Director : Barbara Bredero
Country : Netherlands
Language: Dutch with English Subtitles.
Duration: 81 minutes
Age Group: Above 10 years
ఉదయం లేచిందగ్గర్నించి తమాషాలు,సరదాలతో కూడిన ఫన్ కావాలంటున్న ఈ కాలపు పిల్లల మనస్తత్వాల కనుగుణంగా తరగతిగదిలో పాఠాల సారాంశాన్ని ఆట ఫాటల మధ్య విద్యార్ధుల కందించడానికి ఒక ట్రైనీ టీచర్ సాహసవంతమైన ప్రయోగాలు చేస్తాడు. విద్యార్ధుల్తోపాటు తానూ అల్లరి పనుల్లో సంతోషంగా భాగమవుతూ, తానూ వాళ్ళల్లో ఒకడిగా మమేకమైపోవడమే ఈ సినిమా కధాంశం.
టోబియాస్ చాలా చురుకైన బాలుడు. అందంగా ఉల్లాసంగా ఉంటాడు.మంచి ప్రతిభావంతుడు.ఎప్పుడూ సరదాగా సంతోషంగా ఉండాలనుకుంటాడు.కానీ ఇవేమీ పట్టించుకోదు టీచర్ మిస్ సానా.అతని ఇంటి సమస్యల్నే ఆమె గుర్తిస్తుంది. టోబియాస్ కి తండ్రి చనిపోతాడు.తల్లి మంచం పడుతుంది.ఇంట్లో సమస్యలు సరే ,అతనికి వీటిని స్కూల్లో మర్చిపోయి ఆట-పాటల్తో హాయిగా గడపాలనుకుంటాడు. కానీ అతనికి అక్కడ కూడా కష్టాలే !
టోబియాస్ కి అసలు తన పాఠశాల అంటే నచ్చదు.ఎందుకంటే అతని టీచర్ మిస్ సానా బండెడు హోంవర్క్ ఇస్తుంది. చేసి తీరాలని నిర్భందిస్తుంది. చెయ్యకపోతే ప్రిన్సిపాల్ కి రిపోర్ట్ చేసి మరింత శిక్షిస్తుంది. అందువల్ల స్కూలంటే రోజు రోజుకీ టోబియాస్ కి ద్వేషం పెరిగిపోతుంది. సానా హఠాత్తుగా ప్రసూతి సెలవు మీద వెళ్తుంది. ఆమె స్థానంలో వచ్చిన అసాధారణ ప్రజ్ఞావంతుడైన టిచర్ మిస్టర్ మీస్ కీస్ ని చూచి టోబియాస్, అతని సహచరులు మహదానందపడిపోతారు. మిస్టర్ మీస్ కీస్ ఒక యువ ట్రైనీ టిచర్ . అతను పిల్లలకి అచ్చు తమ ఇంట్లోని పెద్దన్నయ్యలా అనిపిస్తాడు. మీస్ కీస్ బోధనలో పాఠాలు ఇంతకుముందెన్నడూ లేనంత ఆహ్లాదకర వాతావరణంలో అత్యంత వినోదాత్మకంగా, విద్యార్ధుల ఆనందాల కేరింతలతో గడిచి పోతుంటాయి !
ఎప్పుడూ హోంవర్క్ లతో బండ రొడ్డకొట్టుడు విధానాలతో వేధించే రెగ్యులర్ టీచర్ మిస్ సానా తో పోలిస్తే తాత్కాలికమే అయినప్పటికీ మిస్టర్ మీస్ కీస్ బోధన అత్యంత వినోదాత్మకంగా, ఉత్తమంగా ఉందని ఫన్ క్లాస్ విద్యార్ధులు భావిస్తారు. వాళ్ళు అనుకున్నట్లే మిస్టర్ మీస్ కీస్ కూడా బయాలజీ క్లాస్ లో స్పైడర్ మాన్ ని చూపిస్తూ పాఠం చెప్తాడు. మాథ్స్ క్లాస్ లో మేజాబల్లలని తలకిందులు చేసి పిల్లలతో కలిసి గమ్మత్తు లెక్కలు చేస్తాడు. చివరికి అతను మాట్లాడటానికి ఎప్పుడూ ధైర్యం చెయ్యని ఒక అమ్మాయి తన రహస్య ప్రేమను గురించి కీస్ తో చెప్పడాన్ని కూడా విద్యార్ధులతో షేర్ చేసుకుంటాడు.
అయితే, ఒకవైపునుంచి క్రమశిక్షణకు మారు పేరైన ప్రిన్సిపాల్ పాఠశాల వరండా నుంచి తరగతిగది వైపు పొంచి పొంచి చూస్తూ టిచర్నీ,పిల్లల్నీ గమనిస్తుంది.ఇంకోవైపునుంచి పాఠశాల తనిఖీ రోజు దగ్గర పడుతుంది. ఈ పరిస్థితుల్లో క్లాస్ సరదాగా హుషారుగా ఎంత కాలం సాగుతుంది?
ఫన్ తరగతి వాళ్ళొక నాటకం వెయ్యాలి. అది కూడా ఉద్యోగ విరమణ చేసిన వారుండే ఒక ఇంటి హాల్ లో వెయ్యాలి.ఆ ఇంటికి పిల్లలు వెళ్ళాలంటేనే దారంతా భయం పుట్టేటట్లుంటుంది. ఇదంతా సరే అనుకుని ఎదురుచూస్తున్న విద్యార్ధులకి డైరెక్టర్ డ్రియస్ (ప్రిన్సిపాల్) ఇచ్చిన నాటకం మధ్య యుగాలనాటి ఇతివృత్తంతో పరమ చిరాగ్గా బోరింగ్ గా ఉంటుంది. రిటైర్డ్ హోం లో నివసించే కొందరి సహాయంతో ప్రిన్సిపాల్ నాటకానికి బదులుగా ఒక ప్రత్యామ్నాయాన్ని రూపొందించుకోవాలనుకుంటారు మిస్టర్ మీస్ కీస్ బృందం.పిల్లల ఎనర్జీ,శక్తి,సామర్ధ్యాలను చూచి పెద్దవాళ్ళు ముచ్చట
పడతారు.పరిక్షలు దగ్గరకొస్తున్నాయి.రిహార్సల్స్ కి పెద్ద సమయం లేదు. అయినా సరే మిస్టర్ మీస్ కీస్ ఆధ్వర్యంలో మద్యాహ్నాలు నాటకానికి కేటాయించాలనుకుంటారు. కీస్ నాయకత్వంలో ఏదైనా సాధించగలమనే నమ్మకంతో ఉంటారు విద్యార్ధులు. అందుకు తగ్గట్లే మిస్టర్ కీస్ డైరెక్షన్ కూడా ఫన్ క్లాస్ విద్యార్ధులు మాత్రమే చెయ్యగలిగిన ఒక అద్భుతమైన మలుపు నిస్తుంది.
అదేమిటో తెలియాలంటే ఈ ఫన్నీ సినిమా చూడల్సిందే!
మిస్టర్ మీస్ కీస్, ప్రిన్సిపాల్ డ్రియస్ నేతృత్వంలో క్లాస్ 6b ఒక కేంప్ కి వెళ్ళడానికి నిర్ణయమవుతుంది. కేంప్ కెళ్తున్నామని ఎగిరి గంతులు వేసిన పిల్లలు ప్రిన్సిపాల్ డ్రియస్ వస్తుందని తెలిసి అక్కడ కూడా చదువు,అసైన్ మెంట్స్,వర్క్ షీట్స్ ఇవన్నీ ఉంటాయని తెలిసి నీరుగారిపోతూ నిరుత్సాహపడిపోతారు. దారిలో డ్రియస్ నడుముకి గట్టి దెబ్బ తగిలి కదలలేకపోతుంది. హఠాత్తుగా బాధ్యతంతా మిస్టర్ కీస్ భుజాల మీద పడుతుంది. మళ్ళీ బాధ్యత మొత్తం కీస్ తీసుకున్నప్పుడు ఆనందంగా సహాయం చేస్తారు.
ప్రతిదీ ఇలా సాఫిగా నడుస్తుండగా సానా ప్రసూతి సెలవు ఐపోయిందనీ,అమె తిరిగి జాయినవబోతుందనీ ప్రిన్సిపాల్ డ్రియస్ చెప్తుంది. ఈ కబురు విన్న ఫన్ క్లాస్ విద్యార్ధులందరూ కలవరపడిపోతారు.గగ్గోలు పెడతారు. టీచర్ కీస్ కూడా ఆందోళన పడతాడు. కానీ ఎంచేయగలడు?నిజానికి అతనొక శిక్షణ పొందుతున్న స్టూడెంట్ మాత్రమే! కానీ సానా కి టిచర్ గా పనిచేయడానికి పూర్తి అర్హత ఉంది. ప్రిన్సిపాల్ డ్రియస్ యొక్క నియమాల ప్రకారం ఒక ఆరు నెలల ఇంటర్న్ షిప్ చేస్తేనే తప్ప కీస్ ప్రాధమిక పాఠశాల నడపడానికి అర్హుడు కాడు. పిల్లలందరూ మిస్టర్ మీస్ కీస్ ని, సరదాల ఫన్ క్లాస్ ని మిస్సవబోతున్నామని బాధ పడతారు.
టీచర్ కోసం విద్యార్ధులూ – విద్యార్ధుల కోసం టీచరూ పరితపిస్తున్న నేపధ్యంలో చివరికి అంతా ఏమవుతుందో తెలుసుకోవాలంటే పిల్లల్ని ప్రేమించేవాళ్ళందరూ ఈ చిత్రం చూచి తీర వలసిందే!!
“మీర్ జాం ఓల్డెన్ హేవ్” (Mirjam Oldenhave) అనే రచయిత రచించిన విదేశీ పాఠశాలల్లో, గ్రంధాలయాల్లో బహుళ ప్రాచుర్యం పొందిన పిల్లల పుస్తకాల సిరీస్ “మిస్టర్ మీస్ కీస్” నవలల ఆధారంగా రూపొందించిన అనేక చలన చిత్రాలలో మొదటిది ఈ ఫన్ క్లాస్ సినిమా! ప్రాధమిక పాఠశాలలోజరిగే చిత్ర,విచిత్రమైన సంఘటనలను గుది గుచ్చి రకరకాలరంగుల ప్రపంచాన్నీ, మెరిసిపోయే చిన్నారుల సంతోషపు హావభావాల్నీ, చలాకీగా గంతులేస్తూ,ఎగిరెగిరిపడుతూ పరుగులిడే ఉత్సాహాల హోరునీ తాజాగా చూపిస్తూ ప్రేక్షకులను మురిపిస్తుందీచిత్రం. పిల్లలూ,పెద్దలూ,కుటుంబ సభ్యులంతా చూడదగిన కుటుంబ కధా చిత్రం.
టిచర్ మిస్ సానా స్థానంలో తాత్కాలికంగా సబ్ స్టి ట్యూట్ గా వచ్చినందుకు మిస్టర్ మీస్ కీస్ కి టోబియాస్ ,తక్కిన పిల్లలందరూ కలిసి అతన్ని చూసిన వెంటనే సబ్- సామ్ అని మారు పేరు పెట్టేస్తారు. మారు పేర్లు పెట్టడం ఈ కాలపు చురుకైన పిల్లలకి సర్వ సాధారణం కదా?
తరాల మధ్య అంతరాలనూ, వివిధ తరాల మధ్య వైరుధ్యాలనూ ఫన్ క్లాస్ లో అద్భుతంగా తెరకెక్కించారు దర్శకురాలు బార్బరా బ్రెడేరో (Barbara Bredero). ముగింపు కుడా చాలా సహజంగా అమిరింది.
డచ్ ఫిలిం ఫెస్టివల్ సమయంలో క్రిస్మస్ సెలవులు కూడా ఉన్నందున ఒకసారి ఒక 100,000, ఇంకోసారి 400,000, ఇవికాక ఏకంగా డచ్ లో ఒక మిలియన్ సినిమా టికెట్లు అమ్ముడయ్యాయి. డచ్ సినిమా ఫండ్ తో పాటు గోల్డెన్ సినిమా, ప్లాటినం సినిమా, డైమండ్ సినిమా హోదాలను సాధించి పెట్టిందీ సినిమా!
దర్శకురాలు బార్బరా బ్రెడేరో, మిస్టర్ మీస్ కీస్ గా నటించిన “విల్లెం వీజ్”, టీచర్ మిస్ సానా గా నటించిన “వివియన్నే వాన్ డెన్ యసాం” డచ్ ఫిలిం ఫెస్టివల్ లో స్పెషల్ అవార్డులు గెల్చుకున్నారు. టోబియాస్ పాత్ర పోషించిన “ఫెలిక్స్ ఒసింగా” , ప్రిన్సిపాల్ డ్రియస్ పాత్ర పోషించిన “సానే వాలిస్ డి వ్రైస్” తమ తమ పాత్రల్లో అద్భుతంగా ఒదిగిపోయి పాత్రలే ప్రేక్షకుల మనసుల్లో తిష్ట వేసేటట్లుగా జీవించారు.
ఇక దర్శకురాలికి ప్రపంచవ్యాప్తంగా తెచ్చిపెట్టిన కీర్తి ప్రతిష్టలు అమూల్యమైనవి.
Festivals a.o:
Zlín International Film Festival for Children and Youth
LUCAS International Children’s Film FEstival – Audience Award
– శివ లక్ష్మి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~