జోగిని

santhi prabodha లెక్క మంచిగ మాటాడరు. మంచిగ సూడరు. ఏందేందో అంటరు” కొంత గారాబం పోతున్నట్లు కొంత బాధను దిగమింగుకొని అడిగినట్లు ఉంది ఆమె అడిగిన తీరు. ఆ పసిదాని మొహం చూస్తే జాలేసింది విద్యకి, కానీ తీసుకెళ్ళి తాను ఏం చేస్తుంది? ఇంట్లో వాళ్ళు చూస్తే జాలేసింది విద్యకి. కానీ తీసుకెళ్ళి తాను ఏం చేస్తుంది? ఇంట్లో వాళ్ళు ఆమెను పని మనిషిగా మారుస్తారనడంలో సందేహం లేదు. అయినా వాళ్ళ అమ్మ, అమ్మమ్మ, ఊర్కొంటారా…? తనకి ఉద్యోగం వస్తే, అప్పుడు తీసుకెళ్ళవచ్చు. చదువు చెప్పించవచ్చు అనుకొంది మనసులో. ”సబితా… నేను ఇంట్లో ఉండను కదా… చదువుకోవడానికి వెళ్ళిపోవాలి కదా..”

”చదువు కోవడానికి వెళ్ళిపోవాలా వద్దా…?”
”ఊ… నేను నీ తోటే అస్త. నేను బీ సదుకుంట” అంది గోముగా.
”మా సబిత మంచిది. నేను చెప్పింది వింటుంది కదా…” అని ఆమె తల నిమురుతూ ”నేను చదువుకునే చోట నీలాంటి చిన్న పిల్లల్ని రానీయరు కదా… అందుకని నీవు మళ్ళీ బడి పెట్టగానే ఇక్కడే చదువుకుంటావంట. కొందరు ఏదో అన్నారని మా సబిత బడి మానేసి ఇంట్లో కూర్చోదంట అవునా…” ఇందాక వాళ్ళు ముత్తెమ్మకు కొట్టిన కొబ్బరి చిప్ప తెచ్చుకు తింటున్న సబిత కేసి చూస్తూ. మళ్ళీ వెంటనే మాట మారుస్తూ ”సబితా, ముత్తెమ్మ ఇప్పుడు పడిపోయింది చూడూ… అలా ఇది వరకెప్పుడైనా పడిపోయిందా…? లేక ఇదే మొదటి సారా?” అడిగింది విద్య.

”ఎన్నడన్న గిట్లనే దేవుడొస్తది. గసొంటప్పుడు కుడ్క వక్కలు తెచ్కొని తింట” తన వెంట వస్తానని మళ్ళీ ఎక్కడ మారాం చేస్తుందోనని ”నువ్వు వెళ్ళు” అని సబితను పంపించేసి వడి వడిగా ముందుకు కదిలింది విద్య. ముత్తెమ్మను చూస్తే తన పిన్ని కూతురు రమ గుర్తొచ్చింది విద్యకి. దానికి పదమూడేళ్ళు. ఆడపిల్ల అవడంవల్ల తల్లి, తండ్రి, నాన్నమ్మ, తాతయ్య నుంచి చాలా వివక్షకు గురైంది. అన్న రాజు ఏది అడిగితే అది తెచ్చేవారు. ఇచ్చేవారు. వాడి కంట కన్నీరు కారితే ఇంటిల్లిపాదీ తల్లడిల్లే వాళ్ళు, ప్రతి విషయంలోనూ నీకేం తెల్సు? వాడిని చూసి నేర్చుకో… వాడితో నీకు పోటీ ఏమిటి? వాడు మగాడు. మగరాయుడులా నీవేమిటి? అంటూ రాజుతో నిత్యం పోల్చుతూ, చిన్న చూపు చూస్తూ రమలో ఆత్మన్యూనతా భావాన్ని నింపారు.

రమ చక్కగా కవితలు రాస్తుంది… అందమైన, అర్థవంతమైన చిత్రాలు గీస్తుంది. బాగా చదువుతుంది. అయినా ఇంట్లో ఆమెకు గుర్తింపు లేదు సరికదా…! గడ్డి పరక కన్నా హీనంగా చూస్తారు. రాజు ఏం చేసినా ఆహా ఓహో… అంటూ ఆకాశం అంత ఎత్తేసి పొగుపడుతారు. రాజుకి రమ తెలివి తేటలు, కళానైపుణ్యం, సాహితీ జ్ఞానం అంటే అసూయ. మగవాడినన్న అహంకారం ఎక్కువ. ఎప్పుడూ నీ మొహం నీకేం తెల్సు నీ కసలు బుర్ర ఉందా…? స్క్రూలూజు… అంటాడు ఎద్దేవగా… దాంతో రమ చిన్నబుచ్చుకొనేది. న్యూనత పడేది. చివరికి తిండి విషయంలోనూ వివక్షే. రాజుకి పెరుగైతే రమకి మజ్జిగ. బట్టలూ అంతే. వాడికి కోరిన బట్టలూ, ఖరీదైనవి కుట్టించి రమకేమో తక్కువ ఖరీదువి. నాసి రకంవి. జ్వరం వచ్చినా అంతే. వాడికి కొద్దిగా ఒళ్ళు వెచ్చ బడితే ఆ చాలు హడావిడి చేసేయడం. మొక్కులు మొక్కేయడం. రమకి జ్వరం వస్తే అదే తగ్గిపోతుందిలే రెండు లంకణాలు చేస్తే అనేవారు. ఈ విషయంలో పిన్ని కొద్దిగా కలవరపడినా ఆమె మాట ఆ ఇంట్లో చెల్లేది కాదు.

నిరంతరం తనని, తన తెలివి తేటల్ని కించపర్చడం, చిన్న చూపు చూడడం రమ తట్టుకోలేకపోయింది. ఘర్షణకు లోనైంది. తీవ్ర మానసిక వత్తిడికి గురైంది. ఫలితం కన్వర్షన్‌ హిస్టీరియా. పూనకం రావడం లేదా దేవుడు రావడం. కోర్కెలు తీర్చమనడం, ఇవన్నీ కూడా అణిచివేయబడ్డ కోరికల ఫలితమేననీ, మానసిక సమస్యలేననీ ఆ వత్తిడిని తప్పించుకునేందుకు శరీరం ఏర్పరచుకునే స్థితే హిస్టీరిక్‌ స్థితి అని ఆ మధ్య ఓ సైకో హిప్నోథెరపిస్ట్‌ రాస్తే చదివిన వ్యాసంలో విషయాలు గుర్తొచ్చాయి విద్యకి.

మనిషి జీవితంలో ఎదుర్కొనే సమస్యలు ఆ వ్యక్తిలో ఘర్షణని, ఒత్తిడిని కలుగుజేస్తాయి. ఈ రకమైన వ్యాకులతా స్థితిలో మనిషి స్పందనపై ఆ వ్యక్తి ఆరోగ్యస్థితి ఆధారపడి ఉంటుంది. వ్యాకులత, అపరాధ భావన, భయం, అవమానం, ఆత్మన్యూనతా భావం లాంటి వ్యతిరేక భావనలకు లోనైనట్లయితే ఆ సమస్యలను పరిష్కరించుకునే శక్తి, సమర్థత సన్నగిల్లి నిస్సహాయులై, బలహీనులై, మనోరుగ్మతకు లోనవడం జరుగుతుందనీ… ఆ సమయంలో మనిషి అపసవ్యంగా, హిస్టీరిక్‌గా ప్రవర్తిస్తాడనీ, అది ఒక రోగం కాదనీ, అణచబడ్డ అనుభూతుల సంఘర్షణల ఫలితం అనీ ఉందా వ్యాసంలో. చిన్నతనంలోని చేదు అనుభవాలు, నిరుత్సాహ పూరిత జ్ఞాపకాలు, పరిసరాల్లోని అనుభవాలు, వైఫల్యాలు, ప్రేమరాహిత్యం, నిరంతర అణిచివేత, అనాదరణల వల్ల ఎక్కువగా ఒంటరి స్త్రీలలో హిస్టీరియా వస్తుందనీ ఉంది ఆ వ్యాసంలో.

అదంతా గుర్తొచ్చిన విద్య, ముత్తెమ్మ కూడా జోగినిగా నిత్యం సంఘర్షణకు లోనై, నిస్సహాయ స్థితిలోకి జారి ఉంటుంది. దాని ఫలితమే హిస్టీరియా, ఫలితంగా… జనం దృష్టిలో ఆమెకు దేవత పూనింది. ఆమె దేవత అయింది. ఓసే… అసే… జోగుదానా…. అన్న వారితోనే ఆదరణ అందుకుంటోంది. పూజలు పొందుతోంది. ముత్తెమ్మ హిస్టీరిక్‌ ప్రవర్తన వెనక ఉన్న సామాజిక కారణాలు ఏమిటో రేపు తెల్సుకోవాలి. హిస్టీరియా పేషంట్లను గదిలో పెట్టి తాళం వేసేవారట. ఈ విధంగా ఆలోచిస్తూ… ఇంటికి చేరింది విద్య స్నానం చేసి ఫ్రెష్‌ అయినా విద్యకి పూనకం పూనిన ముత్తెమ్మే కళ్ళ ముందు మెదులుతోంది.

రాంబాయి వేయించిన పల్లీలు తింటూ… కవిత చెప్పే కబుర్లు వినాలని ఎంత ప్రయత్నించినా అవి చెవికెక్కడం లేదు విద్యకి. ” ఏమిటే… నేను చెప్పేది వింటున్నావా…? నీవు మరో రెండ్రోజులు ఉంటున్నావ్‌. నీతో పాటు హైదరాబాద్‌ వరకూ నేనూ వస్తున్నా… అవునా…” అంటున్న కవిత వైపు అయోమయంగా చూసిన ఆమె చూపుకి కవితక్కోపం వచ్చేసింది. అయినా వాతావరణం తేలిక చేయాలని ” ఇందాకట్నుండి నేను వసపిట్టలా వాగుతుంటే నువ్వెక్కడున్నావ్‌… ఏ లోకంలో…? నాకు తెలిసీ నిన్ను ఊహల్లో విహరింపచేసే రాకుమారుడెవరూ లేరే…” అంది కవ్విస్తున్నట్లుగా. ” సారీ కవితా… నీవేమనుకోనంటే ఉన్న విషయం చెప్తాను. నేను నీవు చెప్పేది విందామని ప్రయత్నిస్తున్నా… అయినా నా మనసు ముత్తెమ్మ మీదకే వెళ్తోంది.”

ముత్తెమ్మా… ఆవిడెవరే…ఆ జోగుదేనా?
నిరసనధ్వనిస్తుండగా అంది కవిత. ”అవునే… మొన్న శవం ముందు డాన్స్‌ చేసిన వాళ్ళలో ఒకామె.” అదేమీ పట్టించుకోకుండా జవాబిచ్చింది విద్య. అంతలో రాంబాయి కూడా అక్కడ చేరింది. ”ఏమైంది ఆమెకి!” కుతూహలంగా అడిగింది. జోగినీలలో తన కుటుంబానికి ఉన్న సంబంధం ఆమెకు తెలియనిదేం కాదు. ”ముత్తెమ్మ ఇందాక హిస్టీరియాతో పడిపోతే ఆమెకు దేవుడొచ్చిందని అందరూ దేవతలా చూశారు. కొబ్బరి కాయలు కొట్టారు. లెంప లేసుకుని ఆమె కోరికలు తీరుస్తామని వాగ్దానం చేశారు” అంటూ జరిగిన సంఘటన వివరించింది విద్య. అది విన్న రాంబాయి ” మా ఊర్లో మస్తు మందికి అస్తది దేవుడు” చాలా సామాన్య విషయం అన్నట్లుగా అంది. ”అవును విద్యా… నా చిన్నపుడు అమ్మక్కూడా వచ్చేది” చెప్పింది కవిత. ”నిజమా…? మీకెందుకు వచ్చేది? ” రాంబాయి కేసి పరీక్షగా చూస్తూ అడిగింది విద్య
”ఎందుకేంది? అందరికి ఎందుకొస్తున్నదో… అట్లనే నాకు అస్తుండె”.

”అది కాదు ఆంటీ… అది ఒక రోగం కాదు.. మనసులో పడే బాధను బయటికు చెప్పుకోవడానికి మార్గం లేకపోతేనో.. మీరు అనే ఆ.. దేవుడు వస్తుంది.. దీన్నే డాక్టరు దగ్గరకు వెళ్తే హిస్టీరియా అని చెప్తారు. మీకు… మీకూ.. అంతటి బాధలు ఉండేవా…? మీరూ బాధలు పడ్డారా…?” ఆశ్చర్యంగా అడిగింది విద్య. అటూ… ఇటూ… చూసి భర్త దరిదాపుల్లో లేరని నిర్ధారించుకొని ” ఏం చెప్పాల్నే బిడ్డా… కవిత చిన్నగ ఉండంగ మస్తు బాధలు పడ్తి” అంటూ చెప్పడం మొదలు పెట్టింది.
”నేను నలుగురు అన్నదమ్ముల నడుమ పుట్టిన ఆడపిల్లను. నేను పుట్టినంకనే

లక్ష్మి కల్సివచ్చి మా నాయిన బాగా సంపాదించిండంట. మా ఇంట్లో మా లక్ష్మి అనేటోల్లు. ఆడపిల్లను ఒక్కదాన్నే గద అన్నదమ్ములు పానం పెడ్తుండ్రి. నాకేది కావాల్నంటే అది జేస్తున్రి. చుట్టు పక్కల ఊర్లల్లో భోజాగౌడ్‌ కుటుంబం అంటే బాగా డబ్బున్నది. కల్లు మామ్లల్ల (కల్లు,సారా కాంట్రాక్టుల్లో) మస్తు సంపాదిచ్చిన్రు. ఊర్లె ఆయనే పటేల్‌. అసొంటి గొప్ప ఇంట్ల మా నాయన నన్ను ఇచ్చిండు. పదివేలు కట్నం చీర సారెలతోని ఘనంగా ఈ ఇంటికి తోలిండు.

అగ్గో.. అట్ల మీ అంకులు చేయిపట్టి ఏడడుగులు నడిస్తి. ఈ ఇంటికి జేరితి. ఇల్లు, వాకిలి చూసి మురిస్తి. లగ్గం అయినంక కొన్ని ఒద్దులకే తెల్సింది. మీ అంకులు తాగుడు… ఆయన చెప్పినట్లు ఇనాలని తిట్టుడు… ఏది జేసిన ఏదో అంక బెట్టి తిట్టుడు. గా … జీతగానితోని ఎందుకు మాట్లాడినవ్‌…. ఆ.. దిక్కు ఎందుకు జూసినవ్‌…. అనినన్ను ఏపుకుతినెటోడు. అన్ని బరాయించుకుంట వస్తుంటి. మా అమ్మగారింటికి పోయి అన్నలకు జెప్తే అమ్మకుజెప్తే…. నాయనకు జెప్తే… వాళ్ళ దగ్గరే ఉండమంటారేమోనని ఓ చిన్న ఆశ.

మళ్ళీ అంతల్నే…. పెండ్లి జేసి పంపినం. మా పనైపోయింది. మంచైనా, చెడైనా, చావైనా, బతుకైనా ఆడనే అంటరేమోనని బయం. నాలో నేనే ఘర్షణ పడ్తూ… బాధపడ్తున్న నేను కవిత తమ్ముడు కార్తీక్‌ పుట్టుకకు పురిటికి పోయిన. పురుడైనంక ఇరవై ఒకటికి మీ అంకులు వచ్చిండు. మూడో నెలల తోల్క పోతనని చెప్పిండు. మా అమ్మ దగ్గరకు పోయి అమ్మ… ఇక నేను ఆడికి పోనే… ఈడ్నే ఉంట అని ఏడ్సిన. అనుకున్నంత అయ్యింది. ఎంద్కు పోవు బిడ్డా. నీ కడుపుల ఉన్న బాధేంది బిడ్డా… అని అడక్కపోయిరి. అదేందే గట్ల మాటాడబడ్తివి. లగ్గమైంది నీకు ఇక ఇది నీ ఇల్లు కాదు. అదే నీది. చావైనా బతుకైనా ఆడనే. ఇంటి ఆడబడుచు గా ఏదో చీర, సారె అంతే మానుండి నీకు అందేడ్ది అంటూ సుద్దులు చెప్పింది మా అమ్మ. ఇంక నా గొంతుల మాటలు నా గొంతులోనే పూడ్క పోయినయ్‌. నన్ను అంత మంచిగ చూసుకునే పుట్టింటోల్లు ఇట్లనేసరికి నాకు పుట్టింటి మీన ఉన్న మమకారమే పోయింది. మనసు ఇరిగిపోయింది.

నేను రానన్న ముచ్చట మా ఆయనకు తెల్సింది. ఇంక జూడు రోజూ తన్నులే, గుద్దులే… ఎవడే… ఎవడున్నాడే నీకు రంకు మొగుడు అక్కడ అంటూ… దినాం గీ బాదలెట్లా బడుడు? బాయిల పడి చస్తనని బాయిదాంక పోయిన. దుంకబోతే నా ఎన్కనే అచ్చిన కవిత నా కాల్లకు సుట్టుకొనె… ఇంట్లకెల్లి సంటోని ఏడ్పు.. పిల్లగాల్లకు అనాధ చెయ్యలేక అట్లనే ఇంట్లకు పోతి, నా బాధ ఎవరితోని చెప్పుకోను? ఎవరున్నరు ఇనెటంద్కు…

మీ అంకులు జోగు సాయవ్వ దగ్గరకు పోయెటోడని తెల్సు. అది పండుగలప్పుడు అడుక్కునే తందుకు ఇంటికి వస్తుండె. ఇంట్ల ఏ శుభ కార్యం జరిగినా జోగోల్లను పిలుస్తుంటిమి. దీపం పట్టుకొని ఆల్లు(జోగినిలు) నడిమింట్ల తిరుగుతే శుభం జరుగుతందట. అది నా సవితి అయిన నేనేం బాదపడలె. ఏదో ఆచారం అట్ల నడుస్తది అని సర్దిపెట్టుకుంటి. కానీ.. దాని బిడ్డ జోగు పోశవ్వని సుత ఈయనే చెరబట్టె. నిజానికి అది ఈయన బిడ్డేనట. జనం చెప్పుకుంటరు. దానికి పన్నెండు పదమూడేండ్లు ఉన్నయో లేదో… గప్పటికి అది పెద్దదయిందో లేదో మరి! గానీ, దాన్ని నాశనం జేసిండు. ఏడాది లోపట దానికి బిడ్డ

ఏంది జన్మ… ఎన్నటికి గింతేనా… ఆడోల్ల బతుకు..? అని మస్తు ఫికరు బడ్తి. గప్పుడొచ్చింది నా మీనకు పార్వతమ్మ… అట్ల రెండుమూడు సార్లు వచ్చింది. అపుడే పానం మంచిగ లేకుంటే పట్నంల దవాఖానాకు కొంటబోయిండు మా మామ పోరుబెడ్తె. అపుడు ఆడ డాక్టరు ఏం జెప్పిందో… ఆల్ల అన్న ఏం జెప్పిండో ఏమో గానీ… నన్ను ఏపుక తినుడు బందు జేసిండు. మంచిగానే చూసుకుంటున్నడు. విద్య, కవిత లిద్దరూ రాంబాయి చెప్తున్నంత సేపూ అలా స్థాణువులై వింటూండిపోయారు.

అమ్మ, నాన్నతో ఇంత బాధపడిందా…? నాన్న అమ్మని కొట్టడం, చీటికీ మాటికీ తిట్టడం తనూ చూసింది. అందుకే ఆయన్ని చూస్తే తనూ చాలా భయపడేది. కాలేజీలో చేరిన తర్వాతే గదా కాస్త భయం పోగొట్టుకుని మాట్లాడేది. తను చిన్నప్పుడు చూసిన నాన్నకీ, ఇప్పటి నాన్నకీ ఎంతైనా… చాలా తేడా వచ్చిందిలే. అమ్మకు దేవుడు వచ్చేదని కవితకు తెల్సు. కానీ అది వింతగానూ, కొత్తగానూ ఎప్పుడూ అనుకోలేదు. అలా ఎందుకు వస్తుందో ఆలోచించనూ లేదు. ఆనాటి నుండి ఇప్పటి వరకూనూ. కారణం ఊళ్ళో ఆ విధంగా దేవుడు వచ్చిందనే స్త్రీలను చూసి ఉండడం వల్లనేమో! అయితే దాని వెనుక దాగి ఉన్న కఠోర సత్యాలూ, తన తల్లి పడిన వేదనా… ఆవేదనా… తనకేమీ తెలియదు. తల్లి ఎపుడూ చెప్పలేదు. తనూ తల్లికి బాధలుంటాయనే ఊహించలేదు. ఆ కోణంలో ఆలోచించలేదు. తన తండ్రి అలా ప్రవర్తించే వాడంటే, అనుమానంతో శారీరకంగా, మానసికంగా తల్లిని హింసించే వాడంటే ఎందుకు? తనలా తల్లి ఎక్కడ ప్రవర్తిస్తుందో నన్న భయంతోనా…? అలా హింసించి ఆమె నోరుఎత్తనీయవద్దు. అణిచే ఉంచాలన్న ఆలోచనలతోనా…. తనవిషయం బయట పడుతుందనా..? కొత్తగా ఆలోచించడం మొదలు పెట్టింది కవిత.

పోశవ్వ కోపానికి కారణం ఇదన్నమాట! రాజాగౌడ్‌ జోగినుల గురించి అడిగితే చెప్పకుండా దాటెయ్యడానికి అతని వ్యవహారాలు తనకు తెలుస్తాయనా…? స్త్రీ, పురుష లక్షణాలు పుట్టుకతో సహజంగా వస్తే. చాలా గుణాలకి అలవాట్లు, ఆచారాలు, సామాజిక నీతి నియమాలు, సంప్రదాయాల ప్రకారమూ, కుటుంబంలో పెంపకమూ కారణం అవుతాయి. ఆడది తిరిగి చెడింది. మగాడు తిరక్క చెడ్డాడు. అని సామెతలు చెప్పి ఆడదాన్ని ఇంటికే కట్టిపడేశారు. స్త్రీకి మచ్చపడితే అది పోదని చెప్పి ఆమెను తమ అదుపాజ్ఞలలోనే ఉండాలని ఆదేశిస్తారు. కానీ మగవాడు తన ఇష్టం వచ్చినట్లు తిరగొచ్చు. అతని జీవితంపై ఏ మచ్చా పడదు. అతన్ని ఎవరూ వేలెత్తి చూపరు. అదో గొప్పదనం. మగతనంగా భావిస్తారు. కీర్తిస్తారు. జెండర్‌ విషయాన్ని ఆలోచిస్తూ… విద్య. ఎవరి ఆలోచనల్లో వారు… ఎన్నాళ్ళుగానో మోస్తున్న భారం ఏదో దిగిపోయినట్లు ఫీలవుతూ సాయంకాలపు పని మొదలు పెట్టడానికి లేచింది రాంబాయి.

ఇపుడు విద్య జోగోళ్ళ ఇళ్ళకు వెళ్తుంటే ఎవరూ ఆశ్చర్యపోవడం లేదు. నోరు వెళ్ళబెట్టడం లేదు. వింతగా అన్పించడం లేదు. కానీ, ఆమెను అలా చూస్తూనే ఉన్నారు. తాము చేస్తున్న పనులు ఆపి. ఆమె అంటే విధమైన గౌరవం, అభిమానం వారిలో. ముత్తెమ్మ ఇంటికేసి వెళ్తున్న విద్య చేయి అందుకుంది పరుగెత్తి వచ్చిన సబిత. విద్య వస్తూ తన దగ్గర ఉన్న రబ్బరు బాండ్లు, క్లిప్పులు, బొట్టు బిళ్ళలు సబిత కోసం తెచ్చింది. అవి చూసిన సబిత తెగ సంబరపడిపోయింది. గర్వపడింది. వెంటనే, ‘ అక్కా ఇపుడే అస్త’ అంటూ వాళ్ళింటికి పరుగెత్తింది. అమ్మకి, ఆయికి ఇంకా అడిగినోళ్ళకి అడగనోళ్ళకి చూపించడం కోసం. విద్య వెళ్ళే సరికి ముత్తెమ్మ గోడ వారగా కూర్చోని బియ్యం ఏరుతోంది. లోపల ఓ మూలగా కల్లు సీసాలు ఈగలు ముసురుతూ… ఉట్టిమీద చద్ది అన్నం గిన్నె… దాచిపెట్టిన ఆమె కోరికలు, ఆశల్లా, శుభ్రంగానే ఉన్నా, పెళ్ళలూడిపోయి, గతుకులుగా ఉండి వెలసిపోయిన గోడలూ… బతుకులో ఎన్నెన్నో కడగండ్లు…. వడగండ్లూ.. మరెన్నో ఎత్తుపల్లాల్నీ చూసిన వయసు మళ్ళిన ఆ తల్లీ కూతుళ్ళలా… విద్యని చూడగానే చేతిలో చేట పక్కన పెట్టి గౌరవంగా లేచి ”కూసో అక్కా” అంటూ పీట వేసింది ముత్తెమ్మ.

”ముత్తెమ్మా నీవేమనుకోనంటే ఒక మాట అడుగుతాను చెప్తావా?” సూటిగా అడిగింది విద్య.
”ఎందుకు చెప్పు బిడ్డా… మేం ఏందో… మా బతుకేందో అంత విప్పితిమి. ఇంక మీ తాన దాచెడ్ది, కప్పి పెట్టేడిది ఏముంటది?
”ముత్తెమ్మా నీకు నిన్న దేవుడొచ్చింది కదా! ఇది వరకెపుడైనా అలా వచ్చిందా…”
లోపల మంచం మీద పడుకున్న పోసానికి ఈ మాట విన్పించిందేమో ”మా లెస్స గట్లనే అచ్చింది” అని ముత్తెమ్మ కంటే ముందు జవాబిచ్చింది.
”అక్కా… నీ తాన దాచేడిది ఏంది గనీ… రెండు మూడు సార్లు ఇరుచుక పడిపోయిన. అట్ల ఎట్లయిందో గనీ… గపుడు నా మీనకు ఎల్లమ్మ అచ్చిందన్నరు. గందుకే గట్ల మాటాడినన్నరు. అంత నన్ను ఎల్లమ్మ లెక్కనే చూసిన్రు. ఆరతి బట్టిన్రు. కొబ్బరి కాయ కొట్టిన్రు. కానీ… గిప్పుడైతే నిజంగా నా మీనకు ఎల్లమ్మ అస్తలేదు. ఏమీ పూన్తలేదు”. నిజాయితీగా చెప్పింది ముత్తెమ్మ.

”నాకేం అర్థం కాలేదు ముత్తెమ్మా” అర్థం అయీ కానట్లున్న విద్య ”అవ్‌.. అక్క…గీ ముసలి ముండలకు ఎవల్లు కాస్తరు! ఎవరు గింత ముద్ద ఏస్తరు? అయిసోల్లకంటే అడ్డెడు గాదు కుంచెడు అంటరు. పీనుగుల ముంగట ఆడిన, పండుగలకు, జాతర్లకు ఆడిన ఎంతొస్తది! చిల్లరంత ఏ రంగ ముప్తై నలభై రూపాలైతయ్‌. గవీట్నీ జోగోళ్ళం, పోతరాజోడు అందరూ గల్సి పంచుకోవాల్నాయే. దానితోని మా గాస మెల్తదా..? ఏది కొందమన్న ఏడాదేడాది ధరలు మీది మీదికే సుక్కల్లకేనాయె. గా సుక్క కిందికి దిగేడ్ది ఉన్నదా? నా మీనకు ఎల్లమ్మ అచ్చిందని, ఛీ జోగుది… అసుంట దూరం దూరం నూకినోల్లే గిపుడు నా తాన రావడ్తిరి… కాన్కలివ్వబడ్తిరి.. ముడుపులు కట్టవట్టె.

(ఇంకా వుంది)

– శాంతి ప్రబోధ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

25

ధారావాహికలు, , , , , , , , , , , , , , , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో