రాత్రి సమయం మూడున్నర అయింది . రాత్రంతా పడక మార్చుకుంటూనే ఉన్నాను మనసు బరువుగా ఉంది, అస్తిమితంగానూ ఉంది, ఇంకా బాగా చెప్పాలంటే లోపలంతా ఉక్కగా ఉంది ఎవరితో పంచుకోవాలో తెలియడంలేదు, సంతోషాన్ని ఎవరికైనా పంచగలం. బాధని ఎవరికి పంచగలం ? ఆప్తులకి మినహా ! అందుకే ప్రక్కనే ఉన్న మన అన్న వారిని వదిలేసి దూరంగా ఉన్నాసరే వారినే మన ఆప్తులుగా జత చేసుకుంటాం వాసంతి అంతే కదూ ! ఆమె గురించిన ఆలోచనలే నాకు ఈ రాత్రి నిద్రని దూరం చేసాయి మరి కొన్ని రాత్రులు ఇలాగే ఉండబోతాయనుకుంటా !
ఇప్పుడు తను ఎలా ఉందో ? అనుకుంటూ మొబైల్ని చేతిలోకి తీసుకున్నాను . ‘whatsaap” లో టింగ్ మంటూ వచ్చిన మెసేజ్. చాట్ ఓపెన్ చేయకుండానే డిస్ ప్లే లో కనబడుతున్న సారాంశం .
” నేస్తం ! నువ్వు దూరంగా ఉన్నావనేమో రాత్రి నీ స్థానంలో దిండు వచ్చి నన్ను ఓదార్చింది .” మనసు మరింత బాధకి గురయింది . నిన్న నేను విన్న విషయం మర్చిపోలేకపోతున్నాను. రాత్రి ఏం జరిగిందో ! అదృష్టవశాత్తూ ఆమె ఆత్మహత్యా ప్రయత్నం విఫలమైంది కాబట్టి తేలికగా ఉన్నాను లేకపోతే… ఆ ఊహే భయంకరంగా ఉంది అయితే… నిన్నటి సంభాషణని అప్రయత్నంగానైనా మళ్ళీ గుర్తు చేసుకోవాల్సి రావడం బాధాకరం. ఇది నిత్య గాయాల జ్ఞాపకం కూడానూ .
వ్యధల జీవన సముద్రంలో మరి కొన్ని కన్నీటి చుక్కలు చేరుతున్నాయి. మరి కొన్ని ఆవిరవుతూ ఉన్నాయి నిన్నటి నుండి ఎడతెరిపి లేకుండా ఆలోచిస్తూనే ఉన్నాను. ఎంత ఆలోచించినా పరిష్కారం దొరకినట్టే దొరికి మరికొన్ని ప్రశ్నలని ముందు నిలిపి సవాల్ చేస్తుంది. ప్రశ్నతోనే ఆడదాని జీవితం ముగియాలన్నట్టు పనులు చేసుకుంటూనే వాసంతికి కొంత ఓదార్పు నివ్వాలనే ఉద్దేశ్యంతో ఒక ఉత్తరం వ్రాయాలనుకున్నాను. ఆలోచన రావడమే తరువాయి … క్షణంలో చేరుకునే ఈ – ఉత్తరం పెన్నిధిగా కనిపించింది నాకు .. మెయిల్ బాక్స్ ఓపెన్ చేసి వ్రాయడం మొదలెట్టాను.
వాసంతి ..!
నాకవకాశం ఉంటే ఈ ఉత్తరం బదులు ఉత్తర క్షణంలోనే నీ దగ్గరకి చేరాలని నిన్ను హృదయానికి హత్తుకుని నీ బాధని కొంతైనా పంచుకుని నిన్ను సేదదీర్చాలని ఉంది. నీకు దైర్య వచనాలనివ్వాలని, నీ భవిష్యత్ అగమ్యగోచరంగా మారకూడదని, నీ పిల్లల భవిష్యత్ ని నాశనం చేసే నిర్ణయాలు తీసుకోవద్దని, నీ వ్యక్తిత్వాన్ని, ఆత్మ గౌరవాన్ని భర్త పాదాల దగ్గరే పెట్టి నిత్యం అగ్ని సీతలా నీ పవిత్రతని నిరూపించుకోమని చెప్పడానికి ఈ లేఖ వ్రాయడం లేదు .
వాసంతి .. నీకు కొన్ని గాయాల సంగతి చెపుతాను విను. గాయాల సంగతి గాయానికి తెలిసినంతగా మరెవరికి తెలియదు అందుకే నీకు తప్పక కొన్ని విషయాలు చెప్పాలనిపిస్తుంది . నేనే చెప్పే విషయాలన్నీ ఎవరికీ ఎరుగనివ్వని అత్యంత రహస్య విషయాలు ఇవి . చెప్పుకోవడానికి కూడా సరైన మనిషి కావాలంటారు కదా ! ఆ మనిషి జాడ కనబడకేమో ఎంతో గోప్యంగా నాలో దాగిన విషయాలివి. నీకులాగానే మరికొందరు నాతొ పంచుకున్న వారి వారి చేదు అనుభవాలు. కానీ వీరందరూ నీలా ఆత్మహత్యా ప్రయత్నం చేయలేదు దైర్యంగా బ్రతికి చూపిస్తున్నారు . అందుకే వారి గురించి నీకు చెప్పాలనిపించింది.
ముందుగా ధరణి .. అనుభవం
నాకప్పుడు 16 ఏళ్ళు వయసు . నాకప్పుడు చాలా పెద్ద అవమానమే జరిగినట్టయ్యింది అదేమిటో చెప్పనా !? పెద్దమనిషయ్యానని తాటాకులపై కూర్చున్న మూడేళ్లకి కూడా ఆడమగ తేడా తెలియకుండానే అందరితో ఆడి పాడే మనసు . పెద్దవాళ్ళు ఇంకా నీకు మగపిల్లలతో ఆటలేంటే అంటే అసలు లేక్కపెట్టని నేను మగ పిల్లలతో ఎందుకు ఆడకూదదో తెలియని నాకు వాళ్ళ మాటలు కోపం తెప్పించేవి . వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళు చెప్పినట్టే విని తర్వాత స్వేచ్చగా మసిలేదాన్ని . ఒక రోజు బట్టలు ఉతికే చాకలి లక్ష్మి అమ్మ ఏదో మాట్లాడుకుంటూ నావైపు అనుమానంగా చూస్తున్నారు . తర్వాత అదేరోజు రాత్రి అమ్మ నాన్నతో ఏదో చెప్పింది తర్వాత వారిద్దరూ అనుమానంగా నావైపే చూస్తూ ఏదో మాట్లాడుకుంటున్నారు . తెల్లారి లేవగానే అమ్మ గబా గబా ఇంటిపనులు ముగించుకుని నన్ను కూడా బయటకి వెళ్ళడానికి తయారమని చెప్పి తను తయారయింది . “ఎక్కడికమ్మా వెళుతున్నాం? “అని అడిగాను ఉత్సాహంగా. అమ్మ మాట్లాడలేదు. ప్రక్కన ఉన్న టవున్ లో ఏ చుట్టాలింటికో తీసుకు వెళ్ళి తర్వాత సినిమాకి తీసుకెళుతుందేమోనని త్వర త్వరగా తయారయ్యాను .
అమ్మ నన్ను తీసుకుని హాస్పిటల్కి వెళ్ళింది .అమ్మకి బాగొలేదేమో తోడూ తీసుకొచ్చింది అనుకుని అమ్మతో లోపలి వెళ్లాను నన్ను బయటే కూర్చోబెట్టి లోపలి వెళ్లి డాక్టర్ తో మాట్లాడి వచ్చింది. తర్వాత నర్స్ వచ్చి నన్ను లోపలి తీసుకు వెళ్ళి లోపలి గదిలో బల్లపై పడుకోబెట్టింది. “నన్నెందుకిలా పడుకోబెడుతున్నారు నేను బాగానే ఉన్నాను కదా” అంటూ విదిలించుకుని బయటకి రాబోయాను . డాక్టర్ వచ్చి నా భుజంపై చేయి వేసి మృదువుగా అడిగింది “నీకు మూడు నెలలుగా నెలసరి రావడం లేదని అమ్మ భయపడుతుంది, పరీక్ష చేసి చూడాలి అందుకే నువ్వు బల్లపై పడుకోవాలి ” అని చెప్పి బలవంతంగా పడుకోబెట్టి గ్లవుజ్ తొడుక్కున్న చేయిని లోపలికి పెట్టి కెలికి చూస్తూ .. “నువ్వు ఎప్పుడన్నా మగాళ్ళతో పడుకున్నావా ? అలా పడుకుంటే నెలసరి రావు, కడుపు వస్తుంది. అది మీ అమ్మ భయం ” అని ఒక విధంగా నవ్వి చేతిని తీసి తొడుక్కున గ్లవ్స్ తీసి చేతులు కడుక్కుని నాప్కిన్ తో తుడుచుకుంటూ కుర్చీలో కూర్చున్న అమ్మ దగ్గరికి వెళ్లి కంగారు పడకండి అలాంటిదేమీ లేదు ఒకో సారి నెలసరిలు ఆలస్యంగా వస్తూ ఉంటాయి ” అని చెప్పింది . అమ్మ “అమ్మయ్య మంచి మాట చెప్పారు, ఏమైందోనని భయపడి చచ్చాను ” అని తేలికగా ఊపిరి పీల్చుకుంది. ఆనాటి పరీక్ష అదొక పెద్ద అవమానంగా తోచింది నాకు . 15 ఏళ్ళ పిల్ల శారీరక సంబంధం ఏర్పర్చుకుందేమో అని అనుమానపడే తల్లిదండ్రులు, కాలేజీకి పంపితే చెడు తిరుగుళ్ళు తిరుగుతారని ఆలోచించే వాళ్ళు అసలు శరీరాల కలయిక అంటే ఏమిటి , తమకి తెలియకుండానే ఏమిటో తెలుసుకోవాలన్న ఆసక్తి తో సెక్స్ లో పాల్గొనే వాళ్లకి, వంచనకి గురయ్యే ఆడపిల్లలకి గుప్పిట మూసి రహస్యాన్ని దాచినందువల్ల వచ్చే భద్రత కన్నా అనర్ధమే ఎక్కువ జరుగుతుందని అనిపించింది. నిజం చెప్పొద్దూ … మూడు నెలలు నెలసరి రాకపోతే ఆదుర్దా పడి అనుమానంగా చూసి , డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి పరీక్ష చేయించడం నా వరకు నాకొక పెద్ద అవమానంగా అనిపించింది.
మళ్ళీ అలాంటి అవమానమే ఇంకోటి పదిహేడేళ్ళకే పెళ్ళయ్యి భర్తతో తొలిరాత్రి నేనేదుర్కొన్న అనుభవం గరళం లాంటిదే! భర్త నాతో మాట్లాడిన మొదటి మాట, తొలి రాత్రి పానుపు పై కూర్చున్న నాపై మొరటుగా చేయివేసి .. అనుభవం ఉందా! అదే యాంగిల్స్ తెలుసా !? అని. అవమానంతో మనసు రగిలిపోయింది దంతాల రెండు వరుసలు గట్టిగా కరచుకున్నాయి. ఏ స్పందనా లేకుండా శరీరాన్ని అప్పగించే పని అప్పుడే మొదలయ్యింది. ప్రతి రాత్రి అతనికి నేనొక అవసరమే తప్ప అతని చేతల్లో, మాటల్లో ఏనాడు ప్రేమ దృక్కులని నేనెరగనని చెప్పుకోవడం కూడా నాకు అవమానంగా తోస్తుంది. భర్త ప్రేమకై పరితపించే బలహీనమైన మనసు కాకూదదనుకుని లేని కాఠిన్యాన్ని అరువు తెచ్చుకుని కొట్టినట్లు మాట్లాడే దాన్ని. అలా అందరిలో నేనొక పెడసరపు మనిషిననే ముద్ర పడింది నేనెప్పుడైనా మగవారితో మాట్లాడుతుంటే అతని చూపులు నా శరీరం చుట్టూ ప్రహరా కాస్తున్నట్లే ఉండేది. ఎవరైనా బందువులోచ్చి ఇల్లంతా రద్దీగా ఉన్నప్పుడు కూడా అతని ఆకలి తీర్చాల్సిందే! పడక సుఖం అందకపోతే ఆడముండలు ఇంకొకడిని తగులుకుంటారు నా దగ్గర మొగతనానికి కొదవేలేదు, రా వచ్చి పడుకో! అంటూ అసహ్యంగా ప్రవర్తించే వాడు సిగ్గుతో చచ్చిపోయే క్షణాలని ( కాదు కాదు యుగాలనాలేమో కదా) ఎలా మరచిపోగలను? రోజుకొక స్త్రీ ని అనుభవించాలనే కాంక్ష, పచ్చి త్రాగుబోతైన, అనుమాన పిశాసైన భర్త నీడ వేయి పడగల పాము నీడగా భయపడాల్సి రావడంకన్నా వేరొక దురదృష్టం ఉంటుందా చెప్పు ? ఓ పదేళ్ళు భరించాక నాపై నాకే జాలేసింది ఎదురు తిరిగాను . ఫలితం నిర్దాక్షిణ్యంగా నడివీదిలోకి నెట్టబడ్డాను. తర్వాత జరిపిన ఒంటరి పోరాటంలో నేను గెలిచాననుకుంటాను కానీ అడుగడుగునా శారీరక పవిత్రత అనే అగ్ని పరీక్షని ఎదుర్కుంటూనే ఉన్నాను ” అని ఆవేదన చెందే ధరణిలా ఎంతో మంది స్త్రీ మూర్తులున్నారని నువ్వు తెలుసుకోవాలి
ఈ మధ్య నాకత్యంత సన్నిహితులురాలైన కుసుమ బాధ విన్నప్పుడు ఆమె ఆత్మహత్య చేసుకోకుండా బ్రతికి ఉండటమే చాలా గొప్పనిపించింది తెలుసా ! ఆమె ఎంత ఆవేదనని మనసులో దాచుకుని నవ్వుతూ ఆ విషయాన్ని చెప్పిందో! ఇప్పుడు గుర్తుకు వచ్చినా కన్నీళ్ళు వస్తాయి మరి . అంత పచ్చిగా ఉంటుంది ఆమె గాయం .
కుసుమ మాటల్లో …. ఓ రెండేళ్ళ క్రిందట అనుకుంటా .. ఒళ్లేరుగని జ్వరంతో మంచం మీద పడిఉన్నప్పుడు అటుగా వచ్చిన నా కొడుకు స్నేహితుడు పలకరించిపోదామని వచ్చి నా స్థితిని చూసి హాస్పిటల్ కి తీసుకువెళ్ళి తర్వాత నా ఫ్రెండ్ కి నా విషయం తెలిపి ఆమె వచ్చేదాకా నాతొ హాస్పిటల్ లో ఉండి పది రోజులపాటు నిస్వార్ధంగా సేవ చేసాడు. నేను బాగా కోలుకున్నాక “నీ ఋణం తీర్చుకోలేను, ఎంతో సేవ చేసావ్ బాబూ ” అంటే “మీ అబ్బాయి నాకు స్నేహితుడే కాదు అన్నయ్య లాంటి వాడు. అన్నయ్య ఇప్పుడిక్కడ లేకపోతే ఆ భాధ్యత నేను తీసుకోవద్డా అమ్మా !” అన్నాడు. నిజంగా అతనిలో నాకు నా కొడుకే కనబడతాడు. అది మొదలు అప్పుడప్పుడు నాకేదన్నా సాయం కావాలంటే చేసిపెట్టటానికి వస్తూ ఉంటాడు. అందుకు ఓర్చుకోలేదు ఈలోకం. నా కొడుకు స్నేహితుడికి నాకు అక్రమ సంబంధం అంట గట్టి నా వెనుక చెప్పుకుంటారట . ఈ విషయం నాకు తెలిసినప్పుడు బ్రతుకు మీదే రోత కల్గింది. రెండు రోజులు ఏడ్చాను . తర్వాత గుండె నిబ్బరం చేసుకున్నాను . ఈ సమాజం ఆడదాన్ని ఒంటరిగా బతకనీయదు. ఎవరో ఒకరి అండలో ఉండాల్సిందే ! వాడు ఎంత తలకి మాసిన వెధవైనా సరే ! . ఒంటరిగా బ్రతికే దైర్యం ఆడదానికి ఉన్నా అక్రమ సంబంధాలు అంట గట్టి వినోదంగా చూస్తూ ఉంటుంది నలుగురు కలిసి నవ్వుకుంటూ మళ్ళీ వాళ్ళు విడిపోయాక ఇంకో నలుగురు కలిసి అక్కడ లేని వాళ్ళ గురించి మాట్లాడుకోవడం ఇదంతా సర్వసాధారణం అయిపొయింది. నైతికత అనేది ఆడదానికే ఉండాల్సిన ఆభరణమా ! గాయపడి, ఖేద పడి ఉన్న ఈ శరీరానికి, మనసుకి ఎప్పుడో ప్రిజుడిటీ వచ్చేసింది . ఎందుకురా బాబూ! ఎందుకమ్మా తల్లుల్లారా !! మళ్ళీ అలాంటి మాటలు మాట్టాడి మా శరీరం పై ప్రేమ పుట్టిస్తారు అని నవ్వుకుంటాను .. అని ఎంత బాధగా చెప్పిందో ! నేను కలలో కూడా ఆమె బాధ మరువలేను
ఇంకో స్నేహితురాలు కృష్ణప్రియ గరళమైన అనుభవాలు ఇవి … ఆమె మాటలు ఇలా ఉంటాయి.
“అసలు మన బాధని గురించి పట్టించుకోని లోకాన్ని మనమెందుకు లక్ష్య పెట్టాలి . ఎవరి బాధలు, ఎవరి గాయాలు వారివి. ఎదుటివారికి ఇవన్నీ ఎలా తెలుస్తాయి ? చెప్పినా అర్ధం చేసుకునే సహృదయత ఉందంటావా ?
సునీతా విలియమ్స్ గురించి కొన్ని చెత్త నోళ్ళు ఇలా వాగుతుంటాయి “అంతరిక్షంలో అంతమంది మగాళ్ళ మధ్య అన్నాళ్ళు గడిపివచ్చింది . ఏమి లేకుండానే ఉందంటారా? ” అని. ఆ మాటలు విని మనిషి గా పుట్టినందుకు ఎంత విరక్తి కల్గిందో నీకెలా చెప్పగలను. ఇక మన ఇంట్లో వాళ్ళు మనని అనుమానించడం తక్కువేం కాదు మనం ఎవరితో మాట్లాడినా ఆ సంబంధమేదో ఉన్నట్టు ఊహించుకుంటారు అనుమానంగా చూస్తారు . రహస్యంగా మనం మాట్లాడుకునే పోన్ సంభాషణలు వింటూ ఉంటారు కూడా అందుకు నా అత్తగారే ఉదాహరణ అంటూ చెప్పిన విషయాలు ఇవి . భర్త రాజకీయ నాయకుడి హత్య కేసులో చిక్కుకుని ఆరేళ్ళు జైలు పాలైతే ఒంటరిగా ఎంతో పోరాటం చేసింది ఆమె ప్రతి అడుగుని, ప్రతి సంభాషణని కుటుంబం అక్రమ సంబంధం దృష్టితోనే చూసింది కుటుంబం అండదండలు కావాలని అత్త,మరిది,ఆడపడుచులతో సన్నిహితంగా ఉంటూనే ఉన్నాను. ఒకసారి ఏం జరిగిందో తెలుసా ? “నా కూతురు విదేశాలకి ఉన్నత చదువుకి వెళ్ళే సమయంలో మా ఇంటికెదురుగా ఉన్న బిల్డర్ నుండి తప్పనిసరై మాట సాయం తీసుకున్నాను . పాపం! అతను కూడా నిస్వార్ధంగా శ్రద్ద తీసుకుని మాట సాయం చేసాడు. అలా నా క్లిష్టమైన పని సులభంగా జరిగిపోయింది. నా కూతురు విదేశానికి పయనమై వెళ్ళేటప్పుడు నాకు మాట సాయం చేసినతను కూడా వాళ్ళ ఇంటి గేటు ముందు నిలబడి ఉన్నాడు . అతనికి కూడా వెళ్ళొస్తానని చెప్పి చేసిన సాయానికి థాంక్స్ చెప్పి రా … అని నా కూతురికి చెప్పాను.. నే చెప్పిన మాట విని నా కూతురు అతని దగ్గరకి వెళ్లి వెళ్ళొస్తానని చెప్పి వచ్చింది . అప్పటి నుండి మా అత్తగారికి నా పై ఏదో అనుమానం . ఎప్పుడు కలిసినా అతని గురించి ప్రస్తావన తీసుకు వస్తారు, అతని గురించి నేను ఏం మాట్లాడతానో అని గమనిస్తూ ఉంటారు. ఇంటికి వస్తే సరాసరి బెడ్ రూం లోకి వెళ్లి చెక్ చేస్తూ ఉంటుంది. నా బెడ్ మీద ఒక ప్రక్క ప్రక్క నలిగి ఉందా లేక రెండు వైపులా నలిగి ఉందా అని పట్టి పట్టి చూడటం నేను గమనించాను. ఒకసారి నా ఫ్రెండ్ వచ్చి రాత్రి వేళ విడిది చేసి వెళ్ళింది. ఇద్దరం కలసి పడుకుని ఎన్నో ముచ్చట్లు చెప్పుకున్నాం అలాగే నిద్ర పోయాం నాకసలే బద్ధకం ఎక్కువ రోజూ ప్రక్కలు దులిపి నీట్ గా దుప్పట్లు పరిచే అలవాటు లేనితనం కదా! అదే రోజు మా అత్తగారు వచ్చి చెకింగ్ ఒకవైపే నలిగి ఉండాల్సిన ప్రక్క రెండవ వైపు నలిగి ఉండటం చూసి ఎవరు వచ్చారు? అని అడిగింది అప్పుడుకి గాని నాకర్ధమైంది ఆవిడ చెకింగ్ లకి అసలైన అర్ధం ” అని చెప్పింది
కృష్ణప్రియ చెప్పింది విని నివ్వెరపోయాను. ఇలాంటి అనుమానాల మధ్య జీవిస్తున్న స్త్రీల జీవితాల పట్ల ప్రేమ ఉప్పెనలా ముంచుకొచ్చింది. అసలు ఈ లోకంలో ఆడ మగ మధ్య శారీరక సంబంధం ఉండి తీరాల్సిందే అన్నట్లు నిర్ణయించేస్తారు . మన ప్రక్కన ఉంది తండ్రా ,బాబాయా ,అన్న, తమ్ముడా , కొడుకా ఈ వావి వరుసలేవీ అక్కర్లేదు. అలాగే వయసు తారతమ్యం కూడా పాటించాల్సిన అవసరం లేదు . ఆడది మగవాడితో మాట్లాడితే రంకు , నవ్వితే రంకు , తోటి మనిషిగా సాయమందిస్తే కూడా రంకులంటగట్టేంతగా సమాజం ఎదిగిపోయింది అనిపించింది నాకు.
మనిషికి మనిషికి మధ్య ఏ విధమైన సంబంధం ఉండకూడదు ఉంటే గింటే ఆ సంబంధం మాత్రమే ఉండాలనే ఈ మనుషుల మనస్తత్వాలని చూస్తే జాలి కల్గుతుంది. మనిషికి మనిషికి మధ్య సహజంగా ఉండాల్సిన మానవ సంబంధాల స్థానంలో, ఒకరికొకరు ఎంతో కొంత సాయం చేసుకుని ప్రేమాభిమానాలు పెంపొందించుకుని మనుగడ సాగించాల్సింది పోయి ప్రతి సంబంధాన్నీ ఆర్ధిక సంబంధం గాను, శారీరక సంబంధంతో కొలిచే ఈ సమాజంలో బతకడం ఎంత అవమానకరంగా ఉందొ తెలుసుకోవడానికి నాకు తెలిసిన సంగతులు చెప్పడం కూడా మంచిదే అనుకుంటున్నాను. నీకవి ఉపకరిస్తాయని చెపుతున్నాను తప్ప నిన్ను ఇంకా ఇంకా. ఆందోళనలోకి నెట్టడానికి కాదని అర్ధం చేసుకుంటావనే నమ్మకంతో వ్రాస్తున్నాను.
ఈ ఆడ పుట్టుకే అవమానకరం . తాటి మట్ట లాంటి నోరున్న మనుషుల పాలబడి నెత్తుటి ముద్దై పోతుంది . ఎనెన్ని అవమానాలు, వినడానికి ఎంత అసహ్యంగా ఉంటాయో కదా ! ఈ మనుషుల్లో సున్నితత్వం పోయి క్రూరత్వం చోటు చేసుకుంటుంది ఎన్నాళ్ళని ఓర్చుకోగలం? కంటికి కనబడే ఈ శరీరం చుట్టూ, కనబడిని మనసు చుట్టూ ఎన్ని కోట గోడలు కట్టుకోగలం? స్వేచ్చగా, గౌరవంగా మసిలే వీలు మనకి లేదా !? మనమూ మనుషులమే కదా ! గొడ్డు బతుకూ, బండ బతుకూ అయినా బాగుండేదని అప్పుడప్పుడూ ఏడ్చుకుంటాను . ఏడ్చి ఏడ్చి కసిగా పైకి లేస్తాను . అద్దం ముందుకు వెళ్లి ఏ సంకోచం లేకుండా నన్ను చూసి నేనే నవ్వుకుంటాను.
నా లాగే నువ్వు బాధని దిగమింగుకో ! ముందు నీ కన్నీళ్ళని గట్టిగా తుడుచుకో, బలంగా గుండెల నిండా ఊపిరి తీసుకుని నెమ్మదిగా శ్వాసని బయటకి వదులు. స్థిరంగా ఆలోచించు. ఈ శారీరక హింస, మానసిక హింస ఎన్నాళ్ళు ? అని ప్రశ్నించుకో ! ఓర్చుకున్నన్నాళ్ళు కాపురం సవ్యంగా సాగిపోతూ ఉంటుంది కనుక ఆ కాపురం విలువైనదిగా నీకు తప్పని సరైనదిగా కావచ్చు అనిపిస్తుంది . ఆ కాపురమే కావాలనుకుంటే నీ భర్తని ఈ రోజూ క్షమించేయి. క్షమించ గల మనసుంటే జరిగిన దానిని పూర్తిగా మర్చిపో ! లేదా మర్చిపోలేకపోతే క్షమించకు. భర్త తో కలిసి ఉన్నా నిత్యం అతని అనుమానపు ధృక్కుల నుండి నిన్ను నీవు నిలబెట్టుకోవడం ఎంత కష్టమో , లేక భర్త తో విడిపోయి నీ దారిన నువ్వు బ్రతుకుతూ ఉన్నాకూడా నువ్వు ఎదుర్కోవలసిన ప్రశ్న కూడా ఒకటే అయిందనుకో … ఏది మంచి అని నీకనిపిస్తే ఆ నిర్ణయం తీసుకునే శక్తి నీకే ఉండాలి. అందుకు నా సలహా కూడా అవసరం లేదని నా అభిప్రాయం,
ఆకలి, దారిద్ర్యం, నిరక్షరాస్యత నిలువునా చుట్టేసిన పేదలని ధనస్వామ్యం తన ఉక్కుపాదాలతో పాతాళానికి తొక్కేస్తుంటే బాగా చదువుకుని ఉద్యోగం చేసుకుంటూ పిల్లలని జ్ఞానవంతులుగా సంస్కార వంతులుగా, ప్రేమ మూర్తులుగా తీర్చి దిద్దాల్సిన భాద్యత ఉన్న నీ భర్త లాంటి వాళ్ళు ఇంకా ఇంకా సగభాగంపై చెలాయించే ఆధిపత్య భావజాలం భార్యపై నమ్మకం లేనితనం రోత పుట్టిస్తుంది. అతనికి మానసిక చికిత్స అవసరమనిపిస్తుంది. ” బ్రతకాలంటే వేరొకరిని చంపాల్సిన పనిలేదు, చావాల్సిన పనిలేదు” అని అతనికి తెలియాలి
నీకొక కథ గుర్తుకు రావడం లేదా ? బాట లో నడుస్తున్న అతన్ని కుక్క తరుముతుంది భయంతో ఆతను పరుగు పెడుతున్నాడు. ఒకరి సలహా విని ఆగి రాయి పుచ్చుకుని వెనక్కి తిరిగాడు కుక్క వెంటపడటం ఆపింది. సమాజం కుక్కలాంటిది మొరుగుతూనే ఉంటుంది. నిబ్బరంగా నిలబడి ఎదురుతిరిగితే తోక ముడుస్తుంది.
మన బతుకలని మనని బ్రతకనివ్వని ఈ సమాజం వేసే ఆ ప్రశ్న నీ శరీరపవిత్రత (?) కే సంబంధించిందే అయి ఉండటమన్న దురదృష్టకరమైన స్థితి ఏ ఆడజన్మకి వద్దు . అది శాపమా ? పాపమా ? అన్నది అసలు ఆలోచించవద్దు . చందమామ చూడటానికి చాలా అందంగా ఉంటుంది అచ్చు స్త్రీ లాగా అది ఇచ్చే వెన్నెల కూడా చల్లగా ఉంటుంది స్త్రీ ఇచ్చే ఆహ్లాదం లాగానే . కానీ చందమామలో ఆ మచ్చ ఏమిటో తెలుసా !? అది మనపై పడుతున్న అవమానాల మచ్చ, వ్యక్తిత్వం, ఆత్మగౌరం లేకుండా బతికి ఉండటం అన్నింటికన్నా అవమానమనిపిస్తుంది నాకు. నేటి తరం వాళ్ళు మనమనుభవించే అవమానాన్ని, బాధలని ఒక్క రోజు కూడా భరించలేరు కూడా ! అయినా అమ్మ మాత్రం అన్ని భరించాలనే ఆలోచన చేస్తారు. పిల్లలు కూడా స్వార్ధపరులే కదా !
ఎవరి ఆలోచనలని బట్టి, మానసికస్థితిని బట్టి వారి ప్రవర్తన బహిర్గతమవుతుంది, అది తెలుసుకో చెలీ ! నీ దుఖాన్ని నేను తీర్చలేను. అలా అని నిన్ను నీ ఖర్మానికి ఒదిలి వేయలేను. నేను ఏ సలహా చెప్పలేను . నా మనసంతా బాధగా ఉంది పచ్చిగా ఉంది. మన ఈ దుఃఖాలు మనవి మాత్రమే కాదు చెలీ ! సమూహాలవి. ఈ సమూహాలు పెరిగి పెద్దవుతున్నాయి . ఓదార్చే ఒడి లేక భూమాత ఒడిని వెతుక్కుంటున్నాయి. ఆ ఒడిని వెదుక్కునే అవసరం నీకు రానీయకు అని మాత్రం చెప్పదలచాను . ఎందుకంటే ఆర్ధిక స్వాతంత్ర్యం లేని స్త్రీలు , అన్నీ ఉన్నా కూడా అణువణువునా నిరాశ నింపుకున్న స్త్రీలు ఆవేశంలో క్షణికంలో నిర్ణయాలు తీసుకుని జీవితాన్ని అంతం చేసుకుంటారు, ఆ బాట వైపు నీ చూపు పడనేకూడదు. తగిలిన గాయాలని గేయం చేసుకుని పాడుతూ సాగిపోవాలి తప్ప గాయం తగులుతుందని శరీరమే లేకుండా చేసుకోవడం ద్రోహం కదా !
జీవితమెలా ఉన్నా జీవితాన్ని జీవించడమనే ఆనందాన్ని కోల్పో కూడదనే కవి మాటలని గుర్తుకు తెచ్చుకో! నేనేమి కర్తవ్య బోధ చేయడంలేదు నా బాధని కూడా నీతో చెప్పుకున్నందుకు కొంత తెరిపిగా ఉంది. ప్రశాంతంగానూ ఉంది. ఇక ముగిస్తున్నాను చెలీ.
ISSN – 2278 – 478 సమంజంలో సంస్కృతి – సంప్రదాయాలు అంతర్భాగం. సంస్కృతి అనగా చక్కగా చేయబడినది అని అర్థం. సంప్రదాయము అనగా పెద్దల నుండి … Continue reading →
ISSN – 2278 – 4278 శ్రమ శక్తి మానవ జీవితాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకుపోతుంది. ఈ శ్రమ చేతనే సమాజంలో కులాలు పుట్టుకొచ్చాయి. నిరంతరం శ్రమ … Continue reading →
ఎప్పటి గుర్తులో ఇవి మనసును తాకే శుభతరుణం ఏమి తెలియని నాటి బాల్యం నేడు అన్ని తెలిసి మెలిగే గొప్పదినం.. ఒకనాటి మిట్టాయి పొట్లం లాంటి కబుర్లను … Continue reading →
హోషోగా పిలువబడే యోసానో ఒకికో 7-12-1878లో జపాన్ లోని ఒసాకా లో జన్మించి ,29-5-1942న 64వ ఏట మరణించింది .ఆమె నూతన కవితా శైలి జపనీస్ సాహిత్యంలో … Continue reading →
వర్షం చినుకులు పడుతున్నాయి. వాతావరణం చల్లగా ఉంది. కాస్త మునగదీసుకుని పడుకున్నది మేకల జంట. చినుకులు పెరిగాయి. మోటార్ సైకిల్ ఆపుకుని సెల్ ఫోన్ లో వార్తలు … Continue reading →
కలిమిలేములు కావడికుండలు, కష్టసుఖాలు కారణరుజువులు! జన్మలో ఇవన్నీ జతకలసే జీవిత సత్యాలు! ఔనన్నా కాదన్నా మనకు తారసపడే తప్పించుకోలేని జీవన మార్గాలు! ఋతువులన్నీ ఈ మార్గాలకు మూలాలు! … Continue reading →
ప్రయాణంలో కడవరకు నీతో ఉంటానని ప్రమాణంచేసి మరీ తాళికట్టిన భర్త ఆ విషయం ఆయనకు కూడా తెలియకుండా మధ్యలోనే మౌనంగా వెళ్ళిపోయినపుడు అమ్మ వేదన చెందిందే తప్ప … Continue reading →
“నీ భార్య ఈరోజు నాసిరకం చీరె కట్టుకొని అందరి ముందు వ్రతం దగ్గర నా పరువు తీసింది” అంది శ్రీలతమ్మ. భార్య కట్టుకున్న చీరవైపు చూశాడు జయంత్. … Continue reading →
ISSN – 2278 – 478 సమంజంలో సంస్కృతి – సంప్రదాయాలు అంతర్భాగం. సంస్కృతి అనగా చక్కగా చేయబడినది అని అర్థం. సంప్రదాయము అనగా పెద్దల నుండి … Continue reading →
ISSN – 2278 – 4278 శ్రమ శక్తి మానవ జీవితాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకుపోతుంది. ఈ శ్రమ చేతనే సమాజంలో కులాలు పుట్టుకొచ్చాయి. నిరంతరం శ్రమ … Continue reading →
ఎప్పటి గుర్తులో ఇవి మనసును తాకే శుభతరుణం ఏమి తెలియని నాటి బాల్యం నేడు అన్ని తెలిసి మెలిగే గొప్పదినం.. ఒకనాటి మిట్టాయి పొట్లం లాంటి కబుర్లను … Continue reading →
హోషోగా పిలువబడే యోసానో ఒకికో 7-12-1878లో జపాన్ లోని ఒసాకా లో జన్మించి ,29-5-1942న 64వ ఏట మరణించింది .ఆమె నూతన కవితా శైలి జపనీస్ సాహిత్యంలో … Continue reading →
వర్షం చినుకులు పడుతున్నాయి. వాతావరణం చల్లగా ఉంది. కాస్త మునగదీసుకుని పడుకున్నది మేకల జంట. చినుకులు పెరిగాయి. మోటార్ సైకిల్ ఆపుకుని సెల్ ఫోన్ లో వార్తలు … Continue reading →
కలిమిలేములు కావడికుండలు, కష్టసుఖాలు కారణరుజువులు! జన్మలో ఇవన్నీ జతకలసే జీవిత సత్యాలు! ఔనన్నా కాదన్నా మనకు తారసపడే తప్పించుకోలేని జీవన మార్గాలు! ఋతువులన్నీ ఈ మార్గాలకు మూలాలు! … Continue reading →
ప్రయాణంలో కడవరకు నీతో ఉంటానని ప్రమాణంచేసి మరీ తాళికట్టిన భర్త ఆ విషయం ఆయనకు కూడా తెలియకుండా మధ్యలోనే మౌనంగా వెళ్ళిపోయినపుడు అమ్మ వేదన చెందిందే తప్ప … Continue reading →
“నీ భార్య ఈరోజు నాసిరకం చీరె కట్టుకొని అందరి ముందు వ్రతం దగ్గర నా పరువు తీసింది” అంది శ్రీలతమ్మ. భార్య కట్టుకున్న చీరవైపు చూశాడు జయంత్. … Continue reading →
2 Responses to చెలిని చేరలేక(ఖ)