ఎనిమిదో అడుగు – 24

Anguluri Anjani devi

Anguluri Anjani devi

హేమేంద్ర వరంగల్‌లో సొంతంగా ఓ ఇల్లు కొన్నాడు. ఇన్నోవా కారు కొన్నాడు. సౌకర్యవంతంగా బ్రతకటానికి ఇంకా ఏంకావాలో అవన్నీ సమకూర్చుకున్నాడు. ఒకప్పుడు హేమేంద్ర ఇలా వుండాలనే కలలు కన్నాడు శేఖరయ్య. అదిప్పటికి నెరవేరింది….
ధనుంజయరావు కూడా ఈ మధ్యన కలిసి ‘‘హేమేంద్ర మంచి ఊపులో వున్నట్లు తెలుస్తోంది శేఖరం! ఇంత తక్కువ టైంలో అతను ఒక సీటిలో నిలబడి, ఈ స్థాయికి చేరుకోవడం మాటలు కాదు. ఎంతయినా నువ్వు అదృష్టవంతుడివి.’’ అన్నాడు….
ఆ మాటలు విని నవ్వే ఓపిక లేనివాడిలా చూశాడు శేఖరయ్య. ఒప్పుడు శేఖరయ్య తన కొడుకు ఇంతయితే బావుండు, అంతయితే బావుండు అన్న పిచ్చి కోరికతో ఉండి ఇప్పుడిలా ముభావంగా వుండడం ధనుంజయరావుకి నచ్చలేదు.

‘తండ్రి అనే వాడు పిల్లల అభివృద్ధిని మనస్ఫూర్తిగా ఆస్వాదించగలగాలి. ఇప్పుడిరత అసంతృప్తిగా ఉండాల్సిన అవసరం ఏమొచ్చిందో! ఏమిటో ఒక్కోసారి శేఖరం అర్థం కాడు.’ అని తనలో తను అనుకొని మౌనంగా వుండిపోయాడు.
అంతేకాదు. మంచి హోదాలో వున్న హేమేంద్రను ఎవరు ఏ కామెంట్‌ చేసినా వాళ్లను వాళ్లు తక్కువ చేసుకున్నట్లే అవుతుందనుకున్నాడు.
హేమేంద్ర కారును పోర్టికోలో పార్క్‌ చేసి లోపలకి వచ్చాడు. సిరిప్రియను పిలిచాడు. ఆమె వెంటనే పలకలేదు. వంట ఇంట్లో వంట చేస్తూ ఫోన్లో మాట్లాడుతోంది.

 ఒకవైపు పాలు పొంగుతూ, ఇంకోవైపు నూనె మసులుతూ, ఏ కాస్త ఏమరుపాటుగా వున్నా మిాదపడే పరిస్థితి అది. అలాంటి ప్లేస్‌లో వుండి సెల్‌ ఫోన్‌ పట్టుకొని మాట్లాడడం సేఫ్‌ కాదని హేమంద్ర అనేక సార్లు చెప్పాడు. అయినా వినదు సిరిప్రియ…..అమ్మ మాట్లాడుతుందనో, ధనుంజయ అంకుల్‌ మాట్లాడుతున్నాడనో ఆదిత్య అన్నయ్య మాట్లాడుతున్నాడనో, తాతాయ్య మాట్లాడుతున్నాడనో చెబుతుంది. తన మాటను పెడచెవిన పెడుతోందని అప్పుడప్పుడు కోపం వచ్చినా కంట్రోల్‌ చేసుకుంటాడు. కారణం సిరిప్రియ అంటే అతనికి ప్రాణం.
భర్తను చూడగానే ‘‘ ఇది మీకు తెలుసా? మీ అమ్మగారు, నాన్నగారు పొలం వెళ్లి పనులు చెయ్యలేక ఇంట్లోనే వుంటున్నారట… వాళ్లకి తిండికి డబ్బులేక కష్టపడ్తున్నారట… ధనుంజయ అంకుల్‌ చెప్పాడని ఆదిత్య అన్నయ్య ఇప్పుడే కాల్‌ చేసి చెప్పాడు. మీరెళ్లి వాళ్లను తీసుకురండి! వాళ్లు కూడా మనతోనే వుంటారు. వాళ్లు తినే తిండి మనదగ్గర లేదా? ఎందుకు వాళ్లక్కడ?’’ అంటూ సిరిప్రియ తొందర చేసింది.
అతను ఏమాత్రం కంగారుపడకుండా ‘‘ అది నాకు తెలియదా సిరీ! నువ్వు చెప్పాలా! వాళ్లు పొలాన్ని నమ్ముకొని బ్రతికేవాళ్లు… అలాగే బ్రతకనీ,’’ అన్నాడు.

‘‘వాళ్లేమైనా కుర్రాళ్లా! కష్టపడి పొలం దున్నుకొని బ్రతకటానికి ముసలాళ్లండీ వాళ్లు! వాళ్లలకి అన్నంపెట్టి పోషించాల్సిన బాధ్యత మనకుంది. మనల్ని ఇంతవాళ్లని చేసింది వాళ్లే, అసలు వాళ్లు లేకుంటే మన మున్నామా!’’ అంది.

అప్పటికే వాష్‌ బేసిన్‌ దగ్గరకెళ్లి ముఖం, చేతులు కడుక్కుని నాప్‌కిన్‌తో చేతులు తుడుచుకుంటూ…. ‘‘అవన్నీ నాకు తెలుసుకాని, ముందు నాకు అన్నం పెట్టు. నేను బాగా టయిరయి వచ్చాను. కొత్తగా ఓపెన్‌ చేసిన బ్రాంచీలో స్టాక్‌ బ్యాలెన్స్‌ కావటం లేదు. దాన్నిప్పుడు సిస్టమ్‌లో చెక్‌ చేసుకోవాలి.’’ అన్నాడు.
సిరిప్రియ అతను అడిగినట్లే అన్నం పెట్టి అతని పక్కనే కూర్చుంది. అతను అన్నం తిని నేరుగా వెళ్లి కంప్యూటర్‌ ముందు కూర్చున్నాడు. అన్ని బ్రాంచీల స్టాక్‌ బ్యాలెన్స్‌,క్యాష్‌ బ్యాలెన్స్‌ చూసుకొన్నాడు…. అంతా కరక్టుగానే వుంది.

తేలిగ్గా నిట్టూర్చి, ఒళ్లు విరుచుకుంటూ వచ్చిపడుకున్నాడు. అప్పటికే బెడ్‌మిాద పడుకొని వున్న సిరిప్రియ స్వాతి వీక్లీలో ‘‘జె’’…. అనే ఆర్టిస్ట్‌ గీసిన బొమ్మలా అపూర్వంగా, అపురూపంగా అన్పించి దగ్గరకు తీసుకున్నాడు. సిరిప్రియ ఎప్పుడూ లేని విధంగా ఒక్క వుదుటన లేచి కూర్చుంది.
ఆశ్చర్యపోయాడు హేమేంద్ర. ఏమిటన్నట్లుగా చూశాడు.
‘‘ఈ రోజు కూడా అదే పద్ధతా?’’ అంది సూటిగా చూస్తూ. అంత సూటిగా ఆమె ఎప్పుడూ అతని ముఖంలోకి చూడలేదు.

‘‘ఏం వద్దా!’’ అన్నాడు అర్థం కాక…
‘‘వద్దు. ఈ రోజు నుండి మీరు పాటించే పద్దతులేం వద్దు. మన ఫస్ట్‌నైట్‌న నాతో ఏమన్నారో గుర్తుందా? మిారు బాగా డబ్బు సంపాయించి ఓ స్థాయికి వచ్చాక పిల్లల గురించి ఆలోచిద్దామన్నారు. ఇప్పుడు మీరు అనుకున్న స్థాయికి చేరుకున్నారు. ఇక ఆ పద్దతులేం వద్దు.’’అంది ఖచ్చితంగా…..
…కోపం వచ్చింది హేమేంద్రకి. అతనికి కోపం వస్తే గంటకి 180 కిలో మీటర్ల స్పీడుతో కారును డ్రైవ్‌ చేస్తూ వెళ్తాడు. ఆ కోపం తగ్గాక తిరిగి ఇంటికి వస్తాడు.ఇప్పుడు అలా చెయ్యకుండా సుడిగాలిలా బెడ్‌ మిాద నుండి లేచి ఎదురుగా వున్న సిస్టమ్‌ని విసిరి కొట్టాడు.

బెదిరిపోయి చెవులు మూసుకుంటూ చూసింది సిరిప్రియ. అతనెందుకలా చేస్తున్నాడో, అంత కోపం వచ్చే మాట తనేమన్నదో అర్థం కాక అలాగే చూస్తోంది.
‘‘చూడు! నీకెలా చెప్పాలో నాకర్థం కావటం లేదు. ఇప్పుడే కాదు. ఎప్పటికీ నాకు పిల్లలొద్దు. నీకు నా పద్ధతి నచ్చకుంటే ` పిల్లలే కావాలనుకుంటే నీ దారి నువ్వు చూసుకో….’’ అన్నాడు హేమేంద్ర తెగతెంపులకి నేను రెడీ అన్నట్లు.

షాక్‌ తిన్నది సిరిప్రియ.వెంటనే తేరుకొని ‘‘మీరేం చెప్పినా అర్థం చేసుకొని భరించే శక్తి నాకుంది. అదేదో మనసులో పెట్టుకొని`అంటే! పిల్లలు ఎందుకు వద్దో నాకు చెప్పకుండా దాచుకొని, మిారు బాధపడొద్దు. నన్ను బాధపెట్టొదు ప్లీజ్‌!’’ అంది.హేమేంద్ర కొద్దిగా చల్లబడి ‘‘ నేను ఒకప్పుడు, ఇప్పుడు నువ్వు చూస్తున్న మనిషిని కాదు. ఏ తండ్రీ నాలాంటి కొడుకును కోరుకోడు. పొరపాటున నాలాంటి కొడుకును కన్నా వీడెందుకు పుట్టాడా అని అనుకోకుండా వుండలేడు. ఇప్పుడు నాకు కొడుకు పుడితే నాలాగే పుడతాడు. వ్యూచర్లో వాడు నన్ను కొడతాడు. ఎందుకంటే నేను మా నాన్నను కొట్టాను కాబట్టి….’’ అన్నాడు.

‘‘ కన్న తండ్రిని కొట్టారా మీరు?’’ అంటూ మళ్లీ షాక్‌ తిన్నది సిరిప్రియ.
‘‘ అంతేకాదు మా బంధువర్గంలో కూడా నాకు మంచిపేరు లేదు. నేను స్వార్థపరుడ్ని, దుర్మార్గుడ్ని…. నేను చేసిన పనులు చెబితే వినేవాళ్లు కూడా నన్ను ఛీ అంటారు. మా పక్కనున్న మా పెద్ద నాన్న పొలాన్ని మాకివ్వలేదని ఆ పొలంలో వున్న మా పెద్దమ్మ సమాధిని పొలాలకు మందుకొట్టే స్త్రేతో బాది కూలగొట్టాను. మా పెద్ద నాన్న కూతుర్ని నా నోటికొచ్చినట్లు దారుణంగా తిట్టాను. ఆమె తన భర్త ఉద్యోగ రీత్యా ఎక్కడెక్కడో ఉంటే ఆమె తల్లిదండ్రులు చనిపోయాక, వాళ్లు సంపాయించిన ఇంట్లో ఉన్న సామాన్లను తాళం పగలగొట్టి ఎవరికీి తెలియకుండా అమ్ముకొని తాగాను. వాళ్ల పిల్లలు వచ్చి అడిగినప్పుడు సామాన్లన్నీ వానొచ్చి కొటుకుపోయాయని చెప్పాను. గోడలుండగా సామాన్లు ఎలా కొట్టుకపోతాయి? నాలో విచక్షణ వుందా? నాలాంటి వాళ్లు ముదిరితేనే కదా దేశద్రోహులైయ్యేది.

మా స్వంత అక్కా, బావలు, కూడా నా నోటికి బలైన వాళ్లే… మాపెద్ద అక్క కొడుకు ఇంటికి అతిథిలా వెళ్లి టి.వి. స్టాండ్‌ సొరుగులో వున్న డబ్బుల్ని దొంగతనం చేశాను. నీళ్ల కోసం కాలువ దగ్గర తగాదా పెట్టుకొని, మా పక్క పొలంలో వున్న దళితుడ్ని కొట్టి, కొద్దిరోజులు జైలుకి వెళ్లి వచ్చాను. నా ఒళ్లు కొవ్వెక్కి ఎవరూ లేని టైం చూసి మా పెద్దనాన్న కోడలు పక్కన పడుకున్నాను…. నా పనులు చూసి మానాన్న సిగ్గుతో చచ్చిపోతుంటే నేనేమో నిర్లక్ష్యంగా తలెగరేసి తిరిగేవాడిని. ఇవన్నీ నేను కాలేజీ నుండి సస్పెండ్‌ అయిన తర్వాత చేసిన చెడ్డపనులు. నేను దేశద్రోహిని, టెర్రరిస్టును కాకపోయినా, నాలాంటి కొడుకే నాకు పుడితే నేను యాక్సెప్ట్‌ చెయ్యలేను.’’ అంటూ ఆగాడు.

షాక్‌లోంచి తేరుకోలేదు సిరిప్రియ.
‘‘ నా తండ్రిని నేను కొట్టినా ఆయన ఎలా ఫీలయ్యాడో నాకు తెలియదు. కానీ పైకి మాత్రం మౌనంగానే వున్నాడు. నేనలా వుండలేను. ఎందుకంటే ఆయనకి లేని స్టేటస్‌, డబ్బు ఇప్పుడు నాకుంది. నేనున్న ఈ స్థితిలో నా కొడుకు పెద్దయి నన్ను కొడితే నేను తట్టుకోలేను. వాడ్ని భరించలేను. ఇంత వయొలెన్స్‌తో కూడిన ఆ కొడుకు నాకొద్దు. కూతురు కూడా… ఎందుకంటే దాన్ని సర్టన్‌ ఏజ్‌ వరకు పెంచాక అది రోడ్డు మిాద నడుస్తుంటే దానికి సెక్యూరిటి గార్డులాగా నేను పక్కనే వుండాలి. లేకుంటే అది లవ్వు, గివ్వు అంటూ ఎవడితోనే లేచిపోయి నా పరువు తీస్తే నా తల ఎక్కడ పెట్టుకోను….? అందుకే నాకు కూతురు కూడా వద్దు’’ అన్నాడు.

భర్త మాటల్ని అతికష్టంగా జీర్ణించుకున్న సిరిప్రియ భావోద్వేగాలకు లోనవ్వకుండా ప్రశాంతంగా చూస్తూ….
‘‘ఒక జీవికి జన్మనిచ్చే ముందు ఇలాగే ఆలోచిస్తారా ఎవరైనా? అగ్నిపర్వతాలు వున్నాయని అక్కడ ప్రజలుండడం లేదా? తుఫాన్లు వస్తాయని, సునామిాలు వస్తాయని, జనాలు ముందుగానే చచ్చిపోతున్నారా? అలా అనుకుంటే జపాన్‌ నిండా భూకంపాలే. కెనడా ఉత్తర భాగం మొత్తం జీరో డిగ్రీస్‌లో వుంటుంది. ఇలా ప్రతి చోట సమస్య వుంటుంది. దాని పక్కనే పరిష్కారం వుంటుంది.

దేవుడు మనిషికి ఆకలిపెట్టి దాని పక్కనే అన్నం పెట్టలేదా? ప్రతి దానికి భయపడ్తే ఎలా? ఎప్పుడైనా మనిషి స్వభావం కాలమాన పరిస్థితులను బట్టి, పరిసరాలు, అవసరాలను బట్టి మారుతుంటుంది…. మట్టిని ముద్దలా చెయ్యాలన్నా, కుండలా చెయ్యాలన్నా మన చేతుల్లోనే వుంది. నేనొక్కటి మాత్రం చెప్పగలను. ఇప్పుడు మనం మిా అమ్మగారిని, నాన్న గారిని మన దగ్గర వుంచుకుంటే రేపు మనం కూడా మన పిల్లల దగ్గర వుండొచ్చు.’’ అంది.

అతను కోపోద్రిక్తుడై ‘‘ అసలు పిల్లలే వద్దని చెబుతుంటే మళ్లీ పిల్లలంటావేంటి?’’ అన్నాడు. ఆమె అదే ప్రసన్నవదనంతో అతన్ని చూస్తూ ‘‘మిారు కాస్త కోపాన్ని తగ్గించుకుంటే నేను మాట్లాడతాను.’’ అంది.
‘‘ సరే! మాట్లాడు.’’ అంటూ బెడ్‌ పై పడుకొని చేతుల్ని తలకింద పెట్టుకొని పైకి చూస్తూ….
‘‘వేప విత్తనం భూమిలో వేస్తే వేప చెట్టే వస్తుంది. చింత చెట్టు రాదు , అది గుర్తుపెట్టుకొని మాట్లాడు.’’ అన్నాడు.
‘‘ అది చెట్ల విషయంలో మనుషుల స్వభావాల్లో కాదు. మనకి పిల్లలు పుడితే అన్నీ మీ బుద్దులే వస్తాయని లేదు. నా పోలికలు, నా మనస్తత్వం కూడా రావొచ్చు. ఇంతెందుకు ఎంతో మంచివాడైన మిా నాన్న గారికి మిారు పుట్టలేదా? తండ్రిలాగే కొడుకు, కొడుకులాగే తండ్రి వుండాలని ఎక్కడా లేదు…. గాడ్సే లాంటి తండ్రికి గాంధీ మహాత్ముడులాంటి కొడుకు పుట్టొచ్చు. గాంధీమహాత్ముడులాంటి తండ్రికి గాడ్సేలాంటి కొడుకు పుట్టొచ్చు. మైకేల్‌ జాక్సన్‌ తండ్రి పెద్ద శాడిస్ట్‌. అతని కడుపున పుట్టిన మైకేల్‌ జాక్సన్‌ ప్రపంచ దేశాలు అబ్బురపడే డాన్సరయ్యాడు, పురస్కారాలు అందుకున్నాడు. దాన ధర్మాలు చేశాడు.

అతి సాధారనమైన తండ్రి కడుపున స్వతంత్ర సమరయోధుడు సుభాష్‌ చంద్రబోస్‌ పుట్టాడు…దావుద్‌ ఇబ్రహీం తండ్రి నిజాయితీపరుడైన కానిస్టేబుల్‌. ఆయన పేదరికంలో పుట్టి, పేదరికంలో పెరిగినా తన నిజాయితీని ఎక్కడా పోగొట్టుకోలేదు. మరి అలాంటి తండ్రి కడుపున ప్రపంచ దేశాలను, చట్టాలను తుంగలో తొక్కి బొంబాయి మహానగరాన్ని నిట్ట నిలువునా కాల్చేసిన భయంకర నరరూప రాక్షసుడు, మాఫియా లీడర్‌ అయిన దావూద్‌ ఇబ్రహీం ఎలా పుట్టాడు….? సర్ద్దార్‌ వల్లభాయ్‌పటేల్‌ తండ్రి కూడా అతిసామాన్యుడే… అయినా జెనిటికల్‌గా వున్న సుగర్‌ జబ్బే పిల్లలకి వస్తుందో, రాదో గ్యారంటీ లేనప్పుడు మీకు మిాలాంటి కొడుకే పుడతాడన్నది ఎక్కడుంది చెప్పండి!’’ అంది.

హేమేంద్ర మాట్లాడలేదు.
‘‘ మిాకింకో విషయం చెప్పనా! తల్లి నవమాసాలు మోసేటప్పుడు ఆమె చేసే ఆలోచనలే బిడ్డకు సంక్రమిస్తాయట…. ఆమె ఆలోచనలు, ఆధ్యాత్మికంగా, ధీరోదాత్తంగా వుంటే అటువంటి బిడ్డలే కలుగుతారట.. అందులో కొందరు మాతృమూర్తులను ఉదాహరణగా చెబుతాను. సుభద్ర గర్భంతో వున్నప్పుడు ఆమె భర్త అర్జునుడు ఆమెకు పద్మ వ్యూహాన్ని ఛేదించే రహస్యం చెప్పాడు. కడుపులో వున్న బిడ్డ తండ్రి చెప్పేది శ్రద్దగా విన్నాడు. కనుకే పద్మ వ్యూహాన్ని ఛేదించగలిగాడు. అయితే పద్మవ్యూహం నుండి బయటకు వచ్చే రహస్యం అర్జునుడికి చెప్పే అవకాశం శ్రీకృష్ణుడు ఇవ్వకపోవటంతో అభిమన్యుడు ఛేదించగలిగాడే కాని బయటకు రాలేకపోయాడు….
అష్టావక్రుడనే ఋషి తల్లిగర్భంలో వుండే వేదవేదాంగాలను నేర్వగలిగాడు… అలాగే శకుంతల కూడా వీరుడైన దుష్యంత మహారాజు ఆలోచనతో సింహ సమానుడైన భరతుడ్ని కన్నది. కనుకే చిరుప్రాయంలోనే భరతుడు సింహాన్ని అధిరోహించి తిరిగేవాడు… మదాలసాదేవి తన పుత్రులైన విక్రాంతుడు, సుబాహువు, అరిదమనుడులను సంసారమాయ, రాజ్యకాంక్షలకు లోబడకుండా పెంచగలిగింది…. ఇలా ఎందరో తల్లులు తమ ఉదాత్తమైన ఆలోచనలతో గర్భంలోనే బిడ్డలను తీర్చిదిద్దుకోగలిగారు… మహా భక్తుడైన ప్రహ్లాదుడు కూడా తల్లి గర్భంలోనే విష్ణు భక్తుడయ్యాడు. అలా బిడ్డల్ని తీర్చిదిద్దుకోగలిగే శక్తి తల్లికి వుంటుంది. రేపు మనకి పుట్టబోయే బిడ్డ కూడా…..’’ అంటూ భర్త వైపు తిరిగి చూసిందిసిరిప్రియ.
… హేమేంద్ర అప్పటికే నిద్రపోయాడు.

తొమ్మిది నెలలు గడిచాయి.
ప్రతిరోజు అవసరాన్ని బట్టి డాక్టర్‌ దగ్గర చెకప్‌లు, ఇంజక్షన్లు, ఇంట్లో వాళ్లు తీసుకునే జాగ్రత్తలు వెరసి ఓ యజ్ఞం పూర్తయినట్లు స్నేహితకి ఓ శుభనక్షత్రాన దివ్యజ్యోతిలాంటి కొడుకు పుట్టాడు.
హాస్పిటల్లో స్నేహిత వుండే రూం బంధువులతో నిండిపోయింది. వచ్చేవాళ్లు వస్తున్నారు. బాబును చూసి వెళ్లేవారు వెళ్తున్నారు. బెంగుళూర్‌ నుండి స్నేహిత బావగారు, తోడికోడలు శుభ వస్తున్నట్లు ఫోన్‌ చేశారు.
స్నేహితకి, భువనేష్‌కి ఆనందంగా వుంది. స్నేహిత తల్లిదండ్రులు సంతోషించారు.నీలవేణమ్మకి కాలు ఓ చోట నిలవకుండా అంతా తనే అయి తిరుగుతోంది. ఎవరూ లేని టైం చూసి మనవడికి దిష్టి తీసి వేస్తోంది.
హాస్పిటల్లో వున్న మనవరాలిని చూడాలని గోమతమ్మ హైదరాబాద్‌ వచ్చినట్లు తెలిసి, ఓల్డేజ్‌ హోంలో వున్న కాత్యాయని, రామేశ్వరి నేరుగా హాస్పిటల్‌కే వచ్చారు. అప్పటికే బంధువులంతా చాలా వరకు వెళ్లిపోయారు.

స్నేహిత వున్న రూంలో బాబును చూస్తూ గోమతమ్మ, కాత్యాయని, రామేశ్వరి కూర్చుని మాట్లాడుకుంటున్నారు.
‘‘తొలి కాన్పు కాబట్టి వరంగల్‌లోనే చేసేవాళ్లం కాత్యాయనీ. కానీ స్నేహితకి మొదటి నుండి ట్రీట్‌మెంట్‌ ఇక్కడే జరిగింది. కాబట్టి డెలివరీ కూడా ఈ హాస్పిటల్లోనే చేయించాము. ఖర్చంతా నా కొడుకే పెట్టుకున్నాడు. భువనేష్‌తో ఒక్క పైసా కూడా పెట్టనివ్వలేదు.’’ అంది గోమతమ్మ… తొలి కాన్పు హైదరాబాద్‌లో చేయించినందువల్ల తన కొడుకు గొప్పతనం ఎక్కడ తగ్గుతుందో అని ఆమె భయం. ఏ విషయంలో కూడా ఇతరులు తమని వేలెత్తి చూపకూడదన్నదే ఆమె తాపత్రయం.
రామేశ్వరి దృష్టి అంతా బాబు మిాద వుంది.

గోమతమ్మ మాటలు ఆపి రామేశ్వరి వైపు చూస్తూ ‘‘బాబు ఎలా వున్నాడు రామేశ్వరి? ఎవరి పోలికలు వచ్చాయో చెప్పు?’’ అంది మురిపెంగా బాబునే చూస్తూ…
‘‘పసి బిడ్డలో పోలికలు చెప్పాలంటే కష్టం గోమతీ! ఇంకా కొద్ధిరోజులు పోవాలి. కానీ చూడటానికి మాత్రం గొప్ప ప్రకాశవంతంగా, చురుగ్గా, ప్రశాంతంగా అన్పిస్తున్నాడు. నాకెందుకో ఆ ఆదిత్యుడే పుట్టాడనిపిస్తుంది….’’ అంది రామేశ్వరి. వెన్నులో జలదరింపు పుట్టింది స్నేహితకి. ఈ పెద్దవాళ్లని నమ్మటానికి లేదు. వీళ్ల చూపుకి లోతు ఎక్కువ. పైగా అనుభవజ్ఞులు అనుకొంది మనసులో…

‘‘ అయితే మొన్న నా మనవరాలి కాన్పు సమయంలో జరిగింది గుర్తొస్తోంది. ఈ బాబును చూస్తుంటే….’’ అంది రామేశ్వరి.
‘‘ఏం జరిగింది?’’ అన్నారు అందరు ఒకేసారి.
‘‘ ఆ రోజు నేనుండ బట్టి సరిపోయింది. లేకుంటే వాళ్లు తీసుకొచ్చి నా మనవరాలి పక్కన పడుకోబెట్టిన బిడ్డనే ఇంటికి తీసికెళ్లేవాళ్లం…. అప్పటికే ఆ బిడ్డను చూసి మా వాళ్లంతా ‘మనవాళ్లలో ఇంత నలుపు ఎవరున్నారు?’ అని పరిశోదన మొదలు పెట్టారు. అ తర్వాత వుంటే వుండొచ్చని ఒకరికి ఒకరు నచ్చ చెప్పుకున్నారు.
నేను వెళ్లి నర్స్‌ను నిలదీశాను. ‘‘తప్పయిపోయింది. నేను హడావుడిలో చూసుకోలేదు. మిాబాబును తీసుకెళ్లి పక్కనున్న తల్లి పక్కలో పడుకోబెట్టాను.’’ అని మా బిడ్డను మాకు తెచ్చి ఇచ్చింది. ఆ నర్స్‌కి ఎలాంటి పనిష్‌మెంట్‌ ఇవ్వాలో డాక్టర్‌తో మాట్లాడి ఇప్పించాను. కొన్ని చోట్ల అలాంటి పొరపాట్లు జరుగుతుంటాయి. ఇక్కడ కూడా అలాంటిదేమైన జరిగిందేమో చూసుకోండి!‘‘ అంది రామేశ్వరి అనుమానంగా చూస్తూ, వింటున్న కాత్యాయని, గోమతమ్మ వులిక్కిపడ్డారు.

వెంటనే స్నేహిత సర్దుకొని ‘‘ వీడు నా బిడ్డే బామ్మా! ఇందులో ఎలాంటి సందేహాలు వద్దు,.’’ అంది. అప్పటికే ఆమెలోని తల్లి మనసు గిలగిల్లాడిరది. దీని మొహం! దీనికేంతెలుసు బాబును చూడగా, చూడగా రామేశ్వరి మాటలే నిజమనిపించాయి గోమతమ్మకి… ఆమెలోకి చిన్న పురుగు ప్రవేశించి తొలవటం మొదలుపెట్టింది. కాత్యాయని మాత్రం ఏం మాట్లాడలేదు. ఆమెకంతా అయోమయంగా వుంది… ఆఫ్రికన్ల కడుపున ఆఫ్రికన్లే పుడతారు. అమెరికన్లు పుట్టరు. పాకిస్తానీల కడుపున పాకిస్తానీలే పుడతారు. భారతీయులు పుట్టరు. అలాగే ఏ ఇంటి పిల్లలు ఆ ఇంటి మనుషుల పోలికలతోనే వుంటారు. అలా లేకుంటే ఏదో మార్పు జరిగినట్లే లెక్క. ఆ మార్పు తప్పకుండా కన్పిస్తుంది.ఎందుకంటే ఏ బిడ్డలో అయినా అటు మూడు తరాలు ఇటు మూడు తరాలు రక్తం ప్రవహిస్తుందంటారు. అందుకే ఈ బిడ్డ ఈ ఇంటి బిడ్డ కాదేమో అని కొద్దిగా అన్పించినా రామేశ్వరి అలా పైకి అనటం కాత్యాయనికి నచ్చలేదు.

పెళ్లికి ముందు ‘‘ అటు చూడకే స్నేహ! ఇటు కూడా చూడకు. ఆ పాటలేంటి? ఆ వేషాలేంటి? తిన్నగా వుండలేవా? ఆడపిల్ల ఇలాగేనా వుండేది?’’ అని గోమతమ్మ అంటుంటే ‘‘అబ్బా ! బామ్మా! నువ్వండవే!’’ అని అమాయకంగా అనటం తప్ప ఇంకో మాట అనేది కాదు… పెళ్లయ్యాక పిల్లలు పుట్టలేదని, గర్భసంచి లేదన్నారు. గొడ్రాలివి అన్నారు. అ బాధను కూడా మౌనంగా భరించింది…. చివరికి టెస్ట్‌ట్యూబ్‌ బేబిని కనటానికి కూడా సిద్ధపడిరది. ఏ ఆడపిల్ల తీసుకోని రిస్క్‌ తీసుకున్నది…నిజానికి ఈ రోజుల్లో చాలామంది అమ్మాయిలు ఏ మాత్రం రిస్క్‌ అన్పించినా దాన్ని పేస్‌ చెయ్యటానికి సిద్ధంగా లేరు…. పిల్లలు పుట్టకపోయినా, భర్తతో ఏ చిన్న ప్రాబ్లమ్‌ వచ్చినా విడాకులు తీసుకుంటున్నారు. పిల్లలు పుడితే అందం తగ్గుతుందని. అమ్మతనాన్ని కూడా కాదనుకొని అబార్షన్లు చేయించుకుంటున్నారు. తాము బ్రతకటానికి ఆర్థికపరమైన వెసులుబాటు ఏ మాత్రం ఏర్పడినా ఏ అనుబంధాన్నైనా సమస్యలాగే ట్రీట్‌ చేస్తున్నారు. పరిష్కారం వెతుక్కుంటున్నారు..

అందుకే కాత్యాయని రామేశ్వరి వైపు చూసి ‘‘ ఈ బిడ్డ స్నేహిత బిడ్డే… నా కళ్లకి అచ్చు స్నేహితలాగే అన్పిస్తున్నాడు. దీని మిాద నువ్వింకో మాట కూడా మాట్లాడొద్దు ఎక్కడో ఏదో జరిగిందని అన్నిచోట్ల అలాగే జరగదు. అమ్మగా మారటం ఏ స్త్రీకి అయినా అపూర్వమైన అనుభవం. స్నేహిత ఎంతో కష్టపడి మాతృత్వపు కలల్ని సాకారం చేసుకుంది…. తనలో లేనిపోని అలజడి లేపొద్దు. చేతనైతే అభినందించు. సంతోషిస్తుంది. మనకి టైమయింది వెళ్దాం….’’ అంటూ లేచి రామేశ్వరిని తీసికెళ్లింది కాత్యాయని.

వాళ్ళు వెళ్లాక స్నేహిత వైపు, బిడ్డవైపు చూసి ‘‘స్నేహితా! నీ బిడ్డను మార్చినట్లు నీకేమైనా అన్పిస్తుందా?’’ అంది గోమతమ్మ నెమ్మదిగా.
‘‘రామేశ్వరి బామ్మ ఏదో తన ఎక్స్‌పీిరియన్స్‌ని చెప్పిందని నువ్వు కూడా అదే పట్టుకున్నావేం బామ్మా! నాకు జరిగింది నార్మల్‌ డెలివరీ కాబట్టి నా బిడ్డను నేను చూసుకున్నాను. ఈ బిడ్డ నా బిడ్డే….’’ అంది కచ్చితంగా.
డాక్టర్‌ గారు వస్తున్నట్లు విన్పించి మాటలు ఆపేసింది గోమతమ్మ.

చేతన అంటే నిజాయితీ, క్రమశిక్షణ, పట్టుదల, ప్రతిభ, మేధస్సు, చిరునవ్వు, కసి, కలబోసిన బంగారు ముద్ద. చురుగ్గా ఆలోచించడం, తిరుగులేని నిర్ణయాలు తీసుకోవటం, వెనకడుగు లేకుండా దూసుకెళ్లిపోవటం, ఆమెలో వుండే ప్రత్యేకత……ఎవరి ప్రభావానికి లొంగకుండా, తనవల్ల ఈ సమాజానికి, దేశానికి మేలు జరుగుతుందని నమ్మి పదునెక్కిన బాణంలా సాగి, మంచి డ్రగ్‌ ఇన్స్‌పెక్టర్‌గా పేరు తెచ్చుకుంది.

ఆమె ద్యాస అంతా మందుల మిాద, మందుల షాపుల మిాదనే వుంటోంది. ప్రతిక్షణం అలర్ట్‌గా వుంటూ మెడికల్‌ షాపుల్లో వుండే కెమిస్ట్రీలను నిద్రపోకుండా చేస్తోంది. ధనార్జనే ధ్యేయంగా పెట్టుకున్న కొన్ని మెడికల్‌ షాపుల్ని మూయించి వేసింది. అసలే ఒకవైపు భూగోళం వేడెక్కి, వరదలు, ముంచేస్తూ, కరువులు కాటేస్తుంటే కల్తీ మందులు మనుషుల ప్రాణాలను పొట్టనపెట్టుకోవటం క్షమించలేకపోతోంది….. ఎంతో సాహసంతో ఒక్కోసారి ఆమె విజృంభించిన తీరు చాలా మంది దృష్టిలో అభినందనీయంగా మారి ఆమెకు వెన్ను దన్ను అవుతోంది. దీనివల్ల పరోక్షంగా రోగులకి న్యాయం జరుగుతోంది ఇలా ఆమె లక్ష్యం ఎప్పటికప్పుడు నిరంతరాయంగా నెరవేరుతోంది.
సోఫాలో రిలాక్స్‌ గా కూర్చుని రిమోట్‌తో చానల్స్‌ మార్చుకుంటూ టి.వి.చూస్తోంది చేతన. అంతలో బాల్కనీలో ఎవరో నిలబడివున్నట్లు నీడ కన్పించి అటువైపు చూసింది. ఆ తర్వాత ఆ నీడవున్న వైపు నుండి ఆదిత్యలోపలకి వచ్చాడు. ఆమెకు అర్థం కాక ఆదిత్యను చూడగానే…. ‘‘అక్కడెవరో నిలబడివున్నట్లుంది. ఎవరన్నయ్యా?’’ అంది చేతన.

ఆదిత్య మౌనంగా ఆమెకు ఎదురుగా వచ్చి కూర్చుంటూ…. ‘షణ్ముఖం చేతనా! నిన్ను కలవాలని, మాట్లాడాలని వచ్చాడు. లోపలకి రావాలంటే సంశయిస్తూ అక్కడే నిలబడ్డాడు.’’ అన్నాడు.
చేతన మాట్లాడకుండా వేరే చానల్‌ మార్చబోతూ, అది మానుకొని టి.వి. ఆపేసి అన్నయ్య ఏం మాట్లాడబోతాడో ముందుగానే తెలిసిన దానిలా కూర్చుంది.

‘‘షణ్ముఖం మందుల షాపుకి ఈరోజు నువ్వెళ్లావట కదా! తనవల్ల చిన్న మిస్టేక్‌ జరిగిందని బాధపడ్తున్నాడు. ఎంతయినా అతను నా ఫ్రెండ్‌ చేతనా! బాధపడితే చూడలేను. అతన్ని క్షమించు….’’ అన్నాడు.
‘‘నా డ్యూటీ నేను చేశాను అన్నయ్యా.! క్షమాపణలు అవసరం లేదు.’’ అంది నిర్మొహమాటంగా. అది గమనించాడు ఆదిత్య. ‘‘షణ్ముఖం భార్యా పిల్లలు వుండేవాడు. చూసి, చూడనట్లు వదిలెయ్యాలి. అతనేమైనా ప్రపంచ బ్యాంకుల్ని దోచుకున్నాడా? డ్యాముల్ని కూల్చి వేశాడా?’’ అన్నాడు గంభీరతను గొంతు లోకి తెచ్చుకొని…
‘‘నువ్వు చెప్పిన నేరాల వల్ల డబ్బు, సమయం వృధా అవుతాయి. అతను మందుల షాపులలో కూర్చుని చేసే తప్పుల వల్ల ప్రాణాలు పోతాయి. అక్కడి సిట్యుయేషన్‌ నీకు తెలిస్తే అతన్ని ఇలా సపోర్టు చెయ్యవు… అతనిచ్చే మందుల్లో క్వాలిటీ లేకపోయినా, కల్తీ వున్నా, ఎక్క్‌పైర్‌ అయినా ఆ పేషంట్‌ చనిపోయి తన భార్యా పిల్లలకి దూరమవుతాడు…. ఒక డ్రగ్‌ ఇన్స్‌పెక్టర్‌గా నాకు కొన్ని పండమెంటల్‌ డ్యూటీస్‌ వుంటాయి. వాటిని నేను తప్పకుండా పాటించాలి.

అందులో బాగంగా`ప్రతి మెడికల్‌ షాపులో క్వాలిటీ డ్రగ్స్‌ వున్నాయా లేదా అన్నది చూడాలి….. బాటిల్‌ మిాద వున్న రేటుకి అమ్ముతున్నారా లేదా చూడాలి…. కొంతమంది డాక్టర్లు తమకి వచ్చిన పిజీషియన్‌ శాంపిల్స్‌ని రోగులకి ఫ్రీగా ఇవ్వకుండా మెడికల్‌ షాపుల్లో పెట్టి అమ్ముతుంటారు. అదికూడా గమనించాలి….కొన్ని గవర్నమెంట్‌ హాస్పిటల్స్‌లో ఇచ్చే మందుల్ని కూడా మెడికల్‌ షాపుల్లో పెట్టి అమ్ముతుంటారు. దాన్ని కూడా మేము ఖండిరచాలి… మందుల్ని పరీక్ష నిమిత్తం నెల నెలా టెస్టింగ్‌ లాబరేటరీకి పంపించి, ఏ కంపెనీ ఎలా తయారు చేస్తుందో, అందులో మందు వుందో లేదో చూసుకోవాలి.. ఇంకా కొంతమంది దొంగ బిల్లులు, అంటే టాక్స్‌లు అవాయిడ్‌ చెయ్యటానికి బోగస్‌ కంపెనీ ద్వారా మందుల్ని తయారు చేయించుకొని, బోగస్‌ బిల్లులతో అమ్ముతుంటారు. ఇలాంటివి లేకుండా చూసుకోవాలి…’’ అంటూ ఆగింది చేతన. ఆదిత్యకి విషయం అర్థమై చెల్లెలు వైపు అలాగే చూస్తున్నాడు. ఆమె చేసే పనిలోనే కాదు.. మాటల్లో కూడా క్లారిటీ కన్పిస్త్తోంది.

ఆమె ఆదిత్యవైపు చూసి ‘‘అంతేకాదు అన్నయ్యా! మెడికల్‌ షాపుల్లో స్టోరేజ్‌ కండిషన్స్‌ని కూడా మేము గమనించాలి. అంటే! కొన్ని మందులు ‘లో’ టెంపరేచర్‌లో వుంచాలి. అవి పోలియో టి.టి. ఇన్సులిన్‌ లాంటివి…. కొన్నేమో తేమవున్న ప్రాంతంలో కాకుండా పొడి వాతావరణంలో వుంచాలి. అవి అమాక్సిలిన్‌, పెన్సిలిన్స్‌ లాంటివి…. ఆయింట్‌మెంట్స్‌, ఐడ్రాప్స్‌ లాంటివి ఎక్కువ టెంపరేచర్‌లో వుంచకూడదు. కరిగిపోతాయి,
అందుకే వాటిని కూల్‌ టెంపరేచర్‌లో వుంచకూడదు. కరిగిపోతాయి, అందుకే వాటిని కూల్‌ టెంపరేచర్‌లో పెట్టాలి…. కొన్ని మందులు డాక్టర్‌ ప్రిష్కప్షన్‌ మిాదనే అమ్మాలి. అవి గాడ్రినాల్‌, డైజీపామ్‌, ఆల్‌ప్రోజమ్‌… సో ఇలా ఎనీ డ్రగ్‌ ఈజ్‌ ఎ పాయిజన్‌ ఇన్‌ ఎక్సెస్‌ క్వాంటిటీ… ఇలాంటివన్నీ మా డ్రగ్‌ ఇన్స్‌పెక్టర్స్‌ మానిటర్‌ చేసుకోవాలి…. నిన్న షణ్ముఖం షాపులో నాకు కొన్ని లోపాలు కన్పించాయి. వార్నింగ్‌ ఇచ్చాను. అతను వాటిని సవరించుకోలేకపోతే ఈసారి కేసు బుక్‌ చేస్తాను.’’ అంది.

‘‘ నీకు సారీ చెప్పాలని వచ్చాడు. ’’ అన్నాడు ఆదిత్య.
‘‘సారీతో ఏంరాదు. ఆయనే మారాలి. మంచి మందుల్ని రోగులకి ప్రొవైడ్‌ చెయ్యాలి. మనుషుల ప్రాణాల విలువ తెలుసుకోవాలి.’’. అంది.
ఆదిత్య ఇంకేం మాట్లాడలేదు.
లేచి స్నేహితుని దగ్గరకి వెళ్లాడు.
ప్రభాత్‌ దగ్గర నుండి కాల్‌రావటంతో వెంటనే లిఫ్ట్‌ చేసి మాట్లాడిరది చేతన.
మాటల మధ్యలో ‘‘ఏంటి చేతనా! అనీజీగా వున్నావ్‌? నీ వాయిస్‌ కూడా డల్‌గా విన్పిస్తోంది. ఏం జరిగింది?’’ అన్నాడు కంగారుగా.

‘‘నేను అన్నయ్య మనసును కష్టపెట్టానేమోననిపిస్తోంది. ప్రభాత్‌! ఎంతయినా షణ్ముఖం అన్నయ్యకి మంచి స్నేహితుడు. అదే ఆలోచిస్తున్నాను.’’ అంటూ జరిగింది చెప్పింది చేతన.
‘‘చూడు చేతనా! అతను ఎంత స్నేహితుడైనా అలాంటి పనులను మిా అన్నయ్య సపోర్టు చెయ్యడు. ఆదిత్య గారి తత్వం నాకు బాగా తెలుసు. డోంటువర్రీ’’ అన్నాడు ప్రభాత్‌.

( ఇంకా ఉంది )

– అంగులూరి అంజనీ దేవి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

107
ధారావాహికలు, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో