బెంగుళూరు నాగరత్నమ్మ

వి.శ్రీరామ్

వి.శ్రీరామ్

అవశేషంగా మిగిలిన దేవదాసీ వ్యవస్థ మిద 1935-37లలో దాడులు జరిగాయి. దేవాలయాలకి స్త్రీలని అంకితమివ్వడం చట్టరీత్యా నేరమని 1934లో బాంబే ప్రెసిడెన్సీ చట్టం చేసింది. కొత్తగా నిర్మాణమయిన మద్రాసు శాసనమండలి దేవదాసీల అంకితాన్ని నిషేధిస్తూ బిల్లు ప్రవేశపెట్టింది. సెలెక్ట్‌ కమిటీకి దీన్ని అప్పజెప్పారు. దాని నివేదిక పూర్తయ్యేలోపే 1939లో రెండో ప్రపంచ యుద్ధం మొదలైంది. రాష్ట్రప్రభుత్వాల్ని సంప్రదించకుండా వైస్రాయి లార్డ్‌ లిన్‌లిత్‌గో యుద్ధంలో భారతదేశం పాల్గొంటున్నట్టు ప్రకటించాడు. దీనికి నిరసనగా మంత్రిమండలి వారందరూ రాజీనామాలు చేశారు. దాంతో ఈ బిల్లు కొన్నాళ్ళు నిలిచిపోయింది.  ఈ మార్పుల గురించి దేవదాసీలు ఏమి స్పందించలేదు. నాగరత్నమ్మ కూడా ఎలాంటి ప్రకటనా చెయ్యలేదు. కాని తోటి స్త్రీల దైన్యం ఆమెకి బాధని కలిగించి వుండొచ్చు. తన సర్వశక్తుల్నీ ఆరాధనకే వినియోగించింది.

1939లో సంగీత ప్రియుడైన ఎస్‌.వై కృష్ణస్వామి, ఐసిఎస్‌ కావేరి డెల్టా రీజియన్‌కి ప్రత్యేకాధికారిగా తంజావూరు వచ్చాడు. వీణధనం కుటుంబానికి అతను పోషకుడు. అతనికి సంగీతకారులందరూ తెలుసు. ఆరాధన నిర్వహణకి అందరినీ కూడగట్టడంలో అతను చేసిన కృషికి సత్ఫలితాలు రావడం మొదలయింది. వాళ్ళ ఐక్యతకి పరిస్థితులు కూడా అనుకూలించాయి. పెరియ కచ్చి వాళ్ళు చేతులెత్తేయడానికి సిద్ధంగా వున్నారు. చిన్న కచ్చి వర్గంలో కూడా తిరుగుబాటు ధోరణులు కనిపిస్తున్నాయి. అరియకుడి రామానుజయ్యంగార్‌ జీవనసహచరి కె.ఎస్‌. ధనమ్మాళ్‌ ఒక దేవదాసి. ఆరాధనలో స్త్రీలకి తప్పని సరిగా అవకాశం వుండాలని ఆమె ఆయన్ని ఒత్తిడి చేసింది. మహారాజపురం విశ్వనాథ అయ్యర్‌కి ఎవరి మిదా వ్యతిరేకత లేదు. ఎవరు నిర్వహించినా సరే, ప్రతి సంవత్సరం ఆరాధన సక్రమంగా జరిగితే ఆయనకి ఆనందం. చిన్నకచ్చిలో పెద్దవాడయిన వేణు గాన విద్వాంసుడు పల్లడం సంజీవరావు వాయించే ‘చేతులార’ ‘ అనే భైరవి రాగకృతితో ఆరాధన మొదలవుతుంది. ఆయనకి కూడాఈ పరిస్థితులకి చిరాకు కలిగింది. ఇలాగే కొనసాగినా శూలమంగళం వైద్యనాధభాగవతార్‌ తన మానాన తను పనిచేసుకు పోయేవాడేమో. ఇంతలో 1938లో మాంగుడి చిదంబర భాగవతార్‌ హఠాత్తుగా చనిపోయాడు. దీంతో ఆయనలో మార్పు వచ్చింది. అయినా 1939 చివర్లో చిన్న కచ్చివాళ్ళు 1940లో జరపవలసిన ఆరాధనకి ఏర్పాట్లు మొదలు పెట్టారు. ఆహ్వాన పత్రాలు, కరపత్రాలు అచ్చుకి ఇచ్చారు.

ఈ సమయంలో, ఎస్‌.వై. కృష్ణస్వామికి సన్నిహితుడైన ముసిరి సుబ్రమణ్య అయ్యర్‌ అన్ని వర్గాలనీ మద్రాసులో సమావేశానికి ఆహ్వానించాడు. ఇది 1940, జనవరి 10న కృష్ణస్వామి ఇంట్లో జరిగింది. చిన్నకచ్చి వర్గం తరఫున అరియక్కుడి రామానుజయ్యంగార్‌, పెరియకచ్చి వర్గం తరఫున తిరువిజిమిజలై సోదరులు, మహిళల ఆరాధన సంఘం తరఫున నాగరత్నమ్మ, సి.వి. రాజగోపాలాచారి పాల్గొన్నారు. శెమ్మగుడి శ్రీనివాస అయ్యర్‌ కూడా పాల్గొన్నాడు. ఐక్య ఆరాధనకి సూత్ర ప్రాయంగా అందరూ అంగీకరించారు. ఆహ్వాన పత్రాలు, కరపత్రాలు తయారుచేసి సి. వి. రాజగోపాలాచారి చేత వైద్యనాధభాగవతార్‌ అంగీకారం కోసం పంపారు. దీంతో పాటు అరియక్కుడి, ముసిరి, శెమ్మంగుడి సంతకం చేసిన వుత్తరం కూడా పంపారు. చిన్నకచ్చివాళ్ళు వేస్తూన్న ఆహ్వానపత్రాలని నిలిపేసి, వీళ్ళు పంపిన పత్రాల్లోని నిజాయితీని గుర్తించమని అందులో కోరారు.
కొద్ది రోజులకి తిరుచ్చిలో రెండో సమావేశం జరిగింది. దానికోసం శూలమంగళం వైద్యనాధ భాగవతార్‌ కూడా హాజరై తన షరతులు ముందుంచాడు.

త్యాగరాజు శిష్యపరంపరకి సమాధి దగ్గర పూజ నిర్వహించే హక్కు గురించినది మొదటి అంశం. శిష్యులందరి ప్రతినిధిగా రాజగోపాల భాగవతార్‌ పాల్గొన్నాడు. రాముడు భాగవతార్‌ పూజ చెయ్యడానికి ఒప్పుకోనని, చిన్నకచ్చితరఫున రాజగోపాల భాగవతారే చేయాలని ఆంక్షపెట్టాడు. దీనికి అందరూ ఒప్పుకున్నారు.
శ్రాద్ధకర్మలు శాస్త్రప్రకారం చెయ్యాలనీ, దానికవసరమైన వంట పవిత్రంగా చెయ్యాలనేది రెండోషరతు. త్యాగరాజుఆత్మకి ప్రతినిధులుగా వున్న ఆ పదహారుగురు బ్రాహ్మణులకి మాత్రమే ఇది వడ్డించాలి. దీనికీ ఒప్పు కున్నారు. అందరూ కలిసి రాముడు భాగవతార్‌ ఇంట్లో శ్రాద్ధకర్మ నిర్వహించేందుకు శూలమంగళం ఒప్పుకున్నాడు, చివరికి.

నాగస్వర కళాకారులు వేదిక మిద మాత్రం వాయించకూడదనేది ఆఖరి షరతు. శాస్త్రప్రకారం సమాధి బయట నుంచుని వాయించాలి. తిరువిజిమిజలై సోదరులు దీనికేమి అడ్డు చెప్పక పోవడం ఆశ్చర్యం.
ఈ ఒప్పందాలు, సంధికార్యక్రమాల్లో ముసిరి సుబ్రమణ్య అయ్యర్‌ ముఖ్యపాత్ర వహించాడు. అతను ఇంగ్లీషులో ధారాళంగా మాట్లాడగలిగేవాడు. అతని స్నేహితులు పెద్ద హోదాల్లో వున్నారు. ఏమాత్రం సహకరించని వాళ్ళనీ, ఛాందసులైన సంగీతకారుల్ని కూడా మార్చగల చాకచక్యం గల సమర్థుడతను. అతనికి శెమ్మంగుడి సహకారమందించాడు. ముసిరి, సంగీత అకాడమిలో కీలకస్థానంలో వున్నాడు అక్కడ కళాకారులందరూ ఏకంగా వున్నట్టే, ఇక్కడ కూడా అందరూ ఏకంగా సంవత్సరాని కొకసారి త్యాగరాజు ఆరాధన నిర్వహించాలని కోరాడు. అలా శ్రీ త్యాగబ్రహ్మ మహోత్సవ సభ ఒక సంస్థగా నమోదయ్యింది. ఈనాటి సంకీర్ణ ప్రభుత్వాల లాగా అందర్నీ సంతృప్తి పరుస్తూ ఒక పెద్ద కమిటీ ఏర్పడింది. దానికి తిరువయ్యారు కాక మద్రాసు ప్రధాన కార్యాలయంగా రిజిష్టర్‌ అయింది. త్యాగరాజు గ్రామం కన్నా మద్రాసే క్రియాశీల కార్యక్రమాలకి వేదిక అన్నమాట. అలాగే సంగీత అకాడమిలో ముఖ్య సభ్యులందరూ సంగీతకారులు కానివాళ్ళే. చెట్టినాడులో వున్న పెద్ద వ్యాపారవేత్త రాజా శ్రీ అన్నామలై చెట్టియార్‌ అధ్యకక్షుడు. పిఠాపురం యువరాజు, కొచ్చిన్‌ దివాను ఆర్‌. కె. షణ్ముఖం చెట్టి (నాట్యకారిణి టి. బాలసరస్వతి పోషకుడు), ‘హిందూ’ పత్రిక అధిపతి, కె. శ్రీనివాసన్‌, మైలాపూర్‌లో ప్రసిద్ధ న్యాయవాది కె. ఎస్‌. జయరామఅయ్యర్‌, భూస్వామి, వ్యాపార వేత్త వి. యస్‌. త్యాగరాజ మొదలియార్‌, సి.వి.సి.టి.వి. వెంకటాచలం చెట్టి అనే వ్యాపారవేత్త వీళ్ళంతా అకాడమి ట్రస్టీలు.

ఈ జాబితా పరిశీలించదగింది. సంగీత ప్రపంచం అప్పటికే తమిళ ఇశై వుద్యమంతో అతలా కుతలం అవుతోంది. కచేరీల్లో తమిళపాటలకే ప్రాధాన్యం ఇవ్వాలని ఒక వర్గం భావిస్తే, అది సంగీతానికి అనువైన భాషకాదని మరో వర్గం వాదన. అకాడమి అధ్యకక్షుడు తమిళ ఇశై పక్షం. షణ్ముఖం చెట్టి, త్యాగరాజ మొదలియార్‌, వెంకటాచలం కూడా ఆ జట్టు లోని వారే. పిఠాపురం యువరాజు వారి వ్యతిరేకపక్షం. జయరామయ్యర్‌, కె.శ్రీనివాస అయ్యర్‌ తటస్థ వైఖరి అవలంభించారు. అయినప్పటికీ తెలుగు వాగ్గేయకారుడైన త్యాగరాజుని స్మరించుకోవడానికి ఏర్పడిన సంస్థ కోసం ఒకటయ్యారు. త్యాగరాజు గొప్పదనమే దీనికి కారణం. మరో కారణం కోశాధికారి, కార్యదర్శి అయిన ముసిరి కూడా. ఒక్క ఊపున ఆయన, ఆరాధన నిర్వహణలో సాధారణ స్థాయి నుంచి కీలక స్థాయికి ఎదిగారు. తిరువిజి మజిలై సోదరుల్లో ఒకరయిన ఎస్‌. సుబ్రమణ్య పిళ్ళై మరో కార్యదర్శి. నాగరత్నమ్మ సహాయకుడు సి.వి. రాజగోపాలాచారి ఇద్దరు ఉపకార్యదర్శుల్లో ఒకరు.

కార్యనిర్వాహక కమిటీలో 38మంది సంగీతకారులున్నారు. పూర్వం ఆరాధన నిర్వహణలో పాలుపంచుకున్న కొందరి పేర్లు కూడా ఈ కమిటీలోవున్నాయి. ముఖ్యంగా అయిదుగురు మహిళలు వున్నారు. స్వయానా గాయకురాలూ, కళాపోషకురాలు అయిన అలిమేలు జయరామయ్యర్‌, బెంగుళూరు నాగరత్నమ్మ, సి. సరస్వతీ బాయి, టి. బాలసరస్వతి, గాయనీ, నాటక సినీ కళాకారిణి కె.బి. సుందరాంబాళ్‌. ముగ్గురు రాజపోషకులు మైసూరు, గ్వాలియరు, తిరువాన్కూరు మహారాజులు, తిరువాన్కూరు యువరాణి సేతు పార్వతీబాయి కూడా వున్నారు.

కొద్ది కాలంలోనే, మొట్ట మొదట సాధారణమైన సంగీత మతపరమైన అంజలిగా ప్రారంభమైన ఆరాధన క్రమంగా ఒక సాంఘిక ఘటనగా మారింది. దీనిలో పాల్గోనడం ఒక హోదాగా పరిణమించింది. దీనికి ఆర్థిక అవసరాలూ వున్నాయి. విరాళాలకి సంబంధించిన వ్యవహారాలకి ఒక బాంక్‌ అవసరమయింది. చెట్టియార్‌ ప్రముఖ పాత్ర వహిస్తున్న ఇండియన్‌ బాంక్‌ ఆ స్థానం తీసుకుంది. ప్రతిసంవత్సరం ఒక సంచిక ప్రచురించాలని కూడా నిర్ణయించారు. జరిగిన ఆరాధన కార్యక్రమాల వివరాల కోసమే కాకుండా దాతల వ్యాపార ప్రకటనల కోసం కూడా ఇది అవసరమయ్యింది. ఈ ప్రకటనలవల్ల చాలా సొమ్ము పోగవుతుంది. పెద్ద ఎత్తున జరిగే ఆరాధనకి ఇంత సొమ్ము అవసరమే మరి.5

ఆరాధన నిర్వహణలో ఒక కచ్చితమైన కార్యక్రమాన్ని రూపొందించాలి. ఇప్పుడు ఇక ఆరాధనంటే కేవలం కొంతమంది సంగీతకారులు ఒక చోట కూడి, పూజచేసి, కృతులు పాడడం మాత్రమే కాదు. సంగీత అకాడమి, మద్రాసులోని ఇతర సంగీత సభల వార్షికోత్సవాల్లో లాగానే ఒక ప్రారంభోత్సవం వుండాలని కార్యవర్గ సభ్యులు భావించారు. మద్రాసులో జరిగే డిసెంబరు కచేరీల మాదిరిగా కచేరీలని క్రమ పద్ధతిలో ఏర్పాటు చేశారు. ఎవరి తర్వాత ఎవరిని వేయాలి అనే జాబితా తయారయ్యింది. ఒక శూలమంగళం వైద్యనాథ భాగవతారో, ఒక నాగరత్నమ్మో ఎవరినో ఒకరిని ఆహ్వానించి పాడించడానికి ఇక కాలం చెల్లింది. కమిటీలో వున్న పెద్దవాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి అవకాశమివ్వవలసి వచ్చింది. సంగీత ప్రతిభ మాత్రమే కొలమానం కాకుండా పోయింది.
1940లో పెద్ద ఎత్తున త్యాగరాజు ఆరాధన జరిగింది. సమాధి ముందు ప్రత్యేకంగా ఎత్తుగా వేదిక నిర్మించి విద్యుద్దీపాలంకరణతో దేదీప్య మానంగా తయారు చేశారు. కచేరీలు సక్రమంగా జరిగేందుకూ, కళాకారులకి ఏ ఇబ్బంది కలగకుండాను అన్ని ఏర్పాట్లు చేశారు. పేరెన్నికగన్న కాంగ్రెసు వాది, మద్రాసు ప్రెసిడెన్సీ మాజీ ప్రధాని సి. రాజగోపాలాచారి (రాజాజి) వుత్సవాల ప్రారంభోత్సవం చేశారు. మొత్తం అయిదురోజుల వుత్సవం. మూడోరోజున అసలు ఆరాధన. హరికేశ నల్లూర్‌ ముత్తయ్య భాగవతార్‌, విడివిడిగా ఆరాధన జరిగినన్నాళ్ళు తన మాట ప్రకారం ఆరాధనలో పాలు పంచుకోలేదు గాని ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో పాల్గొన్నాడు. తిరువయ్యారు నడి బజార్లో శూల మంగళం వైద్యనాధ భాగవతార్‌ని కావిలించుకుని ‘తిరువయ్యారు పంచనదీశ్వరాలయం ఉత్తర దక్షిణ గోపురాలు ఏకమైనట్టుంది’ అన్నాడు.

కాని శూలమంగళానికి ఆనందంగాలేదు. జరగరానిది జరిగిపోయింది. వేదిక మిద నాగస్వర విద్వాంసులు వాయించగూడదనే షరతుకి ఒప్పుకున్నందుకు తిరు. సుబ్రమణ్య పిళ్ళైని టి.ఎన్‌. రాజరత్నం పిళ్ళై చీవాట్లు పెట్టాడు. తన వాళ్ళని గౌెెరవించకపోతే కమిటీకి తాను రాజీనామా చేయడమే మేలని సుబ్రమణ్య పిళ్ళైతో అన్నాడు. ముసిరి సుబ్రమణ్య అయ్యర్‌ జోక్యం చేసుకున్నాడు. సభ్యులందరూ సమావేశానికి వచ్చారు. చర్చల అనంతరం, నాగస్వర విద్వాంసులు వేదిక మిదనుంచి వాయించవచ్చని ప్రకటించారు. వాళ్ల ఆనందానికి పట్ట పగ్గాల్లేవు. వైద్యనాథభాగవతార్‌ లాంటి సనాతనుల కిది పెద్ద ఎదురుదెబ్బ.మొదటి రోజున చాలా కచేరీలయ్యాయి. చివరికి శెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్‌ రాత్రి పొద్దు పోయేదాకా పాడాడు. రెండో రోజు మధురైమణి అయ్యర్‌, పల్లడం సంజీవరావు, ముసిరి సుబ్రమణ్య అయ్యర్‌ లాంటి ప్రముఖుల కచేరీలు అయ్యాయి. మూడో రోజున సమాధి దగ్గర రెండు పూజాకార్యక్రమాలు జరిగాయి. వైద్యనాథ భాగవతార్‌ కోరిక ప్రకారం చిన్నకచ్చి తరఫున రాజగోపాల భాగవతార్‌ చేసిన పూజ ఒకటి. మిగతా అందరి తరఫున రాముడు భాగవతార్‌ చేసిన పూజ రెండోది. కొత్త మార్పు ప్రకారం నాగస్వర కళాకారులు వేదికమిద వాయించారు. గాత్ర కళాకారులూ, వాద్యకళాకారులూ, స్త్రీపురుషులు తలా ఒక కీర్తనతో అంజలి ఘటించారు. శూల మంగళం మొదలైన వాళ్ళందరి సమక్షంలో మధ్యాహ్నం ఒంటిగంటకి రాముడు భాగవతార్‌ ఇంట్లో శ్రాద్ధకర్మలు జరిగాయి.

ఈ లోపు నాగరత్నమ్మ సంగతేమిటి మరి? అంతపెద్ద ఎత్తున ఆ ఉత్సవం జరుగుతూండడం చూసిన ఆమె ఆనందానికి హద్దులులేవు. ఇప్పుడు ఆరాధనలో ఆమెకి ప్రముఖపాత్ర లేకపోవడం నిజం. కాని త్యాగరాజు ఆరాధన అందరి దృష్టిలో పడడం, సంగీత కళాకారులందరూ కలిసికట్టుగా పాల్గోవడం ఆమెకి చాలా ఇష్టమైన విషయాలు. ”నా ఆశలన్నీ నెరవేరాయి. పొరపొచ్చాల్లేకుండా అందరూ కలిసి ఆరాధన నిర్వహించడం కన్నా నాకు కావలసిందేమిటి?” అని రాసింది.

ఆరాధన రోజున కచేరీలు మధ్యాహ్నం 3.00గం|| కి మొదలయ్యాయి. నాగరత్నమ్మ సాయంత్రం 6.00 నుంచి రాత్రి 8.30 దాకా పాడింది. తరవాత అరియక్కుడి రామానుజయ్యంగార్‌ పాడాడు. రాత్రి 10.30కి శూలమంగళం వైద్యనాథ భాగవతార్‌ హరికథ . ఆయన మొదలు పెట్టబోయే ముందు నాగరత్నమ్మ వేదిక మిదకి వెళ్ళింది. ఆమె మైకు అందుకోగానే అందరూ పెద్దపెట్టున చప్పట్లు కొట్టారు. ఆయన కథ చెప్పేటప్పుడు పక్కన కూర్చుని వినాలని ఆమె చిరకాల వాంఛఅనీ, ఆయన అంగీకరించడంతో అది తీరిందని అన్నది. ఆయనని చాలా పొగిడింది. జనంచప్పట్లు కొడుతూనే వున్నారు. భాగవతార్‌ అంగీకారసూచకంగా తల ఆడించాడు. నాగరత్నమ్మ ఆయన పక్కన కూర్చుని కథ వింది. ఆమె వాచ్యం చెయ్యక పోయినా సమానత్వం కోసం ఆమె చేసిన పోరాటంలో జయం ఆమెదేనని అందరికీ అర్థం అయ్యింది.

నాలుగో రోజు బన్నీబాయి హరికథ ప్రత్యేక ఆకర్షణ. అయిదోరోజు ఉదయం ముత్తయ్య భాగవతార్‌ హరికథ అయ్యింది. దాని తరవాత శూలమంగళం ప్రేక్షకులని ఉద్దేశించి మాట్లాడుతూ ‘సమష్టి ఆరాధనకి తను వ్యతిరేకి ననే నింద తనమిదవుంద’న్నాడు ‘తన జీవితకాలంలోనే ఇలాంటి ఆరాధన జరగడం చూసి ఆనందిస్తున్నా’ నన్నాడు. ఆ రాత్రి త్యాగరాజు పటాన్ని పల్లకిలో పెట్టి పెద్ద ఊరేగింపు తీశారు. దారి పొడుగునా నాగస్వర కళాకారులు వాయిస్తూనే వున్నారు. మర్నాడు ఉదయం 6.30కి ఆ ఊరేగింపు సమాధిదగ్గరకి మళ్ళీ వచ్చి చేరుకుంది. కార్యక్రమాలన్నిటినీ శూలమంగళం సమిక్షించడంతో ఉత్సవాలు పూర్తిఅయ్యాయి. బయటికి చాలా మెచ్చుకున్నాడు గాని ఇంక ఎప్పుడూ వీటిలో పాలు పంచుకోగూడదని శూలమంగళం నిశ్చయించుకున్నాడు . స్త్రీ కళాకారులు, నాగస్వర కళాకారులు మొదలైన విషయాల మిద తనొక్కడే వేరేగా ఆలోచిస్తున్నట్టు అర్థమయ్యిందతనికి. ఆరాధనలో ఇక తన పాత్రలేదని భావించాడు. భవిష్యత్తులో దాన్ని ముందుకి తీసుకెళ్ళేవారు వేరే వున్నారని బోధపడింది. శూలమంగళం గ్రామానికి వెళ్ళిపోయి అక్కడ ప్రసిద్ధి పొందిన భాగవతమేళా అనే నృత్యరూపకాన్ని చుట్టుపక్కల గ్రామాల్లో నిర్వహిస్తూ గడిపాడు.

ఈలోపు 1941లో జరగవలసిన ఆరాధన ఏర్పాట్లు మొదలయ్యాయి. సంగీత కళాకారులు, సంగీత ప్రియులతో చాలా సమావేశాలు జరిగాయి. విరాళాలకోసం మద్రాసులో కొన్ని కచేరీలు పెట్టారు. మైలాపూర్‌ రసికరంజని సభహాల్లో సెప్టెంబరు 22న బ్రహ్మాండమైన సభతో మొదలు పెట్టారు. ఆనాటి సభకి ప్రముఖ న్యాయవాది ఎస్‌. శ్రీనివాస అయ్యంగార్‌ ముఖ్యఅతిధి. సంగీత ప్రియుడైన మద్రాసుమేయరు ఎస్‌. సత్యమూర్తి అధ్యక్షత వహించాడు. నాగరత్నమ్మని గౌరవ అతిధిగా ఆహ్వానించి, వందన సమర్పణ చెయ్యవలసిందిగా కోరారు. ఆమె తన ప్రసంగంలో త్యాగరాజు రాసిన ఆరభికృతి ‘సాధించెనే’లో రాముడు సమయానికి తగుమాటలాడిన వాడు. త్యాగరాజు కూడా అలాంటివాడే అని చెప్పి ‘ఆరాధనలో అందరూ ఆసక్తిగా పాల్గొంటున్నందుకు సంతోషంగా వుంది’ అని ముగించింది.  ఆరాధన కచేరీల్లో ఎమ్మెస్‌ సుబ్బలక్ష్మి కచేరికి టిక్కెట్లు ఎక్కువగా అమ్ముడు పోయాయి. ఎప్పటిలాగానే ఆమె ఉచితంగా, బ్రహ్మాండంగా కచేరి చేసింది. 1930లలో సుబ్బలక్ష్మి సంగీతం మిద నాగరత్నమ్మ అభిప్రాయం అడిగితే ఉచ్చారణలోపాలున్నాయని నిష్కర్షగా విమర్శించింది.11 1941 కల్లా ఆ అభిప్రాయం మారింది. అన్ని విషయాల్లోనూ అత్యుత్తమ స్థాయిని అందుకుంది ఎమ్మెస్‌. ఈ కచేరీని నాగరత్నమ్మ చాలా మెచ్చుకుంది.

ఆరాధన ఆఖరి రోజున (డిశంబరు23) అందరూ కీర్తనలు పాడుతూ త్యాగరాజు చిత్రపటాన్ని ఏనుగుమిద ఊరేగించారు. నిజజీవితంలో ఆడంబరాలకి దూరంగా ఎప్పుడూ కాలినడకన తిరిగే త్యాగరాజుకి ఈ దృశ్యం ఎంతో నవ్వుతెప్పించి వుంటుంది. కానీ ఆయన భక్తురాలు ఇదంతా వాకిట్లో నుంచి చూసి ఆనందభాష్పాలు రాల్చివుంటుంది. ఆమె కల ఫలించింది.

ఆరాధన విరాళాల కోసం నాగరత్నమ్మ కచేరీలు చెయ్యలేదు. ఆమె దగ్గర వున్న సొమ్ము నిల్వ తగ్గిపోతూవచ్చింది. అందుకని తన స్నేహితుల్నీ, దాతల్ని ఆరాధన కోసం విరాళాలు కోరింది. డా|| కె. ఎన్‌. కేసరి చేసిన పరిచయం వల్ల మైసూరు మహారాజు జయచామరాజ ఒడయార్‌ దగ్గరకి వెళ్ళింది. ఆయన కోరికమిద కచేరి చేసింది. మహారాజు ఒకటికాదు రెండు బంగారు కంకణాలు బహూకరించాడు. ఇది మైసూరు సంస్థాన సంప్రదాయానికి విరుద్ధమని చాలా మంది విమర్శించారు. ఆమె పాండిత్యానికీ, త్యాగరాజు పట్ల ఆమె భక్తి భావానికి పండితుడైన మహారాజు చలించి పోయాడు. నిస్సంకోచంగా ఆమె ఆ కంకణాల్ని ఆరాధన ఉత్సవాలకి బహూకరించింది. ఈ పర్యటనల్లో ఆమెకి అన్ని చోట్లా మంచి ఆదరణ దొరకలేదు. సి. వి. రాజగోపాలాచారితో కలిసి నెల్లూరు వెళ్ళినప్పుడు చేదు అనుభవం ఎదురయ్యింది. ఆ ఇంటివాళ్ళకి దేవదాసి రావడం ఇష్టంలేదు. ఆయన్ని దాత ఇంట్లో వుంచుకుని ఆమెని మాత్రం టివిఎస్‌ కంపెనీ వాళ్ళ అతిధి గృహంలో వుంచారు. మర్నాడు ఉదయం విరాళంకోసం వాళ్ళింటికి వెళ్ళింది. రాజగోపాలా చారికి వెండిగ్లాసులోనూ, ఆమెకి ఇత్తడి గ్లాసులోను కాఫీ ఇచ్చారు. వాళ్ళ ఆడవాళ్ళు బయటికే రాలేదు. ఆమెని పాడమన్నారు. శంకరాభరణంలో ‘ఎదుట నిలచితే’ అనే కృతి సమయ స్ఫూర్తితో పాడింది. ఎదుట నిలిచితే నీదు సొమ్ములేమి బోదురా
నుదుటి వ్రాతగాని మట్టు మిఠను నా ||ఎ||
తరము తెలిసి మోసము పోదునా
తెలుగు శ్రోతలకి దాని అర్థం బాగా బోధపడింది. విరాళాలు బాగా పోగయ్యాయి. తమకి ఆతిధ్యమిచ్చిన వాళ్ళ వెనకబాటుతనాన్ని మాత్రం విమర్శించింది.

1941లో జరిగిన ఆరాధన అంతకుముందు సంవత్సరాల కంటే గొప్పగా పెద్ద ఎత్తున జరిగింది. ఆర్‌. కె. షణ్ముఖం చెట్టి ప్రారంభోత్సవం చేశాడు. అయిదు రోజుల ఆరాధనకి నూరుమంది కంటే ఎక్కువ ప్రముఖ సంగీతకళాకారులే వున్నారు. అంతకు పూర్వం మధ్యాహ్నం తర్వాత కచేరీలు మొదలయ్యేవి. ఈసారి ఉదయం నుంచి మొదలై రాత్రి పొద్దు పోయేదాక జరిగాయి. సంగీత అకాడమిలో లాగా అర్హత, అనుభవాన్ని బట్టి కచేరిటైం కేటాయించేవారు. బాగా అనుభవం వున్నవాళ్ళకి రాత్రి 45 నిమిషాలు, మిగిలిన వాళ్ళకి పగలు 10,20,30 నిమిషాలు ఇచ్చేవాళ్ళు. నాగరత్నమ్మకి ఆరాధన రోజున అనుభవజ్ఞుల స్థానం ఇచ్చారు. శివసుబ్రహ్మణ్య అయ్యర్‌ వైలిన్‌, రామామృతం అయ్యర్‌ మృదంగం వాయించారు. ఒక అసంతృప్తి మాత్రం మిగిలిపోయింది. ముసిరి ఎంత బ్రతిమిలాడినా శూలమంగళం ఉత్సవంలో పాల్గోనన్నాడు. ఈ సంగతి తెలిసి ముత్తయ్య భాగవతార్‌ తానూ రానన్నాడు. కచేరీల్లోని కొన్ని భాగాలని తిరుచ్చి రేడియో కేంద్రం ప్రసారం చేసింది. గ్రేడువున్న కళాకారులవి మాత్రమే ప్రసారమయ్యాయి. వేదిక ఎక్కుతూండగా నాగరత్నమ్మకి తను చేసిన పోరాటాలన్నీ గుర్తువచ్చి వుండొచ్చు. ఆమె ఒకస్త్రీ, ఒక దేవదాసి అయి కూడా, ఇవాళ పురుషులతో సమానస్థాయి పొందుతోంది. ”నేనుదేవర్‌ అడియాళ్‌ని” అని మైకులో ప్రకటించి మరీ కచేరి ప్రారంభించింది . ఆఖరిదేవదాసి చేసిన యుద్ధ నినాదం అది. అంతటా ప్రసారమయ్యింది. జనం అంతా ఒక్కక్షణం ఊపిరి బిగబట్టి, వెంటనే ఆగకుండా చప్పట్లు కొట్టారు. ఆమె చేసిన పోరాట ఫలితం ఆ విజయం.

1942 ఆరాధన కూడా ఇలాగే విరాళాల కోసం మద్రాసులో కచేరీలు, ఆర్భాటంగా ప్రారంభోత్సవం, పెద్ద ఎత్తున 5 రోజుల ఆరాధనోత్సవాలతో జరిగింది. సమాధి దగ్గర త్యాగరాజు ప్రశంసగా నాగరత్నమ్మ పాడిన ప్రార్థనా గీతంతో ఉత్సవాలు మొదలయ్యాయి. 1942లో మరో రకమైన సవాలు నెదుర్కొంది నాగరత్నమ్మ నగలు అమ్ముకోవడం, పరిస్థితుల మార్పులతో ఆస్తి గురించి కథలు పుట్టాయి. ఒక రాత్రి దొంగలు పడి మిగిలిన నగలన్నీ ఎత్తుకు పోవడంతో పాటు ఆమెని గాయపరిచారు కూడా. దాంతో ఆమె వణికి పోయింది. రాత్రులు ఒంటరిగా నిద్రపోవడానికి భయపడి పోయింది. ఆ ఆపత్సమయంలో తన మాతృభాష కన్నడం మాట్లాడే వాళ్ళ కోసం వెదికింది. అరవం, తెలుగు మాత్రమే మాట్లాడేవాళ్ళున్న తిరువయ్యారు ఆమెకి హఠాత్తుగా పరాయి ప్రదేశంగా తోచింది. కాని త్యాగరాజు మిద వున్నప్రేమ ఆమెని ఆ ఊరు వదలనియ్యలేదు. కొన్ని వీధుల అవతల వున్న రామారావు అనే కన్నడిగుడికి కబురు పెట్టింది. కొద్దికాలం వాళ్ళింట్లో వుంటే ఆయనకిగానీ, ఆయన కుటుంబానికి గాని అభ్యంతరమా అని ఆమె అడిగింది. ఆయన భార్య సగుణాబాయి ఒకప్పటి మైసూరు దివాను వి.పి. మాధవరావు వంశీకురాలు. భార్యాభర్తలు ఆమెని సహృదయంతో ఆహ్వానించారు. ‘భట్‌ గోస్వామి గృహం’ అనే పేరున్న ఆ ఇల్లు ఒక వీధిని ఆక్రమించింది. వాళ్ళకి చాలా భూములుండేవి. వాళ్ళకి లెక్కలేనన్ని గుర్రపుబళ్ళు వుండడంతో దాన్ని ‘గాడీఖానా’ అనేవాళ్ళు. నాగరత్నమ్మ వాళ్ళింట్లో ఆరునెలలుంది. వాళ్ళ పిల్లలకి త్యాగరాజు కృతులు నేర్పేది. మొదట్లో తన వంటతనే వండుకునేది గాని క్రమంగా వాళ్ళతో కలిసి పోయింది.

యుద్ధ భయానికి చాలా మంది మద్రాసు వదిలి తంజావూరు జిల్లాకి వచ్చేస్తున్నారు. అలా వచ్చిన వాళ్ళలో నాగరత్నమ్మ శిష్యురాలు, ఆమెస్నేహితురాలు శకుంతలా సేతురామన్‌ చెల్లెలు జానకి కూడా వుంది. జానకి, ఆమె తల్లి, రామారావు ఇంట్లో అద్దెకి వుండేవారు. ఆమె నాగరత్నమ్మ దగ్గర చాలా కృతులు నేర్చుకుంది.
ఈ లోపు వైలిన్‌ విద్వాంసుడు శివసుబ్రమణ్య అయ్యర్‌కి నాగరత్నమ్మ ఇంట్లో దొంగలు పడిన సంగతి తెలిసింది. వెంటనే ఆయన తిరువయ్యారు వచ్చి తన మేనల్లుడు సీతాపతిని ఆమె ఇంటి వరండాలో ప్రతి రాత్రీ పడుకునే ఏర్పాటు చేశాడు. దీంతో ధైర్యం చిక్కి ఆమె తన ఇంటికి తిరిగి వచ్చింది. ఆర్నెల్లు గడిచినా దొంగలు గానీ, వాళ్ళు ఎత్తుకెళ్ళిన నగల జాడగాని తెలియలేదు. ఆమె నగల గురించి బెంగపడలేదు. త్యాగరాజు ఇచ్చిన ఆ నగలు ఆయనే తీసుకెళ్ళి పోయాడంది.

1943 మొదట్లో కలరా వచ్చింది. జనం గుంపులుగా వుంటే సమస్య మరింత పెద్దదవుతుందని జిల్లా కలెక్టరు ఆరాధనని ఒప్పుకోలేదు. తిరువయ్యారులో అసంతృప్తి చెలరేగింది. మళ్ళీ మళ్ళీ మహజర్లు పెట్టుకున్నా ఫలితం లేకపోయింది. నాగరత్నమ్మ మాత్రం చెక్కుచెదరలేదు. అంతా త్యాగరాజే చూసుకుంటాడని ధీమాగా వుంది. విచిత్రంగా అలాగే జరిగింది. మూడు రోజుల ఆరాధనకి అంగీకరించారు. రేడియో ప్రసారాలు విని జనం మరింతగా వస్తారని, ఆ ప్రసారాల్ని మాత్రం నిరాకరించారు. దాంతో ఆ సంవత్సరం ఆరాధన చిన్న ఎత్తున జరిగింది. ఆరాధన జరగడమే నాగరత్నమ్మకి కావలసింది. ముసిరి చాలా ఉత్తరాలు రాయడంతో శూలమంగళం కాస్తమెత్తబడ్డాడనీ, ఆరాధనకి వస్తున్నాడని పుకార్లు బయల్దేరాయి, కానీ అప్పటికే మధుమేహంతో ఆయన నీరసించి పోవడంతో కొడుకులు ఆయన్ని ప్రయాణం మానుకొమ్మని సలహాయిచ్చారు.1943 అక్టోబరులో వైద్యనాథ భాగవతార్‌ తను ఇంక ఎంతోకాలం బతకనని అనుకున్నాడు. త్యాగరాజులాగా సన్యాసాశ్రమం తీసుకున్నాడు. మూడు రోజుల్లో అక్టోబరు 24న చనిపోయాడు. ఆ ఊళ్ళోనే గౌరవ మర్యాదలతో అంత్యక్రియలు జరిపారు. అక్కడే సమాధి కట్టారు.

త్యాగరాజు ఆరాధన జరిపిన ముగ్గురిలో నాగరత్నమ్మే మిగిలివుంది. తిరువయ్యారులో ఆమె ప్రత్యేక ఆకర్షణ అయింది. ఆ ఊరువచ్చిన ప్రతివాళ్ళు ఆ ఊరిదేవాలయం, త్యాగరాజు సమాధి చూసిన తర్వాత ఆమె ఇంటికి బారులు కట్టి నుంచునే వారు. ఆమె వాళ్ళతో మాట్లాడుతూనో, ఆపల్లె పిల్లలకు సంగీతం నేర్పుతూనో ఉండేది. ఆమెకి త్యాగరాజ కీర్తనలు ప్రచారం చెయ్యడమే అత్యున్నత లక్ష్యం. పిల్లలని హుషారు చేసేందుకు ఒక మంచి పథకం వేసింది. ఒక పెద్ద పడక్కుర్చీలో కూర్చుని వాళ్ళతో పాటు పాడేది. కుడి చేతికి తగిలించుకున్న సంచిలోనుంచి. గుప్పెడు నాణాలు తీసి అందరికీ పంచేది. దాంతో ఆమె పాఠాలు బాగా సాగేవి. పిల్లలు కూడా నెమ్మదిగా సంగీతం అంటే ఇష్టపడేవారు. ఊళ్ళో అందరికీ ఆమె అంటే అభిమానం. ఆమె వంటకోసం బజారుకి వెళ్ళిన సీతాపతికి పోటీల మీద తక్కువ ధరకి వర్తకులు సరుకులు ఇచ్చేవాళ్లు. చాలా మంది కూరగాయలు ఉచితంగా ఇచ్చేవారు. ఆమె పంచిపెట్టే పసుపూ కుంకుమ దేవుడి వరాలుగా భావించి స్త్రీలు తీసుకు వెళ్ళేవాళ్ళు.

హరికథలకీ, నాటకాలకి త్యాగరాజు జీవిత చరిత్ర ఎప్పుడూ మంచి కథావస్తువే అందుకని సినిమారంగం కూడా త్యాగరాజు పట్ల ఆసక్తి చూపింది. దాని మీద ఒక మూకీ సినిమా రావడం ఆశ్చర్యం. టాకీలు వచ్చాక ఒక సినిమా తీశారుగాని అది అంతగా విజయవంతం కాలేదు. 1944లో ప్రసిద్ధనటుడు వి. చిత్తూరు నాగయ్య కూడా తెలుగులో సినిమా తీయడం ప్రారంభించాడు. ఎక్కువ భాగం తిరువయ్యారులోనే తీసిన ఆ సినిమాకి సంగీత పరంగా ఎందరో సంగీతకారులు సాయంచేశారు. నాగరత్నమ్మని గౌరవ సలహాదారు గా తీసుకున్నారు. 1946లో విడుదలైన ఆ సినిమా బాగా విజయవంతం అయ్యింది. ఔదార్యానికి మారుపేరైన నాగయ్య నాగరత్నమ్మని ఏదో ఒక బహుమానం కోరుకోమన్నాడు, ఆమె తనకేమీ ఒద్దంది. ఆమె అద్దె ఇంట్లో వుందని తెలిసి సొంత ఇల్లు కొనుక్కునేందుకు సాయం చేశాడు. దాంతో తిరువయ్యారులో దక్షిణంవేపు పెద్దవీధిలో చిన్న ఇల్లు ఆమెదయింది. కానీ ఆమె దాన్ని సమాధికి సంబంధించిన అతిధి గృహంగానే భావించింది. త్యాగయ్యకి అంజలి ఘటించేందుకు వచ్చే యాత్రికులెవరైనా అక్కడ బసచేయవచ్చుననీ, ఆయన కీర్తనలు తనదగ్గర నేర్చుకోవడానికి వచ్చే వారెవరైనా కూడా అక్కడ వుండవచ్చునని ఆమె స్పష్టం చేసింది.

ఈ సినిమాతో ఆరాధనకి మరింత ప్రాచుర్యం వచ్చింది. జనం తండోప తండాలుగా రావడంతో నిర్వాహకులకి ఒత్తిడి పెరిగింది. కచేరి చేసేవారికి సమయం మరింత తక్కువయ్యేది. కల్కి కృష్ణమూర్తి అన్నట్టు ఒక సంగీతకారుడు వేదిక ఎక్కి కూర్చునే లోపే, తర్వాతి వారికోసం దిగి పోవలసి వచ్చేది. నిర్వాహకులతో పైరవీలు చేసి అనుభవం, అర్హతలేని వారు కూడా పాడడంతో సంగీతస్థాయి దిగజారి పోయిందని చాలామంది అభిప్రాయ పడ్డారు .నాగరత్నమ్మతో సహా మరి కొందరు నిరుత్సాహపడ్డారు.

– వి.శ్రీరాం
అనువాదం:టి.పద్మిని

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
ఈ పుస్తకాన్ని ప్రచురించడానికి అనుమతించిన హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారికి , గీతా రామస్వామి గారికి కృతజ్ఞతలు .
Gita Ramaswamy,
Plot No. 85, Balaji Nagar, Gudimalkapur,
Hyderabad 500 006

— 117
ధారావాహికలు, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో