బోయ్‌ ఫ్రెండ్‌-5

Dr. Jaya prada

Dr. Jaya prada

వీళ్ళ విషయాలేమి పట్టనట్టు భానుమూర్తి, మురళి తెగ మాట్లాడేసుకుంటున్నారు.

”ఈ చేపలు, మనంత ఎప్పుడవుతాయి అంకుల్‌?”

”అవుతాయి నాన్నా, అవుతాయి. ఈ మారు మనమొచ్చేసరికి మనంత అయిపోతాయి.”

తన భావావేశాన్నుండి తప్పించుకోవడానికి అక్కడనుండి లేచి వెళ్ళి బఠానీలు తెచ్చి అందరికీ పంచింది కృష్ణ.

”మీరు ఏ మనసుతో పెట్టారో నాకు పుచ్చు బఠానీలు వచ్చాయి,” ముఖాన్ని వీలైనంత వికారంగా పెట్టడానికి ప్రయత్నిస్తూ అన్నాడు చైతన్య. ఈమారు అతని చూపుల్లో మామూలు చిలిపి తనమే గాని కృష్ణకు చూపిస్తున్న ప్రత్యేకత ఏమి లేకపోవడంతో తేలిగ్గానే తీసుకుంది కృష్ణ..

”మీరేజన్మలో ఏ పాపం చేసారో, ఈ జన్మలో మికు పుచ్చు బఠానీలు ప్రాప్తించాయి.”

”అలాగా? అయితే వుండండి. వచ్చే జన్మలో నేను బఠానీలు అమ్మేవాడిగా పుట్టి, మికు ఏరి ఏరి పుచ్చు బఠానీలే అమ్ముతాను”

కృష్ణ సన్నగా నవ్వేసింది.

”మిరిలా కూర్చుంటె ఎలా?చీకటి పడిపోతోంది. ఎనిమిది గంటల కల్లా చింతపల్లి చేరాలి. ప్రొద్దుపోయే కొలదీ అడవిలో కష్టం. పులులు కారు కడ్డంగా వస్తాయి” అన్న హెచ్చరికతో ఉలిక్కిపడింది అరుణ.

”పులులే!” ఆమె కళ్ళల్లో భయం స్పష్టంగా కన్పించింది.

”అవును. అప్పడప్పుడూ కన్పిస్తుంటాయి.

”నిజంగానా బాబాయ్‌! ఒక్క పులి కన్పిస్తే బాగుణ్ణు! ఆ మాత్రం థ్రిల్‌ ప్రతివాళ్ళ లైఫ్‌లోనూ వుండాలి.”

”నాకూ అన్పిస్తుందమ్మా జీవితంలో కొన్ని మిరాకల్స్‌ చూడాలని. పాకిస్థాన్‌ యుద్ధంలో ఆ కోర్కె తీర్చుకున్నాను నేను. అవి నేను మెడిసిన్‌లో క్రొత్తగా చేరిన రోజులు. సీనియర్స్‌ ముందు చేతులు కట్టుకుని వణికేరోజులు. మొత్తానికి ఆ యుద్దం మమ్మల్ని సీనియర్స్‌కు దగ్గరగా చేర్చింది. ఆ తర్వాత రుయర్‌ స్టీల్‌ప్లాంట్‌ యజిటేషన్‌’ ఇంకా థ్రిల్లింగ్‌’గా వుండేది” అన్నాడు డాక్టర్‌ యదునందన్‌.

”ఏమైంది? బాగా కాల్పులు జరిగాయట కదా! ఆ రోజు ఏమైంది చెప్పు” ప్రసాదరావు అడిగారు.

వాళ్ళ ఉత్సాహంతో పుంజుకున్న చైతన్యంతో తన అనుభవాలన్నీ కధలు కధలుగా చెప్పసాగారాయన.

4

”ఒకరోజు హఠాత్తుగా మాకు నోటీస్‌ వచ్చింది. హాస్టలు నుండి ఎక్కడికీ కదలొద్దనీ – భారత పాకిస్థాన్‌ యుద్ధం మొదలయిందనీ, ఆ రోజు కోస్టల్‌ బ్యాటరీ వాళ్ళు కాల్పుల ప్రయత్నంలో ట్రయల్స్‌ వేస్తున్నారనీను. అంతవరకూ పేపర్‌లో విశేషాలు చదవడముా, వింతలు వినడమే గాని ప్రత్యక్షంగా ఇంత దగ్గరగా స్వంత కళ్ళతో యుద్ధం తాలూకు భీభత్సాన్ని చూడబోతున్నానంటే నామట్టుకు నాకు చాలా ధ్రిల్లింగ్‌గా వుండేది. ఆ విషయం విని భయపడి వణికిపోయిన వాళ్ళను చూచినప్పుడు నాకు భలే చిరాకనిపించేది. కొందరు బ్రతికుంటే బలుసాకు తినొచ్చు అని మూటముల్లె సర్దుకుంతుంటే , అసాధారణంగా దొరికే ఈ అవకాశాన్ని ప్రాణభీతితో పారవేసుకుంటున్నందుకు వాళ్ళమీద జాలేసేది.

”యుద్ధం ఎప్పుడు మొదలరుంది?” చైతన్య అడిగాడు.

”ఆరోజు పదకొండు మార్చి పంతొమ్మిది వందల అరవై అయిదు.

”చెప్పండి” భానులో ఆసక్తి.

”చెప్తాను. ఓ సాయంత్రం సరదాగా చూచే నిమిత్తం టెర్రస్‌ మిదికి బయలు దేరాను. నాలాటి మరికొందరు కూడా అక్కడ చేరారు. అందరం చూడబోయే అద్భుతమైన తమాషా కొఱకు ఎదురు చూస్తున్నాం. ఎదురు చూచి ఎదురుచూచి విసిగిపోయిన మేము మాలో మేము యుద్దం గురించి తెలిసినవి, తెలియనివి మాట్లాడుకోవడం మొదలెట్టాం. ఇంతలో ఎక్కడో ‘ఢామ్‌’ మనే శబ్ధం మమ్మల్ని మేల్కొలిపింది. ఒక్కమారు మేమందరం ఉలిక్కిపడి లేచి నిల్చున్నాం. ఆ యుద్ధపు థ్రిల్‌ని అనుభవించాలనే వెఱ్ఱి కోర్కె వెనకాల మాకూ బ్రతుకు మీద భయం బలంగా వున్నందుకు అందరం కలసి నవ్వుకున్నాం.”

”ఒకదాని తర్వాత ఒకటి తూటాలు – ఆకాశంలో పగిలి ఎఱ్ఱటి కాంతినిస్తున్నాయి. ముందురోజుల్లో రాబోయే శతృవిమానాలను కూల్చే ప్రయత్నాలలో జరిగే ట్రయల్స్‌ అవి. మేము చాలా ఉత్సాహంగా గర్వంగా నిల్చుని చూస్తున్నాం. మా వెనగ్గా సైలెంట్‌గా వచ్చిన వార్డన్‌ని చూచుకోలేదు. అలా మేము హాస్టలు రూల్సుని అతిక్రమించినందుకు ఆ తర్వాత ఆయన చేతిలో ఎన్ని అక్షింతలు తినుంటామో మీకు చెప్పక్కరలేదనుకుంటాను.”

”చెప్పకపోతే మాకెలా తెలుస్తుంది?” అని జోక్‌ విసిరాడు ప్రసాదరావ్‌. నవ్వేసి మరలా మొదలెట్టాడు యదునందన్‌.

మర్నాడు నిండు పూర్ణిమ. ఆ పగలు మేమెవ్వరం సరిగ్గా పాఠాలు వినలేదు. సాయంత్రం అయ్యేసరికి రాబోయే శతృ విమానాల కొఱకు ఎదురు చూడసాగాం. మెల్లి మెల్లిగా చీకటి పడసాగింది. యధాప్రకారం హాస్టల్‌లో లైట్లు దేదీప్యమానంగా వెలిగించుకున్నాం. ఆ తర్వాత అంత వెలుతురు చాల రోజుల వరకు మేము చూడలేదనే చెప్పాలి. కారణం హాస్టల్లో ఎవ్వరు లైట్లు వేసుకోరాదనే నోటిస్‌తో పాటు ఎప్పుడూ దీపావళి రోజులా వుండే విశాఖపట్నం అక్కడక్కడ వీధి లైట్ల కనెక్షన్స్‌ మునిసిపాలిటి వాళ్ళు లాగేయడంతో కళావిహీనమైపోయింది. ఆ రోజు నిండు పూర్ణిమ కావడంతో ప్రకృతి వాళ్ళతో ‘కో ఆపరేట్‌’ చెయ్యలేకపోయిoది. ట్రాన్సిస్టర్లు ఒళ్ళో పెట్టుకుని పుచ్చపువ్వులాటి వెన్నెల దారుల గుండా మెడలు నిక్కబొడుచుకుని, కళ్ళు చిట్లించుకుని, కిటికీల గుండా ఆకాశంలోకి చూస్తూ ఎప్పుడు నిద్రపోయామో మాకే తెలియదు. ఆరోజు ఎలాటి భీభత్సం జరగలేదు.

”వాటె థ్రిల్‌ అంకుల్‌! కృష్ణకు వినడమే థ్రిల్‌గా వుంది.

”అవునమ్మా! మర్నాటికి టౌన్‌లో ఇళ్ళల్లో కూడా లైట్లార్పి వేయబడ్డాయి. ట్రాఫిక్‌ కూడా బంద్‌ చేయబడింది. అక్కడక్కడ మినుకుమినుకు మంటూ నలభైకాండిల్‌ బల్బ్ ల కాంతి తప్ప మరే కాంతీ లేదు. ఆ రోజు తప్పకుండా కాల్పులు జరుగుతాయనే అందరూ అనుకుంటున్నారు. యుద్ధం యొక్క మొదటిరోజు తాలూకు భయం ప్రజల్ని ఆవహించింది. ఒక రకమైన చావు నిశ్శబ్ధం టౌనంతటా వ్యాపించింది. విశాఖ పట్టణం వ్యాపారకేంద్రం. ముఖ్యంగా ‘పెట్రోల్ ట్యాంక్’ శతృవుల్ని ఆకర్షిస్తుంది. ఒక్క బాంబు దాని మిద పడితే చాలు చుట్టుపట్ల ఆనవాలు మిగలకుండా సర్వనాశన మైపోతుంది. ముందు జాగ్రత్తగా టాంక్స్ లో నిలవున్న పెట్రోల్‌ అంతా సముద్రంలోకి దొర్లించేసారు. అరుణా ఏ క్షణానికాక్షణం భయమే.” అతను ఆగాడు. అందరు కారు దగ్గర కొచ్చేసారు.

”పర్వాలేదు. పూర్తి చేయండి వెళ్దాం” అని కారునానుకుని నిల్చుంది కృష్ణ.

ఆ రోజు మేడ మిద ఎవ్వరూ పడుకోవద్దనీ అందరూ క్రింద గదుల్లో సర్దుకోమని నోటీస్‌ వచ్చింది. ఏదైనా అపాయం జరిగితే మేడమీద వాళ్ళు మొదట గాయపడ్తారట. ఆ రాత్రి కాల్పుల శబ్దంలో కలత నిద్రనుండి అందరం మేల్కొన్నాం. నాలుగు వైపుల నుండి ‘ఢామ్‌ ఢామ్‌’ అనే శబ్ధాలు. హాస్టలు అదిరిపోతోంది. ఆ రోజుతో అంతా అయిపోతుందనుకునేంత భీతావహం కలిగింది. కానీ అనుకున్నదేమి జరగకుండానే తెల్లవారింది. ఆ రాత్రి పరిసరాలు గమనించుకోవడానికి వచ్చిన విమానాన్ని భయపెట్టాలనే ప్రయత్నంలో నాలుగు వైపులనుండి కోస్టల్‌ బ్యాటరీ వాళ్ళు తమ ప్రతాపాల్ని చూపారు. ఆ విమానానికి వీసమెత్తు దెబ్బ తగల్లేదు. వెనక్కి తిరిగి మాత్రం వెళ్ళిపోయిoది.

వాళ్ళ హాస్టలు వెనక కొండమిద కోస్టల్‌ బ్యాటరీ వుంది. అక్కడ కావలసిన యుద్ధ పరికరాలన్నీ దాచబడి వుంటాయి. క్రింద హాస్టలులో యుద్ధపు భయం వలనైతేనేమి, ‘పరీక్షలు దగ్గరకొస్తున్నాయి చదువుకోవాలనే తపన’ వల్లనైతేనేమి లైట్లు వెలగడం మొదలెట్టాయి. ఆ కాంతిలో శతృవులకు కోస్టల్‌ బ్యాటరీ స్థావరం తెలిసిపోతుందని మిలిటరీ వాళ్ళు భయపడి గోలచేయసాగారు. దాంతో మెయిన్‌ ఆఫ్‌చేసి నిశ్చింతగా కూర్చున్నారు వార్డన్‌. ఆ పద్ధతి మా హాస్టలు దాకా పాకిపోయింది. పోనీలే కిటికీలు తీసుకుని కూర్చుందామనుకుంటె మా రూమ్‌మేట్‌ ఒకాయన ఆ ఏప్రిల్‌లో ఫార్మకాలజీ పరీక్షకు అపియర్‌ అవ్వాలి.

ఆ పరీక్షలదాకా ఎక్కడండీ రేపో మాపో మనమే ఊడిపోతాం అంటే అతను ఊర్కునేవాడుకాదు. అతను ఆశావాది. కిటికీలకున్న అద్దాలకి వెంటలేటర్స్‌కీ, గాలివచ్చే ప్రతి మార్గానికి నల్లకాయితాలంటించి క్యాండిల్‌ వెలిగించుకుని చదవడం మొదలెట్టేవాడు.” అని నవ్వారాయన.

”పుస్తకాల పురుగు అన్నమాట మా భానులాగ” జోక్‌ విసిరింది కృష్ణ.

”అంత ఇంటరెస్టింగ్‌గా ఆయన చెప్తోంటే…డిస్త్రబ్‌ చేయకు కృష్ణా !”

”ఓకే ఓకే….సారీ…చెప్పండి డాక్టర్‌గారూ” అని కారుకానుకుని నిలబడింది కృష్ణ.

”అర్థరాత్రి గాలి వచ్చే మార్గం లేదు. పొగ పొయ్యే దారిలేదు. ఆ ఉక్కలో ఆ పొగలో నిద్రపట్టక చచ్చిపోయేవాణ్ణి. పైగా తలుపు తీసేయాలనిపించేది. ఒకరోజు ప్రిన్స్‌పాల్‌గారు, వార్డన్‌ రౌండ్స్‌ కొచ్చారు. ఎవరో తలుపులు తీసేసి లాంతరు పెట్టుకుని చదువుతున్నారు. వాళ్ళు గబగబ ఆ దేశ ద్రోహిని శిక్షించడానికి వచ్చేసరికి ఆ అబ్బారు విషయం గ్రహించి గుట్టుచప్పుడు కాకుండా లాంతరు ఆర్పేసి దానిని దాచేసి నల్లకాగితాలు అంటించుకున్న కిటికీ తలుపులు మూసేసి చాల అమాయకంగా నిల్చున్నాడు. ఎవరు ఈ సాహస కృత్యం జరిపారో అర్థంకాక వాళ్ళు చాల తికమకపడ్డారు. దోషి పట్టుపడుంటే మాత్రం శిక్ష చాలా పెద్దదే వుండేది. అది గుర్తు కొచ్చి ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాము.”

తన పాత అనుభవాల్ని నెమరువేసుకుంటూ, భావావేశంతో చెప్తున్నారు డాక్టర్‌గారు.

”పగలు యధాప్రకారం క్లాసులకి అటెండ్‌ అవుతున్నాం మేము. ఒకరోజు క్లాసులో కూర్చొనున్నాం. లెక్చరర్‌ క్లాసు తీస్తున్నారు. మాపాటికి మేము కబుర్లు చెప్పుకుంటున్నాం. ఇంతలో సైరన్‌శబ్దం విన్పించింది. అందరు ఒక్కమారు సైలెంట్‌గా అయిపోయాం. ఎప్పుడు సైరన్‌ వచ్చినా అందరు సైలెంట్‌గా వుండాలనీ కొద్దిపాటి లైట్లు వెలుగుతున్నా వాటిని ఆర్పేయాలనీ, దోవలో నడచిపోతుంటె వెంటనే అక్కడ బోర్లా పడుకోవాలనీ” విశాఖ పౌరులకు విజ్ఞప్తి వచ్చింది. దానిని మేము అక్షరాల పాటిస్తున్నాం. తమాషా ఏమంటే ఆ రోజు మాకు విన్పించింది సైరన్‌ కాదు కుక్క అరుపు. ప్రతి శబ్దానికీ భ్రాంతి చెంది ఉలిక్కిపడే మా బలహీనతకు పగలబడి నవ్వుకున్నాం మేము.”

కాళ్ళు నొప్పులు. కారులో కూర్చుంటాను అని బాక్‌డోర్‌ తెరచి వెనకసీటులో కూర్చుంది అరుణ.

”మేలోనో జూన్‌లోనో మా పరీక్షలుంటాయి. డే స్కాలర్స్‌ సాయంత్రం క్లాసులయ్యాక లైబ్రరీకి వెళ్ళేవాళ్ళు. నాకు చదువు కోవాలనే తపన లేకపోయినా లైబ్రరీలో కూర్చుని డే స్కాలర్స్‌తో వాళ్ళ అనుభవాలని పంచుకోవాలనే  సరదా కొద్దీ నేనూ వెళ్ళేవాడిని. పూర్తిగా చీకటి పడకముందే అందరం ‘బ్రతికుంటే రేపు కలుద్దాం’ అని వీడ్కోలు చెప్పుకుని వెళ్ళిపోయేవాళ్ళం.

ఒకరోజు ఎందువల్లనో ఏడయి పోయినా కదల్లేదు. ఒక మూలగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ అప్పుడప్పుడు చదువుకుంటున్నాం. ఇంతలో సైరన్‌ విన్పించకుండానే లైట్లారిపోయాయి. చిమ్మచీకటి గాఢాంధకారం. టౌనంతా కూడా తీసేసారు. సైరన్‌ ఇచ్చే అవకాశం లేకుండానే కాల్పులు మొదలయ్యాయి. నాలుగు వైపులా కోస్టల్‌ బ్యాటరీ  నుండి గుండ్లు ఆకాశంలోకి పరుగులు తీస్తున్నారు. అన్నీ కలసి లేడీస్‌ హాస్టలు మిదుగా కలుస్తున్నాయి. ఆ హాస్టలులో వుండేవాళ్ళు బిక్క చచ్చి ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకున్నారు. సన్నగా విమానాల మ్రోత, గట్టిగా తూటాల శబ్ధాలు విన్పిస్తున్నాయి. అలా అరగంట సేపు గడిచింది. కాల్పులు ఆగిపోయాయి. శతృ విమానాల ఛాయలు కన్పించడం లేదు. ఒక మూలగ ఒక్కలైటు ఒక్కక్షణం పాటు వెలిగి ఆరిపోయింది. పది పదిహేను మంది అక్కడక్కడ భయం భయంగా ఆతృతగా చూస్తూ కూర్చునున్నారు. తర్వాత ఒక అరగంటయ్యాక లైబ్రేరియన్‌ ఒక లాంతరు పట్టుకొచ్చాడు. ఆ సన్నటి వెలుగులో చూస్తే ఇంకేముంది? నేను తప్ప ఇంకెవ్వరూ లేరక్కడ. ఎవరికి వారే ఎప్పుడు వెళ్ళిపోయారో వెళ్ళిపోయారు. నిజం చెప్పొద్దూ! నాకు ఆ క్షణంలో చాల భయం వేసింది. ‘నాతోపాటుమరో నాలుగు ప్రాణాలు పోతాయంటే వున్న ధీమా ఒక్కణ్ణే చావాలంటే వుండదేమో! మెల్లిగా లైబ్రేరియన్‌ దగ్గరకెళ్ళాను.

”అందరూ వెళ్ళిపోయారు. మిరు వెళ్ళిపొండి సార్‌. మరలా మొదలవచ్చు” అన్నాడు. ‘సరే’ నని తెచ్చుకోలు ధైర్యంతో బయలుదేరాను. పరుగు లాటి నడక అది. సరిగ్గా కలెక్టర్‌ ఆఫీస్‌ దగ్గర కెళ్ళేసరికి సైరన్‌ శబ్ధం విన్పించింది. గుబుక్కున రోడ్డు మిద బోర్లాపడుకున్నాను. ఆ సైరన్‌తో పాటు రెండు మూడు లైట్లు వెలగడంతో గబుక్కున లేచాను. అప్పుడు తట్టింది నాకు. అది విడుపు సైరన్‌ అని. గాభరాలో ఏది ఏదో అర్ధం చేసుకోలేని పరిస్థితి. అక్కడ నుండి పరుగెడ్తూ హాస్టల్‌లో వచ్చిపడ్డానో లేదో! మరలా సైరన్‌ మోగడం లైట్లన్నీ ఆరిపోవడం ఒక్కసారి జరిగినాయి. ‘హమ్మయ్య!’ అని గుండెలనిండా గాలి పీల్చుకున్నాను. ఆ చీకటిలో నా కొఱకు నాలుగు ‘లెటర్స్‌’ ఎదురు చూస్తున్నాయి. దేశం నాలుగు మూలలనుండి అన్నదమ్ములు స్నేహితులు నా క్షేమాన్ని కాంక్షిస్తూ భయపడుతూ ఉత్తరాలు వ్రాస్తుంటే అదో గర్వం. అదో రిలీఫ్‌.

ఎంత యుద్ధం జరుగుతున్నా ట్రాన్స్‌పోర్ట్‌ ఆగలేదు.

”లెటర్స్‌ వచ్చాయా? ఉత్తరాలు వస్తున్నందుకు మీరు సంతోషపడి వుండాలే….” సార్‌ చెప్పండి అన్నాడు చైతన్య. అవునన్నట్టు సంతోషంగా తలూపాడతను.

”క్యాజువాల్టీస్‌ ఎక్కువయ్యాయి. అన్ని ఆకాశంలోకి వదిలిన గుండ్లు మిదపడి తగిలిన దెబ్బలే. టౌన్‌లో గూఢచారులు ఎక్కువయ్యారు. దాంతో అనుమానాలు, పుకార్లు కూడా ఎక్కువయ్యాయి.”

”మా క్లాస్‌మేట్స్‌లో కొందరు భయపడుతుంటే అవన్నీ ఉత్త డమ్మిలని చెప్పి బుజ్జగిస్తూ వుండేవారు. లేడీస్‌ హాస్టలు వాళ్ళు భయపడి హాస్టలు ఖాళీచేసి మా హాస్టలులో ఒక బ్లాక్‌లోకి వస్తున్నారని మరో పుకారు లేచింది. హాస్టలులో అదొక పెద్ద చర్చనీయాంశం అయింది. నా బోటి కొందరికి ఇంటరెస్టింగ్‌ టాపిక్‌ అయిపోయింది.” అని చెప్పడం ఆపాడు.

కృష్ణ ఆతృతగా ముందుకు వంగి ”ఆ తర్వాతేమయింది చెప్పండి” అంది. ఆమెకు అతని అనుభవాలు చాలా ఆసక్తికరంగా వున్నాయి.

”ఆ తర్వాతింకే ముంది? యుద్ధం ఆగిపోయింది.” అన్నారు యదునందన్‌.

”తమాషా కాదు చెప్పండీ”

”నిజంగా ఇంకేమి లేదు. ఇంకా విమానాల మోత తాలూకు భ్రాంతి మా చెవుల్లో మారు మ్రోగుతుండగానే మార్చి మూడవ వారంలో అనుకుంటాను యుద్ధం ఆగిపోయిందనే వార్త వచ్చింది. కొద్దిపాటి డేమేజ్‌తో విశాఖపట్టణం యుద్ధపు బారి నుండి తప్పించుకుంది.”

అతను చెప్పడం ఆపినా, ఇంకా ఆకాలంలో తనున్నట్టే తదాత్మ్యం చెందిన కృష్ణ తేరుకోలేదు. అంతవరకు చాలా ఇంటరెస్టింగ్‌గా విన్న భానుమూర్తి మిగతా శ్రోతలు నిట్టూర్చి ‘రిలాక్స్‌ అయ్యారు.

వాతావరణాన్ని తేలిక చేసే ఉద్దేశంతో సరదాగా అన్నాడు చైతన్య-

”ఇక వెళ్దామా? లేకపోతే అరుణాదేవి గార్ని పులివచ్చి పట్టుకుపోగలదు”. అరుణ కనుబొమలు కొద్దిగా ముడుచుకున్నాయి.

5

సంధ్య గూటికి చేరింది. వెన్నెల మెల్లి మెల్లిగా చెట్లమీద పరచుకుంటోంది. ప్రకృతి కాంత మంచు ముసుగు

సవరించుకుంటోంది. కారు హెడ్‌లైట్ల కాంతి నల్లటి రోడ్డు మిద మెత్తగా జారిపోతోంది. ఆ కాంతిలో తను చూడబోయే చిరుతపులి తాలూకు వెలిగే రెండు నేత్ర గోళాల కొరకు, తన చూపులన్నీ, జారిపోయే రోడ్డు వంక కేంద్రీకరించింది కృష్ణ.

కొండలను చుట్టుకుంటూ కారు మెలికలు తిరిగిపోతోంది. ఒక్కొక్క కొండ చుట్టూ తిరిగేటప్పుడు భయంతో ముద్ద కట్టుకుపోతోంది అరుణ. అలవాటయిన దారుల వెంట నిర్మల చూపులు తాపీగా సాగిపోతున్నారు. భానుమూర్తి మురళిని కబుర్లలోకి దింపి ఆ చిన్నవాడితో స్నేహాన్ని పెంచుకుంటున్నాడు. చైతన్య మధ్యలో ‘జోకులు’ విసురుతూ ఆ కారులో కూర్చున్న రకరకాల మనస్తత్వాలకి కాస్త ‘రిలీఫ్‌’ ఇస్తున్నాడు.

‘పులి, పులి’ ఉత్సాహంగా అరచిన కృష్ణ అరుపులకు అరుణ గడ్డకట్టుకుపోరు కళ్ళు గట్టిగా మూసుకుంది.

”ఎక్కడ? ఎక్కడ?” అంటూ మిగతా వాళ్ళంతా ముందుకు వంగారు. వెంటనే వంగిన వాళ్ళంతా వెనక్కువాలి పకపక నవ్వసాగారు. గోళాల్లా మెరిసే కళ్ళతో అడవి పిల్లి రోడ్డుకడ్డంగా పరుగెట్టి పొదల్లో దాక్కుంది. చిరునవ్వు నవ్వుతూ తమాషా చూస్తున్నాడు ప్రసాదరావు.

”హడల గొట్టేసారు” కంపించే స్వరంతో అంది అరుణ. అరుణ అవస్థ చూస్తున్న భానుమూర్తికి ఆమె మీద జాలేసింది.

”నువ్వు మరీ కృష్ణా! ప్రక్కన కూర్చుని ఆమెను హడల గొట్టేస్తున్నావు.” అని వెనక్కు తిరిగి అరుణ కళ్ళల్లోకి ధైర్యం చెప్తున్నట్టు చూస్తూ అన్నాడు-

”మిరు భయపడకండి. పులులు రావు. వచ్చినా మన కారును చూచి అవే బెదిరిపోతాయి.”

ఆ మాటలతో బెదురుతున్న ఆమె కళ్ళు ఒక్కమారు మెరిసాయి. అతని అనునయంతో ఒకరకమైన ఆనందానుభూతిని పొందినా, ఆమెను భయం అనే పిరికి దయ్యం వదలిపెట్టనే లేదు.  ”ఏమో! ‘సడన్‌’గా పెట్రోలు అయిపోవచ్చు. లేదా, ఏవైనా పార్టు చెడిపోవచ్చు. అడవి మృగాలు తిరిగే చోట ఈ నిశ్శబ్ధంలో అడవి మధ్యగా… అమ్మో!” ఇక ఆలోచించలేకపోయిందామె. ముందుసీట్లో కూర్చుని ఆనుకునే సీటు మిద ఆనించివున్న భానుమూర్తి  తాలూకు బలమైన హస్తాన్ని గట్టిగా పట్టుకోవాలని ఆమెకు తీవ్రమైన కోరిక కలిగింది. స్వతహాగా వున్న పిరికితనం వల్లనైతేనేమి సాంఘిక సంస్కారం వల్లనైతేనేమి ఆపని చెయ్యలేకపోయిందామె.

”ఏరా నాన్నా! పులి ఎదురైతే ఏం చేస్తావురా?” మెల్లగా అడుగుతున్నాడు భానుమూర్తి.

”దాని తలమిద ఎక్కి కూర్చుని చంపేస్తానంకుల్‌” అంటున్నాడు మురళి.

”అవునులే తలమిద ఎక్కాల్సిందే. ఎదురుగా వెళ్ళలేవు ”రెచ్చగొడ్తున్నాడు చైతన్య ఆ పసివాడిని.

”ఆ ఎందుకు వెళ్ళలేనేం? ఒక్క కరాటె దెబ్బ ఇచ్చానంటె గింగిరాలు తిరుగుతుంది.”

“వచ్చేసాం.”

”అప్పుడే వచ్చేసామా?” అని కృష్ణ నిరుత్సాహంగా అంటే

”హమ్మయ్య” అని గుండెలమీద చెయ్యివేసుకుంది అరుణ.

అప్పుడే ఎక్కడ? ఈ శిఖరాగ్రాన ఇంకా పదకొండుమైళ్ళు ప్రయాణం చేస్తే గాని చింతపల్లి రాదు. భూమి మీద వెళ్ళినట్టె కొండమీద సాఫీగా కారువెళ్తుంటె చాలా థ్రిల్లింగ్‌గా అన్పించింది కృష్ణకు. చీకటిని చీల్చుకుని లోయలోకి చూద్దామని తాపత్రయ పడ్తోందామె.

ఇంతవరకు ప్రగల్భాలు పలికిన మురళి భానుమూర్తి ఒడిలో నిద్రపోయాడు. నిర్మల, చైతన్య అరుణ తూగుతున్నారు. భానుమూర్తి కృష్ణ తమకు ఎదురువచ్చే దృశ్యాల్ని తాము ఎదుర్కోబోయే అందాల్ని చూస్తూ తన్మయత్వంలో మునిగిపోయారు.

చంద్రుడు పైపైకి ఎగబ్రాకుతున్నాడు. చీకటి చెల్లా చెదరైపోతోంది. మంచుతో తడిసిన చెట్లు మనోహరంగా మెరుస్తున్నాయి. రోడ్డు  ప్రక్కగా వెదురు పొదలు ఫౌంటెన్‌లా విచ్చుకుని ఆకాశాన్ని చుంబిస్తున్నాయి. వెన్నెలలో క్రొత్త అందాల్ని సంతరించుకుంటున్న వెదురు పొదల్ని చూస్తుంటే, కృష్ణకు చటుక్కున యశోదానందుడు, చిలిపి కృష్ణుడు గుర్తుకొచ్చాడు.

మృదుల మనోహర చక్రవర్తి గోపికా మనోరంజకుడు రసికాగ్రేసరుడు అయిన మురళీ మోహనుడు గుర్తుకు రాగానే కళ్ళు విప్పార్చుకుని పొదలలో తన ఊహాజనితమైన మూర్తి కొఱకు వెతికింది.

”వెదురుపొదలలో, చీకటి కాదది శ్యామలదేహము…” ఆ భావగీతమంటే మహా ఇష్టం కృష్ణకు. దాని మొదలు తుది ఆమెకు గుర్తులేదు. అరుణను తట్టిలేపి, ఆ పాట పాడించుకోవాలనీ తన ఆనందానుభూతిని పంచుకోవడానికి, తనతోపాటు అందమైన ప్రకృతిని ఆరాధించడానికి మరో వ్యక్తి కావాలనీ గాఢమైన కోరిక కలిగింది.

(ఇంకా ఉంది )

– డా|| పెళ్లకూరు జయప్రద సోమిరెడ్డి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

B35
ధారావాహికలు, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో