స్త్రీవాద కథ దాటవలసిన పరిమితులు

స్త్రీవాద కథ దాటవలసిన పరిమితులు ` అన్న విషయం మీద నేను మాట్లాడడానికి, నేను విమర్శకురాలిని కాదు. కథలు రాస్తాను ` అన్నదొక్కటే యీ విషయం మీద యేదైనా చెప్పడానికి నాకున్న అర్హత. స్వేచ్ఛ అనేది వొక రాజకీయ ఆకాంక్ష అనీ, దాన్ని సాధించుకోవడానికి గానీ నిలుపుకోవడానికి గానీ పరిసరాలతోనూ సమాజంతోనూ పోరాడాలని మాత్రం నాకు తెలుసు. ఆ పోరాటం గురించీ దాని బహుముఖాల గురించీ రాయాలని నేను ప్రయత్నిస్తున్నాను. ఆ ప్రయత్నంలో నాకు అనుభవంలోకి వచ్చిన అవరోధాలని, సడలించుకోలేకపోతున్న సంకోచాలని పెగిల్చుకోలేక పోతున్న గొంతుకలను మీకు చెప్పాలని వుంది. యీ సీరియస్‌ విషయాన్ని స్వగతంలాగా చెప్పడాన్ని మీరు అర్థం చేసుకోగలరనుకుంటాను.

నేను వొక తరానికి చెందిన పాఠకురాలిని.

కొంచెంకొంచెంగా పరచుకునే తెల్లవారి వెలుగులాగా నా చూపును స్పష్టం చేసిన అక్షరాలు నాకు బాగా గుర్తు. నిలువనీయని వుద్వేగంతో నింపేసినవీ, కన్నీరుమున్నీరు చేసినవీ, యీ ప్రపంచంపై ఆశలు పెంచినవీ, కోపం పుట్టించినవీ, రోత కలిగించినవీ ` అయిన అక్షరాలన్నీ నాకు గుర్తు. కొన్ని శతాబ్ధాల, కొన్ని తరాల, కొన్ని వందల వేల జీవితానుభవాల మీగడ తరకల్నీ, హాలాహలాల్నీ గోరుముద్దలుగా తినిపించిన అక్షరాలన్నీ నాకు గుర్తే.

నేను వొక తరానికి చెందిన స్త్రీని.

వొక దేశానికి వొక ప్రాంతానికి వొక కులానికి చెందిన స్త్రీని కూడా. నా ప్రమేయం లేకుండా అమరిన నేపథ్యమూ, నా ప్రేమేయం లేకుండా, నా ప్రయత్నంతోనూ నేను యేర్పర్చుకున్న జీవితమూ, నాకు మునుపే పోగుబడి నాలోకి యింకిపోయిన అక్షర ప్రపంచమూ కలసి నన్ను నన్నుగా చేశాయని నాకు తెలుసు. నా అంతట నేను తీర్చిదిద్దుకున్న వ్యక్తిత్వంపై తప్ప, యాదృచ్చిక సామాజిక కారణాల వల్ల సమకూరిన మరే యితర అస్తిత్వాలపై నాకు గర్వమూ లేదు, అవమానమూ లేదు.

నేను వొక తరానికి చెందిన రచయితను.

నేను రాసే అక్షరాలు కేవలం నావి మాత్రమే కావని నాకు తెలుసు. అవి వొక పరంపరలో భాగమనీ, నేడు కొత్తగా వున్నా రేపటికి పాతబడిపోతాయనీ తెలుసు. నేను చూస్తున్న ఘర్షణా, పడుతున్న ఘర్షణా మాత్రమే కాదు, నా తరం స్త్రీలలో సుడులు తిరుగుతున్న అనేక భావోద్వేగాలు, వారి నిశ్శబ్ధ పోరాటమూ నా అక్షరాలను పోషిస్తున్నాయి.

స్త్రీవాద కథకులు వున్నత, మధ్య తరగతి స్త్రీల జీవితం గురించి రాస్తున్నారని వొక ఫిర్యాదుగా చెబుతుంటారు. అది ఫిర్యాదు కాదు, అదొక వాస్తవం. మేం చర్చిస్తున్న విలువల ఘర్షణకు వేదిక ఆ తరగతే, కులమూ, మతమూ, వర్గమూ వంటి యితర వైరుధ్యాలు బలంగా లేని చోట జెండర్‌ సమస్యను ప్రస్ఫుటంగా చూపిచవచ్చనుకుంటారు. ఆర్థికంగా బాగున్నవారు, అభ్యుదయవాదులు అయిన వారిలో కూడా స్త్రీ పురుష సంబంధాలు యెంత దారుణంగా వున్నాయో చెప్పగలగడం అనేక భ్రమలను పటాపంచలు చేస్తుంది. కాబట్టి, స్వేచ్ఛ కోసం స్త్రీ చేసే పోరాటాలను రచనల్లో చెప్పేటప్పుడు యేదైనా వొక సామాజిక, ఆర్థిక నేపథ్యం పరిమితి అవుతుందని భావించలేను. కథా రచనకు సంబంధించిన మేం ఫీలయ్యే పరిమితులు, హద్దులు నిజానికి నేపథ్యాలకు పాత్రలకు సంబంధించినవి కానే కావు.

దుర్మార్గుడైన భర్తా, రాచి రంపాన పెట్టే అత్తిల్లూ, యింటి చాకిరీ, పిల్లల పెంపకం, యెదగడాన్ని అడ్డుకునే పరిస్థితులు ` వీటి గురించి, వీటి నుంచి బయటపడాలనుకునే పోరాటం గురించి మా ముందు తరం రచయితలు యెంతో రాశారు. కుటుంబం, పెళ్ళి, మాతృత్వపు విలువలు మనుసును, మనిషిని మరుగుజ్జును చేసే దుర్మార్గాన్నీ, ఆ దుర్మార్గం జీవితంలో నింపే ఆరసికతనీ, సౌందర్యరహిత్యాన్నీ కూడా చిత్రించారు. స్త్రీవాదం వొక సిద్ధాంతంగా ముందుకు వచ్చి యీ ప్రపంచాన్ని అర్థం చేసుకునే వొక చట్రాన్ని యిచ్చాక మా జీవితాల్లోని అనేకానేక పార్శ్యాలని కొత్త వెలుగులో అక్షరబద్ధం చేశాం.

యిప్పుడు మాకు కార్యకారణ సంబంధాలు తెలుసు. సమస్త రాజకీయ, సామాజిక, ఆర్థిక నిర్మాణాల పురుషత్వం తెలుసు. సమస్త విజ్ఞాన శాస్త్రాల, కళల మగతనం తెలుసు. అభివృద్ధి పుల్లింగమని తెలుసు. యీ లోకాన్నంతా స్త్రీకరించకపోతే యెవరికీ ముక్తి లేదని తెలుసు.

అన్ని తెలిసినా మా అక్షరాలు కొన్ని యిరుకు తోవల్లోనే ప్రయాణిస్తున్నాయన్న అనుమానం. యింకా గొంతుకు అడ్డం పడుతున్న విలువలు, కలం పెగల్చుకోలేకపోతున్న కలలు, తెరచుకోలేకపోతున్న కిటికీలు వున్నాయని తెలుస్తూనే వుంది. మా కథలు, మా సమస్యలు, మా పరిష్కారాలు కూడా కొన్ని మూసదారుల్లో నడుస్తున్నాయని అనిపిస్తూనే వుంది.

జీవితాన్ని దాని వాస్తవమైన గతిశీలత నుంచి పట్టుకోవడం విరమించి, వొక రాజకీయ వాస్తవాన్ని నిరూపించడానికో పరమసత్యాన్ని గుర్తింపచేయడానికో మేం సన్నివేశాలను, కథనాన్ని ` వక్రీకరిస్తున్నాం అనను కానీ ` మ్యానిపులేట్‌ చేస్తున్నాం.స్వేచ్ఛను సౌదర్యం కోసం, సౌందర్యాన్ని స్వేచ్ఛ కోసం ప్రేమించే స్త్రీలం, పోరాడే స్త్రీలం జీవితాన్ని కూడా ప్రేమగా హత్తుకుంటాం.

మా యిష్టాల్ని నెరవేర్చుకునే క్రమంలో మా పోరాటం కేవలం రక్తసిక్తమైనదే కాదు. ఆనందభరితమైనది కూడా. మేం యెప్పుడూ విజయాలనే పొందం, వొక్కొక్కప్పుడు కోలుకోలేని యెదురు దెబ్బలు తింటాం. యిష్టపూర్తిగా వొక్కోసారి మేం లొంగిపోతుంటాం.

వొక మనిషినో వొక సంబంధాన్నో వొక చట్రాన్నో తీసిపారేసినప్పుడు ఆ అనుభవం, ఆ క్రమం కేరింతల సంబరంగా వుండదు. పరమ హింసాత్మకంగా వుంటుంది. అలసట వుంటుంది. ఆనందం వుంటుంది. పొరపాటు వుంటుంది. లొంగుబాటు వుంటుంది.

యింత సంక్ష్లిష్టమైన జీవిత సన్నివేశాలను స్త్రీ స్వేచ్ఛా కథకులం మిస్‌ అవుతున్నామేమో అనిపిస్తుంది. యే తప్పులూ చేయని, దేనికీ చలించని, దేనికీ లొంగని పురుషోత్తములైన విప్లవకారుల వంటి ఆదర్శమూర్తులనూ, విముక్త స్త్రీలనూ, కథానాయికలను చేస్తున్నామేమో అనిపిస్తుంది. పరమ మనవీయమైన పోరాటాన్ని అమానవీయం చేస్తున్నామని అనిపిస్తుంది.

జెండర్‌ సమస్య అనగానే ప్రేమ సంబంధాలను, దాంపత్య సంబంధాలను, లైంగిక సంబంధాలను యెక్కువగా తీసుకుంటున్నాం. యీ పరిధిని మరింత విశాలమూ, విస్త్రృతమూ చేయవలసి వుంది. స్త్రీ పరుషతత్వాలు సమస్త మానవ సంబంధాలకు, సామాజిక సంబంధాలకు సంబంధించినవిగా మారాయి.

ప్రపంచాన్ని అర్థం చేసుకునే పద్దతీ, వ్యాఖ్యానించే పద్దతీ, మానవోద్రేకాలలోని భేదాలూ అన్నీ కూడా స్త్రీ , పురుషతత్వంగా, పరిరక్షణ, సామరస్యం, శాంతి స్త్రీతత్వంగా విధించిన స్వభావాలలో మానవాళికంతటి ముఖ్యమైనవీ, అపురూపమైనవీ అయిన వాటిని కాపాడుకోవాలేమో! పురుషులతో సమానవ్వం అంటే పురుషులు రచించిన నియమాలకు లోబడి, పరుషులు సృష్టించిన వాతావరణంలో పరుషులతో పోటీ పడడం కాదేమో! మొత్తం వాతావరణాన్నే స్త్రీకరించాలేమో. యిటువంటి సందేహాలు చాలా వున్నాయి. మమ్మల్ని మేం యెప్పుడూ అణిచివేతకు గురయ్యే స్థానం నుంచే కాక, పాజిటివ్‌గా కూడా చూసుకోవాలి. స్త్రీత్వానికి గర్వపడాలి. సున్నితత్వానికి, మార్దవానికి ప్రతినిధులుగా వుండాలి. యీ ప్రపంచాన్ని మరింత మానవీయం చేయడంలో మా సరళి భిన్నంగా, మరింత హేతుబద్ధంగా వుంటుందని చెప్పాలి.

యిందు కోసం, మా ప్రపంచ అవగాహనను చుట్టూ వున్న జీవన వైవిధ్యానికి అంతటికి అన్వయించాలి. మెహమాటంతో, సంకోచంతో యేవో చెప్పగలగాలి, స్వేచ్ఛలోని ఆనందాన్ని, రాజీలోని నిశ్చింతను కూడా స్పష్టంగా రాయగలగాలి. వొక రాజకీయ దృఢ నిశ్ఛయానికి వచ్చేలోగా మేం పడే సంక్షోభాన్ని అంతటినీ యే నైతిక భయాలు లేకుండా వ్యక్తం చేయగలగాలి. వొక్క మాటలో చెప్పలంటే, బ్లాక్‌ అండ్‌ వైట్‌ యుద్ధభూమిని కాసేపు వదిలి ‘గ్రే యేరియాస్‌’లోకి కాలు పెట్టాలి.

స్త్రీ స్వేచ్ఛా కథనం యిప్పుడు ఆశ్చర్యపరచడం, షాక్‌ చేయడం తగ్గించేసింది. మేం యేం రాయబోతున్నామో తెలిసిపోతోంది. అంటే సమాజం, పాఠకులు కొద్దికొద్దిగా మేం చెబుతున్న విషయాన్ని స్వీకరిస్తున్నారన్నమాట. అదే సమయంలో ఆ స్వీకరణ మేం చెప్పిన విషయాన్ని యథాతథ స్థితిలోకి నెట్టి వేస్తోంది. యీ పురుష ప్రపంచపు ఆయువుపట్ల కొత్త గుట్టుముట్లను కనిపెడుతూ యెప్పటికప్పుడు దిగ్భ్రాంతిలో ముంచెత్తాలి. అంటే సెన్సేషనలైజ్‌ చేయమని కాదు. మనం చెప్పే విషయాలు మామూలై పోవడం వొక ప్రమాద సూచిక. వ్వవస్థలో జీర్ణమవుతున్న ప్రక్రియకు సంకేతం.

మానవ సంబంధాలలోని రహస్యాలు మాకు తెలుసు. ధనంలో, అధికారంలో, విద్యలో యెంత రోత వుందో మాకు తెలుసు. అక్రమ సంబంధాలలోని గొప్ప ప్రేమను, సక్రమ సంబంధాలలోని గొప్ప అవినీతిని మునుపు మేమే చెప్పాం. తాళితోనూ, ప్రేమతోనూ, అందంతోనూ, అధికారంతోనూ కట్టి పడేయని ప్రేమని మేం యెంత ప్రేమిస్తామో యిప్పుడు చెప్పాలి. వొకరికి లోబరిచే ఆస్తి కాకుండా మా అంతట మేం మా అనుభవం కోసం వినియోగించే సాధనం అయినప్పుడు మా శరీరాలు యెంత స్వచ్ఛంగా, పవిత్రంగా వుంటాయో చెప్పాలి.

మునుపటి తరం అణచివేత, అవమానం, కాఠిన్యం వున్న పురుష పాత్రల స్థానంలో వో సహృదయుడైన విముక్తుడైన ఆదర్శ పురుషులను నిలబెట్టే ప్రయత్నం చేసింది. ఆ ఆదర్శ పురుషుల ఆదర్శాన్ని రకరకాల గీటురాళ్ళపై పరీక్షిస్తూనే వుండాలి. వ్యవస్థాగత సంబంధం స్థానంలో ప్రేమ సంబంధాన్ని మునుపు ప్రతిపాదించారు. ప్రేమ కూడా ప్రశ్నించకూడని పవిత్ర విషయమేం కాదని చెప్పాలి. చట్రంలో యిమడని ప్రేమల్లో కూడా అధికారం యెంత పని చేస్తుందో యింకా గట్టిగా చెప్పవలసే వుంది. చివరకు, లైంగిక విషయాల్లో కూడా పురుష కామానికి ప్రతిగా స్త్రీ మోహాన్ని నిలబెట్టవలసి వుంది.

చలంగారి లాలన స్వేచ్ఛను వివేకాన్ని, జీవితావసరాలను వొక సంబంధంలో పెట్టి ఆలోచించి, జీవితాదర్శం శాంతి అనుకుంది. ఆ ఆదర్శం సరైనదో కాదో కానీ, స్వేచ్ఛాకాంక్ష మాలో రూపొందించే పరిపక్వ వ్యక్తిత్వం అనేక సామాజిక జీవన సందర్భాలలో యెంత నిర్భరంగా ధైర్యంగా వుంటుందో సోదాహరణంగా చిత్రించాలి.

మేం స్వేచ్ఛ కోసం పోరాడుతున్నవాళ్ళం. పోరాటం పోరాటం కోసం కాదు. అర్థవంతమైన జీవితం కోసం. చుట్టూ వున్నది ప్రతిఘటన. నిరోధం. మాలోనూ పురుషభావాల, గత కాలపు అవశేషాలు వున్నాయి. వాటిపై కూడా పోరాడుతూనే మేం జీవిస్తాం. జీవితం యెంతో పెద్దది. మేం రహస్య వ్యక్తిగత సంబంధాలను మార్చాలని రహస్యంగా ప్రయతి ్నస్తున్న వాళ్ళంకాదు. ప్రపంచాన్నే మార్చాలని మా చుట్టూ కట్టిన కంచెలను నరుకుతున్న వాళ్ళం. మా కథలకు యే మొహమాటాలూ, యే దాపరికాలూ, యే సరిహద్దులూ వుండకూడదు.

యెక్కడ అక్షరం తడబడి ఆగిపోతుందో, యెక్కడ భయంతో మాట పెగలకపోతుందో, యెక్కడ అర్థాన్ని అస్పష్టత కింద దాచేయాలనిపిస్తుందో అక్కడే తెగించాలి. యిప్పటి దాకా చేసింది అదే. యిక ముందు చేయవలసిందీ అదే.

– కుప్పిలి పద్మ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

సాహిత్య వ్యాసాలు ​, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , Permalink

6 Responses to స్త్రీవాద కథ దాటవలసిన పరిమితులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో