వేదుల జీవన ప్రస్థానం – అవధానం- డా|| కె. వి.ఎన్‌.డి.వరప్రసాద్‌

vihanga-telugu magazine

ISSN 2278-4780

‘గౌతమీ కోకిల’గా ప్రసిద్ధి పొందిన శ్రీ వేదుల సత్యనారాయణశాస్త్రి 20-03-1900 సంవత్సరంలో భద్రాచలం తాలూకాలోని గొల్లగూడెంలో జన్మించారు. ప్రాధమిక విద్యాభ్యాసాన్ని ఆయన అక్కడే పూర్తి చేశారు. రెండవ ఫారం వరకూ భద్రాచలంలో చదివారు.
తిరుపతి వేంకటకవులు అవధాన ప్రక్రియకు బహుళ ప్రాచుర్యం కల్పించిన కాలమది. వారి అవధాన విద్యామృతాన్ని గ్రోలని తెలుగువాడు ఆ రోజుల్లో లేడనడం అతిశయోక్తి కాదు. పద్యాన్ని పండిత, పామర జనరంజకంగా మార్చి, పామరులనోట కూడా పద్యాలను పాడించిన ఘనత వారిది. అలాగే కొప్పరపు కవులు, రామకృష్ణ కవులతో పాటు, రాష్ట్ర, రాష్ట్రేతర ప్రాంతాల్లో ప్రతిధ్వనిస్తున్న శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రిగారి పేరు చెవిన సోకగానే ఆయన వద్దకు చేరుకునే ప్రయత్నాలు చేశారు వేదుల.
1915లో కవిత్వం చెప్పాలనే కోరికతో శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రిగారి దగ్గరకు 15 రోజులు ప్రయాణంచేసి వెళ్ళానని, ఆయన ‘నా సాహిత్య యాత్ర’లో స్వయంగా చెప్పుకున్నారు.
శ్రీపాదవారి దగ్గర కృష్ణ భారతం, వ్యాస భారతం, నన్నయ భారతాలను తులనాత్మక అధ్యయనం చేయడంతోపాటు వాటిలో మార్పులు, చేర్పులు మొదలైనవి చర్చించడంవల్ల ఆయన కవిత్వానికి చాలా మేలు చేకూరిందని అయనే స్వయంగా ‘నా సాహిత్య యాత్ర’లో చెప్పుకున్నారు.
సాహిత్య అధ్యయనం ద్వారా లభించిన పాండిత్యంతోపాటు, ఆయనకు సహజంగానే ధారణాశక్తి అధికం. ఈ రెండు అవధానానికి అత్యావశ్యకాలు. ఇవి లేకపోతే అవధానం అసాధ్యం. అప్పటికే ఆయనకు వాటిపట్ల మక్కువ ఉండేదని చెప్పుకున్నాం. దీంతో ఆయన దృష్టి సహజంగానే అవధానంపై నిలిచింది.
శ్రీ వేదుల మొదటి అవధానం 17 ఏళ్లునిండిన తరువాత పెద్దాపురంలో చేసినట్లు ఆయన ‘నా సాహిత్య యాత్ర’ ద్వారా తెలుస్తుంది. తనకు కాస్త జ్ఞాపకశక్తి ఎక్కువేనని, ఒకసారి వింటే మర్చిపోయే వాడిని కాదని, ఏక సంథాగ్రాహి కానివాడు, శతావధానం చేయ్యలేడని ఆయన అందులో అభిప్రాయపడ్డారు. పేరుకు శతావధానమే అయినా 50, 60 మంది కంటే ఎక్కువ మంది పృచ్ఛకులుండేవారుకాదని ఆయన చెప్పారు. పెద్దాపురంలో శ్రీ వేదుల చేసిన తొలి శతావధానంలో చెప్పిన మొదటి పద్యం –
‘ఏ పురమందొ చేయుటది ఎంత ముదంబొ ! కవిత్వ ధారణా
టోపమొ ఏమొ ! బాలుడితడున్‌ గరుణింపుము శారదాంబ ! పె
ద్దాపురవాస పండిత సదస్యుల దాపున పేరు నిల్ప …………..’
అంటూ సాగిపోయిందని చెప్పారు.

తరువాత భద్రాచలంలో జరిగిన అవధానంలో ఆయనకు చంద్రాలోక కర్తయైన జయదేవుని ‘ప్రసన్న రాఘవం’ లోని
‘యేషాం కోమల కావ్యకౌశల కలాలీలావతీ భారతీ
తేషాం కర్కశ తర్కవక్ర వచనోద్గారే-పికిం హీయతే?’ ……..
అనే శ్లోకాన్ని ఇచ్చి అనువాదం చేయమంటే సామన్య విషయంకాదు, అదీ అశువుగా … కానీ దానిని
”కృతులందున్‌ సుకుమార కల్పన కలా హేలాఢ్యులౌ వారి భా
రతి దుర్దాంత కఠోర తర్క వచనార్భాటమ్మునం దగ్గునే? ” ………..
అని మూల శ్లోకంలోని భావం చెడకుండా, అందమైన పద్యంలో పూరించి పృచ్ఛకుల మెప్పు పొందారు శ్రీవేదుల.
తుని సంస్ధానంలో అవధానం చేసినపుడు శ్రీనాథాదులు పూరించిన
”ఇంకన్‌ గస్తురి బొట్టు పెట్టకుము తల్లీ! ఫాల భాగంబునన్‌” అనే సమస్యనివ్వగా …..
”పంకే జానన! తొందరేల అపుడే ప్రాణేశుడున్‌రాడు నే
డింకన్‌ నీతల దువ్వునప్డు మొగమందెంతే వికారంబు తై
లాంకంబంటెను దాని తుడ్వగ జలంబందింతు నుండుండు మీ వింకన్‌ గస్తురి” …..
అంటూ పూరించి మెప్పు పొందారు.
తరువాత అవధానం కాకినాడలో కల్టెకరు ప్రశంసలకు కూడా పొంది, ‘మెక్లారిన్‌’ హైస్కూలులో ఉద్యోగం లభించడానికి కారణమైంది.
ఆ అవధానంలో ఇచ్చిన ”ఇభవరయాన రైక సడలించి మహాసుఖమందె మామతోన్‌”
అనే సమస్యను …..
”ప్రభుతదలిర్ప వాయుజ డరణ్యమునం దమిమైహిడింబినిన్‌
రభసము మీర మార సమరంబున బిట్టలయింప నాశ్రమా
రభటి నిరంతరమ్ముగ దొరంగెడి చెమ్మట కోపలేక, య
య్యిభవరయాన” …..
అంటూ పూరించి తిరుపతి వేంకటకవులు శతావధానాన్ని ప్రారంభంచిన కాకినాడ లోనే విమర్శకుల ప్రశంసలు పొందిన శతావధాని వేదుల.
ఈ విధంగా శతావధానాలతో అందరి మదిదోచిన ఈ ‘గౌతమీ కోకిల’ కేవలం డజనులోపే అవధానాలకు పరిమితం కావడం అనేది అవధాన ప్రక్రియకు తీవ్ర నష్టమే అయినా ఆయన కవితా వికాసానికి, తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన సేవకు ఎంతో ఉపకరించిందని చెప్పక తప్పదు.

