దీపం ఆరకముందే చక్కదిద్దుకో…

santhi prabodha మొబైల్ ఫోన్ మళ్ళీ మళ్ళీ మోగుతోంది.  ఆ చప్పుడికి మెలకువ వచ్చిన సులేఖ అబ్బ అప్పుడే తెల్లారిపోయిందా అనుకుంటూ మూసుకుపోతున్న కళ్ళని విప్పార్చే ప్రయత్నం చేస్తోంది.  ఆమె కళ్ళు విడివడడంలేదు.  కళ్ళు బరువుగా మూసుకుపోతున్నాయి.  రాత్రి ఒంటి గంట వరకూ కంప్యూటర్ లో పనిచేసుకుంటూ ఉంది.  నిద్ర  మధ్యలో లేచిన అత్తగారు రేపు ఆదివారమే కదా!   పడుకోమ్మా సులేఖా అంటూ కేకేసేవరకు సమయమే చూసుకోలేదు.   పూనాలో ఈ మధ్యే ఉద్యోగంలో చేరిన ఆమె కొడుకు సుబోధ్  వీకెండ్ అని నిన్న ఉదయం వచ్చాడు. వాడు గ్రాఫిక్స్ చేసుకుంటుంటే తానూ పనిలో పడిపోయింది. నిద్ర చాలలేదు. కళ్ళు మండుతున్నాయి. రెప్పలు మూసుకు పోతుంటే అలాగే చేత్తో తడిమి ఫోన్ ఆదుకుంది సులేఖ.

అవతల నుండి హలో అని అపరిచిత కంఠం.  మగ వారిది.
‘హలో ఎవరూ.. ‘ అడిగింది.
కొద్ది క్షణాలు మౌనం  తర్వాత ‘హలో ఎవరండీ .. ఏమీ వినిపించడం లేదు ‘ చెప్పింది సులేఖ
‘మీరెవరు ?’ అవతల్నుంచి ప్రశ్న
‘అదేంటి నన్నడుగుతున్నారు ? ఫోన్ చేసింది మీరు.  ఎవరికి  చేశారసలు ?’ తెల్లబోయిన ఆమె నిద్రమత్తు వదులుతుండగా
‘నీకే ‘

ఏకవచన ప్రయోగం గుర్తించినా ‘ నాకా ..? అసలు మీరెవరు ? ‘ అవతలనుండి సమాధానం లేదు. ‘నాన్చుడు ఆపి ఎవరో చెప్పండి ‘ కొంచెం విసుగు ధ్వనింపజేస్తూ అని మండుతున్న  కళ్ళు మూసుకుంది.
‘నీ ఫ్రెండ్ ని ‘ నొక్కి పలుకుతూ అవతలనుండి
‘నా ఫ్రెండా …’ ప్రశ్నార్ధకంగా నొక్కి పలికింది. ఎవరో తెలియడం లేదు . మైండ్ వేగంగా పరుగుపెడుతోంది ఆ గొంతుని గుర్తించడానికి.  తెలియడం లేదు. ఎప్పుడూ ఆ గొంతు విన్న గుర్తు లేదు.

‘ఎవరో చెప్పకుండా ఏంటయ్యా నీ నస .. ‘ విసుగుతో కసిరింది
‘నేనా … నా పేరు .. ఊ .. రాజు . నీతో స్నేహం చేద్దామని..  ‘ నసుగుతూ
మొదటి నుండి చూస్తోంది అతని ఏకవచన ప్రయోగం.  ఫ్రెండ్ నంటూ ముక్కూ మొహం తెలియని వీడెవడ్రా బాబూ పొద్దున్న పొద్దున్న అనుకుంటూ ‘ఎవరో తెలియకుండా ఎవడు  బడితే వాడితో నేనట్లా స్నేహం చేస్తానయ్యా ..? ముందు పెట్టేయ్యి ఫోను  ‘ గద్దించి లైన్ కట్ చేసింది.

                          మళ్లీ మళ్లీ రింగవుతూనే ఉంది.  అదే నంబరు నుండి .  అప్పటి వరకూ బద్దకంగా బెడ్ పై అటూ ఇటూ పొరుల్తున్న సులేఖ టైం చూసింది. ఉదయం 6. 15.  ఇక పడుకున్నా నిద్ర పట్టదు.  అనుకుంటూ రెండు రోజుల్లో పంపాల్సిన సెమినార్ పేపర్ గురించి ఆలోచిస్తోంది. కొద్ది క్షణాలు అలా పడక మీదే దొర్లి లేచింది. జుట్టుని బ్రష్ చేసి రబ్బర్ బ్యాండ్తో బిగించింది. కప్పుకున్న బ్లాంకెట్ మడత పెట్టి బెడ్ పై దుప్పటి సరి చేస్తోంటే ఫోన్ మళ్ళీ రింగవుతోంది. చూసింది అదే నంబరు నుండి.  కాల్ తీసుకోలేదు. అలా మోగుతూనే ఉంది. చివరికి విసుగొచ్చి ‘ ఎవరయ్యా నువ్వు , పనీ పాటా లేదా .. ‘ గట్టిగానే కసిరింది.

                        ‘నీతో స్నేహం చేస్తానంటే అట్లా కసురుతావేం  డియర్ ?’ కమాండింగ్ గా  అని ‘ నీ  మనసులో మాట పంచుకోవడానికి నీకు నేనున్నా..  ‘  కొంచెం గుసగుసగా అవతలనుండి  సర్రున పొంగుకోచ్చే కోపాన్ని తమాయించుకుంటూ ‘నాకా అవసరం లేదు’ అంటూ  లైన్ కట్ చేసింది. మళ్ళీ రెండు మూడు సార్లు మొబైల్ మోగి ఆగిపోయింది. ఆ వెంటనే మెసేజ్ .ఆ నంబరు నుండే ‘ఎప్పుడయినా అవుసరం రావచ్చు. నీకు నేనున్నా. మర్చిపోకు ‘ అంటూ
పని పాటా లేని వెధవలు. ఏదో ఒక నంబరుకి ఫోన్ చేసి స్నేహం చేయమని వేధించడం , ఆడపిల్లల్ని ప్రేమ పేరుతో మోసగించడం ఎక్కువయిపోతోంది.  మనసులోనే తిట్టుకుంది. ఆ తర్వాత ఉదయం పనుల్లోనూ, ఆదివారపు ప్రత్యేక పనులలోను బిజీగా ఉండడంతో ఆ విషయమే మరచి పోయింది సులేఖ. 

                    సాయంత్రం మార్కెట్లో కూరగాయాలు బేరం చేస్తుండగా మోగింది ఫోన్. ఎవరిదో ఫోన్ నంబర్ చూడకుండానే హలో అంది. అవతలనుండి అదే గొంతు. ఉదయం వచ్చిన కాల్స్ మదిలో మెదిలాయి.
‘మీరెవరైనా కానీ , మీతో స్నేహం చేసే ఇంటరెస్ట్ నాకు లేదు .  నా పనుల్లో నేను బిజీగా ఉన్నాను డిస్ట్రబ్ చేయకండి ‘ అని ఆ ఫోన్ ని అలా ఉంచేసింది.  కొద్ది క్షణాల తర్వాత కాల్ కట్ అయింది.  ఆ వెంటనే మళ్ళీ మోగింది.  కాల్ తీసుకోక పోవడంతో రెండుసార్లు మోగి ఆగిపోయింది. 

                                 అర్దరాత్రి మంచి నిద్రలో ఉంది. ఫోన్ మోగుతోంది. ఈ సమయంలో ఎవరు చేసుంటారు..ఆమె మనసు ఆలోచిస్తోంది.  పెద్ద నాన్నకి బాగోలేదని, నమ్మకం తక్కువని రెండు రోజుల క్రితం అన్నయ్య చెప్పిన విషయం సులేఖ గుర్తొచ్చి ఉలిక్కి పడింది.  ఆయనకు ఏమీ కాలేదు కదా .. గుండె దడ దడ లాడింది. వెళ్ళి చూసిరావాలని రోజూ  అనుకుంటూనే ఉంది. ప్చ్ .. వెళ్ళనే లేదు. మనసు బాధగా మూలుగుతుండగా చిన్ననాటి నేస్తం సరోజ వాళ్ళ ఆయనకి మాములు జ్వరమేనని అనుకుంటే అది సెలెబ్రెల్ మలేరియా అనీ,  పరిస్థితి విషమించిందని నమ్మకం తక్కువని సాయంత్రం సరోజ కూతురు బోరుమంటూ చెప్పిన మాటలు గుర్తుకు రాగానే ఏ దుర్వార్త వినాల్సి వస్తుందోనని దిగాల్న లేచి ఒక్క ఉదుటున ఫోన్ అందుకుంది.  నంబరు చూసింది. అదే నంబర్. ఉదయం నుండి విసిగిస్తున్న నంబర్.   అయినా ఈ వెధవలకి ఇదేం పాడుబుద్దో ..? అని తిట్టుకుంటూ ఫోన్ మ్యూట్ లో పెట్టి పడుకుంది.  నిద్రపట్టడం లేదు సులేఖకి. కొన్ని క్షణాలు ఎంత గాభరా పడింది. మనసు ఎంత వేదన అనుభవించింది.  బాధపడింది పెద్దనాన్నని చూడలేకపోయానే అని. స్నేహితురాలికి ఆపదలో దగ్గరలేకపోయానే అని.  ప్చ్ ఎప్పుడూ ఏవో పనుల వత్తిడి.  నిట్టూర్చింది సులేఖ . అయిన వాళ్ళని మిస్ అవుతున్న ఫీలింగ్ ఆమెను కుదిపేస్తోంది. రేపు ఎలాగయినా వీలుచేసుకుని వెళ్లి సరోజని , పెదనాన్నని చూడాలని ఒక నిర్ణయానికి వచ్చి కళ్ళుమూసుకుంది. ఎప్పటికో నిద్రలోకి జారుకుంది.

                           మరుసటిరోజు ఉదయం లేచి చూసే సరికి 15 మిస్డ్ కాల్స్.  చివరగా ఒక మెసేజ్. ‘నాతో స్నేహం చెయ్యి. ఎప్పటికైనా నీకు ఉపయోగపడతాను. నీవు ఎవరితో చెప్పుకోలేని బాధలు నాతో పంచుకోవచ్చు. నువ్వు ఒంటరివి కావు. నీకు నేనున్నా .. ‘ మెసేజ్.

                            వీడి బండబడ ,ఈ వెధవలకి ఇదేం ఆనందమో ..? నాకు నీ స్నేహం వద్దు పోరా అంటే వినడు చిన్నగా నవ్వుకుని తింగిరి వెధవ తింగిరి ఆలోచనలు.  నా మనసులో బాధో , దుఃఖమో , సంతోషమో, ఆనందమో ఏదైనా  వాడితో ఎందుకు పంచుకుంటాను. నేను ఒంటరినట! ఎవడు చెప్పాడో వీడికి?  నాకింత ఆత్మీయులుండగా నేను ఒంటరినా .. మనసులోనే నవ్వుకుంది.  నాకు నా వాళ్ళు లేకపోతే కదా..  ఇలాంటి వాళ్ళ అవసరం.. ఈ మధ్య కొందరు అమ్మాయిల పేర్లు, అబ్బాయిల పేర్లు వారి ఫోన్ నంబర్ ఇచ్చి ఒంటరిగా ఫీలయితే వాళ్ళకి ఫోన్ చెయ్యమని వారితో కాసేపు మాట్లాడితే స్వాంతన చేకూర్చే మాటలు చెప్తారని వచ్చే మెసేజ్ లు గుర్తొచ్చాయి.   అత్తగారి పలకరింపుతో ఆ విషయం ఆలోచనల నుండి పక్కకు పోయింది. ఆమె  ఇంటిపనిలో పడిపోయింది.

                          రాత్రి భోజనాలయి టేబుల్ శుభ్రం చేస్తుండగా కాల్. అమెరికాలో ఉంటున్న కూతురు సుధీర కొద్దిగా ఆగి ఫోన్ చేస్తానమ్మా .. ఈ రోజు ఇంట్లోనే ఉంటాను. లాంగ్ వీకెండ్ అని చెప్పి రెండు గంటలు  దాటింది.  అనుకొంటుండగా  వచ్చింది ఆ కాల్. తననుండేనేమోనని గబగబా వచ్చి చార్జింగ్ లో ఉన్న ఫోన్ కేబుల్ తీసేసి  కాల్ తీసుకోబోతూ చూస్తే  వాడి నుండి.  ఆమెకు చాలా చిరాగ్గా అనిపించింది.  వద్దంటుంటే కాల్స్ చేస్తూ తన  టైం తినేస్తున్నాడని.  ఆలోచనల్లోకి బలవంతంగా చొచ్చుకొస్తున్నాడని. 

                                 తను పెంచే కుండీల్లో విరగ బూసిన గులాబీలను ఆదివారం సాయంత్రం తీసిన ఫోటోలను వాట్సప్ లో కూతురికి, చెల్లెలుకి మెసేజ్ చేసింది సులేఖ. ముందురోజు సాయంత్రం బయలుదేరి వెళ్ళిన కొడుకు భోజనం అయిందో లేదోనని మాట్లాడి పెట్టేసరికి  బీప్ మంటూ మెసేజ్. వాడి నుండే ‘ డార్లింగ్ నీతో మాట్లాడాలి. చాలా మాట్లాడాలి. ఫోన్ తియ్’ అంటూ . డార్లింగ్ అట డార్లింగ్ .. ఎవడసలు వీడు పిచ్చి ముదురుతోంది. ఎవరో ఎట్లా గుర్తించేది.  ఆలోచిస్తోంది. ఇంతలో సుధీర ఫోన్ రావడంతో ఆ ఆలోచన కట్టిపెట్టి కూతురితో కబుర్లలో పడిపోయింది. ఆ కాల్ ముగించే సరికి ఐదు మిస్డ్ కాల్స్ వాడి నుండే.  కొంచెం సేపు భర్తతో మాట్లాడింది. మాట్లాడుతోందే కానీ ఈ విషయం చెప్పాలా వద్దా మీమాంస. చెప్తే ఎలా స్పందిస్తాడు. ఒక్కడే ఎక్కడో దూరాన ఉన్నాడు. పనుల ఒత్తిడిలో ఉన్నాడు. ఇప్పుడు ఈ విషయం చెప్తే ఆందోళన పడతాడు. ఎందుకులే.. వాడి సంగతి తనే తెల్సుకుంటుంది అని తనకు తాను చెప్పుకుందామే.

                        బయట డోర్ లాక్ చేసి అత్తగారికి మంచం దగ్గర మంచినీళ్ళ జగ్గు పెట్టి వచ్చి నిద్ర కుపక్రమించింది సులేఖ.  నిద్ర పట్టడం లేదు.  ఈ ఫోన్ చేస్తున్నదెవరు ? ప్రశ్న .. ఎవరో ముక్కూ మొహం తెలియని ఆకతాయి పనా .. ఎవరైనా తెలిసినవాళ్ళే కావాలని చేస్తున్నారా ..ఎన్నెన్నో  ప్రశ్నలు రక్తనాళాల్లా విస్తరిస్తూ. ఆకతాయి వెధవ కాదేమో … తెలిసిన వాళ్లేనేమో .. ఏవేవో సందేహాలు వేగంగా పరుగులు పెడుతూ .

                      మొన్నీమధ్య గంగామణి అనే అమ్మాయిని ఎవరో పోకిరీ వేధిస్తుంటే అతనికి గట్టి వార్నింగ్ ఇచ్చింది కదా .. వాడేమన్నా ఆ కక్షతో ఇలా చేస్తున్నాడా ..?  అయిన వాడికి కాని వాడికి ఆడది ఒంటరిగా కనిపిస్తే చాలు లోకువేనన్న  అమల మాటలు మనస్సులో మెదిలాయి.  అమల మంచి అందగత్తె. అందానికి తోడు ఆమె చలాకితనం , చొచ్చుకుపోయే గుణం ఎందరికో ఇస్టురాల్ని చేస్తే,  అంతకంటే ఎక్కువమంది ఆమె వెనుక చిత్కరిస్తారు.  కారణం దుబాయిలో ఉండే ఆమె భర్త రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదించి పంపుతే ఇది ఇక్కడ ఈమె షోకులు చేస్తోంది, విచ్చల విడిగా తిరుగుతోంది, మగవాళ్ళకు ఎర వేస్తోందనే  అభియోగం.  అమల గురించి రకరకాల వ్యాఖ్యానాలు విని ఉంది.  అందరితో కలివిడిగా ఉంటూ తనకో వ్యాపకం కల్పించుకుంటూ, ఒంటరితనం దూరం చేసుకునే ఆమెను అనవసరంగా పనిపాటా లేని వాళ్ళు ఆడిపోసుకుంటున్నారని వాదిస్తుంది సుధీర.  ఆ వాదనని ఒప్పుకోని సులేఖ నిప్పులేనిదే పొగవస్తుందా అనుకునేది. అకస్మాత్తుగా సులేఖలో తొంగి చూసిందో ఆలోచన .   అమలని కూడా ఎవరైనా ఇలాగే ఫోన్ లోనో శారీరకంగానో, మానసికంగానో  వేధించలేదు కదా .. ఒకవేళ ఏదైనా ఒక బలహీన క్షణంలో ఆమె లొంగి పోలేదు కదా … ఆ తర్వాత ఆమెను బ్లాక్ మెయిలింగ్ చేయడం లేదు కదా..  ఇంతింతై వటుడింతై అన్నట్లు ఏవేవో  ఆలోచనలు విస్తరిస్తూ..   అంతలోనే అవన్నీ తన ఊహేనేమో.. ! ఏమో .. ఏదైనా కావచ్చు కదా.. వీస్తున్న గాలివాటుని బట్టి రెప రెపలాడే గాలిపటంలా సులేఖ మనసు పరిపరి విధాలా ఆలోచిస్తోంది. 

                              ఒంటరిగా ఆడది కనిపిస్తే చాలుఈ మగాళ్ళు లాగులు తడుపుకుంటారు.  నడివయసులో ఉన్న తనకే ఇలా ఫోన్స్ చేస్తుంటే, మెసేజ్ లు పంపుతూ వేదిస్తుంటే  వయసులో ఉన్న ఆడపిల్లల పరిస్థితి ..? వివిధ కారణాల వల్ల పెళ్ళయి ఒంటరిగా ఉండేవారిని, భర్తకు దూరమయిన వారిని ఈ మగవాళ్ళు ఏ దృష్టితో చూస్తారో అర్ధమవుతోంది. వాళ్ళకసలు తమ అమ్మ, అక్క , చెల్లి , భార్య, కన్న కూతురు కూడా ఆడవాళ్లే నన్నసంగతి స్పృహలో ఉండదా .. ?  హు .. ఉంటే అలా ఎందుకు ప్రవర్తిస్తార్లే ..ఎంతమంది  నిర్భయలు, శ్రీలక్ష్మిలు ఉన్నారో  కనబడడంలా .. పాములతో బెదిరించి ఆడపిల్లను లొంగ దీసుకొని అత్యాచారం చేసి ఏదో ఘనకార్యం చేసినట్లు ఆ వీడియోలను యూ ట్యూబ్ ద్వారా బయటి ప్రపంచంలోకి పంపిస్తున్న స్నేక్ గ్యాంగ్ ఆగడాలు వినడంలా అనుకుంది.. ఆమె మనసు ఎటునుండి ఎటో ప్రయాణిస్తూ ఆలోచిస్తోంది.  పెద్ద శిక్షలు ఉంటాయని తెలిసినా ఇంకా ఆడపిల్లపై శారీరక, మానసిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఏమిటి మగవాడి చంచల మనస్తత్వం?  ఆలోచిస్తోంది సులేఖ.  అంతకు ముందెప్పుడూ ఈ విధంగా ఆలోచించలేదు.  అమలనే తప్పుగా అనుకునేది.  ఇప్పుడు మరో కోణంలోంచి ఆలోచన . నాన్న , అన్న, తమ్ముడు, భర్త, కొడుకు, మామలు, మేనల్లుళ్ళు ఎందఱో ఉన్నారు తనకీను. వాళ్ళూ ఈ పనికిమాలిన పోరంబోకు వెధవలాగే ఆలోచిస్తారా ..? వాళ్ళూ మగవాళ్ళే కదా .. ? ఏమో .. ఎవరు చెప్పగలరు .?!. ఒక వేళ తన భర్తే ఇలా చేయడం లేదు కదా .. ఏ మూలనుండో సందేహం ముందుకు తోసుకొచ్చింది.  ఛ ఛ ఆయనెందుకు చేస్తాడు ..? తనపై చంద్రకి ఏమన్నా అనుమానం ఉందా .. ఏమో ఎప్పుడూ  అలా కనపడలేదు అంటున్న ఆమెను మనస్సు ఆపింది. ఇంటికి ఆలస్యంగా ఎప్పుడు వచ్చినా బెల్ కొట్టేవాడు కాదు.

    ఒక్కోసారి ఒక్కో డోర్ దగ్గరకి వచ్చి తలుపు కొట్టేవాడు. మంచి నిద్రలో ఉన్న తను వెంటనే తలుపు తీయకపోతే ఇప్పటిదాకా ఏం చేస్తున్నావ్..? అంటూ ఏదో గొణగడం లీలగా గుర్తొస్తోంది. అప్పుడు నిద్ర మత్తులో వింది. అసలా మాటలు నిద్రలోవా .. నిజంగానా అర్ధం కాలేదు.  అవును, తను విన్నది నిజమే. చంద్రలో ఏదో తేడా వస్తోంది.  కానీ ఎప్పుడూ సూటిగా అడగలేదే.  ఆ ప్రస్తావన తేలేదే.  ఇద్దరికీ ఏడెనిమిదేళ్ళ తేడా వయసులో. కోరికలున్నాయి కానీ ఆ… శక్తి సన్నగిల్లుతోంది అతనిలో.  దానికి తోడు పనుల వత్తిడి ఎక్కువైంది.  అందుకే అలా ప్రవర్తిస్తున్నాడా .. మాములుగా చాలా ప్రేమగా ఉంటాడు. పిల్లలకీ, తనకీ ఏలోటు రానివ్వలేదు ఇంతవరకూ.  తనూ చంద్రని అట్లాగే ప్రేమించింది.  ఛ ఛ తను తప్పుగా ఆలోచిస్తోంది.  తన చంద్ర తనకి అలాంటి మెసేజ్లు ఎందుకు పెడతాడు ?  ఈ ఫోన్ నంబర్ ఎవరిదో ఎలా తెలుసుకోవాలి.. అన్నయ్యకి చెప్తే .. ఊహు వాడసలే కోపిష్టి .. పోలీసులకు చెప్తే .. ఒక వేళ ఈ మెసేజ్ లు పెట్టేది, ఫోన్ చేసేది చంద్ర అయితే .. కుటుంబ పరువు పోదూ .. వద్దు వద్దు .. మరి ఎలా ..  తప్పుగా ఆలోచిస్తున్నావ్ సులేఖా .. అలా కప్పిపుచ్చ బట్టే కదా .. నిశ్చబ్దంగా భరించడం వల్లే కదా .. పరువు ప్రతిష్ట పేరుతో నిందితుల్ని కాపాడుతుండడం వల్లే  కదా వాళ్ళు మరింత పెట్రేగిపోతున్నారు. ..మొట్టి కాయవేసింది మనస్సు. 

                      అవును, నిజమే,  తప్పును తప్పుగా చూపక పోవడం వల్లే, నిందితుల్ని శిక్షించక పోవడం వల్లే రకరకాలుగా లైంగిక వేధింపులు ఆడవాళ్ళపై జరిగేది … అవును నిజం .. ఆ స్పృహ ఉన్నవాళ్ళ వల్లే జస్టిస్ స్వతంత్ర కుమార్, జస్టిస్ ఎ. కె. గంగూలీ,‘తెహల్కా’ ఎడిటర్ తరుణ్ తేజ్ పాల్ ఉదంతాలు బయటికొచ్చాయి దుప్పటి ముసుగు పెడుతూ అనుకుంది సులేఖ. 

                           అయినా, ఆడవాళ్లంటే మగాళ్ళకి అంత వ్యామోహం ఎందుకో .. ? అది ఇప్పటిదా .. పురాణ కాలం నుండి ఉన్నదేగా ..  ఈ మధ్యే చదివిన మత్స్యగంధి, పరాశరుని కథ కళ్ళముందు కదలాడింది. ఒక నిర్జన ప్రదేశంలో ఒంటరిగా కనిపించిన  మత్స్యగంధిని చూసే చూపులతో, కలిగే లైంగిక ఆలోచనలతోను  పరాశురుడు నిస్సిగ్గుగా ఆమె వెంటబడి తన కోరిక తీర్చుకున్నాడు.   ఇప్పుడు  జరిగేదీ అంతేకదా … దేశ రాజధాని నడిబొడ్డునే అమ్మాయిలకి భద్రత లేదు. స్వేచ్చ లేదు. మగాళ్ళు మృగాలై పోతున్నారని భయంతో వణికిపోవాల్సి వస్తోంది.   రాబందుల్లా చూడాల్సి వస్తోంది .. తప్పెవరిది ..? ఆడవాళ్ళకి భరోసా కల్పించలేకపోతున్న మగవాళ్ళదా .. వాళ్ళని అనుమానించే .. ఆడవాళ్ళదా ..?

                            ఈ ఆకర్షణలు వికర్షణలు అర్ధం చేయలేని పెద్దలదా ..? రెండు విభిన్న శారీరక నిర్మాణం ఉన్న ఆడ , మగ ఇద్దరూ ఈ సృష్టికి అవసరమే .. మరి అలాంటప్పుడు తన దారిలో తను నడిచే అమల లాంటి వారి శీలం గురించి ఎందుకు అన్యాయంగా ఆలోచిస్తారు? అదే మగవాడినయితే ఇంకోరకంగా ఎందుకు చూస్తారు ..? అసలే రోజులు బాగాలేదు అంటూ ఆడపిల్లని ఇంట్లోంచి బయటికి వెళ్లొద్దు అంటాం  కానీ బయటికి వెళ్ళిన మగపిల్లాడికి ఎలా మెలగాలో ఎందుకు చెప్పడం లేదు .. ఎటునుండి ఎటో పరుగులు పెట్టే ఆలోచనల సుడులు వీడి ఎప్ప్దుడు నిద్రాదేవి ఒడిలోవాలిందో ఆమెకే తెలియదు. 

                                   ****                                                                           ****

                                       ఏడు గంటలవుతుండగా లేచిన సులేఖని చూస్తూ ఏమ్మా ఈ రోజు ఆఫీసుకి వెళ్ళడం లేదా అడిగింది ఆమె అత్తగారు పరిపుర్ణమ్మ.  వెళ్ళకపోతే ఎలా చాలా పని వత్తిడి ఉందత్తయ్యా అన్న సులేఖ మొహంలోకే చూస్తూ ‘ఏంటమ్మా రాత్రి నిద్ర పట్టలేదా ..?’ కోడలిని సానుభూతితో అడిగింది పరిపూర్ణమ్మ.  పాపం ఇంటిపని , వంటపని, బయటి పని , ఆఫీసు పని అన్నీ ఒంటిగా చేసుకోస్తోంది. అలసి పోతోంది.   కొడుకు చంద్రం  పనిముగించుకుని త్వరగా వస్తే బాగుండుననుకుంది పరిపూర్ణమ్మ.

                                     హడావిడిగా ఆఫీసుకి బయలుదేరిన సులేఖ ఆటోలో కూర్చున్నాక  ఫోన్ తీసింది సరోజకి ఫోన్ చేద్దామని. చూస్తే చాలా మిస్డ్ కాల్స్.  అన్నీ ఆ వెధవ నుండే. వాటికి తోడు మెసేజ్ లు కూడా చాలా అసభ్య పదజాలంతో. ఇక ఊర్కోలేకపోయింది ఆమె.  ‘వొరే .. సోదరా .. నువ్వు ఎవరో ఎక్కడుంటావో , ఎలా ఉంటావో ఏమి చేస్తుంటావో నాకు తెలియదు. అనవసరం కూడా . కానీ , నీది ఎంత నీచ నికృష్ట మనస్తత్వమో అర్ధమవుతోంది.  నీ కారుకూతలు ముందు మీ ఇంట్లో అమ్మతోనో, అక్కతోనో , చెల్లి తోనో, కూతురుతోనో  లేకపోతే నీ భార్యతోనో కూయరా .. నువ్వు గనక మనిషివైతే నీ బుర్ర కున్న మకిలి వదులుతుంది.  అలాకాక వాళ్లలోనూ, నాలోనూ నీకు ఆడది మాత్రమే  ఎత్తుపల్లాల మాంసపు ముద్దలు మాత్రమే కనిపించి…  ఫోన్ చేసో, మెసేజ్ పెట్టో సరిహద్దులు దాటి అక్రమ చొరబాట్లకు యత్నించావో ..   నీలో పేరుకుపోయిన మకిలిని, వికృతపోకడల్ని ఎలా వదిలించాలో ఎవరు వదిలించాలో వాళ్ళే వదిలిస్తారు.   జాగ్రత్త!  దీపం ఆరకముందే చక్కదిద్దుకో.. ‘ మెసేజ్ పెట్టి ప్రశాంతంగా ముందుకు సాగింది.

వి. శాంతి ప్రబోధ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కథలు, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , Permalink

4 Responses to దీపం ఆరకముందే చక్కదిద్దుకో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో