నా కళ్లతో అమెరికా – 40

ఎల్లోస్టోన్ -4

మర్నాడు ఉదయం ఎప్పుడెప్పుడు “దోమల రిసార్టు” నించి బయట పడతామా అన్నట్లు త్వరగా బయలుదేరేం.
సమయం లేనందు వల్ల ఇక అక్కడ బ్రేక్ ఫాస్టు వంటివి చెయ్యదల్చుకోలేదు. గ్రాండ్ టేటన్ నేషనల్ పార్కు : ఎల్లోస్టోన్ నేషనల్ పార్కుకు వెళ్లాలంటే ముందుగా “గ్రాండ్ టేటన్ నేషనల్ పార్కు” దాటి వెళ్లాలి. రెంటికీ కలిపి ఎంట్రన్సు టిక్కెట్టు $25 పెట్టి ఒక్కసారే తీసుకోవాలి. మేం వెళ్లింది జూలై నెల, మంచి వేసవి కాలం. అయినా ఈ టేటన్ లో చుట్టు మంచు కొండలు ఆహ్లాదంగా దర్శనమిచ్చాయి.

మంచు పట్టుతో నేసిన మెరిసే ధవళ వస్త్రాలు ధరించి అందమైన దేవతల్లాగా మాకు స్వాగతం పలుకుతున్న మంచు పర్వతాల్ని చూస్తూ అక్కడే జీవితం గడిపేయాలన్న పులకరింత కలిగింది. కొంత దూరంలోనే దారి పక్కన అతి పెద్ద “లేక్ లూయీస్” కనిపించింది. ఎదురుగా పర్వత శ్రేణి, ఆకాశపు రంగు తో పోటి పడుతున్న సరస్సు నీలపు రంగు. చాలా అందమైన ప్రదేశమది. మామూలుగా కారు వెళ్తున్నపుడు రోడ్డు పక్కన ఆగేందుకు స్థలం లేనట్లు కనిపించినా, కారు ఆపి దిగేందుకు బానే ఉండడం తో కిందికి దిగేం. నీటి కొసల్లో పెరిగిన గడ్డి మొక్కల తన్మయపు అరమోడ్పు కళ్లని చూసి తీరాల్సిందే. ఎక్కువ సమయం గడపకుండా బయలుదేరాల్సి ఉంది మేం. గొప్ప అనుభూతి క్షణకాలం చాలుకదా అనిపించింది.

అక్కడి నించి ముందుకి వెళ్తే వచ్చే టేటన్ విజిటింగ్ సెంటర్ దగ్గర వచ్చేటప్పుడు ఆగడానికి నిర్ణయించుకుని ముందుకెళ్లి పోయేం. మేం ఆ రోజు ఎల్లోస్టోన్ నేషనల్ పార్కు సగమైనా చూడాలన్నది మా ధ్యేయం. అందు వల్ల టేటన్ పార్కు లో అతి కొద్ది సమయం మాత్రం గడిపేం. మేం అంత దూరం నించి ఎల్లోస్టోన్ నేషనల్ పార్కుని చూడడానికి వచ్చేం, ఇంటి నించి బయలుదేరిన నాలుగో రోజున ఇవేళ మొత్తానికి చేరబోతున్నాన్న సంతోషం మా అందరిలో. ఎల్లోస్టోన్ ఎంట్రన్సు గేటు దాటగానే పిల్లలు “హుర్రే” అని అరిచారు.

లూయీస్ ఫాల్సు : ఎంట్రన్సు నించి కొద్ది దూరంలో లూయీస్ ఫాల్సు ఉన్నాయి. చాలా చిన్న ఎత్తులో రోడ్డు కి పక్కనే అందంగా అలరారుతున్న ఫాల్సవి. చిన్న సెలయేటి రూపం దాల్చి బాట వారనే ప్రవహిస్తున్న నీటి వైపు ఎవరికైనా అడుగులు పడకుండా ఎలా ఉంటాయి? చిన్న గులక రాళ్ల మీద చల్లగా విస్తరించుకున్న పలుచటి నీటి తెరలా ఉంది అక్కడి చేతికందే నీటి ప్రవాహం. నేను కాళ్లు ముంచి కూచున్నదే తడవు పిల్లలు కూడా పరుగెత్తుకొచ్చారు. సత్య కొత్తగా కొన్న కేమెరాతో జలపాతానికి రకరకాల ఫోటోలు తీసే పనిలో నిమగ్నమయ్యేడు. పిల్లలూ, నేనూ కలిసి అందరం పిల్లలమై హాయిగా నీళ్లతో ఆడుకుంటూ గడిపేం. అంతలోనే ఎల్లోస్టోన్ లో ఇంకా చాలా చూడాలని జ్ఞాపకం వచ్చి కారెక్కేం.

ఎల్లోస్టోన్ : ఎల్లోస్టోన్ నది ఈ నేషనల్ పార్కు గుండా ప్రవహించడం వల్ల ఈ పార్కుకి ఈ పేరు వచ్చిందని చెపుతారు. దాదాపు 96% పార్కు భూభాగం వ్యోమింగ్ రాష్ట్రం లోను, ఇతర చిన్న భాగాలు మోంటానా, ఐదహో రాష్ట్రాలలోను విస్తరించి ఉంది. ఈ పార్కు విస్తీర్ణంలో అమెరికాలోని రోడ్ ఐలాండ్, డెలావర్ రాష్ట్రాల కంటే పెద్దది. అత్యంత వైవిధ్యమైన భూభాగాలన్నీ ఇక్కడ మనం చూడొచ్చు. ఒక పక్క అగ్నిపర్వతపు ఆనవాలుగా పొంగి ఉబికే వేడి నీటి బుగ్గలు, కుతకుతా ఉడికే సున్నపురాతి గుంటలు, రకరకాల రంగుల్లో విస్తరించిన వేడి నీటి పొగల సెగల మడుగులు, మరో పక్క దట్టమైన అరణ్యం, ఎత్తైన చెట్లు, జలజలా పారే నదులు, అతి పెద్ద సరస్సులు, జలపాతాలు. మరో పక్క చెట్టు జాడ లేని రాతి శిలల పర్వతాలు…. ఇలా ఎటు అడుగువేసినా ఒక్కో ప్రత్యేకత గోచరిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ నేషనల్ పార్కుని దర్శించాలని అంతా ఉవ్విళ్ళూరుతారు అందుకే.

ఇలాంటి నేషనల్ పార్కులకు వచ్చినపుడు ఎంట్రన్సు లో ఇచ్చిన మేప్ లని అనుసరించి వెళతాం సాధారణంగా. ఈ పార్కు కొంత దూరం వెళ్లగానే మొత్తం రెండు దారులుగా విడిపోయి ఒక పెద్ద సర్కిల్ గా ఉంది. మరలా ఆ సర్కిల్ నుంచి నాలుగు వైపులకూ దారులుగా బయటకు విస్తరించి ఉంది. దాదాపు 3500 మైళ్ళ విస్తీర్ణం లో ఉన్న పార్కు మొత్తం చూడడానికి మాకు న్న రెండు రోజులూ చాలవు. కనీసం ముఖ్యమనుకున్నవి చూడడానికి మంచి ప్రణాళిక కావాలి. మేమిక గబగబా ఆలోచించి ముందుగా ఎడమ వైపు నించి మొదలుపెట్టి సగ భాగం ఆ రోజు , సగ భాగం మర్నాడు చుట్టి రావాలని నిర్ణయించుకున్నాం.
గ్రాంట్ విలేజ్ విజిటింగ్ సెంటర్ : రోడ్లు విడిపోయే ముందు గ్రాంట్ విలేజ్ విజిటింగ్ సెంటర్ ఉంది. మేమసలే ఉదయం నించీ ఏమీ తినలేదేమో మంచి ఆకలి మీద ఉన్నాం. కాబట్టి భోజనానికి విజిటింగ్ సెంటర్ రెస్టారెంటు లో ఆగేం. సాండ్ విచెస్, పొటేటో ప్రైస్ తిని బయలుదేరేం. అక్కడ నుంచి దాదాపు అరగంట ప్రయాణిస్తే ఉన్న “ఓల్డ్ ఫెయిత్ పుల్ గీజర్” అనే అతి పెద్ద వేడి నీటి బుగ్గ ప్రతి 90 నిమిషాలకొకసారి పైకి ఉబికి వస్తుంది. విజిటింగ్ సెంటర్ దగ్గరే ఆ గీజర్ పైకి ఉబికే సమయం టైం రాసి ఉంది. ఇక త్వరగా అక్కణ్ణించి బయట పడ్డాం.

ఓల్డ్ ఫెయిత్ పుల్ గీజర్ : ఇక మా మొదటి అడుగు అగ్నిపర్వతపు ఆనవాళ్లని తడుముతూ మొదలైంది. ” ఓల్డ్ ఫెయిత్ పుల్ గీజర్ ” అంటే ఏదో ఒక వేడి నీటి బుగ్గ లే అని అనుకున్న మాకు ఆశ్చర్యం ఎదురైంది. నిజానికి ఆ ప్రదేశం “ఒక” బుగ్గ కాదు. అనేకానేక బుగ్గల సమూహం. అతి పెద్ద గీజర్ దగ్గర్నించి చిన్న గీజర్ల వరకూ ఉన్నాయక్కడ. ఇక ప్రధాన గీజర్ దగ్గర ఎక్కడికక్కడ వలయాకారంలో మనుషులు రెయిలింగుల దగ్గర కాపు కాసుకుని ఉన్నారు. మేమింకా గంట సమయంలో బుగ్గ పైకి లేస్తూందనగా అక్కడికి చేరుకున్నాం. ఆ గంటా మొత్తం అక్కడున్నవన్నీ చుట్టి రావాలి మేం. దాదాపు మూణ్ణాలుగు మైళ్లు రౌండు కొట్టాలి. సిరి బాగా పేచీ పెడుతుండడంతో నేను అక్కడే ఉండిపోయాను. ఒక పెద్ద కప్పు నిండా ఐస్క్రీము కొనుక్కుని తినుకుంటూ కూచున్నాం. ఇక సత్య, వరు పరుగున వెళ్ళి వచ్చారు.
ఇక అసలు గీజర్ బయటికి భూమిని చీల్చుకుని పెద్ద శబ్దం చేస్తూ ఆకాశం లోకి ఎగిసి వచ్చిన సమయం రానే వచ్చింది. చుట్టూ ఉన్న జనమంతా అప్రమత్తంగా అపురూప దృశ్యాన్ని కెమెరా లలో బంధిస్తూ ఉన్నారు. ఒక్క ఉదుటున దాదాపు 90 అడుగుల ఎత్తున అద్భుతంగా ఎగిసిపడే నీటి జల్లుల్ని సంభ్రమంగా చూస్తూ ఉండి పోయిన ఆ మధ్యాహ్న వేళ అక్కడి నించి అప్పర్ గీజర్ బేసిన్, మిడ్ వే గీజర్ బేసిన్, లోయర్ గీజర్ బేసిన్ అని అక్కడున్న నీటి బుగ్గల ప్రాంతాల్ని విడదీసారు. ఇప్పుడు చెప్పుకున్నది అప్పర్ రీజియన్ లో ఉంది.

[tribulant_slideshow post_id=”13945″]

“గ్రాండ్ పిస్మాటిక్ స్ప్రింగ్” : అక్కడి నుంచి మిడ్ వేకు బయలుదేరి “గ్రాండ్ పిస్మాటిక్ స్ప్రింగ్” కు చేరుకున్నాం. అక్కడొక కొండ మీదకి దారి కట్టి ఉంది, కొండని ఆనుకుని నదీ పాయ ప్రవహిస్తూంది. కొండ మీంచి భగభగా మండుతూ వేడి నీటి కాలువలు ఒక పక్క నించి నది లోకి ప్రవహిస్తూండగా ఎగువనెక్కడి నుంచో శీతల జలాలు ప్రవహిస్తున్నాయి. అన్నిటి కంటే ముఖ్యంగా కంటికి ఇంపుగా కనిపిస్తూన్నా సల్ఫర్ వంటి వాయువుల వల్ల కడుపులో తిప్పే వాసన మాత్రం భయంకరంగా ఉంది అడుగడుగునా. కొండ మీదికి వెళ్లి చూసేసరికి ఎన్నడూ చూడని గొప్ప అగ్నిపర్వతపు పొగలు, నీలి రంగు, పసుపు రంగు వలయాల తో ఉన్న అతి పెద్ద పలుచటి మడుగులు ఒక పక్క, ఎగిసిపడే తెలుపు రంగు పొగలతో, నీలి రంగు లో దిగువన ఉడుకుతున్న అఖాతం వంటి గుంత లొక పక్క. భూమి పైన విలయాలన్నీ కూడబలుక్కుని అందంగా ముస్తాబైనట్లు అనిపించింది. ఈ పార్కుకి యెల్లోస్టోన్ అని కాకుండా ” అందమైన విలయం” అని పేరు పెట్టాల్సిందనిపించింది.

ఫౌంటైన్ పెయింట్ పాయింట్ : తర్వాతి విజిటింగ్ పాయింట్ లోయర్ గీజర్ రీజియన్ లో “ఫౌంటైన్ పెయింట్ పాయింట్”. ప్రతీ చోటా కారు పార్కు చేసి లోపలికి ఉన్న సన్నని చెక్క బాట మీద నడవడమే. కనబడడానికి రోడ్డు వారగా కనిపిస్తూంది కానీ ఇది కూడా మైలున్నరకి తక్కువ ఉండదు అనిపించింది. అప్పటికే సాయంత్రం కావస్తూంది. అయినా ఓపిక తెచ్చుకుని నడిచేం. సుద్ద రాయి వేడి నీటితో కలిసి పోయి పెద్ద భూపాత్రలో కుతకుతా ఉడుకుతూ కనిపించిందక్కడ. ఒక విధమైన ఊబి అది. ఇక మరి కాసిన్ని చిన్న చిన్న వేడి నీటి బుగ్గలు. ఒక పక్క వేసవి సూర్యుడు ఎంతకీ కుంకనంటున్నాడు. మాకు ఒంట్లో ఓపిక మాత్రం అయిపోవచ్చింది. మేమింకా నోరిస్ గీజర్ బేసిన్ జంక్షన్ కు చేరుకుని మ్యూజియం వగైరాలు చూడాలి.

ఆర్టిస్ట్స్ పెయింట్ పాయింట్ : మధ్యలో “ఆర్టిస్ట్స్ పెయింట్ పాయింట్” అనే చోట ఆగి చూసి వెంటనే వెళ్ళిపోవాలని అనుకున్నాం. తీరా అది చాలా తప్పు నిర్ణయమని వెళ్లొచ్చేవరకూ తెలియలేదు. మామూలుగా రోడ్డు వారనే ఉంటుందిద లెమ్మని నడవడం మొదలు పెట్టాం. కాస్త లోపలికి వెళ్లే సరికి దట్టమైన చెట్ల మధ్యగా ఉన్న మట్టి బాట మీద నడవలాల్సి వచ్చింది. అస్తమాటూ బేబీ కార్టు మీద కూచుని బోరెత్తి పోయున్న సిరిని అక్కడ కాసేపు స్వేచ్ఛగా వదిలేసాం. ఆ పాయింటు రోడ్డు నించి దాదాపు మైలు దూరం ఉండి ఉంటుంది. దాదాపు అరా మైలు చంటి పిల్లతో పడ్తూ లేస్తూ నడిచేక, ఇక మిగతా మార్గం కొండ మీదికి పైకి ఉంది. ఇక నాకు నడిచే ఓపిక లేకపోయింది. ఇక నేను అక్కడే సిరి తో ఆగిపోయి వీళ్లని వెళ్ళి రమ్మని చెప్పేను. సరిగ్గా అయిదు నిమిషాలు ఆ చెట్ల మధ్య కదలకుండా ఉన్నామో లేదో, జుమ్మని అతి పెద్ద దోమలు గబగబా వాలి గట్టిగా కుట్టడం మొదలు పెట్టాయి. ఇక గత్యంతరం లేక, వెనక్కి కారు దగ్గరికి పాపనెత్తుకుని పరుగు తీసాను. అప్పటికే ముందు రోజు సంధ్య వేళ రిసార్టు దోమలు, ఇక ఇప్పుడు మరలా భయంకరమైన దోమ కాట్లు. మా ఇద్దరికీ అయిదు నిమిషాల్లో ఎర్రని దద్దుర్లు పావలా కాసంత సైజులో నించి రూపాయి కాసంత సైజుకి పొంగి వచ్చాయి. అసలవి దోమలా, ఏనుగులా అని ఆశ్చర్యం వేసింది.

ఇక మరో అరగంటలో వరు, సత్య వచ్చి అక్కడ పైన తీసిన ఫోటోలు చూపించేరు. అదేమీ కొత్తగానూ, వింత గానూ ఏమీ లేదు కూడా.

నోరిస్ బేసిన్ : తీరా మేం నోరిస్ బేసిన్ కు చేరేసరికి మ్యూజియం వేళ అయిపోయింది. కారు పార్కు చేసి రెండడుగులు ముందుకు వెళ్లేం. కనుచూపు మేర పర్వతపు లోయలో కిందికి అనేకానేక బుగ్గలు పొగలు చిమ్ముతూ కనిపించాయి. అదేదో ఇతర గ్రహమ్మీద ఉన్న భ్రాంతి కలిగింది. పై నించే కాస్సేపు చూసి వచ్చి కారెక్కాం.

కాన్యయన్ విలేజ్ : ఇక ఆ నాటికి చూడవలసిన ప్రదేశాలను అక్కడితో ఆపి మా బసకు బయలుదేరాం. నెల ముందే బుక్ చేసుకున్నందు మాకు పార్కులో బస దొరికింది కానీ, రోజుకొక చోట దొరికింది. అవేళ్టి రాత్రికి మేం “కాన్యయన్ విలేజ్” లో ఉన్నాం. పెద్ద కాంప్లెక్సు, చక్కని గది. అందుబాటులో మూడు, నాలుగు రెస్టారెంట్లు, పెద్ద పచారీ కొట్టు, బహుమతుల దుకాణం అన్నీ బావున్నాయి కానీ పొద్దుట్నించీ అలిసిన మాకు ముందు హోటల్ లో చెకిన అవడం కంటే భోజనం చెయ్యడం ఉత్తమమని అప్పటికే మూసేస్తున్న దుకాణాలు చెప్తున్నాయి. గబగబా ఒక రెస్టారెంటు లోకి నడిచేం. నాకు ఆ మెను నచ్చలేదు, మరొకటి చూడడానికి వెళ్లి ఆలోచించుకునే సమయం లేదు నిజానికి. అయినా నచ్చనిది తినడం కష్టమని పక్క దుకాణం లోకి వెళితే అక్కడంత కంటే దారుణంగా ఉన్నాయి ఫుడ్ చాయిస్ లు. ఇంతలో సత్యకి రయ్యి మని కోపం తన్నుకు వచ్చింది. “ఇలా చేసి అన్నీ మూతపడే లోగా నువ్వు ఎవరినీ తిననివ్వవు. నాకు భోజనం అక్కరలేదని” విసవిసా నడిచి హోటల్ చెకిన్ వైపు వెళ్లిపోయాడు. అలిసి పోయి ఉన్న పిల్లల్ని సముదాయించలేక నేనిక మొదటి హోటల్ కు వెళ్ళి కూచుని ఫుడ్ ఆర్డరు చేసి, పిల్లల్ని కూచోబెట్టి వచ్చి సత్యని పిలుచుకు వచ్చాను. వచ్చినా తను సరిగా తినలేదు, సరికదా ఎవ్వరూ సరిగా తినకుండా అయిందారోజు. హోటల్ లో చెకిన్ అయ్యి ఎలా మొద్దు నిద్రపోయామో ఎవరికీ తెలియలేదు. నాకు, సిరికి దోమ కాట్లు బాగా బాధ పెడుతున్నా అలాగే పడుకున్నాం గత్యంతరం లేక. ఉదయం నించీ కడుపులో తిప్పే వాసనలు, సరైన సమయానికి తిండి తినకపోవడం, సాయంత్రం అలకలను మించిన సంతోషమేదో మా హృదయాలలో ఉందనుకుంటా అందుకే ఉదయాన మరలా మామూలుగా లేచి పరుగున తయారయ్యేం మరోవైపు ఎల్లోస్టోన్ ని చుట్టి రావడానికి.

-కె.గీత

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

యాత్రా సాహిత్యం, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , Permalink

Comments are closed.