‘కరుణ’ సాహిత్యంలోతెలంగాణా స్త్రీల పోరాట చైతన్యం

తెలుగు సాహిత్యం లో సామాజిక సాంస్కృతిక రంగం లో ఆధునిక దృష్టి తో  ఆడవాళ్ల జీవితాలపై చర్చ మొదలై వందేళ్ళకు పైగా గడిచిపోయింది.వీరేశలింగం గారి సంఘ సంస్కరణ కార్యక్రమంతో సాహిత్యం లో స్త్రీ కేంద్రం గా రచనలు,ఆలోచనలు మొదలయ్యాయి.గురజాడ ఆధునిక చరిత్రను స్త్రీలే రచిస్తారు అన్నవ్యాఖ్యతో మొదటిసారి సమాజం ఉలిక్కిపడింది.అంతకు ముందు స్త్రీ ఉనికి అంటే వ్యక్తి గా ఆమె కంటూ ఒక స్థానం లేదు.బహుశా మొదటిసారి గురజాడ స్వతంత్ర వ్యక్తిత్వం గల మధురవాణి పాత్ర ను తెలుగు సాహిత్యం లో ప్రవేశ పెట్టారు.అంతేకాదు కట్టమంచి రామలింగారెడ్డి గారు తన”కవిత్వ తత్త్వ విచారము”అనే గ్రంధం ద్వారా ప్రాచీన కావ్య సంప్రదాయం లో స్త్రీ పాత్ర చిత్రణ తీరును విమర్శించి స్త్రీలను చూసే సామాజిక దృష్టి పై సంప్రదాయ సాహిత్య కారులపై నిశిత విమర్శ చేశారు. ఈ క్రమమే మొత్తం తెలుగు సాహిత్యం లో స్త్రీల సామాజిక హోదా-వారి పరాధీనతల పై ఒక తాత్విక ప్రాతిపదికను రూపొందించ గలిగింది. తర్వాత వచ్చిన భావకవిత్వం లో స్త్రీ పట్ల నూతన దృష్టి ఏర్పడింది.అయితే భావ కవిత్వం కూడా సమాజంలో ఉండే స్త్రీ ఉనికిని విస్మరించి ఊహామూర్తిని సృష్టించింది.ఈ సమయం లోనేశ్రీపాద వారు “ఈ ఇంట్లో ఆ దొడ్లో కట్టేసి ఉన్నగొడ్డుకీ నాకూ తేడా లేదమ్మా!”అని తన సాహిత్యం లోని ఒక పాత్రతో చెప్పించి బాల్య వివాహాల వల్ల పసితనం లోనే విధవలై పోయి ఇంట్లోని బండ చాకిరీ కి బలవుతున్న వైనాన్ని,స్త్రీల కడు దయనీయ స్థితిని తన సాహిత్యంలో దీనికి బాధ్యులెవరు?అని ప్రశ్నిస్తారు. వీటి ఫలితంగా విధవా వివాహాలు, వేశ్యా సంస్కరణ వంటివి సామాజిక ఆమోదం పొంది ఆచరణలో కొచ్చాయి. క్రమ క్రమంగా మధ్య తరగతి ఏర్పడే క్రమం,జాతీయోద్యమంమొదలయ్యాయి.ఈ పరిస్థితి లోనే బ్రహ్మసమాజ కార్యాచరణ తో ప్రేరేపితుడైన చలం, సోషలిస్టు భావాలతో స్ఫూర్తి పొందిన కొడవటిగంటి కుటుంబరావు, రావిశాస్త్రి అప్పటి పరిస్థితులపై తిరుగుబాటు చేసి భావ కవిత్వపు దృక్పధాన్ని తోసి రాజని నవీన పంధాని ఎంచుకున్నారు.వీళ్ళ దృష్టి లో స్త్రీ అంటే నండూరి సుబ్బారావు గారి ఎంకి కాదు. కృష్ణశాస్త్రి గారి ఊర్వశీ కాదు.ఆమె తన చుట్టూ ఉన్న సమాజ పరిస్థితులపై కొంత అవగాహన,కొంతఅమాయకత్వం,కొద్దిపాటు చదువు కలిగిన నవీన స్త్రీ.ఆమె ఇక ఎంత మాత్రమూ తన జీవితంలో పొడసూపే సమస్యలను భరించడానికీ,అణగిమణిగి పడి ఉండడానికీ,సంప్రదాయాలపేరుతోదుర్భర పరిస్థితులకు బందీ కావడానికి సిద్ధంగా లేదు. చలం సృష్టించిన శశిరేఖ,పద్మావతి,అరుణ,మైదానం రాజేశ్వరి మొ|న పాత్రలు సమాజాన్ని ఒక కుదుపుకి గురి చేశాయి – వీళ్ళెవరూ అప్పటి సమాజ ప్రతినిధులు కాదు.ఆ సమాజం మీద తిరుగుబాటు ప్రతిబింబాలు.ఇదే కాలాన ఆనాటి సమాజం శరత్ సాహిత్యాన్నికూడా చవిచూసింది.ఆనాటి సాంప్రదాయాలను అన్వయిస్తూనే ఉన్నత వర్గాల స్త్రీల అణచివేతను ఇంటిస్త్రీ గుట్టును విప్పి చెప్పి సాహిత్యలోకంలో బలమైన చర్చను లేపారు శరత్. ఈ క్రమం లో దేశానికి స్వాతంత్ర్యం రావడం తో చదువులు పెరిగాయి.నగరాలకు వలసలు,ఉద్యోగాలుపెరగడం తో బలమైన మధ్య తరగతి ఏర్పడింది.ఈ క్రమం లో కుటుంబానికే పరిమితమై సేవలు చేసే ఆధునిక మధ్య తరగతి స్త్రీల చిత్రణ మాదిరెడ్డి సులోచన, కోడూరి కౌసల్యా దేవి, యద్దనపూడి సులోచనా రాణి మొ||న రచయిత్రులసాహిత్యం కథల రూపం లో, నవలల రూపం లో విస్తృతంగా వచ్చింది.ఈ రచయిత్రులకు సమకాలీనం గానే మరొక కొత్తగొంతు సాహిత్య రంగంలోకి వచ్చింది .చలం గారి వారసురాలిగా ఆయన అంతే వాసి గా రచన చేపట్టిన రంగ నాయకమ్మ మధ్య తరగతి స్త్రీ జీవిత పరిస్థితులను మరింత వాస్తవికత తో సామాజిక ,రాజకీయ స్పృహ తో చిత్రించారు.కానీ రంగ నాయకమ్మ పాత్రలు యద్దన పూడి మొ||రచయిత్రులుసృష్తించిన పాత్రల్లాంటివి కాదు.వాళ్ళు మధ్య తరగతి  కుటుంబాల నుంచే వ్యక్తిత్వం కోసం పోరాటాలు చేసే మహిళలు.ఆర్ధిక స్వాతంత్ర్యంకోసం తమదైన వ్యక్తిత్వం కోసం పోరాడుతూనే జీవితంలోనిలదొక్కుకునే మహిళలపాత్రలవి. ముఖ్యంగా “జానకి విముక్తి”నవలలో రంగనాయకమ్మ గారు స్త్రీల జీవితం లోని ఎన్నో సమస్యలను,పురుషాధిపత్యాన్ని ఎత్తి చూపి చర్చకు పెట్టారు. ఎనభయ్యవ దశకం లో స్త్రీల కష్టాలు,కన్నీళ్ళు,వివక్ష, లైంగికత్వం,అసమానత్వం,ఈ కాలానికి పనికిరాని సాంప్రదాయాలు,వివాహ వ్యవస్థలోని పురుషాధిపత్యం,మతమౌఢ్యం మొ|న అనేక విషయాల మీద స్త్రీవాద సాహిత్యం ఉవ్వెత్తున వచ్చి సమాజం లో కొన్ని మౌలికమైన మార్పులు తెచ్చింది.కానీ 80 ల నుండీ ఫెమినిస్టు ఉద్యమాల పద్ధతులను గనుక గమనిస్తే కొన్ని గ్రూపులను ప్రభుత్వం తన లో కలిపేసుకుంటుంది.మరి కొన్ని సంస్థలేమో విదేశీ నిధులతో ఫండెడ్ సంస్థలు గా మారిపోతున్నాయి. ఆస్థి హక్కు ఏర్పడిన నాటి నుంచి సాగుతున్న వర్గ పెత్తనాన్ని నిర్మూలిస్తే తప్ప స్త్రీ కి విముక్తి లేదు అన్న అవగాహనతో వచ్చిన నక్సల్బరీ రాజకీయాల ప్రభావం వల్ల సాహిత్యం లో మళ్ళీ వస్తువు మారి స్త్రీల జీవిత చిత్రణ మందగించింది.ఆదివాసులు,కాయకష్టం చేసుకునే రైతు కూలీలు,అట్టడుగు మహిళలు సాహిత్యం లో వస్తువులయ్యారు.ఈ క్రమమే తాయమ్మ కథ పుట్టుక రావడానికి నేపధ్యంగా పని చేసింది.అయితే అల్లం రాజయ్య” నీల”,”కమల” వంటి కథల్లోనూ రఘోత్తమ రెడ్డి “పనిపిల్ల”కథ లోనూ అట్టడుగు వర్గాల మహిళల జీవిత చిత్రణ జరిగింది. అట్టడుగు మహిళల జీవన పోరాటాలగురించి మరో మహిళ తాను రాజాకీయ,సామాజిక విప్లవ పోరాటం లో పాల్గొంటూ రాయడం రచయిత్రి కరుణ ప్రత్యేకత.సమకాలీనంగా ముస్లిం అట్టడుగు మహిళల గురించి గీతాంజలి, సుజాతా రెడ్డి, సుభద్ర, స్స్కైబాబా,మరికొంతమంది దళిత రచయితలు చిత్రించారు.నక్సల్ బరీ రాజకీయాల తొలి దశను అల్లంరాజయ్య,సాహూ,రఘోత్తమ రెడ్డి సృష్టిస్తే,రెండో దశను చిత్రించిన వాళ్లల్లో ఎన్.డి.,మిడ్కో,కరుణ ఉద్యమ విస్తరణ నీ అది ఎదుర్కొంటున్న ఆటు పోట్లనూ వీటి దరిమిలా పెరిగిన సామాజిక  సంక్షోభాన్ని చిత్రించారు. తెలుగు సమాజం లో విప్లవోద్యమ ప్రభావాన్ని దాని విస్తృతిని చాటి చెప్పే రచనలివి. ఎన్.డి.జీవితం లోనిబహు ముఖీనమైన ఎన్నోఅంశాలనూ,కోణాలనూ స్పృశిస్తూ అలుపు లేకుండా విస్తృతంగా రాస్తున్నారు. ఈరచయిత్రి రచనలు చాలా శక్తివంతంగా ఉంటాయి.మిడ్కో గాని కరుణ గాని తెలంగాణా స్త్రీలు కావడం వల్ల,పోరాటాల్లో తల మునకలై ఉండడం వల్లకూడాతెలంగాణా గురించి, తెలంగాణా మైనారిటీ స్త్రీల గురించిన వాస్తవిక చిత్రణలో వాళ్ళ ముందటి తరం రచయితల కన్నా భిన్నమైన నేర్పును ప్రదర్శించారు.వీరి ముగ్గురి విప్లవ రాజకీయాల తాత్విక నేపధ్యం వల్ల వాళ్ల రచనల్లో తమదైన పంధాను అనుసరించారు. ఈ ముగ్గురిలోకరుణది భిన్నమైన కథన శైలి.వస్తువు పై నిశిత దృష్టి ,కధనం లో సరి కొత్తపోకడ,భాషా వైవిధ్యంఆమె సొంతం.

కరుణ సాహిత్యం –వస్తువు– నేపధ్యం

కవితలు

పిల్లలు :  ఎన్నో కష్టాల కోర్చుకుని కని పెంచిన తల్లి కి ముసలి తనం లో తల్లి కింత కూడు పెట్టడానికి

 కూడికలూ తీసి వేతలూ వేసే పిల్లలు సామ్రాజ్యవాదులై పోయారు.అమ్మా!నీకిక/ పోరాడితే/ పోయేదేమీ లేదే అంటూ అమ్మని పోరాటానికి పిలుపునిస్తుంది.

సహచరి :

ఊర్ల సంగతి అని మొదలౌతుంది.

 వనవాసం బోయిన తన కొడుక్కు అమ్మ చేప్పే మాటలివి.

కోడలి మీద వాత్సల్యమూ,ఆప్యాయత పెల్లుబుకుతాయి.దొరలు తోకముడిసినా పోలీసులు ఊరి ప్రజల్ని

“పోలీసు కుక్కల కొడుకులు” పెట్టే బాధలు తన భాషలో చెప్పుకుంటుంది.నువ్వెప్పుడొస్తావో నని కళ్ళల్లో వత్తులు వేసుకుని నీ భార్య చూస్తూందని చెప్పడం తో కవిత ముగుస్తుంది.

శాంతి భద్రతలు: పరమ పిరికి, బానిస ,బుడ్డ గోసి,బోడిగాడు ఇవాళ ప్రాణాలతో ఉంటే శాంతి భద్రతలకు భంగమని వణుకుతుంది ప్రభుత్వం .

            కొన్ని కవితలు సహచరుడు ఎన్ కౌంటర్ తర్వాత దుఃఖం లో రాసుకున్నవి.వాళ్లిద్దరు ఒకరికొకరు రాసుకున్న కవితల్లో కూడా వారి ఉమ్మడి ఆశయం విప్లవం-నూతన సమాజాన్ని కలగనడమే.

కొన్ని కవితలు,వ్యాసాలు లభ్యం కానందువల్ల, కథలన్నీ అందుబాటు లో ఉండడం చేతా అందులోనూ- స్త్రీలు-పిల్లల విప్లవ చైతన్యం అంతస్సూత్రం గా ఉన్నకథా సాహిత్యాన్ని నా పరిశోధనాంశంగా ఎంచుకున్నాను.

సౌలభ్యo కోసం కథల్ని ఈ క్రింది విధం గా విభజించాను

1.పోరాటాలు వెల్లువెత్తుతున్న ప్రదేశాల్లో చిన్నారులు సైతం ఎలా ఉంటారని తెలియజెప్పే కథలు

రేపటి గెరిల్లాలు

చిన్న చిన్నపోరగాండ్లు తమ ఉత్సాహం,తెలివి తేటలతో  రకరకాలుగా ఎస్.ఐ బృందాన్ని

 ముప్ప తిప్పలు పెట్టి ,పోలీసులనుంచి తుపాకులు దొరకబుచ్చుకుంటారు.

విశ్లేషణ : ఎస్.ఐ.భాష కౄరంగా ఉంది.పూలన్ దేవి ఒక చోట డబ్బున్నవాళ్ళూ,పదవుల్లో ఉన్నవాళ్ళూ పేద వారిని మనిషి అన్న విషయం మర్చిపోయి తూలనాడతారంటుంది.నోటికొచ్చిన తిట్లు తిట్టడమే కాదు,స్త్రీలను జుట్టు పట్టి గుంజడమేమిటి?అవే తిట్లు తిడుతూ వీళ్లకి పౌర హక్కుల గురించి పాఠాలు చెప్పేలా ప్రజాస్వామిక వాదులందరూ పోరాటాలు చెయ్యాలనే ఆలోచననిరేస్తుందీరేకెత్తికథ.

            పోలీసులనుంచి ఆయుధాలు తెలివి గా అందిపుచ్చుకున్న పద్ధతి అద్భుతంగా ఉంది.వాళ్ళని చిరాకు పెట్టాలనేఉద్దేశ్యమే కావచ్చు. కానీ వాళ్ళ జీపు టైర్లలో గాలి తీస్తే వాళ్లక్కడ నుంచి కదిలే వీలుండదు కదా?ఈ విషయం రచయిత్రి ఆలోచించి ఉండరు.

కొత్త చిగుళ్ళు

ఇది చిన్న పిల్లల ఆట-పాటల ఆలోచనల గురించిన కథ.ఇందులో లాగూల్లేని పిల్లలు,చొక్కాలు చిరిగిన పిల్లలు,చొక్కా-లాగూ రెండూ లేని పిల్లలు,చీమిడి ముక్కు పిల్లలు,చింపిరి జుట్టు పిల్లలు,మట్టి గొట్టుకు పోయిన పిల్లలు ఉంటారు.వెన్నెల ఆట,దొంగాట,జాగిల్లు-మూగిల్లు,కుంటు డాట-ఇన్ని ఆటల్లో ఒక్కోదానికీ ఒక్కో అభ్యంతరం చెప్తూ ఏ ఆటనీ ఒప్పుకోరు పిల్లలు.వీళ్ళల్లో ఒకరు దళం ఆట ఆడదామా?అనడగ్గానే సై అంటే సై అంటారు అందరూ.వాళ్ళు ఆట ఆడిన తీరు,అందులోని ప్రజల సమస్యల్లో మమేకమై ఊళ్ళో అందరికీ అన్నం దొరకాలంటే ఎవరి మీద కొట్లాడాలో పిల్లలు చెప్తున్న  పద్ధతి అప్పుడే ఊళ్ళోకి ప్రవేశించిన దళ సభ్యులు చూసి ముగ్ధులై పోతారు.

            దళ కమాండర్ ఇప్పటివరకూ పిల్లల మీద శ్రద్ధ పెట్టనందుకూ  మెరికల్లాంటి  పిల్లలతో బాలల సంఘ ఏర్పాటుకి ప్రయత్నించనందుకూ తనను తాను విమర్శించుకుంటుంది.పిల్లలంత అసాధ్యులండరనీ కొన్నిసార్లు పెద్దల కళ్ళు తెరిపించగలరనీ ఈ కథ నిరూపిస్తుంది.

సుడ్ల తుపాయ్

ఈ కథ లో నాలుగేళ్ళ చిన్నారి కటియ ఉంటాడు.దళాన్నీ,అందులో ఎంతమంది ఉన్నారు,ఎవరెవరు ఏమిచేస్తుంటారుమొ|| నవిషయాల్ని గమనిస్తూ ఉంటాడు.రచయిత్రి కటియ గురించి చెప్పవలసివచ్చినప్పుడల్లాఅపురూపంగా ముద్దుగా”పిట్ట కొంచం కూత ఘనం” అంటుంటారు. కటియ పేరుకి తగ్గట్టే ఉన్నాడు.సుడ్ల తుపాయ్ అంటే చిన్న తుపాకీ.నాకో చిన్న తుపాకీ ఇస్తే చాలు దళం లో చేరి శత్రువు తో పోరాడతానంటాడు.పిల్లల మీద పెద్దలు పెట్టాల్సిన శ్రద్ధ గురించి ఆలోచించమని చెప్తుంది.

ఈ కథ మొత్తాన్నీ స్థానిక గిరిజన భాషలో పాఠకుల కర్ధం చేయిస్తూ నడిపిన పద్ధతి అబ్బురమనిపిస్తుంది.

పిల్లల కోసం కరుణ రాసిన పై మూడు కథల గురించి మనసు పెట్టి ఆలోచించడం మొదలెడితే బోలెడు సందేహాలు ముసురుకుంటాయి.నాలుగేళ్ళ చిన్నారి బాలుడు ఆయుధమిస్తే శత్రువు తో పోరాడతాననడ మేమిటి?,

సరైన బట్టలు సరే-అసలు వంటి మీద బట్టలే లేని పిల్లలు,పోషకాహారం లేని పిల్లలు, చీమిడి ముక్కు పిల్లలు,చింపిరి జుట్టు పిల్లలు,దుమ్మూ,ధూళి తో నిండిపోయిన పిల్లలు, దళం ఆట ఆడుకొవడం-అందులో ప్రజల సమస్యల్ని ప్రస్తావించి తీర్పు చెప్పడ మేమిటి,

పిల్లలే పోలీసులతో పోరాడి ఆయుధాల్ని గెల్చుకోవడ మేమిటి?-అతి పెద్ద ప్రజాస్వామ్యం,గొప్ప వారసత్వం కలిగిన ఘనమైన భారత సంతతి ఈ విధం గా ఉందా?అని పాఠకులకు ఉలిక్కి పడే ఆలోచనలు కలిగించే వస్తువులని ఎంచుకుని  ఇంత నేర్పుగా ఆర్ధ్రంగా కథలల్లి పిల్లల పట్ల “మన సమాజం ఇంత దయనీయం గా ఉంది”అని పాఠకుల ముందుంచుతారు కరుణ.అసలు చిన్నారులు ఎలా ఉండాలి?అమ్మా-నాన్నల ఒడి లో అందంగా,ఆనందంగా,సీతాకోకచిలుకల్లాగా స్వేచ్చగా ఉండాలి.ఎక్కడుండాలి?చుట్టూ ఉన్న ప్రపంచం గురించి ఎంతో తెలుసుకోవాలనే కుతూహలంతో ఉంటారు.ఈ వయసుపిల్లలు బడిలో ఉండాలి. మరి ఈ బాలలు “నేటి బాలలే రేపటిపౌరులు”అన్న దేశం లోని భావి భారత పౌరుల లిస్ట్ లోకి రారా?

            రాజ్యాంగం లో రాసుకున్న ఆదేశిక సూత్రాల ప్రకారం నిర్బంధ ప్రాధమిక విద్య సంగతేమిటి?మన పాలకులు తెల్లారి లేస్తే అభివృద్ధి-అమెరికా-చైనా అంటూ ఉపన్యాసాలిస్తూ ఉంటారు కదా మరి ఆ దేశాలు, పిల్లలకు 18 ఏళ్ళు వచ్చేవరకూ అద్భుత ప్రపంచాలు కదా?స్కూలు పిల్లల బస్సులు ముందుంటే ఆ దేశ అధ్యక్షుల కార్లుకూడా ఎంతసేపైనా ఆగిపోవల్సిందే ! అమెరికాలో అయితే మైనారిటీ తీరని పిల్లలకు సిగరెట్లు,మద్యం పొరపాటున అమ్మినా కూడా అమ్మినాయన్ని జైల్లో పెడతారు.భావి భారత పౌరులు-మన జాతి సంపదలు అని గొంతులు చించుకునే ప్రభుత్వానికి ఆదర్శవంతమైన ఆ దేశాలు బాలల పట్ల ఎంత బాధ్యత గా ఉన్నాయి అనే సంగతులు  పట్టవా?రాజ్యాంగంలో రాసుకున్న సూత్రాల్ని అమలు చెయ్యమని అడిగి-పోరాడుతున్న ప్రజలతో పిల్లలు  మమేకమవ్వడం లో తప్పేముంది?

“విద్య నివ్వకుండా వారికింకేం యిచ్చినా అంతా వృధా శ్రమే అవుతుంది.విద్య ఉంటే వాళ్ల మంచి చెడ్డల సంగతి వాళ్లే ఆలోచించుకోగలరు.–  ఇంజన్ లో స్టీమ్ ఉంటేనే రైలు నడుస్తుంది …లేకపోతే ఎంతమంది తమ శరీర బలం ఉపయోగించినా అంగుళం మేర కూడా కదిలించలేరు.” అని శరత్ పిల్లల గురించి ఆవేదన చెందారు.(శరత్ సాహిత్యం-తొమ్మిదవ సంపుటం- పంతులుగారు-పే-347).ఇది గడిచి సుమారు నూట పాతిక సంవత్సరాలు పైబడినా సమాజం లో ఏమీ మార్పు రాకపోగా ఇంకా,ఇంకా దిగజారిపోతుంది.ఈ పరిస్థితిని హృద్యంగా చిత్రీకరించారు రచయిత్రి.”రేపటి గెరిల్లాలు”,”కొత్త చిగుళ్ళు” – అనే శీర్షికలు ఎంతో అందంగా భవిష్యత్తు ని ఊరించేలా ఉన్నాయి.”సుడ్ల తుపాయ్”అనే శీర్షిక-అందులోని భాష గిరిజన,ఆదివాసీ తెగలభాషల పట్ల గౌరవాన్నికలిగిస్తాయి. 

            ఉద్యమ ఆచరణ లో ఉన్నందు వల్లే,ఆయా ప్రాంతాల్లో పిల్లల్ని ప్రేమగా గమనించినందువల్లే ఇది సాధ్యమైంది.

 మహిళల పోరాట స్పూర్తిని చెప్పే కథలు

నేటి మహిళ

ఈ కథ లో ఐదుగురు అమ్మాయిలు భవిష్యత్తు లో తమ కాళ్ళ మీద తాము నిలబడాలనుకునే ఆర్ధిక స్వాతంత్ర్యం గురించి మాట్లాడుకుంటుంటే మధ్య లో ఒకతను కల్పించుకుని  స్త్రీలు ఇంటికే పరిమితం కావాలనీ  లేకపోతే లోకం అల్లకల్లోలమైపోతుందనీ వ్యాఖ్యానిస్తాడు.సమాజమంతా ఈ విధం గా ఆలోచించడానికి అసలు మూలాలెక్కడున్నాయో తెలుసుకుని తర్వాత దాని మీద పోరాడాలనుకుంటారు అమ్మాయిలు.

ఉద్యోగం పురుష లక్షణం కాదు మనిషి లక్షణం-అనే విషయం పైకి అంగీకరించినట్లే పురుష సమాజం కనపడుతుంది.కానీ లోపల్లోపల ఆడవాళ్ళు పెద్ద ఎత్తున ఉద్యోగాల్లోకి రావడం వల్లే పురుషులు నిరుద్యోగులవుతున్నారనే సంగతి కొందరి నరనరానా పాతుకు పోయింది.

తగిన శాస్తి

పేరుకి తగ్గట్లే పోలీసులు అన్నల వేషం లో వచ్చి అన్నం పెట్టమంటే పాడైపోయి వాసనొచ్చే అన్నాన్ని తెచ్చి మోసానికి మోసమే చెల్లు చేసి ఊరి నుంచి పోలీసుల్ని ఉరికిస్తారు ఆడవాళ్ళందరూ కలిసి.

అన్నలతో మమేకమైన ఊరి పురుషులు సరే స్త్రీలు కూడా అంతే మిలిటెంట్ గా దేనికైనా సిద్ధంగా ఉంటారని తెలియ చెప్తుందీ కథ.

మీచరిత్ర ను జెబుతాం

సుమ అనే అమ్మాయి లోపలి నుంచి తన సహచరుడు పంపిన ఉత్తరం శరత్ అనే దళ సభ్యుడి ద్వారా అందుకుంటుంది. కొత్త గా చేరిన సాగర్ అనే 16 ఏళ్ళ పిల్లవాడు తన మంచితనంతో పనితనంతో అందరి ప్రేమనీ పొందడం చివరికి పోలీసుల చేతికి చిక్కి చిత్రహింసల పాలై చంపబడిన విధం,అతనికి ఊరి ప్రజలంతా నివాళు లర్పించిన వైనం-ఇవన్నీ పాఠకులకి సుమ-శరత్ మాటల్లో తెలుస్తాయి. 

“ఒక వైపెమో చిన్న పిల్లలను రిక్రూట్ చేసుకుంటున్నారని ప్రచారం.ఇంకోవైపు ఆ చిన్నపిల్లలే దొరికితే కోర్టు కి కూడా ప్రొడ్యూస్ చెయ్యకుండా చిత్రహింసలు పెట్టి చంపుతారు.ఆ చిన్న పిల్లలకే ఇంటి దగ్గర ఉండలేని పరిస్థితులు కల్పించిందెవరు? అని సాగర్పట్లసహానుభూతి తో విలవిల లాడి పోతుంది సుమ.కథ మొదట్లో సహచరుడు ఉత్తరం పంపిస్తాడా లేదా అని ఆరాటపడిన సుమ సాగర్ విషయం విన్నాక సాగర్ స్మృతుల్లో దుఃఖభారం లో మునిగిపోతుంది.

మహిళలు ధైర్యం గా నిలబడగలరా

రక్త పింజెర అనే పాము కాటుకి స్పృహ కోల్పోయిన ఒక అన్న ను దళ కమాండర్ విమలక్క మోస్తూ తుపాకీ ని పట్టుకుని కటిక చీకట్లో నడిచి ఆ కామ్రేడ్ ని ఆస్పత్రి చేర్చిన వైనమే ఈ కథా ఇతివ్రుత్తం.

చేపలు నీళ్ళూ

ఈ కథ లో అన్నలు అట్టడుగు వర్గాల ప్రజల్లో నీళ్ళల్లో చేపలు ఎంత సహజంగా ఈదుతాయో అంతే సహజంగా మావోయిస్టులు గిరిజన తండా ప్రజలతో మమేకమైన విషయాన్ని తెలియజేస్తుంది.పోలీసులు గ్రామాన్ని చుట్టుముడతారు.కామ్రేడ్స్ తప్పించుకునే వీలు లేదు.రాకేష్ ని ఒక అవ్వ,భగత్ ని లక్ష్మీబాయి రక రకాల ఉపాయాలతో రక్షించడమే ఈ కథా వస్తువు.ఇద్దర్నీవిడి విడిగా ప్రశ్నించిన పోలీసులకి అనుమానం వస్తే లక్ష్మీబాయి చివరికి తన కంటే చిన్న వయసున్న భగత్తో లేచిపోయి వచ్చానని తన వాళ్ళకి తెలిస్తే కష్టమని  ప్రతి మెలిక ప్రశ్నకీ ఒక కిటుకైన సమాధానం చెప్పి భగత్ని పోలీసులనుంచి తప్పిస్తుంది.

నందె

పూర్తి కాలం దళం లోకి పోలేని అన్నల రాజనీతి పట్ల ఆకర్షితురాలైన నందె అనే అమ్మాయి ఒక్కత్తే ధైర్యం గా ఊరి సామానంతా పోలీసుల బారిన పడకుండా కాపాడి ఎవరి వస్తువులు వాళ్ళకి భద్రంగా అందించడం ఈ కథ ఇతివృత్తం.

దళమంతా ప్రజల అండ దండ లుంటే ఎంతటి నిర్భంధాన్నైనా చేపల్లా ఈదేయగలం అంటూ ముగించడం భవిష్యత్తు మీద ఎంతో ఆశను చిగురింపజేస్తుంది.

పోరాడ్డంలో తేడా

పూర్తి కాలం పార్టీ లో పోరాడే ఒక కామ్రేడ్ తన తల్లి ఆమెను తక్కిన పిల్లల్నీ పెంచి పెద్ద చేసిన విధానాన్ని తలపోసుకుంటుంది.తండ్రి పోయాక కుటుంబ సభ్యులు-బంధుమిత్రుల నుండి ” ఈ భూమిని వదిలి ఎక్కడికీ రాను.సచ్చినా బతికినా నా భూమిలోనే”అని భూమి కోసం నిరంతరం పోరాడే తల్లి పట్ల తన కెంతో గౌరవ భావమని చెప్తుంది.

ఆడవాళ్ళ దృష్టి కోణం నుంచి చూసినప్పుడు మహిళలు మెచ్చే కథ ఇది.అడవి నంతటినీ ఒక్కడే నరికి చదును చేశాడని వాళ్ళ నాన్న సామర్ధ్యం గురించి చెబుతుంది.ఆయన పోయాక అమ్మ ఆ బాధ్యత నంతటినీ అమ్మ తీసుకుందంటుంది.నాన్న పొలం పని ఒక్కటే చెయ్యగలడు.దాన్నే చాలా గొప్పగా భావిస్తుంది సమాజం.కాని అమ్మ ఏడుగురు పిల్లల్ని ఆడా-మగా తేడా లేకుండా పెంచడం,తను చేస్తూ పిల్లల చేత భూమిని చదును చేయడం,అడవి ని నరికించడం,వాళ్ళను పని మొదలెట్టారంటే అంతు చూడనిదే వదలని పని రాక్షసులు గా తయారు చెయ్యడం,వాళ్ళకు జీవితానికవసరమయ్యే అసలైన అకల్ బుద్ధి ని నేర్పించడం మొ| న గుణ గణాలతో అమ్మ వ్యక్తిత్వాన్ని విశదపరుస్తుంది. అంతే కాదు.ఏ జాతి,ఏ కులం వాళ్ళైనా ఆ దారిన పోయే వాళ్ళకు రాత్రి ఆశ్రయమిచ్చి,ఏ సమయం లో వచ్చేవాళ్ళకైనా అన్నం పెట్టిన తోటి మనిషి ని ప్రేమించే స్వభావం.ఇవన్నీ ఒక ఎత్తైతే ప్రతి మహిళా ఆమె నుంచి నేర్చుకోవలసిన ధీర గుణం ఒకటుంది-ఇంటి వాళ్ళూ- బంధువులతో సహా పురుష ప్రపంచమంతా భూమి కోసం ఎసరు పెడుతుంటే “నేను చస్తేనే ఈ భూమిల ఎవ్వడైనా కాలు పెడ్తడు.ఎవ్వడొస్తాడో రండిరా” అని సాహసంగా సవాల్ విసరడం. 

జీవితం పట్ల ఎంతో అవగాహన ఉండి లోకం లోని బిడ్డలందరికీ తన బిడ్డలకి వండి నట్లే శ్రద్ధ గా వండి పెట్టే అమ్మే ముసలితనం లో తన బిడ్డ మాత్రం తనతో ఉండి మిగిలిన బిడ్డల్లో వాళ్ళు ఉద్యమాల్లోకి వెళ్ళాలని ఆశిస్తుంది.అందులో తప్పు లేదు. తన కూతురు తన కోసం రాదని అందరి కోసం త్యాగాల బాట పట్టిందని,ఆమె తరఫు వాళ్ళని పొలీసులు చంపుతారని తెలిసినప్పటికీ ” ఈ భూమిని వదిలి ఎక్కడికీ రాను.సచ్చినా బతికినా నా భూమిలోనే”అని నిర్ణయించుకుంటుంది.

’నేను పార్టీ లోకి వచ్చి పోరాడుతున్నా.నిజంగా చూస్తే మా అమ్మ కూడా భూమి కోసం నిరంతరం పోరాడుతూనే ఉంది.కాకపోతే నేను జనత కోసం. మా అమ్మ తన కోసం. పోరాడడం లో అలసిపోని మా అమ్మ అంటే నాకెంతో గౌరవం’ అంటూ కథ ముగిస్తుంది రచయిత్రి.నిజానికి మహిళా లోకం మొత్తం పోరాటం లోనే వాళ్ళ వాళ్ళ పరిధుల్లోనే అయినప్పటికీ రకరకాల పోరాటాల్లో తల మునకలవుతున్నారు.కాకపోతే ఈ కథా రచయిత్రి కి దొరికిన అదృష్టం-అంటే జీవితం గురించి సరైన లోక జ్ఞానాన్నివ్వగలిగిన

అమ్మ,స్త్రీల జీవితాల వెనక నడుస్తున్న రాజకీయాల గురించిన అసలైన శాస్త్రీయ అవగాహన ని అర్థం చేయించగల దళ కమాండర్ అనే వెలుగుదారుల అదృష్టం అందరికీ అందుబాటు లో ఉండవు.

                గొప్ప సాంప్రదాయ-సాంకేతిక ఘర్షణలు జరుగుతున్న సంధి కాలం లో ఇప్పుడు మనమున్నాం.వేగం,అతి వేగం ఈ కాలపు వేదం.నేటి యువతది టీ.వీ.ఇంటర్నెట్ల మాస్ కల్చర్ యుగం” . ప్రపంచ సమాచార సుడిగుండం లో యువత ఈ రోజు ఈదులాడుతుంది.మార్కెట్ మాయాజాలమేమో యువతీ-యువకుల్నిఅల్ల కల్లోలం లో ముంచేస్తున్నది.ఈ రెండిటి బలీయమైన,అపరిమితమైన ఆకర్షణ లకు యువత విపరీతమైనగందర గోళంలో పడిపోతుంది. ముఖ్యం గా మార్కెట్ కి మహిళలు కావాలి.సాంప్రదాయమేమో మనది వేదభూమి.పెళ్ళిళ్ళు వైదిక మంత్రోచ్చారణల మధ్య,అతి ఖరీదైన పట్టుచీరలతో వైభవం గా జరగాలంటుంది.సాంకేతిక నైపుణ్యం గల సాఫ్ట్ వేర్ నిపుణులందరికీ అమెరికాలో మా సంస్కృతి చాలాగొప్పదని చాటుకోవడానికి ఇదంతా ఫొటోల్లో,వీడియోల్లో బంధించడానికి లక్షలు,కోట్లలో ఖర్చు చేస్తున్నారు.మళ్ళీ ఆ వాతావరణంలో బతకడానికి జీన్స్,అక్కడఅత్యాధునిక టెక్నాలజీతోతయారైనసామానంతా కావాలి. ఈ మొత్తం ప్రాసెస్ కి బ్రాండ్అంబాసిడర్లూ-వినియోగదారులూ కూడామహిళలే.ఈరెంటి లో ఏ ఒక్కటీ ఆమె ఎదుగుదలకి అనుకూలంగా లేకపోవడం లోనే ఉంది అసలు విషాదం.కార్పొరేట్ చదువులు,మార్కెట్ లోని విలాస వస్తువులు,ఫ్యాషన్లు,పబ్ లు,క్లబ్బులు,ఫాషన్ డిజైనర్లు,సూపర్ మోడల్స్,సినిమా హీరోయిన్లు,ఖుషీ,మగధీర లాంటి సినిమాలుమొదలైననిలువెత్తు చెత్త తో బుర్రలు నింపుకుంటున్నమహిళలకు ఎదురు బొదురుగా ఈ మహిళలను నిలబెట్టి చూడాలి .

సమాజాన్ని మార్చేప్రక్రియ ఎలా జరగాలి?కొత్తగా నెలకొంటున్న వాతావరణం లో మనలను మనం ఎలా మలచుకొవాలి?సొంత జీవితం పై మనకు గల హక్కును ఎలా కాపాడుకోవాలి?అనే ఆశయాలతో పోరాడుతున్న ఈ మహిళలు మహిళాలోకానికి ఆదర్శం అవుతారు.రెండు పరస్పర విరుద్ధ అంశాలను ఎదురెదురుగా పెట్టి అన్వయిస్తే అబ్బురం గొలిపే కొత్త సవ్యమైన సత్యాలు బోధపడతాయి. చర్య నుంచి ప్రతిచర్యకు దృష్టి ని మళ్ళించే దిశ లో ఆడవాళ్ళు ఇంత ముందున్నారా అనే దిగ్భ్రాంతి లో పడతారు పాఠకులు.

చేపలూ-నీళ్ళు కథలో లక్ష్మీబాయి త్యాగం మరువలేనిది.స్త్రీలకి ఒక విషయం గురించి నమ్మకం కలిగాక ఇక వాళ్ళు ఎంతకైనా తెగిస్తారని తెలుస్తుంది. పైగా ఈ కథ గుంటూరు ప్రాంతంలో జరిగిన ఒక నిజసంఘటన ఆధారమని రచయిత్రి చెప్పారు.ప్రజలతో మమేకమైనప్పుడు అన్నలకి తమ భద్రత గురించిన అప్రమత్తత కూడా ఉండదనేది నిన్న మొన్నటి కిషన్ జీ ని గుర్తు కి తెస్తుంది.

 అమ్మల అంతులేని ఆవేదనలని తెలిపే కథలు

అమ్మ

లచ్చుమమ్మ తన కొడుకు పుట్టినప్పటినుంచి కళ్ళన్నీ బిడ్డ మీదే.ప్రాణం కంటే మిన్న గా చూసుకుంటుంది.తల్లి కనుసన్నల్లో పెరుగుతూనే ఊరి పేద ప్రజలందరికీ దగ్గరౌతాడు.అందరిచేతా మంచి వాడనిపించుకుంటాడు.అందరూ అతన్ని అన్నల్లో వాడే అనుకుంటారు.ప్రతి సంక్రాంతి కి కొడుకు కోసం కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురు చూసే తల్లి కి నాలుగేళ్ళ క్రితమే కొడుకు అమరుడయ్యాడని తెలిసి గుండె పగులుతుంది.ఎందరో అమ్మల గర్భశోకమే ఈ కథావస్తువు.

జీవితం

ఎనిమిది మంది పిల్లలుండి కూడా వృద్దాప్యం లో ఒంటరిగా బతుకు వెళ్ళదీస్తున్న అమ్మ దగ్గరకి కూతురు ఒంట్లో అస్వస్థత గా ఉండి వస్తుంది. కథ రాసుకోవాలని కూర్చుంటుంది.అమ్మ ఎదురుగా కూర్చుని కష్ట-సుఖాలు,ఊరి సంగతులు తన గత జీవితం లోని మనుషుల గురించి చెప్తూ పోతుంటుంది.అమ్మ నా పని చేసుకోనివ్వడం లేదని కూతురు విసుక్కుంటూ కనీసం చదువుకోనిస్తే బాగుండనుకుంటుంది మనసులో.అదీ కుదరదు.అమ్మ తన జీవితానుభవాలన్నీ ఏకరువు పెడుతూనే ఉంటుంది.ఇక లాభం లేదనుకుని వినడానికుపక్రమిస్తుంది.చివరికి కథ పూర్తయ్యేసరికి పాఠకులకి జీవిత  జ్ఞానాన్ని పొందిన అనుభూతికలుగుతుంది.

            ఎనిమిది మందిని ఒంటి చేత్తో కూడు తిననీయకపోయినా బిడ్డ కొక ముద్ద పెడుతూ తానొక ముద్ద తింటూ పిల్లల్నికంటికి రెప్పలా పెంచిన అమ్మ చాతకాని వయసు లో నాకు చావెప్పుడొస్తుందో అని ఎదురుచూసుకుంటూ బతుకుతున్న ఎందరో తల్లుల విషాద గాధ ఈ కథ.”మా అమ్మ ముసలితనపు మానసిక రుగ్మతలను మేమెక్కడ భరిస్తాం?” అనడం ఈ కాలపు పిల్లల మనస్తత్వాన్ని పట్టిస్తుంది.

తాయమ్మ కథ

తాయమ్మ కథ ఒక్క స్త్రీ కథ కాదు.శ్రమ ,నిరంతర శ్రమ చేస్తూ అన్ని రకాల అణచివేతలకు,తోటి మనుషుల పెత్తనాలకు బలవుతున్న ఈ దేశం లోని వేలాది స్త్రీల కథ.తండ్రి లేని పిల్లను మేనమామ  ఏళ్ల వయసు లో రెండో పెళ్ళి వాడికిచ్చి చేస్తాడు.మొదటి భార్యను అరిగోస పెట్టిండట అని తాయమ్మ తల్లి అంటుంది గానీ ఆమె నిస్సహాయురాలు.అలా అత్తింటి కొచ్చిన తాయమ్మది కూడా అరిగోసే అవుతుంది..”ఏం బతుకు నాది,పుట్టి బుద్దెరిగిన కాన్నుంచి ఎన్నడన్ననిమ్మలం గుంది లేదాయె—ఈ పెండ్లి ముదునష్టం గాను పెండ్లైన కాన్నుంచే మరీ పాణానికి సుఖం లేకుంట పోయింది”-అని వాపోతుంది. పొద్దంతా బండ చాకిరి చేసినా చేసినా అందరి చేతా చీదరింపులు చీత్కారాలే..”కష్టపడ్డోనికి కష్టం సంగతి తెలుస్తది,కష్ట పడనోనికి కష్టం ఎట్ల తెలుస్తది” అనిఅంటుంది అని తాయమ్మ.ఒక్క పైసా సంపాయించేది లేదు గాని అన్ని అవలక్షణాలకు తోడు అనుమానం రోగం. తాయమ్మతీరిక లేక మూడు నాలుగేళ్ళకొకసారి జడేసుకుంటూ అయ్యో,జుట్టు అంతా ఊసిపోయిందని అద్దంలో చూసుకుంటే సానిదానిలెక్క తయారయ్యావంటాడు.మూడు రోజులకొకసారి స్నానం చేసి చీర కుచ్చిళ్ళు పోస్తే  ఏ మిండడి కోసం సోకులు, చీర కుచ్చిళ్ళు తీసి గోసి పెట్టమంటాడు.నిద్రలో ఉండి తలుపు తియ్యడం ఒక్కక్షణం లేటయితే ఎవడో దాక్కున్నాడని గదులన్నీ వెతుకుతాడు.ప్రతి సారీ పులిలా మీదబడి తన్నుడే తన్నుడు.తన్నడమంటే నాలుక తప్పించి దెబ్బ లేని చోటుండదు.వీటన్నిటికి తోడు భార్య ఇంట్లో ఉండగా బయట ఇంకొకామె తో సంబంధాలు.ఆమెకు పొలంకట్ట బెట్టాలని చూస్తున్నప్పుడు తాయమ్మ పిల్లల గతేం కాను అనడిగితే “నాకు పుట్టిన పిల్లలైతే గద?”అని అంటాడు. ఇల్లు,పొలం అమ్మాక జీవితాధారం మిల్లు కూడా అల్లుడు,ఆడిబిడ్డ మొగుడితో కలిసి అమ్మేస్తాడు.దుఃఖం ఆపుకోలేని తాయమ్మ అపర కాళికలా విజృంభించి ముగ్గుర్నీ ఏది దొరికితే దానితో వీర బాదుడు బాదుతుంది.

కవులమ్మ ఆడిదేనా?

కవులమ్మ అసలు పేరు కమలమ్మ.వాడుకలో కవులమ్మ అయింది.దాదాపు అరవై ఏండ్లుంటాయి.జీవితమంతా చాకిరీతో నలిగి ఎముకలగూడులా తయారైంది.అయినా పని చెయ్యడం ఆపలేదు.చిన్నప్పుడు గారంగా అల్లరి చేసేది.పెళ్ళి తర్వాత మూగదానిలా తయారైంది.మొగుడు ఇంటి నుంచి బయటికెళ్తే తలుపు తాళం పెట్టుడు,దొడ్డికి పోతే దొడ్డి తలుపు తాళం పెట్టుడు-“నేనటు పోంగానే మిండడి కోసం చూస్తున్నావె”అని బూతులు తిడుతూకొట్టడం. “ఈడు మనిషా,పసురమా?ఈని బుద్ధి పాడుగాను.తల్లి కడుపున ఎట్ల బుట్టిండో ఈ బాడుకావ్”అనుకుంటుంది కవులమ్మ.వదినెను సీతమ్మ కష్టాలు పెట్టిండని అన్న గురించి చెల్లెలు గూడా అంటుంది. చివరికి కన్న కొడుకుతో, కన్న తండ్రితో కూడాసం

బంధమంటగడతాడు.తండ్రి కవులమ్మ గురించి “భూదేవి కున్నంత ఓపిక ఎట్లొచ్చింది బిడ్డ నీకు” అన్న తండ్రి మాటతో కవులమ్మ నరక యాతన మనకు తెలిసొస్తుంది.65 ఏళ్ళ వయసు లో రెండో పెళ్ళి చేసుకుని పోయినోడు చాతగాని వయసులో నాపెళ్ళాం,నా ఇల్లు అనుకుంటూతిరిగి వస్తే అతనికి చాకిరి చెయ్యమని పెద్దమనుషులు,పిల్లలు వత్తిడి చేస్తారు.”ఇది మా ఇల్లు.మా నాయిన గట్టింది.నాయిన కు చేసే దానివైతె వుండు.లేకపోతే పో”అన్న కొడుకులకి”నా పాణం పోయినా ఆని మొకం చూసేది లేదు.మీ ఇంట జేసే కష్టం యాడ జేసుకున్నాబతుకుత”అంటూ బయటికి నడుస్తుంది కవులమ్మ.

.ఎలాంటి భర్త ని జీవితాంతం భరించింది కవులమ్మ? అప్పుడామె కు దన్ను గా ఒక్కరూ రాలేదు.మాయదారి మొగుడు మంచాన పడ్డాక మాత్రం లోకానికీ పిల్లలకీ భార్య కి భర్త పట్ల ఉండాల్సిన బాధ్యతలూ-ధర్మాలు గుర్తుకొచ్చాయి.కవులమ్మ నోటీ వెంట ఈ బూతులేమిటి? కవులమ్మ నోటీ వెంట ఈ బూతులేమిటి? అని నగరిక రచయితలూ,పాఠకులూ అనుకోవచ్చు గానీ అవి చాలా సహజాతి సహజంగా కడుపూ లో దిగమింగుకున్న ఆవేదన వెళ్ళగక్కడమంటే అదే!ఆయా కులాలకూ,ఆయా జాతులకూ బాధని వెళ్ళగక్కే కొన్ని పదబంధాలుంటాయి.ఆ సమయాల్లో అలా గొంతు చించుకుంటేనే ఎదుటివాళ్ల మనసులకి హత్తుకుంటాయి.అది చాలా సహజం.

తాయమ్మ – కవులమ్మల జీవితాలకు కొన్ని పోలికలున్నాయి.ఇద్దరూ ఒళ్ళు హూనం చేసుకుని పని చెయ్యని సోమరి భర్తల్ని పోషించిన వారే!కవులమ్మ తండ్రి కవులమ్మభర్త గురించి గోడ్డూ కాదు మనిషీ కాదు అన్నది తాయమ్మ భర్తకీ వర్తిస్తుంది.ఇద్దరూ అనుమానపు మొగుళ్ళతో కన్నకష్టాలు పడ్డారు.తీరి కూర్చుని ఏడ్చేందుకు కూడా లేదు.ఇల్లు గడవడానికి,పిల్లల్ని పెంచడానికి అంతులేనిశ్రమ చేస్తూనే ఉంటారు.నాపిల్లలు,నాఇల్లు అనుకుని ఆరుగాలం రెక్కలు ముక్కలు చేసుకుంటారు తాయమ్మ,కవులమ్మలు. బతుకు మీద విరక్తి తో చావబోయి కూడా నేను జస్తె నాపిల్లలు ఆగమైతరు.వానికి పెండ్లామొస్తది అని వెనక్కి తిరిగొస్తుందితాయమ్మ.కవులమ్మమొగుడుకొడుకుని చూసి”ఏమిండనికి గన్నదో వీణ్ణి” అనిఅంటాడు.అంతే కాదు,కత్తిపీట తీసుకొచ్చి “వీడు నా కళ్ళ ముందట ఉండొద్దు”అని ఉరికొస్తుంటే కొడుకుని రక్షించడానికని వేరే గదిలోకి ఉరుకుతుంది. అష్ట కష్టాలు పడి ఇల్లు గట్టిస్తే చెరొక మూడు గదులు ఆక్రమించి తల్లికి వసారానిస్తారు.సంపాదిస్తూ కూడా పని మనిషిని పెట్టుకుంటే ఐదు వందలివ్వాలని ఇంటెడు చాకిరి చేయిస్తారు. వాళ్ళు పెరిగి పెద్దై తల్లి బాధను రవ్వంత గూడా పట్టించుకోకుండా ఇటువంటి ఆడిదాన్ని, ఇంత కఠినాత్మురాలిని  ఎక్కడాజూళ్ళేదని అంటారు. ఈ కాలపు పిల్లలు చాలా స్వార్ధం గా ప్రవర్తిస్తున్నారు.వ్యవస్థ కని పెంచిన తల్లికి వ్యతిరేకం గా పిల్లల్నితయారు చేస్తుంది. అందుకే తాయమ్మ”కొడుకుల నోట్ల మన్ను బడ, ఏం కొడుకులు” అంటుంది.

ఈ ఇద్దరు స్త్రీలు కూడా వారి వారి మొగుళ్ళు ఎంత కొట్టినా,వారి ప్రవర్తన మీద ఎన్ని అభాండాలు వేసినా వాళ్ళ ధైర్యం సడలదు. దుర్మార్గంగా మాట్లాడితే అంతే ధీరత్వం తో ఎలాంటి వాళ్లకు అలాంటి బుద్ధులే ఉంటాయని మాటకు మాట సమాధానం చెబుతారు.అసలు పురుషుడి బాధే అది అన్నీ అమర్చిపెట్టాలి.అడ్డమైన చాకిరి చెయ్యాలి.వీటన్నిటి కంటే ముఖ్యంగా స్త్రీలు ఎంత సమర్ధులు గా ఉన్నప్పటికీ పురుషులు ఏంచేసినా చెప్పుకింద తేలులా పడుండాలి.లేకపోతే వాళ్ళ అహం దెబ్బ తింటుంది.ఎంత అన్యాయం గా ప్రవర్తించినా పురుషుల్ని ఈ సభ్యసమాజం శిక్షించదు.పైగా సంఘం లో వాళ్ళే పెద్దమనుషులుగా చెలామణీ అవుతారు.తాయమ్మ భర్త ఊరి సర్పంచ్.కవులమ్మ భర్త సమాజం అమోదించిన వైద్యుడు. ఇద్దరికీ బయటి వారితో సంబంధాలున్నప్పటికీ సమాజంపాతివ్రత్యం స్త్రీల కొక్కరికేనా?పురుషులకు అవసరం లేదా? అని అడగదు.ఈ దేశం లో పిల్లలూ-స్త్రీలూ కూడా ద్వితీయ శ్రేణి పౌరులే!సమాజంలో వారి స్థితిని కరుణ తన కథల్లో కళ్లకి గట్టిస్తారు. ముఖ్యంగాపసితనంలో వృద్దాప్యం లో అపురూపంగా చూసుకోవడంలో బాధ్యత వహించాల్సిన ప్రభుత్వం వారి సంక్షేమానికి పూర్తిగా తిలోదకాలొదుల్తుంది.”యధా రాజా తధా ప్రజా” అన్నట్లు మనుషుల ప్రవర్తనలు కూడా ఆ సమాజ చట్రం లోనే ఉంటాయి గనుక పెరిగి సంపాదిస్తున్న పిల్లలు కూడాతలిదండ్రుల గురించి బాధ్యతగా ఆలోచించడం లేదు. ఈ ఇద్దరు స్త్రీ మూర్తుల కథలని కరుణ నిర్వహించిన తీరు అనితరసాధ్యం.అసలు వాళ్ళు వాళ్ల కుటుంబాలకే కాదు సమస్త ప్రపంచానికీ విసిరిన సవాళ్ళు.పురుషులు స్త్రీలను అణచిపెట్టడానికి రాసిన ఈ శాస్త్రాలను,పన్నిన కుటిల పన్నాగాలను విశదపరిచింది.వీళ్ళకింత శక్తి ఎక్కడ నుంచి వచ్చింది. వాళ్ళ శ్రమ ,నిరంతర శ్రమ వల్ల అంత శక్తివంతులయ్యారు.వీళ్ళ కథలు చదివితే ప్రపంచాన్నిచైతన్యవంతం చేసే శక్తంతా శ్రమ లోనే ఉందని అర్ధమవుతుంది.

ప్రభుత్వద్వందనీతి ని ఎండగట్టే కథలు

ముదునష్టపు రోజులు

జన్మ భూమి పేరిట ప్రభుత్వం చేసే కుట్రలు,ప్రజల సంక్షేమమని చెప్తూ చేసే మోసాల్ని చెప్తుంది ఈ కథ.

            ఆప్యాయతలతో ఉన్నంతలో కలో గంజో తాగుతూ బిడ్డ లా చూసుకునే కోడలు,తండ్రిలా కనిపెట్టుకుని ఉండే మావ ల మధ్య అన్ని వైపులనుంచి ముసురుకున్న (ఆర్ధిక ఇబ్బందుల తో పెన్షన్ కోసం ప్రయత్నించమని ఒత్తిడి పెడుతుంది కోడలు.ఎన్నడు ఎవరి ముందూ చెయ్యి చాచి ఎరుగని నారయ్య బయలుదేరుతాడు. 

“ముందుగాల ఎవరు సచ్చిపోయేటట్టు ఉన్నరో తెల్సుకుని వచ్చి నాకు చెప్తివంటే మల్ల గా పెన్షన్ నీకే వచ్చెటట్టు జన్మభూమి అధికార్లతోటి మాట్లాడ్త” నంటాడు సర్పంచ్.”గిది మరీ అన్నాళం గుందే ఏ ముసలోడు సస్తడా అని ఎదురు సూసుడు”-అంటాడొక పెద్దాయన.  ఎవరికన్నా పెట్టినోన్నా,పోసి నోన్నా,ఎవనికి రోగం వచ్చిందని కనుక్కుందు,ఎవరు సచ్చేటట్టు ఉన్నరని కనుక్కుందు,ఎవని సావు ని కోరుకుందు అనుకుని జావగారి పోతాడునారయ్య.బుచ్చయ్య కు ఒంట్లొ బాగలేదని నారయ్య చూడబోతె నా సావు కోసం ఎదురు చూసేటోళ్ళు  సానామంది ఉన్నరు అంటాడు బుచ్చయ్య.

ముదనష్టపు రోజులు దాపురించెనే,ఒకరికొకరు పెట్టుకోకపోయినా,పోసుకోకపోయినా,కనిపిస్తె కడుపారా పలకరించుకునేటోళ్ళం,ప్రాణంపెట్టి మాట్లాడుకునేటోళ్ళం.–కల్సుకున్నప్పుడు కష్టం సుఖం చెప్పుకుని మన్సుల ఉన్న బరువు దించుకునేటోళ్ళు.ఒగరికొకరు ఓదార్చుకునేటోళ్ళు.గిప్పుడు గది కూడా లేకుండైపాయె.ఈ ముసలి తనంల ఏందీసిచ్చీ సచ్చెముందల పాణం నిమ్మలం లేకుండైపాయె.ఈ సర్కారోడు ముసలోళ్ళ బతుకులల్ల సావుదలకు సిచ్చు బెట్టె.అరిగోస తీయిస్తుండు గద.–పాణం ఉండంగనె పీక్క తిన్నట్టుగుంది.-ఈ మాటలు మన వ్యవస్థ ని కళ్లకి గట్టిస్తాయి.

బుచ్చయ్య పోయాడని తెలుసుకున్న నారయ్య నానాటికీ గడ్డు గా మారుతున్న ఇంటి పరిస్థితుల్ని తల్చుకుంటాడు.

 ఆ రోజు న్న జన్మభూమి కార్యక్రమం వైపుకి కాళ్లు ఆయన ప్రమేయం లేకుండానే కదుల్తాయి. కానీ మోయలేని బండ రాయిని మీద పెట్టినట్టు,భూమిలకు దిగబడి పోతున్నట్టు,చీము నెత్తురు లేనట్టు,పాణాన్ని ఎవరో చెయ్యి పెట్టి గుంజి అవతల  పారేసినట్టు కాళ్ళీడ్చుకుంటూ సాగిపోయాడు.తోటి మనుషుల్ని ప్రేమించే మనుషులతో కూడా ఈ దుర్మార్గమైన ప్రభుత్వ విధానాలు కడుపు కోసం ఆటలాడిస్తున్నాయి.

నా రైలు ప్రయాణం

రైలు ప్రయాణం పల్లెల్లోని ఇరుగుపొరుగు పలకరింపులాఅనిపిస్తే బస్సు ప్రయాణం ఇప్పటి పట్టణ జీవితం లా ఒంటరి గా ఉంటుందంటారు రచయిత్రి.తోటి ప్రయాణీకుల గురించిన ప్రస్తావన ఉంటుంది. అవసరంగా బయల్దేరినందున రిజర్వేషన్ చేయించుకోలేక బెర్త్ కోసం టి.సి. కి డబ్బులిస్తుంది.ఒక ప్రయాణీకురాలు లంచం ఇవ్వడం తప్పు కదా?అతనికి సాలరీ వస్తుంది కదా?అని అడుగుతుంది.ఈ మధ్య ప్రభుత్వం ప్రవేశపెట్టిన “తత్కాల్”గురించిన వాదోపవాదాలుంటాయి.ఎంత ముందు వెళ్ళి క్యూలో నిలబడినప్పటికీ టికెట్స్ ఐపోయాయంటారు.గొప్ప వాళ్ళకి తత్కాల్ లో అప్పటికప్పుడు దొరికిపోతాయి. సాధారణ ప్రజలు గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రభుత్వానికి 150 రూ| ఇచ్చిరిజర్వేషన్ చేయించుకొనే బదులు 50 రూ టి సీ కి లంచమిచ్చే పరిస్థితి ని కల్పిస్తున్నారని సమాధానం చెబుతుంది.

ప్రభుత్వానికి క్లాస్ నేచర్ ఉంటుంది.ఏ పధకాలు గాని,చట్టాలు గాని ధనవంతుల శ్రేయస్సు కోరేవి గానే ఉంటాయి తప్ప బడుగు వర్గాల సంక్షేమ దృష్టి ఉండదనే అభియోగం ఉంటుంది.

ఆడపిల్లల పట్ల సమాజపు హృదయ హీనత ను వివరించే కథలు

కౄరత్వం

ఈ కథ ఆడ పిల్లలు పెద్దగా మాట్లాడ కూడదు,తల వంచి బతకాలి,పెద్దగా నవ్వకూడదు లాంటి శాసనాలు చేసిన వ్యవస్థ కౄరత్వం గురించి చిన్నపిల్లల ద్వారా చెప్తుంది.

“నవ్వంగ రాదు పలుమారు నవ్విన చిరునవ్వె గాని”, “నవ్వు నాలుగందాల చేటు” అంటూ

 ద్రౌపది నవ్వినందుకే కురుక్షేత్ర యుద్ధానికి దారితీసిందనే ప్రచారం చేశారు.ఆడవాళ్ల నవ్వుల మీద రకరకాల ఆంక్షలు పెట్టిన దుర్మార్గపు వ్యవస్థ మీద ,పురుషులు స్త్రీలను అణచి ఉంచడానికీ,ఎప్పటికీతమ చెప్పుచేతల్లో పెట్టుకోవడానికీ చేసిన కుట్ర గురించి గ్రామంలో ఉండే అమాయక బాలికల ద్వారా చెప్పించి అందర్నీ ఆలోచించమంటుంది.

మగబుద్ధి

ఒక చిన్నబాబు రోజూ స్కూలు కి తనతోపాటు చెల్లెల్ని తీసికెళ్తాడు.ఒక రోజు నేను చెల్లెల్తో వెళ్ళనని మొండికేస్తాడు.ఎందుకని వాళ్ళమ్మ అడిగితే ఆడపిల్లతో కలిసి వెళ్తే అందరూ నవ్వుతారంటాడు.

స్త్రీత్వం-పురుషత్వం అనే వాటిని పితృస్వామ్య సమాజం పసితనం నుంచే నిర్మిస్తుం ద నేవిషయాన్ని ఈ కథ  చెప్తుందిస్త్రీ-పురుషులు మనుషులు గా పుట్టినప్పటికీ సమాజం వారిని స్త్రీలు గా అబలలు గా పురుషులకి లోబడి ఉండేవారిలా,మగవాడిని ధీరుడిగా మహారాజు గా పెరిగేలా వ్యవస్థ,పిల్లలు పెరిగే క్రమంలో చిన్నతనం నుంచే శ్రద్ధ తీసుకుంటుంది.

ధనవంతుల్ని మరీ గొప్పగా పేదవాళ్ళను హీనం గా చూసే సమాజపు తీరును తెలిపే కథ.

లాభం-నష్టం = మానవ సంబంధాల బలి

డబ్బు మీద ప్రీతి తో తోటి మనిషుల పట్ల మనిషి ప్రవర్తిస్తున్న తీరును విశ్లేషిస్తుందీ కథ.

ప్రస్తుతం ప్రతి ఇంట్లో నడుస్తున్న భాగోతమే ఇది.తరచి చూస్తే ఈ కథ లోని విజయ మనస్తత్వం మనందరిలోనూ  ఎప్పుడో ఒకప్పుడు కనిపిస్తుంది.అదేమిటో మన దేశం లో కోడలికి అత్తా-మామలు-ఆడబిడ్డ-మరుదు లంటే పడదు.ఎక్కడినుంచో తనవాళ్ళనందర్నీ వదిలి వచ్చిన ఇంటి కోడల్ని అపురూపంగా చూసుకోవాలని వీళ్ళకి ఉండదు.ఒకరంటే ఒకరికి గిట్టకపోవడమన్నది

ఒక అమలు చెయ్యని,చెయ్యనవసరం లేని చట్టం లాగే కొనసాగుతున్నాయి.ఇష్టం లేని మనుషులమీద పైసా ఖర్చు చెయ్యాలన్నా కష్టం గానే ఉంటుంది.అది నెమ్మది నెమ్మది గా ఒక జబ్బు లా తయారై సొంత రక్తం పంచుకు పుట్టిన అన్నదమ్ములు,అక్క చెల్లెళ్ళ వరకూ విస్తరిస్తుంది.అది చివరికి కన్న తల్లి ని కూడా బయటికి గెంటేంత కౄరమైన మానసిక వ్యాధిలా తయారవుతుంది.ఈ కథ లో విజయ అనే పాత్ర ప్రవర్తించిన తీరు ఇదే.ఒక ప్రణాళిక ప్రకారం భర్త కి సందర్భానుసారంగా అత్తమామలు,మరుదులు,ఆడ-బిడ్డల యెడల విరక్తి పుట్టేలా చేయగలుగుతుంది.కష్ట సుఖాల్లో ఆదుకున్న భర్త స్నేహితుణ్ణి అనకూడని మాటలని ఇంటి ముఖం చూడకుండా చేస్తుంది.చివరికి కని పెంచిన అమ్మ నాలుగు రోజులుంటుందని గ్రహించి పైసల లెక్కలు గడుతుంది.ఇంత కాపీనం గా లెక్క గట్టిన మనిషి లోనే ఒక విచిత్రమైన మనస్తత్వం కనిపిస్తుంది.ఖరీదైన నగలూ,గొప్ప చీరా ధరించిన చిన్ననాటి స్నేహితురాలి కోసం తెగ తాపత్రయ పడి పోతుంది.బలవంతాన ఇంటికి పిల్చి ఆమె వద్దంటున్నా వినిపించుకోకుండా పిజ్జా-కూల్ డ్రింక్స్ తెప్పించి ఇస్తుంది.నిజానికి తనకుతాను తిండి కూడా మానుకుని పైసా పైసా కూడబెట్టిన మనిషి ధనవంతురాలైన స్నేహితురాలికి గొప్ప మర్యాదలు చేయటాన్ని భర్త అసహ్యించుకుంటాడు.ఈ గుణం మనందరిలోనూ ఉంది.సిరి సంపదలతో తులతూగే స్నేహితులో బంధువులో మనల్ని పెళ్ళిళ్ళకో ఫంక్షన్ల కో పిలిస్తే మన తాహతు కి మించి బహుమతులు ఇస్తూ వాళ్ళ మెప్పు పొందటానికి,వాళ్ళ దృష్టి లో పడటానికి ప్రయత్నిస్తాం.అదేపేదవాళ్ళు పిలిస్తే అత్యంత సాధారణమైన బహుమతిని కొనేటప్పుడే “ఈ వస్తువు ని వాళ్ళేం చేసుకుంటారు?ఎలా వాడాలో కూడా వాళ్ళకి తెలిసి చావదు”అంటూ హేళన గా మాట్లాడతాం.డబ్బున్న వాళ్ళ పట్ల లోకంలో అందరికీ ఉండే మోజునీ,గౌరవాన్నీ రచయిత సందర్భానుసారం గా ఈ సంఘటన ద్వారా చాలా హృద్యం గా చిత్రించారు.

చాత్రిబాబుకు ముత్యాలమ్మ నివాళి

రచయిత్రి మొట్టమొదటి కథ ఇది.అయినా చక్కటి ఉత్తరాంధ్ర భాష లో రావిశాస్త్రి గారిని చాత్రి బాబు గారు అని సంభోదిస్తూ చచ్చిస్వర్గాని కెళ్ళిపోయి మాలాంటి వాళ్ళకన్యాయం చేశారని ముత్యాలమ్మ అర్పించే నివాళి ఈ కథ.

            “మా లాటి బోడిగాళ్ల బాధలు అందరికి అవుపిచ్చవుగదండి.కానండి చాత్రి బాబుకు బాధలు గాఅవుపిచ్చాయండి,….అందుకండి మేం వొవురికి సెప్పుకోనేదండి.చాత్రి బాబుక్కూడా సెప్పుకోనేదండి.కానండి.ఆయన సూసినారండి.–రాసేసినారండి.—చాత్రి బాబు తెల్వకముందండి వేరే నాయరు దగ్గరకి పోయేవోళ్ళమండి.వాళ్ళు మా బాదలినేవోరు కాదండి.డబ్బులడిగేవోరండి.కానండి చాత్రిబాబు గోరు మాం సెప్పేదినేవోరండి.డబ్బులడిగేవోరు గాదండి.చాత్రి బాబు సానా మంచోరండి.”

            ఈ విధంగా సాహిత్యం సాహిత్యకారులకే కాక మామూలు ప్రజలందరికీ అర్ధమయ్యేటట్లుంటే అదే మంచి రచన అవుతుంది.కరుణ తన మొదటి కథ లోనే క్లుప్తతనీ గాఢతనీ సాధించింది.పదాడంబరాలతోనూ,మాయాజాలం లో ముంచెత్తే శిల్ప విన్యాసాల సృజనకారుల కంటే వాస్తవాలను కళ్ళకు గట్టిస్తూ ఆదీ-అంతం తెలిసి చేసే రచన మంచిదని సురవరం ప్రతాపరెడ్డి గారంటారు.ఈ చిట్టి కథ ఆ ప్రమాణాలకు చక్కగా సరిపోతుంది.            

            ముందు మాట లో శివారెడ్డి గారన్నట్లు ఒక బృందపు దుఃఖాన్ని గ్రీకు కోరస్  రూపంలో రాయడం కరుణ ప్రత్యేకత.కరుణ గ్రీకు పురాణాలు చదువుకోలేదు.అవి వాళ్ళు పడ్డ బాధ,అవమానం,ఆక్రోశాన్ని వెల్లడిస్తాయి.”మీ చరిత్రను చెబుతాం” లో

“అయ్యో!పిలగాడా!మొన్నటిదాంకా వూర్లనే వుండె.ఎప్పుడు పోయ్యిండు అన్నళ్ళకు”s

“ఇంత చిన్న పోరగాండ్లను సంపటానికి వాళ్ళకు పాణం ఎట్లొప్పిందో”

“అయ్యో…బిడ్డలారా ఎంత గోస పెట్టిండ్రు మిమ్ముల”చేతులు పట్టుకుని చూసి ఏడ్చుకుంటూ ఓ తల్లి.

“పసి పిందెలమ్మ.అన్ని దెబ్బలను ఎట్ల తట్టుకున్నరో కొడుకులాలా”వల వలా ఏడ్చింది ఓ అమ్మ.

“అయ్యో..!అయ్యయ్యో…కొడుకా…ఓ కొడుకా…పాణం ఎంత గుంజుకుందో కొడుకలాలా…సూడండయ్యో సూడండి.సూడండయ్యో…సూడండి.గోర్లు ఎట్లా పీకిండ్రో,అయ్యో …కొడుకులాలా,,కొడుకో…కొడుకా…మీ అసుమంటి పిల్లలు వాళ్ళకు లేకుండిరా….బిడ్డో బిడ్డలారా”ఎదురు రొమ్ములు కొట్టుకుంటూ శవాల మీద పడి ఏడ్చుకుంటూ …ఓ తల్లి.

“నీ కింత చిన్నతనానఎంత కష్టమొచ్చె తండ్రీ … ఎవరికోసం నాయినాఇన్ని తిప్పలపడ్తివి”ఇంకో తల్లి కళ్ళు వత్తుకుంది.

“యేసు ప్రభుకొచ్చిన కష్టాలొచ్చెబిడ్డా!మీకు”ఒక ముసలవ్వనడవలేక నడవలేక కర్ర సాయంతో చూడ్డానికివచ్చి,నీళ్ళింకి పోయిన కళ్ళొత్తుకుంది.

“ఆ ముండా కొడుకులు అన్నం తింట లేరామ్మా…పియ్యి తింటున్నరా…చిన్న పోరగాండ్ల గొడ్లను బాదినట్టు బాదిండ్రు”

“ఆళ్ళ పెండ్లం పిల్లలు చెట్టు పుట్ట పట్టుకపోను”

“ఆళ్ళ పిల్లలకు ఇదే గతి పట్ట”

“ఆ దెవుడు ఇట్లాంటోళ్ళను ఏమిసెయ్యడేవమ్మ”

“ఆ దేవుడే ఉంటే మనకిన్ని తిప్పలెందుకు”

“ఏ బాంబు కిందనో పడి సస్తరు ముండాకొడుకులు”అంటూ ఏడ్వని వారు లేరు.  

 అమ్మకథ -ప్రాణ హిత -జూన్ 2009 సంచిక లో వచ్చింది.ఇందులో

“కడసారి సూపన్న సూసుకుందును. శవాన్నయినా ఇయ్యకపాయిరి ముండాకొడుకులు”
“లచ్చుమమ్మను చూస్తే గుండె చెరువైతది. పాణాలన్ని ఆని మీద పెట్టుకొని బతికె”
“ఈ బజార్న రావాల్నంటె కన్నపేగు మెలిపడ్డట్టయితది. ”
తలా వో మాట అనుకుంట కండ్లొతుకుంట ఎవరిదారినవాళ్లు పోయారు.
“నా కొడుకు చీమకన్న హాని జేసేటోడు కాడు
నాకొడుకు దయగల్లోడు
నా కొడుకు నల్గురి బాగును కోరుకునేటోడు
ఎవరిక్కష్ట మొచ్చినా తనకొచ్చిందనుకుంటడు
నా కొడుకును ఎందుకు సంపుతరు
నా కొడుకు ఎవలకేం పాపం జేసిండని
సూర్యుని మొఖాన మన్ను బోస్తే
ఆళ్ల మొఖానే పడ్తదివానసుమొంటి పిల్లల్లేరా.

తాయమ్మ కథ లో

 “మీ కడుపులు కాలగదరా./మీ నెత్తిన దుమ్ము బోయ గదరా./మీ నెత్తిన మన్ను బోయగదరా./మిమ్ములేట్ల బెట్టగదరా./మీకు పెద్దరోగం బుట్త./

నన్నరిగోస పెడ్తుంటిరి గదరా./నా ఎంట యిట్ల బడ్డరేందిరా?/మీకేమన్నాయంజేసిన్రా?/నెత్తిత్తు నేల బడ్డకాంచి/నన్ను కలి కలి జేస్తుంటిరిగదరా./మిమ్ముల కాష్టంల బెట్ట/మీకు సావన్న రాదేందిరా”దీని తర్వాత తాయమ్మ దుఃఖం తారస్థాయి కెళ్ళిపోతుంది.ఉన్మాద స్థితి లో మనసు కి బాగా దగ్గరైన వారు గుర్తొస్తారు.ఇక వాళ్లమ్మను తల్చుకుంటూ

నన్నెందుకు గన్నవే అమ్మో…అమ్మా…

పుట్టిన్నాడే సంపకపోయినవే అమ్మో…అమ్మా…

కొడుకుల గని ఏం సుఖపడ్డనే అమ్మో…అమ్మా…

కడుపు నిండ కూడెరగనైతినే అమ్మో…అమ్మా…

కంటి నిండ నిద్రెరగనైతినే అమ్మో…అమ్మా…

ఒంటి నిండ బట్టెర్గ అమ్మో…అమ్మా…

సీత కష్టాలు పెడ్తుండ్రు గదనే అమ్మో…అమ్మా…

నా కష్టమంత రాళ్ల పాలాయెనే అమ్మో…అమ్మా…

నన్నీ బందెల దొడ్లెకు తోల్తివి అమ్మో…అమ్మా…

నన్నడివిల బడేస్తివిగదనే అమ్మో…అమ్మా…

నేనెవరికి జెప్పుకుందునే అమ్మో…అమ్మా…

నన్ను బత్కనిస్తలేరాయెనే అమ్మో…అమ్మా…

సచ్చిందాంక నా ఎంట బడ్తున్నరే అమ్మో…అమ్మా…

నేనెట్ల బత్కుదునే అమ్మో…అమ్మా…

నాదెంత మొండి బత్కాయెనే అమ్మో…అమ్మా…

నాకు సావన్న రాదాయెనే అమ్మో…అమ్మా…

నా పాణం యిసిగి పోయిందే అమ్మో…అమ్మా…

నన్ను నీ కాడ్కి దీస్కపోవే అమ్మో…అమ్మా…

నీ కొంగుల దాసుకోవే అమ్మో…అమ్మా…

నీ కడుపుల బెట్టుకోవే అమ్మో…అమ్మా…

ఇక కరుణ కథాసాహిత్యం విషయానికొస్తే నిరంతర శ్రమ నుంచే అసలైన  జ్ఞానం పుడుతుంది.ఎక్కడ దోపిడీ ఉంటుందో అక్కడ ప్రతిఘటన తప్పదు.గతి తార్కిక భౌతికవాద దృక్పధం తో  సరళం గా సూటిగా వాస్తవ చిత్రీకరణ చేశారు. ” కథకుడు ఇతివృత్తం ఎన్నుకోవడం లో గాని,దానికి తగిన శిల్పం అమర్చుకోవటంలో గాని పూర్తిగా ఏకాకి గా ఉంటాడు.ఆ కథ రచించటం లో అతను పెట్టుకునే ఆశయం ఒకటే,అతణ్ణి సామాజికుణ్ణి చేస్తుంది. అతను ఒంటరిగా తన గదిలో కూర్చొని కథ రాస్తున్నప్పటికీ అతని మీద కథ చదవబోయే సహృదయుడి ప్రభావం అనుక్షణమూ ఉంటుంది.ఈ సహృదయుణ్ణి స్పష్టంగా భావన చెయ్యలేని రచయిత తన ప్రయోజనాన్నికూడా స్పష్టంగా చూడలేడని నిస్సంకోచంగా చెప్పవచ్చు.” అని అంటారు కొడవటిగంటి కుటుంబరావు గారు. ఈ ప్రమాణాల ప్రకారంకరుణ ఒక స్పష్టమైన ప్రాపంచిక దృష్టితో రాస్తున్నప్పుడు తన ఇతివృత్తాలు ఏ సహృదయుల కోసంఉద్దేశిస్తుందో ఆమె కు స్పష్టమే.మేడి పండు లాంటి కుటుంబ జీవితం,తర తరాలు గా స్త్రీల నరకయాతనల్ని పట్టించుకుని బాధ్యత గా తపించిన శరత్,చలం,శ్రీ పాద మొదలైన ముందుతరాల రచయితలందరి ఆర్తి నీ ఆవాహన చేసుకుని,వాటితో తన అనుభవ సారాన్నంతా మేళవించి బహు ముచ్చటైన అల్లికలు గా మనకందించారు. కరుణ తనకు పరిచయం లేని అంశాల జోలికి పోలేదు. విశేష పరిచయం ఉన్న అంశాలనే కథా ఇతివృత్తాలుఎంచుకున్నారు. మహా శ్వేతాదేవి,అరుంధతీ రాయ్, అనూరాధా గాంధీ,కామ్రేడ్ మాసే మొ|న రచయిత్రులకున్న శాస్త్రీయ దృష్టి – అనే కొత్త వెలుగు దారిలో తను ప్రయాణిస్తూ పాఠకుల్ని కూడా తనతో తీసికెళ్తారు.

       వస్తువు ప్రాధాన్యాన్ని బట్టి శిల్పంరూపం సంతరించుకుంది.ఇక బాష విషయానికొస్తే తెలంగాణా ప్రాంతపు అట్టడుగు కులాల అస్థిత్వాలకు అద్దం పట్టే ప్రజల జీవబాష.మనసు ముసురు పట్టడం,నిర్రంది, కన్నపేగు గుంజుకపోతున్నట్టు,ఆటిక పట్టుడు,గలుమట్ల,సైసకపోతి,నా నోటికి గత్తర పుట్ట,చూసి చూసి కండ్లు లొట్టలకు పాయె, గుల్లగురిగి, యేసులు, జీవితానికవసరమయ్యే అకల్ బుద్ధిని నేర్పించడం/నెత్తిత్తు నేల బడ్డ కాంచి-ఇంకా ఎన్నో సొగసైన పదబంధాలున్నాయి. అమ్మ కథ గురించి ప్రాణహిత (నెట్ లో) చర్చ నడిచింది.(ఒకతను?/ఆమె)తెలియదు.Dropped_dead “ఈ రచయిత ప్రతి అక్షరం,ప్రతి మాటా,ప్రతి వాక్యం విలువైనవి.అనవసరమైనదేది’ లేదన్నారు.అది మొత్తం సాహిత్యానికి వర్తిస్తుంది.

– శివలక్ష్మి

                                                            **********

సాహిత్య వ్యాసాలు ​, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో