శ్రీమతి డా . పెళ్లకూరి జయప్రద సోమిరెడ్డి 1975 లో రాసిన ” బాయ్ ఫ్రెండ్” నవల వాస్తవికతలో ఈ తరానికి కూడా అద్దంపడుతుంది . సామాజిక సందేశం ఉన్న ఏ రచన అయినా చదువరులకి అవసరమే కాబట్టి దీనిని విహంగ మహిళా సాహిత్య పత్రికలో పునర్ముదిస్తున్నాం . చదువరులు మీ అభిప్రాయాల్ని పాలుపంచుకుంటూ ఆదరిస్తారని ఆశిస్తున్నాం .
– విహంగ
రచయిత పరిచయం :
పేరు : డా|| పెళ్లకూరు జయప్రద సోమిరెడ్డి
జన్మస్థానం/జననం : నెల్లూరు, 1945
తల్లిదండ్రులు : పెళ్ళకూరు సుందరరామిరెడ్డిగారు, యశోదగారు
వైద్య విద్య : ఆంధ్రా మెడికల్ కాలేజ్, విశాఖపట్టణం
వృత్తి : గర్భకోశ వ్యాధులు & కాన్పుల విభాగంలో ప్రైవేట్ ప్రాక్టీస్.
ప్రవృత్తి : చదవడం, అవాంఛనీయ సంప్రదాయాల్ని, మూఢనమ్మకాల్ని,
దురాచారాల్ని, రచనాంశాలుగా తీసుకుని వ్రాయడం, కవి సమ్మేళనాలలో పాల్గొనడం, హేతువాద, స్త్రీవాద సభలలో,
రచయితల సభల్లో ప్రసంగించడం, గ్రంథ సమీక్షలు చేయడం.
రచయిత్రి మాట :
ముందుగా ఈ నవలలోకి మీ చూపు సారించే ముందు నాదిగా ఒక్క మాట – విశిష్ట రచయిత్రి, కవయిత్రి అయిన పుట్ల హేమలత గారి విహంగ.కామ్ నెట్ మాగజైన్‌లో మీరు 2014లో చదవబోతున్న ఈ ‘బోయ్‌ఫ్రెండ్’ నవలను 1975లో వ్రాసాను. కాలమాన పరిస్థితులు చాలామారిపోయాయి. కాబట్టి, ఆ కాలాన్ని మనసులో పెట్టుకుని ఈ నవలను చదవమని రీడర్స్ ని కోరుతున్నాను.
అవి ఐశ్వర్యవంతులకు కూడా కార్లు లేని రోజులు. ఫోన్స్ కూడా ఎక్కువగా లేని రోజులు. ఉత్తరాల మీద ప్రియంగా ఆధారపడ్డ రోజులు. మహిళ రెండో వివాహం చేసుకుంటే పాపం అనుకునే రోజులు. బోయ్‌ఫ్రెండ్ అంటే అసహజంగా తీసుకునే రోజులు. ఆడపిల్లల్ని ఎక్కువగా కాలేజీకి పంపించని రోజులు. సమాజం పట్ల భయంతో మూఢనమ్మకాలతో దురాచారాలతో తమ ఆడబిడ్డల్ని తామే బాధపెట్టుకునే పేరెంట్స్ 99% వున్న రోజులు. ఆ రోజుల్లో నాకు చాలా ఆశలుండేవి. కత్తి పట్టలేని నేను కలం పట్టిన రోజులు అవి… సమాజాన్ని ఎదిరించే ధైర్యం లేదు. అందుకే అక్షర రూపంలో సమాజంలోని మనుషుల్ని మార్చాలనుకున్నాను. రచయితలందరి అక్షరాలే సమాజాన్ని ప్రభావితం చేశాయో, లేక ఈ ఆదర్శ పురుషుల ప్రోత్సాహమో. మహిళలు ధైర్యం చేసి ముందుకు అడుగేసారో. మీడియా మహిమ కూడా కొంత వుండచ్చు. మొత్తానికి మహిళ జీవితం మెరుగుపడింది. ఆడపిల్లలు మగపిల్లలతో ఇంచుమించు సమంగా ఉండే విధంగా మెరుగుపడింది. ఆడపిల్లలు మగపిల్లలతో ఇంచుమించు సమంగా చదువుకుంటున్నారు. ఉద్యోగాలు చేస్తున్నారు. ఆర్థికంగా అందరూ ఎదిగారు. దాంతో ఫోన్స్, కార్లు, సెల్‌ఫోన్స్…. ఇలా ఎన్నో సౌకర్యాలు పెరిగాయి. ఈ ఎదుగుదల లేని రోజుల్లో వ్రాసిన ఈ నవలను ఇప్పుడు విహంగ.కామ్ ద్వారా ప్రచురించాల్సిన అవసరం లేదు. కానీ ఈ రోజుల్లో బోయ్‌ఫ్రెండ్స్, గర్ల్‌ఫ్రెండ్స్‌కి అసలైన అర్థం తెలీకుండా… మగపిల్లలు ఆడపిల్లలు… అది స్నేహమో… ఆకర్షణో, ప్రేమో అర్థం కాకముందే ముందుకు అడుగులేస్తున్నారు… ఫలితంగా మోసపోవడం, యాసిడ్ దాడులు…. ఆత్మహత్యలు… ఇవి వాంఛనీయమైనవి కాదు.
ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నామనుకుంటున్నప్పుడు ఇద్దరి భావాలు జీవితాంతం కలుస్తాయా లేదా అని ఆలోచించాలి లేదా, ‘ప్రేమించిన వ్యక్తితోపాటు వాళ్ళల్లో వున్న లోపాల్ని కూడా ప్రేమించాలి… అని నిర్ణయించుకోవాలి. ప్రేమించడం తప్పుకాదు. అవతలి వ్యక్తితో నిజంగా జీవితాంతం వుండగలిగే ప్రేమ మీలో వుందని, నిర్ధారణ చేసుకున్న వెంటనే మనసులో మాటను పైకి ధైర్యంగా వ్యక్తం చేయాలి. లేకపోతే చాలా నష్టపోవాల్సి వస్తుందని తెలుసుకోవాలి. లవ్ మేరేజస్ చేసుకోవచ్చు, అరేంజ్ మేరేజస్ కంటే అవి మంచివే. కానీ అవి సంఘపరంగా తల్లిదండ్రుల సమ్మతితో జరిగితే పెళ్ళిళ్ళు విఫలమయ్యే అవకాశాలు వుండవనే ముందు చూపు కూడా వుండాలి. అప్పుడే నూరేళ్ళ జీవితంలో ప్రతిరోజూ సంతోషమే, మనశ్శాంతే. ఆ ప్రయత్నంలో ఒక భాగమే ఈ బోయ్‌ఫ్రెండ్. ఈ నా పాత నవలను నెట్ – ప్రచురణకు తీసుకున్న రచయిత్రి పుట్ల హేమలత గారికి, డి.టి.పి. చేసిన సాహితీ ప్రచురణలు స్టాఫ్‌కు నా కృతజ్ఞతలు తెలుపుతూ……మీ జయప్రద
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
బోయ్ ఫ్రెండ్
ఆ గదిలో కొచ్చి తలుపు దగ్గర ఒక్క క్షణం ఆగింది కృష్ణకాంతి.
”రా కృష్ణా ! రా” కిటికీ ప్రక్కగా కుర్చీలో కూర్చుని మంచం మిదకు కాళ్ళు చాపుకుని, చేతిలో పుస్తకంలోకి చూస్తున్న భానుమూర్తి సర్దుకుని కూర్చుంటూ ఆమెను ఆహ్వానించాడు.
అక్కడే నిల్చుని చురుగ్గా చూసింది కృష్ణకాంతి.
”నీ ఆహ్వానం కొఱకు ఎవ్వరూ ఎదురు చూడ్డం లేదు. ఇంటి కొస్తానని ఎందుకురాలేదో కనుక్కుని పోదామని వచ్చాను.”
ఆమె కోపానికి బదులుగా చిరునవ్వు నవ్వుతూ ఆమె దగ్గరగా వచ్చి ఆమె చెర్యు పట్టుకుని తీసుకెళ్ళి కుర్చీలో కూర్చోబెట్టి, తను మంచం మిద కూర్చుంటూ అన్నాడు.
”సారీ కృష్ణా, మర్చిపోయాను”
కోపంగా చూసింది కృష్ణ.
”అవును మర్చిపోతావు. నేను మాత్రం నా పనులన్నీ మానుకుని నువ్వు వస్తావని ఎదురుచూస్తూ కూర్చోవాలి. అరునా నాకే బుద్ది లేదు. నువ్వు నాకేమవుతావనీ ! బంధువివా, స్నేహితుడివా? ఏదో కాలేజీలో మంచి స్టూడెంట్‌వీ, బుద్దిమంతుడివీ అని అభిమానిస్తే నీకు నా మాటంటే విలువ లేకుండా పోరుంది.”
ఆమె పసి పిల్లలా అలిగితే ఆమెనే ముచ్చటగా చూస్తూ మృదువుగా అన్నాడు-
”ఈ మారుకు క్షమించెయ్ కృష్ణా. పొరపాటరుంది ప్లీజ్”
ఆ! నిన్ను ఇలా క్షమించేయడమే నా బ్రతుక్కి పరమార్ధమరుపోరుంది” కంఠంలో మార్థవం లేకపోరునా, కళ్ళలో క్షమించిన భావం సృష్టంగా కన్పిస్తోంది.
”అక్కడ నా పనులన్నీ చెడగొట్టి ఇక్కడ బుద్థావతారంలా కూర్చుని చదువుకుంటున్నావా? ఓ.కె.నేనూ, నీ చదువు పాడు చేస్తాను” ఆమె అతని చేతిలో పుస్తకం లాక్కుని విసిరేయ బోతుంటే అందుకుని ప్రక్కన బెట్టి చిరునవ్వును దాచుకుంటూ, కంఠంలోకి అర్థింపును అరువు తెచ్చుకున్నాడు భానుమూర్తి.
”ఇంకా కోపం పోలేదా కృష్ణా !”
”నా కోపంతో నీకేం పనిలే! మీ అమ్మగారు నీ ఒక్కడి కోసం రూము తీసిచ్చి వంటవాడిని పెట్టినందుకు అందరిలా చదువు మానేసి సరదాల్లో మునగలేదు. చాలా సంతోషం” ముభావంగా అనేసి ప్రక్కనున్న పుస్తకం తీసి తిరగేస్తూ కూర్చుంది.
భానుమూర్తి మౌనంగా వుండిపోయాడు.
”నాకాకలి వేస్తోంది. మీ వంటవాడెక్కడ?” కొన్ని నిముషాల తర్వాత ప్రసన్నంగా మారిన సూచనగా పుస్తకం ప్రక్కన బెట్టి అంతవరకు తననే చూస్తున్న భానుమూర్తి చూపులతో చూపు కలిపింది.
”వాడి అమ్మకు బాగాలేదని ప్రొద్దున్నే ఊరెళ్ళాడు వాడు.’
”అయితే ఈ రోజు తమరి స్వయంపాకమన్న మాట! వంటింటి సౌందర్యం చూసితీరాల్సిందే ఈ రోజు.
వంటింట్లోకి పరుగు తీసిన కృష్ణ మరుక్షణంలోనే వెనక్కొచ్చింది.
”వంట వండిన సూచనలే లేవు. భోంచేయలేదా భానూ!” ఆమె కంఠంలో అంతవరకున్న కోపం దిగిపోయింది.
”లేదు. ఒక్కడినే వండుకోవాలనిపించలేదు కష్టపడి”
ఆమె అతనివైపు దయగా చూసింది.
”ఏమిటి భానూ! ఇలా ఉపవాసాలు చేస్తే నువ్వు చదవగలవా? నాకు ఫోన్ చెయ్యకపొయ్యావా? నేను వచ్చి చేసిపెడ్దును కదా!”
భానుమూర్తి కొద్దిగా పెద్దగా నవ్వుతూ అన్నాడు.
(ఇంకా ఉంది )
– డా|| పెళ్లకూరు జయప్రద సోమిరెడ్డి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~