బెంగుళూరు నాగరత్నమ్మ

వి.శ్రీరామ్

వి.శ్రీరామ్

మద్రాసు మేయరుకోర్టుని గుర్తిస్తూ, పునర్నిర్మిస్తూ 1727లో రాజఫర్మానా జారీ అయ్యింది. దాని ప్రకారం వుత్సవాల్లో, వూరేగింపుల్లో నాట్యకత్తెలు రాగతాళయుక్తంగా ఆటాపాటా సాగించడానికి అనుమతించారు. ఈ భోగం మేళం క్రమంగా దేవదాసీల కళగా గుర్తింపు పొందింది. అప్పట్లో సమాజంలో విభిన్న అభిప్రాయాల్ని సహించే వాతావరణం వుండేది. బ్రిటిష్‌ పాలకులు, నవాబులు తమ పరివారంలో నాట్యకత్తెలను వుంచుకునేవారు. దేవదాసీల విషయాల్లో న్యాయస్థానాలు ఎక్కువగా కలగజేసు కోవాల్సివచ్చేది. ఆలయాల్లో వారసత్వపు హక్కులూ, ఆస్తిహక్కు, దత్తత, ధర్మకర్తల పక్షపాత ధోరణులు వగైరాల గురించి తరుచు వ్యాజ్యాలు వేసేవారు దేవదాసీలు. దురాశాపరులైన ధర్మకర్తలు తమ కనుకూలమైన వాళ్ళకి మెరుగైన హోదా కల్పించేవారు. 1861 నాటికి కలకత్తా, బొంబాయి, మద్రాసులలో హైకోర్టులు ఏర్పాటయ్యాయి. దాంతో ఆధునిక న్యాయవ్యవస్థ అమల్లోకి వచ్చింది. అప్పటికి, దేవదాసీలు ‘ఆచారాన్ని పాటించేవారనీ, ధర్మానికి కట్టుబడిన ఒక ప్రత్యేకమైన వర్గమనీ’ గుర్తించారు.

దేవదాసీ వ్యవస్థని అంగీకరించకపోయినా, 1862లోనూ, 1889లోను తీర్పు ఇచ్చేటప్పుడు మద్రాసు హైకోర్టు దేవదాసీలని ప్రత్యేక సాంఘిక వర్గంగా గుర్తించింది. ఆ వ్యవస్థని బహిష్కరించే చట్టం లేనందువల్ల, వాళ్ళకుండవలసిన హోదా, వారసత్వం, దత్తత, హక్కులు వగైరాలకి సంబంధించిన కేసులు వచ్చినప్పుడు చట్టంవాటికి ప్రతిస్పందించాల్సి వుందని హైకోర్టు అభిప్రాయపడింది. అంకిత భావం వున్న దేవదాసీలకీ, నీతిమాలిన స్త్రీలకి మధ్య అంతరం చూపిస్తూ, దేవదాసీలకి పనికి వచ్చే చట్టం వేశ్యలకి వర్తించదని కూడా పేర్కొంది. భారత శిక్షా స్మృతి ప్రకారం యుక్తవయసులోపు వారికి వ్యభిచారం నిషేధం. కాని దేవదాసీలు దత్తత తీసుకునే విషయంలో హైకోర్టు ఇది పాటించదు. దేవదాసీలకి సంబంధించిన వివాదాలు పరిష్కరించేటప్పుడు వ్యభిచారానికి సంబంధించిన చట్టాన్ని అన్వయించడం కొంతకాలం వీలుగా వుండేది. మిశ్రమ భావాలుండడంతో, హైకోర్టు కొన్నిటికి ఆచారాన్ని అనుసరించే ధర్మాన్నీ, మరికొన్నిటికి భారత శిక్షాస్మృతిని అనుసరించింది. కోర్టులుగానీ, ప్రభుత్వం గాని ఏనాడూ దేవదాసీలని సామాన్య వేశ్యలతో సమానం చెయ్యలేదు.

పాశ్చాత్య విద్య ప్రభావంవల్ల, దేవదాసీ వ్యవస్థలో సంస్కరణలు తెచ్చేందుకు ప్రభుత్వం మిద ఒత్తిడి పెరిగింది. సంఘసంస్కర్తలూ, దివ్యజ్ఞాన సమాజం వాళ్ళూ, రామకృష్ణమిషన్‌ లాంటి సంస్కరణ సంస్థలు ఆలయాలకి అమ్మాయిల్ని అంకితమివ్వడం వ్యభిచారంతో సమానమని ఘోషించారు. నాగరత్నమ్మ ప్రత్యర్థి వీరేశలింగం పంతులు నాయకత్వంలో దేవదాసీలకి వ్యతిరేకంగా 1881లో ఒక తీవ్రమైన వుద్యమం బయలుదేరింది. వేశ్యల ప్రదర్శనలకి పోయి ఆనందించే పాశ్చాత్య అధికారులను చూసి క్రైస్తవ మతబోధకులు నిర్ఘాంత పోయారు. వాళ్ళు వేశ్యా వ్యతిరేకోద్యమకారులకి తమ మద్దతు ప్రకటించారు. 1893లో గవర్నరు లార్డ్‌ వెన్లాక్‌కి వీరేశలింగం ఒక మహాజరు పంపాడు.
దాన్లో అతను బోగం వాళ్ళని వేశ్యలతో సమానంగా పేర్కొని, వాళ్ళిచ్చే నాట్యప్రదర్శనలకి హాజరుకారాదని గవర్నరుని కోరాడు. ప్రభుత్వాధీనంలోవున్న ఆలయాల్లో దేవదాసీల సేవల్ని నిలిపివేయాల్సిందిగా 1909లో మైసూరు ప్రభుత్వం నిర్ణయించింది. ఇది సంస్కరణ వాదులకి వుత్తేజాన్నిచ్చింది దాంతో మద్రాసు ప్రెసిడెన్సీలో ఈ వ్యవస్థకి వ్యతిరేకంగా చట్టం తేవడానికి గట్టి ప్రయత్నాలు మొదలెట్టారు. ఢిల్లీ, మద్రాసు ప్రభుత్వాలు మతాచారాల్లో జోక్యం చేసుకోదలచుకోలేదు. ఎన్నో చర్చలు జరిగినా కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

కేథరిన్‌ మేయో అనే అమెరికన్‌ విలేఖరి 1927 లో రాసిన ‘మదర్‌ ఇండియా’ అనే పుస్తకంలో రకరకాల హిందూ ఆచారాల్ని నిశితంగా విమర్శించింది. వీటిలో జోక్యం చేసుకోనందుకు వలస ప్రభుత్వాన్ని దుయ్యబట్టింది కూడా. అభ్యుదయభావాలు గల భారతీయులు ఈ పుస్తకాన్ని తీవ్రంగా విమర్శించారు. ఫలితంగా ఢిల్లీ కేంద్ర శాసనసభలో దేవదాసీ విధానం మిద చర్చజరిగింది.పెళ్ళికాని ఆడపిల్లల్ని దేవదాసీలుగా ఆలయాలకి అర్పించే ఆచారాన్ని నిషేధించమని వి.రామదాసు పంతులు అనే సభ్యుడు మద్రాసు నుంచి కౌన్సిల్‌లో వున్న గవర్నర్‌ జనరల్‌కి ఒక తీర్మానం పంపాడు. ఆర్థిక పరంగా, దేవదాసీలకి భూములు ఇవ్వడం వల్ల , ఆ పద్ధతి తప్పనిసరిగా కొనసాగుతోంది అని కూడా తీవ్రంగా విమర్శించాడు. దాని బదులు ప్రభుత్వమే ఆ భూములు కొని వాళ్ళకి శాశ్వతంగా ఇచ్చేస్తే బాగుంటుందని సూచించాడు. అప్పుడు ఆ భూముల కోసం ఆ వృత్తినే కొనసాగించనక్కర్లేదు. వాళ్ళని పోషించేందుకు దేవాలయాలు ఖర్చు పెట్టనక్కర్లేకుండా దేవాదాయ చట్టంలో కొన్ని మార్పులు చెయ్యాలని కూడా సలహా యిచ్చాడు.దేవదాసీల ఆదాయం తగ్గిపోయినందువల్ల వాళ్ళకి ఆశ్రయం కల్పించడానికి హిందూశరణాలయాలు ఏర్పాటు చెయ్యాలని కూడా రామదాసు పంతులు సలహాయిచ్చాడు. అయితే యుక్త వయసురాని ఆడపిల్లల్ని దేవాలయాలకి అర్పించడం మానిపించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందే గాని దేవదాసీ వ్యవస్థకి వ్యతిరేకంగా మాత్రం ఏ చర్యా తీసుకోదని ఎస్‌. ఆర్‌. దాస్‌ అనే లాబోర్డు మెంబర్‌ సమాధానం ఇచ్చాడు. దేవదాసి, మామూలు వేశ్యతో సమానం కాదని ప్రభుత్వం భావించిందనీ, ఈ విషయంలో మద్రాసు హైకోర్టులోని విజ్ఞులైన జడ్జీలు సరైన ఆలోచనే చేశారని చెప్పాడు. ఆడవారిని అంకిత మిచ్చే బిల్లుని భారత ప్రభుత్వం చట్టం చేయడం కంటే స్థానిక ప్రభుత్వాలు దేవదాసీ వ్యవస్థని క్రమబద్ధీకరించడం మెరుగని మద్రాసు నుంచీ వచ్చిన జి.ఏ.నటేశన్‌ (అధికారప్రతినిధి; పబ్లిషర్‌) అభిప్రాయపడ్డాడు. చివరికి మద్రాసు ప్రభుత్వమే చర్య తీసుకోవాలని నిర్ణయమయింది.

డా|| ముత్తులక్ష్మీ రెడ్డి ఎత్తుగడల గురించి ఉప్పు అందడంతో దేవదాసీలు ఏకమయ్యారు. టి.దొరైకణ్ణు అమ్మాళ్‌ పేరుకి మాత్రమే నాయకురాలు. వీణ ధనమ్మాళ్‌ ఇంట్లో జరిగే ఇష్టాగోష్టి సమావేశాల్లో నాగరత్నమ్మే ప్రముఖ పాత్ర వహించేది. అన్ని వివరాలతో ఒక మహాజరు తయారుచేసి 1927, నవంబరు 3న శాసన మండలి సభ్యులకి సమర్పించారు.

ఆ నివేదికని చాలా అందమైన భాషలో రాశారు. అది తొమ్మిది భాగాలుగా వుంది. దేవదాసీ వ్యవస్థనిర్మూలనకి చర్యలు ఎందుకు తీసుకోగూడదో దాన్లో వివరించారు. తమని వేశ్యలతో పోల్చడాన్ని తీవ్రంగా నిరసించారు. వేశ్యలు వివిధవర్గాలనుంచీ తయారయ్యారన్నారు. ప్రభుత్వానికి నిజంగా వ్యభిచారం గురించి ఆందోళన వుంటే ప్రజల నైతిక ప్రవరర్తన గురించి చర్యలు చేపట్టాలేగాని, పురాతనకాలం నాటి దేవదాసీ వ్యవస్థలో అనవసరంగా జోక్యం చేసుకోగూడదు. తమలోంచి కొందరు వెళ్ళిపోయి నీతిమాలి బతుకుతున్నారని ఒప్పుకున్నారు. అయితే ఆ దౌర్భాగ్యాల్ని మాత్రమే శిక్షించాలి కాని వ్యవస్థ మొత్తాన్ని నిషేధించకూడదని కోరారు. ఈ వ్యవస్థకి మతంతో సంబంధం వుండడంవల్ల దీనికి వ్యతిరేకంగా చట్టం చేయడానికి మద్రాసు ప్రభుత్వం సందేహించింది. ఇది గ్రహించిన దేవదాసీలు ‘చాలా ఆలయాలూ, మఠాలూ తమకి హోదా కల్పించాయని’ వాదించారు. ‘ఆలయాల నుంచీ వచ్చే ఆదాయం లేకపోతే ఇక బతకడం ఎలా? అని శాసన మండలి సభ్యుల్ని ప్రశ్నించారు. ఈ చట్టం హఠాత్తుగా వచ్చింది కాబట్టి తమకి కొంత వ్యవధి కావాలన్నారు. మతాధికారుల్నీ, న్యాయవాదుల్ని సంప్రదించడానికీ, కూడగట్టడానికీ, తమ బలం నిరూపించు కోవడానికి వ్యవధి అవసరం. చట్టం చేసే ముందు తమ అభిప్రాయాలు వాళ్ళు పరిగణనలోకి తీసుకుని వుండాల్సిందని దేవదాసీలు భావించారు. అందుకని 1928లో జరగబోయే మొదటి సమావేశంలో చర్చించాల్సిన అవసరం వుందనీ. దానివల్ల తమ వాదన వినిపించేందుకు వాళ్ళకి తగిన సమయం వుంటుందనీ విన్నవించారు.

అదే రోజున వచ్చిన రెండో అప్పీలు ఈ విషయాన్ని చట్ట సంబంధమైన దృక్పధంతో పరిశీలించింది. ఈ డాక్యుమెంటులో 5 పేరాలున్నాయి. రామదాసు పంతులు తాను చేసిన తీర్మానాన్ని భారత ప్రభుత్వపు న్యాయశాఖ ప్రతినిధి ఎస్‌.ఆర్‌.దాస్‌ అంగీకరించనందు వల్ల అది వుపసంహరించుకున్నాడు. ”ఆలయసేవలకీ, పూజలకి జీవితాల్ని అర్పించు కోవడానికీ, వ్యభిచారానికి ఏమి సంబంధం లేదని మద్రాసు హైకోర్టు స్పష్టంగా పదే పదే చెప్పింది” అని కూడా ఆ డాక్యుమెంట్‌లో పేర్కొన్నారు. దేవదాసీ మగవాళ్ళు నిషేధానికి అనుకూలం. ”మనిషి స్వప్రయోజనం కోసమే ఏదైనా నిర్ణయం తీసుకోవడం విధి” ”వి. రామదాసు పంతులు తీర్మానం లాగానే, రాష్ట్రశాసన మండలిలో డా|| ముత్తులక్ష్మీ అమ్మాళ్‌ ప్రతిపాదించిన బిల్లు కూడా ప్రస్తుతానికి వుపసంహరించుకోవలసిందిగా” విజ్ఞప్తిచేస్తూ డాక్యుమెంటు ముగిసింది. అయినప్పటికీ నవంబరు 4న ముత్తులక్ష్మీరెడ్డి ఒక తీర్మానాన్ని ప్రతిపాదించింది. ”చట్టం చేయవలసిందిగా ప్రభుత్వానికి ఈ కౌన్సిల్‌ సిఫారసు చేసింది. ఒక వేళ త్వరగా చట్టంచేయలేక పోతే, కనీసం కులం, ఆచారం, మతంపేరుతో ఆలయాలకి చిన్న పిల్లల్ని అంకితం చెయ్యడం వంటి అవినీతి చర్యలని అరికట్టాలి.” నవంబరు 5న శాసన మండలిలో దానిమిద చర్చజరిగింది. ఆ రోజునే ప్రెసిడెన్సీలోని ప్రముఖ పత్రికల్లో ‘అంకితం వ్యవహారంగురించీ, దాన్ని అంత మొందించేందుకు డా|| లక్ష్మి చేస్తున్న కృషిని మెచ్చుకుంటూను వ్యాసాలు ప్రచురించారు. ఆవిడ చేస్తూన్న పనికి చాలా మంది దేవదాసీల మద్దతు కూడా వుందనీ, కొద్దిమంది అభివృద్ధి నిరోధకులు మాత్రం వ్యతిరేకించారని కూడా రాశారు. అదే రోజు సాయంత్రం మింట్‌ స్ట్రీట్‌లో జీవరత్నమ్మాళ్‌ అనే కుల పెద్ద ఇంట్లో దేవదాసీలు సమావేశమయ్యారు. నాగరత్నమ్మ ఆధ్వర్యంలో మద్రాసు దేవదాసీ సంఘం ఏర్పాటయింది. జీవరత్నమ్మాళ్‌ అధ్యకక్షురాలు, దొరైకణ్ణు అమ్మాళ్‌ కార్యదర్శి. ”దేవదాసీలకి సంబంధించి డా|| ముత్తులక్ష్మి అమ్మాళ్‌ ప్రవేశపెట్టిన బిల్లుని ఈ సంఘం ఏకగ్రీవంగా, తీవ్రంగా నిరసిస్తోంది. మా కులం, మతంలోని ప్రాచీన ఆచార వ్యవహారాలని ఈ బిల్లు దెబ్బతీస్తోంది” అని తీర్మానించారు. ఈ తీర్మానం కాపీతో పాటు ఒక వుత్తరం కూడా మద్రాసు ప్రభుత్వంలోని న్యాయశాఖ సభ్యుడు సర్‌.సి.పి. రామస్వామయ్యర్‌కి పంపారు. గవర్నరు కార్యాలయానికి కూడా దాని నకలు పంపారు.

నవంబరు 3నాటి నివేదన (అప్పీలు), 4 నాటి తీర్మానం పత్రికల్లో ప్రముఖంగా వచ్చాయి. ఈ విషయం మిద సవివరంగా ఒక మెమొరాండం ఇవ్వమని దేవదాసీలని కోరుతూ న్యాయశాఖ సభ్యుడు వుత్తరం రాశాడు. ఇదే సమయంలో, తిరువన్వేలి నుంచి పద్మావతి అమ్మాళ్‌్‌, కోర్నాడ్‌ నుంచి రంగనాయకి అమ్మాళ్‌ అనే దేవదాసీలు రాసిన కరపత్రాలు డా|| ముత్తులక్ష్మి అనుయాయులు విడుదలచేశారు. ఆ కరపత్రాల్లో వాళ్ళు దేవదాసి సంఘం వునికినే ప్రశ్నిస్తూ ఆ సంఘంలో సభ్యులెందరో, ఎన్నిసార్లు వాళ్ళు సమావేశ మవుతారో చెప్పమని కోరారు. వినాశనకరమైన ఈ సంప్రదాయాన్ని నిషేధించే చట్టం కోసం మద్రాసు ప్రెసిడెన్సీలోని దేవదాసీలందరూ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. శాసన మండలి సభ్యులందరూ ఏకమై తగిన చట్టం చేయాలని ప్రార్థించారు. ముత్తులక్ష్మీ రెడ్డి సభ్యురాలిగా వున్న భారత మహిళా సంఘం, సాంఘిక పరిశుద్ధమండలి లాంటివి ఆమె వైఖరిని సమర్థిస్తూ లేఖలు రాశాయి. ఈ లోపు శాసనమండలిలో పలువురు సభ్యులు తీర్మానాన్ని బలపరుస్తూ గట్టిగా వాదించారు. ‘ఆడపిల్లల్ని ఆలయానికి అర్పించడం స్త్రీత్వానికే ఒక కళంకంగా భావించే వివిధ మహిళా సంఘాల కోరిక’ మేరకి తాను ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టానని డా|| రెడ్డి తన తుది వుపన్యాసంలో చెప్పింది. భాషాపరమైన చిన్న చిన్న మార్పులు ఆ తీర్మానంలో చేశారు. సర్‌.సి.పి రామస్వామి అయ్యర్‌ మంచివక్త. కాని ఎందుకో, మొదటిసారి ఆయన చాలా మృదువుగా మాట్లాడాడు. ”తీర్మానం వెనక వున్న వుద్దేశాన్ని ప్రభుత్వం సానుభూతితో అర్ధం చేసుకున్నా,వెంటనే కచ్చితమైన పరిష్కారం యివ్వలేకపోతోంది. అయితే తప్పనిసరిగా ఈ విషయాన్ని పరిగణిస్తుంది. దేశంలో వున్న సంస్కరణాభిలాషుల్ని సంప్రదించి పరిష్కారానికి ప్రయత్నిస్తుంది. దేవదాసి వ్యవస్థకి వ్యభిచారంతో సంబంధంలేదు. దాన్లోవున్న కష్టనష్టాలనీ, ప్రమాదాలని నివారించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. అయితే దేవదాసీ వ్యవస్థ వలన ఇటీవల కలుగుతున్న కష్టనష్టాలు, ప్రమాదాలని నివారించాలి.” ఈ తీర్మానాన్ని దాదాపు ఏకగ్రీవంగా ఆమోదించారు. దాంతో ఈ విషయం మిద చర్యతీసుకునే బాధ్యత మద్రాసు ప్రభుత్వం మిద పడింది. ఈ లోగా దేవదాసీలు మెమొరాండం తయారు చేసే పనిలో మునిగిపోయారు. దీన్లో నాగరత్నమ్మకే ప్రధాన పాత్ర ఇచ్చారు. ‘మద్రాసు ప్రెసిడెన్సీలో వున్న దేవదాసీలు వినమ్రంగా సమర్పించుకుంటూన్న మెమొరాండం’ అనే శీర్షిక పెట్టారు.

దీన్ని తేనాంపేటలోని రామస్వామి అయ్యర్‌ ఇంటికి నవంబరు 11న పంపారు. అది తమిళ, ఇంగ్లీషు పత్రికల్లో ప్రముఖ వార్త అయ్యింది. మంచి ఇంగ్లీషులో చక్కగా టైపు చేసి వుంది. వాళ్ళ పునరుద్ధరణకోసం దేవదాసీలు చేసిన ఆఖరి ప్రయత్నమిది. ముందుగా తమని వేశ్యలతో పోల్చడాన్ని నిరసించారు. మద్రాసుహైకోర్టు ఇచ్చిన తీర్పుల నుంచి ఉటంకించారు. తాళి కట్టించుకోవడానికీ, వ్యభిచారానికి సంబంధమే లేదన్నారు. దేవదాసికీ, వేశ్యకి వున్న తేడాల్ని ఎత్తి చూపించారు. దేవదాసి వృత్తి మతపరమైనదనీ, దేవుడికి సేవచెయ్యడమే ముఖ్యవుద్దేశమని చెప్పారు. ప్రభుత్వం చట్టం చేయాలను కోవడం తమ మతానికి గొడ్డలి పెట్టు అని వాళ్ళు భావించారు. అయితే తమ కులంలో కొందరు అడ్డతోవ తొక్కారని అంగీకరించారు. కానీ దాని మూలంగా అందరినీ నిందించడం సరికాదని వాదించారు. ‘ఈరకంగా మొత్తం జాతిని నిషేధించాలనుకోవడం ‘వెర్రి తలలు వేసిన ఫ్రెంచి విప్లవం’ లాంటిది; అధునిక రష్యా ఆవిష్కర్తల (శాసనకర్తలు కాదు) అనాగరికమైన ఉన్మత్తతలాంటిదని’ ఉద్దేశపడారు. శాస్త్రాల్లోకూడా తమ ప్రస్తావన వుందని దేవదాసీలన్నారు. జీవించే హక్కు తమకి వుండాలన్నారు. ‘గౌరవప్రదమైన వాళ్ళ జీవిక’ని రద్దు చేస్తే, ఇక గతిలేక వేశ్యావృత్తిలోకి దిగవలసి వస్తుందని హెచ్చరించారు. బిల్లు పాసయితే తాము దిక్కులేని వాళ్ళ మవుతామనీ, ‘ఆకలీ, నిరాశా నిస్పృహలకి లోనై వ్యభిచారానికి బలి అవుతామ,నీ వాపోయారు. దీనికన్నా క్రమపరిణామం మేలు’ అన్నారు. ఉంపుడు గత్తెగా వుంటే దాదాపు పెళ్ళి చేసుకున్నట్టే అని చాలా కోర్టులు అంగీకరించాయి. ఇలాంటి వాళ్ళకి పుట్టిన పిల్లలకి తండ్రి ఆస్తిలో హక్కుకూడా వుంటుంది. ఇలాంటి పిల్లలకి గుర్తింపు కూడా వుండాలని దేవదాసీలు కోరారు. అలా ఏదైనా చట్టం వస్తే ఇలాంటి వాళ్ళకీ, పెళ్ళి చేసుకున్న వాళ్ళకీ తేడా వుండదన్నారు.

తమ అప్పీలుకి ప్రజల సహకారం కోసం తీసుకోవలసిన చర్యల గురించి ఒక జాబితా తయారు చేసుకున్నారు. ”ప్రెసిడెన్సీలో ఎక్కడెక్కడోవున్న కుల పెద్దలందరితో మెమొరాండం మిద సంతకాలు పెట్టించి అప్పుడు అధికారులకి అందజేయాలి. ఇది చాలా పెద్ద పనే. అయినా మా కుల సంక్షేమం దృష్ట్యా ఈ పని నెత్తికెత్తుకున్నాం. మద్రాసులో వున్న మా సంఘానికి అనుబంధంగా ఈ ప్రావిన్స్‌లో వున్న నగరాల్లో,పట్టణాల్లో వివిధ సంఘాలుగా ఏర్పడతాం. వాటి వల్ల మా లక్ష్యాలకి వున్నబలం, న్యాయబద్ధత మీ అందరికీ తెలియ జేయగలం. పాశ్చాత్య నాగరికదేశాల్లో ప్రజాభిప్రాయం కోసం తీసుకునే రెఫరెండం లాంటిదే మా ఈ అభిప్రాయ ప్రకటన” మద్రాసు ప్రెసిడెన్సీలో వున్న అన్ని ఆలయనగరాల్లోనూ, ఈ బిల్లుని వ్యతిరేకిస్తూ సమావేశాలు జరిగాయి. దాదాపు ఒకే మాదిరిగా తీర్మానాలు ప్రతిపాదించి ప్రభుత్వ న్యాయశాఖ సభ్యుడికి పంపారు. అక్కడ వున్న బహుభాషాత్వం వల్ల ఇంగ్లీషు, తమిళం, తెలుగు భాషల్లో రాసి ప్రభుత్వానికి సమర్పించారు. అవి చదివి సంతకం పెట్టిన దేవదాసీలకి భాషా సమస్య లేకపోయింది. ట్రిప్లికేన్‌లో వున్న పార్ధసారధి గుడి లాంటివాటి ధర్మకర్తలు కూడా ఈ విషయమై వుత్తరాలు రాశారు.  కొద్దిరోజులకే సంబంధిత ఫైలు (ప్రభుత్వం దగ్గర) పెద్దదిగా తయారయ్యింది.

సర్‌ సి.పి.రామస్వామి అయ్యర్‌ అంగీకారంతో, మద్రాసులోని ప్రముఖ దేవదాసీలు నవంబరు 23న ఆయన్ని కలిశారు. నాగరత్నమ్మతో సహా 8 మంది వెళ్ళారు. నవంబరు 11న సమర్పించిన మెమొరాండంలాంటిదే ఇదీను. అయితే దీన్ని ‘మెమోరియల్‌’ అన్నారు. నాగరత్నమ్మ. ఇంగ్లీషులో చేసిన సంతకంలో ఆత్మవిశ్వాసం తొణికిసలాడింది. ”ఏ చర్యాతీసుకోనక్కర్లేదు. ఈ కాగితాలని భద్ర పరచాలి” అని రామస్వామి అయ్యర్‌ చిన్న వాక్యం రాశాడు. మద్రాసులోని అన్ని ప్రాంతాల దేవదాసి సంఘాలనుంచి వచ్చిన మెమోరియల్స్‌ని అలాగే భద్రపరిచారు.

మద్రాసు ప్రభుత్వం తీసుకోవలసిన చర్యగురించి రామదాసు పంతులు ‘హిందూ’ పత్రికలో వివరంగా రాశాడు. డా|| లక్ష్మీరెడ్డి కూడా చాలా వుత్తరాలు రాసింది. దేవదాసీల ధోరణి తప్పని ఆమె గట్టిగా వాదించింది. శాస్త్రాల్లో వాళ్ళ వృత్తిని గౌరవంగా ప్రస్తావించడం గురించి విమర్శించింది. మరి భారతదేశంలోని తిరువాన్కూరు, బ్రిటిష్‌ మలబారు, సంయుక్త రాష్ట్రాలు, బెంగాలు, పంజాబు వంటి ఇతర ప్రాంతాలవారు దీన్ని ఎందుకు పట్టించుకోలేదని ఆమె ప్రశ్నించింది. ”ఈ దౌర్భాగ్యపుదేశంలో ప్రతి చెడ్డ పనీ మతం, ఆచారాల ముసుగులో మంచిపనిగా చలామణి అవుతూంటుంది. మనదేశంలో అనారోగ్యానికీ, దరిద్రానికీ, వెనకబాటు తనానికి ముఖ్యమైన అసలు కారణం ఇదే” అని ఆమె బాధపడింది. దేవదాసీల్లో కొద్ది మందే దారి తప్పారనే వాదనని ఆమె ఖండించింది. ”95% వ్యభిచారులు గానూ, 5% ఉంపుడు కత్తెలుగాను వున్నా” రంది. జాతీయవాది కమలాదేవి ఛటోపాధ్యాయ కూడా ఈ విషయం గురించి రాసింది.38 ఎ.యస్‌. నటరాజన్‌ అనే హైకోర్టు వకీలు మాత్రమే దేవదాసీల తరఫున మాట్లాడాడు. అతను హిందూ పత్రికకి వుత్తరాలు రాశాడు. ప్రభుత్వానికి వీళ్ళ గురించి వినతి పత్రం రాశాడు. వకీలుగా కూడా పనిచేశాడు. వాళ్ళ రాతకోతలు కూడా చూశాడు.

నాగరత్నమ్మ కూడా తెలుగులో ‘దేవదాసి ప్రబోధ చంద్రోదయం’ పేరుతో ఒక మెమొరాండం రాసింది. తాను ఒకప్పుడు గౌరవం పొందిన దేవదాసీ వ్యవస్థని పునరుద్ధరించడం కోసం దానికో ప్రణాళిక సూచించింది. దాని నకలు ఇప్పుడు దొరకడం లేదు. ఆమె పెట్టిన పేరుకి ఒక ప్రత్యేకత వుంది. కృష్ణ మిశ్ర (12వ శతాబ్దం) సంస్కృతంలో ‘ప్రబోధ చంద్రోదయం ‘రాశాడు. దాన్లో అతను దేవదాసీలమిద ధ్వజమెత్తాడు.
వివిధ కారణాలతో దేవదాసీ సంఘకార్యక్రమాలు చల్లారిపోయాయి. జనవరి 1928 దాకా నిరసన సమావేశాలు జరుగుతూనే వున్నాయి. కాని మొదట్లో వున్న వేడీ, వాడి తగ్గింది. తర్వాత జరగవలసినపని గురించిన స్పష్టత లోపించింది. ఈ చట్టం అమలు అయితే తమదే పైచెయ్యి అవుతుందనే నమ్మకంతో వాళ్ళ మగవాళ్ళు చాలామంది దేవదాసీలని లొంగిపొమ్మని ఒత్తిడి చేశారు. దీనికి సంబంధించిన సంఘటన ఒకటి జరిగింది. చట్టాన్ని రానీకుండా అడ్డం పడితే పరిణామాలు దారుణంగా వుంటాయని నాగస్వర విద్వాంసుడు టి.ఎన్‌. రాజరత్నం పిళ్ళై ఇద్దరు దేవదాసీలని బెదిరించాడు. దాంతో వాళ్ళు పోలీసు రక్షణ కోరారు. దేవదాసీలని వేశ్యలతో పోల్చడం వాళ్ళ వ్యవస్థకే దెబ్బ. తాము ఆవ్యవస్థకి చెందమని చెప్పమని వాళ్ళ పిల్లలు బలవంత పెట్టారు. క్రమంగా నిరసనలు ఆగిపోయాయి. ప్రభుత్వ పాత దస్తావేజులతో కలిసి వీళ్ళ మెమోరియల్స్‌ కూడా దుమ్ము కొట్టుకు పోయాయి.

వీటి ప్రభావం ఏమి పడని వ్యక్తి నాగరత్నమ్మ ఒక్కతే. ఆమె ఇవేవీ పట్టించుకోలేదు. తనని దేవదాసి అని గర్వంగా చెప్పుకుంటూనే వుంది.42 1927లో జరిగిన సంఘటనలు ఆమె ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచాయి. దేవదాసీ సంఘాన్ని ముందుకి నడిపించే బాధ్యత తన భుజాల మిద వేసుకుంది వీణధనమ్మాళ్‌ కూతుళ్ళలాంటి యువతుల్ని కూడగట్టుకుని పోరాడింది.1927 డిసెంబరు లో మద్రాసులో జరుగుతున్న అఖిల భారత కాంగ్రెస్‌సభ వైపు అందరి దృష్టి మళ్ళింది. అఖిల భారత సంగీత సభ కూడా జరిగింది. దక్షిణ భారత సంగీత కళాకారులందరూ వచ్చారు. దీని అధ్యకక్షుడు డా|| యు. రామారావు ప్రారంభోపన్యాసంలో మిగతా విషయాలు ప్రస్తావిస్తూ దేవదాసీ వ్యవస్థ మిద విరుచుకు పడ్డాడు. ”దక్షిణ భారతీయ సంగీతం అంతరించి పోకుండా ఈనాడు నివురుగప్పిన నిప్పులాగా నిలిచి వుందంటే దానికి కొంతవరకు దేవదాసీ వ్యవస్థే కారణం. అందుకు మనం వారికి కృతజ్ఞత చూపించాలి” అంటూనే ఆయన ”ఇవాళ వాళ్ళు జనం ముందు దోషులుగా నిలబడ్డారంటే దానికి వాళ్ళు చేసిన క్షమించరాని పాపాలే కారణం” అన్నాడు. అప్పటికి ఆయన మద్రాసు శాసనమండలికి అధ్యకక్షుడు. ప్రభుత్వం వుద్దేశించిన అభిప్రాయానికి అతను ప్రాతినిధ్యం వహించాడు.

పురుషకళాకారుల కచేరీల వివరాలతో జాబితా తయారు చేసిన ఈ సమావేశం స్త్రీ కళాకారుల ప్రసక్తే రాకుండా జాగ్రత్త పడింది.45 కాని 1928 లో మ్యూజిక్‌ అకాడమి ఒక నివేదిక విడుదల చేసింది. డిసెంబరు 24 నుంచీ 31 దాకా జరిగిన 25 కచేరీలలో అయిదుగురు స్త్రీకళాకారులవే. మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి నాగరత్నమ్మ ఒక్కతే గాయనీ, దేవదాసీను.ప్రముఖ హిందుస్తానీ కళాకారుడు పండిట్‌ విష్ణుదిగంబర్‌ ఆ సమావేశంలో హిందుస్తానీ సంగీతం గురించిన చర్చల్లో పాల్గొన్నాడు.  ఆయన నాగరత్నమ్మ పాటకి ముగ్ధుడై ఆమెకి బంగారు పతకం బహూకరించాడు.  తర్వాతి రోజుల్లో అది గుర్తు చేసుకుంటూ, ఆ బహుమానం పొందిన ఏకైక కళాకారిణి తానేనని గర్వంగా చెప్పుకుంది.సంగీత సభ విజయవంతం కావడంతో, దాని నుంచి వచ్చిన సొమ్ముతో మద్రాసు మ్యూజిక్‌ అకాడమి ఏర్పడింది. మొదటి స్త్రీ కళాకారిణి అయిన నాగరత్నమ్మని పాడవలసిందిగా ఒక్కసారి అయినా అకాడెమి అహ్వానించకపోవడం ఆశ్చర్యకరం.

1928, జనవరిలో త్యాగరాజ ఆరాధన నిర్వహించేందుకు నాగరత్నమ్మ తిరువయ్యారు వెళ్ళింది. ఆమెకి క్రితం ఏడాది కంటె మరింత సహాయ సహకారాలు లభించాయి. గురువు బిడారం కృష్ణప్ప అఖిల భారత సంగీత సభకి వచ్చి, తర్వాత నాగరత్నమ్మ నిర్వహణలోని ఆరాధనలో పాల్గొన్నాడు. రాబోయే కాలంలో మైసూరు నుంచీ కళాకారుల్ని పంపుతానని మాట ఇచ్చాడు.స్టేట్‌ కార్యదర్శి (ఇండియా) వత్తిడి చేస్తూనే వున్నా, దేవదాసీ చట్టం తెచ్చేందుకు మద్రాసు ప్రభుత్వానికి కొంత సమయం పట్టింది. బ్రిటిష్‌ పార్లమెంటు, సంస్కరణల పట్ల ఆసక్తిగా వుంది. రామదాసు పంతులు చేసిన ప్రతిపాదన గురించి చర్చ జరుగుతూన్నప్పుడు, ఇక్కడి ఆచార వ్యవహారాల్లో జోక్యం చేసుకోగూడదని చెప్తూ భారత ప్రభుత్వం 1927లో తీసుకున్న నిర్ణయాన్ని విమర్శించింది.53 దాంతో భారత ప్రభుత్వం ఈ విషయం గురించి రాష్ట్రప్రభుత్వాల అభిప్రాయాల్ని కోరింది. దేవదాసీ వ్యవస్థలో అనవసరంగా జోక్యం చేసుకోగూడదనే అభిప్రాయం మద్రాసు ప్రభుత్వం వెలిబుచ్చింది.

డా|| లక్ష్మీరెడ్డి ఇప్పటికే తాను చాలా కాలం వేచిచూశానంది. 1926 నాటి హిందూమత దేవాదాయ చట్టాన్ని సవరించాలని 1928 సెప్టెంబరులో డా|| లక్ష్మీరెడ్డి ప్రతిపాదించింది. దాంతో దేవదాసీల ఆర్ధిక వ్యవస్థని రద్దు చెయ్యాలని ఆమె వుద్దేశం. కొత్తబిల్లు ప్రకారం దేవదాసీలు దేవాలయాల్లో నిర్వహించే పనులని బట్టి వాళ్ళకి కేటాయించిన భూముల్ని వాళ్ళకే దఖలు చెయ్యాలి. అయితే ఇక ముందు వాళ్ళు ఆలయ సేవలు చేయకూడదు. భూమి మిద వస్తూన్న ఆదాయం వాళ్ళకి మాత్రం జీవితాంతం ఇస్తారు. కాని ఈ హక్కులు వారసత్వంగా ఎవరికీ చెందవు. అందుకని ఆడపిల్లల్ని దత్తత తీసుకుని వాళ్ళని తర్వాత దేవదాసీలుగా అంకిత మివ్వడానికి అవకాశం లేదు. చాలా చర్చలు జరిగిన తర్వాత ఈ బిల్లు 1929 నాటికి చట్టంగా రూపొందింది.  ఆ వెంటనే ఆలయ యాజమాన్యం, ధర్మకర్తల క్రౌర్యం బయట పడింది. దేవదాసీల పేరు మీద ఆ భూముల బదలాయింపు త్వరగా జరగలేదు. కొన్ని అసలు జరగలేదుకూడా. ఆలయ విధుల కివ్వవలసిన నిధుల చెల్లింపూ జరగలేదు. దాంతో ఆర్థికంగా చాలా ఇబ్బందుల పాలయ్యారు. నాగరత్నమ్మ నేస్తం మైలాపూర్‌ గౌరి దీనికొక విషాదకరమైన వుదాహరణ. ఆమెతో నాట్యప్రదర్శనల్లో పాడేందుకు వీణ ధనం కూతుళ్ళు పోటీ పడేవారు. గౌరి మైలాపూర్‌ కపాలేశ్వరాలయంలో అనువంశికంగా నాట్యం చేస్తోంది. బిల్లు పాసైన కొద్ది రోజులకే యాజమాన్యం ఆమెనీ, పది మంది సంతానాన్ని, వాళ్ళు వుంటూన్న దేవాలయం తాలూకు ఇంటినుంచీ వెళ్లగొట్టారు. కటిక పేదరికంలో కూడా ఆమె కొద్దిమందికి సంగీతం, నాట్యం నేర్పుతూ బతికింది. చివర్లో చూపు కోల్పోయింది. 1971లో ఆమె అంత్య క్రియలకి అయిన ఖర్చు శ్రేయోభిలాషులే భరించారు.56 కోర్టులో ఈ చట్టాన్ని దేవదాసీలు ఎందుకు సవాల్‌ చేయలేదనేది శేషప్రశ్న. దేవదాసీ వ్యవస్థని నిషేధించే చట్టం ఎంతకీ రావడంలేదే అని విచారించిన ఈ కోర్టులో తమకి న్యాయం జరగదని వాళ్ళ వుద్దేశం కావొచ్చు.

మద్రాసు ప్రెసిడెన్సీలోనూ, ఇతర చోట్ల ఈ బిల్లు పాసయినందుకు ఛాందసులు బాధపడ్డారు. తరతరాలుగా వస్తూన్న హిందూ ఆచారాలకి ఇది గొడ్డలి పెట్టు అని వాళ్ళ అభిప్రాయం. ఇదే కాకుండా కేంద్ర శాసన మండలిలో రాయ్‌ సాహెబ్‌ హరబిలాస్‌ శారద 1927లో ప్రవేశ పెట్టిన బిల్లు (మైనర్ల వివాహాల్ని నిషేధిస్తూ) అంటే ‘సనాతనవాదులు’ మండి పడ్డారు. ఆ చట్ట ప్రకారం 14 ఏళ్ళ లోపు బాలికలు, 18 ఏళ్ళ లోపు బాలలు పెళ్ళిళ్ళకు అనర్హులు. చట్ట ప్రకారం ఈ పెళ్ళిళ్ళు చెల్లక పోవడమే కాక, వాళ్ళు శిక్షార్హులుకూడా.57 ఈ బిల్లుని వ్యతిరేకిస్తూ 1928, 1929 లలో దేశమంతటా నిరసన తెలుపుతూ సనాతన ధర్మసమావేశాలు జరిగాయి.  1929లో మద్రాసులో జరిగిన సమావేశంలో గొప్ప ‘సనాతనవాది’ అయిన నాగరత్నమ్మ ప్రముఖపాత్ర వహించింది. సంస్కృతంలో ఆమె పాడిన ప్రార్థనతో ఆనాటి సభ మొదలయింది. కన్వీనర్‌ బాబూనరేంద్రనాథ్‌ సేఠ్‌, ఆ సందర్భంగా ఆమెని సన్మానించాడు.  ఇలాంటి నిరసనలని ఏమి లెక్కచెయ్యకుండా, 1929, అక్టోబరు 1న ఈ బిల్లు శారదా చట్టంగా పాసయ్యింది. మరో ఆరునెలల తరవాత నుంచి ఇది అమలులోకి వస్తుంది. అయితే ఈ చట్టం ఆశించిన దానికి భిన్నంగా జరిగింది. ఆరు నెలలలోపే పెద్ద ఎత్తున బాల్యవివాహాలు జరిగాయి.  ఆ పెళ్ళిళ్ళలో పాటకచేరీలు, భోగం మేళాలు వుండేవి.

దీంతో దేవదాసీల సమస్య తీరిపోలేదు. 1930, జనవరిలో హిందూ దేవాలయాల్లో ఆడవాళ్ళని అంకితం చెయ్యకుండా వుండేందుకు శాసన మండలిలో డా|| లక్ష్మీరెడ్డి ఒక బిల్లు ప్రవేశ పెట్టింది. ప్రజాభిప్రాయం కోసం ఈ బిల్లు ప్రతిని అందరికీ పంపాలని నిర్ణయించారు. ఇది పాసైతే దేవదాసీ వ్యవస్థని సమూలంగా నిర్మూలించడమే. ఇది ఆఖరి చావుదెబ్బ అన్నమాట. అయితే దీని అమలు వాయిదా పడింది. ఉప్పు సత్యాగ్రహం సందర్భంలో మహాత్మాగాంధీని మే 5న అరెస్టు చేశారు. దీనికి నిరసనగా డా|| లక్ష్మీరెడ్డి మే 8న శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేసింది. ఆమె లేకపోవడంతో మండలి ఈ బిల్లుని తాత్కాలికంగా పక్కన పెట్టింది.  కానీ డా|| లక్ష్మీరెడ్డి దీని గురించి ప్రచారం మాత్రం విరమించుకోలేదు.  ఆలయాల్లో అశ్లీలతని ప్రోత్సహిస్తూన్న ఈ వ్యవస్థ పనికిరానిదని ఆమె వుద్దేశం. దేవదాసీ వ్యవస్థ రోజు రోజుకీ బలహీనపడుతున్నా, రెండేళ్ళపాటు భోగం మేళం గురించి గొడవలేమి జరగలేదు. సంపన్నుల ఇళ్ళల్లో మాత్రమే వీళ్ళ ప్రదర్శనలు జరిగేవి. ఈ ప్రదర్శనలు స్థాన చలనం చెందాక పతివ్రతలు వాటిని చూడకూడదనే నియమం ప్రారంభమయింది. ఆఖరికి పనిమనుషులు కూడా ‘దేవదాసి’ పదం అంటేనే చీదరించుకునే పరిస్థితి వచ్చిందని డా||లక్ష్మీరెడ్డి అన్నది.  దేవాలయాలకి అంకితమిచ్చే విషయం మిద 1931లో కేంద్ర శాసన మండలి బిల్లులు ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించిందిగాని కొన్ని సాంకేతిక కారణాల వల్ల వాటి గురించి చర్చా జరగలేదు, అవి పాసూ కాలేదు.

మద్రాసు శాసన మండలిలో 1932లో బొబ్బిలిరాజా జస్టిస్‌ పార్టీనాయకుడిగా ఎన్నికయ్యాడు. దాంతో మద్రాసు ప్రెసిడెన్సీకి ప్రధానమంత్రి అయ్యాడు. ఆ సందర్భంగా గడిభుక్త సీతారాం అనే రాజనర్తకి నాట్యప్రదర్శన జరిగింది. బొబ్బిలిరాజా కోరిక మేరకి సీతారాం మద్రాసుకి మకాం మార్చి నాగరత్నమ్మ దగ్గరేవుండి, తంజావూరు నాట్యశైలి నేర్చుకుంది. అడయార్‌ చెట్టినాడు భవనంలో ఎం.ఎ. ముత్తయ్య చెట్టియార్‌ గౌరవార్ధం జరిగిన మరొక కార్యక్రమంలో భోగం మేళాలు జరిగాయి. ముఖ్యమైన సందర్భాల్లో ఇలాంటి ప్రదర్శనలు ఏర్పాటు చెయ్యడం వల్ల దేవదాసీలని ప్రోత్సహించి నట్టే అని డా|| ముత్తులక్ష్మీరెడ్డి అభిప్రాయ పడింది. దీని గురించి దినపత్రికల్లో ఘాటుగా వుత్తరాలు కూడా రాసింది. ప్రధానమంత్రికి ఇలాంటి ప్రదర్శనలతో సంబంధం వుండటాన్ని ఆవిడ విమర్శించింది. అలాగే, ఆమె ప్రతిపాదించిన బిల్లుని బలపరచిన వాళ్ళు కూడా ఇలాంటివి నిర్వహించడాన్ని ఆక్షేపించింది. అప్పటి మ్యూజిక్‌ అకాడమి కార్యదర్శి ఇ. కృష్ణయ్యర్‌ ఈ వుత్తరాలకి ప్రతిస్పందించాడు. ఆయన మంచి నాట్యకళాకారుడూ, కళా పోషకుడూను. నాట్యాన్ని నీతిమాలిన పనులకి వాడుకోకూడదనే డా|| లక్ష్మీరెడ్డి అభిప్రాయమే ఆయనది కూడా. అసలు నాట్యమే తప్పనీ, దాన్ని నిషేధించాలనడం మాత్రం సరికాదని ఆయన భావన. చాలామంది ఆయనని బలపరిచారు. ఆయన సారథ్యంలో కళారాధకులు ఒక కూటమిగా ఏర్పడ్డారు. ‘మెయిల్‌’ పత్రిక ప్రజాభిప్రాయాన్ని సర్వే చేసింది. నాట్యాన్ని నాలుగు గోడల మధ్య బంధించి వుంచకూడదనీ, దాని అందాన్ని అందరూ తిలకించాలని చాలా మంది అన్నారు. దేవదాసీల దగ్గర్నుంచి నాట్యాన్ని వేరు చేస్తే అది మరింత వృద్ధి చెందుతుందనే కొత్త వాదంకూడా బయల్దేరింది.

దేవదాసీల నుంచి కళని వేరుచేస్తే అది అంతరించి పోతుందనేది నాగరత్నమ్మ బృందం వాదన. ఆమె కార్యదర్శిగా వున్న దేవదాసీ సంఘం ఒక ప్రకటన విడుదల చేసింది. సంగీతం, నాట్యం తమకి వారసత్వంగా వస్తూన్న కళలనీ, వాటి దైవత్వాన్ని కాపాడడం తమకే చాతనవుననీ ఆ ప్రకటనలో రాశారు. దీని మిద వీణధనం, సేలం లక్ష్మి, సేలం తాయి, మినాక్షి, ధనం పెద్ద కూతుళ్ళు-రాజలక్ష్మి, లక్ష్మీరత్నం, మైలాపూర్‌ గౌరి సంతకాలు చేశారు.ఇ. కృష్ణయ్యర్‌ ప్రోద్బలంతో నాట్యప్రదర్శనలు అందరూ చూసే విధంగా ఏర్పాట్లు ముమ్మరం చేసింది, మ్యూజిక్‌ అకాడమి లోగడ, 1931, మార్చి 15న రాజలక్ష్మి, జీవరత్నంల నాట్యప్రదర్శన జరిపారు. తిరువల పుత్తూరు కల్యాణి కూతుళ్ళు వీళ్ళు. ఇది అంతగా రక్తి కట్టలేదు. 1932, జనవరి 3న మైలాపూరు గౌరి నాట్యం అకాడమి సాంవత్సరిక కార్యక్రమంగా జరిపారు. అది ఘనవిజయం సాధించింది. 1933 నుంచే అకాడమి నాట్యప్రదర్శనలు వూపందుకున్నాయి. డా|| లక్ష్మీరెడ్డి, కృష్ణయ్యర్‌ల మధ్య జరిగిన చర్చలు కూడా ఇందుకు ముఖ్య కారణం. రిప్పన్‌ బిల్డింగ్స్‌ వెనక అకాడమి కట్టిన వేదిక మిద జరిగే ప్రదర్శనలకి వందలాది ప్రేక్షకులు వచ్చేవారు. వీటికి వచ్చిన స్పందన వల్ల అకాడమి ఇలాంటి ప్రదర్శనలు మరిన్ని ఏర్పాటు చేసింది. మిగతా కకులాల స్త్రీలు కూడా నాట్యం నేర్చు కోవడం మొదలు పెట్టారు.66 ఈ మార్పుల వల్ల దేవదాసీలు వాళ్ళకున్న నాట్య పరిజ్ఞానాన్ని ఆసక్తి వున్నవారికి పంచారు. నాగరత్నమ్మ వంటి వారి ఆలోచనా ధోరణిలో వచ్చిన మార్పువల్ల. అంతవరకు వాళ్ళకి మాత్రమే పరిమితమైననాట్యం ఇప్పుడు అందరికీ అందు బాటులో కొచ్చింది.

నాట్యం ఒడ్డున పడింది కాని దేవదాసీలకి గడ్డు కాలమే దాపురించింది. మిగతా కులాల ఆడవాళ్ళుకూడా నాట్యం నేర్చుకోవడం వల్ల వీళ్ళ ఆదాయం తగ్గింది. దేవదాసీలు ప్రదర్శిస్తే అశ్లీలంగా భావించిన కొన్ని పాటలు మిగతావాళ్ళు ప్రదర్శిస్తే తప్పుగా తోచలేదు. దేవదాసీలకి మాత్రమే పరిమితం కాని వేశ్యావృత్తి మాత్రం నిరంతరాయంగా కొనసాగింది. చట్టం రావడం దాని మిద చర్చలు జరగడం వల్ల ఒక మేలు మాత్రం జరిగింది. దేవదాసీల పిల్లలు తమకేమాత్రం అవగాహన లేని ఈ వృత్తిలోకి బలవంతంగా రావలసిన అవసరం తప్పింది.1932లో చాలా రకాలుగా నిరాశని ఎదుర్కోవలసినప్పటికీ నాగరత్నమ్మ రేడియో కళాకారిణి అయ్యింది. మద్రాసు ప్రెసిడెన్సీ రేడియో క్లబ్బు ఆధ్వర్యంలో 1925లో మొదలైన రేడియో కార్యక్రమాలు క్రమంగా చాలా పేరుపొందాయి. మద్రాసు కార్పొరేషన్‌ 1929లో కార్యక్రమాలు ప్రసారం చేయడం మొదలు పెట్టింది. ఆదివారాలు, సెలవు రోజుల్లో సాయంత్రాలు 5:30 నుంచీ 7:30 దాకా ప్రముఖ కళాకారుల కార్యక్రమాలు ప్రసారం చేసేది. పార్కుల్లోనూ, బీచిలోను స్పీకర్లు ఏర్పాటు చేశారు. అందరూ వినేందుకు వీలుగా వుండేది. రిప్పన్‌ బిల్డింగ్స్‌లో స్టూడియోల నుంచి అప్పటికప్పుడే (లైవ్‌ ప్రోగ్రాంలు) ప్రసారం అయ్యేవి. ముసిరి సుబ్రమణ్య అయ్యర్‌, ‘జలతరంగం’ రమణయ్య చెట్టి, టైగర్‌ వరదాచారి, హరికధకురాలు సి. సరస్వతీబాయి, చిత్తూరు సుబ్రమణ్య పిళ్ళై, హరికేశనల్లూర్‌ ఎల్‌. ముత్తయ్య భాగవతార్‌, ‘విద్యాసుందరి’,’గానకళా విశారద’ బెంగుళూరు నాగరత్నమ్మ ఆనాటి కళాకారుల్లో వున్నారు.68 కార్పొరేషన్‌ కమిషన్‌ వార్షిక నివేదికలో ఈమె పేరుతో పాటు బిరుదులు కూడా ప్రచురించారు.

                          మద్రాసులో వున్న తెలుగు ఆర్య వైశ్య సంఘానికి శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం వుంది. అందులో ఆ సంవత్సరం ఆమె కచేరి అయిన తర్వాత, ‘కవిరాజసార్వభౌమ’ కృష్ణమూర్తిశాస్త్రి (గొప్ప పండితుడు) ఆమెని ‘గాన కళా విశారద’ బిరుదుతో సత్కరించాడు. అదివరకటి ‘విద్యాసుందరి’ బిరుదుతో పాటు ‘గానకళావిశారద’ ఆమె పేరుకి అతికింది.

ఈ పనులన్నిటిలో మునిగిపోయి, నాగరత్నమ్మ త్యాగరాజుని విస్మరించలేదు. 1929, 1930, 1931 సంవత్సరాల్లో మద్రాసు ప్రెసిడెన్సీలో కచేరీలు చేయగా వచ్చిన సొమ్ము ఆరాధనకీ, త్యాగరాజు సమాధి నిర్వహణకి వాడింది. ఆవిడకి వున్న అంకితభావం, శక్తి సామర్థ్యాల వల్ల ఆ ఆరాధన నిరంతరాయంగా కొనసాగింది. ఫలితంగా రెండు కచ్చి వర్గాలూ వెనక్కి తగ్గాయి.

– వి.శ్రీరాం

అనువాదం:టి.పద్మిని

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ఈ పుస్తకాన్ని ప్రచురించడానికి అనుమతించిన హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారికి , గీతా రామస్వామి గారికి కృతజ్ఞతలు .

Gita Ramaswamy,

Plot No. 85, Balaji Nagar, Gudimalkapur,

Hyderabad 500 006

98
ధారావాహికలు, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో