జోగిని

సన్నగా గొణిగింది. 

santhi prabodha

santhi prabodha

ఆమె గొణుగుడూ ఆమెనీ అర్థమయీ అర్థం కానట్లు … చూస్తూ…
కానీ ఆమె ఎవరో మాత్రం అర్థం అయినట్లుంది.
అందుకేనేమో, మళ్ళీ తానే చనువుగా ” పుస్తకం చదువుతూ మధ్య మధ్యలో అంత తీవ్ర ఆలోచన చేస్తున్నారేమిటో…” అన్నాడతను.

ఏమిటి అసలు ఇతను ఏమనుకొంటున్నాడు. ఆరేళ్ళ పిల్లాడి నుండి అరవై ఏళ్ళ ముసలి వాడి దగ్గర వరకూ ఆడపిల్ల అంటే అందరికీ లోకువే.. చులకనే… అవకాశం ఎలా దొరుకుతుందా… ఎప్పుడు దొరుకుతుందా… అని ఎదురు చూస్తుంటారు. అందుకు రంగం సిద్ధం చేసుకుంటారు. అనుకొని అతని కేసి ఒక చూపు విసిరింది.
చూడబోతే మర్యాదస్తుడిలా కన్పిస్తున్నాడు. చేతిలో పుస్తకాలు కూడా ఏం లేవు. బహుశ బోర్‌ కొట్టి పలుకరిస్తున్నాడేమో! తను తప్పుగా ఆలోచిస్తుందేమో… చూద్దాం అసలు సంగతేమిటో… తనలో తనే అనుకుంది.

”ఎక్కడి వరకూ…?” పుస్తకం మూస్తూ తానే అడిగింది.
”తిరుపతి, మరి మీరు?”
”తిరుపతికే” అమ్మో, అక్కడి వరకూ నా ప్రాణం తింటాడేమో… నన్ను చదువుకోనీకుండా అనుకుంటూనే జవాబిచ్చింది.
”ఎక్కడి నుండి వస్తున్నారు?”
”కరీంనగర్‌”
”కరీంనగర్‌! అయితే మీకు జోగోళ్ళ గురించి తెల్సా…?” జోగినీల గురించే ఆలోచిస్తున్న విద్య ఆత్రంగా అడిగింది.
”జోగోళ్ళా…” అతను ప్రశ్నార్థకంగా మొహం పెట్టి అంటూండగా.
కరీంనగర్‌ వైపు శివసతులు అని రాంబాయి చెప్పిన విషయం జ్ఞాపకం వచ్చి
”శివ సతులు ఉన్నారా?” మళ్ళీ అడిగింది.
”ఓహ్‌ వాళ్ళ గురించా… లేకేం…? వేమలవాడ గుడి దగ్గరంతా వాళ్ళే…
అయినా వాళ్ళ గురించి మీకెందుకంత ఆసక్తి?” ప్రశ్నించాడు అతను.
అదేం పట్టించుకోకుండా ” వాళ్ళ గురించి తెల్సా…?”
”ఆ… ఎందుకు తెలీదూ… వాళ్ళు దేవతకి అంకితమైన వాళ్ళు”
”ఊ.. ఇంకా ఏం తెల్సు వాళ్ళ గురించి?” చెప్పగలరా ప్లీజ్‌
”అలా అంకితం చేసే ఆచారం అనాదిగా వస్తున్న సంప్రదాయమే.
ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో కూడా ఇటువంటి పద్ధతి ఉంది”
”నిజమా…? ఇంకా మీకు తెల్సిన విషయాలన్నీ చెప్పండి ప్లీజ్‌ నాకు అన్నీ తెల్సుకోవాలని చాలా ఉత్సాహంగా ఉంది.”

కొద్ది క్షణాల క్రితం అతనంటే చిరాకు పడడం, ఎగతాళిగా, వ్యంగ్యంగా మాట్లాడిందన్న విషయం మరచిపోయి, ఎంతో కాలంగా తెల్సి ఉన్న వాళ్ళని బతిమాలుతూఅడుగుతూన్నట్లుగా మొహం పట్టి.

ఆమె మొహంలో కొత్త విషయాల్ని తెల్సుకోవాలన్న అభిలాష. ఆసిక్తి చూసి కావచ్చు. ఆమె ఉత్సాహాన్ని గమనించి కావచ్చు. లేక ఆమె ఎవరో తెలియడం వల్ల కావచ్చు. లేదా అతనిలోని ఉపాధ్యాయుడు కావచ్చు తనకు తెల్సిన విషయాలు చెప్పడం ఆరంభించాడు. ” దేవతలకు అంకితమైన ఆడపిల్లలు ప్రాపంచిక ఆకర్షణలకు లోను కాకుండా, తమ కాలాన్ని భగవంతుని సేవలో గడిపే దేవదాసీలు, బసివిలకు, భగవంతుని సేవే వారికి పరమార్థం. ఎన్నో శతాబ్దాల క్రితం ప్రారంభమైన ఆ సంప్రదాయం నేటికీ మనకు సజీవంగా కన్పిస్తోంది. రోమన్‌ కాధలిక్‌నన్స్‌, జైన భిక్కులు, హిందూ పీఠాలలో సన్యాసినులు ఈ కోవకు చెందిన వారే.

మీరు అడిగిన జోగినిలు కానీ, బసివిలు కానీ, మాతంగులు కానీ శివసతులు కానీ, దేవదాసీలు కానీ ఈ వ్యవస్థలోంచి వచ్చినవారే. ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో ఉన్నప్పటికీ వారు దైవ సన్నిధిలో గడుపుతూ దైవ కార్యాలలో పాల్గొనేవారు. అయితే కాల క్రమంలో ఎన్నో మార్పులు వచ్చాయి. సమాజంలో వచ్చే మార్పుల ప్రభావం వల్ల, నైతిక విలువలు పతనం కారణంగా ఈ జోగినీ వ్యవస్థ, దేవదాసీల వ్యవస్థ నీతి బాహ్యమైన స్థితికి దిగజారింది. గ్రామంలో పెద్దలు, ధనికులు, భూస్వాములు యవ్వనంలో ఉన్న ఆ యువతులను ఆకర్షించి, ప్రలోభపెట్టి తమ కామ వాంఛలు తీర్చుకునేవారు. మొదట్లో గుట్టు చప్పుడు కాకుండా సాగిన ఈ కామకలాపాలు క్రమక్రమంగా బహిర్గతం కావడం విచ్చలవిడి రూపం దాల్చడం, చివరకు కొందరు డబ్బున్న వాళ్ళు, అధికారం ఉన్న వాళ్ళు వీరిని చేరదీసి ఉంచుకుని ఇష్టమైతే వారికి ఆస్తులు కట్టబెట్టడం, వారిలో ఆకర్షణ తగ్గిపోగానే వారిని కాదనడం, వారికి ఆశ్రయం కరువు కావడంతో ఆకలి బాధనుండి తప్పించుకోవడం కోసం వీరు మరొకర్ని చూసుకోవడం ప్రారంభమైంది. వ్యభిచరించడం సాధారణమైంది. ఈ రోజుల్లో దైవ సాన్నిధ్యంలో గడిపే దేవదాసీలు మనకి కన్పిస్తారా..? సర్వ సాధారణంగా వీరంతా వ్యభిచార వృత్తిలో ఉన్నవారే. పెళ్ళి చేసుకోక పోవడమొక్కటే నాటికీ నేటికీ ఈ దేవదాసీ వ్యవస్థలో కన్పించే సామ్యం. మిగతా ఆశయాలతో, ఆచరణలో పూర్తిగా భిన్న రూపం దాల్చాయి.”

‘ఈ వ్యవస్థ ఇలా కొనసాగాల్సిందేనా..?, మధ్యలో ప్రశ్నించింది. అప్పటి వరకూ శ్రద్ధగా విన్న విద్య.
”సమాజంలో ఇటువంటి దుర్మార్గపు వ్యవస్థలు, దురాచారాలు వున్నప్పుడు అందరూ చూస్తూ ఊరుకోలేరు. ఎవరో ఒకరు వీటిని చూసి చలించి ఆ దురాచార నిర్మూలనకు కంకణం కట్టుకుంటారు. అటువంటి మానవతామూర్తుల కృషి ఫలితంగానే 1929లో ‘నాయిక’ బాలికల రక్షణ చట్టం (ఉత్తర భారత పర్వత ప్రాంతాలలో నివసించే వారి వ్యవస్థ) వచ్చింది. 1934లో ”బొంబాయి దేవదాసి చట్టం, 1940లో’ మదరాసు దేవదాసి చట్టం, మైసూరు దేవదాసీ చట్టాలు వచ్చాయి. 1947లో అసలు మొత్తం దేవదాసీ వ్యవస్థనే పూర్తిగా నిషేధిస్తూ చట్టం తెచ్చారు. ఆ తర్వాత దేశం మొత్తానికి వర్తించే ‘వ్యభిచార నిరోధక చట్టం ఏర్పాటైంది. 1988లో జోగిని, బసివి, దేవదాసీ నిర్మూలన చట్టం చేసింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.’

”మరి ఇన్ని చట్టాలు ఉన్నా ఈ వ్యవస్థలో జోగినీ ఆచారం, దేవదాసీ వ్యవస్థ ఇంకా ఎలా నిలబడగలిగింది..? ఎలా సజీవంగా ఉంది?” సమాజంలోని స్త్రీ పురుష తారతమ్య భావనలు, ఆర్థిక అసమానతలు, కుల మత ఛాందస భావాలు, తరిగిపోతున్న మానవతా విలువలు, పెరిగిపోతున్న స్వార్థ చింతనలు, చట్టాలలో ఉన్న లొసుగులూ, లోపాలు, రోజు రోజుకీ హెచ్చవుతున్న యాంత్రికత అన్నీ కూడా కావచ్చు” చక్కగా విశ్లేషించారాయన.
ఎదుటి వ్యక్తి ఎవరో తెల్సుకోకుండానే ఎన్నో విషయాలు తెల్సుకున్న విద్యకి అప్పుడు కలిగింది సందేహం. ఆయన ఎవరు..? ఏం చేస్తారు? ఇన్ని విషయాలు ఎలా తెలిసాయి? వెంటనే ఆ విషయమే ఆయన్ని అడిగింది.
దానికాయన నవ్వుతూ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నానని చెప్పి మరో ప్రశ్నకు తావు లేకుండా లేచి ఒళ్ళు విరుచుకుని ఆవలిస్తూ పై బెర్తుపై ఉన్నతని కేసి చూస్తూ నిద్ర వస్తోంది ‘ ఆ దిండు ఇటివ్వు’. అని అడుగుతోంటే అప్పుడు చూసింది విద్య పై బెర్తు అతనికేసి. ఇరవై అయిదో, ఇరవై ఆరో ఏళ్ళుండవచ్చు. ఛామన ఛాయలో ఉన్న ఆ కోల మొఖంలో మిలమిల మెరిసే ఆ చిన్ని కళ్ళలో ఏదో వింత ఆకర్షణ.

మళ్ళీ చూస్తే బాగుండదేమోనని మనసులో అనుకుంటూనే అతనివైపే చూసింది మళ్ళీ. ఇండియా టుడే చేతిలో ఉన్నా ఏదో ఆలోచిస్తూ ఉన్నట్లుగా అతను. ఇంతసేపూ తమ ఎదురుగా ఉన్న వారినీ, పక్క వారినీ గమనించకుండా ఎంత సుదీర్ఘంగా మాట్లాడుకున్నారు. ఆ పెద్దాయనా, తనూ… అనుకొని మనసులో నవ్వుకుంది. తనూ నిద్రకుపక్రమిస్తూ ఆ పెద్దాయనకి గుడ్‌నైట్‌ చెప్పింది. మిగతా బెర్తులలో వారు అప్పటికే బిస్తరు వేసేశారు. పై బెర్తుకేసి చూసింది. అతను పుస్తకం పట్టుకొనే ఉన్నాడు. లైటు వెలుగుతోంటే తనకు నిద్ర పట్టదు. ఎలా అనుకొని అతనికేసి చూస్తూ.

”ఇఫ్‌ యు డోంట్‌ మైండ్‌, లైట్‌ ఆఫ్‌ చేయొచ్చా” అడిగింది. ఏమనుకున్నారో అతను. ఓ క్షణం అలా కన్నార్పకుండా చూసి పుస్తకం మూసేసి పక్కనే ఉన్న బ్యాగ్‌లో పెట్టేశాడు. థ్యాంక్స్‌ చెప్పి తనూ నిద్రకుపక్రమించింది విద్య.
యూనివర్శిటీ హాస్టల్‌కి వెళ్ళేసరికి కవిత రూంలో లేదు. లాబ్‌కి వెళ్ళిందట. రూం లాక్‌ చేసి ఉంది. ఆ బ్లాక్‌లో దాదాపు అన్ని రూమ్స్‌కి తాళం కప్పలే వేలాడుతున్నాయి. అందుకే ఉమెన్‌ స్టడీస్‌లో రీసెర్చ్‌ చేస్తున్న వలసమ్మ రూమ్‌కి దారితీసింది. విద్య వెళ్ళేసరికి వలసమ్మ రూంలోనే ఉంది. లగేజ్‌ అక్కడే ఉంచి తను ప్రెష్‌ అయి వలసమ్మతోపాటు బ్రేక్‌ఫాస్టు ముగించుకుంది.

వలసమ్మ మళయాళీ అమ్మాయి. ఉమెన్‌ డెవలప్‌మెంట్‌ స్టడీస్‌ డిపార్ట్‌మెంట్‌ కేరళలోని ఏ యూనివర్శిటీల్లో లేదంట. అందుకే ఈ యూనివర్శిటీలో చేరి” ”పురాణేతిహాసాలలో మహిళ. ఆధునిక మహిళ” అన్న అంశంపై తులనాత్మక పరిశోధనచేస్తోంది.కాలేజీకి బయలుదేరబోతూ ”నీ పరిశోధన ఎంత వరకూ వచ్చింది. నీ పరిశోధనలో  ఎప్పుడైనా ఎక్కడైనా జోగినీలు, దేవదాసీలు ప్రస్తావన వచ్చిందా?, అడిగింది విద్య

”జోగినీ… ఆ పేరు నేనెప్పుడూ వినలేదు. కానీ దేవదాసీ గురించి విన్నాను. పురాణేతిహాసాలలో దేవదాసీల ప్రస్తావన కన్పిస్తుంది. సూత్రకాలంలో అంటే మనువు కాలంలోనూ, మధ్యయుగంలోను దేవదాసీ వ్యవస్థ ఉన్నట్లు చారిత్రక ఆధారాలు నిరూపిస్తున్నాయి. ప్రాచీన, మధ్యయుగాలలో కరువు వస్తే, పిల్లల్ని పోషించలేక తమ పిల్లల్ని దేవాలయ అధికారులకు అమ్మేవారట. వారిలో అందంగా ఉన్నవారిని దేవదాసీలుగా నియమించేవారట. పిల్లలు లేని వాళ్ళు తమకు కలిగే మొదటి ఆడ సంతానాన్ని దేవాలయానికి ఇస్తామని మొక్కులు మొక్కేవారట. మూఢ విశ్వాసాలు ఉన్న వాళ్ళు తమ ఆడపిల్ల దురదృష్టవంతురాలనీ, నక్షత్ర బలం సరిగ్గా లేదనీ భావించినప్పుడు దేవాలయాలకు అంకితం ఇచ్చేవారట. గజనీ మహ్మదు దండయాత్రలు చేసిన సోమనాధ దేవాలయంలో 500 మంది దేవదాసీలు ఉన్నట్లు, వారు ఉదయం, సాయంత్రం దైవ సన్నిధిలో తమ కళలను ప్రదర్శించే వారనీ తెలుస్తోంది. దేవదాసీలు దేవునికి అలంకరణ చేస్తున్నట్లూ, నైవేద్యం పెడ్తున్నట్లూ పాటలు పాడుతున్నట్లూ మధ్యయుగంలోని వర్ణనలు చెప్తున్నాయి. వీరిని కళావంతులు అని కూడా అంటారట. సంగీతం, నాట్యం వంటి కళలు నేర్చుకుని దేవాలయాల్లో సేవ చేయడం వారి వృత్తి.

‘మనిషి సూర్యలోకాన్ని చేరుకోవడానికి ఉత్తమ మార్గం కొందరు బాలికలను దేవాలయానికి అంకితం చేయడం అని భవిష్యపురాణం అంటుందని శ్రీమతి జె. వరలక్ష్మి గారు రాసిన ”యుగయుగాల్లో భారతీయ మహిళలో చదివాను.
అంతేకాదు., 1,2 శతాబ్దాల మధ్యకాలంలో రాశాడనే వాత్సాయన కామ సూత్రాల్లో ‘గణిక’ లేదా విలాసవతి’ కన్పిస్తుంది. ఆమె 64 కళల్లో విదుషీమణి, ఆమె తన ఇంట్లో నృత్యం, సంగీతం వంటి కళలతో పురుషులను రంజింపచేసేది. కవులు, గాయకులూ, సంపన్నులైన వ్యాపారస్థులూ, అత్యున్నత పదవులలో ఉన్నవారూ వారి ఇంటికి ఆహ్వానితులట. రాజులు సైతం వీరి పట్ల సుముఖులేనట. వీరి ప్రవర్తన ఆనాటి సమాజంలో నిందార్హమూ, నీతి బాహ్యమూ కాదట. ఆమె విలాసాన్ని పంచిపెట్టే వస్తువు. చాణుక్యుడు ఈ స్త్రీలను గూఢచారులుగా వాడుకున్నట్లు తెలుస్తోంది. వీరు అందచందాలతో హావభావాలతో అలరింపచేసే కళాప్రియులు. రాజ దర్బారులో సంగీతం, నృత్యం ప్రదర్శించి రాజుగార్కి మనోల్లాసం కల్పించే ఈ విలాసినులు పరదేశీయులు వచ్చినపుడు వీరి మనోభావాలను, ఆలోచనలను పసిగట్టి, కనిపెట్టి ఎప్పటికప్పుడు రాజుగారికి వార్తలు అందజేసేవారట. హుయాన్‌త్సాంగ్‌ భారత దేశానికి వచ్చే నాటికి దేవదాసీలు దేశమంతా ఉన్నారట. క్రీస్తుపూర్వం 3వ శతాబ్దానికి చెందిన ‘జోగిమర’ శాసనంలోనూ దేవదాసీల ప్రస్తావన ఉందట.

తనకు దేవదాసీల గురించి తెల్సిన విషయాలన్నీ చక్కగా చెప్పింది వలసమ్మ. ఆమె చెప్పిన దాంట్లో ఎక్కడా జోగిని, బసివి, శివసతి, మాతంగి, మాతమ్మ, పార్వతి వంటి పదాలు దొర్లలేదు. అంటే ఆ కాలంలో ఉండే దేవాలయ కాంతలే దేవదాసీలు అయి ఉంటారనీ వారే వేశ్యా వృత్తిలో ఉండి ఉంటారు. లేకపోతే వేశ్యలు వేరుగా ఉండేవారా…? వలసమ్మ చెప్పింది ఎంతో శ్రద్ధగా విన్న విద్య మనసులో ఎన్నెన్నో సందేహాలు. అయితే జోగినిల గురించి వలసమ్మకి ఏమీ తెలియదని మాత్రం అర్థం అయింది. ‘వేమన్న వాదం’లో చదివినట్లు శైవ మతం ప్రచారంలోకి వచ్చాకే బసివి, జోగినీలు వచ్చారన్నమాట అనుకుని, మరోసారి వలసమ్మతో నిర్ధారించుకుందామని” వలసమ్మా మరి జోగిని గురించి…” అంటూండగానే వలసమ్మ అందుకుని ” నేనెప్పుడూ జోగిని గురించి వినలేదు. విద్యా” మళ్ళీ తనే నీకేమన్నా వారి గురించి అయిడియా ఉందా” అని అడిగింది.
తనకు తెల్సింది టూకీగా చెప్పింది. విద్య

”ఓ వాళ్ళా… జోగినీలంటే…! బహుశ మొన్న భారతి మేడమ్‌ చెప్పిన మాతమ్మల జీవితంలాగే ఉంది. జోగినీలది కూడానూ…” ‘భారతీ మేడమ్‌ మాతమ్మల గురించి చెప్పారా..? ఏమనీ?” ఆత్రుతగా విద్య. ”చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో మాతమ్మలు ఉన్నారట. చిత్తూరు జిల్లాలో వాళ్ళని సర్వే చేసే బాధ్యత మన మేడం తీసుకున్నారట. త్వరలో మీ జూనియర్స్‌ మొదలు పెట్టబోతున్నారు” వలసమ్మ ” అవునా…! అయితే సర్వే ఎందుకట? నీకు తెల్సా….? ” మాతమ్మలకు ప్రభుత్వం ఉచితంగా భూమి ఇస్తుందట. ఇంకా కొన్ని ప్రభుత్వ పథకాలను వారి అభివృద్ధి కోసం ఇస్తుందట. నీకు తెలియనిది ఏముంది…? ఏదైనా ప్రయోజనాలు సమకూరతాయనుకుంటే తప్పుడు సమాచారం రావచ్చు. ప్రభుత్వం డైరెక్టుగా సర్వే చేస్తే ఉన్న ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని జిల్లా కలెక్టర్‌ గారు మన మేడంని అప్రోచ్‌ అయ్యారట. మనం చేస్తే స్టూడెంట్స్‌ కదా… ఏదో స్టడీ కోసం సర్వే చేస్తున్నారు అనుకుంటారు ఎవరైనా… అందుకే ఆయన ఈ స్ట్రాటెజీ తీసుకున్నారనీ మేడమ్‌ చెప్పారు. అలా కబుర్లు చెప్పుకుంటూ, చర్చించుకుంటూ టైం మర్చిపోయారు ఇద్దరూ…

పదకొండు గంటలు కావస్తోంది. గబగబ లేచి హ్యూమానిటీస్‌ బిల్డింగ్‌ వైపు నడక సాగించారు.
కంప్యూటర్‌ లాబ్‌లోంచి వస్తూన్న కవిత, విద్యని చూసి గబగబ హ్యూమానిటీస్‌ బిల్డింగ్‌ వైపు వచ్చి ”హాయ్‌” అంటూ విద్యని కౌగిలించుకుంది. మిత్రులు, పరిచయస్తులు పలకరింపులు, ఒకరికొకరు బాగోగులు కలబోసుకుంటూ, కులాసా కబుర్లయ్యాక నేను మేడంని కలిసి వస్తాను. లంచ్‌ టైంకి అని కవితతో చెప్పి వలసమ్మతో కల్సి లోపలికి వెళ్ళిపోయింది విద్య. ”నమేస్తే మేడం” అంటూ రెండు చేతులూ జోడించి విష్‌ చేసిన విద్యను చూసి ఆవిడ లేచి షేక్‌హ్యాండ్‌ ఇస్తూ ”హార్టీ కంగ్రాచ్యులేషన్స్‌” అంటూ అభినందించారు.
”ఏమ్మా… బాగాన్నారా” అంటూ పలకరించారు. ప్రొఫెసర్‌ భారతి ఎంత ఫ్రీగా, ఫ్రెండ్లీగా మాట్లాడినా, ఆవిడంటే గౌరవం, అభిమానం ఉన్నా, ఆవిడ నిక్కచ్చితనం వల్లనో మరెందువల్లనో గానీ కాస్త భయంగా కూడా ఉంది విద్యకి.
అలా నిలబడే ఉన్న విద్యని చూసి ”కూర్చోమ్మా” అనడంతో ఆవిడ ఎదురుగా కూర్చొంది.
వలసమ్మ వచ్చి ప్రొఫెసర్‌ భారతికి విష్‌ చేసి లైబ్రరీకి వెళ్ళిపోయింది.

”విద్యా ఏం చేయాలనుకుంటున్నావ్‌? నీ భవిష్యత్‌ ప్రణాళిక ఏమిటి..? ప్రశ్నించారావిడ. ”ఇంట్లో వాళ్ళు పెళ్ళి చేస్తామంటున్నారనీ, తనకి మాత్రం పిహెచ్‌డి చేయాలని ఉందనీ చెప్పింది. ”మంచి సంబంధం కుదిరితే పెళ్ళి చేసేస్తాం అంతవరకూ చదువుకో, కావాలంటే పెళ్ళి తర్వాత కంటిన్యూ చేయి అంటున్నారు” నాన్న. మొదలు చేరిపోతే ఆ తర్వాత చూసుకోవచ్చని సరే అన్నాను. అంటూ ఇంట్లో జరిగిన విషయాలు చెప్పింది విద్య.
”ఆడపిల్ల వేసే ప్రతి అడుగూ ఎంతో సంఘర్షిస్తూ వేస్తోంది. ఆ సంఘర్షణలోంచి అద్భుతమైన శక్తుల్ని రూపొందించుకుంటోంది. గరళం చిలికితే అమృతం వచ్చినట్లుగా నెక్ట్స్‌మంత్‌ నోటిఫికేషన్‌ వస్తుంది. అప్లై చేయి. నీ దృష్టిలో టాపిక్‌ ఏమైనా ఉందా?” అడిగారు ప్రొఫెసర్‌ భారతి. ”ఉంది మేడం. పరీక్షలు అయిన తర్వాత మా రూమ్మేట్‌ కవితతో కల్సి వాళ్ళ ఊరు వెళ్ళాను. అక్కడ జోగినీలను చూశాను. వాళ్ళను కలిశాను. వారి దయనీయ పరిస్థితి గురించి తెల్సుకున్నాను. మానవజాతి ఎంతో అభివృధ్ధి చెందింది. ఇరవయ్యవ శతాబ్దిలో మహిళలు ఎంతో ప్రగతిని సాధించారు. ప్రధానులుగా, మంత్రులుగా, కలెక్టర్లుగా, రాయబారులుగా, రోదసీ యాత్రికులుగా అన్ని రంగాలలో మహిళ కాలు పెట్టిందని ఎంతో గొప్పగా మనం చెప్పుకుంటున్నాం. కానీ ఈ సామాజిక వ్యవస్థలోని ఆర్థిక వ్యత్యాసాలు, కులాల కుత్సితాలు, ఆచారం – సంప్రదాయం పేరుతో జరుగుతున్న దోపిడీ, పురుషాహంకారంతో అణచివేత కళ్ళారా చూశాను మేడం. తరతరాలుగా ఆ ఆచారం అలా కొనసాగుతూనే ఉంది. కనీసం వాళ్ళు ఇది తప్పు అని భావించడం లేదు. దైవ నిర్ణయం, తమ తలరాత అంటూ సరిపుచ్చుకుంటున్నారు” అంది ఉద్వేగంగా.

”గుడ్‌… మంచి సబ్జక్ట్‌” ”మేడం, చిత్తూరు జిల్లాలో ఉన్న మాతమ్మలు నిజామాబాద్‌ జిల్లాలోని జోగినిలు ఒకటేనా?” తన సందేహం వెలిబుచ్చింది. ”ఒకటేనమ్మా, ప్రాంతాన్ని బట్టి పేర్లు మారుతున్నాయి. సంస్కృతీ ఆచార వ్యవహారాల్లో కొద్ది తేడాలు ఉన్నట్లే ఈ విధానంలోనూ” అంటూ ఆవిడ టైం చూసుకున్నారు. 12 గంటలు కావస్తుంది. ”ఉంటున్నావ్‌ కదా విద్యా” అంటూ లేచారు. ఆవిడ క్లాస్‌కి వెళ్ళడానికి. ఏ విషయాన్నయినా చక్కగా విశ్లేషించి మాట్లాడుతుందనో, బాగా చదువుతుందనో, తెలివిగలదనో గానీ విద్య అంటే ఆవిడకి ప్రత్యేకమైన అభిమానం. అందుకు విద్య క్లాస్‌మేట్స్‌ లీల, సురేఖ ఎప్పుడూ కొద్దిగా జెలసీ ఫీలయ్యేవాళ్ళు. డిపార్టుమెంటులో మిగతా లెక్చరర్స్‌ని పలకరించి లంచ్‌ టైం అవుతుండగా లైబ్రరీలో ఉన్న వలసమ్మతో లంచ్‌కి బయలుదేరింది.
”వలసమ్మా నీవు ఏమనుకోకపోతే ఓ మాట” ”ఆ … ఏంటో చెప్పు తల్లీ… నేనేం అనుకోనులే…” సరదాగా అంది వలసమ్మ ”లంచ్‌టైంకి కవిత దగ్గరికి వస్తానని మాటిచ్చాను. అక్కడికి వెళ్దామా..! ”ఓస్‌… ఇంతేనా…? ఇంకా ఏమిటో అనుకున్నాను. అయినా నీవు అడగడమూ నేను కాదనడమూనా… ఆజ్ఞాపించు తల్లీ” నాటక ఫక్కీలో అంది. ఇద్దరూ నవ్వుకుని కవిత వుంటున్న కిన్నెర బ్లాక్‌ వైపు పడిచారు.

ఈ బ్లాక్‌లోనే.. సెకండ్‌ ఫ్లోర్‌లో.. తన రూమ్‌లోంచి చూస్తే… దూరంగా కొండ కన్పిస్తూ… ఎంత అద్భుతమైన దృశ్యాలో… వాటిని అలా చూస్తూ… రెండేళ్ళు గడిపేసింది. మనసులో అనుకొని. ”వలసమ్మా.. అటుచూడు ఆ కిటికీ లోంచి చూస్తూ ఉంటే అసలు టైమే తెలీదు. అదిగో… ఆ దృశ్యం చూడు, కొండ దిగువ భాగానికి ముసుగు వేస్తున్న మేఘం. ఆ పైకి చూడు మబ్బుతునకలతో మేలి ముసుగు వేసుకోవడానికి ఇబ్బంది పడ్తూ… మధ్యలోంచి మెలికలు తిరుగుతూ.. భక్తులు గోవింద నామ స్మరణతో ముందుకు కదిలే బస్సులు… ఈ దృశ్యమే నాకు అంత్యంత అద్భుతంగా కన్పిస్తుంది. సాయంకాలం పడమటి దిక్కున అస్తమించే సూరీడు… అరుణారుణ కిరణాలు…
ఉత్తరం దిక్కున ఉన్న కొండపై వాలి హాయిగా సేదతీర్చుకుంటున్న ఆ మేఘం పై పడి మెరిసే వెండి జలతారులు….
అలా చూస్తూ ఉంటే అసలు టైం తెలీదు. నాకెంతో ఇష్టమైన దృశ్యమో అది. స్కాలర్స్‌ బ్లాక్‌లోంచి ఇంత అందమైన దృశ్యాలు అగుపించవు కదూ…?” అడిగింది వలసమ్మని.

ఎప్పుడూ పుస్తకాల్లో మునిగితేలే వలసమ్మ విద్య చెప్పిన అద్భుతమైన ఆ ప్రకృతిని ఎప్పుడూ ఆస్వాదించలేదు. అందుకు ప్రయత్నించనూ లేదు. అసలు ఆమె ఎప్పుడూ గమనించనేలేదు. అంతలో పక్క రూంలోంచి కవిత ”నేనొచ్చేశా… మీరెంత సేపయిందీ వచ్చి” అంటూ లోనికి వచ్చింది. అంతా భోజనానికి కదిలారు. ”కవితా రేపు కొండకెళ్దాం. ముందుగానే వార్డెన్‌కి చెప్పి పర్మిషన్‌ లెటర్‌ తీసుకో” అంది విద్య భోజనం చేస్తూ. ”కొండకా… నేనూ వస్తాను” వలసమ్మ అంతలో కవిత ఫ్రెండ్‌ సరస్వతి వచ్చి ‘నడిచి వెళ్ళేట్లయితే నేనూ వస్తాను’ అంది.
”నడిచా ఎక్కడం కష్టమేమో…” వలసమ్మ ”నడిచేవెళ్దాం ఆ సరదా వేరు…” అంది విద్య సరేనంటే సరే అనుకున్నారు. కాలినడక ప్రయాణానికి. ఆ రాత్రే గేటు దగ్గర ఉన్న మునిరత్నంకి ఆటోతో ఉదయం నాలుగున్నరకి సిద్ధంగా ఉండమని చెప్పారు. ఉదయం 5 గంటలకల్లా నలుగురూ అలిపిరి చేరుకున్నారు ఆటోలో. అక్కడి నుండి కాలి నడక. దారి పొడువునా రేకులతో వేసిన షెల్టర్‌. శోభారాజ్‌, బాలకృష్ణ ప్రసాద్‌లు ఆలపించిన అన్నమయ్య కీర్తనలు ఓలలాడిస్తుండగా, ఉత్సాహంగా నడక సాగింది. మెట్లదారిన వెళ్ళడం ఇది వాళ్ళకి మొదటి సారి ఏమీ కాదు. అయినా అలా వెళ్ళడం అదో సరదా.

వీళ్ళ కంటే ముందే బయలు దేరినట్లున్నారు ఆ నలుగురూ. శ్రీకాకుళం ప్రాంతం వారిలా ఉన్నారు. తెగ ఆయాసపడిపోతూ ఎక్కుతున్నారు. వీళ్ళను చూసి మైదానం ప్రాంతం వాళ్ళయి ఉంటారు అన్నారు. ఆ మాటను ఎవరూ పట్టించుకోలేదు. గుజరాతీ జంట అనుకుంటా, వీళ్ళని దాటాలని ప్రయత్నిస్తున్నారు. అది గమనించిన వీళ్ళు మరింత ఉత్సాహంతో ముందుకు కదిలారు. కాలినడకన ఎక్కుతూ అలసిపోయి ఆపసోపాలు పడేవాళ్ళ కోసం గ్లూకోజు పాకెట్స్‌, బిస్కెట్లు, మజ్జిగ, పలు రకాల పండ్లు అమ్ముతున్నారు. అక్కడక్కడా మంచి నీటి టాప్స్‌, రెండు చోట్ల కూల్‌డ్రింక్స్‌ స్టాల్స్‌. వలసమ్మకి కాస్త అలసట అన్పించిందేమో ఆగి రెండు గ్లూకోజ్‌ పౌడర్‌ పాకెట్స్‌ కొంది. ఒకటి విప్పి అందరి నోట్లో తలా కాస్త వేసింది. అది అసలు గ్లూకోజ్‌లానే లేదు. కల్తీది. వెంటనే గుర్తు పట్టింది విద్య.

”తిరుపతిలో అంతా మోసమే. మన అవసరాన్ని ఆసరాగా చేసుకుని నకిలీవి అమ్ముతారు. వీళ్ళ మీద కంప్లైంట్‌ చేయాల్సిందే” అంది సరస్వతి. అప్పటికే పాతిక మెట్లు పైకి వచ్చేశారు. ఆ కల్తీ పాకెట్‌ తీసుకున్న దగ్గర నుండి.
”వలసమ్మ గారూ… అది అవతల పారేయండి. కల్దీది తింటే లేనిపోని ప్రాబ్లమ్స్‌ వస్తే కష్టం అని, ”కంప్లైంట్‌ ఎవరికిస్తావే పద… పద…” అంటూ సరస్వతిని ముందుకు నడిపించింది కవిత. ”సరస్వతి అనేది నిజమేనే కవితా, ఆ ప్యాకెట్‌ ఉంచుదాం’ అంటూ విసిరి వేయబోతున్న వలసమ్మ చేతిలోంచి తీసుకుని తన బ్యాగ్‌లో వేసుకుంది విద్య కంప్లైంట్‌ ఇద్దామని. మధ్యలో డీర్‌ పార్క్‌ దగ్గర కాస్త ఆగి ముందుకు నడిచారు. పాలనురుగులా కదిలిపోయే నీరూ… ఇటు కుడివైపు చూస్తే అంతు తెలియని అగాధం… ఆ జలపాతం ఎదుట నిల్చోవడం… అదో అద్భుతమైన అనుభవం” అంది విద్య. ” మనం చూడాలేగానీ ప్రతీరోజూ ఆకాశాన కొత్తగా సూర్యోదయం అవుతున్నట్లూ….

(ఇంకా వుంది)

– శాంతి ప్రబోధ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
38
ధారావాహికలు, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో