బయలుదేరిన దగ్గర్నించీ హడావిడి అయినా, శానోజే లో మా ఫ్లయిట్ గంట లేట్ కావడం వల్ల మాకు డిన్నర్ తినే అవకాశం కలిగిందని సంబరపడ్డాం.కానీ అదే గంట ఆలస్యంగా సాల్ట్ లేక్ సిటీ కి చేరడం వల్ల అక్కడ పాట్లు పడాల్సి వస్తుందని అనుకోలేదు.మా ఫ్లయిట్ పదకొండు గంటకు సాల్ట్ లేక్ సిటీకి చేరాల్సి ఉంది, కానీ డిలే వల్ల పన్నెండింటికి చేరింది.
రెంటల్ కారు పాట్లు: మేం అందరి కంటే చివరగా విమానం దిగేం. ఇక మరి కాస్సేపు బేబి కార్ సీట్, స్ట్రాలర్ వచ్చేంత వరకు వేచి ఉండాల్సి వచ్చింది. అయినా ఎయిర్ పోర్టులోనే కారు బుకింగ్ సెంటర్ లో రెంటల్ కారుని ఆన్లైన్ లో బుక్ చేసుకున్నాం కదా అని ధీమాగా, నెమ్మదిగా వచ్చి చూద్దుము కదా. అక్కడ వివిధ రెంటల్ కంపెనీల కౌంటర్ లు 10 వరకు ఉన్నాయి. అందులో మేం బుక్ చేసిన కంపెనీ కౌంటరు లో ఎవరూ లేరు. ఇక చుట్టూ వివరం చెప్పే వారెవ్వరూ లేరు. మా బుకింగ్ లో ఉన్న టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేస్తే పది నిమిషాల తర్వాత ఒక వ్యక్తి లైనులోకొచ్చి చెప్పిన విషయమేవిటంటే, వారి లెక్క ప్రకారం ఇక్కడ కౌంటర్ లో ఎవరైనా ఉండి ఉండాలి, కానీ ఏమైందో వారికీ తెలియదట. అరగంట తర్వాత మాకు అర్థమైన విషయమేమిటంటే వాళ్ళకి 12 గంటలకి క్లోసింగ్ టైమట. అంతే. ప్లయిట్ డిలే అయినా, బుక్ చేసుకున్న కస్టమర్లు వస్తున్నదీ, లేనిదీ అనవసరమనుకుని, దుకాణం కట్టేసి వెళ్లిపోయారు. ఇక మాకు మిగిలి ఆప్షను ఏవిటి? మరొక రెంటల్ కారు తీసుకోవడం. ఇక దాని కోసం తెరిచి ఉన్న మరి రెండు సెంటర్లలో ఇద్దరం చెరొక లైనులో నిలబడ్డాం. తెల్లారగట్ల పిల్లలు నిద్దర్లతో వేళ్లాడుతూ ఉన్నారొక పక్క. తీరా అలా గంట సేపు నిలబడ్డాక ముందే వాళ్ల దగ్గిర ఆన్లైనులో బుక్ చేసుకోవాలని, లేకపోతే వాళ్ల దగ్గిర సిస్టం అప్ డేట్ అవ్వదనీ, మేం అప్పుడు బుక్ చేసుకుంటే మరో గంటన్నర తర్వాత సిస్టం అప్ డేట్ అయ్యాక కార్లు ఖాళీ ఉన్నదీ, లేనిదీ చెప్తామనీ సెలవిచ్చారు.
ఇక అప్పటికి మాకూ ఓపిక అయిపోయింది. ముందు టాక్సీ మాట్లాడుకుని, బుక్ చేసుకున్న హోటలుకి వెళ్ళిపోదామని, పొద్దుట వచ్చి ఈ కారు సంగతి చూసుకోవచ్చనీ అనుకుని లగేజీ, పిల్లల్ని తీసుకుని టాక్సీ మాట్లాడుకుని బయలుదేరేం. మా హోటల్ ఎయిర్ పోర్టు నించి చాలా దగ్గర్లో ఉండడం వల్ల $10 డాలర్లలో మాకు టాక్సీ వచ్చింది. రెంటల్ టాక్సీ కోసం ఎయిర్పోర్టు లోంచి బయటకు టెర్మినల్స్ మధ్య నడిచేం. బయట ఎంత వేడిగా ఉందంటే, అంత తెల్లార గట్ల మధ్యాహ్నంలా ఉడికే వేడి. ఆశ్చర్యపోయాం. వరు అయితే “అమ్మా! ఇక్కడ సింగపూర్ లా ఉందేవిటి?” అంది. తనకి తెలిసిన మొదటి వేడి దేశం సింగపూర్. అందుకే ఎక్కడ అంత వేడి ఉన్నా “సింగపూర్” అంటుంది.
నిజానికి సాల్ట్ లేక్ సిటీ చలి కాలంలో మంచుతో కప్పబడి ఉండే ప్రదేశం. వేసవి లోనేమో ఇంత వేడి. అన్నీ ఎక్ట్రీమ్ అన్నమాట అనుకున్నాం.
తెల్లార గట్ల రెండున్నర గంటల వేళ ఇక హోటలుకి చేరుకుని ఎక్కడి వాళ్లమక్కడ దబ్బున పడిపోయాం.ఉదయం 8 గంటలకే త్వరగా తయారయ్యి ఎయిర్పోర్టు కి మరలా టాక్సీ లో వచ్చాం. పొద్దున్నైనా మా రెంటల్ కారు కౌంటరు తెరిచి ఉంటుందనే ఆశతో. హోటలుకి దగ్గర్లో ఇంకెక్కడైనా దొరుకుతాయేమో ముందు ఆరా తీసేం. హోటలు రిసెప్షన్ లో ఆ చుట్టుపక్కల ఎయిర్పోర్టు లో మాత్రమే రెంటల్ కారు ఫెసిలిటీ ఉందని చెప్పేసరికి ఇక మాకు తప్ప లేదు.
[tribulant_slideshow post_id=”13317″]
రాత్రి ఒక్క ప్రాణి లేని మా కొంటరు దగ్గిర పొద్దుటే దాదాపు 25 మంది లైను లో ఉన్నారిప్పుడు. నాకు ఓపిక బాగా నశించిపోయింది. విసవిసా వెళ్లి లైను లో ముందున్న వ్యక్తికి రాత్రి మా పరిస్థితి చెప్పి, నన్ను లైనులో అతని ముందు వెళ్లే అవకాశం కలిగించమని అడిగాను. అదృష్టం కొలదీ అతను ఒప్పుకున్నాడు. మొత్తం మూడు కౌంటర్లున్నా ఒక్క అమ్మాయే పని చేస్తూంది. అదింకా అసహనం కలిగించే విషయం. నా వంతు రాగానే నేను మేనేజరుతో మాట్లాడడానికి వచ్చాను. అని చెప్పాను. అందులో ఒకమ్మాయి ముందుకు వచ్చింది. తనకి తెల్లార గట్ల మా పరిస్థితి చెప్పి, అన్ని కౌంటర్లు తెరిచి ఉండగా, ఫ్లయిట్ డిలే అయిన వివరం తెలుసుకోకుండా మీరెలా దుకాణం కట్టేసి వెళ్లిపోతారని తగవు పెట్టేను. నేను మామూలు స్వరంతోనే మాట్లాడుతూ ఉన్నా, నా ముఖంలోని సీరియస్ నెస్ చూసి భయపడ్డట్లు, వెంటనే “సోరీ, సోరీ ఆమె సత్వరమే మీరు బుక్ చేసుకున్న వెహికిల్ ఇప్పిస్తాను” అని కూల్ చేసేసి, చకచకా కాగితాల తయారీ మొదలు పెట్టింది. ఇక అక్కడి నించి పని సత్యని పిలిచి అప్పగించాలి, నా చేతిలో పర్సు లేదు. చుట్టూ చూస్తే లైను లో చివర కనిపించాడు. దగ్గరికి రమ్మని పిలిస్తే వచ్చి “వెనక్కి పోదాం, మరలా లైనులో వద్దాం, నువ్విలా గొడవ పెట్టడం ఏవీ బాగా లేదంటాడు.” అప్పటికే కౌంటరులో మా కాగితాలు సిద్ధమైనందు వల్ల మరలా ఏమనుకున్నాడో మాట్లాడకుండా తీసుకునే పనిలో పడ్డాడు. అక్కడి నించి మరో 45 నిమిషాలైనా వెయిట్ చేస్తే గానీ మా వంతు రాలేదు. వాళ్లు కీస్ ఇచ్చేక కూడా కార్లు వరస వెంబడి ఇచ్చే కౌంటరు లో బుక్ చేసుకున్న కారు సిద్ధమయ్యే వరకూ వేచి ఉండాల్సి వచ్చింది. మొత్తానికి 10 గంటలకు మాకు మేం బుక్ చేసిన జీప్ అప్పగించేరు వాళ్లు. వెహికిల్ మాకు చాలా బాగా నచ్చింది. ముందుగా డ్రైవ్ నేనే చేస్తానని అడిగి తీసుకున్నాను. పొద్దుట్నించీ తిండీ తిప్పలూ ఏవీ లేవు. తిరిగి హోటలు కి వెళ్లేం. అప్పటికే బ్రేక్ ఫాస్ట్ సెషన్ అయిపోయింది. పిల్లలు హాట్ చాక్లోట్ కొనుక్కున్నారు.
సాల్ట్ లేక్ సిటీ టూర్: ఇక ఆ రోజంతా సాల్ట్ లేక్ సిటీ టూర్. స్వయంగా తిరిగి చూడాలనుకున్నాం కాబట్టి, హోటలు నించి కావలసిన బేగ్గులు తీసుకుని బయట పడ్డాం.
కొత్త కారు, కొత్త ప్రదేశం, అన్నీ వెతుక్కుంటూ వెళ్లడం…నాకు బాగా ఇష్టమైన విషయాలు, సత్యకి బెంబేలు పుట్టించేవీను.
ఇదంతా చక్కబెట్టుకునే సరికి పదకొండున్నర కావస్తూండడంతో ఇక ఏకంగా లంచ్ చేసేద్దామని, ముందు సాల్ట్ లేక్ సిటీ డౌంటౌన్ లో ఉన్న ఇండియన్ రెస్టారెంట్ లో లంచ్ కి వెళ్లేం. పక్క నెక్కడో సందులో పెయిడ్ పార్కింగ్ చేసి నడిచొచ్చేం. బఫే. కడుపు నిండా తిన్నాక హుషారు వచ్చిందందరికీ. హోటలులో లోపలే బల్ల ఉయ్యాలలో కూచుంటామని పిల్లలు పేచీ. హోటలు యజమాని “తప్పకుండా కూర్చోండి” అని ఆహ్వానించేడు మర్యాదకి. ఫోటోలు తీసుకుని బయటికొచ్చేక నెత్తి మాడ్చే ఎండ చుర్రున తగిలింది. అంతకు అంతా గొంతు పిడచ కట్టేసే దాహం.
సిటీ టూర్ ఇంకా మొదలెట్టకుండానే పిల్లలు దాహం అనడం మొదలు పెట్టేరు. ముందు తాగడానికి సరిపడా మంచినీళ్లు, జ్యూసులు, కూల్ డ్రింకులు, అయిస్ బాక్సు వంటివి కొనుక్కోక పోతే అడుగు కూడా వెయ్యలేమని అర్థమైంది.
దగ్గర్లో “సేఫ్ వే” ఉందేమోనని ఫోన్ లో వెతికేం. అటువంటి పేరుతో ఏవీ లేవు, ఇక మాకు తెలిసిన ఒకట్రెండు కాలిఫోర్నియా సూపర్ మార్కెట్ల పేర్లు ఫోను లో సెర్చి చేసినా ఏవీ కనబడలేదు. అప్పుడర్థమైంది. మేం కాలిఫోర్నియా నుంచి వెయ్యి మైళ్ల దూరంలో మరో రాష్ట్రం లో ఉన్నాం అని. సరే ఇక దగ్గర్లో గ్రోసరీస్ అమ్మే సూపర్ మార్కెట్ అని సెర్చ్ చేస్తే అక్కణ్ణించి దాదాపు మైలున్నర లో ఉన్న “బిగ్ లాట్స్” కనిపించింది.
అక్కడ వాటర్ ఉంటాయో లేవో, “అయినా చూద్దాం” అని బయలుదేరేం. చూడబోతే ఆ చుట్టుపక్కల అదే ఒక పెద్ద సూపర్ మార్కెట్ లా ఉంది. మరీ అన్నీ దొరకవు కానీ మినిమం వస్తువులు, ముఖ్యంగా మాకు కావల్సిన వన్నీ దొరికాయి.
అయిస్ బాక్సు కొని, చల్లగా మంచి నీళ్ళు, కూల్ డ్రింకులు ఆరారగా తాగుతుంటేనే ముందుకెళ్లగలిగేం.
“సాల్ట్ లేక్ సిటీ” యూటా రాష్ట్రపు రాజధాని. చుట్టూ పచ్చదనం లేని రాతి కొండల మధ్య ఎత్తైన కట్టడాలు మొలిచినట్లున్న అందమైన నగరం. అంతకంతా విలక్షణమైన నగరం కూడా. ఎత్తైన ఆధునిక భవంతుల నడుమన గోడలన్నీ అడ్డదిడ్డంగా గీసేసి ఉన్న గ్రాఫిక్ ఆర్ట్ లు అడుగడుగునా సందర్శనమిస్తాయి.
ఒక విధంగా దీనిని “చర్చ్ సిటీ” అనొచ్చనుకుంటా. ఇక్కడ టెంపుల్ స్క్వేర్ లో ఉన్న చర్చిల ప్రాంగణం చూసేక, ఇక్కడ మొత్తం జనాభాలో సగం మంది ఆ చర్చికి సంబంధించిన వాళ్లేనని తెలుసుకున్నాక ఆ మాట నిజమనిపించక మానదు.
టెంపుల్ స్క్వేర్ : ముందుగా ప్రధాన సందర్శనీయ స్థలమైన టెంపుల్ స్క్వేర్ కి వెళ్లేం. దగ్గర్లో పార్కింగు దొరకలేదు. రెండు మూడు సిగ్నళ్లకవతల పార్కు చేసి ఎండలో నడక మొదలెట్టాం.
నాకు మా చిన్నప్పుడు వేసవిలో మేం ఓరుగల్లు చూడడానికి వెళ్లి, చుర్రున కాలే ఎండలో ఏకశిల ఒక్క పరుగున ఎక్కడం జ్ఞాపకం వచ్చింది.
అందమైన రోడ్లనీ, సందడిగా తిరుగుతూన్న మనుషుల్ని, రోడ్ల పక్క షాపింగ్ కాంప్లెక్సుల్ని చూసుకుంటూ హుషారుగా నడిచేం. టెంపుల్ స్క్వేర్ లో నార్త్, సౌత్ ఎంట్రన్సుల గేట్ల మధ్య విశాలమైన చర్చి భవనాలు, ఎత్తైన చెట్లు, ఎక్కడ చూసినా వచ్చిన వారిని నవ్వుతూ పలకరించి మాట్లాడే కార్య కర్తలు. మేం ప్రవేశించిన సౌత్ గేట్ కి కుడి వైపు మ్యూజియం అని కనిపిస్తే లోపలికి వెళ్లి చూసొచ్చాను.
18 వ శతాబ్దిలో టెంపుల్ స్క్వేర్ ఆవిర్భావం దగ్గర్నించీ, అక్కడ ఉన్న “మొర్మాన్” అనే మత శాఖా విస్తరణ వివరాలన్నీ ఎగ్జిబిట్స్ లో ఉంచారు. ఇక ఆ ఆవరణలో ఉన్న ప్రతీ ఒక్కటీ గొప్ప అందమైన విశేషాలని చెప్పదగిన రకరకాల పద్ధతుల్లో కట్టిన కట్టడాలే చెబుతున్నాయి. రకరకాల ప్రార్థనా మందిరాలు. ఒక హాలు గుండ్రంగా ఉంటే, ఒక హాలు చతురస్రంగా, ఏ హాలు లోకి వెళ్ళినా విశాలమైన ప్రాంగణం, ఎత్తైన స్టేజీ, చుట్టూ వేల మంది కూర్చోవడానికి వీలుగా వలయాకారంలో సీటింగ్. అడుగు పెట్ట గానే గొప్ప ప్రశాంతమైన భావన.
“మొర్మాన్” మత శాఖ 18 వ శతాబ్దంలోనే ప్రారంభమైనా చాలా చురుగ్గా పాదుకొంది. ఇక్కడి టెంపుల్ స్క్వేర్ ప్రధాన కేంద్రం. ప్రపంచ వ్యాప్తమైన LDS చర్చి విధానాలు వివరించే కార్యకర్తలు వచ్చిన వారిని ప్రశ్నలున్నాయా అని అడగడం, త్రోవ చూపించడం చేస్తున్నారు. దాదాపు గంట పైనే పట్టిందవన్నీ చూడడానికి. నేను ఆసక్తిగా అవన్నీ అడిగి తెలుసుకుని వచ్చేటప్పుడు “బుక్ ఆఫ్ మార్మన్” ఒక కాపీ అడిగి తెచ్చుకున్నాను.
ఒక పక్క ఎండ, మరో పక్క ముందు రోజు రాత్రి నిస్సత్తువ పిల్లల్లో కనిపించింది.మేం తెచ్చుకున్న నీళ్ళు అయిపోయి, టెంపుల్ స్క్వేర్ లో కనబడ్డ చోటల్లా చల్ల నీళ్లు పట్టుకుని తాగేం. గంటలో తలా ఒక రెండు మూడు బాటిళ్ల నీళ్ళు తాగి ఉంటాం.అక్కడి నుంచి దగ్గరలో స్టేట్ కాపిటల్ బిల్డింగ్, సిటీ హాల్ లు బయటి నుంచే చూసేం.ఈగిల్ గేట్ మాన్యుమెంట్ రోడ్డు పక్కన పార్కు చేసి చూసేం.ఇక సిటీ లో కెల్లా పెద్ద పార్కు “లిబర్టీ పార్కు” లో ఎక్కడా ఆగేందుకు పార్కింగ్ దొరక్క పోవడంతో అక్కణ్ణించి వెంటనే బయలుదేర వలసి వచ్చింది.
గ్రేట్ సాల్ట్ లేక్: ఇక సిటీ ని వదిలేసి అసలా ఊరికి ఆ పేరు రావడానికి కారణమైన “గ్రేట్ సాల్ట్ లేక్” ని చూద్దామని బయలు దేరేం.
గ్రేట్ సాల్ట్ లేక్ 75 మైళ్ళ పొడవు, 30 మైళ్ళ వెడల్పు కలిగిన గొప్ప ఉప్పునీటి సరస్సు. పశ్చిమ ఖండాంతరాళం లో కెల్లా అతి పెద్ద ఉప్పునీటి సరస్సు.లేక్ కు వెళ్ళే పక్క త్రోవలో “సాల్టేయిర్” కాన్సర్ట్ బిల్డింగ్ బయటి నుంచే చూసేం. అదే పేరుతో 19 వ శతాబ్దంలో ఇక్కడ గొప్ప రిసార్టు లు ఉండేవట. ఇప్పుడు మూడవ సారి నిర్మించ బడ్డ “సాల్టేయిర్” ప్రస్తుతానికి కాన్సర్ట్ బిల్డింగ్ గా కొనసాగుతూ ఉంది. బయటి నించి ఆ కట్టడం చూడడానికి “గురుద్వారా” లా అనిపించింది.
ఇక సరస్సు దగ్గర కెళ్ళాం. అదేదో అందమైన సరస్సని భ్రమ పడ్డ మాకు తీరా చూసేసరికి అక్కడున్న చిన్న విసిటింగ్ సెంటర్ నించి లేక్ వైపు దిగే సరికి భయంకరమైన దుర్వాసన, అతి చిన్న జుమ్మని మూగే వేల ఈగలతో చెత్త చెత్త గా ఉన్న సాల్ట్ లేక్ తీరం ప్రత్యక్షమైంది. ఎందుకంత నిర్లక్ష్యం గా వదిలేసేరో బొత్తిగా అర్థం కాలేదు నాకు.ఒక్క నిమిషం ఆగి లేక్ ని పరిశీలించే అవకాశం లేదు ఒడ్డునెక్కడా.అందులోనే కొందరు చక్కగా లోపలికి నీళ్ళలోకి నడిచెళ్ళి స్విమ్మింగ్ చేసేస్తున్నారు.ఒడ్డున అక్కడక్కడా చచ్చి పడి ఉన్న పక్షులు, మురిగిన వాసన కొడుతున్న గడ్డి, అన్నిటినీ మించి చెవుల్లో, ముక్కుల్లోకి ఎక్కడ వెళ్లిపోతాయోననిపించే చిన్న ఈగల గుంపుల నించి ఒక్క ఉదుటున మరలా వెనక్కి పరుగెత్తుకొచ్చేం.పిల్లలు ఇంకాస్సేపు ఉందామని కాస్త ఈ వలగా చిన్న రాళ్ళలో ఆట మొదలెట్టేరు.
మాకిక అక్కడ ఎక్కువ సేపు గడపడం ఆరోగ్యకరం కాదనిపించి పది నిమిషాలలో వెనక్కి బయలుదేరదీసేం.అక్కడి నించి రోడ్డు కవతల ఎదురుగా పెద్ద గొట్టాలతో సాల్ట్ రిఫైనరీ అనుకుంటా కనిపించింది.ఇక్కడ దొరికే శుద్ధి చేసిన ఉప్పు చిన్న బాక్సుల్లో సావనీర్ గా అమ్ముతూంటే కొనితెచ్చుకున్నాం.అప్పటికే సాయంత్రం కావచ్చినా వేసవి పొద్దు కావడంతో ఎండ ఇంకా దేదీప్యమానం గా మండుతూంది.ప్లానిటోరియం: మరలా డౌంటౌన్ కి ఆరుగంటల ప్రాంతంలో తిరిగి వచ్చాం. ఈ సారి పిల్లల కోసం ప్లానిటోరియం కి వెళ్లేం.తీరా అక్కడ షోలు వంటివేవీ లేవు ఆ రోజు. ఎగ్జిబిట్లు తప్ప. అయినా పిల్లలతో సమానం గా అన్ని ఎగ్జిబిట్లూ చూసి ఆనందించాం. ముఖ్యంగా చంద్రుడిపైకి, మార్స్ పైకి వెళ్లొచ్చినట్లు భ్రమింపజేసే ఎగ్జిబిట్ల దగ్గిర ఫోటోలు తీసుకున్నాం.అక్కడి నించి బయటి కొచ్చిన దారిలో సన్నని సందు లో ఉన్న రెస్టారెంట్ల నడుమ చల్లని వాన తుంపర్లు చిమ్మే యంత్రాలున్నాయి. అవెక్కడ స్ప్రింకిల్ చేస్తే అక్కడికి పరుగెత్తి కూచోవడం, మరలా లేవడం చేస్తూ పిల్లలతో హాయిగా నవ్వుతూ ఆడుకున్నాం.చీకటి పడే వేళ వరకూ సాల్ట్ లేక్ సిటీ వీధుల్లో తిరిగి అక్కణ్ణించి మరో 20 మైళ్ళ దూరం లో ఉన్న సౌత్ ఇండియన్ రెస్టారెంటుకి డిన్నర్ చేయడానికి వెళ్ళేం. ఇడ్లీలు, వడలు తిని రాత్రి పదిగంటల వేళ తిరిగి హోటల్ కి చేరుకున్నాం.మర్నాడు అక్కణ్ణించి మూడు , నాలుగొందల మైళ్ళు ప్రయాణించి మా ప్రయాణంలో అసలు చూడాలనుకున్న యెల్లోస్టోన్ కి పెందరాళే బయలుదేరాలి.మొత్తానికి ఉదయమంతా చాలా టైము మాకు కారుకోసం వేస్ట్ అయినా, చూడాలనుకున్న వన్నీ చూసి, రోజు బాగా గడిచినందుకు సంతోషించాం.
– డా. కె.గీత
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~