మేక్సిమ్ గోర్కీ కథ

మేక్సిమ్ గోర్కీ
నా పరిచయస్తుడొకాయన నాకీ కథ చెప్పారు.
మాస్కో లో నేను విద్యార్ధి గా ఉన్నప్పుడు మా ఇంటి చుట్టు పక్కల్లో ఉండే ఆడవాళ్ళ ప్రవర్తన చాలా సందేహాస్పదంగా ఉండేది.మా పక్కింట్లో తెరెసా అనే పోలిష్ మహిళ ఉండేది.
ఆమె ఇంగ్లీష్ వారికంటే కొంచెం చాయ తక్కువగా, చాలా పొడవుగా, బలిష్టమైన శరీరంతో, నల్లని ఒత్తైన కనుబొమ్మలతో, జిడ్డుగా,వికారంగా ఉన్న పెద్ద కోల ముఖాన్ని ఎవరో చిన్న చేతి గొడ్డలి తో చెక్కినట్లుండేది-వీర తాగుడు తో మత్తెక్కిన కళ్ళతో,మంద్ర స్వరంతో,కార్ డ్రైవర్ లాగా నడిచే నడకతో,అపారమైన కండరాల శక్తి తో ,ఒక మత్స్యకారుని భార్య రూపురేఖలతో ఉన్న తెరెసాని చూసి నేను అతిగా భయపడిపోయాను.నేను పై అంతస్థులో ఉండేవాణ్ణి,నా ఎదురుగా ఉన్న పనివాళ్ళకు కేటాయీంచే చెత్త-మురికి గదిలో ఆమె ఉండేది.ఆమె ఇంట్లోనే ఉంటుందని తెలుసు కాబట్టి నేనెప్పుడూ నాగది తలుపులు తెరిచేవాణ్ణి కాదు.కానీ ఇది చాలా తక్కువ సందర్భాల్లో జరిగేది.కొన్నిసార్లు ఆమె నాకు మెట్ల మీదా,కొన్నిసార్లు యార్డ్ లోనూ నావైపు నవ్వుతూ చూస్తూ ఎదురుపడేది. కానీ ఆ నవ్వు కపటంగా జిత్తులమారితనంగా మనుషుల్ని ద్వేషించేదిగా అనిపించేది.అప్పుడప్పుడూ బాగా తాగి,మసకబారిన కళ్ళతో, చెదిరిన జుట్టుతో,వికారమైన నవ్వుతో కనపడేది.అలాంటి సందర్భాల్లో ఆమె నాతో మాట్లాడేది.
“ఓ విద్యార్ధీ,ఎలా ఉన్నావు?అంటూ ఆమె వెటకారంగా నవ్విన నవ్వు నాకు ఆమె యెడల నాకున్న అసహ్యాన్ని మరింత తీవ్రతరం చేసేది.ఇలాంటి ఎన్ కౌంటర్స్ నుంచీ, గ్రీటింగ్స్ నుంచి తప్పించుకోవడానికి నేను ఇల్లు మారాలనుకున్నాను.కానీ నా చిన్ని గది, పెద్ద కిటికీతో- ఆ కిటికీ లోంచి చూస్తే ప్రశాంతంగా కనిపించే వీధీ నాకెంతో ఇష్టంగా,మనోహరంగా ఉండేవి.కాబట్టి సరిపెట్టుకుని ఓర్చుకుందామనుకున్నాను.
ఒక ఉదయం నా కోచ్ మీద పడి నా క్లాస్ ఎగ్గొట్టడానికి ఉపాయం కోసం ఆలోచిస్తుండగా తలుపు తెరుచుకుంది.వాకిలి దగ్గరనుంచి చీదర పుట్టే తెరెసా గొంతు వినిపించింది.
“హలో మిస్టర్ స్టూడెంట్,నీకు మంచి ఆరోగ్యం కలుగు గాక”
“నీకేం కావాలి?”అని అడిగాను.నేను ఆమె ముఖంలో సందిగ్ధతనూ,వినయాన్నీ గమనించాను.సాధారణంగా రోజూ చూసేటట్లు గాకుండా చాలా అపూర్వం గా అనిపించింది
“సార్,నాకో చిన్నసహాయం కావాలి.చేసి పెట్టగలరా?బతిమాలే ధోరణిలో అడిగింది.
ఒక్క నిమిషం నిశ్శబ్దంగా ఉండి నాలో నేను ఆలోచించాను.
“మంచి అవకాశం,కాస్త దయగా,మరింత ధైర్యంగా ఉండాలి” అని నాకు నేనే నచ్చచెప్పుకున్నాను.
“నేను ఇంటికొక ఉత్తరం రాయాలి.అదీ సంగతి”ఆమె గొంతు మృదువుగా,పిరికిగా,వేడుకోలు ధోరణిలో ఉంది.
“డ్యూస్,బి బ్రేవ్,అని నాకు నేనే చెప్పుకుని ఒక్క ఉదుటున జంప్ చేసి నా టేబిల్ దగ్గర కూర్చుని ఒక పేపర్ పెన్ తీసుకుని
“ఇక్కడ కూర్చుని డిక్టేట్ చెయ్యండి!”అని అన్నాను.
ఆమె వచ్చి చాలా జాగ్రత్తగా ఒబ్బిడిగా కూర్చుని అపరాధభావంతో నా వైపు చూసింది.
“ఓ.కే.మీరెవరికి లేఖ రాయాలనుకుంటున్నారు?”
“సియత్ జియానా పట్టణం లోని వార్సా రోడ్ లొ నున్న బోల్స్ లావ్ కేష్ పుట్ కు”
“ఓ.కే. చెప్పండి”
“మై డియర్ బోల్స్, మై డార్లింగ్!నానమ్మకస్తుడైన ప్రేమికుడా! మేరీ మాత నిన్ను రక్షించు గాక!నీ హృదయం బంగారం,నీకోసం పరితపించే నీ చిన్ని గువ్వపిట్ట తెరెసాకి ఇన్ని రోజులు ఉత్తరం రాయకుండా ఎలా ఉండగలిగావు?
“పరితపించే చిన్న గువ్వపిట్ట” నాలో నేనే నవ్వుకోబోయి అది దాదాపు బయటికే వచ్చేసింది.ఐదడుగుల కంటే ఎత్తు,రాళ్ళలాంటి పిడికిళ్ళు,లావైన శరీరం-ఈ చిన్ని గువ్వపిట్ట తన జన్మంతా పొగ గూడు లోనే ఉండిపోయి జీవిత కాలంలో ఎప్పుడూ కూడా కడుక్కోలేనంత జిడ్డుకారే ముఖం-ఇవన్నీ గుర్తొచ్చి నన్ను నేను ఎలాగోలా నిలదొక్కుకుంటూ అడిగాను.
“ఎవరీ బోలెస్ట్”
“బోల్స్,మిస్టర్,బోల్స్,నేనతని పేరుని తప్పుగా పలికినందుకు బాధ పడుతున్నట్లుగా నావైపు చూస్తూ “అతను బోల్స్ నా చిన్నవాడు”అన్నది.
“నీ యువకుడు”
“ఎందుకంత ఆశ్చర్యపోతున్నారు?నాకెవరూ ప్రేమికులుండకూడదా?నేనొక అమ్మాయినైనపుడు నాకొక అబ్బాయి ఉండకూడదా?”
ఆమె,ఒక అమ్మాయి,బాగుంది,చాలా బాగుంది అని మనసులో అనుకుని
“ఓ,ఎందుకుండకూడదు?”ఈ ప్రపంచంలో ఏదైనా సంభవమే!అయితే చాలా కాలం నుంచి అతను మీ ప్రేమికుడా?”
“ఆరేళ్ల నుంచి”
“ఓహో! ఓ.కే.మనం ఉత్తరం రాద్దాం”
నేను మనస్పూర్తిగా చెప్పేదేమంటే ఇష్ట పూర్వకంగా ఈ బోల్స్ తో ఎన్నోస్థలాలు మార్చి ఉండేదాన్ని,తెరెసా అతనికి సరైన న్యాయమైన జోడీయే గాని ఇంకొకరు కాదు.
“మీ సహాయానికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతాభివందనాలు. బహుశా నేను కూడా మీకు సహాయపడగలనేమో అంటూ చాలామర్యాదగా అడిగింది.
“చాలా వినయంగా నాకేమీ వద్దు”అని చెప్పాను.
“బహుశా,మీ చొక్కాలు గాని ప్యాంటులు గాని కొద్దిగా మరమ్మతు చెయ్యొచ్చనుకుంటా”
ఈ ఏనుగు లాంటి మనిషి పెట్టీకోట్స్ లో ఉండి నన్నవమానపరుస్తున్నట్లు భావించి,నాకేమీ ఆమె సేవలక్కరలేదని సూటిగా చెప్పేశాను.
ఆమె వెళ్ళిపోయింది.
ఒక వారమో,రెండు వారాలో గడిచిపోయాయి.ఒకరోజు సాయంత్రం వాతవరణం ఏమీ బాగాలేదు.నాకు చాలా బోర్ గాఉంది.నేను నా కిటికీ దగ్గర ఈల వేస్తూ విసుగు నుంచి నన్ను నేను తప్పించుకోవడానికి ఉపాయంకోసం ఆలోచిస్తున్నా.బయటి కెళ్ళాలని పించడం లేదు.పనికిమాలిన బద్ధకం నుంచి మానసికమైన అలసట నుంచి తప్పించుకోవడానికి నన్ను నేను అనలైజ్ చేసుకుంటూ నాలోకి నేను చూసుకోవడం మొదలెట్టాను.ఇది కూడా చాలా చిరాగ్గా ఉంది కానీ ఎమీ చెయ్యబుద్ధికావడం లేదు.ఆశ్చర్యంగా తలుపు తెరుచుకుంది.ఎవరో లొపలకొచ్చారు.
“ఓ,మిస్టర్ స్టూడెంట్,ఇప్పుడు మీకేమీ అత్యవసరమైన పనులు లేవనుకుంటా?”
“అమ్మా! బాప్ రే !! తెరెసా!!!
“లేవు.ఏంకావాలి?”
“నేను మిమ్మల్ని ఇంకొక లెటర్ రాసిపెట్టమని అడగబోతున్నాను సర్”
“మంచిది,బోల్స్ కేనా?”
“కాదు.ఈసారి.అతను రాసినట్లు రాయాలి.”
“ఏంటీ?!!
“నేను చాలా తెలివిమాలినదాన్ని! అది నాకు కాదు.క్షమించండి.అది ఒక స్నేహితుడు.స్నేహితుడు కూడా కాదు.తెలిసినాయనకు.ఆయన చాలా సహృదయుడు,ప్రేమించే మనస్తత్వమున్నవాడు నాలాగే.అదీ సంగతి.ఆయన రాసినట్లు ఈ తెరెసా కొక లెటర్ రాసిపెట్టరూ? ప్లీజ్ సర్?
ఆమె వైపు చూశాను-ఆమె ముఖం బాధతో విలవిలలాడుతున్నట్లు చేతులు వేళ్ళు వణికిపోతున్నాయి.
మొదట్లో అదిరిపడ్డాను-తర్వాత ఏమై ఉంటుందా? అని ఊహించడం మొదలెట్టాను.
“ఇటు చూడండి.అసలు బోల్స్ అనిగానీ తెరెసా అనిగానీ ఎవరూ లేరు.మీరు నాతో బండెడు అబద్ధాలు చెప్తున్నారు.మీరింత నీచమైన స్వభావంతో ఇంకెప్పుడూ నా దగ్గరికి రావద్దు.నాకు మీ పరిచయస్థులనుద్ధరించే కోరికలేమీలేవు.అర్ధమైందా?
అకస్మాత్తుగా ఆమె భయానకంగా కలవరపడిపోయింది.ఉన్న స్థలం నుంచి కదలకుండా ఒక కాలు నుంచి ఇంకో కాలు పాదాలు కదుపుతూ చూసేవారికి నవ్వు పుట్టేలా తనలో తాను గొణుక్కుంటూ ఏదో చెప్పాలని తాపత్రయ పడుతుంది కానీ చెప్పలేకపోతుంది.ఏమవుతుందా అని కొంచెం సేపు వేచి చూశాను.కానీ మనసులోస్పష్టంగా తెలిసిపోయింది.నేనేదో మంచి దారిలో నడుస్తున్నట్లూ ఆమేదో నన్ను తనవైపుకి దృష్టి మళ్ళించడానికి ప్రయత్నిస్తుందేమో నని అనుమానించి చాలా తప్పు చేశాననిపించింది.ఇది స్పష్టంగా వేరే విషయమనీ,నాది చాలా తప్పుడు అవగాహన అనీ రుజువైపోయింది.
“మిస్టర్ స్టూడెంట్!” అని సడెన్ గా చెయ్యి ఊపుతూ అర్ధాంతరంగా తలుపు వైపుకి తిరిగి బయటికెళ్ళిపోయింది.నా మనసంతా చాలా చేదుగా ఐపోయింది.నేను నా గదిలో నుంచే శ్రద్ధగా విన్నాను.ఆమె తన తలుపుని చాలా విసురుగా ధన్ మంటూ వేసింది.పాపం తెరెసా చాలా బాధలో , కోపంలో ఉంది….ఐపోయిందేదో ఐపోయింది.నేను ఆమె దగ్గరికి వెళ్ళి దయచేసి మీరు మళ్ళీ నా ఇంటికొచ్చి మీరు చెప్పదలచుకున్నదంతా చెప్పవచ్చని వినయంగా చెప్పాలని దృఢంగా నిశ్చయించుకున్నాను.
తన ఇంట్లోకి వెళ్ళాను.చుట్టూ చూశాను.తెరెసా టేబిల్ మీద మోచేతులానించి తలను చేతుల్లో పెట్టుకుని ఉంది.
“ఇటు చూడండి”అని అన్నాను.
ఇలాంటి సందర్భాల్లో మాట కలిపే చొరవ చూపలేని నేను, నాకు నేనే సర్వ అవలక్షణాలున్నట్లు ఏమీ చేతగానట్లు భయంకరంగా కుచించుకుపోతాను.సరేలే అనిసర్దిచెప్పుకుని
“దయచేసి ఇటు వినండి”అని మళ్ళీ అర్ధించాను.
ఆమె తన సీట్ నుంచి లేచి నా వైపుకి మెరిసే కళ్ళతో వచ్చింది.నా భుజాల మీద చేతులు వేసి తెరెసా కే ఉన్న ప్రత్యేకమైన లోగొంతుకలో ఏదో గోణగడం మొదలెట్టింది.
“అవును ! బోల్స్ అనేవాడు లేడు.తెరెసా లేదు.అయితే నీకేంటి?నీకు కాగితం మీద కలం పెట్టడం అంత కష్టంగా ఉందా? ఆ..?ఏంటి?… అసలెవరూ లేరు.బోల్స్ లేడు.తెరెసా లేదు.నేనే ఉన్నాను.నువ్వు చూస్తున్నావు.అయితే నీకేంటి నష్టం?”
“క్షమించండి”అన్నాను.అనునయంగా ,ఆదరంగా మాట్లాడటం చూసి ఒక్కసారిగా దిక్కుతోచనిదానిలా చూసింది.”ఏమిటిదంతా?బోల్స్ అనేవాడే లేడని చెప్తున్నారా మీరు?”
“అవును”
“తెరెసా కూడా లేదా?”
“తెరెసా కూడా లేదు(ఉత్తరం లో).కానీ నేను తెరెసా నే !
నాకేమీ అర్ధం కాలేదు.నాచూపులు ఆమె పైనే నిలిపాను.మాఇద్దరిలో ఎవరు ముందు స్పృహలోకొస్తారోనని ఆలోచిస్తుండగానే ఆమె ముందుగా తేరుకుని తన టేబిల్ వైపు కదిలింది.దేనికోసమో వెతికి తిరిగి నావైపుకి తిరిగి వ్యధ ద్వనించే కంఠస్వరంతో ఇలా అన్నది
“మీకు బోల్స్ కి లెటర్ రాయడానికి అంత కష్టంగా ఉంటే, ఇదిగో మీరు రాసిన లెటర్ మీరు తీసికెళ్ళండి,వేరే ఎవరైనా నాకు రాసి పెడతారు”.
ఆమె చేతిలో నేను బోల్స్ కి రాసిన లెటర్!ఓహ్!!
“తెరెసా! ఇదంతా ఏమిటి?నేనూ మీ కోసం ముందే రాసిపెట్టినప్పుడు మళ్ళీ ఎవరినో రాయమనడం ఎందుకు?అసలు లెటర్ ఎందుకు పంపలేదు?”
“ఎక్కడికి పంపాలి?”
“బోల్స్ కే “
“అలాంటి మనిషి ఎవరూ లేరు”
నాకు పూర్తిగా అయోమయమైపోయింది.ఇక మాట్లాడేందుకేమీ లేక వెళ్లిపోదామనుకుంటూ ఉండగా ఆమే చెప్పడం మొదలెట్టింది.
“ఈ భూప్రపంచం లో అలాంటి మనిషి లేడు.అయితే ఏంటీ?ఆమె చేతుల్ని చాపుతూ ఎందుకీ లోకంలో అలాంటి మనిషి లేడో తనక్కూడా అర్ధం కానట్లుండిపోయింది కాసేపు.”కానీ,అతను నాక్కావాలి.నేను అందరిలాంటి మనిషిని కాదా? ఔను, ఔను,నాకు తెలుసు…ఐనప్పటికీ నేను లెటర్ రాయడం వల్ల నేనెవరికీ ఎటువంటి హానీ చేయడంలేదు కదా?
“క్షమించండి.ఎవరికి రాయాలి?”
“అఫ్ కోర్స్ బోల్స్ కి”
“కానీ, అతను లేడు”
“అయ్యో! అయ్యో!అతను లేకపోతే ఏంటి? అతను లేడు.అతనెక్కడైనాఉన్నాడేమో,నేనతనికి రాస్తాను.దానివల్ల అతనెక్కడో ఉన్నాడని నాకనిపిస్తుంది.తెరెసాని నేనే.అతను నాకు జవాబిస్తాడు.నేను మళ్ళీ అతనికి రాస్తాను.”
చివరికి నాకర్ధమైంది.ఒక్కసారిగా నాకు చలిజ్వరమొచ్చినట్లైంది.చాలా దుఃఖం ముంచుకొచ్చింది.చాలా అవమానంగా సిగ్గుగా ఫీలయ్యాను.నాకు మూడు గజాల దూరంలో ఉండే ఒక మానవజీవిని కాస్త దయగా,ప్రేమగా చూడటానికి ఈ ప్రపంచంలో ఇంకో ప్రాణి లేదు.అందుకని తెరెసా ఒక స్నేహితుణ్ణి తనకు తానుగా కొత్తగా కనుక్కుంది కాదు, కాదు, సృష్టించుకుంది!
“ఇప్పుడు వినండి.నువ్వొక లెటర్ బోల్స్ కి రాశావు.అది వేరేవాళ్ళకి చూపించి చదవమంటాను.వాళ్ళు చదువుతున్నప్పుడు శ్రద్ధగా వింటూ మనసులో బోల్స్ గురించి ఊహల్లో తేలిపోతాను.మళ్ళీ ఒక లెటర్ బోల్స్ నుంచి తెరెసాకి రాయమంటాను. వాళ్ళు ఉత్తరం రాసిపెట్టి నాకోసం చదివినప్పుడు నేను బోల్స్ అనేవాడున్నాడని ఖచ్చితంగా ఫీలౌతాను. ఇలా నాగురించి ఆలోచించే నాకొసం పరితపించే ఒకరున్నారనే ఘనమైన భావంతో నేను బతికేస్తాను.”
ఇదంతా విని “ఓరి,డ్యూస్ గాడా! నువ్వెంత మందమతివి! అని నాకు నేనే బుద్ధి చెప్పుకున్నాను.
ఇక అప్పటినుంచీ వారానికి రెండుసార్లు నేను బోల్స్ కి లెటర్ రాయడం,మళ్ళీ బోల్స్ నుంచి జవాబులు రాసేవాణ్ణి.నేను బోల్స్ రాసే ఉత్తరాలు ప్రేమగా,ఆర్ధ్రంగా రాసేవాణ్ణి. తెరెసా ఆ జవాబుల్ని వింటున్నప్పుడు విపరీతంగా ఏడుస్తుండేది.తన మంద్రస్వరంతో ఆనందంగా శబ్దాలు చేసేది.తెరెసా ఊహల్లోని బోల్స్ రాసే నిజమైన ఉత్తరాల్లోని ప్రేమతో ఆమె పొందుతున్న కట్టలు తెగే సంతోషం, జల జలా రాలిపడే కన్నీరు నన్ను ముంచెత్తి నాలోని సమస్త మురికినీ కడిగేసి నన్ను స్వస్థత పరిచేది.ఆ తర్వాత సుమారు మూడు నెలల తర్వాత ఎందుకో గాని ఆమెను జైల్లో పెట్టారు.ఆమె బహుశా ఈ టైమ్ కి చనిపోయి ఉండవచ్చు.
నా పరిచయస్తుడు సిగరెట్ బూడిదను యాష్ ట్రే లో పడేసి ఆకాశం వైపుకి దిగాలుగా చూస్తూ కథ చెప్పడం ముగించాడు.
తెరెసా లాంటి ఒంటరి జీవులు జీవితంలో కష్టాల సుడిగుండాల్లో చిక్కుకుని ఎంతగా నరకాన్ని చవిచూస్తారో అంతగా కాస్తంత తీపిని రుచి చూడాలని తపిస్తారు.మనుషులు తమ తమ పాపాలను చింపిరి గుడ్డలు మూట గట్టినట్లు కట్టి మనసులో ఒక మూల పడేస్తారు. నైతికంగా పైకి ఉదారంగా కనిపిస్తూ తామెంతో గొప్పవాళ్ళమనుకుంటూ తమ స్వావలంబన మాటున లౌక్యంగా ఇతరులమీద దుమ్మెత్తిపోస్తూ ఉంటారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా మనుషులందరూ ఖచ్చితంగాచేస్తున్న తప్పు. మన గొప్ప సమాజం దాన్ని పట్టించుకోదు!
ఇది చాలా భయానకమైన,కౄరమైన విషయం.మనం వాళ్ళని పతితులంటాం గానీ అసలు పతితలెవరో నాకు తెలుసు కోవాలనుంది. ముందుగా వాళ్ళు కూడా మనుషులు ! ఎముకలు,మాంసం,రక్తం,నరాలున్న మనుషులు!! ఇది తరతరాలనుంచి చెప్తున్న సంగతే.యాంత్రికంగా వింటామంతే-ఇంతగా ముదిరిపోయిన మానసిక వికారాన్నుంచి మానవజాతిని రక్షించేదెవరు?ఇంతగా భ్రష్టు పట్టిపోయిన మానవజాతి తన మానవత్వాన్నిపూజారులు/బిషప్ లు బిగ్గరగా వల్లించే నైతిక పాఠాల మాటున పూడ్చిపెడుతుందా? నిజానికి మనమే పతితులం!మనమే స్వయం సమృద్ధిని పెంచుకునే దిశగా అంతులేని స్వార్ధంతో ప్రవర్తిస్తూ నేరపూరిత స్వభావాన్ని దాచిపెట్టడానికి పైకి ఆధిక్యాన్నివెలగబెడుతూ ఒక పెద్ద తేరుకోలేని అగాధం లో పడి పోతున్నాం!కానీ ఇక అయింది చాలు.ఈ విషయం చాలా పాతది.ఎంత పాతదంటే కొండల కన్నా పాతది.దాన్ని గురించి మాట్లడాలంటేనే సిగ్గుగా ఉంది.నిజం!!
-మేక్సిమ్ గోర్కీ
అనువాదం-శివలక్ష్మి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
4 Responses to ఆమె ప్రియుడు