గౌతమీగంగ

కాశీచయనుల-వేంకట-మహాలక్ష్మి-150x150నరసాపురం రాయపేటలో సుబ్బారావుగారు స్థలం కొని ఇల్లు కట్టుకున్నారు అప్పటికీ ఆ ఇంటి సమీపంలోనే మిస్సమ్మ ఘోషా ఆసుపత్రి అని ప్రజలు అభిమానంగా పిలుచుకునే అమెరికన్‌ మిషన్‌ ఆసుపత్రి వుండేది. 8వ నెలలో నొప్పులు వచ్చిన సీతను ఆ ఆసుపత్రిలో చేర్చి భర్తకు వర్తమానం చేసారు. సేవాభావంతో ఏర్పడ్డ ఆ ఆసుపత్రిలో వైద్యులూ, నర్సులూ ఎంతో ఆదరంగా అంకితభావంతో సేవలు అందించేవారు. చిన్న వయస్సులో ఈ దేశపు బాలికలు తల్లులు కావడం వారికి వింతగా వుండేది. ఈ దేశీయులు వట్టి అనాగరికులు అనుకొనేవారు వారు. ఆ ఆసుపత్రిలోనికి మగవారి ప్రవేశం నిషిద్ధం. సీతకు కష్టం మీద కాన్పు జరిగి బిడ్డ మరణించింది. ఆమెకు జ్వరం రాసాగింది. సుబ్బమ్మగారు ఇంటి పనులు చేసుకుంటూ కూతుర్ని చూచుకొంటున్నారు. ఆసుపత్రిలో రోగికి సేవలన్నీ నర్సులే చేస్తారు. ముఖం కడిగించడం, తల దువ్వడం, రోగికి దుస్తులు మార్చడం, ప్రక్క బట్టలు మార్చడం వంటి పనులు రోగి మంచం దిగనక్కర లేకుండా ఇటూ, అటూ కదుపుతూ ఉపాయంగా ఆదరంగా చేస్తున్న ఆ నర్సుల్ని చూచి సీత అబ్బుర పడేది. తాను కూడా వారిలా నేర్చుకొని సాటి వారికి సేవ చేయాలి అనుకునేది ఆ బాలిక. ఆమె దేహస్థితి తెలుసుకోవడానికి అల్లుడు అడిగే ప్రశ్నలకు అత్తగారు సరిjఅయిన సమాధానాలు చెప్పలేకపోయేది. జ్వరం ఎంత వుందో తెలుసుకోవడానికి శాస్త్రి అత్తగారికి ఒక థర్మామీటరు కొని ఇచ్చి అత్తగారి చేతికిచ్చి ఇది మీ అమ్మాయి నోట్లో పెట్టి 3 నిమిషాలు వుంచి తెండి అని చెప్పారు. ఆమె ఇంటికి తెచ్చిన థర్మామీటరు చూచి శాస్త్రి నిర్ఘాంతపోయారు. జరిగినది కొంత ఊహించిన ఆయన ‘అత్తగారు! ఇది మీ అమ్మాయి నోట్లో పెట్టి తెచ్చారా? అని అడిగారు అయ్యో నాయనా ఎందుకు పెట్టలేదు? మీరు చెప్పినట్లుగానే చేసి త్రోవలో కాలువ గట్టున జాగ్రత్తగా పెట్టి స్నానం చేసి వస్తున్నాను అంతే. బాలెంతరాల్ని ముట్టుకొని స్నానం చేయకుండా ఇంట్లో ఎలా కాలు పెట్టను అంది ఆమె. కాలువ ఒడ్డున ఎండలో వున్న థర్మామీటరు చూపిస్తున్న ఉష్ణోగ్రత అది. ఆసుపత్రి వారిచ్చే ఆహారం మన వారికి నచ్చదు. సొంఠి పొడి కారప్పొడి వేసి, మరి కాస్త ఆవు నెయ్యితో పెట్టిన ఆ రెండు ముద్దలూ బాలింతరాలికి తాపం కలిగించి జ్వరం పెరిగింది. మాటలలో సుబ్బమ్మ గారు తమ అల్లుడు వైద్యుడని చెప్పారు ఇకనేం మిస్సమ్మకి ఆ అనాగరిక వ్యక్తిని ఓ సారి చూసి అతడికి జ్ఞానబోధ చేయాలనే సదభిప్రాయం కలిగింది. వార్ని పిలిపించి। ఏమయ్యా మీ భారతీయులు ఇంత అజ్ఞానులేమిటీ? నువ్వు చూడబోతే ఈ పిల్లకన్నా 10,15 ఏళ్లు పెద్దవాడివిలా వున్నావు. ఇంత చిన్న పిల్లతో సంసారం చేసి బిడ్డల్ని కనడానికి నీకు సిగ్గుగా లేదా? అని ముక్క చివాట్లు పెట్టింది. శాస్త్రికి శిరచ్ఛేదం అయ్యింది. వీరికి తగిన సమాధానం తాను చెప్పకలడు. కాని తన భార్య వీరి వద్ద చికిత్స పొందుతూ వుంది. ఈ స్థితిలో ఆమెను కదల్చరాదు. ఆయన మౌనంగా అవమానాన్ని సహించారు. నెమ్మదించాక సీతను ఇంటికి తీసుకొని వచ్చారు. తెలిసిన వాళ్లు బంధువులూ ఒక్కొక్కరే పరామర్శకు రాసాగారు. సీతకు ఒంట్లో బాధ, నీరసం, తనకేం జరిగిందో ఆమెకు అర్థం కావడం లేదు. వచ్చిన వారి దగ్గర తల్లి శోకాలు పెడ్తూ వుంటే తానూ ఏడ్చేది. ఆ రోజుల్లో ఇంట్లో ఏదైనా అనర్థం జరిగితే ఎంతగా రోదిస్తే అంత ఆపేక్ష వున్నట్టు. కొందరు డబ్బు ఇచ్చి ఏడవడానికి మనుషుల్ని కుదుర్చుకుంటారని చెప్పుకొనేవారు. ఈ రోదనల వలన మరణించిన వారి ఆత్మ శాంతిస్తుందట. సీతకు సహజంగా శుభ్రత ఎక్కువ. తల దువ్వుకొని బొట్టు కాటుక చెరుగకుండా వుండేది ఎప్పుడూ. భర్త ఆమెకు మేలు జాతి చీరలే కాని కొనడు. ఆసుపత్రి వారు ఒలిచి తల్లి చేతిలో పెట్టిన నగలన్నీ ఇంటికి రాగానే తల్లిని పోరి ధరించింది. ఈ షోకులేమిటే అని తల్లి ఏడ్చేది. ఈ స్థితిలో సీత పెద్ద వదిన గారు ఆమెను ఆదుకుంది. ఏమిటండీ? మీకు మతి పోయిందా! అదే చిన్న పిల్ల దానికి రోంత పిల్లపుట్టి పోయిందని మీరు ఏడ్చి దాన్ని ఏడవమంటున్నారా? చాల్లే ఊరుకోండి. అని అత్తగార్ని మందలించింది ఆమె. రావే సీతా! నీకు అధ్యాత్మ రామాయణ కీర్తనలు నేర్పుతా అని సీతను పిలిచి దగ్గర కూర్చోపెట్టుకొని ఆమెకు కీర్తనలు నేర్పుతూ, తల దువ్వి జడ వేసి సేద తీర్చేది ఆమె.
ఆ రోజుల్లో గర్భిణీ స్త్రీలకు ప్రసవించే వరకూ ఏది కోరితే అది తినడానికి ఇచ్చేవారు. అజీర్ణం చేసినా సరే. కోరింది తినకపోతే చీపి పిల్లపుడుతుంది అని. పుట్టిన బిడ్డలకు బొడ్డు సరిగా కోయక ఆ బొడ్డులోంచి చీము వస్తే గర్భవతికి కోరిక తీరక బిడ్డ అలా పుట్టిందని ఆమె తినదలచిన వస్తువు ఎవరైనా తిని ఆ బొడ్డుపై ఆ నోటితో వూదితే బిడ్డ మనసు తీరుతుందని తలచేవారు. ఆ తరువాత బిడ్డ అయుష్షు వుంటే బ్రతికేది. లేకపోతే సెప్టిక్‌ అయి మరణించేది. అశుభ్రత వల్ల అలా కలిగిందని మాత్రం వారికి తెలిసేది కాదు. అదే విధంగా ఒకసారి కోసిన బొడ్డు రంధ్రం వద్ద వాచి బుడగలా వచ్చేది. రెండు పూటలా ఉగ్గు పెట్టేవేళ రాగి డబ్బుతో ఆ బొడ్డుపై వత్తుతూ ఉప్పర బొడ్డు, ఊదర బొడ్డు నక్కలు కూస్తే పోయే బొడ్డు అని పాడేవారు.

శాస్త్రిగారి ఆసుపత్రి వెనుక గల విశాలమైన హాలు అన్నదాన సమాజం వారిది. ఆ హాల్లో ఆ రోజుల్లో నాటక ప్రదర్శనలు, సరస్వతీ గాన సభ వారి దసరా, సంగీత సభలు, శ్రీరామ సమాజం వారి త్యాగరాజు స్వామి ఆరాధన ఉత్సవాలు జరుగుతూ వుండేవి. ఆంధ్రదేశంలో లబ్ధ ప్రతిష్ఠులైన నాటక సమాజం వారు నేల నాలుగు చెఱుగుల నుండి వచ్చి తమ నాటకాలను ప్రదర్శించేవారు. కాకినాడలో నాటకం ప్రదర్శించి సభికుల మెప్పు పొందడం అంటే నటీ నటులు నాటక సమాజాల వారు కూడ గౌరవంగా భావించేవారు. రాజమండ్రీ, ఏలూరు, విజయవాడ, బందరు, గుంటూరు, నెల్లూరు మొదలైన పట్టణాల నుండి నాటక సమాజాలు వచ్చి తమ నాటకాలను ప్రదర్శించేవారు. పానుగంటి లక్ష్మీనరసింహగారి పాదుకా పట్టాభిషేకం, చిలుకమర్తి లక్ష్మీనరసింహంగారి గయోపాఖ్యానం, బలిజేపల్లి లక్ష్మీకాంత కవిగారి సత్యహరిశ్చంద్ర, వేదం వెకంటరాయ శాస్త్రిగారి ప్రతాపరుద్రీయం, శ్రీ పాద కృష్ణమూర్తి శాస్త్రిగారి బొబ్బిలి యుద్దం, తిరుపతి వేంకటకవుల పాండవోద్యోగ విజయాలు, శ్రీకృష్ణ తులాభారం, సంస్కరణాభిషతో నూతనంగా వస్తున్న కనకతార, కంఠాభరణం, చింతామణి వంటి సాంఘిక నాటకాలు అక్కడ ప్రదర్శించేవారు. ఆ నాటకాలు చూడటానికి కాకినాడ చుట్టుపట్ల పది గ్రామాల నుండి జనం వచ్చేవారు. తమ గ్రామాల్లో సాయంత్రం నీరెండ వుండగానే భోజనాలు ముగించుకొని రెండెడ్ల బండిపై ఐదారుగురు కలిసి బండి తొట్టిలో ఓ ఇత్తడి బిందె నిండా నీరు పోసి వాసెన కట్టి పెట్టుకొనేవారు.

దాని వల్ల నీరు చల్లగా దుమ్ము పడకుండా పరిశుభ్రంగా వుండేది. బండి అడుగున బియ్యం, పప్పులు, చింతపండు మొదలైనవి మూటలు కట్టి వేలాడ తీసేవారు. మట్టి పిడతలో తోడు పెట్టిన పెరుగు పులవకుండా మంచి రుచిగా వుంటుంది. అటువంటి పెరుగు పిడతలూ కొద్దిపాటి వంట పాత్రలు అడ్డాకు విస్తర్లుకట్ట కూడా తీసుకొని వెళ్లేవారు. ఏ చెట్టు క్రిందనో బండి ఆపి, మూడు ఇటుకలతో పొయ్యి అమర్చి బండిలో ఎండుగడ్డితో దొరికిన ఎండు పుల్లలు సేకరించి ఇంత అన్నం వండుకునేవారు. ఏదో ఒక ఆధరువు, పెరుగుతో తృప్తిగా తిని బండిలోనో సమీపంలో వున్న అరుగుల పైనో విశ్రమించేవారు. ఈ విధంగా బోర్డింగ్‌, లాడ్జింగ్‌ వంటి సమస్యలు లేకుండా హాయిగా వుంటూ తమకు ప్రీతిపాత్రమైన నాటకాల్ని రెండు మూడు ప్రదర్శనలు చూచేవారు. 19వ శతాబ్దంలో 4వ దశకం వరకూ దేశంలోని ప్రధాన సాధనాలలో ఈ రెండెడ్ల బండ్లే ప్రధానమైనవి. ఇవి డబ్బు అవసరం లేకుండా ప్రయాణీకుల్ని ఎక్కడికి కావాలంటే అక్కడకు చేరుస్తూ వారు తిరిగి వచ్చేవరకూ వారి కోసం వేచి వుండేవి. బ్రిటీష్‌ వారు దేశంలో బస్సు ప్రవేశపెట్టారు. ఆ బస్సుల్ని చూచి ప్రజలు ఆశ్చర్యాన్ని ఆనందాన్ని, ఒక సందర్భంలో భయాన్ని, అయిష్టతనీ కూడా పొందాడు.

‘‘పావలా డబ్బులకాశపడి మోటారు కారూ
నీవు పరుగు పరుగున పోయేదవే మోటారు కారు.
చ॥ గన్నవరం రోడ్డు మీద మోటారు కారూ
నీవు గడ్డి వాణ్ణి చంపలేదా? మోటారు కారూ ॥పావ॥
చ॥ పాలకొల్లు రోడ్డు మీద మోటారు కారూ
నీవు పంది పిల్లని చంపలేదా మోటారు కారూ ॥పావ॥
అని
బస్సు వచ్చిందోయ్‌ బాబూ బస్సు వచ్చిందోయ్‌
బస్సు వచ్చి బళ్ల వాళ్ల నోళ్లు కొట్టిందోయ్‌
అని జనం పాడుకున్నారు. కంఠాభరణం, చింతామణిలో సుబ్బిశెట్టి పాత్రధారి గండికోట జోగినాథం గారు ఆ పాత్రను పాతకాలపు వైశ్యుల వేషధారణలో కాకుండా పట్టణంలోని వైశ్యుల వేషధారణకు అనుగుణమైన ఆహార్యంతో నటించి పాత్రను సామాన్య పాఠకులకు సుపరిచితంగానూ, విలక్షణంగానూ నటించి వారిని వినోదింప చేసేవారు. బొబ్బిలి యుద్దంలో బుస్సీ దొర, హైదర్‌జంగ్‌ పాత్రలు నాటి ఆంగ్లేయుల, మహమ్మదీయుల ఉచ్ఛారణను, ఆహార్యాన్ని అనుసరిస్తూ వాస్తవికతకు దగ్గరగా వుండి ప్రేక్షకుల్ని మెప్పించేవి. ప్రతాపరుద్రీయంలో చాకలి పేరిగాడు ప్రతాపరుద్ర చక్రవర్తి పోలికలో వుండటం దైవికం. దాన్ని నాటకీయంగా వుపయోగించి యుగంధరాయణుడు రాజకీయాన్ని నడిపాడు. చాకలి పేరిగాని అమాయకత్వం, పాటకజన సమాజమైన యాస కడుపుబ్బా నవ్వించేది ప్రేక్షకుల్ని. ఈ విధంగా కళ సామాన్య జనుల ముందుకు వచ్చి వారి హావభావాల్ని అనుకరిస్తూ, అన్యాపదేశంగా నీతి చెప్తూ, రసానందం కలిగిస్తూ, అర్థ శతాబ్ది పాటు నాటకం ఆంధ్ర ప్రేక్షకుల్ని అలరించింది. రాగయుక్తంగా పద్యాలు చదివి ఎందరో నటీ నటులు ప్రేక్షకుల్ని సమ్మోహన పరిచారు.

పద్యానికి రాగం అవసరమా? రాగం వలన పద్యానికి రస పుష్టికలుగుతుందా! ఆ సంరంభంలో రసం మరుగున పడుతుందా? అన్న చర్చను లేవదీసి కొందరు సాగదీసినా నాటకాలలో వాటి ప్రాముఖ్యాన్ని అవి నిలబెట్ట్టుకొన్నాయి పద్యాలు సామాన్యులకు అతి సామీప్యంలో వున్న నాటకాల్ని ఆంధ్ర ప్రేక్షకులు మనసారా అస్వాదించి ఆనందించారు చాలాకాలం పాటు పానుగంటి వారి పాదుక నాటకంలోని అనపత్యుడైన పురుషుని వేదన దశరథ పాత్రలో అద్దంకి శ్రీరామమూర్తి గారు, శ్రీకృష్ణతులాభారంలోని సత్య పాత్ర ఉత్తమ జాతి స్త్రీ ఆభిజాత్యానికీ, పతి ప్రేమకోసం తల్లడిల్లే పతివ్రతలోని సత్య సౌశీల్యాన్ని మించి కనపడే పంతం, ఆత్మ విశ్వాసం స్థానం వారి సత్యపాత్రలో ప్రేక్షకుల్ని ముగ్థుల్ని చేసేవి.

ప॥ మీరజాల గలడా నాయానతీ! వ్రత విధాన యమహిమన్‌ సత్యాపతి
చ॥ 1. సుధాప్రణయజలధిన్‌ వైదర్భికి వేరెతావు కలదా ॥వ్రత॥
2. మధుర మధుర మురళీగాన రసా స్వాదన లహరిన్‌ ॥వ్రత॥
అని పాడుతుంటే ప్రణయ తపస్విని, కృష్ణ భక్తురాలు అయిన సత్యను అందరు ప్రేక్షకులూ సాధు వాదాలతో అభినందించేవారు.

చిలుకమర్తి వారి గయోపఖ్యానంలో ప్రాణ స్నేహితులు సైతం నమ్మిన ఆశయాల కోసం అవసరమైతే స్నేహ ధర్మాన్ని మరచి ప్రత్యర్థులుగా నిలవడం ‘‘కూరిమికల దినములలో నేరములెన్నడును కలుగనేరవు। మరియా కూరిమి విరసంబైనను నేరములే తోచుచుండు నిక్కము సుమతీ!’’ అని సుమతీ శతకకారుడు చెప్పినట్లుగా ఆ ప్రాణ స్నేహితులు ఒండోరుల మాటకు చేష్టలకూ విపరీతార్థాలు తీసి వాగ్వివాదం చేసుకుంటూ వుంటే ప్రేక్షకులు ఆ పాత్రల్లో తమ ప్రతిబింబాలనే చూసుకునేవారు. మనస్పర్థల వలన గోరంతలు కొండంతలు కాగా ఆ ఇంటి ఆడపడుచులు పడే మనో వ్యధ సుభద్ర పాత్రలో చిలకమర్తి వారు చక్కగా చిత్రించారు. పాండవోద్యోగ నాటకంలో దూర ప్రయాణం చేసి వచ్చిన అర్జునుడు కళ్ల ఎదుట ద్వారకాపురి కనబడగానే ‘‘అదిగో ద్వారక, ఆలమందలవిగో అందందుగోరాడు. అదె అగడ్త, యదు సింహుడు కృష్ణుడు వసియించు మేడ అదిగో, ఆవాన దంతావళాభ్యుధయంబై వరమందు తురంగోచ్చండమమై బర్వెడిన్‌’’ అని అర్జున పాత్రధారి పద్యం పాడుతుంటే ఒక్కో అడుగు వేస్తూ ముందుగా ద్వారకాపురీ శౌధ గోపురాలు, పట్టణ పరిసరాల్లో సంచరించే గోకబందాలు, కోట చుట్టూ వున్న అగడ్త ఏనుగులూ, రథాలు, నిరాఘాటంగా సంచరించే రాజమార్గాలు, అన్ని మేడలలో తలమానికంగా వున్న శ్రీకృష్ణుని అంతఃపురం, మేడ, బంట్లు, ఏనుగులు, గుఱ్ఱాలు వుండటం మన కళ్లకు కట్టిస్తున్నారు కవి.

‘‘బావా ఎప్పుడు వచ్చితీవు? సుఖులే చుట్టంబుల్‌, సఖుల్‌భ్రాతల్‌’ అని అర్జునుణ్ణి చూడగానే కృష్ణుడు పలకరించే తీరు అత్యంత వాస్తవికంగా లేవు. శ్రీరామ నవమికి, దసరా, వినాయక చవితికి నవరాత్రులు జరిగేవి. వీధి అంతా పెద్ద పెద్ద తాటాకు పందిళ్లు వేసి, మామిడాకు తోరణాలు, రంగు రంగుల కాగితాల తోరణాలు కట్టే వారు. నేలంతా వత్తుగా కళ్ళాపు చల్లి ముగ్గులు తీర్చేవారు. ఒక మందిరంలో దేవతలను ప్రతిష్ఠించి, ఉభయ సంధ్యల్లోను పూజలు, సంతర్పణలూ జరిగేవి. ఆ రోజుల్లో ఇంట్లో వంట మాటే తలపెట్టకుండా ఆ పందిళ్ళలో లభించే దేవుని ప్రసాదంతోనే భోజన అవసరాలు తీర్చుకునేవారు చాలా మంది వుండేవారు. రాత్రి 7 గంటలకు ప్రారంభించి హరికథలు, పురాణ కాలక్షేపాలు, దేవదాసీలచే శ్రీ కృష్ణ లీలాతరంగిణీ, జయదేవుని గీతగోవిందం అనే అష్ట పదులు, అధ్యాత్మిక రామాయణ కీర్తనలూ గానం చేస్తూ అభినయింపబడేవి. ఇవన్నీ రసస్ఫోరకాలు, పాండిత్య ప్రతీకలు అయి సామాన్యులకు అర్థం కావడం కష్టం అయినా భక్తి భావంతో విని ఆనందించేవారు.

ఈ ప్రదర్శనలు అర్థరాత్రి వరకూ సాగేవి. పెట్రోమాక్స్‌ లైట్ల వెలుగులో ఈ ప్రదర్శనలు నిర్వహించే వారు. దేవదాసీలు అమూల్యమైన రత్నాభరణాలు దాల్చి దక్షిణాదిన మధురలోనూ, ఉత్తరాదిన కాశీలోనూ నేసిన బంగారు జరీ పట్టు చీరలు ధగధగలాడుతుండగా పుష్పాల, సుగంధ ద్రవ్యాల సువాసనలు గుబాళిస్తూ వుండగా దివి నుండి భువికి దిగివచ్చిన అప్సరసల్లా ప్రేక్షకుల్ని అలరింపచేసేవారు.ఎందరెందరలో హరిదాసులు సుదూర ప్రాంతాల నుండి వచ్చి తమ హరికథా గానంతో శ్రీహరిని కీర్తించి ప్రేక్షకుల్ని అలరింప చేసేవారు. వారు నాటి సాంఘిక, రాజకీయ పరిస్థితుల్ని చక్కగా అవగతం చేసుకుని పిట్ట కథలుగా తమ హరికథల్లో ప్రస్తావించేవారు.

కారడవుల్లో ఏకాంతంలో సీతారాముల్ని సేవించిన లక్ష్మణుని స్నేహానికి మారు రూపు. ‘‘నాహం జానామి కేయూరాన్‌ నాహం జానామి కంకణాన్‌` నూపురాన్యేవ జానామి నిత్యం పాదాభివందనే’’ మా వదిన దండ కడియా లెలావుంటాయో నాకు తెలియదు. గాజులెలా వుంటాయో నాకు తెలియదు. రోజు ఉదయాన్నే ఆమెకు పాదాభివందనం చేసేటప్పుడు నేను దర్శించిన కడియాలు మాత్రం ఇవే. అని కదా హనుమ చూపిన మూటలోని వదినగారి ఆభరణాలు చూపి ఇవి మీ వదినగారివేనా చూడు అని అడిగిన అన్నగారితో లక్ష్మణుడు అన్నాడు. ఈ మరిది తాను నిత్యం సన్నిహితంగా మెలిగే వదినగారి ఆభరణాలేమైనా గుర్తు పట్టుగలడో లేదో కాని తనకు కన్నతల్లి, తోడబుట్టిన సహోదరి పట్ల కలిగిన గౌరవాభిమానాల్ని ఆమె పట్ల జీవితాంతం కలిగివున్నాడు. వారి చనువు సాంఘిక మర్యాదలకు, హద్దులకూ ఒదిగే వుండేది. రెండవ మరిది మహాకొంటి. ఆమెను వెంట బెట్టుకొని నాటకాలకు, పాటకచేరీలకూ తీసుకొని వెళ్ళే అంగరక్షకుడు ఈయనే.

ఆమె వేవిళ్ళతో నీరసంగా పడుకొంటే ఏవమ్మా అలా వున్నావు అనే వాడతడు. తోచక అనేది ఆమె. దానికేం వుంది ఆ నూతి దగ్గర ఇటుకలు వున్నాయి చూడు అవన్నీ తెచ్చి ఇంట్లో పెట్టు, మళ్ళీ పట్టుకెళ్ళి నూతి దగ్గర పెట్టు చక్కగా తోస్తుంది అనేవాడాయన. నేను లేవ లేకుండా వుంటే నీకు ఆటగా వుందా? అని వదిన గారు ఉడుక్కునేది. మేలురకం పట్టు చీరలు, ఉప్పాడ జరీ 120 నంబరు నూలు చీరలు ధరించేది సీత. ఆ రోజుల్లో చేతి రుమాళ్లు పురుషులకే వినోద వస్తువు. స్త్రీలకు అసలు వాటి వాడుకయే తెలియదు. భర్త తెచ్చి ఇంట్లో పెట్టుకున్న రుమాళ్ళలో ఒకటి తన చీర పాడవుతుందేమో అని బొడ్డులో ధరించేది సీత. హడావుడిగా తిరగడంలో అది కాస్తా జారి కిందపడేది. అది తీసి ఊపుతూ జేబు రుమాళ్ల కంపెనీ అని ఉడికించేవారు మరిది.

ఆ రోజుల్లో ఫోటో దిగడం సరదా. ఊరిలో పేరు పొందిన ఫొటో గ్రాఫర్‌ బసవరాజుగారిని ఇంటికి పిలిపించి భార్యతో సహా ఫోటో దిగారు శాస్త్రి. భార్యకు ప్రియమైన హార్మోని వాయిస్తున్నట్లుగా మరో ఫోటో తీయించారు. సర్వాభరణ భూషితురాలై, బనారస్‌ పట్టుచీర దాల్చి, ఓ కుర్చీలో కూర్చొని ఎదురుగా ఎత్తయిన బల్లమీద హార్మోని పెట్టుకొని వాయిస్తున్నట్లుగా వుండేది ఆ ఫోటో. నిలువెత్తు ఆ ఫోటోకు అద్దం కట్టించి ముందు గదిలో వుంచారు శాస్త్రి. చిన్న తమ్మునికి దాన్ని చూస్తే బలే సరదా వేసేది. వెనుక కట్టిన స్క్రీనుపై పొడవు మూతికల గాజు కూజాల బొమ్మలు చూపి, ఇదిగో చూడండి మా వదిన చారు చాలా బాగా పెడుతుందని ఈ చారు బుడ్డీ బహుమతిగా ఇచ్చి సన్మానం చేసారు. అందుకే ఇది కూడా పెట్టుకొని ఈవిడ ఫోటో దిగింది అని ఆయన అందరితో నవ్వుతూ చెప్పేవారు. సీత వంటలో ఉప్పు, పులుపు కారాలు ఎక్కువగా వుండేవి అందుకని మరిది పరిహాసం అనమాట ఈ విధంగా హాస పరిహాసాలతోనే కాలం గడిచిపోతుంది. పెద్ద మరుదులిద్దరికి ఎవరి కాపురాలు వారికి ఏర్పడ్డాయి. ఇంట్లో భార్య, భర్తలిరువురే మిగిలారు.

ఆ రోజుల్లో చాలా మంది కట్టెల పొయ్యిల మీదే వంట చేసుకొనేవారు. అటవీ ప్రాంతాల్లో పెద్ద పెద్ద కర్రదుంగలు తెచ్చి, కాల్చి బొగ్గులు చేసి, అవి బస్తాల్లో కెత్తి పట్టణాలకు తెచ్చి విక్రయించేవారు. 24 కుంచాలు అంటే నేటి 100 కిలోల బొగ్గులు వున్న బస్తా 8 అణాలు వుండేది. బీడు ఇనుముతో అడుగు మట్టు సన్నంగా వుండి ఎదరబెజ్జం కలిగిన వెడల్పాటి కుంపట్లు క్రొత్తగా వచ్చేవి. వాటి మధ్య వూచలు మధ్యలో ఖాళీ వుండేటట్లుగా అమర్చిన బిళ్ల వుండేది. కుంపటి బెజ్జంలో చిన్న కిరసనాయిలు గుడ్డ వుంచి అంటించి విసరితే బొగ్గులు అంటుకొని కణకణలాడే నిప్పులతో వంటకు తయారుగా వుండేది. ఈ కుంపటి నిండా బొగ్గులు వేస్తే 3 తవ్వల గిన్నెతో అన్నం అరగంటలో తయారు అయ్యేది. కొద్దిగా బొగ్గులు వేస్తే సన్నటి సెగపై పదార్థాలు నిదానంగా వుడికేవి. అణా ఇస్తే సందెడు కట్టెల మోపు శ్రామిక జనం సంతోసంగా వేసి వెళ్లేవారు. శాస్త్రి భార్య కష్ట పడనవసరం లేకుండా బొగ్గుల కుంపట్లే ఏర్పాటు చేసేవారు. రుక్మిణీ కుక్కర్‌ ‘ అనే ఒక రకం కుక్కర్లు ఆ రోజుల్లో క్రొత్తగా పరిచయం చేయబడ్డాయి. ఆ కుక్కర్లలో ముగ్గురు మనుష్యులకు సరిపడా ఏకకాలంలో పప్పు, అన్నం, కూర ఉడికే ఏర్పాటు వుండేది. శాస్త్రి అటువంటి కుక్కర్‌ ఒకటి కొని తెచ్చారు. వారానికి ఒక రోజు మార్కెట్‌కు వెళ్లి కావలసిన కూరలన్నీ కొని తెచ్చేవారు. ఏ కూర అయినా వీశ అణా. కానీ పెట్టి 1/4 వీశ (ఏబులం) కూర కొంటే దంపతులు ఇద్దరికి సమృద్ధి. బంగాళాదుంపలు మాత్రం వీశ 3 అణాలు. కంద, పెండలం, చేమ అన్నీ లభ్యం అయ్యేవి. తోటకూర, మెంతికూర మొదలైన ఆకు కూరలు. 1 కాణీ పెడితే ఇరువురకు సరిపడా వచ్చేవి. అల్లం, పచ్చి మిర్చీ,, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయలతో సహా అన్ని కూరలూ 2 చేతి సంచీల నిండుగా తెచ్చేవారు శాస్త్రి. అమృతాంజనం డబ్బాతో డబ్బాడు కంది పప్పు వండితే ఇద్దరికీ సమృద్ధి.

పది గంటలకు తీరిగ్గా వంట మొదలుపెడితే శాస్త్రిగారు ఇంటికి వచ్చే వేళకు వంట ముగిసేది. మెంతికూర, మామిడికాయ మొదలైనవి పొడి పొడి వాడేటట్లుగా పప్పుకూర శాస్త్రిగారికి ఇష్టం. ఆ విధంగా వండడానికి చాలా నేర్పు కావాలి. సీత శ్రద్ధగా భర్తకు కావలసిన విధంగా వండిపెట్టేది. మధ్యాహ్నం పూట ముద్ద పప్పు, కూర పులుసు చేసుకొనేవారు. గుమ్మడి, ఆనప, బెండ, వంగ, చిలగడదుంప, మునగ మొదలైన వివిధ రకాల కూరలతో చేసిన పులుసు శాస్త్రికి చాలా ఇష్టం. తోటకూర పులుసు చిక్కగా ముద్దగా వుండాలి. అయితే ఆ పులుసు లేవీ ఆయన కలుపుకునేవారు కారు. పప్పు అన్నంలో నంజుకోవడమే, చారు కలుపుకొని, చివరన మజ్జిగ, అష్ఠైశ్వర్యాలు, పంచ భక్ష్య పరమాన్నాలు ఇంటనున్నా ఆయన తినేది మూడు ఆధరువులు మాత్రమే. ఉదయం పూట కాఫీ సేవించడం నాటి రోజుల్లో లేదు. మధ్యాహ్నం 11, 12 గంటల వరకూ ఖాళీ కడుపుతో వుండటమే ఆ రోజుల్లో అలవాటు. మధ్యాహ్నం 3 గంటలకు పని మనిషి వచ్చి అంట్లు తోమి కుంపటి అంటించి ఇచ్చేది. దాని మీద సీత కాఫీ పెట్టి శాస్త్రి గారికి ఇచ్చి, దానిమీదే సావకాశంగా రాత్రికి 1 కూర, చారు చేసి సరిపడా బొగ్గులు వేసి అన్నం వండేది. ఆ అన్నం రాత్రి 8 గంటల వరకూ అలా కుంపటి మీదే వెచ్చగా వుండేది. దీపంతో ఓ కాగితం వెలిగించి నెయ్యి వెచ్చపెట్టి శాస్త్రిగారికి భోజనం పెట్టేది. ఆమె భోజనం ముగించుకొని వంటిల్లు సర్ది కడిగి ముగ్గు పెట్టేది. ఆమె బట్టలు తడిపి ఆరవేయడం, గదులు తుడవడం వంటి పనులన్నీ పని మనిషే చేయడం వలన ఆమెకు తగిన విశ్రాంతి లభిస్తూ హాయిగా వుండేది.

ఆమె వినోదం కొరకు శాస్త్రి గారు వినోదిని, నవ్వులగని, గృహలక్ష్మీ వంటి పత్రికలు తెప్పించేవారు. గ్రంథాలయం నుండి క్రొత్తగా వస్తున్న నవలలు తెప్పించేవారు. మొత్తానికి ఆమెకు సరదాగా, వినోద భరితంగా కాలం జరిగిపోయేది. సీత అలంకార ప్రియత్వం, సంగీతం చూసి సంబరపడుతూ, విద్యార్థినీ సమాజంలో ఉపాధ్యాయురాలైన ఉభయ భాషాప్రవీణ చంద్రకాంతమ్మగారు, సీతా మహాలక్ష్మీ నీవు గంధర్వ అంశలో దానివమ్మా! లేకపోతే ఈ అలంకారాలు, సమయస్పూర్తిగా పాటలూ అందరికీ వస్తాయా ? అనేది అభిమానంగా.
ఆఖరి మరిది సీత ఈడు వాడే. కళ్లకు కొద్దిగా జబ్బు చేయడం వలన అతడు చురుకైన వాడు అయినా చదువు కాస్త వెనుకబడిరది. ఊళ్లో వున్న బోర్డు స్కూల్లో 5వ తరగతి పూర్తి చేసి ఓ ఏడాది ఖాళీగా వున్నాక శాస్త్రిగారు అతన్ని తమ వద్దకు తెచ్చుకొన్నారు. అతడు కొంత ప్రైవేటుగా చదివి ఇంటా ఫస్టు ఫారానికి కట్టి ప్యాసు అయ్యాడు. తన ఈడుదే అయిన వదిన గారు సెకండు ఫారం పాసు అయి చదువు మానేసింది ఆసరికే. సత్యానికి అభిమానంగా వుండేది. వదిన గారు తన స్నేహంతో, వాత్సల్యంతో అతడిలో ఆత్మ విశ్వాసాన్ని, ఉత్సాహాన్ని కలిగించింది. అతన్ని ఉత్సాహపరుస్తూ అతడు చదువుకుంటుంటే అతడి దగ్గర కూర్చొనేది. భోజన ప్రియుడైన అతడి రుచులెరిగి వండిపెట్టేది. భర్త ఇన్నిరకాలెందుకు ఎలా పెడితే అలా తినేవాడే కష్టసుఖాలు తట్టుకోగలుగుతాడు అన్నా ఆమె సరకు చేసేది కాదు. సత్యానికి చురుకుపాలు ఎక్కువ. రోజు సాయంత్రం వేళ పిల్లకాయలంతా వీధిలో చేరి ఆటలు మొదలు పెట్టేవారు. ఓ పిల్లవాడికి ఓ సారి సత్యం చేతిలో గట్టిగానే దెబ్బలు తగిలాయి. లబోదిబోమంటున్న పిల్లవాణ్ణి వెంట పెట్టుకొని వీరి ఇంటిమీదకు దెబ్బలాటకు వచ్చారు. వదినగారు పెద్దరికం వహించి మరిదిని మంచంక్రింద దాచేసింది.

మా వాడు అసలు స్కూలు నుంచి ఇంటికే రాలేదు. మీ పిల్లవాణ్ణి కొట్టడం ఏమిటీ అని వార్ని బుకాయించసాగింది. మహాలక్ష్మీ వంటి ఈ బాలిక ముఖం చూసి మారు మాట్లాడలేక సణుగుకుంటూ వారు తరలిపోయారు. ఓ పర్యాయం ఓ పల్లెటూరి స్త్రీ ఓ తేగలుకట్టా, ఓ చిన్న బూడిద గుమ్మడికాయ తెచ్చింది. డాక్టర్‌ గారికోసం అంటూ వీరు ఎన్ని వివరాలు అడిగినా ఆ అమాయకురాలు ఇవి మీకే తీసుకోండి అని కూర్చొంది. మన సత్యానికి రుచులు ఎక్కువ కదా. అప్పటికప్పుడు ఆ బూడిద గుమ్మడికాయ వదినగారి చేత ముక్కలు తరిగించి, తాను మార్కెటుకు వెళ్లి, మినపప్పు, మిరప పళ్లు తెచ్చి మరునాడు పచ్చి వడియాలు పెట్టించుకొని నాలుగు రోజులు హాయిగా తిన్నాడు. తేగలు కుంపటి మీద కాల్చుకొని రెండు రోజులు తిన్నారు. రెండు రోజులు పోయాక ఆ గ్రామీణ స్త్రీ మళ్ళీ వచ్చి, అవి మీవి కాదు నేను మరొకరి కోసం తెచ్చాను. నా సరుకులు నాకు ఇవ్వండి అని కూర్చొంది. మేము ఎంత అడిగినా మీకే అని ఇచ్చావు. ఇప్పుడు మేం అవి వాడేసుకున్నాం. కావలిస్తే డబ్బులు ఇస్తాం తీసుకో అంటే ఆమె వినలేదు. నా వస్తువులే కావాలని మూర్ఖించింది. సత్యం తిరగబడి నువ్వసలు మాకేం ఇవ్వలేదు, నీ దిక్కున్న చోట చెప్పుకో అన్నాడు. ఆ అమాయకురాలు సణుక్కుంటూ పోయింది.

తన మరిది సర్వ శ్రేష్ఠుడు కావాలని మనసారా కోరుకుంటూ నీవు చదువు అంతు చూడాలయ్యా అనేది ఆమె. అతడి సహాధ్యాయులకు అతడికన్నా ఎక్కువ మార్కులు వస్తే, ఆమెకు కిట్టేది కాదు. మీరు, మా మరిది ఒకలాగే చదువుతున్నారు కదా మీకు అతడికన్నా ఎక్కువ మార్కులు ఎలా వచ్చాయి అనేది ఆమె. పోనీ లేవమ్మా మార్కుల్లో తలో పది అతడి వాటాగా అతడికి ఇచ్చివేస్తాంలే అనే వారు వాళ్లు.

( ఇంకా ఉంది )

– కాశీచయనుల వెంకట మహా లక్ష్మి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

236
ఆత్మ కథలు, గౌతమీగంగ, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో