పాతిక మంది. వారిలో లక్కీగా ఛాన్స్‌ దొరికింది విద్య, వలసమ్మకి. నవీన్‌ చొరవ వల్ల. సముద్ర మట్టానికి మూడు వేల అడుగుల ఎత్తున్న దుర్గమమైన శేషాచలం అరణ్యాల్లోని మసాల రేవు అనే ప్రదేశం నుండి చూస్తే…

పూలు మాలగా గుచ్చినట్లున్న కొండలు వరుసలూ…..

ఆయస్కాంతం వైపు ఆకర్షింపబడే ఇనుప రజనులా…. అందరి కళ్ళూ ఎదురుగా కన్పిస్తున్న పెను పర్వతం వైపే…..

దృష్టి మరల్చ లేకుండా… రొమ్ము విరుచుకుని, జబ్బచరుచుకుని నిలుచున్నట్లున్న ఆ నిలువాటి పర్వత శిఖరాన్ని ప్రకృతి శిల్పులు అతి జాగ్రత్తగా రక రకాల డిజైన్లలో అందంగా చెక్కినట్లుగా… పెద్ద పెద్ద గోనె సంచులు వేలాడదీసినట్లుగా తేనె తుట్టలు, గాలికి బరువుగా ఊగుతూ… రకరకాల వృక్షాలు… లతలూ… అల్లి బిల్లిగా సాగిన ఊడలూ… అంతా విఠలాచార్య సినిమాలో మాయా జగత్తులా లేదూ….. అంది విద్య పక్కనే ఉన్న వలసమ్మతో. ఆ పర్వతాన్ని చేరడమే ప్రస్తుతం నా లక్ష్యం అన్నాడు నవీన్‌. వారి అదృష్టమో, దురదృష్టమో కానీ, అప్పటి వరకూ ఉన్న పసిడి కాంతుల స్థానే ఆకాశంలో పల్చని మేఘాలు ఆవరించుకున్నాయి… ఆ తర్వాత మరి కొద్ది నిముషాలకే కారు మబ్బులుగా మారిపోతూ… వర్షం వచ్చే సూచననిస్తూ… జాగ్రత్త పడమని హెచ్చరిస్తూ… ఆ దుర్గమ ఆరణ్యంలో ఇక ముందుకు సాగడం మంచిది కాదని హెచ్చరిస్తున్న వాతావరణాన్ని కాదని ముందుకు సాగడం ఎవరికీ క్షేమకరం కాదని ముందుకు వెళ్ళే సాహసం చేయలేదు ఎవరూ… ఇక చేసేది లేక అందరితో పాటే వెనుదిరిగారు నవీన్‌, విద్య, వలసమ్మలు. ఆ మరుసటి రోజే విద్య విజయవాడ వెళ్ళి పోవాలి. నెక్ట్స్‌ టైం అంటే పి.హెచ్‌డిలో చేరిన తర్వాత మళ్ళీ ” బూచోళ్ళ వేటు” ప్లాన్‌ చేయాలనుకుంది.

రెండు రోజులుగా భారతి మేడంని కలువలేదు. మరుసటి రోజే ప్రయాణం కావడంతో విషయం చెప్పిరావడానికి క్యాంపస్‌లోకి ఈ మధ్యే షిఫ్ట్‌ అయిన ప్రొఫెసర్‌ భారతి గారి ఇంటికి   వెళ్ళింది విద్య.

”ఓహ్‌… మీరా? రండి…రండి…” చిరునవ్వుతో ఆహ్వానించాడు నవీన్‌. ”వాట్‌ ఎ సర్‌ప్రైజ్‌? మీరు ఇక్కడ! ఇది ప్రొఫెసర్‌ భారతి గారి క్వార్టరే కదా…!” ఆర్థోక్తితో అడిగింది. ఎదురుగా కన్నిస్తున్న నేమ్‌ బోర్డు చూసి. ”మీరు కరెక్ట్‌గానే వచ్చారు. ఆ… ఏమిటీ మీ మేడం దగ్గరకు వచ్చారా…. కూర్చోండి” కుర్చీ చూపుతూ అదే చెరగని చిరునవ్వుతో. ఆ… చిరునవ్వే… ఆ… మిల మిల మెరిసే నక్షత్రాల్లాంటి చిన్ని కళ్ళే విద్యని ఆకర్షించేది.

”అక్కలేదు. అక్కా బావా బజారుకెళ్ళారు. వచ్చేస్తుంటారు కూర్చోండి” అంటూండగానే భారతి గారు వచ్చారు. ఆ వెనకే ట్రైన్‌లో విద్యతో వాదన పెట్టుకొన్న అతను.. ఆయన్ని చూసి ”మీరు… ” సందేహంగా అంటోన్న విద్య మాటని మధ్యలోనే ఆపేసి ”అవును… మీ భారతీ మేడం లైఫ్‌ పార్టనర్‌ని నేనే.” అన్నారాయన నవ్వుతూ… ”గత రెండేళ్ళుగా నేను లండన్‌లో ఉండడంతో నిన్నెప్పుడూ చూడలేదు” అన్నారాయన మళ్ళీ తానే.

”అరె… ఆశ్చర్యంగా ఉందే… విద్య మీకెలా తెల్సు” మరింత ఆశ్చర్యంగా అన్నారావిడ. ”అక్కా… నిన్న ఒకడైనమిక్‌ అండ్‌ ఎంతూసియాస్టిక్‌ లేడీ అని చెప్పానే.. ఈవిడే విద్య” అన్నాడు నవీన్‌. ”భారతీ సస్పెన్స్‌ తట్టుకోలేక పోతున్నావ్‌ కదూ?” అంటూ రైల్లో పరిచయం చెప్పారు. ఎలా జరిగిందో చెప్పారు ఆయన. తిరుమల కొండపై జరిగిన విషయాలు చెప్పాడు నవీన్‌. అంతా మనసారా నవ్వుకున్నారు.

పెళ్ళి ఊసెత్తితే చాలు, ఇప్పుడే పెళ్ళికి ఏం తొందర? పెళ్ళి..పెళ్ళి… అంటూ నన్ను కట్టిపడేయకండి. నేను ప్రపంచం అంతా చుట్టి రావాలి. అందుకు పెళ్ళి అవరోధం కాకూడదు. నా మనసు పెళ్ళి వైపు మళ్ళితే నేనే చెప్తాగా అనే నవీన్‌ మద్రాసులోని ఓ ప్రముఖ కంపెనీలో సాప్ట్‌వేర్‌ ఇంజనీరుగా పని చేస్తున్నాడు. అమ్మాయిల గురించి పట్టించుకోని వీడు ఇప్పుడు ఈ అమ్మాయిని డైనమిక్‌ లేడీ, ఎంతూజియాస్టిక్‌ పర్సన్‌ అంటూ పరిచయం చేస్తున్నప్పుడు అతని కళ్ళల్లో మెరుపు భారతి దృష్టిని దాటిపోలేదు. విద్య నా స్టూడెంట్‌. తన గురించి నాకే చెప్తున్నారా… అని నవ్వేసి విద్యని కూర్చోమని చెప్పి లోనికి వెళ్ళారు ప్రొఫెసర్‌ భారతి. ”విద్యా ఈ రోజు పేపర్‌ చూశావా…?” అంటూ వచ్చారు చేతిలో పేపర్‌తో…

”లేదు మేడమ్‌”

”అయితే ఇది చదువు” అంటూ రెండు పేపర్లు అందించారు.

Women of god and rich men వార్త చూపించి చదవమన్నారు. ఆ వార్త పక్కనే మరో న్యూస్‌ And laxmi was a jogini one out of husdreds  దానికి మరో హెడ్‌లైన్‌ :A step in right Directionఆ పేజీ మొత్తం నిజామాబాద్‌ జిల్లాలోని జోగినీల గురించి ప్రత్యేక వ్యాసాలే. తెలుగు పేపర్‌లో” ఆదరించి నీడ చూపిస్తున్న చల్లని అమ్మ” ఆ పేపర్స్‌ చూశాక ఈ జోగినీ దురాచారం గురించి ప్రజలలోకి తీసుకెళ్తున్నాయి పత్రికలు. అంతే కాదు జోగినీ ఆచారాన్ని దురాచారంగా గుర్తించి ఓ పుణ్యమూర్తి అక్కున చేర్చుకుంటున్నారనీ,”అమ్మ” ద్వారా జోగినీ దురాచార నిర్మూలన, పునరావాస కార్యక్రమాలు చేపట్టాలనుకుంటున్నారు అనీ తెల్సుకుంది. అంతకంటే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే నిజామాబాద్‌ జిల్లాలోని బోధన్‌ దగ్గరలో ఆ సంస్థ కార్యాలయం కూడా ఉండడం.

స్వాతంత్య్రానికి పూర్వమే 1942లో జోగినీ ఆచార నిర్మూలనకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని తెలుసుకుని ఆశ్చర్యపడింది.

ఆనాడు తెలంగాణా ప్రాంతం నిజాం నవాబుల పాలనలో ఉండేది. నిజామాబాద్‌ జిల్లాలో ఉన్న మీర్‌ అలీ అక్బర్‌ అనే పరిపాలనాధికారి సంఘంలో పాతుకుపోయి ఉన్న జోగినీ ఆచారాన్ని దురాచారంగా గుర్తించాడు. అంతే కాకుండా ఈ దురాచారాన్ని వ్యతిరేకించాడు. దాన్ని రూపుమాపాలని తన శాయశక్తులా యత్నించాడు.ఆ తర్వాత 1946లో ఐ.ఎ.ఎస్‌. ట్రైనీ ఆనందకుమార్‌ జోగినీల గురించి పరిశోధించి ఈ దురాచారాన్ని గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళాడు. ఈ తర్వాత కాలంలో జరిగిన ఎన్నెన్నో మార్పులు. కానీ జోగినీ ఆచారం నిర్మూలన గురించి ఎవరూ పట్టించుకోలేదు. కానీ, ఏభైఏళ్ళ తర్వాత మళ్ళీ ప్రభుత్వం జోగినీ వ్యవస్థపై దృష్టి సారించింది. ఆనాటి కలెక్టర్‌ సమస్యని గుర్తించి, జోగినీల జీవన విధానాన్ని చూసి తీవ్రంగా స్పందించి వారి సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారు.

విషయాల్ని తెల్సుకున్న విద్యకి చాలా ఆనందం కల్గింది. సిరిపురంలో జోగినిల పరిస్థితి చూశాక వాళ్ళ గురించి ఎవరూ పట్టించుకోవడం లేదని తెగ బాధపడిపోయింది. కానీ ఫర్వాలేదు. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలూ తమ వంతు కృషి ప్రారంభించాయన్న మాట అనుకుంది విద్య.

ఆ తర్వాత జోగిని సమస్యపై ప్రొ… భారతి, ప్రొ. నారాయణ, విద్య ముగ్గురూ కాసేపు చర్చించుకున్నారు.

”ఓహ్‌ా… తొమ్మిది అవుతోంది. హాస్టల్‌ గేట్‌ మూసేస్తారు వస్తాను మేడం వస్తాను సర్‌. అంటూ లేచి నిలబడింది.

”విద్యా… నాకో సందేహం” తానూ కుర్చీలోంచి లేస్తూ భారతి

”అడగండి మేడం”

”ఆహా… ఏం లేదూ… నీవు పి.హెచ్‌.డి.లో చేరేలోగా ఏదైనా మంచి సంబంధం సిద్ధం చేస్తే ఏం చేస్తావ్‌…?

నాకయితే పి.హెచ్‌డి చేయాలని బలంగా ఉంది మేడమ్‌. అబ్బాయి నచ్చితే, కాదనడానికి ఏ కారణం లేకపోతే, ముఖ్యంగా నా అభిరుచులకు, విధానాలకు అనుగుణంగా ఉంటే మా నాన్న మాట విని పెళ్ళి చేస్కుంటాను. పెళ్ళి అయినా సరే, నా పి.హెచ్‌డి మాత్రం వదలను. నిర్లక్ష్యం చేయను. కంటిన్యూ చేస్తాను. ప్రొ|| భారతి కళ్ళలోని భావాలు చదవడానికి ప్రయత్నం చేస్తూ స్థిరంగా చెప్పింది విద్య

విద్య సమాధానం కోసం ఆత్రుతగా చూసి, శ్రద్ధగా ఆలకించిన నవీన్‌ అంతా విన్న తర్వాత ”ఊ” అంటూ రిలీఫ్‌గా ఒక దీర్ఘశ్వాస విడవడం అతని అక్క గమనించకపోలేదు. అందరికీ బై చెప్పి వెళ్ళిపోయింది విద్య.

అప్పటి వరకు ఎంతో సందడిగా ఉన్న ఆ ప్రదేశం ఏదో కోల్పోయినట్లుగా… నిశ్శబ్ధంగా ఎవరి ఆలోచనల్లో వాళ్ళు… ”విద్యపై నీ అభిప్రాయం ఏమిటీ? ఆ నిశ్శబ్దాన్ని, ఆ ఆలోచనల్ని ఛేదిస్తూ భారతి సూటిప్రశ్న. పుస్తకం చేతిలోకి తీసుకున్నాడు. తను ఇంత వరకూ ఎంతో మంది అమ్మాయిల్ని చూశాడు. బి.టెక్‌లో ఉన్నప్పుడు తన క్లాస్‌మేట్స్‌ కొందరు తన స్నేహం కోసం, తనతో మాట్లాడ్డం కోసం చొరవ తీసుకునేవారు. తానెప్పుడూ వాళ్ళని అంత దూరంలోనే ఉంచేవాడు. తన ఫ్రెండ్స్‌ అంతా అమ్మాయిల్ని ముఖ్యంగా హోమ్‌సైన్స్‌ అమ్మాయిల్ని తెగ ఏడిపిస్తూ ఉండేవారు. ఇంజనీరింగ్‌లో అమ్మాయిలు తక్కువగా ఉండడం వల్లనో, హోమ్‌సైన్స్‌లో అబ్బాయిలు లేకపోవడం వల్లనో కానీ వాళ్ళు, వీళ్ళు తెగ కామెంట్స్‌ చేసుకునేవారు. ఒకసారి తిరుపతి వచ్చిన కొత్తలో, తన ఫ్రెండ్‌ తేజతో కలిసి పద్మావతీ యూనివర్శిటీకి వెళ్ళాడు వాళ్ళ కజిన్‌ కోసం. అసలు అక్కడ   ఉండేది అమ్మాయిలా… కాదు గడుగ్గాయిలు. అమ్మాయిలు ఒక్కళ్ళే ఉన్నప్పుడో లేదా మామూలు అప్పుడు కూడా తలొంచుకుని తమ దారిన తాము పోవడం, మగపిల్లలు కామెంట్స్‌ చేసినా, టీజ్‌ చేసినా లోలోన నవ్వుకుంటూనో, తిట్టుకుంటూనో, ఎంజాయ్‌ చేస్తూనో ఉన్నా. కానీ ఏమీ ఎరుగనట్లే, ఏమీ విననట్లే వెళ్తుంటారు. కానీ ఇక్కడ తమదే రాజ్యం అనుకుంటారేమో తమ సామ్రాజ్యంలోకి అడుగు పెట్టిన అబ్బాయిల్ని ఎంతలా ఏడ్పించాలో అంతలా కామెంట్స్‌తో ఏడ్పించి వాళ్ళు మాత్రం నవ్వుతూ, తుళ్ళుతూ… ఆ గడుగ్గాయిలు. అప్పటి నుండీ మళ్ళీఆ ఛాయలకు వెళ్ళాలంటేనే భయం… వెళ్ళనే లేదు. అని గతాన్ని ఆ సంఘటనల్ని తలచుకుని తనలో తానే నవ్వుకున్నాడు నవీన్‌.

అమ్మాయిలంటే ఆమడ దూరాన ఉంచే తనేనా ఈ అమ్మాయితో అంత ఎక్కువగా మాట్లాడింది అనుకుంటూ తనకు ఆమెతో కలిగిన పరిచయం తలచుకుని తనే ఆశ్యర్యపోయాడు నవీన్‌. ఆ…ఆ అమ్మాయిలో ఏముంది.? అందమా…? గొప్ప అందగత్తేం కాదు. అలాగని అనాకారీ ఎంతమాత్రం కాదు. మరి ఏమిటి ఆమెలో తనని ఆకర్షించింది. ఆమెతో ఎంతో కాలంగా పరిచయం ఉన్నట్లు ఎలా మాట్లాడగలిగాడు.? అంటూ తనలో తానే గత రెండు రోజుల్లో ఎన్నో మార్లు ప్రశ్నించుకున్నాడు. ఇది అని ఖచ్చితంగా చెప్పలేని భావన. ఇప్పుడు అకస్మాత్తుగా అక్క అడిగితే ఏమని చెప్పగలడు?

మొత్తం మీద విద్య తనకు నచ్చింది. తనకు తెలియకుండానే తన ఆలోచనల్లోకి చొచ్చుకు వచ్చేస్తోంది.  చోటు చేసేసుకుంటోంది. తను ఆమెను ప్రేమిస్తున్నాడా..? ఛ…ఛ.. ప్రేమ… ఆమెకీ తనకీ ఉన్న పరిచయం వయసెంత…? రెండు రోజులు. రెండురోజుల్లోనే ప్రేమా… ఆమె గురించి తనకేం తెల్సనీ… అంతా ట్రాష్‌… అని తనకు తానే చెప్పుకుని ఆ ఆలోచనలోంచి బయట పడ్డం కోసం టి.వి. ఆన్‌ చేశాడు.

 అమెరికాలోని డెట్రాయిట్‌లో ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం వచ్చింది నవీన్‌కి. మరో రెండు నెలల్లోపు ఫార్మాలిటీస్‌ అన్నీ పూర్తి చేసుకుని వెళ్ళిపోవాలి.

మధ్య మధ్యలో విద్య చాలా సార్లు గుర్తొచ్చినా, అమెరికా వెళ్ళడం కన్‌ఫర్మ్‌ అయ్యాక ఆమె మరీ మరీ తన తలపుల్లో చేరి అల్లరి చేస్తోంది. ఆమె తన వెంట ఉంటే బాగుండుననీ, ఇద్దరూ కల్సి కబుర్లు చెప్పుకోవాలనీ,…అలా….అలా…అడ్వెంచర్స్‌ చేయాలనీ మరీ మరీ అన్పిస్తోంది. తన ఆలోచనలు అక్కతో ఎలా చెప్పాలా అని తనలో తానే మదనపడిపోతున్నాడు నవీన్‌. అసలు తనంటే విద్య అభిప్రాయమేమిటో  సూచన ప్రాయంగానైనా తెలీదే….ప్చ్‌… కనీసం ఆమె ఫోన్‌ నెంబర్‌ లేదు. అడ్రస్‌ తెలియదు. ఎలా తెల్సుకోవడం..?

ఆమెను కల్సుకోవడం? తన మనసు విప్పడం..? ఆలోచిస్తూండగా భారతి ఓ ఫోటోల కట్ట తీసుకొచ్చి నవీన్‌ ముందుంచింది.

”ఒరేయ్‌ నవీ…అమ్మా, నాన్నలకు ఇక నేను నచ్చజెప్పలేను. ఈ ఫోటోల్లో ఏదో ఒకటి సెలక్ట్‌ చెయ్‌. ఆమెరికాకి ఎగిరిపోతున్నావని తెలియగానే నీ రేటు మరింత పైకి లేచింది. అమ్మాయి తల్లిదండ్రులు అమెరికా అల్లుడి కోసం పోటీలు పడ్తూ… వెంట పడ్తూ ఆ ఒత్తిడి తట్టుకోలేక అమ్మా నాన్న ఒత్తిడి… నీకు నచ్చచెప్పమని… ఒరే అమ్మకి మరో భయం కూడా ఉన్నట్లుందిరా… అంటూ వచ్చి తమ్ముడి పక్కనే కూర్చుంది. ప్రొ|| భారతి.

”భయమా..? ఎందుకక్కా..!

”ఎందుకేవిట్రా…! నీ గురించే..”

”నా గురించా..” ఆశ్చర్యంగా నవీన్‌.

”అవును, నీ గురించే, ఇన్నాళ్ళూ మా మధ్యన ఉన్నావ్‌. అక్క బావల మధ్య ఉన్నావ్‌లే అని సరిపెట్టుకున్నారు. మద్రాస్‌లో నువు జాబ్‌లో జాయిన్‌ కాగానే అమ్మ బెంగపడిపోయింది. శని, ఆదివారాల్లో తిరుపతిలో వాలిపోయే నిన్ను చూసి అమ్మ మనసు కుదుట పడింది. మరిప్పుడేమో దేశంకాని దేశం వెళ్ళబోతున్నావ్‌. సంప్రదాయ కుటుంబంలో పుట్టిన నీవు కన్నతల్లి లాంటి మన దేశాన్ని, మన సంస్కృతిని, ఆచారాల్ని మర్చిపోతావేమోననీ? అన్నింటికీ మించి అక్కడి అలవాట్లతో పాటు అక్కడి అమ్మాయిని కావాలనుకుంటే..? ”అందులో తప్పేముందక్కా…? నీవూ అమ్మలాగే ఆలోచిస్తున్నావ్‌.

 ”నేను అనడం కాదురా అమ్మ భయం అది. అందుకే నీ పెళ్ళి నిశ్చయం చేయాలని వాళ్ళ తొందర. అంతగా అయితే పెళ్ళి కొన్నాళ్ళ తర్వాత చేసుకోవచ్చు అని అమ్మ ఆలోచన” వివరంగా చెప్పింది భారతి. ”అక్కా… నేనొకటి అడగనా..? అంటూ ఫోటోల కట్ట చూడకుండానే టీపాయ్‌ పైకి విసిరాడు.

”అడగరా..?”

”ఆ… అదే..”

”ఆ నసుగుడు ఆపి అసలు విషయానికి రా.. విషయం అర్థమవుతుండగా అంది ప్రొ|| భారతి.

”మీ స్టూడెంట్‌ విద్యపై నీ అభిప్రాయం…?” ఆమె కళ్ళలోకే సూటిగా చూస్తూ

”ఏమిట్రా… నా ప్రశ్న తిప్పి నన్నే అడుగుతున్నావా..?” అని తమ్ముడ్ని ముద్దుగా ఒకటి మొట్టి నవ్వుతూ.

”ఫోన్‌ చేయరా…విద్యకి.

”నీ దగ్గర ఫోన్‌ నంబర్‌ ఉందా..?” ఆశ్చర్యంగా, ఆనందంగా, కళ్ళు మిలమిల లాడుతూండగా…

ప్రొ|| భారతి, ప్రొ|| నారాయణల నేతృత్వంలో అన్నీ చకచకా జరిగిపోయాయి.

ప్రొ|| భారతి ఫోన్‌ కాల్‌ అందుకున్న విద్య తల్లిదండ్రుల ఆనందానికి అవధిలేదు.

ఇటు నవీన్‌ తల్లిదండ్రులూ అంతే..

డబ్బుతో, కట్న కానుకలతో ప్రమేయం లేకుండా, బంధు మిత్రుల సమక్షంలో రిజిస్ట్రార్‌ ఆఫీసులో సింపుల్‌గా విద్య, నవీన్ల పెళ్ళి జరిగిపోయింది.

జోగిని సమస్యపై పి.హెచ్‌.డి చేయాలని కలలు కంది. కానీ మొదలైనా పెట్టలేదే అని మనసులో ఎక్కడో ఓ మూల ఉన్నా, నవీన్‌తో ఆనందంగా అమెరికా ఎగిరి వెళ్ళిపోయింది. విద్య రెండు నెలలు కాదు. రెండేళ్ళు రెండు నిమిషాల్లా గడిచి పోయాయి. అప్పుడప్పుడు తనవాళ్ళతో పాటు సబిత, పోశవ్వ వాళ్ళు గుర్తొచ్చేవారు. ఈ మధ్య అయితే మరీ ఎక్కువగా గుర్తొస్తున్నారు. ఆ మాటే నవీన్‌తో చెప్పింది.

”సారీరా…? విద్యా? నా కోసం పి.హెచ్‌.డి. చేయ్యాలన్న నీ కోరికను అణచివేసుకున్నావ్‌… నీకు చేయాలని ఉంటే ఆ దిశగా ఆలోచించు”

వెంటనే తన ఆలోచనలు తెలియజేస్తూ ప్రొ|| భారతికి ఇ-మెయిల్‌ చేసింది. ” నీ సర్టిఫికెట్స్‌, వెంటనే పంపు నోటిఫికేషన్‌ పడింది. అప్లై చేస్తానంటూ ఆవిడ నుండి మరో ఇ-మెయిల్‌. ఇక ఆలస్యం చేయకుండా వెంటనే కొరియర్‌లో పంపింది విద్య.

ప్రొ|| భారతి గైడెన్స్‌లోనే విద్య నిజామాబాద్‌ జిల్లాలోని జోగిని వ్యవస్థపై పి.హెచ్‌.డి. ప్రారంభించింది.

అందులో భాగంగానే ఈ సారి సిరిపురం బయలుదేరింది. దాదాపు రెండున్నర సంవత్సరాల క్రితం కవిత కోసం వెళ్ళిన విద్యకి, ఇప్పటి విద్యకి తేడా ఉంది. ఈ సారి ఆమెకి ఓ లక్ష్యం ఉంది. చాలా కాలం తర్వాత వచ్చిన విద్యని ఆప్యాయంగా రిసీవ్‌ చేసుకున్నారు రాజాగౌడ్‌, రాంబాయి. విద్యని చూసిన వాళ్ళకి ప్రస్తుతం ఫ్లోరిడాలో ఉంటున్న తమ కూతురు కవితను చూసినంత సంబరం కల్గింది. రాజాగౌడ్‌ కోసం తెచ్చిన రేబాన్‌ కూలింగ్‌ గ్లాసెస్‌, రాంబాయి కోసం తెచ్చిన పగడాలు చూసి వాళ్ళు మురిసిపోయారు. ఎంతయినా విద్యది పెద్ద మనసు. కూతురుతో వచ్చి నాలుగురోజులు ఉండి వెళ్ళిన అమ్మాయి తమను గుర్తుంచుకొని మళ్ళీ తమ దగ్గరకు రావడమే కాకుండా, తమ కోసం అమెరికా నుండి బహుమతులు తేవడంతో వారి మనసులకు ఎంతో దగ్గరైంది విద్య. సాయంత్రం వరకూ కబుర్లు చెప్పుకున్నాక సబిత వాళ్ళ దగ్గరకు వెళ్ళి వస్తానని చెప్పి అటుకేసి బయలుదేరింది విద్య.

కాలనీ మొదట్లో ‘అంబేద్కర్‌ కాలనీ’ అని బోర్డు. పోశవ్వ వాళ్ళ ఇంటికి దగ్గరలో మినీ వాటర్‌ టాంక్‌కి కుడి వైపున ఉండే ఖాళీ స్థలంలో చిన్న బిల్డింగ్‌… అంబేద్కర్‌ భవనం పేరులో… గుడిసెల స్థానంలో నాలుగైదు చిన్న చిన్న పెంకుటిళ్ళు… గోడలకి ప్లాస్టరింగ్‌ లేకుండా… ఇంతకు మించి మార్పేమి లేదు అనుకుంటూ పోశవ్వ ఇంటికేసి అడుగులువేసింది విద్య.

గుడిసె ముందే రెండు చిన్న గదులకు పునాది వేసి ఉంది. ఆ పునాది మధ్యలోనే పునాదికోసం వాడే రాతిపై చేపలు శుభ్రం చేస్తూ పోశవ్వ… తల్లి చేస్తోన్న పని చూస్తూ ఏవో కబుర్లు చెప్తూ మధ్య మధ్యలో చేప ముక్కలపై నీళ్ళు పోస్తున్న సబిత.

”ఓ పోరి నీళ్ళు పోసుడు ఆపి… గింత ఉప్పుకారం అందుకో…” పోశవ్వ. సరేనంటూ ఇంట్లోకి వెళ్ళబోయిన సబిత తమ ఇంటికి వస్తోన్న విద్యని చూసి ”అమ్మా గిటు సూడే..” అంటూ గబగబ వెళ్ళి విద్య చేయి అందుకుంది.

”బాగున్నావా సబితా”

”నువు మంచిగున్నవా… గప్పుడొస్తనని గిప్పుడచ్చినవా…?” నిష్టూరమాడింది.

”నమస్కారమక్కా… అంత మంచిదేనా..?” మర్యాదగా పలుకరించింది పోశవ్వ.

ఇద్దరిలోనూ కొద్దిగా మార్పు మాటలో… తీరులో.

”సాయవ్వ లేదా..?” విద్య…

”అవ్వ కల్లుపాక కూడా ఉన్నది.” సబిత

విద్యలో కన్పించే మార్పుని పసిగట్టేసింది సబిత. ” అక్కా బావ ఏం జేస్తరు” అడిగింది. విద్య చెప్పింది విని ”అబ్బ! అమెరికాల ఉన్నడా…? పెద్దగౌడ్‌ బిడ్డ బీ ఆడనే ఉన్నదట. ఆడికి బోవాల్నంటే మీది మోటర్‌ల బోవాల్నట గద! మస్తు పైసలయితయట గద! మరి నువ్‌ బోవా? ఆశ్చర్యం, సందేహంతో సబిత ”నేనూ వెళ్ళాను. మిమ్ముల్ని చూడ్డం కోసం, మీ గురించి పూర్తిగా తెల్సుకోవడం కోసం నేను వచ్చేశాను” విద్య సమాధానం విని ఆశ్చర్యపోయారిద్దరూ”

”నిజ్జంగా మా గురించే అచ్చినవా…” తమ కోసం వచ్చిందన్న విషయం ఎంతో అబ్బురంగా ఉండగా సబిత.

”అవును నిజ్జంగా…” సబితను అనుకరిస్తూ విద్య

”మరి ఇప్పుడు ఈడనే ఉంటవా..?” మరో ప్రశ్న సబిత నుండి

”ఆ.. అవును కొన్ని రోజులుంటాను”

”అటెనుక”

”బోధన్‌లో ఉంటాను కొన్నాళ్ళు” మొదట్లో వీరి భాషకి, యాసకి చాలా ఇబ్బంది పడిన విద్యకి ఈ సారి సులభంగా అర్థమవుతోంది.

తమకోసం అమెరికా నుండి అక్క రావడం చాలా గొప్పగానూ, ఆశ్యర్యంగానూ ఉందింకా పోశవ్వకి

”అక్కా బోదనం నాకు బీ ఎర్కే. ఆడికి నేను బీ బోయిన. ఆడ ‘అమ్మ’ ఉన్నది. ‘అమ్మ’ తాటికే పోయినం. ఆడ మా పేర్లు ఎక్కిచ్చుకున్నారు.

వీళ్ళిద్దరి సంభాషణ వింటూనే తన పని చేసుకుంటున్న పోశవ్వ చేపలు చేయడం అయిపోయిందేమో,  చేప ముక్కల్లో పసుపు, ఉప్పుకారం జల్లి గిన్నెలో పెట్టివచ్చి గడపలో చతికిలబడింది పోశవ్వ.

అంతలో సాయవ్వ వచ్చింది.

”అగో పట్నపు అక్క ఎన్నడచ్చినవ్‌..? గిదేన రాకడ? అంత మంచిదేనా..?” మొహం చేటంత చేసుకొని ఆనందంగా పలుకరించింది సాయవ్వ

సబిత నోట ‘అమ్మ’ పేరు వినగానే రెండేళ్ళ క్రితం తను పేపర్‌లో చూసిన వార్త గుర్తొచ్చింది విద్యకి. అందుకే అమ్మ ఆఫీసు విశేషాలు ఏమిటని అడిగింది.

”అక్క… నీ లెక్కనే, ‘అమ్మ’ ఆఫీసుల సుతం అక్కయ్యలు, అన్నయ్యలు మాతోని మంచిగ, మర్యాదతోని, ప్రేమతోని పలుకరిత్తరు. మంచిగ జూత్తరు” చెప్పింది సబిత.

”ఆడికి బోయచ్చినంక మాకు ధైర్నం అచ్చింది. మేమేందో సమజయితాంది”

అంత వరకూ ఆలోచనలో ఉన్న పోశవ్వ.

”అక్కా…గా పొద్దు,. కాపాయన చచ్చిండు. నన్ను జల్డి ఆటకు రమ్మని కబరందె. గప్పుడు ఆటకు పోతుంటి గనీ. ‘అమ్మ’ తాటికి పోయచ్చినంక నేను పోతలేను. మంచిగ అన్పియ్యలె. గందుకోసరం పతేకం నన్ను తోల్కపోను మనిషొచ్చె. నేను రానంటి. మల్ల మల్ల మనిషిని తోలిన్రు. పోతరాజు మావ, సుంకర సాయిలు మావ సుతం అచ్చిన్రు. దొరలు రమ్మన్నప్పుడు బొవాలె. గిట్ల అనద్దు పోరి అనుకుంట నాకు సుద్దులు జెప్పబట్టె. నేను రానంటే రానని పట్టుబడ్తి. మొండిజేసిన ఫిర్‌ బీ అల్లు యినకుంటే నా రెక్కబట్టి గుంజక బోయిన్రు. ఆటకు బోయిన మా అమ్మ, అవ్వ,  ముత్తేయి ఆడ నన్ను జూసిన్రు.

”జోగు పోరి మస్తున్నది. పెద్దదయిందో లేదో… ” అంటున్నరు. ఆల్ల కండ్లను జూత్తే. ఆ సూపులు జూత్తే గుడ్లు పీకీ పారేయ్యాల్ననిపిచ్చింది. ఆల్ల మాటలకు ఆల్ల నోరు పడిపోను. అని తిట్టుకున్న లోపట్నే. మల్లమల్ల గట్లనే మాటాడ బడ్తిరి. ఇక ఊకోలె నాకచ్చిన తిట్లన్ని అందుకున్న.

ఏందో జోగు ముం.. మాదిగ లం.. లారా బగ్గ ఒర్ర బడ్తిరి. బూతులు తిట్టుకుంటు, కొట్ట కొట్ట నా మీనకొచ్చిరి. ఒక్కడైతే నా చేయివట్టి ఆని మీదకు ఇగ్గు కున్నడు. ఆ నడిబజార్ల ఊరు ఊరంత సూడంగ.

(ఇంకా వుంది)

– శాంతి ప్రబోధ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

44

ధారావాహికలు, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో