ఓయినం

Gowri jajula ”ఏమైనా ఒక ఆడిపోరి ఎన్క గిట్ల జరగొద్దన్నా” అన్నది అంజమ్మ.
”ఏం జేస్తం మా కిస్మత్తుల గిట్ల జరిగేదుంది జర్గింది మీద దేవుడున్నడు” అని గుడి దిక్కు తిరిగి దండం పెట్టి చంద్రయ్య దిక్కుచూస్తూ, ”ఓరి చెంద్రి జెర మనమందరం మల్లా ఒకసారి పంచాయతీకి కూకోవాలెరా” అని అంటుంటే, ”అన్ని ఫైసలాలు అయిపాయె యింకెందుకు” అన్నాడు ఆశ్చర్యంగా.
”ఏంలే జెర మాట్లాడేదుంది కూకున్నప్పుడు సెప్తగా” అంటుంటే చంద్రయ్య అర్థంకానట్టు చూశాడు కాని సత్తయ్య మాట తీసిపుచ్చలేక ”సరే” అంటూ తలాడించాడు.
”ఇంక జరిగే ఫైసలా ఏమీ లేదు ఏ ఇంగ నడ్వుండ్రి” అంటూ సత్తయ్య ముందు నడిచేసరికి ఒకరెనక ఒకరు ప్రొద్దుటి నుంచి జరుగుతున్న విషయాలనే చర్చించుకుంటూ ముందుకు కదిలారు.
జరిగిన విషయాలు కూతురి నుంచి తెలుసుకున్న ఎల్లమ్మ, సాలయ్యల గుండె చెరువైంది.
ఆ రోజు సాయంత్రం సత్తయ్యను నిలదీస్తూ ”ఏమన్నా ఎందుల్ల ఏమెరగని నా బిడ్డను మీ సేతుల్ల్ల పెడ్తె దాని కిస్మత్తు బాగలేక నెత్తిమీద నీడపాయె మీ పాలోళ్ళు దాని జిందగీతోటి ఆడుకుంటుంటే ఎట్ల ఊకున్నవు” అంటూ ఎల్లమ్మ సోకాలు పెడ్తుంటే, ”ఇంగో సెల్లె గిట్లని తెలిస్తే నేనూ ఊకుంటుంటినారా గదిగాక నీ బిడ్డ తప్పు మస్తుంది. ముందుగాళ్ళ నా కంట్ల పడింది. కాదంటలే గప్పుడు నాపక్కల పాములెక్క పాలోడుండు నేను ఆని ముందల నా కోడల్ని ఎలెస్తే ఆనికి అలుసైతదని గీసుద్దిని నా కడుపుల దాసుకున్న కాని ఆడు ఇసంపురుగు లెక్క గీ పిల్లను దబాయిస్తా రూపాలు గుంజుతుంటే నాకు సెప్పిందా అడ్గు అడ్గు” అని సూటిగన్నడు.
ఎల్లమ్మ కూతుర్ని సత్తయ్య ముందే నిలదీస్తూ ”ఏమే గిట్ల జర్గువట్టెనని మీ అత్తమామలకు సెప్పకపోతివి, మాకు సెప్పకపోతివి, ఆఖరికి నువ్వు ఏమైదామనుకున్నవే” అంటూ తలబాదుకుంటుంటే, నీలమ్మ ఒక్కమాట మాట్లాడకుండా మోకాళ్ళమీద తలపెట్టుకుని మౌనంగా కన్నీరు కార్చింది.
ఏది నిజమో, ఏది అబద్దమో కాలమే నిర్ణయిస్తుందని అందరూ భావించినా నీలమ్మపై అందరికి అపనమ్మకం ఏర్పడింది, తల్లిదండ్రులు కూడా తప్పుబట్టేసరికి ఆమె లోలోన కుంగిపోతూ అవమానభారంతో తలదించుకుంది.
అందరు రాజు, ఎల్లయ్యలనూ విలువలేనట్లు చూస్తుంటే, మొగోడు ఎన్ని తప్పులు చేసినా చెల్లుబాటు అవుతాయనే ధీమాతో అందరి ముందు దర్జాగా తిరగసాగారు.
నీలమ్మ ఇంట్లోంచి బయటకు రావటంలేదు. ఏ మాట మాట్లాడినా కొడుకులతోనే ఇష్టం ఉంటే యింత ఉడకేసుకుని తినటం లేకుంటే పస్తులుండటం నిత్యకృత్యమైపోయింది.
సత్తయ్య పోచమ్మ ఏమాట మాట్లాడినా ఆ మాట వాగులు వంకలు తిరిగి తిరిగి నీలమ్మ దగ్గరే వచ్చి ఆగుతూ ఈసడించినట్లు మాట్లాడుతుంటే దేవుడి మీద భారం వేసింది.
జరుగుతున్న పరిణామాలన్ని ఏ దారిలోకి పోయినా చివరికి తనదారికే వచ్చినట్లుండే సరికి సత్తయ్య మహదానంద పడిపోయాడు. రాజు, ఎల్లయ్యలు దార్లో ఎదురుపడితే పెద్దరికంగా మాట్లాడుతూ ”టయిము వచ్చినప్పుడు మీతో మాట్లాడతానురా” అంటూ తప్పించుకున్నాడు.
ఎల్లయ్య సత్తయ్యను నిలదీయాలనుకున్నా నీలమ్మ దగ్గర రాజు విషయం చెప్పి డబ్బులు లాగిన విషయం ఆందరి ముందు బట్టబయలు కావటం ముఖ్యంగా సత్తయ్యకు తెలియటంతో అతనిలో వణుకు పుట్టించింది.
ఇలా ముగ్గురికీ ముగ్గురు తేలుకుట్టిన దొంగల్లా ఉండేసరికి.

సత్తయ్య పంచాయతీ పెట్టాలనుకున్న రోజు రానేవచ్చింది.
ఈసారి పంచాయతీలో నీలమ్మ తల్లిదండ్రులున్నారు కాని రాజు, ఎల్లయ్యల కుటుంబాలులేవు.
”గియ్యాల గీ పంచాయతీకి ఎందుకు పిల్సిననో మీకెవలకు సమజ్‌గాలే దన్కుంట పోయిన పంచాయతీలోనే గీ సుద్ది చెబ్దామన్కున్న గాని లడాయి సురువాయే గాలొల్లిల గీ సుద్ది మాట్లాడ్తే మంచిగుండదని గప్పుడు ఊకున్న” అంటూ అందరి దిక్కుచూస్తూ ”నేను ఒక సుద్ది సోంచాంచిన మీరేమంటరు” అనేసరికి అందరు తెల్లముఖాలు వేస్తు, ”అసలు సుద్దేందో సెప్పక మీరేమంటరంటే ఎట్లన్న” అన్నడు చంద్రయ్య.
”ఏం లేరా నీలమ్మ దిక్కెల్లి మాట్లాడుతున్నా ఆడా ఈ పోల్లను ఒక్కత్తిని జేసిపోయిండు ఉన్న యిద్దరు పోరగాండ్లతోని ఎట్లనో బత్కుదామంటే ఇగ జూస్తుండ్రుగా గాపిల్ల కిస్మత్తుల ఎట్ల జర్గవట్టె గంద్కునే గీ పోల్ల సుద్ది ఎట్ల జేద్దాం” అన్నాడు బాధగా.
సత్తయ్య ఉద్దేశం తెలియక నీలమ్మ తల్లిదండ్రులు తికమకపడ్తుంటే మళ్ళీ ఏ గొడవ ముందరికి తెస్తాడో అని నీలమ్మకు కాళ్ళు వణికాయి.
సత్తయ్య మళ్ళీ ఏదో పథకం రచించాడని అక్కడున్న అందరూ గ్రహించారు.
”అయితే గిప్పుడు నువ్వేమంటవన్న” అని రంగయ్య కొంచెం కోపంగానే అడిగేసరికి, ”నేననేదేముందిరా పెద్దోళ్ళు మీరిద్దరే సెప్పాలే” అంటూ పెద్దోళ్ళు అనే మాటను వత్తిపలికాడు.
”పెద్దోళ్లుకాదూ సిన్నోళ్ళు కాదూ అసలు ఈ పిల్లను నువ్వేం సేయ్యాలన్కుంటు న్నవో నువ్వే సెప్పరాదే” అని అసహనంగా చంద్రయ్య అడుగుతుంటే, సాలయ్యను చూస్తూ ”ఏం బావా మీ బిడ్డ సుద్ది ఏంజేద్దాం” అని చంద్రయ్య మాటను పట్టించుకోకుండనే అడిగాడు.
”కని మీ సేతుల పెట్టినం ఇంగ ఏం జేస్తరో మీరే సెయ్యిండ్రి” అంటూ నిట్టూర్చాడు.
”గిప్పుడు నాబిడ్డ దిక్కెల్లి మల్లా పంచాయతీ ఎందుకుపెడ్తివన్నా” అంటూ ఎల్లమ్మ ప్రశ్నించేసరికి, ఆమె దిక్కుచూస్తూ ”కోట్లాట కతమైంది కాని జిందగీ కతం కాలే నీ బిడ్డ నా ఒయిసు పిల్ల సుట్టు అందరం ఉండంగనే గిట్ల జర్గువట్టే రేపటికల్లా మంచాయే చెడాయే, దీనికి ఎవలు జిమ్మెదారో సెప్పండ్రి నీ బిడ్డ ఎన్క ఊకే కావలుంటమా ఏంది రేపటికల్లా సెడు జర్గితే మమ్మల్ని నిలదీస్తారు మా పాలోల్ల ముందు మా ఇజ్జతు లేకుండా పోతది మొన్న జర్గిన అర్కతులకే శరంతో సగం సస్తున్నం గంద్కనే మీ పిల్ల ఫైసలా మీరే జేసుకోండ్రి అంటూ భర్తచెప్పిన మాటలని వల్లెవేసింది పోచమ్మ.
”అయితే నా పిల్లను ఏం జెయ్యాలనుకుంటుండ్రు” అన్నది ఎల్లమ్మ, పోచమ్మ మాటల్లోని ఆంతర్యం ఆమెకు బోధపడలేదు.
”ఏం జేసేది ఏందమ్మ నా యింట్ల ఇగముందు గిట్లాంటి అర్కతులు జర్గితే మంచి గుండదూ నాకా ఆడిపోరలుండ్రు రేపటికల్లా ఆళ్ళకు ఎట్ల సంబంధాలొస్తయి జెప్పండ్రి గంద్కనే మీ పిల్లను మీయింటికి కోనవోయి మల్లా పెండ్లి జేయుండ్రి గంతేగాని మమ్మల్ని పరేషాన్‌ జేయకుండ్రి” అంటూ మనస్సులోని మాట బయటపెట్టాడు.
సత్తయ్య మాటవినేసరికి నీలమ్మ గుండెల్లో రాయిపడింది. అసలు ఇతని ఉద్దేశం ఏంది అని అందరూ నిర్వేరపోయారు.
”ఏందన్నా ఏం మాట్లాడుతున్నవు నా బిడ్డకు పెండ్లిసేస్తే ఈ పోరగాండ్లు ఏమి గావాలనుకున్నవు” అంటూ మనుమండ్లను ముందుకులాగి అందరి ముందు నిలబెట్టింది ఎల్లమ్మ.
”మొగిలిగాన్ని పెంచినట్ల ఈళ్ళను పెంచుతా, ఈ పోరగాండ్లేగా నీ బిడ్డకు అడ్డం” అనేంతలో, నీలమ్మ కొడుకుల దగ్గరకు పరుగునొచ్చి ”అమ్మొ నా కొడుకులను నేనిడ్వనమ్మా” అని ఏడుస్తూ వాళ్ళను వాటేసుకుంది. కొద్దిసేపటి వరకు అందరూ నీలమ్మను, పిల్లలను చూస్తుండిపోయారు.
”సూసినవుగా ఈ కత సూసినవుగా. నా బిడ్డకు పెండ్లి సోకుంటే, ఎప్పుడో పిల్లలనూ ఈ ఇల్లునిడిసి దెంకపోతుంటే, మా బిడ్డకు ఏరే పెండ్లి జెయ్యాలని మాకుంటే నా అల్లుని సావుదినాలు కాంగానే ఆనాడే తీస్కపోదు” అని ఎల్లమ్మ వలవల ఏడ్చింది.
”మల్లా గిప్పుడు నీబిడ్డజేసే అర్కతులు జూస్తివిగా పతేకం నీ బిడ్డకు ఎవడు కావలుండాలే జెప్పమ్మ ఎవడు కావలుండాలే” అంటూ సత్తయ్య సవాలు విసిరేసరికి…
సాలయ్య చప్పున లేచి ”నా బిడ్డ తప్పు చెయ్యలేదని గుడిలకు జోర్రినంక గూడా యింకా నువ్వు తప్పుబడ్తున్నవా బావా, ఆనాడే నీ పాలోళ్ళనూ ఎందుకు గుడిల జొర్రిపియ్యక పోతివి, అంటే ఆళ్ళు నీ సిన్నాయన కొడుకులనేగా ఇడ నా బిడ్డొక్కతే పరాయిదైంది. నా బిడ్డ నెత్తిమీద నీడ పోంగనే ఒక్కొక్కడు ఒక్కొక్క తీర్గ దాని జిందగీతోటి ఆడుకుంటుండ్రు. యింగ గట్ల సాగనియ్య, నీ బిడ్డకు ఎవడు కావలుంటడు, ఎవడు కావలుంటడు అంటున్నవ్‌గ దానికి జవాబు నేను పెద్దలందరి ముందు జెప్తున్న నా బిడ్డ దగ్గర నేనే కావలుంటా. నా బిడ్డను నా కండ్లపెట్టుకుని సూసుకుంట, నా కడ్పుల దాసుకుంట. నేనూ నా పెండ్లాము నా బిడ్డకాడనే ఉండి యిడికేనే కొల్వులకు పోతాం. నా బిడ్డ కాడుండి మేము తిని తాగుతున్నమని మీరనుకోకండ్రి. మా యిద్దరికి సర్కారు కొల్వులున్నయి. నా బిడ్డను మేము సుఖంగా సూసుకుంటం. ఇచ్చినోనికి సచ్చిందాకా సంసారం చేయాలని నా బిడ్డను ఈడికి ఇచ్చినా నా బిడ్డ సచ్చినదాకా ఈడికెని పోదు. మేము సచ్చేదాకా మా బిడ్డను ఇడువము గిది మీకు సమ్మతమేనా దీనికి గూడా యింకేమన్నా ఏరే అర్థాలు తీస్తరా” అనేసరికి సత్తయ్య నీళ్ళు నమిలి నేలచూపులు చూస్తూ ”ఇదేంది దీన్ని మెల్లగా పంపి పొలం కబ్జా చేసుకుందామంటే కత ఉల్టా అయిందేంది” అని ఆలోచనలోపడ్డాడు.
సత్తయ్య కుతంత్రానికి అడ్డుకట్ట వెయ్యటానికి ఇదే అదను అనుకొని ”ఏమే సత్తెన్నా బావా గట్లంటూంటే ఏం మాట్లాడవేమే ఆళ్ళ బిడ్డ కాడ ఆళ్ళు ఉంటమంటుండ్రు, ఉండనియ్యరాదే” అని చంద్రయ్య అన్నాడు.
”అవునన్న తల్లిదండ్రుల నీడుంటే పొల్లమీద ఎవళ్ళు నజరెయ్యరు గట్లగాక తల్లిపిల్లలను ఇడదీసుడేందే” అని రంగయ్య సమర్థించేసరికి సత్తయ్య మనస్సు కుతకుతలాడింది.
”నా యింటి సుద్దులంటే యి లమిడి కొడుకులకీ మస్తు పట్టింపు” అనుకుంటూ ”ఇగో అన్ని సుద్దులల్ల ఫైసలాలు మీఏరా ఎవలెట్ల బత్కితే నాదేం పోయింది, గిది మంచి గిది సెడు, గిట్ల బత్కుండ్రి అని అన్నా రేపేదన్నా మంచిసెడు అయితే మీరిద్దరే బరాయించుండ్రి కానీ ఒక సుద్ది తేటతెల్లం జేస్తున్న నీలమ్మ నా యింట్లకెని ఎల్లి ఏరే ఇంట్ల ఉండాలని జెప్పండ్రి ఇగ ఇల్లకు నాకు ఈడికే ఖతం” అంటూ అక్కడ్నించి లేచిపోయాడు.
సత్తయ్య కుట్ర నీలమ్మ తల్లిదండ్రులకీ అర్ధం అయింది. ఏవిధంగానైనా బిడ్డను పక్కకు తొలగించాలనుకునే అతనే తన బిడ్డకు ప్రథమ శత్రువని గ్రహించారు. అతని బారినుండి బిడ్డను కాపాడటానికి జీవితాంతం అండగా నిలవాలనుకున్నారు.
ఎల్లమ్మ, సాలయ్యలు మకాం నీలమ్మ దగ్గరకు మారింది. రోజు ఒక బస్సెక్కి పోయేటోళ్ళు ఇప్పుడు రెండు బస్సులు మారి కొల్వులకు పోతున్నారు. సముద్రంలో పడి కొట్టుకుపోతున్న నీలమ్మ జీవితానికి ఏకంగా నావే దొరికినట్లయింది. తల్లిదండ్రులు తన ఇల్లుచేరేసరికి కొండంత అండ ఆమె ఎదుట నిలిచి ఉక్కిరిబిక్కిరి చేసింది.
క క క
కాలం గడుస్తోంది.
అందరి దృష్టి పంటల దిక్కు మళ్ళింది.
నీలమ్మ తన పొలాన్ని దున్నించి నాట్లు ఏయించింది.
తల్లిదండ్రుల అండదండలు, ప్రోత్సాహం ఆమెలో ఎక్కడలేని ఉత్సాహాన్ని నింపాయి. పిల్లలిద్దరిని స్కూల్లో చేర్పించింది.
తల్లిదండ్రుల ఉద్యోగస్తులు కావడంతో ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయాయి. ఎల్లమ్మ కూతుర్ని కూలీకి వెళ్లటం మాన్పించింది. ఇంట్లో తిండి బట్టలలో మార్పువచ్చింది.
ఆ ఏడు కూడా పంట విస్తారంగా పండడంలో మంచి లాభాలు వచ్చాయి. ఓ శుభముహూర్తాన కొత్త ఇల్లుకట్టుకుని అందులోకి మారింది.
నీలమ్మ ఇల్లు ఖాళీచేయటంతో యింటికి పట్టిన పీడ విరగడైందని శాపనార్థాలు పోచమ్మ పెడితే… తాను అనుకున్న పని జరుగలేదని ఎల్లయ్యను, రాజును చేరదీసి డబ్బులు మళ్ళీ ఎగేశాడు సత్తయ్య.
నీలమ్మ దగ్గర అన్యాయంగా డబ్బులు గుంజానని నిలదీయనందుకు అదే మహాప్రసాదం అనుకున్నాడు ఎల్లయ్య.
రాజుకి పుట్టిన పిల్లలు పుట్టినట్లు పురిట్లోనే పోతుంటే పాలోళ్ళ మధ్య గొడవలు జరిగినప్పుడల్లా నీలమ్మ ఉసురుతగిలి అందర్ని గడ్డకు పెట్టుకుంటుండని చుట్టుపక్కలవాళ్లు గుసగుసలాడ్తుంటే అతను తలెత్తలేకపోతున్నాడు.
కానీ అందరూ నీలమ్మతో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. కాలచక్రం వెనుతిరగక ముందుకు పరుగులు పెడ్తుంటే అదనుకోసం ఎదురుచూస్తున్నాడు సత్తయ్య.
తన కండ్లముందే నీలమ్మ తల్లిదండ్రుల అండదండలతో పొలాన్ని సాగుచేస్తూ పంటను పండించడం ఆ లాభాలతో ఇల్లు కట్టుకోవటాన్ని అతను భరించలేక పోతున్నాడు.
ముగ్గురు నీలమ్మ దిక్కు కన్నెత్తి చూడటానికే జంకుతున్నారు కానీ చాటుమాటుగా మళ్ళీ మాటలు కలిశాయి. వాళ్ళుచేసిన పనికి ప్రతిఫలం ముట్టజెప్తానని మళ్ళీ మళ్ళీ వాగ్దానం చేశాడు సత్తయ్య.
మెషీను కోటీలు దగ్గర పొలాలకు నీళ్ళు పెట్టుకునే విషయంలో అడపాదడపా పాలోళ్ళు సతాయిస్తున్నా నీలమ్మ వాటిని పట్టించుకోక తన పని తాను చేసుకుపోసాగింది. పాలోళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు ఆమెను ఆదరాభిమానాలతో చూస్తుంటే ముందు జరిగిన పరిస్థితుల ప్రభావంవల్ల నీలమ్మ ఎవ్వరి దగ్గరకు వెళ్ళక యింటికీ పొలానికే పరిమితం అయింది. తల్లిదండ్రులు ఇక్కడ ఉండడంతో అక్కాచెల్లెలు నీలమ్మ దగ్గరకే రాసాగారు. వాళ్ళు వచ్చినప్పుడల్లా చీరసారెలు పెట్టి పొలంలో పండిన బియ్యం ఇచ్చి పంపేది.
ఇదే సమయంలో సుద్దబాయి, గాడిబాయి, చింతబాయి బాయిల మీద రియల్‌ ఎస్టేట్‌ వాళ్ళ కన్నుపడింది. హైవేలో ఉన్న ఆ స్థలాన్ని తక్కువ ధరకు కొని ప్లాట్లుగా విభజిస్తే అధిక లాభాలకు ప్లాట్లను అమ్ముకోవచ్చని ముందుగా సుద్దబాయి మీద కన్నేసి క్రమక్రమంగా ఒక్కొక్క బాయిని కొంటుంటే, ఈ విషయం సత్తయ్య చెవిలో పడింది. ఒక్కసారిగా జన్మలో చూడని డబ్బు కళ్ళపడ్తుందని తెల్సి అతని ఆశలు మళ్ళీ చిగురించాయి. ఇన్ని రోజులుగా ఎదురు చూస్తున్న అవకాశం చేజిక్కినట్లయి మహదానంద పడిపోయాడు.
ఎల్లయ్యను తీసుకుని రియల్‌ఎస్టేట్‌ వాళ్ళను కల్సి తన పొలం అమ్ముతామని చెప్పేసరికి మొత్తం వివరాలతో పాటు భాగస్వాములనూ తీసుకురమ్మన్నారు వాళ్ళు.
తాను పొలం అమ్మే విషయం అందరికి చెప్పటానికి వేపచెట్టుకింద అందర్నీ సమావేశపరిచాడు సత్తయ్య.
”ఇగోరా నా అజం ఇరుకొస్తుంది. యింగ పొలం సాగుజేసే సత్తువ నాకాడ లేదు గదిగాక మన పక్కబాయిలన్ని సూసేటోళ్ళు కొంటుండ్రు గంద్కని నా పొలాన్ని ఆళ్ళకు అమ్మాలనుకుంటున్నా” అని అనేసరికి, ”నీ పొలం నువ్వు అమ్ముకుంటే మాకేందన్నా అమ్ముకో” అన్నాడు చంద్రయ్య.
”నా పొలాన్ని ఏనాటికన్నా నేనే అమ్ముకుంట గా సుద్ది నాకెర్క నాకెవళ్ళు దాని దిక్కెల్లి జెప్పొద్దు గాని నా పొలం కంటే ముందుల మీ పొలాలున్నాయి గదయినంకనే నా పొలం మొగిలిగాని పొలం వస్తయి ఎర్కేనా. మల్లా మీ పొలం అడ్డం ఉంటే నా పొలం ఎట్లా కొంటరు జెర సెప్పుండ్రి అన్నాడు అసలు విషయానికి వస్తూ.
ఆ మాట వినంగానే అందరి గుండెల్లో రాయి పడింది. ”అమ్మో ఈడు మా పొలాలకే ఎసరుపెడ్తుండు” అనుకున్నారు.
”మల్ల మమ్మల్ని ఏం జెయ్యమంటవే” అన్నడు రంగయ్య.
”ఏం లేదురా నా పొలం అమ్మకానికి జెర మీరే తోవ జూపెట్టుండ్రి” అంటూ తెలివిగా నిర్ణయాన్ని వాళ్ళకే వదిలేశాడు.
వెంటనే ఎల్లయ్య, రాజులు కూడా ”మా పొలాలనూ మేము అమ్ముకుంటం” అనేసరికి మిగతావాళ్ళు అటుఇటు ఊగిసలాడారు.
కాని సత్తయ్య అన్నంత పనిచేస్తాడని వాళ్ళు భయపడ్డారు.
అతను పొలం అమ్మకం పెట్టడంలోని మతలబు ఏమిటో వాళ్ళకు స్పష్టంగా తెలిసుండడం వల్ల ”కోతలైనంక మల్లా అందరం కూకోని మాట్లాడ్తమే” అని మాటదాటేశారు.
అక్కడే ఓ మూలన కూర్చున్న నీలమ్మ నిర్ణయాన్ని ఎవరు అడగలేదు.
పొలం అమ్ముడుపోతుందని తెల్సి ఆ రాత్రి నీలమ్మకు నిద్రపట్టలేదు. మర్నాడు తుమ్మచెట్టుకింద కూర్చుని మొగులయ్య తానూ కల్సి తవ్విన నీటి కాలువను చదును చేసిన పొలాలను చూస్తూ కూచుంది.
అప్పుడప్పుడే ఆకుపచ్చని రంగు నుంచి బంగరు వర్ణంలోకి మారుతున్న వరి గొలుసులను రెండు చేతుల మధ్య బంధించి గుండెలకు హత్తుకుంది.
పొలం పనులు చేస్తూ ప్రాణాలు విడిచిన భర్త జ్ఞాపకాలు ఇంకా సజీవంగా ఉంటే ఈ నేల ఈ గాలిలో భర్త జ్ఞాపకాలు అనుక్షణం తోడు ఉంటే ఈ స్థలంలో ఇంకొన్నాళ్ళయితే ఈ కమనీయ దృశ్యాలను భూస్థాపితం చేసి వాటిమీద కంకర భవనాలు లేస్తాయనే ఊహను ఆమె భరించలేకపోతోంది.
ఆరోజు సాయంత్రం తల్లితో అదే మాట అంది.
”అమ్మా పొలం అమ్ముతారంటనే” అంటూ తలకు చేతులు పెట్టుకుంటుంటే
”ఎవరన్నరు బిడ్డ గీ సుద్ది ఉట్టిగన్నరేమో తియ్యి” అని అంటుంటే, ”ఉట్టిగ కాదమ్మా నిన్న సత్తిమామా మావోళ్ళందనీ పిల్సిజెప్పిండంట” అంటూ అక్కడ మాట్లాడిన మాటలన్నీ చెప్పేసరికి, ”మల్లా నిన్ను అడ్గలేదా బిడ్డా” అన్నది.
”నన్ను ఆడికి పిల్సిండ్రుగాని కరెంటు బిల్లు కట్టుడుకాడ నేను యాదికుంట, భూమిశిస్తు కట్టుడు కాడ నేను యాదికొస్త కాని పొలం అమ్ముడు కాడ నేనెంద్కు యాదికొస్తనే” అంటుంటే ఆమె గొంతు జీరవోయింది. ”మల్లా నువ్వేమంటవు బిడ్డా” అంటూ తల్లి అడిగేసరికి, ”నేనేమంటనే” అంటూలేచి పొంగుతున్న అన్నం గిన్నెమీద మూతతీసి కలిపి గంజివంపి అన్నం దమ్ముకేసి పొయ్యిలో మండుతున్న మంటను చూస్తుండిపోయింది. నీలమ్మ ఆలోచనలో పడిందని గ్రహించిన ఎల్లమ్మ కూతురి దగ్గరకు వచ్చి తలపై చెయ్యి వేసి ప్రేమగా నిమురుతూ ”బిడ్డా అందరి పొలం అమ్ముడయినప్పుడే నీపొలం పోతది గిప్పటినుంచే ఎందుకు ఫికరు జేస్తున్నవు” అని ధైర్యం చెప్పింది.
పంటకోతలై యింటికి వచ్చేసరికి యింకొన్నాళ్ళు గడిచాయి. అప్పటివరకు ఆ యిండ్ల మధ్య పొలం అమ్మకం సమస్య చర్చనీయాంశమైంది. మొత్తం పొలం అమ్ముదాం అని కొందరు అమ్మొద్దని కొందరు రెండు వైపుల పంతం పట్టి కూర్చుంటే ”మొత్తం పొలంలో సగం వాటా తమదేనని దాన్ని నేను తెగనమ్ముతానంటూ” సత్తయ్య పంతం పట్టాడు.
సత్తెన్న పొలం అమ్మితే అటు ఇండ్లు ఇటు ఇండ్లు నడుమ పొలాన్ని ఎలా సాగు చేయాలో చంద్రయ్య రంగయ్యలకు అర్థం కాలేదు.
పొలాల మధ్య నుంచే దారి ఇడువాలని సత్తయ్య మరింత వత్తిడి తెచ్చాడు. అతను రెండు వైపుల పదునైన కత్తని అందరికి తెల్సు ఇటు నుంచి పని జరగకుంటే అటు నుంచి నరుక్కొస్తాడని ఊహిస్తున్నది నిజమయ్యె సరికి సత్తయ్యకే దారి విడువాల్సిన దిగువ పొలాన్ని అమ్మకానికి విడిచి ఎగువ పొలాన్ని అమ్మకుండా పిల్లల కోసం అయినా ఉంచుకుందామనుకున్నారు.
కింది పొలాన్ని అమ్మడానికే నిశ్చయించుకున్నారు. కానీ నీలమ్మ నిర్ణయాన్ని ఎవరు అడుగలే.
తమ పొలాల్లో ఈసారే చివరి పంటని అందరూ వడ్లను గిర్నికేసి యింటికి తెచ్చుకుంటే నీలమ్మ పొలంలో పండిన పంటనంతా తెగనమ్మింది.
ఇంట్లోకి ఒక్క సంచి మిగల్చకుండా పంటంతా అమ్మేసరికి ఎల్లమ్మ సాలయ్య ఆశ్చర్యపడ్డారు. కానీ నీలమ్మ ఒక్క మాటా మాట్లాడకుండా డబ్బులన్ని జాగ్రత్త చేసింది.
పొలం అమ్మకాలకి అందరి అనుమతి లభించడంతో సత్తయ్య అందర్ని వెంటేసుకుని రియలెస్టేట్‌ వాళ్ళ దగ్గరకు పోయి పొలం కాయితాలను వాళ్ళ ముందల వేశాడు.
రియలెస్టేట్‌ వాళ్ళు భూమి పత్రాల్ని చూస్తు అక్కడ వచ్చిన వాళ్ళల్లో ఆయా వాటాదార్లనూ పేరుపేరునా పిల్చి పక్కన నిల్పి పెట్టాకే చివరగా మొగులయ్య వాటాకు హక్కుదార్లు ఎవరంటూ అడిగేసరికి సత్తయ్య ముందుకు వచ్చి ”ఆడు నాతమ్ముని కొడుకు, ఆడు సచ్చిపదేళ్ళయింది అని పెండ్లాము పిల్లలుండ్రు ఆడిదాన్ని గీడికెందుకని తీస్కరాలే అంటుంటే.
”ఎవరైతే ఏందయ్య మొగులయ్య వాటాకు హక్కుదారు ఆమె పిల్లలయినప్పుడు ఆమె రావాల్సిందే” అనేసరికి, ”అర్రే పోయి నీలమ్మను పిల్సుకరాపోరా” అంటూ రంగయ్యను ఇంటికి పంపాడు.
రంగయ్య నీలమ్మ ఇంటికి పోతే అక్కడ నీలమ్మ లేదని తెల్సి పొలం దిక్కు పరుగెత్తేసరికి తుమ్మ చెట్టుకింద దిగులుగా కూర్చొని పొలం దిక్కుచూస్తున్న నీలమ్మ దగ్గరకుపోయి ”నీలమ్మ నిన్ను సత్తెన్న పిల్సుక రమ్మంటుండురా” అని చెబుతుంటే, ”ఏడికి మామా” అంటూ దిగులుగా అడిగింది.
”గదే సూసేటోళ్ళు పొలం కొంటుండ్రుగా గాళ్ళ ఆఫీసుకాడ్కి నిన్ను పిల్సుకు రమ్మండ్రు” అనేసరికి, నీలమ్మ గుడ్ల నీళ్ళు కుక్కుకుంటూ ”నేను పొలాన్ని అమ్మును మామా, నేను ఆడ్కి రాను” అంటూ రంగయ్యను తిప్పి పంపించింది.
వాళ్ళ కోసమే ఎదురు చూస్తున్న సత్తయ్య తిరిగొస్తున్న రంగయ్య దగ్గరకు ఎదురిల్లి ”ఏమైందిరా ఒక్కడివే వస్తున్నవేంది” అంటు ఆత్రంగా ప్రశ్నించేసరికి, ”నీలమ్మ ఈడికి రానన్నదన్నా ఆమె పొలం అమ్మదంట” అని చెపుతుంటే ఆ మాటలు విన్న రియలెస్టేట్‌ వాళ్ళు ”ఇదిగో సత్తయ్య మీ పొలం అందరి పొత్తుల ఉన్నది. ఎవరెవరి పేర్లున్నయొ వాళ్ళందరు వచ్చి సంతకం చేస్తేనే మేము మీ పొలాన్ని తీసుకుంటం లేకుంటే వద్దు” అంటూ పొలం కాగితాలు తిరిగి ఇచ్చేసరికి, సత్తయ్య పట్టరాని కోపంతో పొలం దిక్కు ఉరికే సరికి అతను నీలమ్మను ఏం చేస్తాడోనని అందరు అతని వెనకాలే పరుగులు తీశారు.
పొలం దగ్గరకు పోయేసరికి నీలమ్మ అక్కడ లేదు.
సత్తయ్య మరింత కోపంతో ”దీనియమ్మ ఇది ఎన్ని సుట్లు తిప్పుతదో దీని సంగతి ఇయ్యల అటోఇటో తేల్చెయ్యాలే” అంటూ రంకెలేస్తూ నీలమ్మ యింటికి గబగబా పోయి వాకిట్లో నిల్చొని, ”నీలి… ఓ నీలి…” అంటూ అరిచినట్లుగా పిలిచాడు. అతని పిలుపు విని ఎల్లమ్మ గబగబా ఇంట్లోంచి ”వస్తూ ఏందన్నా కోడల్ని పట్టుకుని గట్ల పిలుస్తున్నవు” అంటూ నిలదీసింది.
”పిలుస్త గట్లనే పిలుస్తా మేమంతా పొలం అమ్మబోతే నీ బిడ్డ తానీషా లెక్క ఇంట్ల కూకుందేంది వచ్చి దస్తకత్తు జెయ్యమను” అనేసరికి. ఇంట్లోంచి వచ్చిన నీలమ్మ ”సెయ్య నేనూ దస్తకత్తు జెయ్య నా పొలం నేనూ అమ్మ” అంటూ ధీమాగా పలికింది.
”ఏందే కొమ్ములు మొలిసినట్లు మాట్లాడుతున్నవు ఎక్వతక్వ మాట్లాడక దస్తకత్తు జేస్తవ లేదా” అంటూ నీలమ్మను కొట్టబోయే సరికి ఎల్లమ్మ అడ్డుకుని ”ఏందన్నా ఏంది ఆడపిల్ల మీద గిట్ల జబర్‌దస్తిజేస్తున్న వేంది” అంటూ అడ్డం నిలవడింది.
”ఇంగో మామా నేనూ నా పొలం అమ్మ దల్సుకోలే మామొళ్ళ పొలం అంటే నీ పొలంకూ అడ్డం ఉన్నదని ఆళ్ళను మజుబూరి జేస్తివి అట్లైనా ఆళ్ళు సగం పొలం మిగుల్సుకుండ్రు గానీ నా పొలం మీ అందరి పొలాల కంటే ఆఖర్న ఉంది గంద్కనే నా పాలం జికిరి మీకు ఒద్దు” అని ఖచ్చితంగా చెప్పేసరికి. సత్తయ్య తల తెగి రోట్లో పడ్డట్టయ్యింది.
లే… ”పొలం” పూరగా అమ్మలే” అని సత్తయ్య అంటే, ”నా పానం పోయినా పొలం అమ్మ ఎవల తోటి అడ్గిపిస్తవో అడ్గిపియ్యి నీ పొలంకు నేను అడ్డం వస్తే నన్ను అడ్గు” అంటూ భీష్మించేసరికి, సత్తయ్యకు ఎటూ పాలు పోలే.
నీలమ్మ సంతకం చేస్తే సగం డబ్బులు గుట్టుచప్పుడు కాకుండా తీసుకుని నీలమ్మకు మొండిచెయ్యి చూపిద్దం అంటే కత అడ్డం తిర్గి అతని ఆశల మీద చప్పున నీళ్ళు చల్లినట్లయింది. ”ఇంగో మా పొలాలన్ని అమ్ముతుంటే ఇంగ బాయి కూడా పోతది ఇంగ పొలం పండియ్య నీళ్ళోడకేని వస్తయి” అంటూ భయపెట్ట చూశాడు.
నీలమ్మ చిన్నగా నవ్వి ”ఇంగో మామా ఇంతకూ ముందుగాళ్ళ కూడా నువ్వు పొలం లకెని నీళ్ళియ్యకుంటే ఏదో ఒక లెక్క కష్టపడి కాలువ తవ్వుకున్నట్లనే నా పొలంలనే నీళ్ళు నేను ఎట్లన్న తెచ్చుకుంట అంటు అతని మాటను తిప్పికొట్టింది.
సాయంత్రం వరకూ వాదోపవాదాలు కొనసాగాయి కానీ నీలమ్మ తన పంతం వీడలేదు. ఇంక చివరాఖరిగా ”ఇంగో మామా నాపొలం ఆఖర్న ఉన్నది మీ పొలాలకు నా పొలం అడ్డుకాదు బాయిలకిని నీళ్ళు గూడా నేను అడ్గుతలేను నా పొలాన్ని నేను అలాగ రిజిష్టరు సేసుకున్నాక మీ పొలాలను మీరు అమ్ముకోండ్రి గది మీ మర్జి గట్ల లేదంటరా టౌనుకు పోయి నా తప్పేందో మీ తప్పేందో తెలుసుకుందాం” అనే సరికి అందరు అవాక్కయ్యారు.
ఎక్కడ వేటు పడాలో సత్తయ్యకు అక్కడే వేటు పడిందని చంద్రయ్య రంగయ్యలు సంతోషించారు.
అదే రోజు రాత్రి ఎల్లయ్య తల మీద రుమాలు కప్పకుని అటు ఇటూ చూస్తూ సత్తయ్య యింటిలోకి పోంగానే అతను దీర్ఘాలోచనలో వుండుడు చూసి, ”అన్నా ఏందన్నా ఏమి సోంచాంచుతున్నవే” అంటుంటే, ‘ఇప్పుడు ఏం జెయ్యలేరా అది దస్తకత్తు జెయ్యనన వట్టే ఇప్పుడెట్లరా” అంటూ చేతులు పట్టుకున్నాడు.
”అన్నా ఇప్పుడు దానికాడ శానా రకముంది అది సొంతంగా పొలం పట్టా జేయించుకుంటా సేండ్ల బోరింగు ఏయించుకుంటా అనే కాడ్కి వచ్చి, నాదేమన్నా తప్పంటే టౌన్ల తేల్సుకుందా అనే కాడ్కి వచ్చిందంటే రేపు పొలం రెండు భాగలైందని ఏర్కయితే టౌన్లకి పోయి కోర్టుకు ఎక్కదని ఏం గారంటి గట్ల గిన్న జేసిందనుకో నువ్వు నేనూ టౌన్ల పడటం కాయం. గిన్ని దినాలు చంద్రిగాన్ని, రంగన్ని మనం భయపట్టిచ్చినం గాని కోర్టులకీ పోయినంక కుట్రజేసి పొలం పంచుకున్ననని కావలనే మమ్మల్ని యిరికిచ్చిండు అని సాచ్చం జెప్పిండ్రన్కొ ఇంగ మనం టౌన్ల పడి సీకులు లెక్కపెట్టాల్సి వస్తది.
గంద్కని ఇంగ ఆ పొలం మీద ఆస ఇడ్సివెట్టు మన పొలాలు మనం అమ్ముకుందాం గట్ల కాదంటవా ఇంగనీ ఇష్టం నువ్వు ఎట్లాన్నజేసుకో నీ మర్జి నేనైతే పక్కకు జర్గుతున్న” అని ఎల్లయ్య వెళ్ళిపోయేసరికి సత్తెయ్య రెక్కలు తెగిన పక్షిలా డీలా పడ్డాడు.
వారం పది రోజుల తర్జన భర్జనల తర్వాత అందరు రిజిష్టరు ఆఫీసుకు పోయి నీలమ్మ పేరు మీద రెండు ఎకరాలు, చంద్రయ్య, రంగయ్యల పేర్న అమ్మగా మిగుల్చుకున్న పొలాలను విడివిడిగా రిజిష్టరు చేయించుకుంటుంటే సాకక్షులుగా మిగతావారు సంతకాలు చేశాక మిగతా పొలం అమ్మకం విషయంలో తనకెటువంటి అభ్యంతరం లేదంటూ నీలమ్మ సంతకం చేసింది.
రిజిస్టరు కాంగ మిగిలిన పొలాన్ని సత్తయ్య తెగనమ్మేస్తే నీలమ్మ, చంద్రయ్య, రంగయ్యలు ఎవరి పొలాల్లో వాళ్ళు సొంతగ బోర్లు వేసుకుని వ్యవసాయం చేయటం మొదలు పెట్టారు. నీలమ్మ తన పొలంలో పన్లను చేస్తూ
”ఎన్నెలమ్మ ఓ ఎన్నెలమ్మ
సల్లని చూపుల జాబిల్లమ్మ
నీలి మబ్బుల్లో మెల్లంగా
కదిలి పోయే ఎన్నెలమ్మ ||ఎ||
అమాస చీకట్లో
మినుకు మినుకు ఆకిట్లో
పున్నామి లోగిల్లో
పుట్టెనమ్న మా ఎన్నెలమ్మ ||ఎ||

సుక్కలల్లో నీవు సక్కంగా
ఒదిగి పోయే ఎన్నెలమ్మ
తుమ్మకాయల గజ్జె కట్టి
ఆడి పాడే ఎన్నెలమ్మ ||ఎ||

ఆటలల్లో నీవు మురిపెంగా
పెరిగి పోయే ఎన్నెలమ్మ
పాటలల్లో నీవు సక్కంగా
కోకిలయ్యే ఎన్నెలమ్మ ||ఎ||

పంట సేన్లల్లో పచ్చంగా
మెరిసి పోయే ఎన్నెలమ్మ
వడ్ల కుప్పల్ల బంగారంగా
తలుక్కుమనే ఎన్నెలమ్మ ||ఎ||

నీళ్ళ అద్దంలో నీకు నువ్వే
నవ్వుకునే ఎన్నెలమ్మ
సూరీడునే బొట్టు చేసి
దిద్దుకునే ఎన్నెలమ్మ ||ఎ||

పసి బిడ్డను తొట్టెన్లేసి
జోలపాడే ఎన్నెలమ్మ
పెనిమిటింట్లో పొద్దుగా
ముద్దుగుండె ఎన్నెలమ్మ ||ఎ||

పొయ్యి పక్కన ఒత్తుగా
ఆసరగుండే ఎన్నెలమ్మ
కూరటికెల కూరగా
ఉడికిపోయే ఎన్నెలమ్మ ||ఎ||
ఆడతనమే నీ బతుక్కి
శాపమాయెనె ఎన్నెలమ్మ
ముద్దమందార మంటి
నీ బతుకే మోడువారెనే ఎన్నెలమ్మ ||ఎ||

ఇనుప కాళ్ళకింద గడ్డిగా
అణిగి పోతివా ఎన్నెలమ్మ
కాముళ్ళ చేతుల్ల
కర్కషంగా బలికాబోతివా ఎన్నెలమ్మ ||ఎ||

వద్దమ్మ వద్దమ్మ ఈ బతుకు
నిద్దర లేవమ్మ ఎన్నెలమ్మ
అడివిని కాచిన నీ తెగువే
మోసాన్ని కాయదా ఎన్నెలమ్మ….
అంటూ తన బతుకు పాట మధురంగా పాడుకుంటు జీవిత పయనంలో ముందుకు సాగింది.

– జాజులగౌరి

(సమాప్తం)
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ధారావాహికలు, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో