ఎనిమిదో అడుగు – 20

Anguluri Anjani devi

Anguluri Anjani devi

ఆలోచిస్తున్నాడు, బహుశా ఏ తండ్రి అయినా తనలాగే ఆలోచిస్తాడేమో! ఎందుకంటే మనిషికి ధనం కూడబెట్టుకోవాలన్న కాంక్ష ఎక్కువైంది. దానితో ఇంటా, బయటా ఘర్షణలు మొదలవుతున్నాయి. హోదా, అధికారం సంపాయించాలని మనిషి మరొక మనిషిని ఉపయోగించుకుంటూ ఎలాంటి దోపిడీకైనా వెనుకాడటం లేదు. దీనివల్లనే మానవ సంబంధాలు కలుషితం అవుతున్నాయి. అందుకే జీవితం నిండా ఇంత సంక్లిష్టమైన అనుభవాలు చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి అనుభవం ఏ తండ్రికీ రాకూడదు.

‘‘ అంతగా ఆలోచిస్తున్నావు దేనికి నాన్నా! ఆ పొలమేమైనా కోట్ల విలువ చేస్తుందా? దాన్ని అమ్మితే సరిగ్గా ఆ షాపు కొనటానికి కూడా సరిపోదు. కొంత డబ్బు బయట ఎక్కడైనా తేవలసిందే….’’ అన్నాడు. శేఖరయ్య ఉలిక్కిపడి …. ‘‘బయట నా కెవరిస్తార్రా ! మొన్ననే అక్కకి సిజేరియన్‌ ఆపరేషన్‌ చేసి బిడ్డను తీస్తే నా స్నేహితుడు దనుంజయ దగ్గరకి వెళ్లి డబ్బులు తెచ్చి హాస్పిటల్లో కట్టాను. మళ్లీ ఇంకెక్కడ తేను?’’ అన్నాడు నీరసంగా.

హేమేంద్ర చిరాగ్గా చూస్తూ ‘‘ నీ భయం నాకు తెలుసు, ఇకముందు నా కోసం నువ్వు ఒక్క పైసా బయట తెచ్చినా నువ్వు కట్టనవసరం లేదు. నేనే కట్టుకుంటాను సరేనా!’’ అన్నాడు. ‘‘నా భయం అది కాదురా! నువ్వు అయినా ఎక్కడ నుండి తెచ్చి కడతావు. ఒక్క రాత్రిలో సంపాయించగలవా?’’ అన్నాడు శేఖరయ్య.

తండ్రి మాటలు గుచ్చుకున్నాయి.అవమానిస్తున్నట్లనిపించాయి. అయినా తమాయించుకున్నాడు. జీవితం ఒక సవాలో, ఒక ప్రతిస్పందనో కాదుగా, వెంటనే రోషపడి తెగ తెంపులు చేసుకోటానికి ….

‘‘అందుకే ఒక అమ్మాయిని చూడు. పెళ్లి చేసుకుంటాను. నాకు కట్నం గా వచ్చిన డబ్బుతో అప్పు తీరుస్తాను. ఆ తర్వాత కష్టపడి సంపాయించి, నీ పొలం నీకు కొనిస్తాను. ఎందుకంటే నువ్వు ఆ పొలాన్ని నమ్మినట్లు నన్ను నమ్మటం లేదు. నేను నీ దృష్టిలో దుర్మార్గుడ్ని, చివరి దశలో తిండి పెట్టనని అనుకుంటున్నావు. అంతేకాదు. ప్రస్తుతం ఏ పని చేతకాని వాడ్ని. ఛ ..ఛ.. నా పట్ల నీ నిర్లక్ష్యం చూస్తుంటే నా మీద నాకే అసహ్యం వేస్తోంది.’’ అన్నాడు కోపంగా.

కొడుకు మాటలు అయోమయంగా అన్పించి, భూమిలోకి క్రుంగిపోతున్నవాడిలా చూస్తూ….
‘‘ఇన్ని మాటలు నేను అన్నానా హేమేంద్రా? ఎందుకంత నిష్ఠూరంగా మాట్లాడతావు. సరే! నువ్వు చెప్పినట్లే చేద్దాం! ఆ షాపు కొనేటప్పుడు మాత్రం ఆదిత్య గారిని తీసికెళ్లు, నేను ధనుంజయతో కూడా ఓ మాట చెబుతాను.’’ అన్నాడు వీలైనంత ప్రశాంతంగా శేఖరయ్య. హేమేంద్ర మాట్లాడలేదు.

పట్టుబట్టి తండ్రి చేత అతి తక్కువ టైంలోనే పొలం అమ్మించాడు. ఆ పొలం అమ్ముతున్నంత సేపు శేఖరయ్య మనసు మనసులో లేదు. ఆర్థికంగా అభివృద్ధిలోకి వస్తానన్న కొడుకును చూపి పొంగి పోవాలో, అన్నం పెట్టే పొలాన్ని అమ్ముతున్నానని కుంగిపోవాలో అర్థం కాని అయోమయ స్థితిలోకి వెళ్లాడు. ఇంకా కొంత డబ్బుని బయట అప్పుగా తెచ్చి ఇచ్చాడు.
రాజమౌళి మెడికల్‌ షాపును హేమంద్ర తను అనుకున్న రీతిలో తన సొంతం చేసుకున్నాడు.
 
చేతన ఎం.ఫార్మసి పూర్తయిన వెంటనే డ్రగ్‌ ఇన్స్‌పెక్టర్‌ ఎగ్జామ్స్‌ రాసింది. అందులో పాసై ఇంటర్వ్యూకి వెళ్లింది. అక్కడ ఆమె పెర్‌ఫామెన్స్‌ బాగుండటంతో డ్రగ్‌ ఇన్స్‌పెక్టర్‌గా సెలక్టయింది. ఆమెకు పోస్టింగ్‌ వరంగల్‌లో యిచ్చారు. వెళ్లి జాయిన్‌ అయింది. ఆమె డ్రగ్‌ ఇన్స్‌పెక్టర్‌గా వరంగల్‌ లో జాయిన్‌ అయినట్లు వెంటనే కాపీ లెటర్స్‌ ఆల్‌ డిస్టిక్ట్‌ ఆఫీసర్స్‌కి వెళ్లాయి. ఆ రోజు చేతన ఆఫీసుకి వెళ్లగానే ` కెమిస్ట్‌ అసోసియేషన్‌ మెంబర్స్‌ వచ్చి కలిశారు. వాళ్లలో హేమేంద్ర వుండటం ఆమె గమనించకపోలేదు. అందరితో ఎలా మాట్లాడిరదో, అతనితో కూడా అలాగే మాట్లాడిరది. అంతేకాదు మాట్లాడేటప్పుడు నువ్వు నాకు గతంలో బాగా తెలిసిన వ్యక్తివి అన్న స్పృహ లేకుండా…ఎవరి వేగంలో వాళ్లున్నారు. ఎవరి పని బాధ్యతలో వాళ్లున్నారు. అదొక మహా సముద్రం….

చేతన ఆఫీసు నుండి ఇంటికొచ్చి అన్నయ్యతో కలిసి కాఫీ తాగుతుండగా వచ్చింది స్నేహిత.
స్నేహితను చూడగానే ‘‘హాయ్‌! స్నేహా!’’ అంటూ విష్‌ చేసి… ‘‘నువ్వింకా హైదరాబాద్‌ వెళ్లలేదా? కూర్చో ’’ అంటూ తన పక్కన కూర్చోబెట్టుకుంది చేతన….

అక్కడే కూర్చుని వున్న ఆదిత్య స్నేహితను చూడగానే పలకరింపుగా నవ్వి, వెంటనే పనమ్మాయిని పిలిచి ‘‘మిా అమ్మ గారితో చెప్పి ఇంకో కాఫీ తీసుకురా!’’ అన్నాడు. ఆదిత్య చెప్పినట్లుగానే పనమ్మాయి వెళ్లి కాఫీ తెచ్చి స్నేహితకి ఇచ్చింది.
స్నేహిత కాఫీ తాగుతూ ఆలోచిస్తోంది.

ఆమెను చూస్తుంటే ఎదురుగా ఆదిత్య కాని, చేతన కాని వున్నారన్న ద్యాసలో వున్నట్లు లేదు. ఎక్కడో, ఎక్కడెక్కడికో వెళ్లి ఆలోచిస్తోంది ఆమె మనసు… మనిషి కూడా వడలిన తమలపాకులా, నీరు సరిగ్గా అందని మొక్కలా వుంది. చేతనైతే తను ఏ లక్ష్యాన్నైతే పెట్టుకుందో ఆ లక్ష్యాన్ని చేరుకున్నదానిలా పరిపూర్ణమైన ఆనందంతో, ఆత్మ సంతృప్తితో వుంది. ఆదిత్య వాళ్లిద్దరి మీద దృష్టి నిలిపి పరిశీలనగా చూశాడు. స్నేహితలో మార్పు వచ్చినట్లు గమనించాడు. అది మామూలు మార్పు కాదు. జీవితం పట్ల ఏ ఆశా లేని జీవిలో వుండే నిరుత్సాహం, నిస్తేజం ఆమెను ఆవరించి ‘ఇక ఎప్పటికీ ఈ జీవితం ఇంతేనా!’ అన్న నిరాశతో కూడిన మార్పు…

ఆ మార్పు ఎందుకో అర్థం కావడం లేదు.
కొద్ది రోజుల క్రితమే తన కొత్త రచనలు చదివి ఫోన్‌ చేసి అద్భుతంగా మాట్లాడిరది. చేతన దగ్గరకి వచ్చిన ప్రతిసారి తనకి కన్పించేది. అప్పటికి, ఇప్పటికి ఎంత మార్పు! ప్రస్తుతం ఆమె కళ్లలో అంతులేని అసంతృప్తి, నిర్లిప్తత తప్ప ఇంకేం లేవు. ఎందుకిలా? భర్త మంచివాడు కాకనా? అత్త, మామలతో గొడవలా? లేక క్షణం తీరిక లేని పనుల్లో సతమతమవుతుందా? ఏదీ పైకి చెప్పదు. అడగాలంటే మొహమాటం అడ్డొస్తోంది. అలా అని చూస్తూ మౌనంగా వుండలేని తనం ఘోరంగా బాధిస్తోంది. ఎందుకంటే చేతన తనకి చెల్లెలు అయితే స్నేహిత మంచి స్నేహితురాలు… భాష సరిపోక వ్యక్తం చెయ్యలేకపోతున్నాడు కాని తామిద్దరి మధ్యన స్నేహాన్ని మించింది ఇంకేదో వుంది. అదికూడా మనుషుల్లో వుండే రక రకాల ఫీలింగ్స్‌కి, ఎమోషన్స్‌కి అతీతమైన ఓ అద్భుత బాంధవ్యం.

దానికి కారణం స్నేహితలోని మంచి మనస్సు… ఆమె ఎప్పుడూ ఎదుటివాళ్ల గురించి చెడుగా ఆలోచించలేకపోవటం… తనలోకితను చూసుకోలేకపోవటం….. తనకేం కావాలో త్వరగా తెలుసుకోలేకపోవడం.. అంతేకాదు ఎదుటివాళ్లను త్వరగా అర్థం చేసుకొని వాళ్ల తత్వానికి తగినట్లు నడుచుకోగలగటం… ఇంకా ఆమెలో వున్న నిజాయితీ, నిర్మలత్వం…ముఖ్యంగా హిప్రోకసీ లేకపోవటం… అంతర్లీనంగా ప్రకృతిని ప్రేమించే తత్వం,అనుభూతించటం ఆమె సొంతం కావటం…. ఇవన్నీ ఆమెలో కన్పించి అపురూపంగా అన్పించడం… అలాంటి ఆమె ఈ క్షణం మాసిపోయిన రంగుల వస్త్రంలా కూర్చుని వుంటే చూసి తట్టుకోలేకపోతున్నాడు.

చేతన భౌతికంగా అక్కడ కూర్చుని వున్నా ఆమె మనసు మాత్రం సిటీిలో వున్న మందుల షాపుల చుట్టే తిరుగుతోంది.
స్నేహిత కాపీ తాగి ఖాళీ కప్పును టీపాయ్‌ మిాద పెడ్తుంటే ఆదిత్య స్నేహిత వైపు చూస్తూ ‘‘స్నేహితా! నువ్వు చాలా డిప్రెషన్‌లో వున్నట్లు కన్పిస్తున్నావు. ఎనీ ప్రాబ్లమ్‌?’’ అన్నాడు చనువుగా, అంతకుమించిన ఆత్మీయంగా….
ఆ మాటతో స్నేహిత కళ్లలో నీళ్లు చివ్వున ఉబికి వెంటనే తగ్గాయి. కింద పెదవిని పై పెదవితో ఒత్తి వస్తున్న దు:ఖాన్ని ఆపుకొంది. మాటలు రాని మౌనంతో తన చేతి వేళ్ల వైపు చూసుకుంటోంది.

‘‘నువ్విలా ఆత్మీయుల ముందు కూడా నోరు విప్పకుండా మౌనంగా ఆ బాధను నీలోనే ఇముడ్చుకుంటే ఆ ఒత్తిడికి నువ్వింకా క్రుంగిపోతావు. సరే నీకు ఏదైనా కష్టం వచ్చిందే అనుకుందాం! అది ఎంత క్లిష్టమైనదైనా ‘విధిరాత’ అనుకొని అపారమైన శక్తితో దాన్ని ఎదిరించాలి. అప్పుడే లైఫ్‌లో కాంప్లికేషన్స్‌ వల్ల వచ్చే రుచి ఏమిటో తెలుస్తుంది అలా అని మరింత బాధపెట్టే సమస్యను సాగనియ్యకూడదు. త్వరగా సొల్యూషన్‌ వెతుక్కోవాలి.’’ అన్నాడు ఆదిత్య. స్నేహిత మాట్లాడకుండా చేతన చేతిని తన చేతిలోకి తీసుకుంది.

అతనింకా ఆత్మీయంగా చూస్తూ….‘‘నాకు తెలిసి నువ్వు వర్క్‌లోడ్‌ వల్ల ఇలా అయ్యావేమో అన్పిస్తోంది స్నేహితా! రొటీిన్‌గా చేసే పని అయినా అందులో కాసింత సృజనాత్మకత చొప్పిస్తే విసుగు, డిప్రెషన్‌ లేకుండా పోతుంది. నువ్వెలాగూ బుక్స్‌ బాగా చదువుతావు కాబట్టి ఏదైనా కొత్తగా వూహించి…’’ అంటూ ఆగాడు. వెంటనే స్నేహిత పేలవంగా నవ్వి… ‘‘నన్ను కూడా రాయమంటారా సర్‌! అందరూ రాయగలిగితే రాసేవాళ్లు కొందరే ఎందుకుంటారు? ఆ కొందరిలో మీరే అరుదుగా ఎందుకనిపిస్తారు?’’ అంది చాలా సిన్సియర్‌గా, గౌరవంగా చూస్తూ.

అది తనకి మంచి పొగడ్తే అయినా అతను చలించలేదు. పాలిపోయి కన్పిస్తున్న స్నేహిత ముఖంలో దేన్నో వెతుక్కుంటున్నాడు.
చేతన కదిలి ‘‘అన్నయ్య చూడవే ఎంత బాధపడ్తున్నాడో…. నువ్వేమో దేన్నైనా దాచుకోగల శక్తి నాకుంది అన్నట్లు నిన్ను నువ్వు పైకి కనబడనీయకుండా బాధపెట్టుకుంటున్నావు. నువ్విలాగే వుంటే దాని పర్యవసానాన్ని తప్పించుకోలేక తర్వాత దాన్ని ఎవరూ పరిష్కరించలేక నీకు నువ్వే శిక్ష వేసుకున్న దానివి అవుతాయి. అది ఏదైనా కానీ పైకి చెప్పు! భారం పోతుంది. సరే! నాతో వద్దు. అన్నయ్యతో చెప్పు! మనిద్దరి కన్నా పెద్దవాడు కదా!’’ అంది ఆదిత్య వైపు చూపిస్తూ. స్నేహిత తలెత్తి ఆదిత్య వైపు చూసి తిరిగి తన చూపుల్ని చేతన మీదికి మళ్లించి ` చేతనకి తన మీద వున్న వెర్రి ప్రేమను తలచుకుంటూ, తలవంచుకొని….

దీనికిదో పిచ్చి! ‘ప్రతిదీ అన్నయ్యతో చెప్పు’ అంటుంది. అదేమైనా చదువు సమస్యా…? అన్నయ్య ఇచ్చే స్పూర్తితో అంచలంచలుగా ఎదిగి ఐ.ఎ.యస్‌. కావటానికి… తన సమస్యకి అన్నయ్య ఏం చెప్పగలడు? అదే పుస్తకాల గురించి చెప్పమంటే ఏ సందర్భంలో ఏం చదవాలో చెబుతాడు. అక్షరమే ఆయుధం అంటాడు. అనేక అక్షరాలతో కూడిన శక్తి వంతమైన ఆయుధం పుస్తకం అంటాడు. మనిషికి సరైన మార్గం చూపేది, ఆత్మ విశ్వాసం అందించేది, మేధను మేల్కోలిపేది, సృజనాత్మకతను వెలికి తీసేది, వయసుతో సంబంధం లేని నేస్తంలా పని చేసేది పుస్తకం అంటాడు..

ఆయన దృష్టిలో పుస్తకాలు వెలకట్టలేని ఆస్తులు. మిగిలిన ఆస్తులు తగ్గుతాయి, పెరుగుతాయి. కాని పుస్తకాల ద్వారా సాధించిన ఆస్తులకు పెరుగుదలేకాని, తరుగుదల ఉండదని కూడా అంటాడు. చివరకి పుస్తకాలున్న లోగిళ్లు దేవాలయాలంటాడు. అవి మెదడుకు వ్యాయామంగా మారి, జీవన గమనాన్ని మార్చి, వ్యక్తిత్వాన్ని పెంచుతాయంటారు. కానీ తన సమస్య పుస్తకాలకి సంబంధంచింది కాదుగా… అందుకే అది ఆదిత్య గారితో చెప్పుకునేది కాదు. పంచుకునేది కాదు, నిజానికి ఆయన తన దృష్టిలో గొప్ప ఆధ్యయన క్షేత్రం. అందులో ఎవరికి ఏది కావాలన్నా దొరుకుతుంది. తనకు మాత్రం కాదు. కానీ ఆదిత్య చాలా మంచివాడు. ఇలాగే తన మనసు బాగలేక ఎన్నోసార్లు చేతన దగ్గరికి వచ్చింది. అలా తను వచ్చిన ప్రతిసారి చేతనతో పాటు తనను కూడా కార్లో ఎక్కించుకుని వరంగల్‌ సిటీ మొత్తం తిప్పేవాడు. మంచి, మంచి రెస్టారెంట్లకు తీసికెళ్లేవాడు, అంతేకాదు. ‘ ఇదెందుకో పెళ్లికి ముందున్నంత సంతోషంగా లేదు అన్నయ్యా! అలా కొద్ది సేపు బయటకు తీసికెళ్దాం!’ అని చేతన అనగానే, ఆ క్షణం నుండి అతను ఎన్నెన్నో సరదా కబుర్లు చెబుతూ, జోకు లేస్తూ, రోడ్డు మిాద కన్పించే ప్రతి కొత్త ఐటమ్‌ను పరిచయం చేస్తూ వరంగల్‌ నుండి బయటకెళ్లే అన్ని రోడ్లను తిప్పాడు….

అలా తిరుగుతున్నంత సేపు కారులో పాటలు వింటూ, బయటకు చూస్తుంటే గాలి మెల్లగా తాకినట్లు, సముద్రంలో అలలు పొంగి పాడుతున్నట్లు, మేఘమాల కురుస్తుంటే విరిసిన గులాబి తన పూరేకుల్ని తడుపుకుంటూ వూగుతున్నట్లు అనుభూతి కలిగి మనసుకి హాయిగా అన్పించేది…. అంతేకాదు, ‘‘ఇదిగో ఇప్పుడు మీ ఇద్దర్ని వరంగల్‌`నర్సంపేట రోడ్డుకి తీసికెళ్తా’’ అంటూ మచ్చాపూర్‌ వరకు తీసికెళ్లి అక్కడ వేడి గారెలు తినిపించి, ‘జీవించటం ఓ కళ. వున్న సమయాన్ని అద్భుతంగా మలుచుకోవాలి’. అన్నాడు…. ఆ తర్వాత ఇది వరంగల్‌ `ఖమ్మం రోడ్డు అంటూ వర్థన్నపేట వరకు తీసికెళ్లి ఆ రోడ్డు పొడవున వున్న పంట పొలాలను చూపించి ‘‘ జీవితం ఓ మధుర స్వప్నం, కరిగిపోకుండా చూసుకోవాలి’’. అని చెప్పాడు…. మళ్లీ ఓ రోజు ఇది వరంగల్‌` హైదరాబాద్‌ రోడ్డు అంటూ స్టేషన్‌ ఘన్‌పూర్‌ వరకు తీసికెళ్లి దారి పొడవున వున్న కాలేజీలను, సాక్షి పేపరు ఆఫీసును చూపించి…

‘‘జీవితం ఓ అపురూపమైన యాత్ర. దాన్ని ప్రతిక్షణం ధైర్యంగా, రసాత్మకంగా సాగించాలి.’’ అన్నాడు. అ తర్వాత రోజు ఇది వరంగల్‌ ` కరీంనగర్‌ రోడ్డు అంటూ ఎల్కతుర్తి వరకు తీసికెళ్లి కొన్ని దేవుని గుళ్ళు తిప్పి… ‘‘ జీవితం ఓ ఆద్యాత్మికం, దాని అంతస్సూత్రాన్ని కనుక్కొని జీవించటం నేర్చుకోవాలి. మొత్తానికి జీవితమే ఓ అద్భుత వరంగా భావించి దాన్ని ప్రతిక్షణం అనుభూతిస్తూ ఆస్వాదించాలి’’. అన్నాడు. అలా అతని కారులో కూర్చున్నంత సేపు ఎంతో ఆత్మీయంగా, ఉత్సాహంగా మాట్లాడి మనసులో వున్న బరువు దింపేశాడు. కొత్త శక్తిని నింపాడు. ఇప్పుడు అవన్నీ గుర్తొచ్చి స్నేహిత కళ్లు చెమర్చాయి.
ఆదిత్యకి కాల్‌ రావటంతో వెంటనే లేచి బయటకెళ్లాడు.

‘‘పోనీ హెల్త్‌ ప్రాబ్లమ్స్‌ ఏమైనా వుంటే చెప్పు స్నేహితా! ఇప్పుడే ప్రభాత్‌ దగ్గరకి తీసికెళ్తాను. మంచి ట్రీట్‌మెంట్‌ ఇచ్చి క్షణంలో నయం చేస్తాడు.’’ అంది చేతన, ప్రభాత్‌ పేరును ఉచ్ఛరిస్తున్నప్పుడు చేతన కళ్లు ఎప్పటిలాగే తళుక్కుమన్నాయి.
‘‘ ప్రభాత్‌తోనే మాట్లాడుదాం! నా బాధను అతనితోనే చెప్పుకోవాలి.’’ అంది స్నేహిత ఒక నిర్ణయానికి వచ్చిన దానిలా…. చేతన టీపాయ్‌ మీద వున్న తన సెల్‌ఫోన్‌ తీసుకొని, అందులో టైం చూస్తూ ‘‘ అన్నయ్య కేదో కాల్‌ వచ్చి బయటకెళ్లారు. నాదిప్పుడు ప్రీ టైం. ఇప్పుడే వెళ్దాం ప్రభాత్‌ దగ్గరకి … అన్నయ్యకి మనం ప్రభాత్‌ దగ్గరకి వెళ్తున్నట్లు కాల్‌ చేసి చెబుతాను.’’ అంటూ ఆదిత్య కి కాల్‌ చేసింది. అవతల నుండి ఆదిత్య మాట్లాడుతుండగా కాల్‌ కట్‌ అయింది. అతను కవరేజ్‌ యేరియాలో లేక సిగ్నల్‌ అందట్లేదు. ‘‘ ఓ.కె. స్నేహిత! రా! వెళ్దాం!’’ అంటూ లేచి స్నేహిత చేయిపట్టుకొని లేపింది చేతన. ఇద్దరు కలిసి చేతన కారు వైపు వెళ్లారు.

కారును అవలీలగా నడుపుతోంది చేతన. ‘‘ ఈ కారును అన్నయ్య నాకు గిఫ్ట్‌గా కొనిచ్చారు. ఎందుకో తెలుసా! నేను డ్రగ్‌ ఇన్స్‌పెక్టర్‌ అయినందుకు….’’ అంది చేతన. స్నేహితకి చేతన చాలా కొత్తగా, నిండుగా, గంభీరంగా, గుంభనగా, కత్తి చివరన తళుక్కున మెరిసే మొనలా కన్పిస్తోంది. ఇంకో కోణంలో చూస్తే కష్టపడి అంచెలంచలుగా ఎదిగి కూడా ఒదిగివుండటంలో మంచి నేర్పరితనం ప్రదర్శిస్తున్నట్లు అర్థమవుతోంది. ఆదిత్యకి, చేతనకి చాలా దగ్గర పోలికలు వున్నాయి. ఎంతయినా ఒక తల్లి పిల్లలు కదా! చేతన అవసరాన్ని బట్టి స్టీరింగ్‌ తిప్పుతూ, రోడ్డు వైపు చూస్తూ.. ‘‘ స్నేహితా! ప్రభాత్‌ను చూడక చాలా రోజులైంది. ఈ జాబ్‌లో చేరాక నేను బిజీ కావటమే కారణం. ఫోన్లో మాట్లాడుకోవటమే… ఒకరకంగా ఇద్దరం బిజీ అనే చెప్పాలి….’’ అంది.
పని లేని వారు కూడా ఏంపని చెయ్యాలన్న ఆలోచనలో బిజీగానే వుంటారు. కానీ కొన్ని ‘‘పనుల బిజీ’’ మనుషుల్ని మణిదీపాలై నిలబెడతాయి, కరదీపికలై బాసిల్లేలా చేస్తాయి. కొన్ని లక్ష్యాలు పెట్టుకొని, ఆ లక్ష్యాల కోసం ప్రయత్నించి సాధించిన వాళ్లలో ప్రభాత్‌, చేతన వున్నారని అర్థమై అభినందనగా చూసింది స్నేహిత.

‘‘ స్నేహితా! నువ్వు మరీ ఇంత డల్‌గా వుండాల్సిన అవసరం లేదు. సమస్యలు నాకు లేవా? నిద్రలేచినప్పటి నుండి మళ్లీ నిద్రపోయేంత వరకు నా విధినిర్వహణలో నేను తిరిగే జనారణ్యాన్ని నువ్వు చూస్తే నిజంగా నీకు కళ్లు తిరుగుతాయి. మా డ్రగ్‌ ఇన్స్‌పెక్టర్స్‌ కూడ డాక్టర్స్‌ లాగే 24 గంటలు సేవ చెయ్యాలి. మా సేవ ప్రజలకి అంత అవసరం. ఎక్కడ ఏ మందుల షాపులో ఏం జరిగినా వెంటనే అటెండ్‌ కావాలి. మాది మామూలు సర్వీసు కాదు, ఎమర్జన్సీ సర్వీస్‌… ముఖ్యంగా మేము నకిలీ మందులు, నాసిరకం మందులు మెడికల్‌ షాపుల్లో లేకుండా చూసుకోవాలి. ప్రజల ఆరోగ్యానికి హాని చేసే మందులు కన్పిస్తే వెంటనే తగలబెట్టెయ్యాలి….’’ అంది.

చేతనలో ఏకాగ్రతను మించిన శ్రద్ధ కన్పిస్తోంది. శ్రద్ధ ఒక అద్బుత శక్తి. అది ఎక్కడ వ్యాపిస్తే అక్కడ చైతన్యం వుంటుంది. చేతన చైతన్యానికే చైతన్యంలా డేరింగ్‌, డాషింగ్‌, డైనమిక్‌గా అన్పిస్తోంది. ‘‘ అయినా కానీ నువ్వు చెప్పే పనులను ఆడవాళ్లం చెయ్యగలమా? అసలు నువ్వీ జాబ్‌ చేస్తున్నావంటేనే నాకు ఆశ్చర్యంగా వుంది.’’ అంది స్నేహిత. చేతన సన్నగా నవ్వి… ‘‘ఇప్పుడు అన్నిచోట్ల ఆత్మస్థైర్యం వున్న ఆడవాళ్లే ఎక్కువగా వున్నారు.

( ఇంకా ఉంది )

– అంగులూరి అంజనీ దేవి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
77

 

ధారావాహికలు, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , Permalink

2 Responses to ఎనిమిదో అడుగు – 20

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో