స్త్రీ అంటే శరీరం అని పర్యాయ పదమైన చోట ఎప్పుడైనా ఆమె తనువుపై నిరంతరం దాడులు కొనసాగుతూనే వుంటాయి .పితృస్వామ్య వ్యవస్థ లో మహిళా అంటే ఒక భోగ్య వస్తువు . ఒక మార్కెట్ సరుకు అని రూడి అయిన వేళ నగరంలోనైనా అరణ్యం లోనైనా వీధి లోనైనా , ఇంట్లో నైనా , లిప్ట్ లోనైనా స్త్రీల దేహాల మీద దాడి జరుగుతూనే వుంటుంది .
ఈనాడు సినిమాల్లో , టి .వి ల్లో , నెట్ లో స్త్రీని ఒక భోగ వస్తువుగా ప్రదర్శిస్తున్నారు . బుల్లి తెరపై , వెండి తెరపై స్త్రీని ఒక అవయవ ప్రదర్శన శాలగా చూపిస్తున్నారు . భారత దేశ రాజధానీ నగరంలో జరిగిన నిర్భయ ఉదంతం దేశ మంతటినీ కల్లోల పరచింది . స్త్రీల దేహాలు గాయపడిన నదులైనా ఆత్మ న్యూనతా భావంతో కుంగిపోలేదు .
స్త్రీలు తమపై జరుగుతున్న లైంగిక దాడుల్ని సహించి ఊరుకోవడం లేదు . హింసను సహించడం లేదు . ఈ అన్యాయాలకు వ్యతిరేకంగా పిడికిలి బిగిస్తున్నారు . ప్రశ్నల కరవాలాలను ఝులిపిస్తున్నారు .
సంఘంలో స్త్రీల పట్ల జరుగుతున్న హింసా కాండకు రచయిత్రుల ప్రతి ఘటనా రచనలే ఈ అగ్ని శిఖ పుస్తకం . అతివల నిత్య జీవితాలలో గృహ హింసో , అత్యాచారమో ఏదో ఒకటి వారిపై నిరంతరం దాడి జరుగుతున్న దశలో ఈ హింసను వ్యతిరేకిస్తూ తమ అక్షరాలనే అగ్ని శిఖలుగా వెలిగించి ఈ పురుషాధిక్య ప్రపంచాన్ని ధిక్కరిస్తున్నారు .
ఈ పుస్తకాన్ని ప్రజా స్వామ్య రచ్జయిత్రుల వేదిక వారు ప్రచురించారు . దీనిలో కథలు , కవితలు , వ్యాసాలు , సమీక్షలు , కథనం ఇలా వివిధ ప్రక్రియల్లో రాసిన రచనలున్నాయి . అనాది నుంచి ఆధునిక యుగం వరకు ఆడపిల్లను ఒక అందాల బొమ్మగా ఒక మర బొమ్మగా భావిస్తున్నారు . సాహిత్యంలో సమాజంలో ఇప్పటికీ సౌందర్యానికి ప్రతీకగా స్త్రీని , పరాక్రమానికి ప్రతీకగా పురుషుని భావిస్తున్నారు . 21 వ శతాబ్దంలో నూ ఈ భావాలు మారలేదు . యుద్ధాలు జరిగినప్పుడు శత్రు దేశాల మీదకు దండెత్తి ఆ దేశాలను జయించినపుడు ఆ దేశాల స్త్రీల దేహాలపై గూడు దాడి చేయడం ఒక అలవాటై పోయింది .
బాధా శాప్తనది కవితలో కొండేపూడి నిర్మల గారు “ కలల్ని కన్నీటి చాటున జార విడిచాం / కళ్ళను రెప్పల వెనుక చిదిమి ఉంచాం / కడుపు కడుపునా ఆ కిరాతక మూక పాతిపోయిన / భయో త్పాతాల నెలా దాచుకోగలవు ? / అని ఆవేదనతో “ బోస్నియా లోని రిజ్వినో లిపి బాదాశాప్తన ది కాగా / ఉన్న పళాన విరుచుకు పడ్డ సెక్స్ పశువుల తొక్కిసలాటకి / మా ప్రపంచం మట్టి కొట్టుకు పోయింది /” అని ఆ సైనికుల దాడిలో గాయపడిన స్త్రీల బాధ లగాధలను కన్నీటి లిపిలో వర్ణిస్తారు .
శరీర న్యాయం రెండో అధ్యాయంలో ఘంటశాల నిర్మలగారు స్త్రీలు ఏ నేరం చేయక పోయినా వాళ్ల దేహాలపై దాడులు జరుగుతాయని “ మనదారిన మనం పోతామా / అడుగడుగునా ఆపద లు / క్షణం ఏ మారితే చిరుత పులులు వరదలు / సామాజిక అధికారం సంపాదీకృత అహంకారం కలిసి / ఆధునిక చిరుత పులిని ఆదిమ పిశాచం చేస్తాయి / అది క్రూర కాంక్షల జూలు విదిల్చి హుంకరిస్తుంది “ అంటూ కాముకుల కౄరత్వాన్ని వివరిస్తారు .
ఆంధ్ర ప్రదేశ్ లో వాక పల్లిలో గిరిజనులపై జరిగిన దాడి గురించి అందరికీ తెలిసిందే . ఒక రోజు తెల్ల వారు జామున గిరిజన స్త్రీలపై జరిగిన అత్యాచారం గురించి వర్ణిస్తూ “ నెత్తుటి నదిలో నెల వంకలు “ కవితలో ప్రతిమ గారు ఉదయించే సూర్యుడి సాక్షిగా / కుక్కల కొడుకుల కామక వారు మింగుడు పడక / ఘనీభవించి పోయిన పసుపు తోట / ఇప్పటికీ గాయంలో మగ్గుతున్న నెత్తుటి గడ్డ / అంటూ అక్కడ పోలీసులు చేసిన దాడిని గురించి “ రాజ్యం చెక్కిలి మీద కూంబింగ్ పోలీసులు చిమ్మిన బురదని / ఏ బహుళ జాతి సెంటు తుడవ లేదు / వాకపల్లి కళ్లల్లో ఇప్పటికీ / సూర్యుడు నల్లగానే ఉదయిస్తున్నాడు / అంటూ ఆ గిరిజన మహిళల బాధలను వ్యాఖ్యానిస్తారు .
స్త్రీల శరీరాలనే లక్ష్యంగా చేస్తున్న మగ ప్రపంచాన్ని పసుపులేటి గీత గారు విశ్లేషిస్తూ “ శరీర మొక చారిత్రక తప్పిదమై పోయింది / రెండు పెదవులు , రెండు చెక్కిళ్లు / రెండు రొమ్ములు , రెండు తొడలు / రెండంకెల అందాలు / రెండు రెళ్ళు నూకలు చెల్లే నూరేళ్ళా అంటూ ప్రక్కనున్న ప్రతి వాడూ / తొడల మధ్య బర్లేన్ని / మోసుకు తిరుగుతున్నట్లే వుంది /” అంటూ ఈ పురుషాధిక్య ప్రపంచంలో “ రక్షణ శాఖోప శాఖలై / నమ్మకాల్ని బాష్ప వాయు మేధామై కమ్మేస్తుంది / పోరిగిల్లూ , నట్టిల్లూ కూడా / పచ్చి గాయమై పలవరిస్తుంటాయి “ అని దేహాలే గాయాలుగా మారిపోవడాన్ని వివరిస్తారు .
“ కాంక్ష భ్రమరం “ కవితలో మందరపు హైమవతి తెహల్కా ఎడిటరే కావచ్చు ! అదను చూసి పంజా విసిరే మృగా ద్ర ముడే / “ అని అంటూ ప్రపంచీకరణ నేపథ్యంలో మహిళల శరీరాలంటే మాంసపు ముద్దలని / మార్కెట్ వస్తువులని ప్రచారం చేస్తున్న వేళ / ఇంట్లో నైనా వీధిలోనైనా లిప్ట్ ల్ప్నైనా / పదే పదే తనువులపై దాడి చేస్తూ హృదయ శిశువులను హననం చేసే కంస మామలే ఈ లోకం నిండా /” అని సభ్య ప్రపంచపు ముసుగులో దాగిన కాముకులతో నిండిన ఈ పురుష ప్రపంచాన్ని వర్ణిస్తుంది .
ఇక కథా ప్రపంచంలోకి వెళ్తే ప్రశ్నిస్తే , విష వలయం , శిలలోని జల ఈనాటి పరిస్థితులకు అడ్డం పట్టే కథలు . ప్రశ్నిస్తే కథలో శ్రీనివాస్ , సింధు రెండు కీలక మైన పాత్రలు , శ్రీనివాస్ ఒక ఉద్యమ నాయకుడు . విప్లవోద్యమంలో ఒక నాయకుడిగా ఎదిగి , ప్రభుత్వ కాల్పుల్లో మరణిస్తాడు . ప్రజలందరూ అతని మరణానికి స్పందిస్తూ అన్యాయంగా అన్యాయంగా ప్రభుత్వ కాల్పుల్లో మరణించిన వీరునిగా అభినందనలు , జోహార్లు తెలుపు తారు . రచయిత త్రిపురనేని గోపీచంద్ “ ఎందుకు ?” అని ప్రశ్న వెయ్యడం నేర్పినందుకు తన తండ్రికి కృతజ్ఞతలు తెలుపుతారు . ఇక సింధు గృహ హింసలో మరిణించిన ఒక గృహిణి అనుక్షణం అనుమానించే భర్త పెట్టే హింసను భరించలేక భరించలేక ఆత్మ హత్య చేసికొంటుంది . శ్రీనివాస్ మరణిస్తే అతణ్ణి అమర వీరునిగా కీర్తించిన ప్రజలు సింధు మరణాన్ని గురించి పట్టించుకోరు . కేవలం ఆత్మ హత్యగా ఒకే సంఘటన స్త్రీ పట్ల జరిగితే సంఘం వివరిస్తుంది . ఈ కథను పి . రాజ్య లక్ష్మి గారు శక్తి వంతంగా చిత్రీకరిస్తారు .
మరొక కథ శిలలోని జల . ఇది వి . శాంతి ప్రబోధ గారి కథ . అత్యాచారానికి ఒక వయో భేదం లేదు . అయిదేళ్ళ పిల్లల దగ్గర నుంచి అరవై ఏళ్ల ముసలమ్మళ వరకు ఎవరిపైనైనా , ఎక్కడైనా ఈ హింస జరుగుతునే వున్నది . అత్యాచారానికి గురైనపుడు ఆ చిన్న పిల్ల మనసులో ముద్రించుకుపోయిన ఆ భయానక సంఘటన తాలుకా హింస ఒక పీడకలలా భయపెడుతుంది . నిద్ర పట్టదు . ఆనాటి భయంకర దృశ్యాలు ఇంకా కళ్లల్లో మెదలుతూ ఆ పసి జీవితం భయపడడం , ఆ భయంకర సంఘటన తాలూకా చేదుతనాన్ని మన హృదయం చెమ్మగిల్లేలా వర్ణిస్తారు రచయిత్రి .
రచయిత్రి కవిని “ విషవలయం” కథ పురుషాధిక్యం గల కౌషిక్ అనే భర్త దుర్మార్గాన్ని వివరించిన కథ. కౌషిక్ ఒక సగటు భారతీయ పురుషుడు . పురుషా హంకారం మూర్తీ భావించిన వాడు . భార్య తాను చెప్పినట్లు వినేలా , కాలికింద చెప్పులా వుండాలను కొంటాడు . విపరీతమైన అనుమానం భార్యను శారీరకంగా , మానసికంగా ఎన్ని విధాలుగా హింసించాలి అన్ని విధాలుగా హింసించిన వాడు ఆఖరికి భార్యను ఇంట్లో నుంచి వెళ్లి పొమ్మంటాడు . కానీ భార్య పద్మ భర్తను ఎదిరించి “ ఈ ఇల్లు నీది మాత్రమే కాదు . ఈ ఇల్లు నాది అని భర్తనే బయటకు వెళ్లి పొమ్మంటుంది . మొత్తానికి ఈ సంకలనంలోని కథల్లోని పాత్రలు పరిస్థితులకు కుంగిపోవు , ఎదిరిస్తాయి . గొప్ప ఆత్మ గౌరవంతో నిలబడతాయి .
ఇంక వ్యాసాల గురించి చెప్పుకొంటే “ భూమి చెపితే ఆకాశం నమ్మదా “ అని వాకపల్లి బాధితుల గురించి మల్లీశ్వరీ వ్యాసం , ఎదురు చూపులూ- ఎండమావులు అనిశెట్టి రజిత వ్యాసం రాజ్య హింస బాధిత స్త్రీలకు దక్కని న్యాయం – రత్నమాల వ్యాసం అత్యాచారం ఆచారమై పోతుందా – కృష్ణా బాయి వ్యాసం , స్త్రీలపై అత్యాచారాల నిరోధానికి ఉపాధ్యాయ ఉద్యమాలు ఉధృతం కావాలి . కాత్యాయనీ విద్మహే వ్యాసం , భయంతో కాదు నిర్భయంగా – భండారు విజయ వ్యాసం చదవదగినవి .
స్పందించే హృదయమున్న వారు , స్త్రీల సమస్యల పట్ల సానుభూతి వున్నా వారి తప్పక చదవదగినది ఈ పుస్తకం .
– మందరపు హైమవతి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~“~~~