ఓయినం

Gowri jajula మాట విని ఆడివట్లోని లెక్క నీకాడికి వచ్చినట్టుండు అయినా పిల్లలు లేరు జల్లలు లేరు నిన్ను రూపాలు అడ్గనీకి ఎంత సిగ్గులేకపాయె మల్లా పైసలు గిట్ల ఇచ్చినావా ఏంది” అన్నది ఈసడించుకుంటూ ”లేవు లేవంటే యినకుండా మొండిగ కూకుండు యింగ ఏంజేయ్యలే అని నూరు రూపాయి ఇచ్చినా’ అంటూ నీళ్ళు నమిలింది.”ఓ పోరీ గట్లేందుకిచ్చినవే నీకు పైసలు ఎక్వయినయా ఏంది అంటూనే మల్లనీకు ఎప్పుడిస్తన్నడు” అన్నది కోపంగా”పైసలు సేతిల పడంగనే సప్పిడుచెయ్యక పోయిండు” అన్నది.

”సిగ్గుశరము లేనోని లెక్కనే ఉండేందే అయినా నువ్వెట్ల యిస్తవు పిల్లా ఇంకొకసారి గిట్లాంటి అర్కతులు జెయ్యకు” అని మందలించింది””గట్లనే తియ్యి అత్తమ్మ గాని గియ్యల మా అమ్మొళ్ల యింటికి పోవాలను కుంటున్న పైసలు గీడున్నయంటే గిట్లనే ఖర్చు అయ్యేటట్లు ఉన్నయి” అంది బాధపడ్తు.”అవునే పిల్లా అయినా తెగించి నోళ్ళేందే గింత ఓమ్మొ గింత అన్నాళ్ళమూ ఏడజూడ్లేదమ్మ గీబాయి గడ్డమీద సాగించు కుంటుండ్రుగాని యింకోయింకో ఊర్లయితే గీళ్లచాలు బాజుతనం సాగక పోతుండే గిప్పుడన్నా జెర ఉషారు గుండే” అంటూ పెట్టెలోంచి డబ్బులుతీసి ఇస్తూ.’నీలమ్మ బస్సులల్ల పైసలు భద్రం. భద్రంగా పోయిరా మీ అమ్మనాయినోళ్ళనూ అడిగినట్లు జెప్పు’ అంటుంటే నీలమ్మ డబ్బులు తీసుకుని యింటిదిక్కు నడిచింది.నీలమ్మ త్వరత్వరగా యింటికి పోయి కొత్తబట్టలన్ని సంచిలో పెట్టి మధ్యన డబ్బులు దాచి ఇంటికి తేళం వేసి ఓ చేతిలో కొడుకునూ మరో చేతిలో సంచిని పట్టుకుని ముందు నడుస్తుంటే సురేందరు తల్లి వెనకలే నడించాడు.ఓరాల గట్లేంటపోతూ సింతబాయి సేన్లు దాటి తామరపూల గంతకాడికేని నడుస్తూ మేడిపండు చెట్టు దగ్గరకు పోగానేమేడిపండు చెట్టుకిందున్న శివుడి గుడిలో శివపార్వతులు గంభీరంగా తన దిక్కు చూస్తున్నట్టు ఉండేసరికి కొడుకును చంకలోంచి దించి సురేందరును చూస్తూ ”దేవునికి మొక్కు కొడ్కా” అని దండం పెట్టుకుని గుడిలోంచి బొట్టు తీసి ఇద్దరు కొడుకులకు పెట్టి గాడిబాయి దగ్గరనుంచి నడుచుకుంటూ పోయి లోతుకుంటా నర్తకీ టాకీసు ముందరకి పోయేసరికి ”ఏడికి పోతున్నవు” అంటూ రాజు ఎదురొచ్చి దారికి అడ్డంగా నిలబడ్డడు.అతన్ని చూస్తునే నీలమ్మకు అరికాలు మంటనెత్తికెక్కింది. ”అతన్ని తీక్షనంగా చూస్తూ నేను ఏడికన్నా పోతా అడ్గనీకి నువ్వెవడివిరా” అన్నది కోపంగా ”నేనేవడినా నీకు తెల్వదా ఎక్వమాట్లాడకు గాని సిన్మకొస్తవా పోదాం” అన్నాడు తాపీగా.”ఓదినను పట్టుకుని గట్ల అననీకి నీకు సిగ్గులేదూ నేనెందుకు నీతోటొస్తా” అని గట్టిగా అరిచింది.

”ఏ లొల్లి జెయ్యకు నువ్వు నాకిందున్నప్పుడు నీమామా సూసిండు అంటే ఏంది నాకింద పండుకున్నవనేగా నీకు లేని సిగ్గు నాకేంది” అంటూ వికృతంగా నవ్వి రాత్రిగంత సేపు తలుపు గొడితే తలుపెందుకు తియ్యలే” అన్నడు. ఆ మాట వినేసరికి నీలమ్మ గుండెల్లో రాయిపడింది. ”నేను ఊహించింది నిజమేనన్నమాట” అనుకుని.”అంటే రాత్రి వచ్చిన లుచ్చాగాడివి నువ్వా” అన్నది.”ఏంది మాటలు ఎక్వెక్వ మాట్లాడుతున్నవు జబడాలు యిర్గకొడ్తా నేను రాకపోతే ఇంకెవడోస్తడే యింకెవడన్నా ఉన్నడా ఏంది” అంటూ అటుఇటూ చూస్తుంటే ”ముదనష్టపు ముండాకొడ్క నన్నెడ్పిస్తే నీకేం మంచిగైతదిరా పురుగులు పడిపోతావు పక్కకు జరుగు పక్కకు జరుగు” అంటూ గట్టిగా నెట్టెసరికినీలమ్మ అరుపులకి జనాలు వచ్చితంతారనే భయంతో పక్కకు జరిగి ”నాటయి మొచ్చినప్పుడు నీ పని సెప్తనే” అనే మాటలు నీలమ్మ చెవిలో పడేసరికి చటుక్కున వెనుతిరిగి రాజుని చూస్తూ కాండ్రించి ఉమ్మి వేసి ముందుకు నడిచింది.బస్సెక్క పోతుంటే మొగులయ్య గుర్తు వచ్చి గుండె బరువెక్కింది. శివరాత్రిరోజు కీసర గుట్టకు పోయి ఇద్దరు గడిపిన క్షణాలను గుర్తుకు తెచ్చుకుంటుంటే అప్రయత్నంగా కన్నీళ్ళు చెంపలపై నుంచి జలజలారాలాయి. బస్సు దిగి ఊర్లోకి పోయే సరికి పిల్లలతో వస్తున్న నీలమ్మను చూసి బుజ్జి గబగబా ఎదురొచ్చి సుభాషును ఎత్తుకుని మరోచేతిల సంచిని తీసుకుంటు ”అక్కా బాగున్నవాయే” అన్నది.

నీలమ్మ చెల్లెలిని కండ్లనిండుగా చూస్తూ ”బాగున్ననే నువ్వెప్పుడొచ్చినవు” అని కుశల ప్రశ్నలు వేస్తునే ముందకు సాగుతుంటే, ”నిన్ననే నీ మరిది నేను వచ్చినమక్కా పెద్దక్కగూడా వచ్చింది. అగొ సెట్టు కింద కూకుంది సూడు” అని అటుచూయించింది.నీలమ్మ అక్కను చూస్తూనే సరాసరి ఆమె దగ్గరకు పోయి అక్కా బాగున్నవాయే అంటూ ఆమెను దగ్గరకు తీసుకుంటుంటే, చంద్రమ్మ చెల్లెల్ని చూసి ”నాసెల్లి ఎట్లున్నవే” అంటూ కన్నీళ్లు పెట్టుకుంట పిల్లలిద్దర్ని అక్కున చేర్చుకుని ”ఎట్లున్నరు కొడ్కా” అంటూంటే ఆమె గొంతు జీరపోయింది.అప్పటికే బుజ్జి ఇంట్లోకి పోయి కాళ్లు కడుగుకోనికి నీళ్ళిచ్చి తాగనికి చెంబుతో నీళ్ళు తెచ్చింది.నీలమ్మ కాళ్ళు చేతులు కడుకుని వచ్చి అక్కపక్కన కూర్చుంటూ ”అమ్మెదే” అని తల్లి గురించి అడిగింది.”పనికాడ్కేని యింక రాలే సెల్లె” అని చంద్రమ్మ అంటుంటె, ”బావా, పిల్లలు అందరు మంచి గుండ్రాయే” అంటూ యోగక్షేమాలు అడిగేసరికి ”అందరు బాగుండ్రుసెల్లే సిన్నోడిని తీసుకుని నిన్ననే వచ్చినా, బావా పిల్లలు గియల పొద్దిమింకి వస్తరు అవును గాని మీ యిండికాడ అందరు బాగుండ్రా ”మీ అత్తోళ్లు ఎట్లుండ్రు ఆళ్లు నిన్ను బాగా సుస్తుండ్రా” అంటూ ఆరా తీసింది. ”అందరు బాగుండ్రే, అందరు నన్ను మంచిగనే సూస్తుండ్రు పొలంల మొన్ననే కోతలైనయి ఇగ మల్లా నాట్లు ఏసేదాక ఉట్టిగనే ఉండాలే” అంటుంటే ”గప్పటిదాకా ఉట్టిగుండుడు ఎందుకు సెల్లె మామరిది ఉన్నప్పుడు గదీలెక్కాగాని ఇప్పుడు అన్ని నువ్వే సూసుకోవాలాయె సురేందరును అమ్మొళ్ళ తాననే ఉంచిపో యింటికాడ కాళీగా ఉండకుండా మీ యిండ్లపక్కలున్న తొటలల్లకీ కల్వ కొయ్య పో కూళ్ళ పైసలొస్తే యింత సిల్లర ఖర్చు ఎల్లిపోతది” అంటూ బుద్ధి చెప్పింది. తాను ఆలోచిస్తున్న మాటనే అక్కననోట్లనుంచి వెలువడెసరికి ”గట్లనే అక్క ఇంగ ఇప్పటి నుంచి గట్లనేజేస్తా” అని అంటుండగానే బుజ్జి ఇంట్లోంచి వస్తూ ”అక్కా బువ్వతిందురు లెవ్వుండ్రే అంటూ చెంబుతొ నీళ్ళిచ్చి పొద్దుగాళ్ళ తిని ఎల్లినవో లేదో తిందువుగానీ లెవ్వక్కా” అని నీలమ్మ చెయ్యి పట్టి లేపింది.

భోజనాలయ్యాక ఇంటిబయట చెట్లకింద చాపేసుకుని పడుకుంది నీలమ్మ. రాత్రి నిద్రలేకపోవటం, ప్రయానం చేసి రావడంతో అలసినట్టుండి తొందరగా నిద్రలోకి జేరుకుంది.మధ్యాహ్నం రెండు గంటలకు ఇల్లు చేరిన ఎల్లమ్మకు వాకిట్లో చాపేసుకుని పడుకున్న నీలమ్మను చూసి గబగబా దగ్గరకు వచ్చి ”బిడ్డాబిడ్డా…” అంటూ లేపింది. కళ్ళు లోతుకుపోయి మొఖం అంతే పీక్కుపోయి దీనంగా ఉన్న కూతుర్ని చూడగానే ఆమె కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.నీలమ్మ లేచి తల్లిని చూస్తూ ”అమ్మ ఎప్పుడొచ్చినవే బాగున్నవా” అంటూ జీవం లేనట్టు నవ్వింది.వెంటనే ఎల్లమ్మ కూతుర్ని గుండెలకు అదుముకుని ”నా బిడ్డ నీరాత ఎట్లయిందే ఆ దేవునికి నేనేం అన్నాళం జేసిననే నా బంగరం లాంటి బిడ్డకు గిట్లాంటి రాతనిచ్చిండు” అని ఏడ్చేసరికి నీలమ్మ మౌనంగా కన్నీరు కార్చింది.పండుగున్న రెండు రోజులు తల్లితండ్రులు, అక్కాచెల్లెలి ప్రేమ అప్యాయతలతో నీలమ్మకు హాయిగా గడిచింది.పండుగ కొచ్చిన కూతుర్లకీ అల్లుల్లకీ మనమలు మనుమరాండ్ల్రకీ కొత్త బట్టలు పెట్టింది ఎల్లమ్మ.నాలుగు రోజులున్నాక చంద్రమ్మ భర్తలతో కల్సి యింటికి పోతే నీలమ్మ తల్లి దగ్గర యింకో పదిరోజులుండి వెళ్తానని అక్కడే ఉండిపోయింది.

ఒకనాడు పంటకని ఇచ్చిన డబ్బులను కూతురు తిరిగి ఇస్తుంటే వద్దని వారిస్తూ ”ఉండనీ తియ్య బిడ్డా నేను నీ కోసమే చిట్టెసి ఆ పైసలు గూడా కట్టెసినా” అన్నది.”అమ్మ నాకాడుంటే ఉట్టిగనే కర్చు అయితయే మళ్ళీ అక్కరొచ్చినప్పుడు తిస్కుంట” అంటూ డబ్బులను చేతిలో పెడ్తూ ”అమ్మ యింగ సురేందరును నీ దగ్గరనే పెట్టుకోయే సుభాషంటే సిన్నోడు ఏసెట్టుకిందనో ఏసి పనిజేసుకుంట. ఈడైతే ఆడిడ ఆడుకుంట పనిజెయ్యనియ్యడు గట్లజేస్తే ఇంగనన్ను కల్వకొయ్యనియ్యరే అంది ”బయట పనికి పొమ్మని నిన్ను ఎవలు కొట్టిండ్రు బిడ్డా పిల్లలని సూస్కుంట ఉండరాదు” అన్నది ఎల్లమ్మ.”గట్లకాదమ్మ సేను పని అయిపోయినంక ఉట్టిగనే ఎన్ని దినాలుందు కలవకొయ్యపోతే నాలుగు రూపాలొస్తేయి ఏదన్నా ఖర్చులెల్తయి ఎన్ని దినాలని నాకు పెడ్తవే” అని అన్నది.”నా పానం ఉన్నన్ని రోజులు నిన్ను సూస్తా బిడ్డా, అదే నాకొడుకుకైతే నేను నా దగ్గరి పెట్టుకోనా, మంచిగుంటే నేనూ పెట్టకపోదునేమొ కాని నువ్వు గిట్లయితివి” అన్నది బాధపడ్తూ.”పోనితియ్యె నా రాత గిట్లుంది ఏదో ఒక కష్టం జేసుకుని నేను బత్కాలే” అంటుంటే సరే తియ్యి బిడ్డా నువ్వన్నట్లనే కానియ్యి అన్నది.తల్లి దగ్గర ఉన్నన్ని రోజుల్లో రాజు సతాయిస్తున్న విషయం తల్లికి చెప్పాలని ప్రయత్నించింది నీలమ్మ.కాని ఈ విషయం తెల్సి తల్లిదండ్రులు మరింత కుంగుతారని, తన వల్ల వాళ్ళు మరింత బాధపడ్తారని వెనక్క తగ్గింది.ఇంటికి తిరిగి వెళ్తున్న రోజు బస్సు ఎక్కించేందుకు తల్లిదండ్రులతో పాటు సురేందరు వచ్చాడు.తల్లి బస్సెక్కి తననూ తీసుకుపోనందుకు ఏడుస్తూ కింద నిలబడి సాలయ్య చేతుల్లో పెనుగులాడుతూ ”అమ్మపోతా, అమ్మపోతా” అని మారాంచేస్తూ తల్లి దిక్కు చూస్తూ వెక్కి వెక్కిఏడ్చాడు. తల్లి తనను అమ్మమ్మ దగ్గర విడిచి వెళ్లటం ఆ చిన్న మనస్సు జీర్ణించుకోలేక పోయింది.బస్సెక్కి కొడుకును చూసిన నీలమ్మ గుండెలవిశాయి. తప్పనిసరి పరిస్థితుల్లో కొడుకును విడవాల్సి వస్తున్నందుకు గుండె రాయి చేసుకుంది.అందరి గుండేలు భారమయ్యాయి.
నీలమ్మ లోతుకుంటలో బస్సు దిగేసరికి సాయంత్రం అయింది.

కొడుకును ఎత్తుకుని సంచిపట్టుకుని యింటికి వెళ్ళేసరికి వాకిట్లో సత్తయ్య ఎల్లయ్యలు మాట్లాడుకుంటున్న వారల్లా కొత్తబట్టల్లో వచ్చిన నీలమ్మనూ చూసి గుసగుస లాడారు. ఆమెను చూసేసరికి వాళ్ళ కడుపు మండింది.నీలమ్మ ఇంటితాళం తీసుకుని లోపలికి వెల్లంగానే ”ఇదేందిరా సుభాషుగాడ్ని ఒక్కడ్నే తీసుకొచ్చింది యింకొకడేడి” అని సత్తయ్య తోవ దిక్కు చూశాడు.”ఆడు ఎన్కవడి వస్తుండేమొనే” అంటూ ”తల్లి బాగనే కొత్తబట్ట పెట్టిందే” అన్నాడు. ”ఆ… ఆళ్ళ అమ్మనాయినలకేం తక్వజెప్ప యిద్దరికి సర్కారు కొల్వులే, కొడుకా ఈ ఊర్లలో లేకపాయె యింగ ఉన్నదంతా ముగ్గురు బిడ్డలకే పెడ్తది మన లెక్కనా ఏంది” అంటూ పోచమ్మ దీర్ఘాలు తీస్తుంటే.ఎల్లయ్య ఇంకొంచెం ముందుకు వంగి ”మొన్న ఎంతో కత జర్గింది నీ కర్మ అన్నా వడ్లు అమ్మిన రూపాలు దీస్కపోయి చంద్రన్న తోటి తల్లికి పంపింది. తల్లి ఈమెకు పెట్టుడేమో గానీ గిప్పుడు బిడ్డ తల్లికి పెడ్తుందే” అని అన్నడు. ”అమ్మా గట్లనా మల్లా గీసుద్ది నీకెట్ల ఎర్కాయేరా” అని అతని దిక్కు తిరిగాడు ”ఈమె ఆళ్లకు రకం ఇచ్చేటప్పుడు మీ మరదలు ఆడనే ఉందటనే నా పెండ్లాము ముందలనే రూపాలిచ్చి నా పెండ్లాము ఏడ పైసలు అడ్గుతదోనని దానితోటి ఒక్క మాటా మాట్లాడక ఎన్కకు మర్లిదంట మేమేమన్నా బిచ్చపోళ్లం అన్కుందేమొ దీనిలాంటి పదిమందిని కూకోపెట్టి నడ్పెటంత రకం నాకాడుంది” అంటూ చిటిక వేశాడు.

”అబ్బొ దీనికి గింత టెక్కు వచ్చిందా అరే ఎల్లిగా మన టయిము రానీ తడాఖా సూపిద్దాం’ అంటూ మళ్ళి దారిదిక్కు చూసి”గింతసేపాయె సురేందరుగాని జాడ లేదేందిరా” అన్నాడు.వెంటనే ఎల్లయ్య బయటికి వచ్చి అడుకుంటున్న సుభాషు దగ్గరకు పిల్లిలా వచ్చి”ఓరి పోల్లగా గిప్పుడే వస్తున్నావా” అంటూ ముద్దు పెట్టుకుని కపటప్రేమను కురిపిస్తూ ”అవునుగాని మీ అన్నేడిరా” అన్నాడు.సురేందరు పేరు వినేసరికి సుభాషుకు సంతోషం కల్గి ”అన్నా అమ్మమ్మొళ్ళ యింటికాడనే ఉండు ఇంగెప్పుడు గీడికి రాడు” అంటూ వచ్చిరాని భాషలో తల్లి అమ్మమ్మ మాట్లాడుకున్న మాటలు గుర్తున్న వరకు చెప్పేసరికి ఆ మాటలు వింటున్న సత్తయ్య ”ఓరి పోరగా మీ అమ్మను పిల్చుకురాపో’ అన్నాడు వెంటనే సుభాషు ఇంట్లోకి వెళ్ళి ”అమ్మ తాతపిలుత్తుండే” అని పిలిచేసరికి ”ఏంది బిడ్డా” అంటూ తలతిప్పి సూసింది.”తాత పిలుత్తుండమ్మ” అపి మళ్ళి చెప్పాడు. ఆ మాట విని గబుక్కున బయటకు వచ్చి ”మామా పిల్చినవా” అన్నది భయం భయంగా.”ఏం పిల్లా పెద్దోడిని మీ అమ్మొళ్లకాడ ఇడ్సి వచ్చినవా” అంట నిలదీస్తుంటే సత్తయ్య మాటలో కఠినత్వం. ”అవును మామా మన సేండ్లల్ల పన్లు అయిపాయె ఇంగ యింట్ల కూకొని ఏం సేస్త తోట్లకన్నా పనికి పోతే యింత పోట్టెల్తదని పెద్దోడు ఈడుంటె ఆడితోటి కష్టమైతది సుభాషు గాడంటే సిన్నోడు ఏడ కూకవెడ్తే ఆడ కూకుంటడు ఈడ్ని ఎంట తీసుకుని పనికి పోవచ్చని ఆడ్ని ఇడ్చి వచ్చినా” అన్నది నేల చూపులు చూస్తూసత్తయ్య నీలమ్మను తేరిపార చూస్తూ ”గట్లనా పనికి పోనికి ఆడు ఆడ్డమైండా లేక నీ పన్లకు అడ్డమైండా” అంటూ మాటలను వత్తివత్తి పలికే సరికి, అతనూ ఏం మాట్లాడుతున్నాడో నీలమ్మకు అర్థం అయి మౌనం దాల్చింది.

”ఉండనీ తియ్యరాదూ దాన్ని తల్లిదండ్రులిద్దరు కష్టం జేసి ఎవళకు పెట్తరూ పోరడు ఆడుంటే నల్గుట్ల ఉండి బుద్ధిమంతుడైతడు” అంటూ పోచమ్మ కల్పించుకునే సరికి సత్తయ్య మారు మాట్లాడలేదు.మర్నాడు తోటలల్లకు పోయి పని గురించి అడిగి వచ్చి పనికిపోవడం మొదలు పెట్టింది నీలమ్మ.రాజు నుంచి తప్పించుకోవటానికే ఆమె ఈ పనుల్లో పడింది. కానీ రాజు సందు దొరికినప్పుడల్లా నీలమ్మను సతాయించడం మానలేదు. అతని ప్రవర్తనతో మానసికంగా లోలోన క్రుంగుతుంటే సత్తయ్య, ఎల్లయ్యలు కల్లంలో రాజుని చూసి కూడా చూడనట్లు నటిస్తూ అతన్ని వెనకేసుకు రావడం నీలమ్మలో భయాన్ని రేపింది రాజు ఇంటికి వచ్చి గంటలు, గంటలు గప్పాలు కొడుతుంటే ఎందుకు ఊరుకుంటున్నారో ఆమెకు అర్థం కాలేదు.మరోవంక ఎల్లయ్య అక్కర పడ్డప్పుడల్లా డబ్బులు అడిగి తీసుకోవటం మానలేదు. ”ఇచ్చిన రూపాలు ఎప్పుడిస్తవు మామా” అంటే ”ఇస్త తియ్యి పిల్లా నేనేమన్నా ఇల్లమ్ముకుని పోతున్ననా, ఔనుగాని కల్లంల జరిగిన సుద్ధి గురించి మల్ల మీ మామేమన్నా అన్నడా, అ… అడ్గడు తియ్యి ఎందుకంటే పోని మొగుడు లేంది ఎట్లని బత్కుతది తియ్యి అని నేనూ సత్తెన్ననూ సమజాయించిన తియ్య” అంటూ నీలమ్మను బ్లాక్‌మెయిల్‌ చెయ్యసాగాడు.

ఇటు పంటేసుకుని అటు కల్వకొయ్య పోతూ రెండు సేతులా సంపాయిస్తోందని సత్తయ్య మనస్సులో కసి మరింత ఎక్కువైంది. ఎల్లయ్యకు డబ్బులిస్తున్న విషయం తెల్సి నీలమ్మను పిల్చి ”ఏం పిల్లా ఎల్లయ్యకు అడిగినప్పుడల్లా రూపాలిస్తున్నవంట ఎందుకు గట్లజేస్తున్నవు గాపైసలేదో నువ్వే జమేసుకోరాదు” అంటూ నిలదీసింది సుక్కమ్మ.”అత్తమ్మ ఎట్లజెప్పాలే నాకాడ రూపాయి లేవంటే ఇనడు ఏదో ఒక వంక తోటి మాట్లాడుకుంట ఇచ్చిందాకా నాపానం తీస్తడు” అంటూ వాపోయేసరికి ”నీకాడ పానం దీసుకుంట పైసలు దీస్కుండుటడుగాని బయట ఆడ ఏం జెప్తుండో నీకు ఎర్కేనా” అంటూ నీలమ్మ కళ్లలోకి సూటిగా చూసింది.”ఏం జెప్తుండు అత్తమ్మా ఏం జెప్తుండు” అని ఆత్రంగా అడిగిందే కానీ ఆమె గుండెలు దడదడలాడాయి.”నువ్వే ఆనికి వద్దన్నకొద్ది రకం చేతులల్ల పోస్తున్నవంట” నా మీద దానికి లావుగాలి మల్లినట్లుదన్నా ఒద్దన్న కొద్ది నాసేతల రూపాలు వెడ్తుందని” అని ఆడు మీ మామతోటి అన్నడంట” అని కండ్లల్లోకి చూసింది.”ఓ పిల్లా గీ మాట ఎర్కయినంక మీ మామ మస్తు పరేషాన్‌ అయిండు నిన్ను పిల్చి ఇంగనన్న పోరిని సరిగుండమని జెప్పుమన్నడు” అంటూ బాధపడింది.నీలమ్మకు పచ్చిపుండు మీద కారం అద్దినట్లు అన్పించింది.”ఏమత్తమ్మ నేను గట్ల సేస్తనా సెప్పు నీకు మొదటి నుంచి నా దిక్కెళ్ళి ఎర్క. అన్ని సుద్దులు నేను నీకాడ సెప్త నువ్వు గీమాట నమ్మినవా” అంటూ ముఖం చిన్నబుచ్చుకుని అక్కడ్నించి వచ్చేసింది.

ఓ రోజు సత్తయ్య కల్లు దుఖానంలో కూర్చుని ఎదురు చూస్తుంటే రాజుని తీసుకొని అక్కడికి వెళ్లాడు ఎల్లయ్య.రాజునే అందరికి కల్లు తెప్పించాడు.సగం కల్లు తాగేసరికి మత్తు తన ప్రభావాన్ని చూపిస్తుంటె”ఒరేయ్‌ ఎల్లిగా మన పిలానుకు పొద్దులు దగ్గర పడ్డయి నీకు యాది కుందారా” అన్నడు. ”అరే ఎట్ల యాదికుండదన్నా నువ్వు సెప్పింది నేనెప్పుడన్నా మరిస్తినాయే” అంటూ నవ్వాడు.”రాజుగా గీసారి అందరి కండ్లల్ల దాన్ని రంకులాడ్ని సెయ్యాలిరా గానీ నిన్ను ఎవల కంట్ల పడనియ్యకుండా సూసే పూచి నాది కానీ కొడ్కా గీ ఒక్కపని జేసినవంటే గీ పెద్ద నాయినకు మస్తు సాయం జేసినట్లయితది. గీ పని జేసినందుకు నీ కష్టం ఉంచుకోనని ముందే జెప్తిగా గీ పనైనంక నీకు ఎంతముట్ట చెప్పాలనో నాకెర్క అప్పటిదాక ఇంగో గివి ఉంచుకో” అంటూ డబ్బులు చేతిలో పెడ్తుంటే రాజు మహదానంద పడిపోతు ఇన్ని దినాల నుంచి వాళ్ళు చెప్పినట్టుగానే కాకుండా తాను చేసిన విశ్వప్రయత్నాల గురించి పూసగుచ్చినట్లు బయటపెట్టేసరికి ”అబ్బో సూసిరమ్మంటే కాల్చి వస్తున్న వన్నమాట రాజుగా గియ్యల నాదిల్లుల మస్తు కుషీ గుందిరా కానీ నువ్వు ఒక్కటే గలతు జేస్తున్నవు గా సేసేదేదో అందరి కండ్లల్ల పడేటట్లు జేయి” అంటూ సత్తయ్య తర్వాతేం చెయ్యాలో పూసగుచ్చినట్లు చెప్పాడు.తాను చేస్తున్న ఘనకార్యాలను కూడా బయటపెట్టి సత్తయ్య మెప్పును పొందాలనుకున్నాడు ఎల్లయ్య. కాని నీలమ్మ దగ్గర డబ్బులు గుంజుతున్నాడని తెలిస్తే ఎక్కడ ఎదురు తిరుగుతాడోనని జంకాడు.

నీలమ్మ ముందు రాజు విషయాని సత్తయ్య ముందు నీలమ్మ విషయాన్ని ఎరగా వాడి డబ్బులు లాగి అంత అవసరం అయితేరాజుని పావుగా వాడుకోవాలనుకున్నాడు.”ఈ ముగ్గురి గుట్లు నాకాడున్నయి ఇంగ రంగమాడ్తా” అనుకున్నాడు. నీలమ్మను అందరి ముందు చెడ్డదానిగా నిరూపించే ప్లాను సిద్ధం చేసుకొని అవకాశం కోసం ఎదురుచూడ సాగారు ముగ్గురు.మళ్ళీ పంటవేసేకాలం దగ్గర పడింది.నీలమ్మ మళ్ళీ తల్లిగారింటికివెళ్ళి కొడుకును చూసి పంట వెయ్యనికి తల్లి దగ్గర నుంచి డబ్బులు తెచ్చింది.పొలాల్లో పనులు మొదలయ్యాయి.నీలమ్మ కూలోళ్ళనూ పెట్టి పొలం దున్నించి నారు పోసి నాట్ల కోసం వరిమడ్లను సిద్ధం చేస్తోంది.పక్క పొలాల్లో చంద్రయ్య, ఎల్లయ్య, రంగయ్య, సత్తయ్య, రాజు ఎవరి పనులు వాళ్ళు నువ్వా నేనా అన్నట్లు చేస్తున్నారు. ఓ రోజు పొద్దుగూకి మసక చీకట్లు ముసురుకుంటున్న సమయం పొలాలల్లో నాగళ్ళను ఇడిచి ఇంటిముఖం పట్టారందరు.ఓరాల గట్లేంటు పోయి మెషిను కోటిలు దగ్గరకు చేరి పంపు కాడ కాళ్ళు చేతులు కడుక్కుంటుంటే, కూలోల్లను పంపించి కొడుకు నెత్తుకొని గట్లమీద నడ్వసాగింది నీలమ్మ.అదే సమయంలో నీలమ్మ నారుమడిలోకి ఎద్దుచేరి నారును మేస్తుండటం చూసి”నీలమ్మ నీసెండ్ల ఎద్దుపడిమేస్తోంది గటుసూడు” అంటూ రంగయ్య కేకేశాడు. వెంటనే నీలమ్మ చంకల వున్న కొడుకును వరం గట్టుమీదనే దించి వెను తిరిగి గబగబా ఎద్దును కొట్టపోతుంటే, మెషిను కోటిలు దగ్గరున్న అందరు పరుగెత్తుతున్న నీలమ్మను నారుమడిలో పడిమేస్తున్న ఎద్దును చూస్తున్న సమయంలో అకస్మాత్తుగా నీలమ్మకు ఎదురొచ్చి గట్టిగా కౌగిలించుకున్నాడు రాజుఈ హఠాత్పరిణామానికి నీలమ్మ దిమ్మెరపోయింది.మెషిను కోటిలు దగ్గర కలకలం రేగింది.

రాజు కావాలనే అందరి ముందు తన పరువు తీశాడని గ్రహించిన నీలమ్మ అతని అసలు రూపం అందరికి తెలియాలని అతని పట్టు విడిపించుకుని ముఖం మీద రెండు గుద్దులు గుద్దేసరికి దిమ్మెరపోయి పట్టు దప్పి పొలంలో పడ్డాడు.ఇన్ని రోజులుగా భరిస్తున్న అవమానం ఆవేశంగా మారి నీలమ్మ కోపం కట్టలు తెంచుకుంది.బురద మడిలో అతన్ని అటు ఇటూ పొర్లిస్తూ కాళ్ళ మధ్యన తంతు ”బాడకావు సావు సావు” అని గట్టిగా అరుస్తుంటెరాజు ప్రతిఘటించసాగాడు.నీళ్ల పంపు దగ్గర వున్న రంగయ్య, చంద్రయ్యలు వెంటనే తేరుకుని వరాల గట్లెంట పడి నీలమ్మ దగ్గరకు పరుగెత్తుతుంటే ”ఏ ఉండు ఏం జరుగతదో సూద్దాం” అంటూ సత్తయ్యవాళ్ళను ఆపే ప్రయత్నం చేశాడు.”అరే ఆడ పోర్ని పట్టుకున్నోడు ఎవడో ఆనిపని పడ్తాం నడువురా బాడకావుకు మన పోర్లమీద సెయ్యేసేంత హిమ్మతే ఏ నడువువయ్య నడువ్వు అంటూ సత్తయ్యను తప్పించుకొని చంద్రయ్య పరిగెత్తేసరికి రంగయ్య వెనకాలే ఉరికాడు.తమ ప్లాను బెడిసి కొట్టడంతో ఇప్పుడు ఎట్లా రంగుమార్చి మాట్లాడాలా అని వెనకాలే ఎల్లయ్య, సత్తయ్య వాళ్ళని అనుసరించారు.చంద్రయ్య రంగయ్యలు పోయి పెనుగులాడుతున్న ఇద్దర్ని విడదీసి బురదలో నుంచి రాజుని లేపి ”ఎవడివిరా నువ్వంటు” ఇద్దరు కల్సి నాలుగు తన్నేసరికిముఖం మీదున్న బురదను తుడ్చుకుంటూ ”కాకా.. నన్ను కొట్టకుండ్రి నన్ను కొట్టకుండ్రి” అంటూ కాళ్ళు పట్టుకున్నాడు రాజునీలమ్మను పట్టుకుని పెనుగులాడింది రాజు అని తెల్సెసరికి నోరు తెరిచారందరు.రంగయ్య రాజు చెంపమీద మళ్ళీ రెండు తగిలించి ”ఏందిరా లంగకొడుకా ఏందిరా గీలెక్కలు తల్లి లెక్క ఒదిన గాపిల్ల మీద సెయేస్తివా” అంటూ నిలదీసేసరికి”లే కాక ఆమెనే నన్ను రమ్మని పిల్సిందే” అని అనగానే నీలమ్మ రాజు దిక్కు తీక్షణంగా చూసి ”లే మామా నేనెంద్కు పిలుస్తా మదమెక్కి ఈడే నా మీద పడ్డడూ” అంటుండగానే అక్కడికి చేరుకున్న ఎల్లయ్య.

”ఆ బాగానే సెప్తున్నవు పిల్లా నా కొడుకుకు మదమెక్కి నీ మీద పడనీకి ఆనికి పెండ్లాము లేదన్కువా ఏంది. అన్ని పొలం కాడ కావలుండమని జెప్పి రాతిరేల బువ్వతీస్కొచ్చి ఆడ్ని సెరిపినవు గీసుద్ది మాకు తెల్వదా” అంటూ చంద్రయ్య దిక్కు తిరిగి.”ఇగో చంద్రన్నా గందుకు సాచ్చం సత్తెన్ననే నేను సత్తెన్న ఐదారుసార్ల ఈ యిద్దరిని సేండ్ల, యింట్ల గూడా పట్టినంగాని అటు కోడలని ఇటు కొడుకని ఇద్దరం మా కడ్పుల దాసుకున్నం గిప్పుడు రంకు బయటపడంగనే తప్పంతా ఒక్కనిదే అంటుంది” అంటునే.”సూస్తివా సత్తెన్న మీ కోడలు చాలుబాజు లెక్కలు, గిప్పుడు ఎట్ల రంగు మార్చి మాట్లాడుతుందో ఇది పిల్వంది ఆడెట్ల వస్తడు జెప్పే” అని నిలదీసేసరికి నీలమ్మ నిలువునా కంపించిపోతూ ”లే మామా నేను గట్లెంద్కుజేస్త పొలం కాడ కావలున్నడని బువ్వ దీస్కొచ్చి పెట్టినగాని నా మీద ఈనీ నజరువడ్తదని నాకెర్కలే ఆడే నన్ను సెరుపొచ్చిండు అని పొలాల్లో పడుతూ లేస్తూ ఏడుస్తూ వస్తున్న కొడుకును తీసుకువచ్చి తలమీద చెయ్యి పెడ్తు ”నా కొడుకు మీద ఒట్టు నేనట్లాంటి దాన్ని కాదు” అంటూ ఓరం గట్టుమీద కూలబడి తల కొట్టుకొని ఏడ్చింది.

అప్పటికే పొలంలో గొడవ జరుగుతుందని తెల్సి ఒకరెనక ఒకరు వచ్చి చేరి జరిగిన సంగతి తెల్సుకుని నోరు ఎల్లబెడ్తుంటే”సాయం జేసినోల్ల నోట్లనే మన్ను బోస్తావే నీ సుద్దేందో మాకెర్కలేకనా, అన్న కొడుకునే గాక నన్ను గూడ రమ్మంటు అప్పుడు గిన్ని, ఇప్పుడు గిన్ని రూపాలిచ్చిందన్నా ఎప్పుడెప్పుడు ఎన్ని రూపాలిస్తుందో గదంతా నా పెండ్లాముకు సెప్తనే ఉన్నా రేపటి కల్లా మాట రావచ్చని నాకు ముందు ఎర్క అందుకే దాని జోలికి పోలే” అంటూ భార్య దిక్కు చూసేసరికి.”అవును బావా గీ పిల్ల అర్కతులు ఎర్కయి గూడా పోనిలే సిన్నపిల్ల తెల్వి దెచ్చుకుంట దన్కున్న గాని గిది, సంసారాలే కూల్చవట్టె పచ్చని సంసారాలల్ల సిచ్చువెట్టి సాని ముండొచ్చి మాకు తిన్న కూడు పెయికి పట్టకుండజేస్తోంది” అని కనకమ్మ వ్యంగ్యంగా అనగానే.”ఆ సాలు తియ్యమ్మ సాలు మంచి పన్జెసినవని సెప్తున్నవా? అయినా అది రూపాలిస్తే ఈడు ఆడివట్లొని లెక్క దెచ్చి నీకిస్తుంటే మంచిగ కర్సు చేసుకుని లెక్క లేసిన ఆని జెప్తున్నవు గీ సుద్ది నాకు ముందే ఎర్క నీ మొగుడు పచ్చి లంగ ఆడు దెచ్చి నీకిచ్చిన అన్నడుగా సిగ్గు శరం ఉన్నోళ్లయితే ఆ రూపాలు తిరిగి ఇయ్యిండ్రి’ అంటూ చంద్రయ్య అరిచాడు.ఆ మాటిని పెండ్లాం మొగుడు బిక్కసచ్చి పోయారు.

డబ్బుల విషయం తెలిసేసరికి అందరు వాళ్ళ దిక్కు కొరకొరా చూస్తుంటే ”సత్తెన్న మల్లా నువ్వేం అంటవే” అని అడిగాడు రంగయ్య.”ఏమనేదేముందిరా నా కొడుకు కోడలు అని కడ్పుల పెట్టుకునే సూసినా నా కండ్ల ముందు నా కాండ్లెనుక గిన్ని అర్కతులు జరుగుతుంటెఎన్నిదినాల కన్నా మంచి దినాలోస్తయి యన్కున్న గాని మాకు సెడేకాలమే వచ్చింది ఇంగ నేనేం జెయ్యలనో మీరే సెప్పండ్రిరా”అనికుమిలిపోతున్నట్లు నటించాడు.”గీ సీకట్ల ఏం మాట్లాడినా మంచిగుండదు గానీ రేపు అందరం కూకుని అసలు సుద్దులు అడ్గుదాం ఇంగ ఇండ్లకు పొండ్రి” అంటూ చంద్రయ్య ముందు కదిలేసరికి అందరు ఇంటి ముఖం పట్టారు.ఎల్లయ్య రాజుని తీసుకుని ముందుకు కదిలి సగం దూరం పోగానే ”దాన్ని సూడంగనే పానం ఆగలేదా? గిట్ల పట్టుకుని గట్లిడిసి ఉర్కమంటే దాన్ని పట్టుకొని పట్టుకొని పాకులాడ్తివి దానితోటి తన్నులు తిని అంత సెడగొడ్తివి గిప్పుడు సత్తెన్నకు ఏం జెప్పాలే” అంటూ చేతులు నలుపుకుంటూ తిట్టడం సురువు చేసేసరికి.

”గిట్లయితదని నేనన్కొలేదే నిన్నటిది జెరంతా సార తాగిన నిషలో ఏమి తెల్వలే గిప్పడేం జెయ్యలినే అందరు నన్ను గలీజుగా సూస్తుండ్రు” అన్నడుతలదించుకుని. ”నువ్వు జేసిన బడివే పనికి గలీజుగా జూడకుంటే నెత్తిమీద ఎక్కించుకుంట రన్కున్నవా జరిగింది జర్గిపాయె నువ్వుగమ్మునూర్కో కతెట్ల నడ్పలనో నాకెర్క” అంటూ ఇంటి దిక్కు నడిచాడు.అందరు వెళ్ళిపోయినంక చీకట్లో ఓరం గట్టున నిశ్చేష్టురాలై కూర్చుండి పోయింది నీలమ్మ.సేదతీర్చి ఆమెను ఓదార్చేవారు కరువయ్యారు.సుభాసు తల్లి పక్కన నిల్చొని అయోమయంగా అటుఇటూ చూస్తూ ”అమ్మ సీకటైందే, పోదం పాయే” అని చెపుతుంటే కొడుకు దిక్కు బేలగా చూసింది. ఏడుద్దామన్నా కండ్లలోంచి ఒక్కచుక్క కన్నీరు రాక గుండెరాయిలా మారింది. కొడుకు చేతులను పట్టుకుని అట్లాగే కూర్చుంది పోయిన చాలా సేపటికి భుజం మీద చెయ్యి పడేసరికి ఉలిక్కిపడింది.ఎదురుగా నాగమణి.

”అక్కా పా అక్కా యింక ఎంతసేపు గిట్లుంటవు పురుగుపుట్ర ఉంటది పా” అంటుంటే.ఆ ఇషం పురుగుల కంటే ఇవేక్వనా సెల్లి” అంటూ చేతులల్లో ముఖం దాచుకుంది.
”ఇంగోక్కా ఎట్ల జరిగేదుంటే గట్ల జరుగుతది ముందీడికెని లెవ్వు, ఇంటికి పోదం నడ్వు అంటూ నీలమ్మను తీసుకుపోయి పంపు దగ్గరున్న నీళ్ళతో బురదంతా కడిగి సగం దూరంవచ్చాక భద్రంగా యింటికి పో అక్కా” అంటూ తోవలోంచే వాళ్ళింటికి మర్లింది.నీలమ్మ కొడుకుతో యింటికి రావడం చూసి పోచమ్మ, సత్తయ్య తిట్లపురాణం మొదలు పెట్టారు.
నీలమ్మ ఒక్కమాట మాట్లాడక చలనం లేని శిలలా నేల చూపులు చూస్తుండి పోయింది.ఆ రాత్రి నీలమ్మకు కాళరాత్రి అయింది.మనస్సులో ఆలోచన వెల్లువ ఉప్పెనలా ఎగిసిపడ్తుంటే ”దేవుడా యింత అన్నాయం నాకే ఎందుకు జర్గుతుంది” అనుకుంటూ ఆలోచనల్లో పడి చివరికి రాజు తన వెంట పడివేధించిన విషయాలను బయటపెట్టి ఈఉపద్రవాన్ని ఎదుర్కోవాలనుకుంది, చేయని నేరానికి నేనెందుకు బలికావాలనుకుంది.మర్నాడు కోడికోసే జాముకు దుర్గమ్మ యింటికి పోయి తలుపు తట్టింది.
తలుపు టకటకా అంటూ చప్పుడయ్యే సరికి. ”గింతజెల్ది ఎవలొచ్చింటరు” అనుకుంటూ తలుపు తీసి ఎదురుగా నీలమ్మను చూసి కంగారు పడ్తూ ”ఓ పిల్లా గింత మబ్బులవచ్చినవేంది ఎవలన్నా జూస్తే మా ప్రాణాలు దీస్తరు ఎందుకొచ్చినవు” అంటూ ఆత్రంగా అటు ఇటు చూస్తుంటె, ”సిన్నమ్మ జెర రాజేశన్ననూ మాఅమ్మొళ్ళ కాడికి పంపించి మీ బిడ్డకు గిట్లయిందని జెప్పి బిరాన రమ్మని సెప్పమను” అన్నది కన్నీళ్ళ మధ్య.నీలమ్మ చెప్పింది విని దుర్గమ్మ కొంచెంసేపు ఏం మాట్లాడలె. ఆమె మౌనం చూసి ఆమె తనకు సాయపడటానికి వెనుకాడుతుందేమోనని ”సిన్నమ్మ నీకాల్మొక్త జెరసెప్పి పంపియ్యి లేకుంటే ఈళ్ళు నా పానం దినేటట్లుండ్రు” అంటూ కాళ్ళ మీద పడబోయేసరికి. ”అయ్యొ వద్దు బిడ్డా గట్లనకు ఒక్కదానివే ఎక్కడని తన్కులాడ్తవు పంపిస్తగాని ఎవల కంట్ల పడకుండా బిరాన పో” అన్నది.భయం భయంగా అటు ఇటూ చూస్తూ పది అంగల్లో ఇల్లు చేరిన నీలమ్మ చుట్టూ ఆలోచనలు మళ్ళీ జోరిగల్లా చుట్టుముట్టాయి.ఉదయం పదకొండు గంటలకల్లా వేపచెట్టు కింద అందరూ సమావేశం అయ్యారు.

మొగొళ్ళ దిక్కు రాజు ఆడోళ్ళ దిక్కు నీలమ్మ నిల్చుంటే చెట్టును ఆనుకొని సత్తయ్య చంద్రయ్య రంగయ్యలు కూర్చొన్నారు.అందరి ముఖాలు కళతప్పి ఉన్నాయి.
అందరి దిక్కు ఒకసారి చూసి ”మన బాయి గడ్డమీద ఎనిమిది యిండ్లుంటే ఆ ఎనిమిది యిండ్లల్ల గింతవరకు గిట్లాంటి అర్కతులు మన యిండ్లల్ల యిప్పటిదాకా జర్గలే కానీ మన యిండ్లల్లో గిట్లాటి అర్కతులు జేస్తున్నరని తెల్సి గియ్యల అందరి తల్కాయలు కిందపడినయి అసలు గిండ్ల నిజమేదో అబద్ధమేదో తేలాలే” అంటూ చంద్రయ్య ఆవేశపడ్తుంటే వెంటనే ఎల్లయ్య అందుకుని ”అన్నా నువ్వు గట్లనుడు తప్పు రెండు సేతులు గలిస్తేనే చప్పట్లు యిండ్ల యిద్దరిది తప్పుంది. నువ్వు రాజుగాని మీదనే తప్పు నూకాలే అనుకోకు” అన్నాడు.
”ఓ ఎల్లిగా మనం మనం కొట్లాడుకొనుడు తప్పురా అసలు గాయిద్దరు ఏం జేప్తరో మనం ఇనాలే గప్పుడు ఏది నిజము రుజువు గావాలే” అని రంగయ్య అంటూ పోచమ్మని చూస్తూ ”ఒదినా పెద్దదానివి నువ్వు ఆ పిల్లనడుగు ఏం జెప్తదో ఇందాం” అనేసరికి ”ఏమే మీ మామలు ఏమంటుండ్రో యిన్నావుగా యింగ నీ రంకు కతలని సెప్పు తప్పు ఆనీదా నీదా గలతు ఎవలితొటి జరిగిందో సెప్పు” అంటూ పోచమ్మ నిప్పులు చెరుగుతుంటే, నీలమ్మ తలొంచుకునే వెనకే కొంగుపట్టుకుని నిలబడ్డ కొడుకు మీద చేతులుంచి ”అత్తమ్మ నా కొడుకు మీద ఒట్టేసి చెప్తున్న పోయినసారి కల్లం తీసినప్పుడు కల్లంకాడ రాత్రిపూట కావాలుండనీకి మనిషి గావాలని పెద్దమామకే చెప్తే రాజునుంచిండు, రాజు ఆడ ఉన్నన్ని దినాలు రాత్రిపూట పోయి బువ్విచ్చివొస్తుంటి. రెండుమూడు దినాలు బాగనే ఉండు, కాని ఆడ్కేని గలీజు లెక్కలు జేస్తుంటే నేనూ గది పట్టించుకోలే గాని ఆకిరిదినం నాడు పోద్దంతా ఈడలేడు ఏడికి పోయిండని ఎల్లి మామనడిగితే అత్తగారింటికి పెండ్లాన్ని సూడబోయిండు అన్నడు, ఇంగ ఈ రాత్రికి రాడు అంటే ఓడ్లకాడ కాపలా ఉండదని పోద్దంతా దబ్బదబ్బ వడ్లుమోసినా. ఇంగ రెండు సంచుల వడ్లున్నప్పటికే సీకటి గావచ్చింది. రాత్రి ఏడెనిమిది కల్లా మొత్తం వడ్లను మొయ్యాలని పిల్లలనూ యింటికాడిడిసి రెండుమూడు గంపలు మోసేసరికి రాజువచ్చి వడ్లకుప్పమీద గడ్డికప్పి ఆ గడ్డిమీద పండుకుండు. నేను వడ్లు గంపల ఎత్తనీకి కుప్పమీది కెని లెవన్నా కానీ ఆసంతకు జర్గక బాగా సీకటైంది వడ్లుమోసుడు ఇంగ సాలు అంటే రాజు వచ్చిండుగా అని యింటికి తిరిగిపోతుంటే ఎనక నుంచి పిల్సిబాగా ఆకలైతుంది బువ్వొండ్కురా అంటే యింటికిపోయి దబ్బదబ్బ వండేతాళ్ళకే నా పిల్లలు నిద్రపోయిండ్రు, నేను కూడా బువ్వతినక రాజుకి టిఫిను దీస్కపోయినా.

పాపం ఆకలితో ఉండని గిన్నెకడిగి బువ్వేస్తు మా సెల్లెలెట్లుందని అడిగిన కాని రాజు ఏం సెప్పక నన్నేసూస్తూ గియ్యాల నువ్వెంత ముద్దుగున్నవని నా సెయ్యి పట్టుకుని గుంజిండు, నామీద పడ్తుంటే నేనూ ఉర్కిపోనీకి సూస్తున్నప్పుడే మామోళ్ళు వచ్చిండ్రు ఈళ్ళు రాకుంటే గాయాల్ల నా బతుకేం అయితుండేనో.ఇంగ ఆ యల్ల నుంచి ఏడగింత సందు దొర్కినా నన్ను సతాయించవట్టిండు”, అంటూ అప్పటి వరకూ రాజు తన వెనకపడి వేధించిన విషయాలన్ని పూసగుచ్చినట్లు అందరిముందు బట్టబయలు చేసింది.నీలమ్మ చెప్పింది విని అందరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటుంటే, ”ఏంరా రాజుగా ఆ పిల్ల చెప్పింది సెవులారా ఇన్నావుగా ఇంగనువ్వు చెప్పుకునేది ఏమైనా ఉందా?” అంటూ తీక్షణంగా చూశాడు చంద్రయ్య.రాజు నీలమ్మను తేరిపార చూస్తూ ”గీమెను ముందుగాళ్ళ నా తల్లిలెక్క, నా అక్కలెక్క జూస్తుంటి కల్లాలప్పుడు సత్తినాయిన సెప్తె పాపం అని గీమె కల్లంకాడ కావలున్న ఒక దినం రెండు దినాలు అయ్యేదాకా బాగనే ఉంది గాని మూడో పొద్దునుంచి మంచిమంచిగా వండుకు రావట్టింది. పొద్దుమీకక ముందే నాకు రూపాలిచ్చి రాత్రి తాగి రమ్మంటుండే జెల్దీ జెల్దీ ఇద్దరం గల్సి వడ్లు మోద్దాం ఒదినా అని సెప్తె ఎంత లేటయితే అంత మంచిదని నన్ను ఆపింది. గీమే గిట్లాటిదని తెల్వక పొద్దుమింకి గింత తాగొచ్చి గడ్డిల పండుకుంటుంటే రాత్రికి బువ్వదీస్కొచ్చి నా సెయ్యివట్టి లేపి నాకు బువ్వ కలిపి తినిపించబోతుంటే నేను గట్ల ఒద్దని బువ్వగిన్నె తీసుకుని తిన్నా గప్పుడు నా దగ్గర ఓరిగి ఓరిగి కూకొని నువ్వు మొగోడివి కావా అంటూండే

గిట్లాంటి అర్కతులు జేస్తుంటే ఇంగ నేను ఎన్ని దినాలు పానం బిగవట్టాలే సెప్పండ్రి నేను గూడా మొగోడినే. గదిగాక మల్ల మస్తునిషాలున్న గంద్కనే సెయ్యేసి దగ్గరకు గుంజుకున్న గప్పుడే పెద్ద నాయినోళ్ళు వొచ్చిండ్రు గాళ్ళనూ చూసి ఇంగ ఉల్టా తిరిగి నేనేదో ఆమెను సెరిపినట్లు ఆమెకు అది ఇష్టం లేనట్లు సెయ్యవట్టింది. నేనూ పెద్దనాయినోళ్ళ ముందర ముఖం సెల్లక ఉర్కిపోయినా, మల్లా రెండు మూడు దినాలైనంక నాకాళ్ళమీద పడి పైసా, ఫలం అన్ని ఇస్తా నన్ను ఏలుకో అని నా ఎన్కపడితే గది తప్పని బుద్దిసెప్పినా ఇంగ ఆడికెని నేను ఆమె జోలికి పోలే శివరాత్రప్పుడు నేనూ మా అత్తగారింటికి పోయినా నేనూ ఉర్లనే లేను యింగ నిన్న గూడా సేండ్లో ఎద్దుపడిందని కొట్టొస్తే నన్ను పట్టుకుని ఉట్టిగనే కొట్టింది నా తప్పెంతుందో తెల్సుకోక మీరు గూడా నన్ను కొట్టిండ్రు” అంటూ మొసలి కన్నీరు కార్చాడు.

రాజు చెప్పింది విని నీలమ్మ నిలువునా కంపించిపోతూ ”ఓరేయ్‌ రాజుగా సిగ్గుదప్పినోడా బువ్వపెట్టిన సెయ్యినే బుగ్గిపాలుజేయ్య సూస్తవురా సేసేదంతా సేస్కుంట ఆడిదాని లెక్క మాట్లాడ్తవేందిరా నీ నోట్ల మన్నువడ నీ నోట్ల దుమ్మువడ నన్ను ఏడిపిస్తే నీకేం మంచిగైతదిరా” అని తిడ్తుంటే, రాజు తల్లి గుంపులోంచి లేచి ”దొంగముండా నా కొడుకును సెర్పాలని చూసింది నువ్వే ఎందుల్ల ఏ మెర్గని నా కొడుకుని నీ సేండ్ల కావలి కుక్కలెక్క జేసి ఆనితోటి పొద్దుమాపు కష్టంజేయించి ఆనికి కమ్మగా తియ్యగా వండి పెట్టుకుంట నా కొడుకుకూ ఏం మందు పెట్టినవో లేకుంటే ఆడు నీ ఎన్క ఎందుకు పడ్తడే” అంటూంటే, ”ఇంగో అత్తమ్మ పొలం కాడ కావలుండని మంచిగా సూసినా ప్రతిదానికి గిట్ల మాటలొస్తయని నాకెర్కలేకపాయే” అన్నది.”అన్నింటికి ఏడి కాడికి తెంచుతున్నవుగాని మల్ల ఎల్లయ్యకు రూపాలెందుకు కిస్తున్నవో గది గూడా సెప్పు ఏడన్నా మామకు కోడలు రూపాలిస్తదామ్మా” అంటూ కనకమ్మ దిక్కుతిరిగి ఏమే సెప్పవేమే అది మన యిజ్జత్తు తీస్తుందే”అంటూ ఎగేసేసరికి, ”మాకు పిల్లలా జెల్లలా ఆలుమగల ఒకరికొకరం లెక్క ఉంటం ఉన్న మాట జెప్తే మా మీద ఉల్టా మాట్లాడుతుండ్రు” అంటూ చంద్రయ్య దిక్కు గుర్రుగా చూసేసరికి పెండ్లము మాటలిని ఎల్లయ్య వంకర నవ్వు నవ్వాడు.

”ఇంగో అత్తమ్మ గిట్ల నా మీద నిందలేస్తే ఏట్ల శివరాత్రి పండ్గ నాటినుంచి ఏదో ఒక వంక జెప్పి పైసలడుక పోతుండు సుక్కత్తమోళ్ళకాడ పైసలుంచినవని నువ్వే ఎల్లి మామకు సెప్పినవంటగా గాయాల్ల నుంచి రాజు సుద్ది నా ముందలతీసి బెదిరించుకుంట రూపాలు తీస్కపోతుండు” అనేసరికి ఆలుమొగల తలలు నేలకు వాలాయి.అందరు వాళ్ళదిక్కు కొరకొర చూస్తుంటే, ”మల్ల గిన్నిదినాల నుంచి గిట్లాంటి అర్కతులు జర్గుతుంటే మాకెందుకు సెప్పలేదే ముండదానా ఆనికి సెయ్యియిచ్చుకుంట ఈనికి రూపాలిచ్చుకుంట ఇంగ మాకు తెల్వకుండ ఎవరెవరికి ఏమేమిచ్చినవే” అని సత్తయ్య విరుచుకుపడ్తుంటే, ”అన్నా నువ్వు పెద్దోడివి ఆడపిల్లను పట్టుకొని గట్లనకు మల్లా రాజుగాన్ని నీలమ్మను సేండ్ల సూసినప్పుడే మీరిద్దరుగూడి ఎందుకు పట్టుకోలే” అంటూ సత్తయ్యనే నిలదీశాడు చంద్రయ్య.”నువ్వు గిట్లడ్గుతవని ముందే అన్కున్నరా ఈ వంశానికి పెద్దోడిని మీ అందరికి సెప్పాల్సినోడిని కాని గీ బద్మాషీ దిక్కెల్లి ఇప్పుడు మీతోటి అడ్గించుకోవడ్తి ఇది నా ఇంటి కోడలని యింగనన్న సర్దుకుంటదని నా కడ్పుల దాసుకున్న ఆడు రాజుగాడని నాకు నీ లెక్కనే నిన్ననే ఎర్కాయే ఎప్పుడు జూసినా ఎట్లనో ఒకట్ల తప్పించుకోవట్టే ఇప్పుడు ఏమెర్గనట్ల మాట్లాడవట్టే అప్పుడే వచ్చి రాజుగాడు గిట్ల జేస్తుండని నాకు జెప్పిందా అడ్గుండ్రి గాసుద్ది. రాజుగాని సుద్ది అడ్డమేసి ఎల్లిగాడు రూపాలు గుంజుతుండని నాకు సెప్పిందా సెప్పమనుండ్రి యింగ నా యింట్లదే గిట్లజేస్తే పాలోడు పగోడైనట్లు ఎల్లిగాడు నాయెన్క తిర్గుకుంటనే నాకంట్ల పొడుస్తడనుకోలే” అన్నడు బాధనటిస్తూ, ఎల్లయ్య రాజులు అతని దిక్కు గుర్రుగా చూశారే కాని నోరు తెరచి ఒక్క మాట మాట్లాడలే.

ఒకవేళ తామిద్దరు నోరుతెరిస్తే సత్తయ్య దాన్ని తిమ్మిని బమ్మి చేసైనా పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకుని తమను నామరూపాల్లేకుండా చేస్తాడని వెనక్కుతగ్గారు. అదిగాక సత్తయ్య చూపిన రూపాయల ఆశ వారిలో సజీవంగా ఉండి ఎన్ని అవమానాలైనా భరించి ఎలాంటి పన్లయినా చెయ్యాలనుకున్నారు.”గది తార్వత అడ్గుదంగాని ఓరి ఎల్లిగా ఆడ పోరికాడ రూపాలు దీస్కుంట బత్కనీకి నీకు సిగ్గులేదురా మల్ల ఉల్టా అదే రూపాలిస్తుందని లంగమాటలు సెప్తున్నవు గిట్లాటి అర్కతులు జేస్తే నీకేం మంచిగైతదిరా కొజ్జోని లెక్క ఆడపోరి దగ్గర పైసలు గుంజనీకి సిగ్గుశరం లేదురా” అంటూ రంగయ్య తుపుక్కున ఉంచేసరికి, ”ఓయ్‌ ఏందిరా మాటలు జెర సక్కంగా రానీ నీకు గూడా ఏమన్నా ఇస్తనన్నదా ఏంది దాని దిక్కు మాట్లాడుతున్నవు” అంటూ అన్న దిక్కు కొరకొరా చూశాడు.”ఓరే ఎల్లిగా ఇంక మొగోని లెక్క మాట్లాడుతున్నవేందిరా దాని దగ్గర పైసలు గుంజి పెండ్లాముతోటి లెక్కవెట్టించినవుగా తియ్యి ఆ రూపాలు ఇప్పుడు బయటకు తియ్యి” అంటుంటే, ”ఇంకేడున్నయి ఎప్పుడో ఖతం అయినయి” అన్నది కనకమ్మ.ఆ మాటిని రంగయ్యకు చిర్రెత్తుకొచ్చి ”ఇంగో మొగడు రూపాలు దెచ్చిస్తుండంటే అవి ఆ పోరియని తెల్సిగూడా నువ్వు ఇంట్లకు ఖర్చుజేసుకోనికి గింతనన్నా సిగ్గుశరం ఉండాలే నీ మొగడన్నట్ల దానికి ఇయ్యనీకి సిగ్గులేకపోతే తీసుకోనికి నీ మొగనికి ఖర్చు జెయ్యనీకి నీకు ఇజ్జతెందుకు లేకపాయె” అనేసరికి ఒక్కరు కిక్కురుమనలే.

”సరే ఇంగ అయింది అయిపోయింది గిప్పుడు ఎవలి తప్పు ఏందో ఎవల నాయమేందో అందరికి సమజైంది అసలు ఆఖరి ఫైసలా ఏంది” అంటూ అందరి దిక్కుచూశాడు సత్తయ్య.
”ఇంగోన్నా ఇడ అందరికందరు పెద్దోళ్ళే, పెద్దోళ్లు, సిన్నోళ్ళు అందరు గూడి తప్పులు జేసిండ్రు గట్లాని ఎవలనన్నా గట్టిగా పట్టి అడిగితే ఎవళ కతలు ఆళ్ళుసెప్తుండ్రు”.”ఆ పోరికా ఎనకా ముందు మాట్లాడేటోళ్ళు ఎవలు లేరు. మనమందరం మందకు మందున్నం మనం గిప్పుడు ఎట్లాంటి ఫైసలా జేసినా యింకోకలకీ అన్నాళం చేసినట్లయితది. ఇందువల్ల తప్పులు జేసినోళ్ళు ముగ్గురు అని మనకు సమజైతున్నా అసలు తప్పు జేసినోళ్ళు ఒక్కలే, ఆ పోరి చెప్పేది ఒకటైతే ఈళ్ళు సెప్పేది యింకొకటి గందుకని, ముగ్గుర్ని బాయిల మునిగి పచ్చిబట్టల తోటి ఎల్లమ్మ గుడిలకు జోర్రమను అప్పుడు తప్పులు ఎవలదైతే ఆ అమ్మ ఆళ్ళకు శిచ్చ ఏస్తది నాయమేదో అన్నాళమేదో కాలమే మన కండ్లముందుంటది” అంటూ తన నిర్ణయాన్ని అందరి ముందుంచాడు.చంద్రయ్య నిర్ణయాన్ని మిగతావారు సమర్థిస్తుంటే సత్తయ్య, ఎల్లయ్య, రాజు ముఖాల్లో నెత్తురు చుక్క లేదు.నీలమ్మ ఏ పరీక్షకైనా తాను సిద్ధమే అన్నట్లు మౌనంగా తలొంచుకుంది. సత్తయ్య ఈ నిర్ణయాన్ని విని ఈ నిర్ణయం తప్పంటూ ఆపే ప్రయత్నం చేస్తాడని ఎల్లయ్య అతని దిక్కుచూస్తుంటే ఏమీ పట్టనట్టు సత్తయ్య తలనేలకేశాడు.

”ఏమన్నా, ఈ ఫైసలా ఇని నువ్వు సప్పుడు సెయ్యలేదంటే గిట్ల సెయ్యమనేగా” అంటుంటే సత్తయ్య గుండెల్లో రైళ్లు పరుగెత్తాయి.”ఏమే పిల్లా నీవొద్దన తప్పుంటే నీవల్లో మన్ను వడ్తది ఆళ్ళవద్దన తప్పుంటే ఆళ్ళవల్లో పడ్తది. నిజమేందో ఆ దేవతకు మాలింగావాలె” అని సుక్కమ్మ అంటుంటేరాజు, ఎల్లయ్య, కనకమ్మ, సత్తయ్యల దిక్కు తీక్షణంగా చూసి కొడుకు చేతిల ఉన్న కొంగును విడిపించుకొని నీలమ్మ బావి దిక్కు పరుగెత్తుతుంటే అప్పుడే అట్లా చేస్తుందని ఊహించని జనాలు ఆమె వెనుక పరుగెత్తారు.నీలమ్మ బావిలోకి గబగబా దిగి నీళ్ళలో ఐదుసార్లు మునకలేసి బావి గడ్డ మీదికి వచ్చి గుడి దగ్గరకుపోయి గుడిచుట్టూ ఐదు ప్రదక్షిణలు చేసి గుడిలోకి దూరింది.గుడి బయట అందరూ గుంపుగా చేరి నీలమ్మ ఏం చేస్తుందోనని ఆత్రంగా చూస్తుంటే..నీలమ్మ ఎల్లమ్మ దేవత పసుపు కుంకుమలు చేత్తో పట్టుకుని ”అమ్మా నా వొద్దన తప్పుంటే నా వల్లె ఎయ్యి, లేదా నన్ను నాశనం జేసినోళ్ళనూ నువ్వు నాశనం చెయ్యి” అంటూ కొంగునూ చాపి శపథం చేసిన తర్వాత పక్కన ఉన్న కర్పూరం తీసుకొని అరచేతిలో వెలిగించుకొని హారతిస్తుంటే ఆమె కళ్ళు నిప్పులు చెరిగాయి.కర్పూరం అయిపోయాక గుడి బయటకు వచ్చి అందర్ని కలియజూస్తూ ”నన్ను నాశనం జేసినోళ్ళు సత్యనాశనంగాని నాశనంగాని” అని రెండు చేతులను భూమికి చరుస్తుంటే” సుభాషు వచ్చి తల్లిని చుట్టేసుకుని ఏడుపు లంకించుకున్నాడు.

రాజేశం ద్వారా విషయం తెలుసుకుని కూతురి దగ్గరకు ఆత్రంగా వస్తున్న ఎల్లమ్మ, సాలయ్యల కండ్లల్లో ఈ దృశ్యం కన్పించేసరికి వాళ్ళిద్దరు పరుగెత్తు కొచ్చారు.
ఎల్లమ్మ కూతుర్ని ఆ పరిస్థితుల్లో చూసేసరికి తట్టుకోలేక నీలమ్మను గుండెలకు అదముకొని ”ఓ బిడ్డా నీ బతుకునుగిట్ల నాశనం చేస్తుండ్రేందిరా ఈళ్ళ నోట్ల మన్నువడ ఈళ్ళ యిండ్లల్లకు నా బంగారాన్ని ఇచ్చి నాశనం జేస్కుంటి గదనే” అంటూ ఏడుస్తుంటే, సాలయ్య కోపం పట్టలేక ఎల్లయ్య, రాజు, సత్తయ్య, చంద్రయ్య, రంగయ్యలతో వాదులాటకు దిగేసరికి తప్పించుకోవటానికి ఇదే మంచి అదను అని ”ఇంగో సాలయ్య నీ బిడ్డజేసిన గలతు అర్కతులకి మేమంతా శిచ్చలు పడ్తున్నం మావోళ్ళతోటే గాక మీతోటి మేమెందుకు మాటలు పడాలే సెప్పు ఇంగ గీ బలిసిన లెక్కల దిక్కెల్లి గుడిల జొర్రి ఓట్లు తినాలంట మేము గంట్ల జెయ్యం అరే రాజుగా ఏవడేం జేస్తడో సూస్తా’ అంటూ తొడ చరిచాడు.
”ఇంగోరా నువ్వు గుంటనక్క లెక్కలు జేసి గిట్ల ఎదురు తిర్గుతవని మాకెర్క. మీరిద్దరు తప్పులు జేసిండ్రురా అంద్కనే గుడిలకు జొరవడ్తలేరు. ఆడదాన్ని సతాయించి మీరేం బాగుపడ్తరురా ఛీ, నా ముందలకెలి జర్గుండ్రి” అని చంద్రయ్య చీదరించు కుంటుంటే, ”తప్పు మేమొక్కలమే గాదు శానాపెద్దోళ్ళు గూడా సేస్తరు” అంటూ సత్తెన్న దిక్కుచూస్తూ ”ముందు ముసుగులు తీసి జూడండ్రి ఎవళు ఎట్లాంటోళ్ళో దెలుస్తది ఒకేళ నాకే తిక్క రేగిందో అందరి బండారం బయటపెడ్తా” అంటూ ఎల్లయ్య అనగానే ”మేమేం తప్పులు జేస్తిమిరా నీ లెక్క జిందగీల తోటి ఆటలాడుకున్నమారా” అంటూ చంద్రయ్య, రంగయ్యలు అతని మీదికి కలబడిపోయిండ్రు అప్పుడే.”అరే పోనియండ్రిరా గిప్పుడు మనకెందుకు కోట్లాట” అంటూ సత్తయ్య అడ్డుపడి ఎల్లయ్య దిక్కు చూస్తూ ”అరే మీరిద్దరు ఇడికెని నడ్వుండ్రి పెద్దోనిగా నేను సెప్తున్న నడ్వుండ్రి” అని బెదిరించేసరికి ఇదే అదను అని వాళ్ళు తప్పుకున్నారు.

వాళ్ళిద్దరిని అక్కడ్నించి దాటించేసరికి అందరు నోళ్ళు తెరిచారు. జరిగిన నిర్ణయం ఏమిటి ఇప్పుడు కళ్ళముందు జర్గుతున్నదేమిటి అని ఆలోచనలో పడగానే, ”ఓ సత్తెన్న గాళ్ళిద్దరిని గట్ల ఇడిస్తివేందే పోరి మీద నిందల మోపుమోపి ఆఖరికి ఋజువు సేసుకోమనిరి. ఆడపోరి గట్లజేసేగాని ఆళ్ళెందుకు సెయ్యకపాయే గిది లెక్కనేనా” అన్నది దుర్గమ్మ.
”పోనిరా దొంగకొడుకులు గీసుద్ది జరిగినప్పుడే ఈ పోరి నాకు ఉన్నదున్నట్లు సప్తె అప్పుడే సట్‌న ఫైసలా సేస్తుంటి. గీ పోరి ఎందుకు సెప్పలేదో మనకు తెల్వకపాయె లోపల జరిగిన మతలబులేంటియో అయినా నన్నడ్గితే యింగలం లేందే పొగవస్తదారా సెప్పు, ఆ భగవంతుడి దయతోటి గిప్పటికన్నా సెప్పింది, నాయింటి కోడలికే గిట్ల జర్గింది గీపోరిని సతాయించి ఆళ్ళేం బాగుపడ్తరు తియ్యి. గింత జరిగినంక యిన్ని ఓట్లు తిన్నంక ఎట్ల అనుమానింతును? నేనైతే నా కోడలిని నా యింట్లకెని ఎల్లగొడ్తలేను తియిండ్రి” అన్నడు తీరికగా.

– జాజులగౌరి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~!~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`

99

ధారావాహికలు, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో