ఎల్లమ్మ పరుగునొస్తున్న తల్లిగోడు విన్న నీలమ్మ ”ఓయ్యో మా అమ్మొచ్చిందే లేయే” అంటూ బిగ్గరగా అరిచి తల్లి దిక్కు చేతులు చాపంగానే ఎల్లమ్మ ఒక్క ఉదుటన ఇంట్లోకి వచ్చి బిడ్డను పట్టుకుని బోరుమన్నది. తల్లిని చూస్తుండగానే నీలమ్మ దుఃఖం కట్టలు తెంచుకుంది. పదకొండు పన్నెండయ్యేసరికి చుట్టాలు పక్కాలందరు వచ్చారు. సత్తయ్య వాకిలంతా ఏడ్పులు పెడబొబ్బలతో నిండిపోయింది. పెద్దలందరు ఒక్కదగ్గర చేరి ”ఇంగో ఆళ్ళ పెద్దనాయిన ఉర్లో లేడు నిన్న పొద్దుగాల్ళనే బర్లబారంకి పోయిండట. ఏ వూరికి పోయిండో తెల్వదు గిప్పుడు సావుదినాలు ఎట్ల జేస్తరు చెప్పండ్రి” అన్నారు. ”ఎట్లంటే మేమందరం లేమా” అన్నాడు చంద్రయ్య. ”గదికాదు కొడ్కా సత్తిగాడు ఇంకా రాకపాయే ఆడు వచ్చేదాకా ఆపుదామా” అన్నాడు.
”గట్లేం వద్దు ఇప్పటికే రాత్రింపగళ్ళు రెండు పూటలాయే ఇంకెంతసేపు పీనుగుని ఇంట్ల పెడ్త జెప్పండ్రి. చలో సావు ఎవళ్ళు జేస్తరో జెప్తె కట్టెబట్ట తీసుకొద్దాం” అన్నాడు ఇంకొకతను.
పక్కనే నిలవడ్డ ముత్తమ్మ ”ఎవలో ఎందుకే నా తమ్ముని సావు నేనూ జేస్త ఆడు నా తోడ పుట్టకున్నా నా పెద్దనాయిన కొడుకే నా తమ్ముని సావు నేను చేస్తా” అని ముందుకు వచ్చింది. ”మీ యింటి ఆడపిల్ల సావుజేస్తానంటోంది. ఒకలెక్క తీర్గనైతే యింటి ఆడపిల్లలకీ సావుజేసే హక్కుంది మూడోద్దులు దినాలు ఇంగ మీరు సోంచాంచుకోండ్రి చంద్రయ్య కట్టెబట్టుకు పోదాం నడ్వండ్రి” అంటూ పెద్దలంతా లేచారు. ముత్తమ్మ రూపాలు ఇయ్యంగానే పెద్దలందరు బజారుకు పోయి కట్టెబట్ట తెచ్చారు. ఇంటి బయట డప్పుల మోత మొదలై ముందుకు కదులుతుండగా సురేందరుకు తెల్ల రుమాలు కట్టించి బాయి దగ్గరకు తీసుకుపోయి నీళ్ళుపోసి నుదుటన విబూది రుద్ది కొత్త కుండలో నీళ్ళు తీసుకువచ్చి బయటనున్న నిప్పుల మీద నీళ్ళు కాచారు.
డప్పుల మోతను వింటుంటే నీలమ్మ గుండెల్లో గునపాలు గుచ్చినట్లుగా ఉంది ఇంకా కొద్దిసేపటి వరకే భర్త రూపు తన కళ్ళముందు ఉంటుందని అర్థమయి ఆమె దుఃఖం మరింత కట్టలు తెంచుకుంది.
శవంపైన ఏడుస్తున్న వాళ్ళనందరిని పక్కకు జరిపి వాకిట్లో పీటమీద కూర్చోపెట్టి మొగులయ్యకి కుండలోని నీళ్ళుపోస్తుంటే
మరోదిక్కు నీలమ్మకు ఆడవాళ్ళంతా కల్సి నీళ్ళుపోసి చెరోదిక్కు ఇద్దరికి బట్టలు కట్టించి బయట అరుగుమీద పీటలేసి పంచకు కూర్చోబెట్టాక ఎల్లమ్మ సాలయ్య కూతురు అల్లుడికి ఓడిబియ్యం పోస్తూ, నీలమ్మను పసుపు బట్టల్లో చూసి ”బిడ్డా నాతోటి బియ్యం పోసుకొనుడు ఇదే ఆకరా” అంటూ గుండెలవిసేలా ఏడ్చింది. అప్పటికే మరోదిక్కు పాడె సిద్దమైంది. మొగులయ్యని పాడెపై పడుకోబెట్టి బట్టకప్పి సుతిలి తాళ్ళతో బిగించాక పాడేలేచింది. లేచిన పాడెవెంట పాడెకట్టను పట్టుకొని భర్తవెంట చివరిసారిగా జీవచ్ఛవంలా అడుగులేస్తు. ”ఓయ్యా నీముందే నా పానం పోవాలన్కున్ననే, నా ముందలనే నువ్వు గిట్లయి నన్ను యిడిసి పోతున్నవా నువ్వులేక నేను ఎట్ల బత్కలేనే, నన్ను కూడా నీ ఎంట తీస్కపోరాదే, నీ దిక్కెల్లి పిల్లలడిగితే నేనేం సెప్పాలే నేనెట్ల బత్కాలే” అంటూ దారంతా తలబాదుకున్నది.
”నీలమ్మ ఇంగ ఊకో ఊకో పిల్ల, నువ్వుగూడా సస్తే నీ పిల్లగాలేంగావాలే జెర ధైర్యం తెచ్చుకో నీలమ్మ” అంటూ సంగమ్మ ఓదార్చినా నీలమ్మనూ ఆపటం ఎవరి తరం కాలేదు. శ్మశానం దగ్గరకు వెళ్ళాక దింపుడుకళ్ళెం చేసి మొగులయ్యని చితిపైకి చేర్చారు. సురేందరు చేత్తో చితికి మంట అంటించేసరికి ఆ దృశ్యాన్ని చూసిన నీలమ్మ స్పృహ తప్పింది.
మూడొద్దులు జరిగే నాటికి కూడా సత్తయ్య ఇంటికి రాలేదు. చుట్టుపక్కల గుసగుసలు పోచమ్మ చెవిన పడంగనే ”అడ్డమైనోళ్ళంతా నువ్వు మంత్రాలు జేసిన వంటుండ్రయ్య, నువ్వు ఏ పనిమీద ఏ ఊరికి పోయినవో గాని ఆ పత్తా నాకెర్కలేదయ్య, మంది నోర్లుగట్ట నాతరమా, ఈళ్ళమీద మన్ను వడనయ్యో, ఈళ్ళ మీద దుమ్ముపడనయ్యో” అంటూ అందరు వినేట్టుగానే వాకిట్లో కూర్చుని సోకాలు పెట్టింది. ”గీడ ఓ దిక్కు పోరడు సచ్చిండన్న పికరు లేకుండా ఆడట్లన్నడని ఈడిట్లన్నడని ఏడుస్తుందేందన్నా మొగులయ్యగాన్ని రవుసువెట్టి రవుసు పెట్టి సాగనంపిరి.
ఇంగ ఇంకేందంట ఇల్లుగాని ఒకడేడుస్తుంటే ఇంకేదో అయి ఇంకొకడేడ్సినట్లు మొగని దిక్కెళ్లి ఏడుస్తుంది ఇనుండ్రియ్యా” అని కోప్పడ్డాడు రంగయ్య.”పోనీ తమ్మి గిప్పుడు గీ సుద్దులన్ని కెలికితే అది రాసపుండు లెక్క సలసల మంటుంటది. గిప్పుడు గీ పోల్లెట్ల పిల్లల్నేసుకుని బత్కుతోదనని సోంచాంచాలే గాని కోట్లాటలు తిట్లాటలు కాదురా” అని చంద్రయ్య సముదాయించాడు.
పోచమ్మ మాటలు, సోకాలు నీలమ్మకు వినపడ్డ వాటి గురించి ఆలోచించే స్థితిలో లేదు. మనస్సంతా భర్తేనిండి ఉండి అతని జ్ఞాపకాలే ఆమె చుట్టూ మూగాయి. రెండు మూడు రోజులు దాటాక తండ్రి చచ్చిపోయాడని గ్రహించిన సురేందరు, సుభాషు తండ్రికోసం తల్లిని అడుగుతున్నారు. ఆశగా అటుఇటు చూస్తున్నారు. ఇది నీలమ్మకు మరింత రంపపుకోతలా ఉండి కొడుకులను సముదాయించలేక సతమతమౌతూ కన్నీరు పెట్టింది.
మిగతా సమయాల్లో మౌనంగా ఓ మూల కూర్చుంటే కళ్ళెదుట సంసారం జ్ఞాపకాలు ఇల్లంతా పరుచుకున్నట్లు అమాస చీకట్లో వెన్నెల ముగ్గేసినట్లు కాని అది అసాధ్యమని గుర్తుకు వచ్చి భవిష్యత్తంతా అంధకారంలా తోచింది. వారం రోజులు గడిచాకా సత్తయ్య ఇంటికి తిరిగివస్తూనే విషయం తెల్సుకుని సురేందరును, సుభాషును దగ్గరుకు తీసుకుని మొసలి కన్నీరు కార్చాడు. నీలమ్మను కన్న బిడ్డలా చూసుకుంటానని సాలయ్యకు మాట ఇచ్చాడు. కసాయి వాడిచేతిలో మేకపిల్లను పెట్టినట్లు నీలమ్మను మళ్ళీ సత్తయ్య చేతిలోనే పెట్టడం పాలోళ్ళకు నచ్చలేదు. కాని నీలమ్మ బతుకుదెరువుకు మరోదారి లేదని ఎవ్వరు కిమ్మనలేదు. దినాలు పూర్తయి ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయేసరికి తూకం ఏస్తానని గంపలో వేసిన వరి విత్తనాలు సగం మొలకెత్తి సగం మొలకెత్తక ఎండిపోయి అంతా పనికిరాకుండా పోయింది. నీలమ్మ ఆ గంపను అట్లనే తీసుకుపోయి మొగులయ్య దున్నిన పొలంలో పడేసింది.
ఇక ఇప్పట్నించి చాలా తెలివిగా పావులు కదపాలని నిర్ణయించుకున్నాడు సత్తయ్య. మొగులయ్య చావుకి తానే కారకుడినని నీలమ్మకు తెలియనియ్యొద్దనుకుని ఆ ఏడు తన పంట పొలం వరకే దున్నుకుని నాట్లు ఏసుకున్నాడు. మొగులయ్య పొలం ఇప్పుడు అందరి దృష్టిలో నీలమ్మది, నీలమ్మ పిల్లలదైపోయింది. ఆ ఏడు ఆమె జీవితంలాగే పొలమంతా బీడుపడింది. ఎంతటి గాయాన్నైనా కాలం మాన్పుతుంది. ఎంతటి ముఖ్యమైనదాన్నైనా దగ్గరకు చేసి దూరం చూసే శక్తి ఒక్క కాలానికే ఉంది. ప్రతినెల జీతాలు రాగానే కూతురికి రాషను ఇప్పించి ఆమె ఆలనాపాలనా చూస్తోంది ఎల్లమ్మ.