నవలా రచయిత్రి అంగులూరి అంజనీ దేవితో ముఖాముఖి


unnamedఎన్నో నిద్రలేని రాత్రుల్లో ఆలోచించి, ఆలోచించి, తపించి, తపించి, తపస్సు చేస్తే కురిసిన అక్షరాలే నా కవితలు, కథలు, నవలలు, స్వశక్తితో ముందుకు సాగాలి. ఆత్మ ప్రేరణతో మనిషి ఉత్తేజం పొందాలి అని చెప్పడం కాదు. ప్రస్తుతం నేను చేస్తున్నది అదే… అంటున్న ప్రముఖ రచయిత్రి “శ్రీమతి అంగులూరి అంజనీదేవి” తో విహంగ వార్షిక సంచిక కోసం  …….

*నమస్కారం అమ్మా !ఎలా ఉన్నారు ?
నమస్కారం అరసి , బాగున్నాను .

*మీ స్వస్థలం ? తల్లిదండ్రులు గురించి చెప్పండి ?

మా స్వస్థలం వెలిగండ్ల , నెల్లూరు జిల్లా . నాన్న గారి పేరు మామిడేల రాఘవయ్య , అమ్మ పేరు మామిడేల వెంకట సుబ్బమ్మ .ప్రస్తుతం వరంగల్ లో ఉంటున్నాం,

*మీ విద్యాభ్యాసం ఎక్కడ ? ఎంత వరకు సాగింది ?
నేను కందుకూరు టి .ఆర్ .ఆర్ ప్రభుత్వ కళాశాలలో చదువుకున్నాను . బి.ఏ లిటరేచర్ చేసాను .

*మీ కుటుంబం గురించి చెప్పండి ?
నాకు 1982 లో వివాహం అయ్యింది . మా వారి పేరు ఆంజనేయులు . బ్యాంకు ఉద్యోగి . నాకు ముగ్గురు అబ్బాయిలు .

*మీ జీవితాన్ని ప్రభావితం చేసిన వారు?​

​నన్ను ప్రభావితం చేసిందీ , క్రమ శిక్షణ నేర్పిందీ నా తల్లిదండ్రులు . 

*మీరిప్పుడు కథలు రాస్తున్నారా ? నవలలా ?

ప్రస్తుతం నవలే రాస్తున్నాను .

* ఒక నవల రాయడానికి ఎంత సమయం పడుతుంది?

 ఒక నవల రాయడానికి ఆరు నెలల సమయం పడుతుంది.

ఒక్కోసారి ఇంకా ఎక్కువ సమయం కూడా పడుతుంది.

అది రాస్తున్న నవలను బట్టి వుంటుంది.

*మీరు కథలు నవలలే కాకుండా వేరే ప్రక్రియల్లో రచనలు చేస్తుంటారా ?
అవును అరసీ ! కవితలు కూడా రాస్తాను.

*మీకు నచ్చిన రచయితలెవరు?​

‘నాకు నచ్చిన’ రచయితలు అంటూ ప్రత్యేకంగా ఎవరూలేరు కానీ అందరి రచనలూ చదువుతాను . వారి రచనల్లో కనబరిచిన ప్రత్యేకతను గమనిస్తాను .

*ఎవరి కవితలు ఇష్టపడి చదువుతారు?

నేను కవితలు రాయడానికి ముందు రేవతి దేవి గారు రాసిన ‘శిలాలోలిత’ కవితా సంపుటి బాగా చదివేదాన్ని .

*మీ తొలి కథ ఎప్పుడు రాసారు  ?ఎక్కడ ప్రచురించబడింది ?
నా తొలి కథ కాలేజి మ్యాగజిన్ లో 1981 లో అచ్చుఅయ్యింది . అదే సంవత్సరం కాటేసిన ఆకలి , కనువిప్పు కథలు ప్రగతి సచిత్ర వార పత్రికలో మామి డేల అంజనీ దేవి పేరుతో ప్రచురించబడ్డాయి . అప్పుడు నేను ఇంటర్ చదువుతున్నాను .

*మీ తొలి నవల ఏమిటి ? ఏ పత్రికలో వచ్చింది ?
నా తొలి నవల “మధురిమ”.దీన్ని నేను ఇంటర్ చదువుతున్నప్పుడు రాసాను , ఇది ప్రగతి  వార పత్రికలో  సీరియల్ గా ప్రచురించబడింది .

*మరి నవలలు, కధలు ఎవరివి ఎక్కువగా చదివేవారు? ఎప్పటి నుండి చదివారు?

తొమ్మిదవ తరగతిలో వున్నప్పటినుండే నాకు నవలలు, కథలు చదవడం అలవాటైంది. అప్పుడు ఎక్కువగా మాలతీచందూర్‌, మాదిరెడ్డి, యండమూరి, యద్ధనపూడి, శరత్‌బాబు, చలం గార్లు రాసిన నవలలు చదివాను. ఇప్పుడు కూడా చదవడం అనేది నాకు చాలా ఆహ్లాదాన్ని ఇస్తుంది.

*”ఎంతెంత దూరం”  కథలో కథానాయిక ఎక్కడా నోరు విప్పి మాట్లాడదు.అలా  రాయాలనే  ఆలోచన ఎలా వచ్చింది మీకు ?
కథ రాస్తున్నప్పుడు ఏమి అనుకోలేదు . కథ మొత్తం పూర్తవ గానే ఒకసారి చదివినప్పుడు అనిపించింది ఎక్కడా నాయిక పాత్రకి ​ఒక్క సంభాషణ కూడా లేదని , చివరలో ఒక్క మాట ఉంటుంది​ థాంక్స్ అని ​అలా ఒక్క మాట  కూడా  లేక పోవటం అదొక కొత్త ప్రయోగం అనిపించింది . ​తరవాత ​థాంక్స్  ఆ అనే ఒక్క పదం కూడా తీసేసి ఆ సందర్భంలో హావ భావాలనే  పొందుపరిచాను  . ప్రతి కథ కి ప్రత్యేకత ఉండాలి అని ఆలోచిస్తాను .

*ఆమె అతడిని మార్చుకుంది నవల ఇతివృత్తం గురించి ?
ఉగ్ర వాదిగా మారిన వ్యక్తిని ఒక అమ్మాయి తన ప్రేమతో మంచి వ్యక్తి గా మారుస్తుంది . అలా మారడం అనేది దేశానికి ఉపయోగపడాలి అనేదే ఈ నవలలో చెప్పాను .

*మీ రచనలలో అభ్యుదయం కన్పిస్తుంది ? కారణం ?
అభ్యుదయం అంటే మార్పు ,చైతన్యం . ఎప్పటికప్పుడు మార్పు కావాలి .మార్పు ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుంది .

*మీ రచనలు చదువరులకు చేరిన తర్వాత మీ రచన ఆశయం నెరవేరిన సందర్భాలున్నాయా ?
ఉన్నాయి .నా రచనలు చదివాక స్పందించి నాతో మాట్లాడిన వారున్నారు.నా నవలలు చదువుతుంటే ఒక మనిషి ఎలా వుండాలి ? ఎలా నిర్ణయాలు తీసుకోవాలి? ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎలా పరిష్కరించుకోవాలి అన్నది సులభంగా తెలిసి పోతుందని అంటుంటారు. అది నాకు ఆనందమే .

.*మీరు ఆకాశవాణి లో కూడా మీ రచనలు వినిపించారు కదా ?
అవునండి . ఆకాశవాణి కడప కేంద్రం వాళ్లు నా కథానికల్ని,కవితల్ని ప్రసారం చేసారు .. 23`03`2012 వరంగల్‌ ఆకాశవాణి వారు నిర్వహించిన కవి సమ్మేళనంలో కూడా పాల్గొని కవితను వినిపించడం జరిగింది.

*మీరు రచనా వ్యాసంగం చేయడానికి కారణం ?

ప్రత్యేకమైన కారణాలేం లేవు . మొదట్లో అచ్చులో పేరు చూసుకోవటం కోసం రాసాను. అది చూసి పొగుడుతుంటే పొంగి పోయాను. ఇప్పుడు రాయకుండా ఉండలేక రాస్తున్నాను . ఏది రాసినా అది చదివిన వాళ్లకి ఉపయోగంగా వుండాలన్నది మాత్రం తప్పకుండా పాటిస్తాను .

*మీ గురించి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తుంది ?
సంతోషం అనిపిస్తుంది .ఎవరైనా తాము ఎలా వుండాలని కోరుకుంటారో దాని కోసమే కృషి చేస్తారు.నేను కూడా అలాగే చేస్తున్నాను. నా కృషికి తగిన ఫలితమే నాకు అందుతోంది .అంతే  కాదు నన్ను ఎవరైనా ప్రేమిస్తే బావుండు అనే భావన నుండి బయటపడి నన్ను నేను ప్రేమించుకునే స్థాయికి ఎదిగాను.

022 - Copy (2)444

*మీవి ప్రచురించబడిన కథలు, కవితలు వాటి వివరాలు చెబుతారా?

ప్రచురించబడ్డ కధలన్నీ ‘‘జీవితం అంటే కథ కాదు’’ అనే కథల సంపుటిగా (2009)లో వచ్చాయి. అలాగే ప్రచురించబడ్డ కవితలన్నీ ‘‘గుండెలోంచి అరుణోదయం’’ కవితా సంపుటిగా (1986)లో వచ్చాయి. ఇప్పుడు కూడా సాహిత్య పత్రికల కోసం అప్పుడప్పుడు కవితలు రాస్తుంటాను. కవిత్వం రాయడాన్నే నేను ఎక్కువగా ఇష్టపడతాను.

*మీవి ప్రచురించబడిన నవలలు ?
‘‘మధురిమ ‘‘ (ప్రగతి వీక్లీ సీరియల్‌ ` 1981), ‘‘నీకు నేనున్నా . . .‘‘ (డైరెక్టు నవల`2008),‘‘మౌనరాగం‘‘ (నవ్య వీక్లీ సీరియల్‌` 2009) ,‘‘ఈ దారి మనసైనది‘‘ (స్వాతి వీక్లీ సీరియల్‌ `2010) ,‘‘ రెండోజీవితం‘‘ (స్వాతి వీక్లీ సీరియల్‌`2011) ,‘‘ఆమె అతడిని మార్చుకుంది‘‘ (డైరెక్టు నవల ` 2013) , ‘‘జ్ఞాపకం‘‘: (డైరెక్టు నవల` 2014)

ఎనిమిదోఅడుగు ‘‘ (విహంగ అంతర్జాల పత్రికలో ) ,‘‘ఆరాధ్య‘‘( మాలిక.ఆర్గ్) ,‘ఇలా ఎందరున్నారు?’ (అచ్చంగా తెలుగు.కామ్ ) ‘‘ మొదలైనవి ప్రస్తుతం ధారావాహికలుగా వస్తున్నాయి . .

*మీరు అందుకున్న పురస్కారాల గురించి చెప్పండి ?

చెబుతాను అరసి!  ముందుగా నాకు 11`1`1987లో ‘‘ఉమ్మెత్తల’’ సాహిత్య అవార్డు వచ్చింది. ఆ తర్వాత  22`04`2010లో  లేఖని సంస్థ వారి యద్దనపూడి సులోచనారాణిగారి మాతృమూర్తి ‘‘నవలా పురస్కారం’’… 26`01`2012లో హెల్త్‌కేర్‌ ఇంటర్‌నేషనల్‌ వారి ‘‘జాతీయ పురస్కారము’)… 06`05`2012లో ‘‘న్యూస్‌మేకర్‌ సెలబ్రిటీ’’ పురస్కారం… 08`03`2014లో ‘‘భారత మహిళా శిరోమణి’’ పురస్కారం అందుకున్నాను.

*కవయిత్రి శిలాలోలిత గారు తను రాసిన ధీసెస్‌లో మీ ‘‘గుండెలోంచి అరుణోదయం’’ కవితా సంపుటిలోని కవితల గురించి ప్రస్తావించినట్లు తెలిసి మీరెలా ఫీలయ్యారు?

 ఎప్పుడైనా తమ కవిత్వాన్ని ఏ స్థాయిలో చూసుకుంటే రాసినవాళ్ళు ఆనందిస్తారో అంతకన్నా ఎక్కువ ఆనందాన్ని అనుభూతించాను. ఇది నాకు ఎప్పటికీ గర్వంగానే వుంటుంది.

*మీలో మీకు నచ్చిన అంశం ?
మన కన్నా గొప్పవారిని ఎప్పుడూ అగ్నిహోత్రంలా భావించాలి. వారికి అత్యంత సన్నిహితంగా ఎప్పుడూ వెళ్లకూడదు. దగ్దమైపోతాము. అలా అని దూరంగా వుండకూడదు. మనస్సు గడ్డ కట్టుకు పోతుంది.

*మీరు మరిచిపోలేని ప్రశంసలు మా విహంగ పాఠకులతో పంచుకుంటారా ?
నేను విద్యార్ధినిగా ఉన్నప్పుడు రాసిన నా కవితల్ని ఒకసారి మహాస్వప్న గారికి చూపించడం జరిగింది . వయసు చిన్నదైనా కవితలు ఒక స్థాయిలో ఉన్నాయని మెచ్చుకున్నారు . తరవాత నేను రాసి కథల పుస్తకానికి ముందుమాట రాస్తూ ఆ విషయాన్ని ప్రస్తావించడం ఎప్పటికి మరచిపోలేను .

*ప్రస్తుతం మీ రచనలు ఏయే పత్రికల్లో ప్రచురింప బడుతున్నాయి?

​2013 నుంచి ‘విహంగ మహిళా అంతర్జాల పత్రిక'(విహంగ.కామ్) లో ‘ఎనిమిదో అడుగు’ ధారావాహిక నవల ​,విహంగ గ్లోబల్ ఆంగ్ల పత్రిక (విహంగ.ఆర్గ్ ) లో ‘ ది సైలెంట్ మెలోడీ’ ధారావాహిక నవల ,అచ్చంగా తెలుగు.కామ్ లో ‘ఇలా ఎందరున్నారు ?’ మాలిక . ఆర్గ్ లో ‘ఆరాధ్య’ ధారా వాహికలు ప్రచురింప బడుతూ వున్నాయి . 

*అంతర్జాలంలోకి ఎప్పుడు ప్రవేశించారు? మీ అనుభవాలేమిటి?

​అంతర్జాలం అంటే నాకు తెలిసింది విహంగ అంతర్జాల పత్రిక ద్వారానే . ఇప్పుడు మూడు అంతర్జాల పత్రికల్లో నా నవలలు  ధారావాహికగా  వస్తున్నాయి . ఈ విషయంలో నేనెప్పుడూ విహంగ కి కృతజ్ఞురాలిని . 

*​మీ నవలల ముఖ చిత్రాలకి , మీ నవలలోని కథకీ సంబంధం వున్నట్టు కనబడదు. ఏంటి కారణం?

​ఇదే మాట చాలా మంది పాఠకులు అడిగారు నన్ను. దీనికి కారణం బుక్ పబ్లిషర్లు .కవర్ పేజీ ఆకర్షణీయంగా  ​వుండటం కోసం అలా డిజైన్ చేస్తారు . దీని వల్ల  నేను బాధపడిన సందర్భాలున్నాయి . 

*రాబోయే రచనలు ?
“మౌన ఘర్షణ” , “ఒక చిన్న అబద్దం” రచనలు ప్రముఖ పత్రికల పరిశీలనలో ఉన్నాయి .

*మీ రచనా వ్యాసంగం మీ పిల్లలకి అబ్బిందా ?

లేదు. పిల్లలకి రాలేదనే బాధ కూడా నాకు లేదు .పిల్లల ఆశలు , ఆశయాలు వేరు.  ​రచన అనేది అనుభవం లోంచీ , సాధన్లోంచీ వచ్చేది . కీర్తి దాహం మనిషిని ఋషిని చేస్తుంది 

* రచనలు చేస్తున్నoదుకు ​ఎప్పుడైనా బాధ పడ్డారా ?

రచనలు చేస్తున్నందుకు నేనెప్పుడు బాధ పడలేదు .

*పుస్తకాలు అచ్చు వేసి ఆర్ధిక నష్టానికి గురయ్యారా ?

 ఆర్ధికంగా నష్ట పోలేదు . 

*ఇప్పటి వరకు రాసిన రచనలు సంతృప్తినిచ్చాయా? ఇంకా రాయాలి అనుకున్న అంశాలు మిగిలి ఉన్నాయా?

​చాలా సంతృప్తినిచ్చాయి. ఎందుకంటే అవన్నీ ప్రముఖ పత్రికల్లో కథలుగా , ధారావాహికలుగా ప్రచురించబడ్డాయి . రాసిన ప్రతి రచన వెలుగులోకి వచ్చింది .తిరిగి రాలేదు . అదొక సంతృప్తి.ఇంకా రాయాలనుకున్న అంశాలు చాలా వున్నాయి . రాయగలిగితే అంతం లేదు . ​

​*గృహిణి గా , రచయిత్రిగా కుటుంబ బాధ్యతల్నీ రచనా జీవితాన్నీ ఎలా సమన్వయం  చేసుకుంటున్నారు ?

​నా కుటుంబాన్నీ , రచనలనీ చూసుకున్నప్పుడు ​గృహిణి గా , రచయిత్రిగా ఎప్పటి పాత్రను అప్పుడు బాగానే పోషించినట్టు అనిపిస్తుంది . ​ఈ రోజు నా ఉత్సాహానికీ , బలానికి కారణం అదే .

*మీకు నచ్చిన వ్యక్తులెవరు ?

పాజిటివ్ థింకింగ్ తో ప్రశాంతంగా వుండే వాళ్ళు ,ఇతరులను గాయపెట్టని వారు నాకు నచ్చుతారు. నాకు ఫ్రెండ్స్ తక్కువ . అందుకనే నాకు టైం సేవ్ అవుతుంది.   

*సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నారు ?

కంప్యూటర్ ఇప్పుడిప్పుడే వాడుతున్నాను .కానీ నా మనసు వెళ్లగలిగినంత వేగంగా ​నా కలమే వెళ్ళగలదు . అదే నాకు తృప్తినిస్తుంది .
అందుకని కూర్చుని రాయగలిగినంత కాలం నా కలం తోనే రాస్తాను . అలా కూర్చునేందుకు సౌకర్యాలు ఇంకా ఎక్కువగా కల్పించుకుంటాను . 

* కథలు రాయాలి అనుకునే వారికి మీరిచ్చే సలహా ?
ముందు కథలు బాగా చదవాలి . అందుబాటులో వున్న కథకుల్ని కలవాలి . దానితో పాటు సాహిత్య వాతావరణాన్నికల్పించుకోవాలి . ఆ తరువాత మనం రాసేది అది చదివే వాళ్ళకి ఎంత వరకు ఉపయోగపడుతుంది అనేది ఒకసారి చూసుకోవాలి .

*మీరు కృతజ్ఞతలు తెలుపుకునే వాళ్లు ఎవరైనా వున్నారా?

 వున్నారండీ! నేను రచనలు చేస్తున్న తొలిరోజుల్లో ‘‘హామిపత్రం’’ ఎలా రాయాలో రాసి చూపించారు శ్రీమతి పవని నిర్మల ప్రభావతి గారు. ఆమె నా ఆత్మీయ రచయిత్రి. ఆమెకు నా కృతజ్ఞతలు.

మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి మీ భావాలను , అనుభవాలను విహంగ చదువరుల కోసం నాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు .

-అరసి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ముఖాముఖి, , , , , , , , , , , , , , , , , , , , , , Permalink

4 Responses to నవలా రచయిత్రి అంగులూరి అంజనీ దేవితో ముఖాముఖి

  1. Pingback: వీక్షణం – 118 | పుస్తకం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో