ఇరవైయ్యవ శతాబ్దపు మలి దశ – స్త్రీల కథ

స్వాతంత్రోద్యమ మహిళలకు గొప్ప ఉత్తేజాన్ని చ్చింది . అప్పటి వరకు సంసారమే సర్వస్వం అని భర్తకు అత్తమామలకు సేవ చేయటమే పవిత్ర కార్యమన్న స్థితి నుండి ఇంటి బయట కూడా సామాజిక కర్తవ్యాన్ని నిర్వహించాలనే జిజ్ఞాస ప్రారంభమైన కాలమది . సారా వ్యతిరేక , విదేశీ వస్తు బహిష్కరణ , ఉప్పు సత్యాగ్రహాలలో తమ కుటుంబ సభ్యులతో పాటు స్త్రీలు పెద్ద సంఖ్య లో పాల్గొన్నారు . బండారు అచ్చమాంబ , ఉన్నావా లక్ష్మి బాయమ్మ , కొటికలపూడి సీతమ్మ ,ఆదుర్తి భాస్కరమ్మ వంటి వాళ్లు సామాజిక కార్యక లాపాలలో పాల్గొనటంతో పాటు స్త్రీల విద్య కు ప్రాధాన్యత నిచ్చి కృషి చేసారు . ఆ దశలో అక్కడక్కడ ప్రత్యేక మహిళా సంఘాలు కూడా ఏర్పడ్డాయి . సంస్కరణోద్యమ కాలం నాటి నుండే కందుకూరి , గురజాడ , గిడుగు రచనలు తెలుగు సమాజంపై ముఖ్యంగా మహిళలపై ప్రభావాన్ని కలిగి ఉండటం వాళ్ళ ఈ కాలం నాటికి స్త్రీలు మరింత చైతన్యవంతమై రచనా రంగం వైపు కూడా దృష్టి పెట్టారు .

అయితే తొలి తరం రచయిత్రుల ఆలోచనలన్నీ కుటుంబ పరిధిలోనే సాగాయి . అప్పటికున్న భూస్వామ్య , పితృస్వామ్య భావ జాలం వల్ల , పెళ్లి కొరకే చడువులనీ , భర్త అడుగుజాడలు అనుసరించటమే స్త్రీల ధర్మమన్నది సాహిత్యంలోనూ ప్రతి బిం బిం చింది . బండారు అచ్చమాంబ – ‘ స్త్రీ విద్య” కథలో భార్య భర్తల సంవాదం , భర్తను క్షేమ సమాచారం తెలియజేయమనటంలో కథ ప్రారంభమౌతుంది . అప్పుడతను నీవు కూడా చదువు నేర్చుకుంటే మంచిది కదాని ! సాగించిన సంభాషణే ఈ కథ . చివరకు ఆమె భర్త అభిప్రాయాన్ని గౌరవించి చదువుకోవటానికి అంగీకరిస్తుంది . కనుపర్తి వరలక్షమ్మ ‘ ఐదు మాసముల యిరువది దినముల ‘ కథలో భర్త జైలుకు వెళ్లగా అతని అభిప్రాయాలను గౌరవించి తన విదేశీ వస్త్రాలను త్యజించటమే కాక రాట్నం వడికి స్వదేశీ వస్త్రాలను ధరిస్తుంది . మరొక కథ బసవరాజు వెంకట లక్ష్మి ‘ ఎవరి దదృష్టంలో’ సాంప్రదాయానికి భిన్నంగా ఇష్టపడి మతాంతర వివాహం చేసుకోవటం వల్ల నష్టపోతామని , తల్లి దండ్రులు చేసే వివాహం మంచిదని సూచించింది . అయితే కథానాయక చివరలో భర్తను ప్రశ్నిస్తుంది . ఈ మేరకు ఆ కథ ఓ సానుకూల అంశాన్ని ప్రతిపాదించినప్పటికీ , సాంప్రదాయాన్ని ధిక్కరించరాదనే భావ జాలాన్ని ప్రతిపాదించిన నెగటీవ్ కథ . ఇలా సాగిన స్త్రీల రచనలు స్వాతంత్ర్యానంతరం కూడా ఆ ఒరవడిని దాటలేదనే చెప్పాలి . అయితే అందుకు భిన్నంగా ‘లలిత’ వంటి కథ రాసిన ద్రోణం రాజు సీతాదేవి , ‘కొండమల్లెలు ‘ కథ రాసిన ఇల్లెందుల సరస్వతి దేవి వంటి వారు అందుకు మినహాయింపు లేకపోలేదు .
ఆనాటి ఉద్యమాల ప్రభావంతో చాలా మంది మద్య తరగతి స్త్రీలు చదువుల్లోకి ఎదిగి వచ్చారు . బ్రిటీష్ వాడు దేశం వదిలిపోవటం , కమ్యూనిష్టు ఉద్యమం కూడా విరమణ ప్రకటించడంతో సమాజంలో ఓ స్థబ్దత ఆవరించింది . దీని వల్ల స్త్రీలకు ఏ విధమైన సామాజిక కార్యాచరణ లేకపోవటంతో చాలా మంది కుటుంబాలకు పరిమితమైన పోగా , కొద్ది మంది సాహిత్యం వైపు దృష్టిని మరల్చారు . ఆయా ఉద్యమ కాలాలలో సమాజాన్ని ఉత్తేజం చేయటానికి సాంప్రదాయ సాహిత్యాన్ని విరివిగా ప్రచారం చేయటం , సభలూ , సమావేశాలల్లో గేయాలు , కీర్తనలు వంటి వాటిని ఆలపించటం చేసారు . కమ్యూనిష్టులు కూడా గీర్కీ ‘అమ్మ’.’నేరము శిక్ష ‘ వంటి అనువాద రచనలు ప్రచురించటం తో ఆ ఉద్యమ కాలాల్లో సంఘంలో ఓ సాహిత్య వాతావరణం ఏర్పడి వుంది . దాని వల్ల స్త్రీలు అనతర కాలంలో ఈ మార్గాన్ని ఎన్నుకోవటానికి దారి చూపినట్లయింది . సామాజిక కార్యాచరణ దూరమై నిస్పృహగా ఉన్న దశలో రచనను ఒక ఆలంబనంగా చేసుకున్నారు .
దీనితో పాటు నీటి వనరు కలిగిన తీర ప్రాంతాలలో వరి , చెరకు వంటి పంటలలో వ్యవసాయాభివృద్ది చెందటంతో కోస్తా ప్రాంతాల నుండి స్త్రీలు ఎక్కువ మంది చదువుల్లోకి వచ్చారు . జాతీయోద్యమంలో పాల్గొన్న స్త్రీలలో ఎక్కువ మంది ఈ ప్రాంతపు మధ్య తరగతి , ధనిక రైతు కుటుంబాల నుండి వచ్చిన వాళ్లేనన్నది ఒక వాస్తవం . ఈ నేపధ్యం నుండి ఈ ప్రాంతపు మహిళలే ఎక్కువగా రచనలు సాగించారు . ఈ కాలంలో వచ్చిన కథల్లోనూ , నవలల్లోనూ వరకట్న సమస్య , పునర్వివాహాలు . విడాకుల హక్కులు , మనోవర్తి హక్కుల సమస్యలే కాక అప్పుడప్పుడే ఉద్యాగాలల్లోకి వస్తున్న స్త్రీల కష్ట సుఖాలకు సంబంధించిన అంశాలు ప్రాధాన్యత వహించాయి . ఆ కథలు కూడా రాజీ ధోరణితోనే ముగిసినా , ఆలోచనలు ప్రేరేపించేవిగా ఉండేవి . కొందరు చైతన్యంతో ప్రతిఘటించినట్లు , ముగింపు ఇచ్చిన కథలు కూడా ఉన్నాయి .
19 55 లో జానకీ రాణి “ నా జీవితం నాకిచ్చేయ్ “ కథ భర్తను ఎదిరించి కూతురు సహకారంతో విడాకులు పొందుతుంది . తల్లి పార్వతమ్మ తరపున సీత కోర్టులో సాక్ష్యం చెపుతుంది . విడాకులు, మనోవర్తి కూడా మంజూరు అవుతుంది . కాని కోర్టులోనే భరణం డబ్బులు పార్వతి భర్త మొహాన విసిరేస్తుంది . ఇరవై ఏళ్లుగా నా దుఃఖం కష్టాలు డబ్బులు ఇస్తే తీరుతాయా? అన్న అర్ధంలో ‘ నా జీవితం నాకీచ్చెయ్ ‘ అంటుంది పార్వతమ్మ . వాహిని రాసిన ‘ నీతి లేని కమల ‘, వి . సుశీలా దేవి రాసిన ‘ చీకటి వెలుగులు ‘ మనుషుల ఆలోచనలలో వస్తున్న మార్పును చూచించేవి .

తూములూరి కృష్ణవేణి 19 51 లో రాసిన ‘ఆడ బ్రతుకు ‘ స్త్రీల హక్కుల గురించి ప్రస్తావించిన కథ …..’పాకీ వాళ్ల దగ్గర నుండి పెద్ద ఆఫీసర్లు దాకా సమ్మె చేస్తూ ఉంటే ఆడవాళ్ల అంత అసమర్దులేవనా మీ అభిప్రాయం ‘ మేమూ చేయదలుచుకోన్నాము “ అంటుంది కథానాయక దుర్గ . స్త్రీల హక్కుల ఆత్మ గౌరవ దృక్పధాన్ని ప్రదర్శించిన కథ ఇది .
ఇట్లా 20 వ శతాబ్దం తొలి దశలో రెండవ తరం రచయిత్రులు కొంత భిన్నమైన దృక్పధాన్ని ప్రదర్శించిన వాళ్లు మనకు కనిపిస్తారు . జయంతి , నిడమర్తి నరసమాంబ , సమయ మంత్రి వందేమాతరం , కందాళం కనకమ్మ , పంతం అమ్మాజీ , గుమ్మిడదల దుర్గాబాయి , గండికోట సావిత్రీ దేవి , పైడి రేణుకా దేవి , వెలిదండ చూడి కుడుతమ్మ వంటి ఎందరో రచయిత్రులు పేరు ప్రఖ్యాతుల్లోకి రాకుండానే పోయారు . వీరంతా ఆ కాలం ప్రభావంతో రచనలు చేసిన వాళ్లు . తరువాత కాలంలో నిత్య జీవితంలో ఒదిగిపోయారు . వారి జీవితాలకి లక్ష్యంగా ఏ ప్రేరణా కన్పించలేదు . అరవయ్యే దశకంలో చివరి నాటికి చాలా మంది రచయిత్రులు చదువుకున్నవారు కూడా తమ వ్యాపకాలను కుటుంబాలకు పరిమితం చేసుకున్నారు , లేదా చేసుకోనేటట్లు చేసింది సమాజం.

ఇరవయ్యో శతాబ్దపు తొలిభాగంలో బ్రిటీష్ వారు పోవాలని జనం ఎన్నో పోరాటాలు , త్యాగాలు చేసి స్వేచ్చా భారతిని కలలు కన్నారు . గురజాడ బండి వాడు కూడా బ్రిటీష్ వాడు పోతే ఈ కానిస్టేబుల్ దాష్టీకం తగ్గుతుందని పిసరంత ఆశపడ్డాడు . అయితే అందరి ఆశలు నిరాశ కావటానికి ఎంతో కాలం పట్టలేదు . స్వరాజ్యం వచ్చినా ప్రజల జీవితాలలో మారింది ఏమీ లేదు . జమీందారీ రద్దుగాని , దున్నేవానికి భూమి వంటి , నినాదాలుగాని , పేద బడుగు జనాలకి ఒరగ బెట్టింది లేదు . భూపరిమితి చట్టాలు వచ్చినా అవన్నీ జమిందారుల స్థానాల్లోకి ఎక్కి వచ్చిన ధనిక భూస్వాములు బడా భూస్వాములు బినామి పేర్లతో భూములను తమ కంట్రోలోనే పెట్టుకున్నారు .

మరోవైపు మొదటి పంచ వర్ష ప్రణాళికలో నిర్దేశించుకున్న “ వ్యవసాయాభివృద్ధి , వృత్తుల పెంపుదల “ లక్ష్యం వల్ల నీటి వసతి , రవాణా సౌకర్యాలున్న తీర ప్రాంతం మరింత అభివృద్ధిలోకి రాగా మిగిలిన ప్రాంతం ఎక్కడ వేసిన గొంగళి అక్కడేగా ఉండిపోయింది . ఇది ఇలా ఉండగానే రెండవ పంచవర్ష ప్రణాళిక ప్రజల ముందుకు వచ్చింది . వ్యవసాయానికి అంతా చేసేసినట్లుగా ఈ సారి ‘పారిశ్రామికా భివృద్ధి ‘ని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు . దీనితో మిక్స్ డ్ ఎకానమి పుణ్యమాని పారిశ్రామిక రంగంలోకి వచ్చిన ప్రైవేటు పారిశ్రామిక వేత్తల హావా కొనసాగింది . వాళ్లంతా జమీలు రద్దయి భారీగా రాజభరణాలు పొందిన వారు , లేదూ ధనిక రైతాంగం నుండి వచ్చిన వారూనూ . ఆ కాలంలో ఈ వర్గం మీద చదువుకున్న మధ్య తరగతి ఆదరాభిమానాలు బాగానే ఉండేవి . కొత్తగా అభివృద్ధిలోకి , ఆధునిక శైలిలోకి వచ్చిన వీరిపట్ల అటు సినిమాలలోను , ఇటు సాహిత్యంలోను మోజు పెరిగింది . గతించిపోయిన వైభవం తాలూకా జమీందారీ ఫాయాకు గుర్తుగా వుండే పాత్రల సృష్టిలో తెలుగు నవలల సీరియళ్ళ హావా సాగింది . ఆరడుగల అందగాడు ధీరత్వం ఉట్టిపడే మగవారు వారపత్రికలచదువరుల ఊహల్లో తేలుతుండేవారు .

అప్పటివరకు తెలుగు పత్రికలన్నీ సమాజంలో వస్తున్న ఉద్యమాలకు , మార్పులకు అనుకూలంగానో , ప్రతి కూలంగానో చూపిస్తూ వచ్చాయి . ఎప్పుడైతే ఉద్యమ వాతావరణం లేకపోయిందో పత్రికలు తమ వ్యాపారాల , లాభాల వేటలో పడిపోయాయి . పత్రికా వ్యాపారం పుంజుకున్నది. అందుకు స్త్రీలు మంచి ఒనరుగా కనబడ్డారు .పైన చెప్పినట్లే కాక అందుకు భిన్నంగా సామాజిక వాస్తవాలతో వట్టికొండ విశాలాక్షి , రంగనాయకమ్మ , వాసిరెడ్డి సీతాదేవి , కె. రామ లక్ష్మి వంటి కొద్ది మంది రచయిత్రులు చైతన్యంతో కూడిన రచనలు చేసి తెలుగు సాహిత్యాన్ని సీరియళ్ళ వరద తాకిడికి అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేసారు . అయితే వారి రచనలలో కూడా స్త్రీల జీవితాలలో ఎదుర్కొంటున్న సమస్యలకు మనుషులు మంచిగా మారితే బాగుపడతాయన్న పరిమితి దృక్పదం వుండేది .

ఏది ఏమైనప్పటికీ ఊహా లోకపు మాయజాలంగానీ మరొకటి గానీ సమాజంలో వస్తున్న అశాంతిని ఏ మాత్రం అడ్డుకోలేక పోయాయి . మొదటి పంచవర్ష ప్రణాళిక గ్రామీణ , సన్న, చిన్న కారు రైతాంగం మీద ప్రభావం చూపితే రెండవ పంచవర్ష ప్రణాళిక మిక్స్ డ్ ఎకానమీ దెబ్బతో ఉద్యోగ కల్పన భ్రమా పూరితమై విద్యావంతులు , యువకుల మీద మరింత ప్రభావం చూపింది . దివాళాకోరు రాజకీయాలతో పార్లమెంటు కంపులో పది రాజకీయం కొట్టుమిట్టాడింది . జాతీయ ఉద్యమ స్ఫూర్తి గాని , సోషలిజం మాట గాని ఊహలో లేకుండా పోయింది .

ఈ నేపధ్యంలో 70 వ దశకం చివరికి అటు గ్రామీణ రైతులు , ఇటు పట్టణ రైతులు , విద్యార్ధులు తమ తమ రంగాలలో అన్నిటి పట్ల అసంతృప్తితో ఆగ్రహ పూరితులైనారు . దీనికి అంతర్జాతీయ పరిస్థితులు కూడా తోడయ్యాయి . ఫ్రెంచి విద్యార్ధుల తిరుగుబాటు , చైనా సాంస్కృతిక విప్లవం , వీరిని ప్రభావితం చేసాయి . వామ పక్ష పార్టీలలో కూడా పార్లమెంటరీ రాజకీయ మీద గొప్ప ఘర్షణ జరిగింది . నక్సల్బరీ ఆవిర్భవించింది . శ్రీకాకుళం గిరిజనులు ఆ పిలుపు నందుకున్నారు . అక్కడ నుండి రెండు దశాబ్దాల పాటు విప్లవోద్యమం అన్ని రంగాలను ప్రభావితం చేసింది .
నక్సల్బరీ శ్రీకాకుళ ఉద్యమాల తరువాత సామాజిక పరిశీలనలో మార్పు వచ్చింది . మార్క్సిజం సాహిత్యంలో చోటు చేసుకున్నది . సాహిత్యానికి , సంస్కృతికి రాజకీయాల కున్న అంతర్గత సంబంధాలను విప్లవ సాహిత్యోద్యమం విరివిగా ప్రచారంలోకి తెచ్చింది . ‘ బంబార్డ్ ది హెడ్ క్వార్టర్స్ ‘ అన్న నినాదం భారతదేశ రాజకీయ సాంస్కృతిక రంగాలలో మారుమోగింది . ఆ దన్నుతో “ తల్లీ భారతీ అంటూ “ అంతర్జాతీయ విపణిలో అంగాంగం తాకట్టు పెట్టిన అందం నీది “ అని కవి నిర్భయంగా అనగలిగాడు . అప్పటి నుండి ప్రజా పోరాటాల గురించి తప్ప మరొకటి ఏది రాసినా ప్రజల ఆమోదం పొందలేదు .

ఈ కాలంలో వచ్చిన కవిత్వం ఆంధ్రప్రదేశాన్ని ఉర్రూత లూగిస్తూ నినాదా గీతాలయ్యాయి . మార్క్సిస్టు దృక్పదంలో కొడవగంటి కుటుంబరావు , కాళీపట్నం రామారావు , రావి శాస్త్రి వంటి సుప్రసిద్ధ రచయిత లెందరో గొప్ప కథా సాహిత్యాన్ని సృష్టించారు . అయితే స్త్రీల వైపు నుండి కథా ప్రక్రియలోకి వచ్చిన లేరనే చెప్పాలి . అయితే దీనికి మినహాయింపుగా నల్లూరి రుక్మిణి 19 7 4 లో సృజన పత్రికలో “ గోరింత దీపం “ – ఎరోపు ప్రత్యేక సంచికలో “ వాన రానుంది “ కథలలో తొలి విప్లవ కధకురాలుగా నమోదయ్యారు . ఈ కథల్లో స్త్రీల సమస్యల గురించి కాక మొత్తంగా సామాజిక మార్పును కోరే ఆకాంక్ష వుంది . ఈ మె తరువాత కాలంలో సాహిత్యం మీద కంటే విప్లవోద్యమం మీద ఆసక్తితో సాహిత్య కృషి కొంత విరామం తీసుకున్నప్పటికి తదనంతరం 90 లనుండి విప్లవ కథా రచనలో తన వంతు కృషి చేస్తున్నారు . ఆమె గాక మరికొంత మంది రచయిత్రులు 90 ల తరువాత విప్లవ కథను పరిపుష్టం చేస్తున్నారు . మిడ్కో , తాయమ్మ కరుణ , షహీదా , అనురాధ మరికొందరు వైవిధ్యమైన రచనలు చేస్తున్నారు . మిడ్కో – ‘ మెట్ల మీద ‘ విప్లవోద్యమ నేపధ్యం ఉన్న కథ . ఉద్యమం నుండి బయటకు వచ్చి బయట జీవితంలో యిమడ లేక పడుతున్న ఘర్షణను చూపించింది . ఈ క్రమంలో ఉద్యమంలోని ఆటుపోట్లు తనదైన రీతిలో చూపించింది .

ఇదొక ప్రధాన పార్శ్వంగా సాగినప్పటికీ సమాజంలో భిన్న పార్శ్వాలు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి . అలా ఈ దశాబ్దంలో కూడా వచ్చిన సాహిత్యంలో స్త్రీల కథలను గమనించినట్లయితే వాసిరెడ్డి సీతాదేవి , అబ్బూరి చాయా దేవి , కె . రామలక్ష్మి , యం . ఫిరోజిమా , ఓగేటి ఇందిరా దేవి , శీలా సుభద్రాదేవి , ఆలూరి విజయ లక్ష్మి వంటి ఎందరో రచయిత్రులు స్త్రీల సమస్యలకు సానుకూల దృక్పదంలో సాంప్రదాయాన్ని ప్రశ్నించే వైపుగా చిత్రించినవారున్నారు .ఓగేటి ఇందిరా దేవి 19 7 8 లో రాసిన ‘ ఫేర్ వెల్ టు మై హస్చెండ్ ‘ అనే కథలో – భర్త పై చదువులకి వెళ్లి వేరొక ప్రాంతంలో ఉంటే పిల్లలను పెట్టుకొని చదువులు చెప్పిస్తూ ఉంటుంది . ఈ క్రమంలో భర్తని ఆశ్చర్యపరచాలన్న దృష్టితో ఓసారి అతడికి ముందుగ చెప్పకుండా అతనుండే ఊరు వెళ్తుంది . అక్కడకు వెళ్లాక తన భర్త మరొక ఆమెను వివాహం చేసుకున్న విషయం తెలుస్తుంది . దానితో అతనితో ఘర్షణ పది – ఇక నువ్వు అక్కర్లేదని చెప్పి వెళ్లిపోతుంది . రెండవ భార్య కూడా అతన్ని తనని తగలేయటంతో కథ ముగుస్తుంది . ఈ కథలో ఎవరో ఒకరు రాజీపడి అతనితో వున్నట్లు చూపించకుండా ఇద్దరూ అతన్ని చీత్కరించి నెట్టి వేసినట్లుగా చూపించటం మంచి పరిణామం .

యం . పిరోజిమా 1973 ‘ కట్నం కొద్దీ మొగుడు ‘ కథలో సరళకు పెళ్లి చేయాలనుకుంటాడు తండ్రి . ఊళ్ళో సబంధం తక్కువ కట్నానికి చేసుకుంటానన్నా తల్లి అంగీకరించదు . ఎక్కువ కట్నం ఇచ్చి చేస్తేనే గొప్పతనం అని భావిస్తుంది . ఎక్కువ జీవితం వచ్చే మరొక సంబంధానికి సరళ తండ్రి సిద్ద పడగా వాళ్లు అంగీకరించి తీరా సంబంధం ఖాయం చేసుకుందామను కునేటప్పటికి వరుడి జీతం పెరిగిందని తిరిగి ఇంకా కొంత కట్నం కావాలంటారు . మిగిలిన కట్నం సర్దుబాటు కోసం తన స్నేహితుడి దగ్గరకు వెళ్లగా అతను హితోపదేశం చేసి సరళ ను సంగీతంలోకి ప్రవేశ పెడతారు . ఆమెకు పేరు ప్రఖ్యాతలు రాగానే అంత క్రితం సంబంధం వద్దన్నా వాళ్లే ఆమెను చేసుకుంటామని వస్తారు . కాని సరళ అతన్ని తిరస్కరిస్తుంది . అలా ఈ దశకంలో స్త్రీలకు పెళ్లిళ్ళే సర్వస్వం కాదని వివాహం లేకుండా బతికే స్వేచ్చ వుందని . “ఈ దారి ముందుకే ‘,” మాకీ భర్త వద్దు “,”మాఘ సూర్య కాంతి “ వంటి కథలు భర్తల హింసలను సహిస్తూ ఉండాల్సిన అసవరం లేదని చెప్పిన కథల దగ్గర నుండి – ఇదే దశకంలో “ పుని స్త్రీ “,” తొణికిన స్వప్నం “ వంటి కథలు సాంప్రదాయాలను తిరస్కరించటం మీద విమర్శతో పాటు ఆత్మహత్యలు పరిష్కారంగా చూపిన వారు ఒకరిద్దరున్నారు . అయితే ఇది ప్రధాన సీవంతి కాదు .

ఇలా సాగిన ఈ దశకం మధ్య నుండే విప్లవోద్యమ స్ఫూర్తిలో 19 7 5 నాటికే ప్రగతి షీలా మహిళా సంఘం ఏర్పడింది . అయితే అది నిలదొక్కుకుని పని ప్రారంభించక ముందే ఎనర్జన్సీ ప్రకటించటంతో ఆగిపోయింది . ఈ క్రమంలో హైదరాబాదులో జరిగిన రమీజాబీ ఘటన ఆంధ్రప్రదేశంలో సంచలనం కలిగించింది. స్త్రీలపై అత్యాచారానికి వ్యతిరేకంగా మొదటి సారిగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఉద్యమంఇదే . దీని ప్రభావం మహిళా కార్యకర్తలపై గణనీయంగా చూపింది . నిజానికి రమీజాబీ ఘటనలో స్త్రీలపై అత్యాచారానికి వ్యతిరేక నిరసనతో పాటు , అప్పటికి ఆంధ్రదేశంలో మొత్తంగా రాజ్య వ్యవస్థ చేస్తున్న దుర్మార్గాలకు ఈ ఘటన ప్రతీకగా నిలిచి చరిత్రలో ఒక ప్రత్యేక స్థానాన్ని పొందింది . ఆంధ్రదేశంలో ఉన్న ఈ పరిస్థితులకు తోడు అంతర్జాతీయ మహిళా దశాబ్దపు ప్రకటన మరింత స్త్రీలకు ఉత్తేజాన్ని ఇచ్చింది .

ఇటువంటి సన్నివేశంలో విప్లవోద్యమం నిర్భందానికి గురి కావటం , ఉద్యమంలో చీలికలు రావటం , కార్యకర్తలలో గందరగోళం , అనుమానాలు కలగడానికి ఆస్కారం ఏర్పడింది . ఉద్యమ కాలంలో ఉండే ఏకత ఇటువంటి సందర్భంలో విభిన్నంగా చీలడం సహజమే . అట్లా విప్లవోద్యమంలో పని చేసిన కార్యకర్తలే ముందుగా మహిళా హక్కుల చర్చను సమాజం ముందు పెట్టారు . స్త్రీల చరిత్ర మీద గుర్తింపు మీద వామ పక్ష పార్టీలపై పదునైన విమర్శలు సంధించారు . ఆంద్ర ప్రదేశంలో ప్రత్యేక మహిళా సంఘాల సందడి ప్రారంభమైంది . వీటిలో కొన్ని సంఘాలకు ఏదో ఒక రూపంలో విదేశీ నిధులు సమకూరాయి .

(తరువాయి భాగం వచ్చే సంచికలో )

– నల్లూరి రుక్మిణి 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`

సాహిత్య వ్యాసాలు ​, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో