
కె.వరలక్ష్మి
ఓ పక్క చదువు , మారో పక్క గేమ్స్ . నేను మాత్రం – ఓ సారి వేలు నొప్పెట్టి వాలీ బాల్ లాంటి ఆటల జోలికె ళ్లడం . రింగ్ టెన్నిస్ , కెరమ్స్ ఆడేదాన్ని . రన్నింగ్ లో కూడా నేనే ఫస్ట్ .
అబ్బాయిల్లో కొందరు కొత్త వాళ్ళొచ్చి చేరేరు . నలుగురైదు గురు సీనియర్స్ ఫెయిలై మాతో కలిసేరు . కొత్తగా వచ్చిన ఎస్సై గారబ్బాయి తమ్మారావు , హెడ్ కానిస్టేబుల్ గారబ్బాయి జి.వి.బి (గొర్ల విజయ భాస్కర సత్యన్నారాయణ మూర్తి ) మా క్లాసులో చేరేరు . వాళ్లు క్లాసుకొచ్చిన మొదటి రోజే మా మీనాక్షి అటవీ ప్రాంతం నుంచి తమ్మారావుకి జింబో అని , జి.వి.బి సన్నగా పొడవుగా ఉన్నాడు పోట్లకాయ్ అని పేర్లు పెట్టేసింది .
స్కూలు నుంచి ఇంటి కొచ్చిన కాస్సేపటికి ఆ జి.వి.బి మా ఇంటి కొచ్చేడు . వాళ్లు మా వీధిలోనే నాలుగిళ్ల కవతల ఉన్న కంసాలి పరాత్పర్రావు ఇల్లు అద్దెకు తీసుకున్నారట . ఆ ఇంటికి వెయ్యడానికి తాళం అడిగి పట్టుకు రమ్మని వాళ్ల నాన్నగారు పంపించేరట . మా నాన్న నన్ను పిలిచి తాళం కప్పు తెచ్చి ఇమ్మ న్నారు . ఇద్దరం ఆశ్చర్యం నుంచి తేరుకోక ముందే మా నాన్న మాకు పరిచయం చేసేరు . ఇంతకీ వాళ్లు మాకు బంధువులు , వాళ్ల నాన్నగారు నాకు బాబాయ్ అవుతారు . వాళ్ల కుటుంబం గోకవరం నుంచి జగ్గంపేట కి షిప్ట్ అయ్యేక మా నాన్న మా అమ్మనీ , నన్నూ వెళ్లి పలకరించి రమ్మన్నారు . మేం వెళ్లే సరికి వాళ్ల ఆఖరి చెల్లెలు చంటి పాప ఇందిరను ఉయ్యాలలో వేసి ఊపుతోంది వాళ్ల క్కయ్య సత్యవతి . సత్యవతి తర్వాత ఐదుగురు అబ్బాయిలు , మరో ఇద్దరు అమ్మాయిలు . జి .వి.బి అబ్బాయిల్లో రెండోవాడు . సత్యవతి s.s.l.c చదువుకుంది . మంచి స్నేహశీలి , త్వరలోనే మేమిద్దరం మంచి స్నేహితులమయ్యాం . తను ఎక్కడికెళ్ళాలన్నా నన్ను తీసుకుని వెళ్లేది .
వాళ్లోచ్చేటప్పటికే కొన్ని క్లాసులు జరిగిపోవడం వలన జి.వి.బి నా నాట్ బుక్స్ అడిగి తీసుకుని రాసుకున్నాడు . అతనికొక దురలవాటు ఉండేది . ఎవరి పుస్తకం తన చేతుల్లోకి వెళ్లినా పేజీ పేజీకి జి.వి.బి అంటూ కొక్కిరి బిక్కిరి రాతలో తన పేరు రాసేసే వాడు . పుస్తకాల్ని నీట్ గా ఉంచుకునే నాకు అతను చేసే పని నచ్చేది కాదు . ఓ సారి అతను నోట్స్ కోసం వచ్చినప్పుడు “ బాబూ , చెల్లికి చదువులో సాయం చేస్తూ ఉండు అన్నారు . మానాన్న , ఆయన ఉద్దేశంలో అబ్బాయిలు తెలివైన వాళ్లు . ఆ అబ్బాయి చివరి బెంచీ స్టూడెంటని మానాన్న కి తెలీదు . అతనికి వరాహగిరి వెంకట్రావు మాస్టారి దగ్గర ట్యూషనుండేది . ట్యూషన్లో చెప్పిన నోట్స్ తెచ్చి నాకిచ్చేవాడు . దానికన్నా నేను రాసుకున్న నోట్సే ఎంతో బావుండేది . తరచుగా నేను వాళ్లింటికి వెళ్లడమో , తను మా ఇంటికి రావడమో జరిగేది . అలా మంచి స్నేహితుల మయ్యాం మేం . ఇప్పటికీ ఆ స్నేహం కొనసాగుతూనే ఉంది . మా ఫ్రెండ్స్ అందర్నీ ఎక్కడున్నా ఫోన్ చేసి పలకరిస్తూ ఉంటాడు . ఆంధ్రా యూనివర్సిటీలో m . a చేసి పోలీస్ డిపార్ట్మెంట్లో చేరి D S P గా రిటైరై హైదరాబాద్ లో స్థిరపడ్డాడు . మొన్న జనవరిలో నేను సుశీలా నారాయణ రెడ్డి పురస్కారం అందుకున్నప్పుడు స్టేజి పై కొచ్చి పుష్ప గుచ్చం ఇచ్చి అభినందించేడు . తనకీ సాహిత్యం మీద నటన మీద అభిరుచి , పట్టు ఉన్నాయి . ‘ గోరంత దీపం ‘ అనే కవితా సంపుటి వెలువరించేడు .
చిన్న వయసులో తెలిసీ తెలీని చేష్టలు ఎలా ఉంటాయంటే నాకు బంధువు కాబట్టి నా ఫ్రెండ్స్ అంతా జి .వి .బి తో అరమరికలు లేకుండా మాట్లాడేవారు . జి .వి .బి ఒక రోజు ప్రేమ లేఖ ఒకటి రాసుకొచ్చి మా లీలకిమ్మని నన్ను బ్రతిమలాడేడు . అప్పటి వరకూ స్కూల్లో అందరం ‘ అన్నయ్యా ,’ ‘ చెల్లీ ‘ అని పిల్చుకుంటూ నిర్భయంగా ఉండేవాళ్లం . ‘ ప్రేమ ‘ అనే మాట వినడం నాకదే మొదటిసారి . వెనకా ముందూ ఆలోచించకుండా ఉత్తరం ఉన్న నోట్ బుక్కుని లీలకి ఇచ్చేను . దానికి చదవడం , రాయడం మహా బద్ధకం . కొన్నాళ్లు అలా వన్ వే లెటర్స్ రాసి , విసుగొచ్చి ఆపేసేడు .
ఆరోజు ఏప్రెల్ ఫస్టు , అడ్డదారిన స్కూలుకి వెళ్తున్నాం . లీల మంచి సిల్కు పరికిణీ , ఓణీ వేసుకుంది . ఉన్నట్టుండి ఎస్సై గారబ్బాయి భీమశంకరం – మా కన్నా రెండేళ్లు సీనియర్ – కరక్కాయ ఇంకు సీసా పట్టుకొచ్చి వెనక నుంచి ‘ ఏప్రెల్ ఫూల్ ‘ అంటూ లీల నెత్తి మీద గుమ్మరించి వెళ్లి పోయేడు . లీల వాళ్లింటి పక్క అడపా వారింట్లో వాళ్లుండే వారు . లీల అన్నయ్యకి ఆ అబ్బాయి ఫ్రెండట . వాళ్లింటికి తరచుగా వెళ్లే వాడట . ఆ చనువుతో వాడలా కోతిలా ప్రవర్తించేడు . ఇంతకీ అది ఏప్రెల్ ఫూల్ ని చెయ్యడమట . లీల తల మీది నుంచీ నల్లని సిరాతో పూర్తిగా తడిసి పోయింది . అది తయారై రావడం కోసం అందరం దానికి సాయంగా వెనక్కి వెళ్లేం .
దాన్ని చూస్తూనే వాళ్ళమ్మ ఉగ్ర రూపం దాల్చేసింది . ఒక తాడు తెచ్చి , వాకిట్లో ఉన్న దానిమ్మ పూల చెట్టుకి లీలని కట్టేసింది . కర్ర తీసుకుని దాన్ని కొట్టడం మొదలు పెట్టింది . నేను అడ్డం వెళ్ళబోతే తోసేసింది . చేసేదేం లేక మేం భయంతో వణుకుతూ స్కూలు కెళ్లి పోయేం . మధ్యాహ్నం స్కూలయ్యేక దాన్ని చూడాలని వెళ్తే ఎర్రని ఎండలో అలా చెట్టుకి కట్టబడి సొమ్మసిల్లి పోయి ఉంది . “ ఇంకెప్పుడూ ఇటేపు రాకండి , దీనికింక సదువూ లేదు సట్టు బండలూ లేవు “ అని మామీద అరిచింది వాళ్లమ్మ . పరీక్షల వరకూ దాన్ని స్కూలుకి పంపలేదు . పరీక్షలు పూర్తవుతూనే వాళ్ల పెద్దక్క ఇంటికి కాకినాడ పంపేసారు . పదో తరగతి కాకినాడ మెక్లారిన్ స్కూల్లో చదువుకుని , స్కూల్ ఫైనల్ కి తిరిగి జగ్గం పేటకి వచ్చింది .
నాకీ విషయంలో ఇప్పటికీ అర్ధంకాని దొక్కటే – తప్పుచేసింది భీమ శంకరం అయితే లీల వాళ్లమ్మ దీన్నేందుకు దండించిందోనని , ఆ రోజుల్లో పెద్ద వాళ్లకి ఎదురు చెప్పడానికి , ప్రశ్నలు వెయ్యడానికి భయపడే వాళ్లం .
తొమ్మిదో తరగతి ప్రారంభంలో ఒక రోజు స్కూల్లో నూతి చప్టా మీద కూర్చుని ఆ మధ్యాహ్నం జరగబోయే స్లిప్ టెస్ట్ కోసమని “ ధర ……..” పద్యాన్ని ప్రతి పదార్ధాన్ని , తాత్పర్యాన్ని నేర్చుకుంటున్నాం . మా వాళ్లు నలుగురూ “ ఏమే , ఈ పద్యాన్ని రాగ యుక్తంగా చదువు చూద్దాం “ అన్నారు . నేను వెంటనే నాకు తోచిన రాగంలో చదివేను . మా వాళ్లు చప్పట్లు కొట్టేరు . మరు క్షణంలో ఆ పక్కనే ఉన్న డ్రిల్లు మాస్టారి రూంలోంచి పెద్ద బెత్తం ఒకటి చేత్తో పట్టుకుని డ్రిల్లు మాస్టారు ప్రత్యక్షమయ్యేరు . “ పరీక్ష రాసేసేక మీ ఐదుగురూ గ్రౌండ్ లోకి రండి “ అని ఒక ఆర్డరు పాస్ చేసేసి కోపంగా చూస్తూ వెళ్లి పోయేరు . ఆయన చెప్పినట్టే వెళ్ళిన మమ్మల్ని అంత పెద్ద గ్రౌండ్ చుట్టూ ఎండలో ఇరవై రౌండ్లు నడిపించేరు . మొదట్లో హుషారుగా మొదలు పెట్టినా చివరి కొచ్చేసరికి డీలా పడిపోయి నీరసించి పోయేం . “ కావాలని నా రూం పక్క కొచ్చి ‘ఖర్వాటుడు ‘ పద్యం చాడువుతారేం ! “ అని ఆయన హుంకరించే వరకూ ఆయన బట్ట తలని మేం గమనించనే లేదు .
ఇంటి కెళ్లి , పుస్తకాలు పడేసి మంచం మీద వాలిపోయిన నాకు రాత్రికి జ్వరం వచ్చేసింది . టాన్సిల్స్ జ్వరాలు ఆగేక మళ్లీ ఇదే జ్వరం రావడం . నాలుగు రోజుల పాటు మూసిన కన్ను తెరవకుండా ఉన్నాక అది టైఫాయిడని తెలిసింది . డా .జయగారు ఇంటి కొచ్చి వైద్యం చేసేవారు . ఇరవై నాలుగు రోజులు జ్వరం ; తగ్గేక పళ్ళ రసాలు , తర్వాత వేపుడు జావ , క్రమంగా అన్న పథ్యం లోకి వచ్చేసరికి నెల దాటి పోయింది . చిక్కి శల్యమై , మళ్లీ జన్మ నెత్తి నడక నేర్చుకుంటున్నట్టు గోడల్నో , మనుషుల్నో పట్టుకుని నడిచే దాన్ని జుట్టంతా ఊడిపోయి రూపం మారిపోయింది . ఏడు పోక్కటే తక్కువైన నన్ను చూసి “ చక్కనమ్మ చిక్కినా అందమేలే , వైజయంతి మాలలాగా ఉండే దానిని ఇప్పుడు వహీదా రెహ్మాన్ లా ఉన్నావు “ అన్నాడు జి , వి . బి పెద్ద ఆరిందాలా మొహం పెట్టి .
మానాన్నమ్మ మాత్రం రోజుకోసారి డ్రిల్లు మేస్టార్ని తిట్టి పోసేది . ఆయన కాళ్లూ చేతులూ విరిగిపోవాలని శాపిస్తూండేది . అంతకు ముందే మా నాన్న నన్ను పెద్దాపురం తీసుకెళ్లి భారత్ స్టూడియో లో ఫోటో తీయించేరు పెళ్లి చూపులకి పనికి వస్తుందని . అది కూడా నాకు జ్వరం రావడానికి కారణమని మా నాన్నమ్మ నమ్మకం . “ పువ్వో పువ్వో మంటన్న పిల్లని తీసుకెళ్లి పుటోవు తీయించేడు . ఉప్పుడే టైందో సూడు “ అని సణుగుతూ ఉండేది .
ఈ జ్వరం సందర్భంగా నేను చాలా కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన వ్యక్తి కోనేరన్నయ్య . అప్పటికి మా చిన్నింట్లో ఫిలిం బాక్స్ వెంట వచ్చిన సినిమా రిప్రజెంట్లు ఉండేవారు . అలా నవయుగా తరపున వచ్చిన వాడే కోనేరు లోకనాధరావు . పిల్లలందరం అతన్ని ‘ అన్నయ్యా ‘ అని పిల్చే వాళ్లం . నేను జ్వరంతో మంచానికి అంటుకుపోవడం చూసి ఒక హార్లిక్స్ సీసా కొనుకోచ్చేడు . రోజూ థియేటర్ నుంచి వచ్చేటప్పుడు బత్తాయి పళ్ళు కొనుక్కోచ్చేవాడు . స్వయంగా తనే రసంతీసి , వేడి నీళ్లల్లో హార్లిక్స్ కలిపి మూడు గంటల కొకసారి తాగించేవాడు .
ఎప్పుడూ ఎవరో ఒకళ్లు నా మంచం దగ్గరే ఉంది కోలుకునే వరకూ జాగ్రత్తగా చూసుకున్నారు .
జ్వరంలో ఊడిన జట్టు తిరిగి రావడం మొదలు పెట్టింది . మొదట్లో దట్టమైన ముంగురులుగా ముఖం మీద వాలి , కొన్నాళ్లకి చెంపల మీదికి సాగి , భుజాల మీదుగా పెరిగి , రెండు జడలు వేసుకుంటే ఒక్కో జడా గుప్పిట పట్టనంత జుట్టు నడుము కిందకి మరో జానెడు పొడవున పెరిగింది . ఒక్క జడ వేసుకుని స్కూలు కెళ్తే బెంచీకి చేరబడినప్పుడు వీపు వెడల్పునా పరుచుకుపోయేది . మా అమ్మ , నాన్నమ్మ కలిసి శేరు కుంకుడు కాయల పులుసుతో తలంటి పోయాల్సి వచ్చేది . తలంటు పూర్తయ్యేక నన్ను స్టూలు మీద కూర్చో బెట్టి పెద్ద ఇనప చట్రంలో నిప్పులు తెచ్చి గుప్పెడు సాంబ్రాణి వేసి , ఆ పొగని జుట్టుకు పట్టించేది మా అమ్మ . నా పాదాలు రుద్ది రుద్ది తెల్లగా మెరిసి పోయేలా తోమేది మా నాన్నమ్మ . “ నా పాదాలు అరగదీసే స్తున్నావు మామ్మా “ అని నేను నవ్వుతూంటే “ బాగానే ఉన్నావులే కోతి పిల్లలాగ “ అని మెటికలు విరుచుకునేది గారాబంగా .
కె . వరలక్ష్మి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~