ఏది పోగొట్టుకోవాలి…?

విడిచిన బాణం నేరుగా వచ్చి
నిర్దాక్షిణ్యంగా గుచ్చుకున్నట్లు …
గుండెలోతుల్లోంచి చీల్చుకెళ్ళి
మనసు పొరల్ని ఛేధించుకొని
అతి సున్నితమైనదేదో తునాతునకలైనట్లు ….
ఎదలోతుల్లో ఎక్కడో నిర్దయగా
నిప్పుల తుంపర కురుస్తున్న భావన.
ఒకవైపు ప్రపంచపు భారాన్ని మోసే అట్లాస్‌లా మనిషి …
ఇంకోవైపు తీరిగ్గా విశ్రమించేందుకు కృషి చేస్తున్న స్పృహ…
ఒకవైపు మానసిక వత్తిడి, ఇంకోవైపు శారీరక ఇబ్బంది.
ఏదో అస్పష్టమైన నిస్పృహ నిండిన నడక.
బాధల వాగుల ఊటల్లోంచి బాధ్యతల మొసళ్లు
మనసును మౌనంగా చుట్టుముట్టినట్లు దారుణమైన హింస.
అందుకే అన్పిస్తోంది…
జీవితం పాలరాతి పై నడక కాదుగా అని ….
యాసిడ్‌ దాడులుంటాయ్‌! సునామీలుంటాయ్‌!
స్వైన్‌ఫ్లూలుంటాయ్‌!
అర్ధాంతర చావులు, కష్టాలు, కన్నీళ్ళు ….
అన్నిటినీ మించి …. రాత్రి ` పగలు
గుప్పెడంత గుండెలో సముద్రమంత దు:ఖాన్ని
సమ్మెట దెబ్బలా భరిస్తూ నిట్టూర్పుల జ్వాలలు
ఏది ధారపోస్తే తీరుతుంది.
నిరంతరం తడుస్తున్న కళ్ళలోని ఈ నిర్వేదం?
అత్మవిశ్వాసాన్ని చేతులుగా మార్చుకొని
మట్టిని పిసికితేనా?
కల్తీ నవ్వుల్ని కౌగిలించుకొని
మనసును నలిపేస్తేనా?
దీని మూలాలను వెతుక్కోవటం కోసం
దేన్ని పొందాలి?
దేన్ని పోగొట్టుకోవాలి?

– అంగులూరి అంజనీదేవి

“**********************************************************************************************************************************************

కవితలు, , , , , , , , , , , , , , , Permalink

Comments are closed.