
కె.వరలక్ష్మి
నా చదువుకి ఆటంకం కలగకుండా చూసిన మా నూజిళ్ల తెలుగు మాస్టారి మాటంటే వేద వాక్యమే నాకు . అప్పట్లో ఆయన చెప్పగా మనసులో నాటుకుపోయిన కొన్ని జీవన సూత్రాలు నా వెన్నంటే ఉన్నాయి ఇప్పటికీ . ‘ ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపించు ‘ లాంటి గాంధీ సూక్తులు , ‘ అవతలి వాళ్లు మనని బాధించినా మనం తిరిగి వాళ్లకి అపకారం తల పెట్టకూడదు ‘ లాంటి హిత వచనాలు . కాని ఇలాంటి హిత వచనాల వల్ల అవతలి వాళ్లు శాడిస్టు లైతే పదే పదే మనం బాధను ఓర్చుకోవాల్సి వస్తుంది , వచ్చింది . ఒకే ఒక్కసారి మా మాస్టారి మాటను నిరాకరించాల్సి వచ్చింది . ఆ సంవత్సరం బొండా వారి వీధిలో వినాయక చవితి ఉత్సవాలకు మాస్టారు వాళ్లు ఒక నాటకం వేయాలనుకున్నారు . కథా నాయకి పాత్రను నన్ను వెయ్యమని అన్నారు . నాకు వెంటనే మా రామలక్ష్మి ఉంది కదా అన్పించింది . తను మాస్టారి మరదలు . బాగా పాడుతుంది. చక్కగా ఉంటుంది . తనని కాకుండా నన్నే ఎందుకు అడుగుతున్నారు ? “ మా ఇంట్లో ఒప్పుకోరు బాబూ “ అంది రామలక్ష్మి . నేను మాస్టార్ని క్షమాపణ అడిగి , నిరాకరించేను .
ఒకసారి మా ఇంటికి రామలక్ష్మి పిన్నిగారమ్మాయిలు లంక అన్నపూర్ణ , వాళ్ళక్క జయలక్ష్మి వచ్చేరు . వాళ్లది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం . అన్నపూర్ణ అప్పుడప్పుడే కూచిపూడి నర్తకి గా పేరు తెచ్చుకుంటోంది . జయలక్ష్మి చాలా మంచి గాత్రం . పాట పాడమంటే తను “ శివ శివ శివ అనరాదా …” అనే గీతాన్ని అద్భుతంగా పాడింది . మా నాన్నకి ఎంతో నచ్చింది . చాలా మెచ్చుకున్నారు . “ ఎవరైనా పాడమంటే అలాంటి పాటలు పాడాలి “ అన్నారు . అప్పటి వరకూ నేను ఎవరు పాడమన్నా సినిమాలలోని భక్తి గీతాలో , అభ్యుదయ గీతాలో పాడుతూండేదాన్ని. అప్పట్నుంచీ రేడియోలో వచ్చే లలిత గీతాల్ని నేర్చుకుని పాడడం మొదలు పెట్టేను .
దసరా సెలవుల ముందు అంతవరకూ నేను చూడని కొత్త చుట్టాలు వచ్చేరు మా ఇంటికి . మా అమ్మ పెద్ద మేనత్త , ఆవిడ పెద్ద కూతురు నాగరత్న , చిన్న కూతురు అమ్మడు , నాగత్త కొడుకు రాజు వచ్చేరు . చాలా కాలంగా వాళ్లు గోదావరి కవతల అమలాపురంలో ఉండి పోయేరు . అప్పట్లో గోదావరి దాటి ఇవతలికి రావడం పెద్ద ప్రయాణమే మరి ! నాగత్త వాళ్లా యనకి సామర్లకోట రైల్వే స్టేషనుకి బదిలీ అయిందట . అందరూ గలగలా మాట్లాడే వాళ్లే . రెండు మూడు రోజులు మా ఇల్లు సందడి సందడిగా అయిపొయింది . నాగత్త బలే అందమైంది . పెద్ద పెద్ద కళ్ళు , చక్కని పలు వరస , అందమైన నవ్వు , మంచి కంఠస్వరం . మా పెద్ద మామయ్యా , తనూ ఒక ర్నొకరు ఎంతో ఇష్టపడ్డారట . మా తాతయ్య వొప్పుకోక ఆ పెళ్లి జరగలేదట . రూపంలో గాని , గాత్రంలో గాని ఆవిడకి పక్కా వ్యతిరేకం వాళ్ల చెల్లెలు అమ్మడు . అమ్మడుని మా నాలుగో మావయ్య వీరబాబుకి చేసుకోమని మా అమ్మని అడిగింది వాళ్లమ్మ .’ తప్పకుండా ‘ లేరు . మిగతా వాళ్లందరికీ మా అమ్మ చెప్పిందే వేదం .
దసరా సెలవులొచ్చే వరకూ మా ఇంట్లోనే ఉండి నన్ను వాళ్లింటికి సామర్లకోట తీసుకెళ్లింది అమ్మడు . ఇంటందరూ నన్నెంతో అపురూపంగా చూసుకొనే వారు . రాజు అక్కా అక్కా అని నన్ను అంటి పెట్టుకుని తిరిగే వాడు . రైల్వే క్వార్ట ర్స్ లో పట్టాల పక్క ఇల్లు వాళ్లది . రైలు బళ్లని అంత దగ్గర్నుంచి చూడడం అదే మొదటిసారి నాకు . అన్నం , నీళ్లు మరచిపోయి వచ్చే పోయే రైలు బళ్లని చూస్తూ ఉండి పోయేదాన్ని . “ ఓసి నీ ఇల్లు బంగారం గాను “ అంటూ నాగత్త గుమ్మంలోకే అన్నం తెచ్చి తినిపించేది . అమ్మడు నాకన్నా ఆరేళ్లు పెద్దదట . అయినా నాతో కలిసిమెలిసి ఉండేది . రెండు మూడు సార్లు కాలవకి అడ్డం పడి నడుచుకుంటూ భీమేశ్వరాలయం , విష్ణాలయం చూడ్డానికి వెళ్లేం . ఇప్పుడు మళ్లీ ఆలయాన్ని పునరుద్ధించేరు కాని , అప్పటికి చుట్టూ ప్రహారీలు పడిపోయి పాడు పడినట్టుండేవి . బ్రిటిష్ వాళ్లోచ్చి రైల్వే లైన్లు వేసేక కాలవకివతల సామర్లకోట అనే ఊరు పెరిగిందట కాని , చాళుక్యుల కాలంలో గొప్ప ప్రాభవంతో వెలిగిన ఉండీ భీమవరం అదేనట . వీరేశలింగం గారు రాజశేఖర చరిత్రం లో కూడా ఆ ఊరి ప్రస్తావన ఉంది . ఇప్పుడా ఊరు ఆనవాళ్లు లేకుండా పంట పొలాలుగా మారి పోయింది కాని యాభై ఏళ్ల క్రితం అక్కడక్కడ పడిపోయిన మట్టి ఇళ్లు ఆనవాళ్లుండేవి .
ఒకరోజు అమ్మడు పక్కింటికి తీసుకెళ్లింది . ఆ ఇంట్లో గోడల మీద సినిమా నటి మణిమాల ఫోటోలున్నాయి . అది మణిమాల కుటుంబం . మణిమాల తల్లిగారు అచ్చంగా మణిమాల లాగే ఉన్నారు . ఇంకో రోజు అప్పటి అందాల నటుడు హరనాద్ గార్ని రైల్వే స్టేషన్లో చూసేను . పాత బస్సు స్టేండు మలుపులో వెంకటేశ్వరా స్టూడియో అని ఒక ఫోటో స్టూడియో ఉండేది . ఆ స్టూడియో ఓనరు నాగత్త వాళ్ల చుట్టమట . రోజూ కాకినాడ నుంచి రైల్లో వచ్చి కేరియరు వీళ్ళింట్లో పెట్టుకుని వెళ్లి . లంచ్ టైంలో వచ్చి తినేవాడు . అతను అమ్మడునీ నన్నూ ఒక రోజు స్టూడియోకి తీసుకెళ్లి ఫోటో తీసేడు .దసరా తర్వాత వచ్చే ముహూర్తాల్లో అమ్మడుకీ , మా మావయ్యకీ పెళ్లైంది . అప్పట్నుంచీ నేను అమ్మడుని ‘ అక్కా ‘ ని పిలవడం మొదలు పెట్టేను . మా మావయ్యల భార్యల్లో మా పెద్దత్తలాగే అమ్మడు కూడా మాతో చాలా ఆప్యాయంగా ఉండేది .
నేను సామర్లకోటలో ఉన్నప్పుడు రాజమండ్రి అబ్బాయి మళ్లీ వచ్చేడట . అతని క్రాఫ్ ఒత్తుగా చాలా బావుందట . ఇప్పుడు చూడ్డానికి బాగున్నాడట . “ అయినా రంగేం చేసుకుంటాం ., కొరుక్కు తింటామా ? నిన్నెంత ఇష్టపడకపోతే మళ్లీ మనింటికి వత్తాడు !” అంటూ ఓ పక్క శేషమ్మ , మరో పక్క మా అమ్మ నన్ను ఊదర గొట్టడం మొదలు పెట్టేరు . “ నన్ను చదువు కోనియ్యండి తల్లీ “ అని నేనో నమస్కారం పెట్టేసెను .
ఇదంతా యాభై ఏళ్ల నాటి మాట . కాని , ఇప్పటికీ మూడొంతుల బి.సి ల ఇళ్ళల్లో ఈ పరిస్థితి మారలేదు . ఆడపిల్ల పెద్ద మనిషి అయ్యిందంటే చాలు పెళ్లి సంబంధాలు చూడ్డం మొదలు పెడతారు . ముప్ఫై ఏళ్లు వచ్చేసరికి అమ్మమ్మలు కూడా అయిపోతారు .
మాడ్రామాల దొడ్డిలో రెండు గదుల చిన్న ఇల్లొకటి కట్టించేరు . మా పిన్నమ్మ , ఆ ఇంటికి మారిపోయింది . ఆ దొడ్లోనే పెద్ద గడ్డి మేట్లు వేసి , పశువుల్ని అక్కడే కట్టెయ్యడం మొదలు పెట్టేరు . నాకు ఎప్పుడంటే అప్పుడు పుస్తకం పుచ్చుకుని పిన్నమ్మ ఇంటికెళ్లి పోయే అవకాశం పోయింది . కాని , రెండు మూడు రోజులకోకసారైనా పిన్నమ్మ యానాదుల తూము వెనక నిలబడి , స్కూలు నుంచి వస్తున్న నన్ను పిల్చుకెళ్లి పాకం గారెలు , పెరుగు గారెలు , ఉల్లి గారెలు లాంటివి తిన్పించేది . “ సదూకోడానికి బలం రావాలంటే బాగా తినాలమ్మా “ అని చెప్తూండేది .
ఆ సంవత్సరం పరీక్షల్లో మళ్లీ ఓసారి కళ్ళు తిరిగి పడిపోయేను . అప్పట్లో ఇప్పతంట ఆరోగ్యాన్ని గురించి పరిజ్ఞానం ఉండేది కాదు . ఇప్పుడు పిల్లలు ‘ఊ ‘ అని మూలిగితే హాస్పటలుకి పరుగెడుతున్నాం గాని అప్పట్లో ఏ కషాయమో తాగించి తృప్తి పడేవారు . ఆ పరీక్షల్లోనే పిప్పిపన్ను నొప్పి వచ్చింది . ఊళ్లో పళ్ళ డాక్టరు లేక కాకినాడ తీసుకెళ్లేరు మానాన్న . పన్ను తియ్యడానికి ఐదు రూపాయలు , సిమెంటు ఫిల్లింగు కైతే పడి రూపాయలు అన్నాడు డాక్టరు . తక్కువ లో అవుతుందని ఐదు రూపాయలిచ్చి పన్ను తీయించేసారు. ఓ రోజు మా పందిరి మంచం మీద నిద్ర పోతున్నప్పుడు పొడవైన వేళ్ళున్న రెండు చేతులు వెనక నుంచి నా గొంతు నులిమేస్తున్నట్టు అన్పించి విలవిల లాడిపోయేను . మెలకువొచ్చి కళ్ళు తెరిచిన తర్వాత కూడా ఆ చేతులింకా నా గొంతు మీద ఉన్నట్టే అన్పించేది . ఇన్నేళ్ళ జీవిత కాలంలో కొన్ని పదుల సార్లు ఆ భ్రాంతి లోనయ్యేను . తర్వాతెప్పుడో మెడికల్ జర్నల్స్ లో చదివేను అది కూడా బ్లడ్ సర్క్యు లేషన్ కి సంబంధించిన ఒక ప్రక్రియ అని .
ఆ సంవత్సరం వేసవి సెలవుల్లో జి .వి .బి వాళ్ళక్క సత్యవతికి పెళ్లైంది . వరుడు కాకినాడలో ఇంజనీరింగ్ చదువుతున్నాడు . అప్పటికి జి .వి .బి వాళ్లు కోమట్ల వీధిలో జయవరపు వారింట్లో ఉంటున్నారు . ఆ పెళ్లి వాళ్ల వాకిట్లోనే నాళం వారింటి ముందు జరిగింది . నేను , మా పెద్ద నాన్నగారమ్మాయి నూకరాజు పెళ్లిలో లేని పనులన్నీ కల్పించుకుని తెగ హడావుడిగా తిరిగేసాం . నూకరాజు పొట్టిగా ఉన్నా డబ్బపండు ఛాయలో బావుండేది . కాని , పెళ్లి కొచ్చిన ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కొందరు కెమేరాలు తెచ్చిన వాళ్లు నేనెక్కడుంటే అక్కడికొచ్చి ఫోటోలు తీసుకోవడం మొదలు పెట్టేరు . అప్పట్లో అలా అబ్బాయిలు ఫోటోలు తీసి ఎం చేస్తారో అనే భయం ఏదో ఉండేది . వాళ్లు కెమేరా సరి చూసుకునే లోపల నేనక్కడి నుంచి వెళ్లి పోయేదాన్ని . మొత్తానికి పెళ్లి కొడుకు చేత చెప్పించి , ఒంటరి ఫోటోకి ఒప్పుకోకపోతే నన్ను , పెళ్లి కూతుర్ని , వాళ్ల పిన్నిని కలిపి తీసేరు . జిడ్డు మొహాల్తో మహా ఘోరంగా వచ్చిందా ఫోటో .
జి.వి.బి కి నలుగురు మేనమామలు . అందులో ఒకాయన సినిమా డైరెక్టరు బి .వి.ప్రసాద్ . పెళ్లి జరిగిన మర్నాడు ఆయన చిట్టి వలస జూట్ ఫేక్టరీ లో పని చేస్తున్న వాళ్ల చుట్టాలబ్బాయికి పెళ్లి సంబంధం కోసమని మా పెద్దనాన్న గారింటికి , మా ఇంటికి వచ్చేడు . మా నాన్న ఇంట్లో లేరు . మా అమ్మ నన్ను టీ పట్టు కెళ్లి ఇమ్మంది . టీ గ్లాసుతో బాటు నా వేళ్ళను కూడా కలిపి పట్టుకున్నాడాయన . నేను విసురుగా చెయ్యి లాక్కునే సరికి సగం టీ ఒలికి పోయింది . నేను నిర్ఘాంత పోయి చూసేనాయన్ని . ఆ టీ గ్లాసు అతని నెత్తిన బోర్లించి ఉండాల్సిందని తర్వాత అన్పించింది .
ఆ విషయం జి.వి.బి తో అంటే “ ఆయన ఆడవాళ్లని పరీక్షించడానికి అలాగే చేస్తాడు “ అన్నాడు .
“వాడేవాడు నన్ను పరీక్షించడానికి “ అన్నాను నేను .
ఆ సంవత్సరాంతానికి మా ఇంట్లో ఏదో మార్పు రావడం గమనించేను నేను . ఓ సంవత్సరం పండితే నాలుగేళ్లు ఎండే వర్షాధార భూముల్లో వ్యవసాయం మా ఇంటి పరిస్థితుల్ని తారుమారు చేసింది . మరోపక్క చిట్స్ పాడుకుని డబ్బులు తీసేసు కున్న వాళ్లు వాయిదాలు కట్టకపోవడం , కొత్తగా పాడుకున్న వాళ్లకి అప్పులు తెచ్చి ఇవ్వవలసి రావడంతో మా అమ్మ నగల్తో బాటు , మా అక్క చెల్లెళ్ళ ఒంటి మీది బంగారం కూడా వెళ్లిపోయింది . మా అమ్మ మెడలో సూత్రాల గొలుసు , నా మెడలో సన్నని ఒంటి పేట గొలుసు మిగిలేయి . పాలిచ్చే ఒక గేదెని , ఒక బండి – జత ఎడ్లు ఉంచి మిగతా వాటిని అమ్మేసేరు . వేలకు వేలు చిట్స్ డబ్బు లెక్క పెట్టి చాపల మీద చేర్చే మా పంచాది చిన్న బోయింది . భూముల్ని కూడా ఒక్కొకటిగా అమ్మడం ప్రారంభించేరు . పరిస్థితులకి అనుగుణంగా మా అమ్మ ఇంటి ఖర్చుల్ని చాలా తగ్గించేసింది . అందరికన్నా ముందు మా నాన్నమ్మ బాగా డీలా పడిపోయింది . హుషారుగా ఎప్పుడూ ఏదో పని చేస్తూ ఉండే మనిషి దిగాలుగా ఎక్కడో చోట కూర్చుండి పోయేది .
– కె.వరలక్ష్మి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~