చరితవిరాట్ పర్వం

Vijaya-bhanu“విశృంఖలత్వం, కుత్సితాభిలాష నా ప్రవర్తనలోనే కాదు, నా నరనరానా జీర్ణించుకుపోయింది. నాకేం కావాలో నాకు తెలియదు. ఏదో కావాలనుకోవడం, దాని వెనుక పరుగులు పెట్టి సాధించుకోవడం….తీరా అది దొరికాక, నాకు కావల్సింది అది కాదని అర్థం కావడం! ఇదే జరుగుతూ వచ్చింది ఇప్పటి వరకూ….
అనుకున్నవన్నీ దొరికాయి. దొరికాక తెలియని అసంతృప్తి. వెర్రి వేయి విధాలన్నట్లుగా నా వెర్రి పరిపరి విధాలుగా పోయేది.”
నేను చెప్తున్నది ఆమెకు అర్థం అవుతుందో, లేదో నాకు తెలియలేదు. ఆమె ముఖంలోకి తేరిపార చూసాను. ఆ చిన్ని కళ్ళల్లో ఒకలాంటి ఉత్సుకత. గెడ్డంపై చేయి ఆన్చి, టేబుల్ పైకి కాస్త ఒరిగి కూర్చుని శ్రద్ధగానే వింటోంది.
“అందమంటే పిచ్చేమో అనిపించేది కొన్నాళ్ళు. చాలా మందిని అనుభవించాను. ప్రతి అనుభవం చివరా చప్పదనమే!”
“చలాకీతనమంటే ఆకర్షణేమో అనిపించేది కొన్నాళ్ళు. చలాకీగా ఉండే అమ్మాయినల్లా నా దారిలోకి తెచ్చుకునే ప్రయత్నాలు చేసేవాడిని. అప్పుడు కూడా ప్రతి అనుభవం చివరా చప్పదనమే!”
“ఏదో ఎండమావి నన్ను పరిగెత్తిస్తూనే ఉండేది. ఏ వయసుకు అయస్కాంతంలా ఆకర్షించబడ్తున్నానో తెలిసేది కాదు. అన్ని వయసుల వారి పొందునూ చవి చూసాను. చివరికి అన్ని రకాల పొజీషన్లూ చేసి చూసాను. ఒక్కోసారి గే కల్చర్ వైపు వెళ్దామా అనే ఆలోచన కూడా కలిగేది….”
ఆమె కళ్ళల్లో కలవరపాటు!
“నిజమే చరితా! నేను అబద్ధాలు చెప్పదల్చుకోలేదు. ఎక్కడో ఏదో వెలితి. నాతో ఉండడానికి ప్రతి ఒక్కరికీ ఏదోక కారణం ఉంది. స్వార్థం ఉంది.”
“నిస్వార్థంగా నీతో పడుకోవడానికి నువ్వేమైనా ప్రేమించిన మనిషివా?” అని నా అంతరాత్మ గద్దించేది. అయినా నాకు కావాల్సింది ప్రేమా? అదే అయితే నేను స్త్రీల శరీరాల పట్ల ఎందుకు ఆకర్షించబడ్తున్నాను? అనుకునే వాడ్ని. హై పొజీషన్లో ఉన్న ఉద్యోగం కావడం వల్ల నా పనులు తేలికగా అయిపోయేవి. అంతర్యుద్ధాలతో అలసిపోయి, ఉన్న ఆస్తులన్నీ కోల్పోయి చివరికి పెనుభారమైన వెలితితో మిగిలిపోయాను.”

***                                              ***                                     ***                                               ***

“బయట చలి ఎక్కువగా ఉంది. కిటికీలు మూసెయ్యనా?” చరిత అడిగింది.
“ఊ” అని మాత్రం అనగలిగాను తలాడిస్తూ…
ఆమె కిటికీ దగ్గర నిలబడింది. ఒకసారి దీర్ఘంగా శ్వాస తీసుకుని, కిటికీని మూసి, కర్టెన్లు దగ్గరకు లాగించి. నన్నే చూస్తూ నడిచి వచ్చి, మంచానికి అటువైపు కూర్చుంది.

“బీపీఓ ఉద్యోగంలో ఎన్నో పరిచయాలు, మరెన్నో ఆఫర్లు. నన్ను చూడకుండానే నా స్వరానికి ముగ్ధులైపోయి, నన్ను ప్రేమిస్తున్నామనే వాళ్ళే ఎక్కువ. నన్ను చూసాక నిగ్రహించుకున్న మగాళ్ళ సంఖ్య చాలా తక్కువ. నాలో ఏదో ఆరాటం. ఏమిటో తెలియదు. మొదట్లో తప్పు, ఒప్పు అనే మీమాంస ఉండేది. ఒక పరిచయం ప్రణయంగా మారాక, బెరుకు పోయింది. నచ్చిన ఆహారపదార్థాన్ని నచ్చినపుడు కొనుక్కుని తింటాం. సెక్స్ కూడా అంతే! అన్నాడొక ప్రేమికుడు. ఈ సంబంధాలకు కమిట్మెంట్ అనీ, తప్పు లేదా ఒప్పు అని టాగ్స్ తగిలించకు. కడుపుకు ఆకలేస్తే అన్నం తిను. శరీరానికి ఆకలేస్తే మరో శరీరాన్ని దగ్గరకు తీసుకో! అన్న ఆ మాటలకు మూడేళ్ళ పాటు కట్టుబడిపోయాను. శరీరభాషకూ, మనసు భాషకూ పొంతన కుదరనపుడు ఏం జరుగుతుందో అదే జరిగింది.” వినడానికి కష్టమనిపించినట్లు లేదు విరాట్ కి. నేను విరాట్ కి ఎదురుగా తిరిగాను. ఇద్దరం మంచం మీద ఎదురెదురుగా కూర్చున్నాం.

“ఎవరితోనూ తృప్తి లేదు. నువ్వు చెప్పిన వెలితే నన్నూ వెంటాడేది. ఎవరో నన్ను వాడుకున్నారని నిందలు మోపదల్చుకోలేదు. నా ప్రమేయం లేకుండా నన్నెవరూ లొంగదీసుకోలేరు కదా! రంగుల లోకంలో కొట్టుకుపోయాను. లగ్జరీకి బాగా అలవాటుపడ్డాను. ప్రణయసంబంధాల్లో ఎన్నో రకాలు చూసాను. కొందరు నా మీద అధికారం ప్రదర్శించడానికి ప్రయత్నించేవారు. అలాంటి ఒకడికి నా మీద కోపం వచ్చింది. మా మధ్య వాగ్యుద్ధం పెరిగింది. వాడి ఆవేశానికి ఉపయోగపడ్డ ఫ్లవర్ వేజ్ దెబ్బకి నా కుడి కంటి చూపు పోయింది. జీవితమంటే అసలైన అర్థం ఏదో ఉండే ఉంటుంది కదా! జీవితాన్ని స్థిరమైన కోణంతో చూడకముందే చీకటి కమ్మేసింది.”
“కన్నీరు రాకపోవడానికి కారణాలుండవ్. ఘనీభవించిన భావోద్వేగపు బరువు మాత్రమే ఉంటుంది.”

“నేను అనపర్తిలో కంటి ఆపరేషన్ చేయించుకుని తిరిగొస్తున్నప్పుడే కదా మనిద్దరం రైల్లో కలిసింది. నీలో మొదట కోరికే కనపడింది. నాకు తెలిసిన చూపులే! నాకు తెలిసిన ఆకలే! కానీ మనం మాటల్లో పడ్డాం. రాత్రంతా ప్రయాణం. ఒకటే మాటలు. ఆ ఎదురెదురుగా కూర్చుని తెల్లవార్లూ మాట్లాడుతూనే ఉన్నాం. ఆ సైడ్ బర్త్ ను ఎప్పటికీ మర్చిపోలేను. నువ్వు లోయర్ బర్త్ లోనే నా ఎదురుగా కూర్చుండిపోయావ్. నీ అప్పర్ బెర్త్ రాత్రంతా ఖాళీగానే ఉండిపోయింది కదూ?” అంటూ అతని చేతిని నా చేతిలోకి తీసుకున్నాను.
“మన మధ్య ఒక వేవ్ లెంగ్త్ ఉందని అప్పుడే అర్థమయ్యింది చరితా….అదే మనల్ని ఇంత దూరం తీసుకొచ్చింది. మనిద్దరి సంగమం తర్వాత నాకు జీవితంలో సంపూర్ణత్వం అంటే తెలిసొచ్చింది. వెలితిలేని అనుభవం, మనసు నిండిన భావన!” నా దగ్గరకు వచ్చి నన్ను అల్లుకుపోతూ అన్నాడు విరాట్.

“నాతో ఉండిపోతావా?”
ఇలా అడగొచ్చా? నిజానికి ఇలా ఎవరినీ అడగలేదు. ఇలా అడగాలని అనిపించలేదు కూడా! ఇప్పుడు చరితను అడగాలనిపిస్తోంది. ఇక పాత జీవితానికి మంగళం పాడెయ్యాలి. చరితతోనే జీవితాంతం ఉండిపోవాలి.
ఎందరినో నా మాటలతో బుట్టలో వేసిన నేను నా ఆలోచనను చెప్పడానికి చరిత దగ్గర చాలా ఇబ్బంది పడ్డాను. నా ఆలోచన విన్నాక ఆమె శాంతంగా ఒకటే మాటంది.
“పెళ్ళి చేసుకుందాం.”
లివిన్ అంటే భయపడిపోయింది కదా! నేను కూడా సరేనన్నాను.
పెళ్ళి జరిగిపోయింది.

ఆరు నెలల వైవాహిక జీవితం. జీవితం ఇంత అందంగా ఉంటుందా అని నాకు ఆశ్చర్యం. నా మీద నాకే అసూయ. విరాట్ ఇంత మంచి భర్త కాగలడని నేను ఊహించలేదు.
ఇపుడొక తీయటి కబురు. నేను ప్రెగ్నెంట్!
మాదంటూ ఏర్పరచుకున్న జీవితానికి అసలుసిసలైన నిరూపణ. నా ఉద్యోగాన్ని మార్పు చేసాను. ఇంటీరియర్ డిజైనర్ గా జాయిన్ అయ్యాను. పాత స్నేహాలు లేవు. వైవాహిక జీవితంలోకి వచ్చాక, నా జీవనశైలిలో చాలా మార్పులు చేసుకున్నాను.

విరాట్ నీరసానికి కారణం తెలియడం లేదు. జ్వరం మాటిమాటికీ వస్తోంది. బాత్ రూంలో ఎక్కువసేపు ఉంటున్నాడు. దగ్గుతున్నాడు కూడా! డాక్టరుకు చూపించాం. ఏవో పరీక్షలు చేసారు. కారణం తెలియలేదు. ఇంకా పరీక్షలు చేస్తారట.
“ఏమిటిది? నాకు బెంగగా ఉంది” అంటే, “స్టమక్ అప్సెట్ లే…ఖంగారు పడకు” అంటున్నాడు.

“ఆయ్యో! అయ్యో మీ చేతులిరిగిపోనూ….మీ కడుపులో పురుగులు పడా! ” గట్టిగా అరుపులు విని కర్టెన్ తొలగించి చూసాను.
మా ఇంటి వెనుక అంతా స్లం. అక్కడి వాళ్ళూ ఎప్పుడూ ఏదోక గొడవ పడుతూ ఉంటారు.
“నా కొడుక్కే చెడుపు పెడతారా? మీరు బాగుపడతారా? మీ పిల్లలు పురుగులు పడి సచ్చిపోరా? మీ కాళ్ళూ చేతులూ పడిపోవా? ఆడు తిండి తినక నెలలౌతుంది. మంచాన పడి శవంలాగైపోతుండే! చేయించినోళ్ళు మాకు తెలియరా ఏటి? ఆళ్ళను దేవుడూ సూడకపోతాడా?…..” ముసలామె చేతులు తిప్పుతూ వీధి మధ్యలో కూర్చుని రాగాలు తీస్తోంది. ఎవరూ నోరు విప్పలేదు. ఆమె కోడలనుకుంటా, వాళ్ళ రేకు ఇల్లు బయట మోకాళ్ళలో తల దూర్చి ఏడుస్తుంది.
“ఈ చెడుపులు అవీ ఉంటాయా?” వీళ్ళు ఎప్పటికి మారుతారో! నిట్టూరుస్తూ కర్టెన్లు మూసేసాను.
మరో రెండు రోజులకు వెనుక ఏదో కలకలం విని కిటికీ తీసి చూసాను.
“సచ్చిపోయాడో…నా కొడుకును సంపేసారో….ఆడి మతి తప్పించేసారు. మతి లేని నా కొడుకు రైలు పట్టాల కింద తలేట్టాసాడు తల్లో….ఆడి బిడ్డలేమైపోవాలి దేవుడో….” ముసలావిడ ఏడుస్తోంది.
“ఇవన్నీ నిజంగా ఉంటాయా?”
“హహహ….చదువుకోనిదానిలా అడుగుతావేంటి? అవన్నీ ఏమీ ఉండవు.” కొట్టిపారేసాడు విరాట్.

“నీకు తెలుసా? కమలమ్మ చెప్పింది ఇందాకే! మొన్న స్లంలో రైలు క్రింద తల పెట్టి ఆత్మహత్య చేసుకున్న పరదేశుకి ఎయిడ్స్ అంట. అది తెలిసి ఎవరికీ చెప్పలేక, తిండి మానేసి, చివరికిలా ఆత్మహత్యకు పాల్పడ్డాడంట.” తను ఇంటికి రాగానే చెప్పాను. ఉదయం ఈ విషయం విన్న దగ్గరనుండీ బాధగా ఉంది.
విరాట్ ఏమీ మాట్లాడలేదు. షూ విప్పి, సోఫాలో కూలబడిపోయాడు. తలపోటుగా ఉందేమో! నేను కిచెన్లోకి వెళ్ళి కాఫీ కలిపి పట్టుకొచ్చాను.
అతని నుదుటి మీద చెయ్యి వెయ్యగానే కళ్ళు తెరిచి చూసాడు. కళ్ళు ఎర్రగా ఉన్నాయి.
ఈ మధ్య ఒంట్లో బాగాలేకపోవడం వల్ల బాగా నీరసమైపోయాడు.
కాఫీ తాగి ఏదో పనుందని బయటికి వెళ్ళిపోయాడు. బయటికి వెళ్తూ నా రెండోనెల కడుపును ప్రేమగా తడిమాడు. ఆ కళ్ళల్లో ఏదో భయం. అడుగుదామనుకున్నా, తిరిగొచ్చాక అడగొచ్చులే అనుకున్నా!
రాత్రి బాగా పొద్దుపోయాకే తిరిగొచ్చాడు. కొద్దిగా తూలుతున్నాడు.
అర్థమైంది. తాగాడు.
ఒంట్లో నలత వల్ల భయపడుతున్నాడు కాబోలు. బిడ్డ గురించి బెంగేమో!
నేనేమీ మాట్లాడలేదు.
భోజనం చేసి ముభావంగానే వెళ్ళి పడుకున్నాడు. కడుపు బిగిసినట్లుగా ఉంటే, నేను కాసేపు హాల్లోనే అటూ ఇటూ తిరుగుతూ ఉండిపోయాను.
తను నిద్రపోయినట్లున్నాడు. మంచంపై పడుకుని అతనికి దగ్గరగా జరిగి, హత్తుకుని పడుకున్నాను.
తన ఉచ్చ్వాసనిశ్వాసలు ఎక్కువగా ఉన్నాయి. ఏదో అనుమానం! అటుతిరిగి పడుకున్న అతన్ని నా వైపుకు లాక్కున్నాను.
ఏడుస్తున్నాడు.
నాకు గాభరా పుట్టింది.
“ఏమయింది విరాట్?” అతన్ని ఇంకా దగ్గరికి హత్తుకుని లాలనగా అడిగాను.

***                                              ***                                     ***                                               ***

ఏం చెప్పాలి ఆమెకు? ఆమె ప్రేమలో కరిగిపోతూ జీవితాన్ని సార్థకం చేసుకుందామనుకున్నాను. పుట్టబోయే బిడ్డకు మంచి తండ్రిగా మిగిలిపోదామనుకున్నాను. ఇపుడవన్నీ ఎలా సాధ్యం? చేసిన తప్పులు ఊరికే పోతాయా? పాపాల శరీరం ప్రతీకారం తీర్చుకోబోతోంది.
“ఒక్కసారికి ఒప్పుకో ప్రియా….నీ అక్కరలన్నీ తీరుస్తా….నీ మీద చాలా కోరికగా ఉంది.” ప్రియ నా దారిలోకి వచ్చేవరకూ ఇబ్బంది పెడ్తూనే ఉన్నా.
ఆమె ఒకరి భార్య.
“నీ సాండల్స్ అలా అరిగిపోయి ఉంటే అందరూ ఏమనుకుంటారు? గంధం చెక్కలాంటి నీ అందాన్ని అలంకరించడానికి నీ పేదరికం అడ్డు రాకూడదు. నేనున్నాను కదా!” స్వాతికి ఫ్యాషన్ మీదున్న మోజును నాకనుకూలంగా మార్చుకున్నాను.
ఇప్పుడు ఆ పాపాలన్నీ నన్ను నాశనం చెయ్యబోతున్నాయి.
చరిత గుండెల్లో తల దాచుకుని వెక్కి వెక్కి ఏడ్చాను.
నిజాన్ని చెప్పే ఆ టెస్ట్ రిపోర్టును దిండు క్రింద నుండి తీసి ఆమె చేతిలో పెట్టాను.
ఆమె ముఖంలో ఒక విస్ఫోటనం….
ఏమంటుందిపుడు?
ఆరు నెలలుగా ఇద్దరం కలిసున్నాం.
ఆమెది నాకొచ్చిందా? నాది ఆమెకొచ్చిందా?
ఇపుడు నాకు పాజిటివ్ అని తెలిసింది. ఆమె పరిస్థితి ఏమిటి?
“ఎవరిది ఎవరికి వచ్చిందో తెలీదు. నిందలెందుకు?” చరిత నన్ను సముదాయిస్తోంది.
అవును. నిందలెందుకు?
కానీ కడుపులో ఉన్న బిడ్డ పరిస్థితి?
బిడ్డకు కూడా ఈ భయంకరమైన వ్యాధి వస్తుందా? వెన్నెముకలోంచి వణుకు మొదలైంది.

***                                              ***                                     ***                                               ***

నేను మూగనోము పట్టాను. రెండు రోజులు విపరీతమైన కలవరం…ఆందోళన…తర్వాత ఏమిటో తెలీదు…..అభావంగా ఐపోయాను.
అది విరక్తా? ఏమో!
నాకు పరీక్షలన్నీ జరిగాయి.
నేను కూడా పాజిటివ్.
ఇపుడు కడుపులో పెరుగుతున్న బిడ్డ పరిస్థితి ఏమిటి?
మా ఇద్దరికీ ఇదే అనుమానం.
“అబార్షన్ చెయ్యించేద్దాం విరాట్. ఈ వ్యాధిని మనతోనే పోనీ!” స్థిర చిత్తంతో అన్నాను ఆ రోజు రాత్రి.
అతనేమీ మాట్లాడలేదు. నన్ను దగ్గరకు హత్తుకుని ఉండిపోయాడు.
నిద్రలేని రాత్రులంటే ఏమిటో తెలుసు కానీ నిద్రపోనివ్వని గుండె దిగులు మా ఇద్దరికీ ఇప్పుడే అనుభవంలోకి వచ్చింది.
ఒకరినొకరం ఓదార్చుకునే ఆలోచన కూడా లేదు.
స్మశాన వైరాగ్యం మా మనసుల్లో చోటు చేసుకుంటే, స్మశాన నిశబ్దం ఇంటిని పట్టుకుంది.
రోజూ రాత్రుళ్ళు బిల్డింగ్ వెనుక స్లంలో ముసలామె అందరికీ శాపనార్థాలు పెడుతూ ఏడుస్తూనే ఉంది.
మా కోసం అలా ఏడ్చేవాళ్ళేరి?
“సచ్చిపోయిన పరదేశు పెండ్లాం ఇల్లు గడవక హైవేకి పోతాండాదమ్మా! దాని పిల్లల్ని, ముసలిదాన్ని పెంచాలి కదా! కానీ ఆ జబ్బు దానిక్కూడా ఉండే ఉంటాది కదా! మరి హైవేలో దాన్ని బుక్ సేసుకునేటోళ్ళకి అంటుకోదా?” కమలమ్మ ఒకరోజు గిన్నెలు తోముతూ అంటోంది.
“నేను పరీక్ష చేపించుకోమన్నాను. చెయ్యించుకోనంటుంది. అందరికీ తెలియనీకు, నా బిడ్డలను పెంచుకోనీ అంటాంది.”
ఆమె మాటలు నా వైరాగ్యాన్ని ఇంకా పెంచుతున్నాయి.

***                                              ***                                     ***                                               ***

“లైంగికపరంగా, లైంగిక కోరికల పరంగా మన అభిప్రాయాలనే ధైర్యంగా బయటకు చెప్పలేని సమాజం మనది. సెక్స్ కి సంబంధించినది ఏదైనా ఒక టాబూగానే పరిగణిస్తాం. ఇదే సమస్య. ఎవరు చెప్పారు ఎయిడ్స్ వస్తే చావే శరణ్యమని? మందులు వాడుతూ ఆరోగ్యంగా జీవిస్తే ఎన్నాళ్ళయినా హాయిగా బ్రతకొచ్చు.”
“నా బిడ్డను తీసెయ్యండి. నాకు ఈ వ్యాధితో పుట్టే బిడ్డ వద్దు. పుట్టాక దానికి దిక్కెవరు? హెచ్ ఐ వి పేషెంట్ గా పుట్టి, ఎయిడ్స్ తో చనిపోవడం ఎందుకు? మా ఇద్దరి జీవితం ఐపోయింది. మాతోనే ఈ వ్యాధిని పోనివ్వండి.” డాక్టర్ మాటలకు అడ్డు తగిలాడు విరాట్.
“బిడ్డకు వ్యాధి రాకుండా చూడొచ్చా?” డాక్టర్ ఏదో చెప్పేలోగానే చరిత అడిగింది. ఆమె గొంతులో ఎంత ఆశ దాగుందో!
తన సీట్లోంచి లేచింది డాక్టర్ హైమ.
“ఎమ్ చిప్ లాంటి క్రొత్త యంత్రాలు ఇపుడొస్తున్నాయి. పరీక్షలే కాదు, వ్యాధి ఉన్న దశను బట్టి మందులు కూడా ఉన్నయిపుడు. భయం లేదు. వచ్చిన వ్యాధిని వెనుతిరిగి పంపలేము కానీ ఆరోగ్యంగా చాలా కాలం జీవించగలం.”
“మీ ఇద్దరూ రేపు ఈ అడ్రస్ కు ఉదయం పది గంటలకు రండి. ఇపుడు నాకు ఆపరేషన్ ఉంది. అప్పుడే అబార్షన్ గురించి ఆలోచించొద్దు. మీ జీవితాలు కూడా ముగిసిపోలేదు.” అంటూ ఆపరేషన్ చెయ్యడానికి వెళ్ళిపోయిందామె.

***                                              ***                                     ***                                               ***

“ఇది రీహాబిలిటేషన్ సెంటర్. ఇక్కడ హెచ్ ఐ వి- ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు మాత్రమే ఉంటారు.” డాక్టర్ హైమ వెంట లోనికి నడిచాం.
“ఇక్కడ ఒకొక్కళ్ళదీ ఒక్కో గాధ.”
“చెడు తిరుగుళ్ళు తిరిగి ఈ వ్యాధిని కొనితెచ్చుకున్నవారు అలా ఎందుకు తిరిగామా అని ఒకటే పశ్చాత్తాపంతో ఏడుస్తూ వచ్చారు ఇక్కడికి. కుటుంబం వెలివేసినవాళ్ళే ఎక్కువ. కొందరి కథలు వింటే మనకు దేవుని మీద నమ్మకం పోతుంది. కొందరి వ్యధలు వింటే సమాజం వారిని ఎందుకిలా మార్చిందా అని సమాజంపై అసహ్యం కలుగుతుంది.” డాక్టర్ హైమ చెప్పుకుంటూ వెళ్తోంది. మేము ముభావంగా ఆమెను అనుసరించాం.
“అక్కడ చీర మీద పెయింట్ చేస్తున్న గౌరికి ఆక్సిడెంట్ అయితే రక్తం ఎక్కించారు. ఆ రక్తం ద్వారా ఎయిడ్స్ వ్యాధి సంక్రమించింది.”
” ఆ గదిలో పడుకుని ఉన్న చిన్నప్పది మరీ ఘోరమైన నిజం. రక్తదాన శిబిరంలో ఇన్ఫెక్టెడ్ సూదుల వల్ల హెచ్ ఐ వి సోకింది. మంచికి పోతే చెడు ఎదురుకావడమంటే ఇదే!”
“ఆ చెట్టుక్రింద లాప్ టాప్ పట్టుకుని కూర్చున్న సుధీర్ ఒక “గే”. స్వలింగ సంపర్కం ద్వారా ఈ వ్యాధి సంక్రమించింది.”
ఇలా ఎన్నో కథలుంటాయి. అవి వింటూంటే బాధతో మనసు చేదైపోతుంది.
“ఈ మనిషిని చూడు చరితా!” అంటూ మిషన్ మీద బట్టలు కుడుతున్న ఒకతన్ని చూపింది హైమ.
“ఇతని పేరు ఇస్మాయిల్. ఇతని తల్లి ఎయిడ్స్ తో చనిపోయింది. అన్నీ అక్రమ సంబందాలే! అయినా ఇతను కూడా అటువంటి సంబంధాలనే నెరపాడు. వ్యాధి సోకింది. భార్య వదిలేసింది. ఇక్కడ కుట్టు పని చేస్తున్నాడు.”
“అక్కడ మేడ మీద బట్టలకు రంగులు వేస్తున్న ఇద్దరు ఆడపిల్లలు కనిపిస్తున్నారా? వాళ్ళను పదేళ్ళ వయసులోనే వ్యభిచార కూపానికి అమ్మేసారు తల్లిదండ్రులు. పదహారేళ్ళకే హెచ్ ఐ వి బారిన పడ్డారు. అప్పుడు వ్యభిచార కూపం వీళ్ళను వెలేసింది.”
“అక్కడ పేపర్ కవర్లు తయారుచేస్తున్న సెంధిల్ “దమ్ మారో దమ్” బ్యాచ్. సెక్సువల్ రిలేషన్స్ ద్వారా వచ్చిందో, వీళ్ళందరూ మాదకద్రవ్యాలు ఇంజక్ట్ చేసుకునే సూదుల వల్ల సంక్రమంచిందో, హెచ్ ఐ వి అయితే సంక్రమైంచింది.”
“ఇలా ఎన్నో కథలు, మరెన్నో దీన గాథలు. వీళ్ళంతా బ్రతకడం లేదా? ఇలా రీహాబిలిటేషన్ సెంటర్ కు రాని వాళ్ళూ ఉన్నారు. కుటుంబ సభ్యుల సహకారంతో జీవితాన్ని గడుపుతున్నవారూ ఉన్నారు. లక్షణంగా ఉద్యోగం చేసుకుంటూ, క్రమంగా ట్రీట్మెంట్ తీసుకుంటున్నవాళ్ళున్నారు. అంతే కాదు…..తమలా ఎయిడ్స్ బారిన పడిన వారి జీవితాలను బాగు చేస్తూ, సమాజంలో హెచ్ ఐ వి ఎయిడ్స్ పట్ల అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్న వాళ్ళూ ఉన్నారు.”
డాక్టర్ హైమతో ఆ రోజంతా అక్కడే ఉండిపోయాం.

***                                              ***                                     ***                                               ***

ట్రీట్మెంట్ మొదలైంది. బిడ్డకు వ్యాధి సోకకుండా డాక్టర్ ట్రీట్మెంట్ మొదలుపెట్టారు. ఇద్దరం బాగానే రెస్పాండ్ అవుతున్నాం. అయినా ఏదో దిగులు.
ఆఫీసులో అందరికీ ఈ విషయం తెలిసింది. నాది గవర్నమెంట్ ఉద్యోగం కాబట్టి నా ఉద్యోగం సేఫ్. ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న చరిత ఉద్యోగం మాత్రం పోయింది. చూపించిన కారణం మాత్రం వేరు.
రీహాబిలిటేషన్ సెంటర్ నుండి వచ్చాక చరిత ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. నేను ఆఫీసు నుండి రాగానే తన కంప్యూటర్ ను ఆఫ్ చేసేస్తుంది. తెల్లవారే వరకూ నాతోనే ప్రతి నిముషం గడుపుతుంది.
ఈ ఆరునెలల కాలంలో అత్యద్భుతమైన సంసార జీవితాన్ని నాకందించింది ఆమె. ఇపుడు ఇద్దరి మధ్యా ప్రేమ పెరిగింది. ఇంకా చెప్పాలంటే ఇద్దరి నడుమా ఒక ప్యాషన్ పెంచేసింది చరిత. ఆమె చూపే ప్రేమకు నాకు ఇంకో పది జన్మలు వెంటవెంటనే ఎత్తాలనిపించేంత మోహం కలుగుతుందీమధ్య. ఇదేనేమో అందమైన అనుబంధం అంటే!

***                                              ***                                     ***                                               ***

“పగలంతా ఏం చేస్తున్నావ్? ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నావా? నేను బిజీ ఐపోవడం వల్ల నిన్ను పెద్దగా పట్టించుకోలేకపోతున్నాను.” ఒకరోజు ఆమె చేతిని నా చేతిలోకి తీసుకుని నిమురుతూ అడిగాను.
“ఇంకా ఏమి చెయ్యలేదని బాధ పడ్తున్నావ్ విర్? నా ఆహార జాగ్రత్తలూ, మందులూ, ట్రీట్మెంట్…అన్నీ నువ్వే చూస్తున్నావ్. నేను తిని తిరుగుతున్నానంతే!” నా గుండెల్లో ఒదిగిపోతూ సమాధానం ఇచ్చింది.
ఆమె గురించే నా బెంగ. వంటరితనం, హెచ్ ఐ వి తో యుద్ధం….తను ఏమైపోతుందో!

***                                              ***                                     ***                                               ***

ఏదో చెయ్యాలి. ఈ ఒత్తిడి నుండి బయటపడాలి. ప్రభుత్వం అవగాహన కల్పిస్తుంది. ఎన్నో కార్యక్రమాలూ జరుగుతున్నాయి. నా వంతుగా నేను ఏదో ఒకటి చెయ్యాలి. ఇదే ఆలోచన ఎంత సేపూ!
డిజైనింగ్ లో క్రొత్త టెక్నిక్స్ రాయడం, క్రొత్త డిజైన్స్ తయారుచెయ్యడం మొదలుపెట్టాను.
ఎన్నాళ్ళుగానో నాకున్న ప్యాషన్ షేర్ బిజినెస్. కాలేజీలో ఉన్న రోజుల్లో న్యూస్ పేపర్లో షేర్ బిజినెస్ పేపర్ ను వదిలేదాన్ని కాదు. ఆ అంశానికి సంబంధించి చాలా పుస్తకాలు చదివేదాన్ని. వృత్తిగా కూడా దాన్నే ఎంచుకుందామనుకున్నా! కానీ కుదరలేదు. తల్లిదండ్రులు చనిపోయాక, నన్ను పెంచిన తాతయ్య నా ఇరవయ్యేళ్ళ వయసులో చనిపోయాడు. ఇక అప్పుడు ఉద్యోగం వెతుక్కుని ఏదో ఒకటిలే అని సరిపెట్టుకుని, జీవితపు పరుగుపందెంలో పరుగులెత్తడమే సరిపోయింది.
లాప్ టాప్ నా నేస్తమైందిపుడు. రోజుకొక క్రొత్త డిజైన్, రోజూ షేర్ బిజినెస్ పై దృష్టి పెట్టడం దినచర్యలో భాగమైపోయింది.
బిడ్డ ఆరోగ్యం గురించి మర్చిపోవాలి. ఆ టెన్షన్ నా దరి చేరకూడదంటే క్షణం తీరిక లేకుండా ఉండడమే మార్గం.
జీవితం మారిపోయింది.
డాక్టర్ హైమ మాకు నిజమైన దైవమైపోయింది.
విరాట్ ప్రతి ఆదివారం రిహాబ్ సెంటర్ కు వెళ్ళి వస్తున్నాడు. నేను డెలివరీ అయ్యాక వెళ్దామని నిర్ణయించుకున్నాను. అక్కడ వారికి వాలంటీరుగా సర్వీసు చేస్తున్నడనుకుంటా!
మూడు నెలల్లో యాభై క్రొత్త హోం డిజైన్స్ తో నా పుస్తకం అచ్చయింది.
తర్వాతి నెల ఆన్లైన్ షేర్ కన్సల్టెంట్ గా అవతారం ఎత్తాను.
విరాట్ నా బాగోగులు చూస్తూనే ఉన్నాడు.

***                                              ***                                     ***                                               ***

“ది బిగ్ డే” రానే వచ్చింది.
విరాట్ ముఖంలో నెత్తుటి చుక్కలేదు.
నా పరిస్థితి వర్ణనాతీతం.
ఆపరేషన్ చేసి ఆడబిడ్డను నా శరీరం నుండి వేరు చేసిన హైమ మరి నన్ను కలవలేదు. బిడ్డను తీసుకుని వెళ్ళిపోయింది.
మర్నాడు నా ఒడిలో పెట్టారు బిడ్డను.
ఆరు వారాల పరీక్షల సమయంలో విరాట్, నేను చాలా టెన్షన్ పడ్డాం.
డాక్టర్ హైమ మెచ్చుకుంది. నేను ట్రీట్మెంట్ కి చాలా బాగా రెస్పాండ్ అయినందుకు.
ఆరు వారాల తర్వాత డిక్లేర్ చేసింది పాపకు హెచ్ ఐ వి సోకలేదని!
ఇది మేము మా జీవితంలో విన్న అతిపెద్ద శుభవార్త.

డాక్టర్ల ఖచ్చితమైన నియంత్రణ మధ్య చరిత పాపకు జన్మనిచ్చింది. హెచ్ ఐ వి పాజిటివ్ అయిన దంపతులకు పుట్టిన ఎయిడ్స్ రహిత బిడ్డ.
యుఎన్ ఓ (యు ఎన్ ఎయిడ్స్) నుండి నాకు పిలుపు వచ్చింది. నేను రిహాబ్ సెంటర్లోని వాళ్ళందరి జీవితాలనూ షూట్ చేసాను. వారు హెచ్ ఐ వి -ఎయిడ్స్ తో జరిపే ప్రాగ్రెసివ్ పోరాటాన్ని చిత్రీకరించాను.
ఎయిడ్స్ ను నిర్ధారించే పరీక్షల గురించి ఎంతో మందికి తెలియదు. ఆ పరీక్షల గురించి వివరించేందుకు వీడియో చిత్రీకరించాను.
అలాగే ఎమ్ చిప్ లాంటి ఆధునిక పరీక్షామాపకాల గురించి తెలియజేసాను.
నేను, చరిత హెచ్ ఐ వి బారిన పడ్డాక, మా జీవనశైలిని ఎలా మార్చుకున్నామో, హెచ్ ఐ వి పాజిటివ్ వ్యక్తులు ఆరోగ్యంగా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ ఒక పుస్తకంగా రాసాను. ఆరునెలల నెలల కష్టం వృధా పోలేదు. నా వీడియోలు, పుస్తకం చూసిన ఐక్యరాజ్యసమితి, రాబోయే ఐదేళ్ళ లో ప్రపంచ దేశాల్లో హెచ్ ఐ వి నియంత్రణ కార్యక్రమాలను నిర్వహించే టీంలోకి నన్ను కూడా తీసుకున్నారు. ఈ వార్త విన్న చరిత ముఖంలో సంతోషం చూడాలి!
మా పాప కూడా బోసినవ్వులతో నాకు కంగ్రాట్స్ చెప్తోంది.

– విజయ భాను కోటే 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కథలు, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో