దేశం అంటే వీరాభిమానం మహాత్మా గాంధీ అంటే గొప్ప ఆరాధనా భావం ఉండి ,భారత దేశ స్వాతంత్ర్యం కోసం మహిళాభ్యున్నతికోసం సర్వం త్యాగం చేసిన మహిళా మాణిక్యం శ్రీమతి చుండూరి రత్నమ్మగారు .
బాల్యం –వివాహం – దేశ సేవ :
తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ,రావు బహదూర్ పైండా వెంకట చలపతి అనే జమీందార్ గారి పుత్రికా రత్నం రత్నమ్మ ..7-2-1891 న కాకినాడలో జన్మించింది .ప్రముఖ ఏలూరు వ్యాపారి చుండూరి సుబ్బారాయుడు గారి కుమారుడు ,విద్యాధిక సంపన్నుడు అయిన శ్రీరాములుగారితో 1901 ఫిబ్రవరి పది న వివాహం జరిగింది . చిన్నతనం నుండి దేశం పరాయి వారిపాలన నుండి విముక్తం కావాలని కలలు కనేది .అప్పటికే దేశమంతా స్వాతంత్రోద్యమ కాంక్షతో రగిలిపోతోంది .తానూ తన వంతు కర్తవ్యాన్ని నిర్వహించాలని ఈ మహిళా మాణిక్యం భావించింది .సరైన సమయం వచ్చింది .1932లో సమిష్టి శాసనోల్లంఘనలో ఉత్సాహం గా పాల్గొని అరెస్ట్ అయి ,ఆరు నెలలు కారాగార శిక్ష ,రెండు వందల రూపాయల జరిమానా అనుభవించిన నిష్కళంక దేశ భక్తురాలు .
ఉద్యమ నాయకురాలు :
మహిళను కదా అని రత్నమ్మ ఏనాడూ నిరుత్సాహ పడలేదు .మరింత ఉద్వేగం గా ఉద్యమాలలో పాల్గొని చరిత్ర సృష్టించింది .1940లో జరిగిన వ్యక్తీ సత్యాగ్రహం లో పాల్గొని ఫలితం గా మళ్ళీ అర్ధ సంవత్సరం జైలు శిక్ష అనుభవించింది .అయినా ఆమె కుంగిపోలేదు .రెట్టించిన ఉత్సాహం తో దేశ స్వాతంత్ర్య సిద్ధికోసం ,ఆంగ్ల దొరల పెత్తనాన్ని తిరస్కరిస్తూ ,సత్యాగ్రహాలు చేస్తూ, చేయిస్తూ, స్పూర్తినిస్తూ మన రాష్ట్రం లోనే కాక దేశం లో పలు ప్రాంతాలు బళ్ళారి,సేలం మొదలైన ప్రదేశాలు పర్యటించి ఉత్తేజ పరిచి అందరినీ ఉద్యమ భాగస్వాములను చేసిన నేర్పు రత్నమ్మ గారిది.
త్యాగ శీలి –సేవా పరాయణి –వితరణ శీలి :
మహాత్ముడు ఏలూరు పర్యటనకు వచ్చినప్పుడు సందర్శించి ప్రేరణ పొంది తన ఒంటి మీది బంగారు నగలన్నీ సమర్పించిన త్యాగ మూర్తి మహిళా రత్నం రత్నమ్మ .భోగరాజు పట్టాభి సీతారామయ్య ,సర్ విజయ వంటి మహా దేశ భక్తులైన జాతీయ నాయకులే రత్నమ్మ గారిని చూడటానికి ఆమె ఇంటికి ఏలూరు వచ్చేవారు. అంతటి ప్రభావ శీలి .ఆ రోజుల్లో కొల్లేరుకు వరద వచ్చి అంతా భీభత్సం చేసినప్పుడు ,స్వంత కారులో ఆ ప్రాంతాలన్నీ పర్య టించి వరద బాధితులను పరామర్శించి ,వారికి కావాల్సిన ఆహార ధాన్యాలు బియ్యం ఉప్పు ,పప్పు ,కూరలు ,వంట సామాగ్రి స్వయం గా పంపిణీ చేసిన ఉదార హృదయ ,వితరణ శీలి .
స్త్రీ –జీన జనోద్దరణ :
ప్రముఖ గాంధేయ వాది ,సంఘ సేవకురాలు ,సంస్కర్త అయిన రత్నమ్మ 1940లో ఎన్నో వితంతు వివాహాలు జరిపించి సంస్కరణను ఆచరణ లోకి తెచ్చిన ఉద్యమ శీలి .స్త్రీలు స్వతంత్రం గా తమ కాళ్ళ మీద నిలబడాలన్నది ఆమె ధ్యేయం .అందుకోసం వారి ఉపాధికోసం ‘’మహిళా పారిశ్రామిక సంఘం ‘’ఏర్పరచింది .ఇందులో కుల మత విచక్షతను పాటించకుండా దళిత ,హరిజన ,అనాధ మహిళలకు స్థానం కల్పించి వారికి కుట్టుపని లో శిక్షణ నిప్పించి ,కుట్టు మిషన్లు కొని అంద జేసిన దీన జన బాంధవురాలు .
ఇంకొక అడుగు ముందుకు వేసి ఆనాడు విపరీతం గా ఉన్న వేశ్యా వ్రుత్తి లో మగ్గి పోతున్న మహిళలకు మార్గోపదేశం చేసి వారి దృష్టిని మరల్చి ,జన జీవన స్రవంతిలోకి మళ్లించిన పుణ్యాత్మురాలు .వేశ్యా జీవితం గడిపిన వారికి మంచి సంబంధాలు చూసి వివాహం చేసి వారి జీవితాలలో వెలుగులు నింపిన మహోదయురాలు .రత్నమ్మ గారు చేస్తున్న మహిళాసేవకు ,ఆ రంగం లో తల పండిన ప్రముఖ సంఘ సేవకులు ,మహిళా ఉద్యమ నాయకులు దుర్గా బాయి దేశ ముఖ్ ,కమలాదేవి చటోపాధ్యాయ మొదలైన వారు స్వయం గా వచ్చి చూసి ఆమె సంకల్ప బలానికి. సేవాతత్పరతకు బహు ప్రశంసలను అంద జేశారు ఇందరి హృదయాలను చూర గొన్న సేవా రత్నం రత్నమ్మ గారు .
విద్యా సేవ :
విద్య అందరి హక్కు అని రత్నమ్మ నమ్మారు .అందుకోసం విద్యా,గ్రంధాలయాలు ఏర్పరచారు .సంస్కృతం తెలుగు నేర్పటమే కాక సంగీతం ,నృత్యం మొదలైన కలలలో ఆసక్తి ఉన్న బాల బాలికలకు ,ఆర్ధిక సాయం అందించారు .తనలాగే స్త్రీ జనాభ్యుతి కోసం కృషి చేస్తున్న స్వచ్చంద సంస్థలను గుర్తించి వారికి కావలసిన ఆర్దికాది అన్ని సదుపాయాలూ అందజేసి చేయూత నిచ్చి వికాసానికి తోడ్పడ్డారు .సమాజం లో అర్హులైన నిరుపేదలను గుర్తించి వారికి ఇతోధికం గా ఆర్ధిక సహకారం ఇచ్చారు .విద్యార్ధినులను ప్రోత్సహించటానికి స్వర్ణ పతకాలు వెండి షీల్డులు ,రజత పతకాలు తయారు చేయించి బహూకరించి మహిళాభ్యుదయానికి ఎన లేని సేవచేశారు .
ప్రధమ మహిళా చైర్మన్ :
ఏలూరు లోని స్వగృహం లో భర్త తోడ్పాటుతో ప్రశస్ట మైన స్వంత ‘’గ్రంధ భాండాగారా’న్ని ‘’ 1920లోనే ఏర్పాటు చేసుకొని అందరికి ఆదర్శం గా నిలిచారు .ఏలూరు కాంగ్రెస్ కమిటీలో ఎక్సి క్యూటివ్ సభ్యులుగా ,యువజన కాంగ్రెస్ సంఘాధ్యక్షులుగా బాధ్యతలను నిర్వహిస్తూనే శాసనోల్లంఘన ఉద్యమాలకు నాయకత్వం వహించారు . బాపూజీ పిలుపు నను సరించి ఖద్దరు, ధారణా.హిందీ భాషా వ్యాప్తి ,మద్య పాన నిషేధం ,హరిజనాభ్యుదయం , మహిళాభ్యుదయం వంటి అనేక నిర్మాణ కార్యక్రమాలు చేబట్టి ,విస్తృత ప్రచారం చేశారు . 1937ఏలూరు పురపాలక సంఘ సభ్యురాలుగా ఎన్నికై ,మూడేళ్ళ తర్వాత 1940పురపాలక సంఘ చైర్మన్ అయ్యారు .ఒక మహిళ ఇలాచైర్మన్ గా ఆంద్ర దేశం లో మొదటి సారిగా ఎన్నికవటం చరిత్ర కెక్కి, గొప్ప సంచలనమే సృష్టించింది .
నెల్లూరు లో జరిగిన ఆర్య వైశ్య మహిళా జన సభ లో రత్నమ్మకు ‘’సంఘ సేవా పరాయిణి’’ బిరుదు నిచ్చి సత్కరించారు .నిరంతర సేవాకార్యక్రమాలలో జీవితాన్ని సార్ధకం చేసుకొన్న స్త్రీ మాణిక్యం మహిళా రత్నం చుండూరి రత్నమ్మ డెబ్భై నాలుగు సంవత్సరాల ఫల ప్రద జీవితాన్ని గడిపి ,స్వాతంత్ర్యానంతరం పది హేదేళ్ళు బ్రతికి స్వాతంత్ర్య ఫలాలను కళ్ళారా చూసి సంతృప్తి చెంది 4-8-1965 న ఏలూరు లో పార్ధివ దేహాన్ని వదిలి కీర్తి శరీరాన్ని ధరించింది .ఆమె మరణానంతరం ‘’ఇండో ఇంగ్లీష్ హైస్కూల్ లో ‘’శ్రీమతి చుండూరి రత్నమ్మ స్మారక గ్రంధాలయం ‘’ను వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ ఏ.వి రాజు గారు ప్రారంభించారు .రత్నమ్మ చేసిన అపూర్వ త్యాగం,సేవా నిరతి చిరస్మరణీయం .భావి తరాలకు స్పూర్తి దాయకం,ఆదర్శం .
– గబ్బిట దుర్గా ప్రసాద్
“~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~