గౌతమీగంగ

కాశీచయనుల-వేంకట-మహాలక్ష్మి-150x1501923లో కాంగ్రెస్‌ మహాసభలు కాకినాడలో జరిగాయి. ఆ సభల ప్రధాన నిర్వాహకుడు బులుసు సాంబమూర్తి గారు, వారు ప్రముఖ వేద పండితుని కుమారులు. వారి గ్రామం మండపేట సమీపాన గల దుళ్ల గ్రామం తండ్రి గారు మంచి భూవసతి గల కామందు. నాటి సంప్రదాయానుగుణంగా సాంబమూర్తి గారు లా చదివి ప్రముఖ న్యాయవాదిగా కాకినాడ చుట్టు పట్ల మంచిపేరు, పుష్కలంగా ధనం ఆర్జిస్తున్నారు. గాంధీ మహాత్ముని స్వరాజ్య శంఖారావం విని సర్వస్వాన్ని త్యజించి స్వరాజ్యసమరంలో దుమికారు. నాటి వరకు ఖరీదైన పట్టు వస్త్రాలు ధరించి మోటారు సైకిలుపై తిరిగే ఆయన మోకాలు దిగని కొల్లాయి ధరించి, చేత ఒక ఖద్దరు చేతిసంచీ ధరించి పాదచారిjైు కార్రగెస్‌ కార్యకలాపాల్లో పాల్గొనసాగారు.

నాటి యువ కాంగ్రెస్‌ కార్యకర్తలంతా వారి వెనుక నిలచి సభలను జయప్రదం చేసారు. శ్రీ మల్లిపూడి పళ్లంరాజుగారు, కళా వెంకట్రావు గారు మొదలైన ఉత్సాహవంతులైన యువకులెందరో వారి వెంట నడిచారు. దుర్గాబాయమ్మ 12 సంవత్సరాల బాలికగా ఆ సభలలో చురుగ్గా పొల్గొన్నారు. దేశనాయకులు వస్తున్నారన్న సంబరమే కాని ఈ కార్యకర్తలెవరూ వారి ముక్కూ ముఖం ఎరుగరు. వార్తా పత్రికలు నాటికి ప్రచారంలోకి రాలేదు. ఊరి మొత్తానికి ఓ సంపన్న గ్రహస్తు గాని, అక్కడ అక్కడ వెలసిన ఒకో గ్రంథాలయం గాని మద్రాసు నుండి వెలువడే ఆంధ్ర పత్రిక దినపత్రిక తెప్పిస్తే పదిమంది చేరి ఒకరు చదువుతుంటే వార్తలు వినేవారు. పత్రికలలో ఫోటోలు ప్రచురించడమా నాటికి రాలేదు. కొంచెం ముతక కాగితం మీద వార్తలు మాత్రం ప్రచురించేవారు. రేడియో, టీవిలు నాటికి జనుల ఊహల్లోకి కూడా ఇంకా రాలేదు. గాంధీ మహాత్ముడు, నెహ్రూ, షేకత్‌ ఆలీ, మహమ్మదాలీ సోదరులూ, సరోజినీదేవీ వంటి ప్రముఖులు ఎందరో ఆ సభల్లో పాల్గొన్నారు. సభలకు కొద్ది రోజుల ముందరే సాంబమూర్తిగారి ఏకైక కుమారుడు మరణించారు. ఆయన స్థితప్రజ్ఞుడై కడుపుశోకాన్ని దిగమ్రింగి సభలను జయప్రదంగా నిర్వహించారు. ముగ్గురు బిడ్డల తల్లి సరోజినీదేవి వేదికపై నుండి అశ్రుపూర్ణ నయనాలతో, గద్గద కంఠంతో సాంబమూర్తి గారికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసారు. గాంధీజీ వారికి మహర్షి అనే బిరుదును ఇచ్చారు. గాంధీజీ మహిళలకు నగల పట్ల మోజు వుండకూడదని, తమ వంటిపై కల బంగారాన్ని స్వరాజ్య నిధికి సమర్పించమని ప్రబోధిస్తున్నారు. సాంబమూర్తి గారి భార్య సభలో ఓ వారగా కూర్చొని వున్నారు. గాంధీజీ ప్రబోధాన్ని వింటూ ఆమె తన చేతులకు మిగిలి వున్న ఒకే ఒక గాజుల జతకేసి చూసుకుంటున్నారు.

వేదికపైనుండి భర్త ఓసి పిచ్చిదానా ఆ ఒక్క జత మాత్రం ఎందుకే. గాంధీగారికి ఇచ్చి వెయ్యి అన్నారు. ఆసాధ్వి లేచి ఆ విధంగానే చేసారు. ప్రముఖ రాజకీయ నాయకుల భార్యలే కాక సామాన్య మహిళలు సైతం గాంధీ మహాత్మునిచే ప్రభావితులై తమ వంటి మీద బంగారాన్ని వొలచి స్వరాజ్య నిధికి సమర్పించారు. నాటి రోజుల్లో స్త్రీ, పురుషులందరికీ పుట్టిన 21వ రోజున ముక్కులు, చెవులూ కుట్టించేవారు. ఈ సంస్కారాన్ని చవులాన్నప్రాశనం, లేక చౌలకర్మ అనేవారు. నిర్దేశించిన సుముహూర్తంలో కంసాలిబత్తుడు వచ్చి శిశువుకు బంగారు పోగులు గాని, రాగి పోగులు (సన్నని తీగలు) కాని తెచ్చి చెవులు, ముక్కులు రంధ్రాలు చేసి, ఆ రంధ్రంలో ఈ తీగలు చొనిపి, ,చుట్టగా చుడతాడు. ఇంటి వారు అతడిని మర్యాద చేసి, బియ్యం, కందిపప్పు, చింతపండు, మిర్చీ, బెల్లం ఏదైనా కూర వుంచి స్వయంపాకం ఇచ్చి తాంబూలంలో వరహా ( 4 రూపాయలు) దక్షిణ ఇచ్చి సత్కరించేవారు. స్త్రీలు భర్త జీవించి వున్నంత కాలం ఆ రంధ్రాలలో రత్నాలు పొదిగిన స్వర్ణాభరణాలు ధరించేవారు. ఆభరణాలు లేని ఆ రంధ్రాలు తోడబుట్టిన వారు, భర్త చూస్తే అమంగళమని భావించేవారు మన స్త్రీలు. చెవుల రంధ్రాలలో లవంగ మొగ్గలు పెట్టుకొని తమ స్వర్ణాభరణాలన్నీ స్వరాజ్యనిధికి సమర్పించారు. కొందరు స్త్రీలు, పసుపు త్రాడు ధరించి మంగళ సూత్రాల గొలుసు ఇస్తే మరి కొందరు పసుపు కొమ్ము ధరించి మంగళ సూత్రాలు కూడా ఇచ్చి వేస్తారు. స్వచ్ఛమైన ఖద్దరు వస్త్రాలు ధరించి చేతులకు ఎర్రని మట్టి గాజులూ, ముఖాన గౌరీ దేవి, త్రినేత్రం వంటి కుంకుమ బొట్టు ధరించిన ఆ కాంగ్రెస్‌ సేవికలు పవిత్రతకూ, దేశ భక్తికి ప్రతిరూపాల్లా వుండేవారు.

సాటి వారు ఎగతాళి చేస్తున్నా, పిల్లల భవిష్యత్తుని గూర్చిన యోచన కృంగదీస్తున్న చిత్తస్థైర్యంతో వెనుకంజ వేయకుండా గాంధీ మహాత్ముని వెంట నడిచారు ఆ దేశ భక్తులైన స్త్రీ, పురుషులు. కాంగ్రెస్‌ వలంటీర్లు స్థాపించిన ఎగ్జిబిషన్‌ చూడటానికి వచ్చారు జవహర్‌లాల్‌ నెహ్రూ, నాటి నాయకులకు మందీ మార్బలం, హంగూ, హడావుడి లేదు కదా. వలంటీర్‌గా వున్న దుర్గాబాయి టిక్కెట్టు చూపమని నిలదీసింది. వెంటనున్న వారు అడ్డుకోబోతే ఆ బాల సరకు చేయలేదు. అతడు నెహ్రూ పండితుడని తెలుసుకొన్న ఆ బాలిక ముఖమాటంగా తలవంచుకొంటే నెహ్రూ ఆమె భుజం తట్టి చిరునవ్వు నవ్వారు.

ప॥ రామా ! కర్పూర హారతిగైకొను
చ॥ శివుని విల్లు విరచి సీతను పెండ్లియాడి
పరుశురాముని భంగపరిచిన శ్రీరామా ॥రామా॥
చ॥ సోదరులిద్దరూ లేడి కోసమే పోవ
ఆ మాయ రావణుడు సీతను గొనిపోయే ॥రామా॥
చ॥ ధరణిలో కాంగ్రెస్‌ పురమున వెలసిన గాంధీ
మహాత్ముని దయజూడు రాజేంద్ర ॥రామా॥

అని రామ భక్తులు, దేశభక్తులూ అయిన ఆంధ్రులు కాంగ్రెస్‌ ప్రముఖులు హరధనుర్భంగం, పరుశురామ గర్వభంగం, మారీచ సంహారం చేయగల సమర్థులనీ, ఇక రామ రావణ సంగ్రామం ప్రారంభం కాబోతుందని పేర్కొంటూ కాకినాడ కాంగ్రెస్‌ గ్రామ సభలను గాంధీ మహాత్మునికి అంకితం చేస్తూ పాడుకున్నారు. ఆ కాంగ్రెస్‌ సభలు జరిగిన చోటనే తరువాతి కాలంలో పార్కు, గాంధీ మహాత్ముని విగ్రహం, గాంధీనగర్‌ వెలిసాయి. పారుపూడి వేంకటరమణమ్మ భర్త సత్యనారాయణగారు రామచంద్రపురం హైస్కూలులో ఇంగ్లీషు, గణితం బోధించే ఉపాధ్యాయులుగా పనిచేసారు ఆ రోజుల్లో. తరువాతి కాలంలో దేశభక్తులుగా, రాజకీయ నాయకులుగా పేరు పొందిన పళ్లంరాజుగారి వంటి ప్రముఖులు వారి శిష్యులు. నాటి గురు శిష్య సంబంధాలు చాలా పటిష్టమైనవి. సంపన్నుల ఇంటి బిడ్డలు కూడా పాఠశాల వదిలాక మాస్టారుగారి ఇంటికి తెలియని అంశాలు చెప్పించుకోవడానికి వచ్చేవారు. చదువుకున్నంతసేపు చదువుకుని వారి ఇంటి సావిడిలోనే నిదురించేవారు. తెల్లవారు రaామునే గురుపత్ని వారిని నిద్ర లేపి చదువుకోవడానికి దీపం వెలిగించి ఇచ్చేవారు. డబ్బు తీసుకొని చదువు చెప్పే పద్దతి ఆ రోజుల్లో లేదు. ఈ పిల్లలు చదువుకొని బాగుపడితే అదే తమకు పదివేలు, వారికి వచ్చే వరకూ చెప్పడం తమ కర్తవ్యం అని గురువులు భావిస్తే, గురువుగారి కుటుంబంలో తాము సభ్యులం. వారి పనులు తమ స్వంత పనులు అని విద్యార్థులు భావించి వారి ఇంటి తోటలోని మొక్కలకు నీరు పోయడం, చిన్న పిల్లల్ని ఎత్తుకొని ఆడిరచడం వంటి పనులు ప్రేమాభిమానాలతో చేసేవారు.

ఉపాధ్యాయుల కుటుంబ సభ్యులు కూడా చదువుకోవడానికి తమ ఇంటికి వచ్చిన ఈ పిల్లల్ని తమ స్వంత పిల్లల్లాగే చూసుకునేవారు. ప్రతి ఇంటిలోనూ నడి వయస్సు వారు, వయస్సు మళ్లిన వారు వితంతువులు, ముగ్గురు నలుగురు స్త్రీలు వుండేవారు. వారు రాత్రిపూట భోజనం చెయ్యరు. కొయ్య రొట్టో, మినపరొట్టో తింటారు. ఎప్పుడో చీకటి పడకుండా ఇంటి వద్ద అన్నాలు తిని వచ్చి, దీపం ముందు కూర్చొని చదువుకుంటున్న ఈ చిన్న పిల్లల చేతిలో కాస్త పెట్టకుండా వాళ్లకు ఎలా గొంతు దిగుతుంది. రెండు మూడు రొట్టెలు ముందరే వేరుగా తీసి ఓ పళ్ళెంలో పెట్టి మరీ ఫలహారం చేసేవారు. వారు ఫలహారం చేసి మడి ముగియగానే ఆ రొట్టెలు తలో ఆకులోను పెట్టుకొని కాస్త పచ్చడి వేసి ఒరేయ్‌ రుచి చూడండిరా నాయనా అని విద్యార్థుల చేతిలో పెట్టేవారు వారు. ఇక ఏకాదశి వస్తే పెద్దవారికి ఉపవాసం వారికి పండుగ. ఒక శేరో, రెండు శేర్లో బియ్యం నీటిలో నానపోసేవారు ఆ స్త్రీలు. ఉదయం స్నానం చేయగానే వంట ముగిసాక అందరూ ఓ చోట చేరి ఆ బియ్యంతడి ఓడ్చి రోటిలో పోసి మెత్తగా పిండి దంపి జల్లించేవారు. నాలుగు కొబ్బరికాయలు కొట్టి, ఇంత బెల్లం, ఏలక పొడి వేసి చలిమిడి తయారు చేసేవారు. లక్ష్మీనారాయణునికి నివేదన చేసుకొని ఆ ప్రసాదం తలో కాస్త ఈ పిల్లల చేతిలో పెట్టేకనే ఫలహారం చేసేవారు.

గాంధీ మహాత్ముని వలన ప్రబోధితులైన సత్యనారాయణగారు ఉద్యోగాన్నీ, రామచంద్రపురం నివాసాన్ని వదిలి కాకినాడకు మకాం మార్చారు. వారి కుమారుడు రామమోహన్‌రావు పాఠశాల విద్య పరిత్యజించి తరువాతి కాలంలో కాంగ్రెస్‌ ఉద్యమంలో చేరారు. ఆ తరువాతి కాలంలో బందరు జాతీయ కళాశాలలో బి.ఎ. చదివారు. రవణమ్మగారు మహిళా కార్యకర్తలలో ముఖ్యులు. నాటి రోజుల్లో నూటికి 50 శాతం మహిళలు నూలు వడికేవారు. కదురాడితే కరువు వుండదని, రాట్నం త్రిప్పే వారి భాగ్యరేఖ తిరుగుతుందని అనుకునేవారు. కొంతమంది నూలు వడికి విక్రయించేవారు. కొందరు ఆ నూలుతో ధోవతులు, దుప్పట్లు మొదలైనవి నేయించుకునేవారు. నేర్పరులైన వారు సన్నని నాజుకైన నూలు వడికితే, మిగతా వారు ఓ మోస్తారు నూలు తీసేవారు. స్త్రీ పురుషులు ఉభయులు తీరిక వేళల్లో నూలు వడికేవారు.

పల్లవి ॥ నూలు వడికే విధము తెలియండీ। జనులారమీరా విధము కనుగొని లాభమందండి।
చ॥ రాట్నమే మన మూట అనుకోండి। రత్నాల ఏకుల రాట్నమే మన మూట అనుకోండి।
రాట్నమే మన మూట యనుకొని పాటు పడుచును।
నూలు వడికిన సాలె కిరాయి కోట్ల రూపాయలను
పరదేశాలపాలును చేయబోకను॥ నూలు॥
అని భారతీయులు ఒండోరుల్ని ప్రభోదించుకుంటూ ఉత్సాహంగా చరఖా ఉద్యమంలో పాల్గొన్నారు. (చరఖా నూలు వడికే సాధనం)

 రమణమ్మ గారు 4 అడుగుల మనిషి, ఎర్రగా, బక్కపలచగా వుండేవారు. ఆమె తాము నూలు వడుకుతూ నాటి మహిళల్ని ప్రబోధించి నూలు వడికించేవారు. ఆ నూలు అంతా సేకరించి, ఆర్థిక ఇబ్బందుల్లో వున్న వారికి వడికిన నూలుకు ఖరీదు చెల్లించే వారు. తాము మరికొందరు మహిళలూ వడికిన నూలు ఖాదీ వారికి చెల్లించి వారు ఇచ్చిన ఖద్దరు బట్టల మూట భుజాన పెట్టుకొని ఇంటింటికీ తిరిగి ఖద్ధరు బట్టలు విక్రయించేవారు. వచ్చిన సొమ్మును స్వరాజ్యనిధికి చెల్లించేవారామె. త్యాగ నిరతులైన ఇటువంటి మహిళలెందరో నాటి మధ్య తరగతి వర్గాలలో వుండేవారు. వారి రాజకీయ చైతన్యం, త్యాగ నిరతి సాటిలేనిది.

రారా నా గాంధీ కుమారా। రారా నా తనయా।
రారా గాంధీ రారా తనయా రారా కూర్చోవేరా।
అరచిటికైనను రా కుమారా తెరపి లేదటరా ॥రారా॥
అని భరతమాత స్వరాజ్య సమరంలో నిమగ్నుడైన తన ప్రియకుమారుని పిలుస్తున్నట్లుగా పాడుకొన్నారు దేశీయులు.
ప॥ వద్దురా మనకొద్దురా పరపాలనంబిక ఒద్దురా
హద్దు పద్దూ లేని పన్నుల రుద్దీ పీల్చుచు నుండెరా॥ వద్దు॥
చ॥ 1. కర్ర లాగీ కత్తిలాగి పర్రలను చేసేడురా
బుర్ర తిరుగుడు మందుపెట్టి గొఱ్రెలను చేసాడురా ॥ వద్దు।
2. వెండి బంగారముల నెల్ల దండిగా లాగేడురా
ముండమోపి కాగితాలకు దండమిడమన్నాడురా ॥ వద్దు॥
3. మాన ప్రాణములకు మహమ్మారి  వున్నాడురా ॥
కావలేవా కన్నతల్లీ గౌరవము కాపాడవా ॥ వద్దు॥

అంటూ ఆంగ్లేయులు దేశీయ విద్యల్ని నాశనం చేసి మనకు పాశ్చాత్య నాగరికత పట్ల వ్యామోహాన్ని కలిగించి, స్వతంత్య్ర భావాల్ని నాశనం చేసి, గొఱ్ఱెల మందల్లా తయారు చేసారనీ, వెండి బంగారు నాణాల్ని తమ దేశానికి తరలించుకొని విక్టోరియా మహారాణి బొమ్మకల కరెన్సీని మనకు అంటకట్టారనీ, ప్రబొధించారు. మన ఆత్మ గౌరవానికి హాని కలుగుతోందని దేశమాత గౌరవాన్ని కాపాడమని, దేశీయుల్ని ప్రభోధించారు నాటి కాంగ్రెస్‌ కార్యకర్తలు. పారుపూడి వారి కుటుంబమంతా స్వరాజ్య సమరానికి అంకితం అయ్యారు. తరువాత వచ్చిన ఉప్పు సత్యాగ్రహం నాటికి వీరి దీక్ష పరాకాష్టకు చేరింది. బందరు జాతీయ కళాశాలలో బి.ఎ. చదువుతున్న రామ్మోహనరావు గారు కళాశాల పరిత్యజించి స్వరాజ్య శంఖం పూరించారు. అచ్చట వారికి బెజవాడ గోపాలరెడ్డిగారి వంటి ప్రముఖులు సహాధ్యాయులు. కళా వెంకటరావు గారు విజయనగరం కళాశాలలో ప్రథమ శ్రేణి విద్యార్థిగా వున్న వారు మహాత్ముని పిలుపుతో వచ్చి ఉద్యమాల్లో పాల్గొన్నారు.

పళ్లంరాజుగారు బాపట్ల వ్యవసాయ కళాశాలలో పట్టభద్రులై గౌరవ ప్రదమైన గ్రామ మునసబు పదవిలో వున్న వారు సాంబమూర్తి గారి వలన ప్రభావితులై సర్వం పరిత్యజించి కాంగ్రెస్‌ ఉద్యమంలోకి వచ్చారు. వారి వారి ధర్మపత్నులు ఆ నాటికి లోకం తెలియని 15 సంవత్సరాలలోపు వయస్సు వారు. అసూర్యంపశ్యలు ఇబ్బందులు, కష్టాలు అంటే ఏమిటో తెలియని సంపన్న గృహాలలోని వారు. వీరూ భర్తల వల్లా, మహాత్ముని ప్రబోధం వల్ల స్వరాజ్య సమరంలో వురికి చివరి వరకూ పోరాడుతూ భర్తకు బాసటగా నిలచారు. ఉప్పు సత్యాగ్రహం, కాకినాడ టౌను హాలు ఆవరణలో జరిగిన సభల్లో సాంబమూర్తిగారిపై, లాఠీ చార్జి జరుగుతుంటే సత్యనారాయణ గారూ, రామ్మోహనరావుగారు వారికి అడ్డుపడ్డారు. వృద్ధులైన సత్యనారాయణ గారి మోకాలి చిప్పలు పగిలి రక్తం ప్రవహించింది. కొడుకు తల పగిలిపోయింది అయినా వారు వెనుకంజ వేయలేదు. స్పృ హ కోల్పోయి పోలీసులు ఈడ్చి వేసే వరకూ వారు ఆ ప్రాంతాన్ని వీడలేదు. ఉభయులు ఎన్నో పర్యాయాలు జైలు శిక్ష అనుభవించారు.

పల్లవి ॥ గాంధీ మహాత్మా। గాంధీ మహాత్మా। కాచి రక్షించు గాంధీ మహాత్మా।
చ॥ సరుకోరువారు కరుకైన వారు। ఉప్పేరి తేను తప్పేసినారు ॥గాంధీ॥
మాల మాదిగలం మనుషులము కామా కుక్కలకన్నా తక్కువైనామా ॥గాంధీ॥
మా బాధలు వారింప సామోరే దిక్కు। ఆ సామి వారే అవుతారమాయే ॥గాంధీ॥
అని అస్పృశ్యతా నివారణని కోరుతూ అందరికి అత్యవసరమైన ఉప్పుపై పన్ను వేసిన ప్రభుత్వపు దుర్మార్గాన్ని గర్హిస్తూ సాక్షాత్తు భగవంతుడే గాంధీ రూపంలో దిగి వచ్చాడని భావించారు భారతీయులు.

కాకినాడ కాంగ్రెస్‌ సభలకు నారాయణగారు వాలంటీరుగా వచ్చారు. ఖద్దరు నిక్కరు పొట్టి చేతుల షర్టు ధరించి మెడకు తెల్లని స్కార్ఫ్‌ కట్టుకొని కాళ్లకు చెప్పులు, చేతిలో పొడుగాటి లాఠీకర్ర ధరించిన వలంటీర్ల సభాస్థలి చుట్టు ప్రక్కలంతా తిరుగుతూ వుండేవారు. ఎవరికి ఏ సహాయం చేయాలన్నా వారు సిద్ధం. జనం కేకలు పెట్టినా, అల్లరి చేసినా వారు చిరాకు పడరు. శాంతంగానే వారికి నచ్చజెప్తారు. అంతగా వినకపోతే వారి చెయ్యి పట్టుకొని నిశ్శబ్ధంగా సభాస్థలికి దూరంగా తీసుకొని వచ్చి వదులుతారు వారు. వారి ముఖాల్లో నిశ్చలతా, ప్రవర్తనలోని సౌమ్యత చూసి అల్లరి చేయడానికి వచ్చిన వారైనా, ఏదో కారణాల వల్ల కోపం వచ్చిన వారయినా ప్రశాంత చిత్తులు అయ్యేవారు. కళా వెంకటరావుగారు, తరువాతి కాలంలో సుభాసుచంద్రబోస్‌ జాతీయ సైన్యంలో చేరి కర్నూలు రాజుగా ప్రఖ్యాతి పొందిన ప్రముఖ వైద్యులు అయిన డి.ఎస్‌.రాజు గారు, ఇదే కోనసీమలో అనేక మంది జాతీయ వాదులతోను నారాయణగారికి సన్నిహిత పరిచయాలు వుండేవి. కుడువాపెట్ట లోటు లేని ఇంటి గారాల బిడ్డగా పుట్టిన ఆయనకు జీవితం కోసం కష్ట పడవలసిన అవసరం కాని, ఆలోచించాల్సిన ఆవశ్యకత లేనేలేదు. వారి దృష్టి దేశ పరిస్థితులవైపు మళ్లింది. భగత్‌సింగ్‌ తీవ్రవాదం, మహాత్ముని అహింసావాదం ఏది అనుసరణీయం అని వారు మధన పడేవారు. ఎక్కడ కాంగ్రెస్‌ సభలు జరిగినా ఆయా వార్తా విశేషాలు సేకరించి, వాటి వివరాలు, పరిణామాలు ఆలోచించేవారు. ఈ సారి వెదుకబోయిన పెన్నిది ముంగిటకే వచ్చింది. కష్టపడి ఉత్తరాపథంలో జరిగే కాంగ్రెస్‌ సభలకు వెళ్లడానికైతే పినతండ్రి అనుమతి ఇవ్వలేదు. ఇప్పుడు అవకాశం ముంగిటకే వచ్చింది. వారు ఉత్సాహంగా సభలలో పాల్గొన్నారు.

( ఇంకా ఉంది )

– కాశీచయనుల వెంకట మహా లక్ష్మి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
203
ఆత్మ కథలు, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో