
కె.వరలక్ష్మి
గుండ్రటి డబ్బా మిషన్లో కాస్త పంచదార చల్లి అప్పటికప్పుడు తయారు చేసిచ్చే వేడి వేడి పీచు మిఠాయి , మణి కట్టుకి చుట్టే పాకం వాచీలు , సంతలో అమ్మే బెల్లం సేమ్యా పాయసం – అన్నిటికీ దూరం జరగాల్సి వచ్చింది పెద్ద దాన్నై పోయిన భావంతో .
డా.జయగారు హాస్పటలు పక్కనే కట్టిన ఇంటికి గృహ ప్రవేశం చేసారు . మా అమ్మ నన్నూ , మా పెద్ద చెల్లినీ పంపించింది . పూజ ముగిసి ఇక పీటల మీంచి లేస్తారనగా హఠాత్తుగా సబ్ రిజిస్ట్రార్ గారి భార్యకి పూనకం వచ్చింది . ఆవిడ మీదికి వెంకటేశ్వర స్వామి వచ్చి వాలేడట . కళ్ళు పెద్దవి చేసి ఊగిపోతూ పెద్ద పెద్ద కేకల్తో “ నా పూజ మరిచిపోయేరా ? నీ కొడుకుని ఏం చేత్తానో చూడు “ అనే సరికి జయ గారి భార్య హడలి పోయి ఏడుస్తూ అక్కడే పాకుతున్న వాళ్లబ్బాయిని ఎత్తుకుని వణకడం మొదలుపెట్టేరు . నలుగురు ఆడవాళ్లు కుందె నిండా నిప్పులు తెచ్చి సాంబ్రాణి పొగవేసి దణ్ణాలు పెడుతూ వేంకటేశుడు వాళ్లింట్లో మనిషైనట్టు మందలిస్తూ సంభాషణ ప్రారంభించేరు . నా చిన్నప్పటి నుంచి మా వీధిలో చాలా మందికి పూనకాలు రావడం , సోది చెప్పించుకోవడం లాంటివి చూస్తూనే ఉన్నాను . కాని , నాగరీకుల ఇళ్ళల్లో కూడా ఇలాంటివి జరుగుతాయని అదే మొదటిసారి చూడడం . మర్నాడే బయలుదేరి తిరుపతి వస్తామని మొక్కుకున్నాక ఆవిడ పూనకం దిగింది . అప్పటికే నేను చదువుతున్న సాహిత్యం వల్ల , నా ఆలోచనా విధానంలో వస్తున్న మార్పు వల్ల అదంతా ఉత్త బూటకపు చర్య అని నాకన్పించింది .
మా రామలక్ష్మి అన్నయ్య ఆకెళ్ల సుందరంగారు మా స్కూల్లో గుమస్తాగా చేరేరు . ఆయన భార్య విజయ లక్ష్మి మొదటి కాన్పు కొడుకుని ఎత్తుకుని పుట్టింటి నుంచి వచ్చేరు . ఒకే ఒక్క గది ఉన్న వాళ్లింట్లో చోటు చాలక ఇల్లు దొరికే వరకూ మా వీధి గదుల్లో ఒక గది ఇమ్మని మా నాన్నని అడిగేరు . మా నాన్న వెంటనే ఆ గదిని ఖాళీ చేయించి ఇచ్చేరు .
విజయ లక్ష్మి గార్ని చూసి “ అంత అందమైన సుందరం గారికి ఈవిడేం భార్య అనుకున్నారు కాని , మనుషుల రూపాన్ని కాదు చూడాల్సింది అని నాకప్పుడే అర్ధమైంది . చదువుకున్నది స్కూల్ ఫైనల్ వరకే అయినా సాహిత్యంలోగాని , సంగీతంలో గాని మంచి విమర్శకురాలావిడ . గ్రంధాలయం నుంచి తెచ్చుకున్న పుస్తకాన్ని చదివేక , ఆ కథ గురించీ , శైలి గురించీ చర్చించేవారావిడ . పుస్తకం పేరునీ , రచయిత పేరునీ , కథా వస్తువు గురించి కొన్ని లైన్లనీ ఒక పుస్తకంలో నోట్ చేసుకోవాలని చెప్పిందావిడే . గొప్ప స్నేహ శీలి , సహన శీలి . నాలుగైదు నెలల్లో మా ఇల్లు ఖాళీ చేసి వెళ్లే లోపల చాలా నేర్చుకున్నానావిడ నుంచి . వెళ్తూ “ నువ్వొక ఆనందమయివి . ఎప్పటికీ ఇలాగే నవ్వుతూ తుళ్లుతూ గడవాలి నీ జీవితం “ అని ఆశీర్వదించేరు . నా పుస్తకాల పిచ్చి చూసి సుందరం అన్నయ్య గారు నాకు టామ్ సాయర్ పుస్తకాన్ని బహూకరించేరు . అప్పటి వరకూ లత , వాసిరెడ్డి సీతాదేవి , రంగనాయకమ్మ , మాదిరెడ్డి సులోచన వంటి రచయిత్రుల్ని ఇష్టంగా చదువుతున్న నాకు మరో ప్రపంచానికి ద్వారాలు తెరిచిండా పుస్తకం . ప్రపంచంలోని ఏ భాష నుంచి అనువాదమైనా ఇష్టంగా చదువుతూ ఆ దేశపు కాలమాన పరిస్థితుల్నీ , ఆయా వ్యక్తుల జీవన విధానాల్ని , ఆ రచయితలు కథ చెప్పిన వైనాన్ని గ్రహించడం ఎంతో బావుండేవి . ఆ సంవత్సరంలోనే యద్దనపూడి సులోచనారాణి గారి మొదటి కథ ఆంద్ర పత్రిక వీక్లీలో వచ్చింది . ఆ కథ నాకెంతో నచ్చేసిందో చెప్పలేను .
అలా నేను చదివే సాహిత్యం నా జీవన విధానాన్ని నిర్దేశించడం ప్రారంభమైంది . మనుషుల నడవడికల్ని సాహిత్యంలోని పాత్రలతో బేరీజు వేసుకుని మంచి చెడుల్ని నిర్ణయించుకునే దాన్ని . ఈ లోకంలోని సామాన్య విషయాలేవీ నా తల కెక్కేవి కాదు . నేల నుంచి జానెడు ఎత్తున నడుస్తున్నట్టుండేది . ఇంట్లో చెప్పే పనుల్ని అవకతవకగా చేసేదాన్ని లేదా అసలు చెయ్య లేకపోయేదాన్ని . నాలుగు చెంబుల నీళ్లు పట్టే ఇత్తడి బిందెతో చెరువుకి నీళ్లకి వెళ్ళిన దాన్ని చెరువులో విరిసిన తామర పూల అందాన్ని చూస్తూ పావంచాల మీద కూర్చుండి పోయేదాన్ని . సూర్యోదయం , సూర్యాస్తమయం , కొబ్బరి చెట్ల మీద పరుగులెత్తే ఉడతలు , నీటి మీది నుంచి ఒక్కసారిగా రెక్కలు విప్పుకొని ఎగిరే కొంగలు , ఎక్కడి నుంచో గాలిలో తేలి వచ్చే పూల పరిమళాలు అన్నీ మైమరపు కలిగించేవి . ఏదో భావుకత్వంలోకి నెట్టేసేవి .
నాకు ఇంటి పనులేనీ రావడం లేదని , పెళ్లి చేస్తే కష్టమని ఇంట్లో ఓ చర్చ జరిగింది . పాపం నాకన్నా చిన్న వాళ్లైనా మా చెల్లె ల్లిద్దరూ , మా నాన్నమ్మకీ , అమ్మకీ సాయం చేతూ పనులు నేర్చుకుంటున్నారు . వాళ్లు కళ్లాపు జల్లితే ముగ్గులు మాత్రం నేను పెట్టేదాన్ని . ఒకరోజు వాకిట్లో గేదె వేసిన పేడ ఎత్తమన్నారు . నేను ముని వేళ్లతో బుట్టను పట్టుకెళ్లి అక్కడ పడేసేను . వంగి పేడలో చెయ్యి పెట్టాలంటే నా వల్ల కావడం లేదు . అంతా చోద్యం చూస్తున్నారు . కళ్ళు మూసుకుని పేడను తాకే వేళకి ఓక్ మని వాంతి వచ్చేసింది . అప్పుడే తిన్న పెరుగున్న మంతా బైటికొచ్చేసింది . అప్పుడే “ ఈ పిల్ల పుస్తకాలు చదవడానికి తప్ప ఇంకే పనికీ పనికిరాదు “ అని ఓ ముద్ర వేసేసేరు .
కొన్ని సంఘటనలు ఎప్పటికీ మరపురావు . ఓసారి ఎండు చేపలకూర అనుకుని నేను మధ్యాహ్నం భోజనానికి ఇంటికి రాననుకుని మా అమ్మ భోజనం పంపింది . ఎలా అంటే మేం చద్దన్నాలు తినే సీవెండి మట్టు గిన్నెలో అన్నం , దానిపైన ఏదో పప్పుకూర వేసింది . ఓ చిన్న గిన్నెలో చారు, ఓ గ్లాసుతో పెరుగు . ఆ రోజెందుకో ఎలిమెంటరీ స్కూలు సెలవు . మా స్కూలు విడిచి పెట్టి అందరం బైటికొస్తున్నప్పుడు గేటు వరకూ వెళ్లిన వాళ్లంతా వెనక్కి నా వైపు చూసి నవ్వుతున్నారు . తీరా చూద్దును కదా చింపిరి జుట్టు , నలిగిన బట్టల్లో మా పెద్ద చెల్లి ఓ పక్క , మా పెద్ద తమ్ముడోపక్క కూచుని మట్టిలో ఆడుతున్నారు . మా చెల్లి వొడిలోమూతైనా లేని అన్నం గిన్నె , మా తమ్ముడి పక్కన చారు , పెరుగు . నా ఫ్రెండ్స్ ఫక్కున నవ్వేరు . నాకు మాత్రం ఏడు పాగలేదు . ఎలా పరుగెత్తు కుంటూ వచ్చి ఇంట్లో పడ్డానో తెలీదు . పాపం నా వెనక గస పోసుకుంటూ చెల్లీ , తమ్ముడూ , తర్వాతెప్పుడో అర్ధమైంది ఆ సంఘటనలోని తల్లి ప్రేమ . ఆలస్యమైతే ఆకలికి ఆగలేనని ఎలాంటి నాగరికతా భేషజాలు అంటని మా అమ్మ – వెర్రి తల్లి నా ఏడుపు చూసి తెల్ల బోయింది .
ఓ సారి మా చెల్లెళ్లనీ , తమ్ముళ్ల నీ తీసుకుని సినిమాకెళ్లేను . చెప్పేను కదా , మేం టిక్కెట్లు కొనుక్కోవాల్సిన అవసరం ఉండేది కాదు . వెళ్తూనే గులాబీ మొక్కల వైపు వెళ్లి ఓ పువ్వు తుంచు కోవడం అలవాటు . ఆ రోజు ఒక్క పువ్వూ లేదు చెట్లకి . అప్పటికి జనం అంతగా రాలేదు . లోపలి కెళ్లి కుర్చీల్లో కూర్చున్నాం . కాస్సేపటికి గేటు దగ్గర టిక్కెట్లు చింపే సూరయ్య ఓ పెద్ద గులాబీల గుత్తి తెచ్చి నా చేతికి చ్చేడు . పూలమీది ప్రలోభం కొద్దీ తీసుకున్నాక అనుమానం వచ్చింది. సూరయ్య ఇది వరకు మా ఇంట్లో పని చేసేడు . ఎవ్వరిచ్చేరని అడిగితే గేటు వైపు చూపించేడు . అక్కడ పెద్ద రెడ్డిగారబ్బాయి , పెద్ద రాజుగారిబ్బాయి లైటు కింద నుంచుని మిస్చువస్ గా నవ్వుతున్నారు .వాళ్లిద్దరూ మోతు బర్లు , అందమైన వాళ్లు . సి . పుల్లయ్య గారి సాయంతో సినిమాల్లో నటించాలని ఉబలాట పడుతున్న వాళ్లు . స్వతహాగా మంచి వాళ్లు . కాని , పల్లెటూరి ప్రభావం . వెనక బడిన కులాల ఆడపిల్లలు ఏదో ఒక ప్రలోభానికి పడిపోతారనే ఓ నమ్మకం కావచ్చు . వెంటనే నాలో ఇంగితం మేల్కొంది . చేతిలోని గులాబీల గుత్తిని సూరయ్యకి తిరిగి ఇచ్చేసేను . ఆ తర్వాతి కాలంలో నేనీ ఊళ్లో స్కూలు పెట్టినప్పుడు వాళ్లిద్దరూ నన్ను సొంత అన్నల్లాగా ఆదరించేరు .
మా ఇంట్లోంచి వంటింట్లోకి వెళ్లే గచ్చు చివర అరుగు లాంటి పెద్ద రాయి ఒకటి ఉండేది . వారానికొకసారి అందరూ తలంటు కోడానికి సరిపడా కుంకుడు కాయలు ఆ రాతి మీద కొట్టే వాళ్లం . నాకాపని సరదాగా ఉండేది. గుండ్రటి రాయితో కుంకుడు కాయని కొడితే గింజ బుల్లెట్ లాగా దూసుకొచ్చేది . నూతి దగ్గరున్న బకెట్లకీ , డేగిసాలకీ గింజలు తగిలి చిత్రమైన శబ్దాలో చ్చేవి . మా తమ్ముళ్లు , చెల్లెళ్లు కావాలని అటొచ్చి గింజలు తగలకుండా గెంతుతూ ఉండేవారు . ఎవరికైనా గింజ తగిలి ‘ అబ్బా ‘ అంటే మిగిలిన వాళ్లందరం పడీ పడీ నవ్వే వాళ్లం . ఓ ఆది వారం ఉదయం అలాంటి ఆటలో ఉండగా మా నాన్న ఒక అబ్బాయిని వెంట బెట్టుకొచ్చేరు . వాళ్లిద్దరూ తిన్నగా హాల్లోకి వెళ్లిపోయి నట్టున్నారు , వెనక్కి తిరిగి ఉండడం వల్ల నేను గమనించలేదు . మా నాన్న అవతలి దొడ్డి గుమ్మంలోంచి వచ్చి వంటింట్లో ఉన్న మా అమ్మకేదో చెప్పేరు . మా అమ్మ అప్పటికి చిన్నింట్లో ఉంటున్న శేషమ్మని పిల్చుకొచ్చింది . నేను స్కూలుకెళ్లడానికి ఆవిడే జడలు వేసేది . ఆవిడ నా జుట్టు దువ్వి జడ వేసి , మొహానికి పౌడరు పూసి , బొట్టు పెట్టింది . మా అమ్మ మంచి బట్టలు తెచ్చి వంటింట్లో మార్చుకోమంది . ఈలోగా ఇంట్లో వాళ్లూ ,వీధిలో వాళ్లూ ఒక్కక్కళ్లూ వెళ్లి ఆ అబ్బాయిని పలకరిస్తున్నట్టున్నారు . అతని మాటలు విన్పిస్తున్నాయి . మంచి గంభీరమైన గొంతు , స్పష్టమైన ఉచ్ఛారణ . గుమ్మనిండా ఉన్న జనం మధ్య నుంచి శేషమ్మ నన్ను తీసుకెళ్లి మా హాల్లో (ముందు గది ) నుంచో బెట్టింది . ఆ మూల రేడియో దగ్గర నేను కూర్చుని చదువుకునే కుర్చీలో కూర్చుని ఉన్నాడతను . లోపలికి పోయిన చెంపలు , దట్టమైన కనుబొమల కింద లోతైన కళ్ళు , సూది ముక్కు , నల్లని పెదవులు , ఇన్ షర్ట్ చేసుకున్న తెల్లని బట్టల్లో మరింత నల్లగా , బక్కగా ….అన్నిటినీ మించి నున్నని గుండు . ఇంత సేపటి నుంచీ నేను వింటున్న గొంతుకీ , ఆ రూపానికీ ఎక్కడా పొంతన లేదు . అతను చిన్నగా నవ్వి ఏదో మాట్లాడబోయేడు కాని , నేను బైటి కొచ్చేసేను . భోజనం వేళ అయ్యింది కాబట్టి అతనికి అన్నం పెట్టి మా నాన్న తీసుకెళ్లి బస్సెక్కించి వచ్చేరు .
ఏలేశ్వరం చుట్టాలింటి కెళ్లి కాకినాడ బస్సులో వచ్చి దిగి రాజమండ్రి బస్సు కోసం ఎదురు చూస్తున్నానని చెప్పేడట మా నాన్నతో . రమ్మని పిలవక పోయే సరికి “ మీ ఇంటికి రావచ్చాండి ?” అని అడిగేడట . రాజమండ్రి వెళ్లి మావాళ్లు చూసొచ్చిన అబ్బాయి ఇతనేనట . బిఎ స్సీ మొదటి సంవత్సరం చదువుతున్నాడట. పెద్ద వాళ్లు వద్దనుకున్నాక ఇతనెందుకొచ్చేడో నాకర్ధం కాలేదు .
వంటింటి గట్టు మీద చతికిలబడి పోయిన నా పక్క కొచ్చి కూర్చుంది మా నాన్నమ్మ . నేను నాన్నమ్మ చేతిని గట్టిగా పట్టుకుని “ మామ్మా నాకతన్తో పెళ్లి చేసేస్తారా ?” అనడిగేను ఏడుపు గొంతుతో .
“ ఆడేం పెళ్లి కొడుకే , తియ్ ; ముడుక్కాళ్లు , దొంగ మొకం ఏస్కుని “అంది నాన్నమ్మ . అప్పటి వరకూ “పెళ్లి .. పెళ్లి “ అంటున్న నాన్నమ్మ మానాన్న బైటి నుంచి రాగానే “ బాబా ! పిల్లని బాగా సదువుకొనిద్దార్రా , ఉప్పుడప్పుడే పెళ్లీ వొద్దు గిళ్లీ వొద్దు “ అనేసింది . ఆదన్ను చూసుకుని నేను కూడా “ నాకా పెళ్లి కొడుకు అస్సలు నచ్చలేదు “ అని ఓ ప్రకటన చేసేసేను .
– కె.వరలక్ష్మి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
2 Responses to తొమ్మిదో తరగతిలో …..3