జననం –ప్రాచుర్యం –వలస
గ్రీకు దేశానికి చెందిన పాటల కవితల రచయిత్రి సఫో .లెస్బొస్స్ దీవిలో క్రీ పూ 630–612లో జన్మించి, క్రీ పూ.570లో మరణించింది .అలేక్సా౦ డ్రియన్లు.తమ’’ నవ రత్న కవుల’’లో సఫో ను చేర్చి గౌరవించారు .ఆమె రాసిన అనంత సాహిత్యం ఆనాటి ప్రజల మెప్పు పొంది ,ఆరాధనీయురాలై నా ,కాలగర్భం లో చాలా భాగం కలిసి పోయింది .మిగిలిన కవిత్వమే చాలు ఆమె ప్రతిభకు గీటు రాయి గా నిలిచిపోవటానికి .లిడియా కు చెందిన ప్రముఖ కవి ‘’ఆల్యేటీస్ ‘’.కు సమకాలికురాలని భావిస్తారు .నలభై అయిదు నలభై ఆరు ఒలింపి యాడ్ ల నాటికే ఆమె ప్రాచుర్యం పొందిన కవి అయింది .
తలిదండ్రులు – సంతానం
పారియాన్ మార్బుల్ శాసనాన్ననుసరించి సఫో లేస్బాస్ నుండి వలస పోయి సిసిలీకు క్రీ .పూ604-594 కాలం లో వెళ్ళింది .ఆమెరాసిన కవితల్లో మిగిలిన వాటిలో 98 వ కవిత ఆమె జీవిత చరిత్ర గా భావిస్తారు .. వలసపోవటానికి ముందే ఆమెకు ఒక కూతురు ఉన్నట్లు తెలుస్తోంది . .ముసలితనం దాకాఅంటే క్రీ పూ. ఆరవ శతాబ్దపు మధ్య కాలం వరకు జీవించింది .’’ఆక్షి రింకస్ పేపరస్’’లో చెప్పబడిన దాని ననుసరించి ఆమె తల్లిపేరు ‘’క్లీస్’’.కూతురి పేరుకూడా అదే .తండ్రిపేరు ‘’స్కామెండ్రోనిమస్’’.తల్లి జీవించిన కాలం లోనే సఫో కవిత్వం రాయటం ప్రారంభించింది .తండ్రిపేరు ఆమె కవిత్వం లో ఎక్కడా కనిపించదు .సఫో రాసిన ఒక కవితలో ‘’నాకు ఆరుపుట్టిన రోజులు గడిచిపోయాయి మా నాన్న అస్తికలు సేకరించే నాటికి ‘’అని చెప్పుకొంది..
సోదరులు –భర్త
సేఫోకి ముగ్గురు సోదరులున్నట్లు తెలుస్తోంది .వారిపేర్లు ఈజిరియస్ ,లారికస్,కేరకస్.ఇందులోకేరకస్ అందరిలో పెద్దవాడు .సఫోకు చిన్నతమ్ముడు లారికాస్ అంటే అభిమానం ఎక్కువ .నగరం లో భాగ్య వంతుల కుమారులు తరచూ కలిసే చోట లారికాస్ వారికి వైన్ పోయి౦చేవాడని రాసింది .దీన్ని బట్టి సఫోకూడా సంపన్న కులీనురాలే అని నమ్మ్తుతున్నారు .ఆమె జీవితం పై అనేక చరిత్రకారులు విపరీత కధనాలు అల్లారు .కాని అవన్నీ సత్య దూరాలేనని తేలింది .చివరికి సూడా వివరణలో ఉన్నదానిప్రకారం సఫో బాగా ధనవంతుడైన ‘’సేరిక్లియాస్ ‘’అనే అతన్ని వివాహమాడింది .ఆతను ‘’ ఆండ్రోస్’’లో బడా వ్యాపారి అని ఆయనే సఫే కూతురు క్లీస్ కు తండ్రి అని తేలింది .
సిసిలీ జీవితం –మళ్ళీ లేస్బాస్ చేరిక
సఫో జీవితం ఆనాటి రాజకీయ కల్లోల పరిస్తితులకు గురైంది .లేస్బాస్ రాజకీయ కల్లోలం లో పాటికస్ అధికారం లోకి వచ్చాడు .దీనితో సఫో సిసిలీకి వలస పోయింది .అక్కడ సిరాక్యూజ్ నగరం లో ఆమె విగ్రహాన్ని స్తాపించారు ..సమకాలీనుడు ఆలికాస్ లాగా కాకుండా రాజకీయాలకు కవిత్వం తో చోటుకల్పించ లేదు .కాని 98 వ కవితాఖండిక లో తనకు విలాస వంతమైన జీవికకు తగిన సౌకర్యాలు .లేవని మాత్రం తెలిపింది .ఆల్సియాస్ రాజకీయ పక్షానికి మద్దతు తెలియజేసింది .మళ్ళీ లేస్బాస్ చేరి అక్కడే జీవితం గడిపిందని రికార్డులు సూచిస్తున్నాయి .
సఫో జీవితం పై మరో నీలి నీడ
ఫాయాన్ లిజెండ్ ప్రకారం సేఫో కవయిత్రి ‘’ఫాయాన్ అనే ఫెర్రీ నడిపే వాడిని ప్రేమించి అతనికోసం ‘’లూకాదియన్ క్లిఫ్ ల నుండి దూకి ఆత్మ త్యాగం చేసుకొన్నది .ఇది చారిత్రిక అసత్యం అని రుజువైంది .
సఫో రచనల సేకరణ –భద్రత
అలేక్సాండ్రియా గ్రంధాలయం సేఫో కవితా ఖండికలను తొమ్మిది పుస్తకాలుగా సేకరించి భద్ర పరచింది .అందులో ఒకటవ పుస్తకం లో 330 స్తాఫిక్ స్టాంజాలున్నాయి .రెండవ పుస్తకం లో గ్లకానిక్ పంక్తులున్నాయి ‘మూడులో యాక్లిపియాద్ స్టిక్స్ పద్యాలు ,నాలుగులో మూడులో ఉన్నట్లుగానే ఉండేకవితలు ,అయిదులో త్రిపాద కవితలు ,ఆరులో ఏమి ఉందొ తెలియదు .ఏడవ పుస్తకం లో రెండే రెండు కవితలు ,ఎనిమిదిలో 103వ విభాగం లోనివి తొమ్మిదిలో ‘’ఎపి తాల్మియా ‘’మొదలైన ఛందస్సులలో ఉన్నవి కనిపిస్తాయి ఈ పుస్తకాలను సేఫో రాసిన ఛందస్సును బట్టి విభజించి తయారు చేశారు .
సఫో కవితా విన్యాసం
మొదటి తునక లేక ఫ్రాగ్మేంట్ లో పూర్తీ కవిత ఉంది ‘అది ఆఫ్రో డైట్ కు స్తోత్రం .గోప్పశైలీ ,చక్కని పద బంధం తో అలరారే కవిత ఇది .అందర్నీ ఆకర్షించింది .2014ఫిబ్రవరిలో ఇదివరకు వెలుగు చూడని సఫో కవితలను ‘’టైమ్స్ లిటరరీ సప్లిమెంట్ ‘’లో ‘’న్యు పోయెమ్స్ బై సఫో ‘’పేరిట ముద్రించారు .ఆమె కవిత్వం చిక్కగా చక్కగా మంచి పదబంధం తో ప్రాసలతో ఆధునిక ప్రణయ కవిత్వ ధోరణిలో ఉంటుంది .అంత చక్కని కవిత్వం అంతకు ముందెన్నడూ గ్రీకు భాషలో రాలేదని అంటారు .పిచ్చికలు ఆఫ్రొడైట్ రధాన్ని లాగుతున్నట్లు రాసింది .సరైన పదాలను ఎన్నుకొని సూటిగా గుండెలను తాకేట్లు కవిత్వం రాసింది .చదివి యిట్టె ఆకర్షింప బడతారు .మాధుర్యం గల శబ్దాలతో సంగీత ధ్వని కల్గిస్తుంది .చెవులకు ఏంతో ఇంపుగా కవితలుంటాయి .కవిత్వం అంతా ప్రసాద మాధుర్య భరితం .ప్రముఖ విశ్లేషకుడు డయారిసియాస్ ,సఫో కవిత్వానికి ముగ్ధుడయ్యాడు .
హోమర్ తో పోలిక
సఫోకవిత్వం లో కొన్ని భాగాలు హోమర్ కవితలను పోలిఉంటాయి . ఇలియడ్’’లోని కధలను విస్తరించి ,మాధుర్యం అద్ది అందం గా తీర్చింది .హెక్టార్ , ఆన్డ్రో మాక్ వివాహాన్ని మనోహర కవిత్వం తో ముంచేసింది .హెలెన్ పాత్రనూ బాగా పోషించింది .హోమర్ కవి ట్రాయ్ పట్టణం లాగా, సఫోకవయిత్రి లేస్బాస్ కూడా లిడియా వలన రాజకీయ అస్తిరత్వం తో ఉండేది .హోమర్ ‘’మిలిటరిజం’’ నుకవిత్వం లో ప్రదర్శిస్తే సఫో ప్రేమ ,సౌందర్యాలతో కవిత్వాన్ని హృదయాన్ని మనసుని ఆకర్షించింది .అది వీరకావ్యం అయితే ఇది ప్రేమకావ్యం . ..ఇద్దరూ చారిత్రక సంఘటనకు అక్షరాకృతి తమదైన శైలిలో కల్పించారు .వీటివలననే ఆనాటి సాంఘిక రాజకీయ స్తితిగతులు తెలిశాయి .
అలెక్సాండ్రియాలో పాపిరస్ పై సఫో కవిత్వం –ప్లేటో మెచ్చుకోలు –ఇంగ్లీష్ అనువాదం
సఫో తనకవితలను ‘’సితార ‘’వాయిద్యం పై వాయిస్తూ పాడేది .క్రీ పూ మూడవ శతాబ్దానికి అప్పటికి వాడకం లోకి వచ్చిన పాపిరాస్ చుట్టలపై సఫో కవితలు గ్రంధస్తమై అలేక్సాండ్రియా ‘’హౌస్ ఆఫ్ మ్యూసేస్ ‘’లో భద్రపరచ బడినాయి .కాని దానిపై అనేక సార్లు దండ యాత్రలు జరిగి ఎక్కువ భాగం సేఫో రచనలు ద్వంసమైనాయి . సేఫో కవితలను ‘’డివైన్ సాంగ్స్ ‘’అన్నారు ఆనాడు .తత్వ వేత్త ప్లేటో –సేఫోను’’ తెలివైన కవి ‘’అన్నాడని క్లాడియస్ ఆలినాస్ రాశాడు .సఫో సమకాలీన కవి ఆల్కేయాస్ ‘’ఊదా రంగు కురుల స్వచ్చ తేనే మాధుర్య హసిత సఫో ‘’అన్నాడు మూడవ శతాబ్దపు తత్వవేత్త ‘’మాక్షిమస్ ఆఫ్ టైర్ ‘’సఫోను గురించి రాస్తూ ‘’పొట్టి నల్లని అమ్మాయి’’ అని ,’’ఆమె మహిళా స్నేహితురాళ్ళ తో మెలిగే విధానం అచ్చం గా సోక్రటీస్ విధానం గానే ఉండేదని’’అన్నాడు .సఫోకవితలను ఇంగ్లీష్ లోకి జాన్ హాల్ అనువదించి1652లో ప్రచురించి గొప్ప వ్యాప్తి తెచ్చి ఆమె కవితామాదుర్యాన్ని తెలుసుకొవటానికి సహకరించాడు.2002లో ‘’అన్నే కార్సన్ ‘’సఫో కవితా ఖండికలను ‘’ఇఫ్ నాట్ వింటర్ ‘’పేరిట ముద్రించాడు .ఆ తర్వాత అనేక అనువాదాలోచ్చి సఫో కవిత్వ మాధుర్యం ఆధునిక యుగం లో బాగా ప్రచారమైంది .
సఫో పేరు ప్రభావం
19 .వ శతాబ్దం నుండి సఫో జన్మించిన లేస్బోస్ దీవి పేరు నుండే మహిళా హోమో సెక్సువల్స్ కు ‘’లే స్బియన్ ‘’అనే పేరు వచ్చింది .విక్టోరియన్ యుగం లో సఫో పేరు బాలికల ఉన్నత విద్యాలయం హెడ్ మిస్ట్రెస్ పేరు గా మారింది .
– గబ్బిట దుర్గా ప్రసాద్
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~