ఏమైనా 1922లో రాజమండ్రి చేరుకున్న వేదుల రాజమహేంద్రి గొప్పతనాన్ని
”ఆంధ్ర వాఙ్మయ నందనారామ సీమకై
నన్నయ్య తొలిమొక్క నాటెనిచట
భారత కృతిపతిత్వమ్ము నభ్యర్ధించి
చాళుక్యనృపతి చేసాచె నిచట
కావ్యేందిరకు నలంకార చూడామణి
పెద్దన్న తొలిసారె పెట్టె నిచట
కవిసార్వభౌముని కస్తూరికాభిక్ష
మించు వేడుక గుబాళించె నిచట
ఎడతెగని యాంధ్రజాతి వేయేండ్ల చరిత
వృద్ధ గౌతమివోలె విన్పించు నిచట
నాడు నేడాంధ్ర శారదానంద లాస్య
రంగమైనదీ రాణ్మహేంద్రవర పురము.
(నాటి నుండి నేటి వరకూ ఆంధ్ర సరస్వతి వికాసానికి రాజమహేంద్రి ఆలవాలంగా నిలుస్తుందని ఆయన భావన)
1927లో గుంటూరు మిషనరీ పాఠశాలలో ఉపాధ్యాయ పదవిని పొందారు. 1930లో ఆయనకు జరిగిన వివాహం ఆ కాలంలో చాలా సంచలనం. పర్లాకిమిడికి చెందిన చతుర్వేదానువాదకర్తలు బ్రహ్మశ్రీ బంకుపల్లె మల్లయ్యశాస్త్రిగారి ఏకైక పుత్రిక కృష్ణవేణికి మొదటి వివాహం జరిగింది. అయితే ఆమె భర్త దుర్మరణం మల్లయ్యశాస్త్రిగారికి దుఃఖాన్ని కలిగించింది. వేదాల్లోని కొన్ని అంశాలను సోదాహరణంగా వివరిస్తూ గర్భాదానం జరగకపోతే ఆమెకు పునర్వివాహం చేయవచ్చని వాదించారు. కందుకూరి బాటలో పయనిస్తూ గిడుగు రామ్మూర్తి పంతులు మొదలుగు వారి ప్రోత్సాహంతో బ్రాహ్మణ సమాజంలో తీవ్ర వ్యతిరేకత వస్తున్నా కుమార్తెకు వేదులతో పునర్వివాహం జరిపించారు. అయితే కన్యాదానం చేసింది మాత్రం గిడుగు రామ్మూర్తి దంపతులు.
సంప్రదాయ కుటుంబ నుంచి వచ్చిన వేదుల మల్లయ్యశాస్త్రిగారి అమ్మాయితో వివాహాన్ని అంగీకరించడం అపూర్వ విషయం. 1933, 1934 సంవత్సరాలలో ‘నవ్య సాహిత్య పరిషత్తు’కు కార్యదర్శిగా పనిచేశారు. ఆ సమయంలో అధ్యకక్షులు రాయప్రోలు.
1938లో ‘దీపావళి’ని నూతక్కి రామశేషయ్యగారికి అంకితమిచ్చిన పద్యంలో ఆయన వాడిన ”గౌతమీ కోకిల” తరవాత కాలంలో ఆయన బిరుదుగా స్థిరపడిపోయింది. ఈ సభకు అధ్యకక్షుడు కవిసమ్రాట్‌ విశ్వనాధ సత్యనారాయణ. హాస్యప్రియులైన కొంతమంది ‘గోదావరీ గోరువంక’ అని కూడా పిలిచేవారు.29-09-1943న సామర్లకోటలో జరిగిన సభలో ”మహాకవి” బిరుదుతో వేదుల సత్కరింపబడ్డారు. ఈ సభకు అధ్యకక్షులు కవిసార్వభౌమ శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రిగారు. అందుకే తరవాత కాలంలో ”గురుదేవుడె మెచ్చుకొని ‘మహాకవి’ యన్న బిరుదమ్మొసంగి దీవించునాడు” అని సంతోషంగా చాటుకున్నారు. 

చిన్నతనం నుంచీ వారాలు చేసుకుంటూ, కొన్ని రోజులు పస్తులుంటూ ఎన్నో కష్టాలుపడినా మధ్యలో కొన్ని అద్భుతాలు కూడా జరిగినట్టు ఆయన చెప్పుకొన్నారు. చేతిలో చిల్లిగవ్వ కూడా లేకుండా ప్రయాణం చేస్తూ పశ్చిమగోదావరి జిల్లా మార్టేరు గ్రామం నుంచి పోడూరు గ్రామానికి మిట్టమధ్యాహ్నం నడిచి ప్రయాణం చేసానని గుర్తుచేసుకున్నారు. ఆ సందర్భంలో పోడూరు చేరుకున్న తరువాత అక్కడ పేకాడుకుంటున్న ఓ వ్యక్తిని మంచి నీళ్లు అడగగా ఆయన తన వివరాలు అడిగాడని శ్రీ వేదుల తెలిపారు. తాను తన వివరాలు చెప్పగా సాష్టాంగ నమస్కారం పెట్టి, మిమ్మల్ని చూడాలని ఎంతో కాలం నుంచీ అనుకుంటున్నానని, ఎంతో మర్యాద చేసి 80 రూపాయలను పళ్ళెంలో పెట్టి ఇచ్చారని, ఇలాంటి కొన్ని సంఘటనలు తాను దుర్భరదారిద్య్రాన్ని అనుభవిస్తునప్పుడు జరిగినట్లుగా ఆయన ఉదహరించారు.
మొత్తం మీద తన జీవితంలో బెంగాలీ నుంచి ధర్మపాలుడు, వినోదిని మొదలైన నవలల్ని తెలుగు చేశారు వేదుల. రాణాప్రతాప సింహ నాటకంతో దేశభక్తిని ప్రేరేపించడానికి తనవంతు ప్రయత్నం చేశారు. ‘కన్యాశుల్కం’ సమస్య నిరసిస్తూ ‘కాలేజి గరల్‌’ అనే సాంఘిక నాటకాన్ని, ‘వెలి’ దురాచారాన్ని నిరసిస్తూ ‘ఆర్తనాదం’ మొదలైన కథలను రాసి సంఘసంస్కర్తగా కూడా కందుకూరి, గురజాడల బాటలో నడిచారు వేదుల.
భాసుడు నాటకాలను తెలుగుదనంతో మనకందించడంతోపాటు, రవీంద్రుని బాల సాహిత్యాన్ని తెలుగులోకి మార్చారు. వివేకానందుని గురువైన రామకృష్ణ పరమహంస జీవిత చరిత్ర ద్వారా ఆయనలోని వేదాంతిని కనుక్కొనే ప్రయత్నం చేయవచ్చు.
పిల్లలందరికీ చేరువచేసే ఉద్దేశ్యంతో భారతాన్ని ‘విజయప్రభ’ పేరుతో వారి హృదయాలను హత్తుకునేలా రాశారు.
జానపద వాఙ్మయం, సాహిత్యాలపై విమర్శనా వ్యాసాలు, పీఠికలు రాయడంతోపాటు ఆకాశవాణి ద్వారా పలుప్రసంగాలు చేశారు.
అవధానాలపై మోజుతో నల్లేరుపై బండినడకగా సుమారు డజను వరకూ శతావధానాలు చేశారు. పేరు ప్రఖ్యాతలు సంపాదించారు.
కవిసార్వభౌమ శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రి గారిచే ‘మహాకవి’ బిరుదాన్ని అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ సభ్యులుగా ఎంపికైన వేదుల, రాష్ట్ర, రాష్ట్రేతర సాహిత్యాభిమానులతో సన్మానింపబడ్డారు.
”గురజాడ, రాయప్రోలు మొదలగువారు అప్పటికే ఒక విధమైనటువంటి మార్పు మొదలుపెట్టారు” అని ఆయన అముద్రిత ‘నా సాహిత్య యాత్ర’ (పుట 3) లో చెప్పుకున్నారు

రాజమహేంద్రిలో ఉండగానే ‘సాహిత్య సమితి’లో సభ్యులయ్యారు.
ఇందులో అప్పటికే అంటే 1919లో ఆయన కాకినాడలో ఉన్నప్పటికేనని, మొదలైన వారు అంటే వేంకటేశ్వర కవులు, కృష్ణశాస్త్రిగారని చెప్పుకోవచ్చు.
శ్రీ వేదుల సత్యనారాయణశాస్త్రి ‘దీపావళి’కి అంకితంగా రాసిన పద్యాలే ఆయన్ని ‘గౌతమీ కోకిల’గా మార్చాయి. భావకవిత్వ యుగంలో వచ్చిన ఈ ఖండకావ్య సంపుటి తెలుగు సాహిత్యంలో గొప్ప రచనల్లో ఒకటిగా నిలిచింది.
ఈయన ఉద్యోగరీత్యా పలుప్రాంతాలను సందర్శించినా చివరకు పెద్దాపురంలోనే తన విశ్రాంత జీవితాన్ని గడిపారు. తెలుగు సాహిత్యానికి ‘దీపావళి’ని అందించిన వేదుల మహాప్రస్థానం 7-01-1976న ఆగిపోయింది. అయినా ఆయన ‘దీపావళి’ నేటికీ వెలుగులు విరజిమ్ముతూనే ఉంది.                                                                                          –

డా|| కె.వి.ఎన్‌.డి.వరప్రసాద్‌,ఎం.ఏ., ఎం.ఫిల్‌., పిహెచ్‌.డి.,
అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, తెలుగుశాఖ
ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం, రాజమండ్రి 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

సాహిత్య వ్యాసాలు ​, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో