బెంగుళూరు నాగరత్నమ్మ

వి.శ్రీరామ్

వి.శ్రీరామ్

1909 లో ఆరాధన చాలా బాగాజరగడంతో ఇదే ప్రణాళిక రానున్న కాలంలో కూడా అమలు జరగాలని తిలైలస్థానం సోదరులు నిర్ణయించారు. జనాదరణతోపాటు మలై క్కోటై గోవిందస్వామి పిళ్ళైలాంటి విద్వాంసుల సహకారం వుండడంతో 1910 ఆరాధన ఘనంగా జరిగింది.23 సోదరులిద్దరూ ఒకే మాటగా పనిచెయ్యడం చూసి ఓర్వలేనివారూ వున్నారు. వాళ్ళ కుతంత్రాల వల్ల ఇద్దరి మధ్యా భేదాభిప్రాయాలు తలెత్తాయి. ఆర్థిక విషయాల గురించి పరస్పరం అనుమానాలు మొదలై 1910 చివరికి ఒకరితో ఒకరు మాట్లాడుకోని స్థితికి చేరారు. 1911లో ఆరాధన నాటికి నరసింహ భాగవతార్‌ తాను తిరువయ్యారు రాననీ, కుంభకోణంలో తాను నిర్వహించే ఆరాధనకి రమ్మని కళాకారులకీ, శ్రేయోభిలాషులకి ఆహ్వానం పంపాడు. పంజు భాగవతార్‌తో పాటు మరికొందరు రాజీ ప్రయత్నాలు చేశారు. త్యాగరాజు సమాధి వున్న చోటకాక వేరే చోట ఆరాధన జరపడం సరికాదని వారి అభిప్రాయం. ఇది కొత్త వాదన. ఎందుకంటే దాదాపు 60 ఏళ్ళుగా త్యాగరాజు శిష్యులున్న గ్రామాల్లో వర్థంతులు జరుపుతున్నారు.

అయినా రాజీ కుదరలేదు. నరసింహ భాగవతార్‌ తన పంతం వదల్లేదు. తిరువయ్యారు వాళ్ళు నిరాశ చెందారు. కాని తమ కార్యక్రమం ఆపలేదు. పురప్రముఖులూ, సంగీతజ్ఞులు దాన్లో పాల్గొన్నారు. ఆ కరపత్రాలు, ఆహ్వాన పత్రాలు పంచారు. విరాళాలు బాగా వచ్చాయి. ఎప్పటిలాగానే అయిదురోజులు ఘనంగా జరిగాయి. ఆఖరిరోజు సమాధి దగ్గర పంజు భాగవతార్‌ శ్రాద్ధకర్మలు నిర్వహించడంతో ఆరాధన ముగిసింది.25 చివరికి అన్ని అడ్డంకుల్నీ తొలగించిన ఆంజనేయస్తుతీ ఎప్పటిలాగానే జరిగింది.
మలై క్కోటై గోవిందస్వామి పిళ్ళైలాంటి విద్వాంసులతో కలిసి నరసింహ భాగవతార్‌ నాయకత్వంలో కుంభకోణంలో కూడా ఆరాధన ఘనంగానే జరిగింది. మరి కొద్దికాలానికే నరసింహ భాగవతార్‌ మరణించాడు. దాంతో, ఇక ఆరాధన ఎలా జరపాలో తెలియని సందిగ్ధంలో పడ్డారు అతని సహచరులు. తిరువయ్యారులో కాక కుంభకోణంలో ఆరాధన నిర్వహించడం వల్ల అతను అకాల మరణం చెందాడని కొంతమంది అనుకున్నారు. 1912 నుంచీ కుంభకోణం బృందం కూడా తిరువయ్యారులో ఆరాధన జరపాలని నిర్ణయించు కున్నారు.26
దాంతో కుంభకోణం బృందాన్ని పెరియకచ్చి అనీ, పంజు భాగవతార్‌ బృందాన్ని చిన్న కచ్చి అని పిలిచేవారు.27 రెండు బృందాలూ పోటాపోటీగా ఆరాధన నిర్వహణ ఏర్పాట్లు చేసేవారు. తిరుచ్చిలో వుండే గోవిందస్వామి పిళ్ళై పెరియకచ్చి కోసం అక్కడ విరాళాలు సేకరించే వాడు; మునుస్వామి నాయుడు మద్రాసులో సేకరించేవాడు. మద్రాసులోని టి.ఎస్‌. సబేశ అయ్యర్‌ అనే సంగీత కళాకారుణ్ణి తమవేపుకి తిప్పుకున్నారు చిన్న కచ్చి బృందం. అతను త్యాగరాజ పరంపరకి చెందిన వాడు. అతని పూర్వీకులు తిరువయ్యారులోని పదిహేను మండపాల వీధిలో వుండేవారు. రాజు అంగీకారంతో త్యాగరాజు తండ్రి వారికి కొంతభూమి పంచాడు.28

1912 నుంచీ తిరువయ్యారు గ్రామస్థులు ఒకేసారి జరిగే రెండు ఆరాధనోత్సవాలూ కళ్ళారా చూసేవారు. పెరియకచ్చి బృందం కల్యాణ మహల్‌లో కార్యక్రమాలు నిర్వహించే వాళ్ళు. అది తంజావూరు రాజుల విడిదిగృహం. చిన్నకచ్చి బృందం పచ్చయప్ప మొదలియార్‌ సత్రంలో జరిపేవారు. ఆరాధన రోజున మొదట చిన్న కచ్చిబృందం సమాధి దగ్గర పూజ చేసేవారు; తర్వాత పెరియ కచ్చి బృందం చేసేవారు. రెండు ఊరేగింపులూ వేడుకగా జరిగేవి. చిన్న కచ్చి బృందం పొద్దున్నే నదిలో స్నానం చేసిసన్నాయి మేళంతో సమాధి చేరుకునేవారు. అక్కడ పంజు భాగవతార్‌ శ్రాద్ధకర్మలు చేస్తాడు. తర్వాత కొందరు విద్వాంసులు త్యాగరాజ కీర్తనలు గానం చేస్తారు. అక్కడ నుంచీ 8.30కి బయల్దేరతారు. దారిలో కుంభకోణం రోడ్డులో పెరియకచ్చి బృందాన్ని కలుస్తారు. ఆ అపురూప దృశ్యం చూసేందుకు జనం తండోపతండాలుగా వచ్చేవారు. ఆ తర్వాత పెరియకచ్చి బృందం సమాధి దగ్గరకి చేరేవారు.29 వీళ్ళ తరఫున రాముడు భాగవతార్‌ పూజ చేసేవాడు. అతను త్యాగరాజు అన్న జపేశుడు వారసుడు. కాని అతను పేరు పొందిన సంగీత విద్వాంసుడూ కాదు, హరి కథకుడూ కాదు. అతన్ని పూజకి ఎందుకు ఎంచుకున్నారనేది తేలని విషయం. త్యాగరాజుకి దూరపు బంధువు కావడమే అతని అర్హత. దీన్నికూడా కొందరు ఎగతాళి చేసేవారు. ఎందుకంటే త్యాగరాజుని అతని అన్న చాలా హింస పెట్టాడు. దాని ప్రస్తావన కాపి రాగంలో ‘అన్యాయము సేయకురా’ అనే కీర్తనలో వుంది కూడా.30 అందుకని త్యాగరాజు అభిమానులకి ఇతను పూజ నిర్వహించడం నచ్చలేదు.

రెండు వర్గాల వారూ ఒకేసారి ఆరాధన జరపడం వల్ల కొన్ని ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ అన్న సంతర్పణలూ, సంగీత కచేరీల వల్ల తిరువయ్యారూ, చుట్టుపక్కల వూళ్ళ వాళ్ళకి ఆ అయిదురోజులూ పండగలా వుండేది. కాని కొన్ని చికాకులు కూడా వచ్చిపడ్డాయి. పెరియకచ్చి వాళ్ళ తర్వాత చిన్న కచ్చివాళ్ళ అన్న సంతర్పణ వుండేది. దాంతో కొందరు తిండిపోతురాయుళ్ళు అక్కడ మొదటిపంక్తిలో తిని, మళ్ళీ ఇక్కడ చివరి పంక్తిలో కూర్చునేవారు. ఇక సంగీత కచేరీల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురయ్యేవి. బాగాపేరుపొందిన విద్వాంసుడు ఒక చోట కచేరి చేస్తుంటే, రెండో చోట కూర్చున్న ప్రేక్షకులు ఇక్కడి కొచ్చి చేరేవారు. ఒకే స్థాయిగల విద్వాంసులయితే జనం కాసేపు అక్కడా, కాసేపు ఇక్కడా వినేవాళ్ళు. విద్వాంసులకీ, శ్రద్ధగా వినే శ్రోతలకి వీళ్ళవల్ల చాలా చిరాగ్గా వుండేది. ఒకోసారి కొందరు తుంటరి కురక్రారు విషంలేని నీటిపాముల్ని ప్రేక్షకుల మధ్యకి ఒదిలేవారు.31 దాంతో కచేరి ఆలగోడుబాలగోడు అయేది. 1911లో మంగుడి చిదంబర భాగవతార్‌ కచేరిలో ఇలాగే జరిగి మధ్యలో ఆపెయ్యవలసి వచ్చింది.

చిదంబర భాగవతార్‌ (అగర మంగుడి బ్రహ్మశ్రీ చిదంబర భాగవతార్‌) శరీరమూ, శారీరము కూడా గంభీరమైనవే. లా చదువు మధ్యలోనే ఆపేసి హరికథలు చెప్పడం నేర్చుకున్నాడు.32 త్యాగరాజ కీర్తనలు చాలా బాగా పాడేవాడు.33 ఏ వర్గానికీ చెందని ఆ తటస్థుణ్ణి పెరియకచ్చి బృందం కచేరికి ఆహ్వానించారు. అక్కడ నీటి పాముల అల్లరి జరగడంతో అంతా గందర గోళంగా తయారయ్యింది. పెరియకచ్చి బృందంలోని హరికథకులే అలా చేశారనే వుద్దేశంతో అతనువెంటనే చిన్న కచ్చి వాళ్ళ పక్షం చేరి వాళ్ళకి అండగా నిలిచాడు.34 శూలమంగళం వైద్యనాధ భాగవతార్‌ అనే మరో హరికథకుడు కూడా చిన్న కచ్చి వాళ్ళతో కలిశాడు. ఆయనకి చాలా మందితో పరిచయాలు వుండడంతో చిన్న కచ్చి వాళ్ళకి మేలు జరిగింది.35 సమాధి దగ్గర పంజు భాగవతార్‌ పూజ చేయడాన్ని అందరూ అంగీకరించారు.
అలా చిన్నకచ్చి బృందానికి పలుకుబడిగలవాళ్ళు తోడయ్యారు. రెండు వర్గాల వారూ ఒకేసారి ఆరాధన జరపడం వల్ల ఎవరికీ వుపయోగం లేదని గోవిందస్వామి పిళ్ళై గ్రహించాడు. అందుకని 1912 లో పెరియకచ్చి బృందం, త్యాగరాజు చనిపోయిన నాటినుంచీ 5 రోజుల పాటు ఆరాధన కార్యక్రమాలు జరిపేలాగ ఏర్పాటు చేశాడు.36
చిన్న కచ్చి బృందం 4 రోజులు కార్యక్రమాలు చేసి ఆరాధన రోజున ముగిస్తే, ఆరోజున మొదలు పెట్టి పెరియకచ్చి బృందం 5రోజులు చేసేవారు. దాంతో ప్రేక్షకులకి 9రోజుల పాటు విందుభోజనం, కమ్మని సంగీతం దక్కాయి. ముందుఎటు వెళ్ళాలనే మిమాంస లేకుండా హాయిగా వుండేది. చిన్న కచ్చి బృందం చోటు చాలడంలేదని పాలాయి సత్రంలాంటి పెద్ద భవనంలో కార్యక్రమాలు జరిపారు.37

గోవిందస్వామి పిళ్ళై పూనికతో పెరియకచ్చి వాళ్ళు హరికేశనల్లూర్‌ ముత్తయ్య భాగవతార్‌ని ఆరాధనలో హరికథ చెప్పేందుకు ఆహ్వానించారు. ఆయన గొప్ప వాగ్గేయ కారుడూ, సంగీతజ్ఞుడూ, హరికథకుడూను. అప్పటిదాకా అక్కడ వున్న స్పర్థల గురించి ఆయనకి తెలియదు. తిరువయ్యారు వచ్చి చిన్న కచ్చి బృందం చేసిన ఏర్పాట్లు చూశాక ఆయనకి విషయం బోధపడింది. జనవరి 17న రెండు వర్గాల నాయకుల్నీ ఒక చోటకి పిలిచి వారి మధ్య సయోధ్య కుదర్చడానికి ప్రయత్నించాడు. గోవిందస్వామి పిళ్ళై హాజరు కాకపోవడంతో ఏమి తేల లేదు. విడివిడిగానే ఆరాధన జరిపేందుకు నిశ్చయమయ్యింది. ముత్తయ్య భాగవతార్‌ అంతటితో వూరుకోకుండా కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళ మధ్య సఖ్యతకోసం ప్రయత్నిస్తూనే వున్నాడు.38
చిన్నకచ్చి వాళ్ళు ఆరాధన నిర్వహించడానికి ఒక సంస్థగా రిజిస్టర్‌ చేసుకోవడానికి నిర్ణయించుకున్నారు. శూలమంగళం వైద్యనాధ భాగవతార్‌ సహకారం వుంది. పండిట్‌ లక్ష్మణాచార్‌ అనే హరికథకుడి ఇంట్లో (మద్రాసు) ఫిబ్రవరి 1న అందరూ సమావేశమయ్యారు. త్యాగరాజ పరబ్రహ్మ వైభవ ప్రకాశసభ అనే పేరుతో సంస్థ రిజిస్టర్‌ అయింది. 16 మంది ప్రఖ్యాత సంగీత విద్వాంసులు కార్యవర్గ సభ్యులు,లక్ష్మణాచార్‌-అధ్యకక్షుడు, రామనాధపురం (పూచి)శ్రీనివాసయ్యంగార్‌ (నాగరత్నమ్మకి గురువు) ఉపాధ్యకక్షుడు, శూలమంగళం వైద్యనాధ భాగవతార్‌-కార్యదర్శి, మంగుడి చిదంబర భాగవతార్‌ -ఉపకార్యదర్శి, తంజావూరు పంచపాకేశ భాగవతార్‌-కోశాధికారి. పంజు భాగవతార్‌ వాళ్ళందరి కంటే కింది స్థాయిలో వున్నా, డైరెక్టరుగా వాళ్ళందరి మిదానాయకుడిగానే చలామణి అయ్యేవాడు39. అతని దగ్గర్నుంచి సభకి మూలధనంగా 25/-రూ|| తీసుకున్నారు. ఆయన వున్నంతకాలం ఆయనే సమాధి దగ్గర విద్వాంసులకి నాయకత్వం వహించాలని నిర్ణయమయ్యింది40.

ఒక సంస్థగా రిజిష్టరయిన తరవాత నుంచి జమా ఖర్చుల లెక్కలు పకడ్బందీగా జరిగేవి. ఆరాధన ముగిసేసమయానికి లెక్కలన్నీ అచ్చు వేయించి దాతలకీ, సంగీతకారులకి పంపేవారు. దాన్లోనే ఆరాధనలో పాల్గొన్న కళాకారుల వివరాలుండేవి41. అంతక్రితం సంవత్సరం కూడా జమాఖర్చుల లెక్కలు తనపేరుమిద పంజు భాగవతార్‌ అచ్చు వేయించాడు42. అందుకని సంస్థపేరు మిద కూడా అలాగే జరగాలని నిర్దేశించి వుంటాడు. 1917 నాటికి పాలాయి సత్రం కూడా చాలక నది ఒడ్డున వున్న పుష్యమండపానికి ఆరాధన వేదికని మార్చారు43. కల్యాణ మహల్‌లో ఆరాధన నిర్వహిస్తున్న పెరియకచ్చి బృందం కూడా మరింత బలపడింది. విరాళాల కోసం వాళ్ళు గోవింద పిళ్ళైమిద ఆధారపడ్డారు. ఆయనకి సంగీత ప్రపంచంలో వున్న హోదానీ, పరపతిని బట్టి తేలికగానే ఎక్కువ విరాళాలు సేకరించగలిగారు44. ఆయనకి కుంభకోణం అళగనంబి పిళ్ళై అనే మృదంగ విద్వాంసుడు కూడా సహకరించాడు. ముత్తయ్య భాగవతార్‌ 1915 దాకా తటస్థవైఖరినే అవలంభిస్తూ రెండు వర్గాల వారి కార్యక్రమాల్లోను పాల్గొన్నారు. అందర్నీ ఏకం చేసే ప్రయత్నం మాత్రం విరమించలేదు. ఆరెండు వర్గాల నుంచి ఏమి స్పందన లేకపోవడంతో విసుగెత్తి, చివరికి 1915 నుంచీ ఆరాధనకి రావడం మానుకున్నాడు.45

1915 నుంచీ చిన్న కచ్చి వర్గం బలహీన పడింది. పెద్దవాళ్ళందరూ చనిపోయారు. ఆ ఏడాది, అధ్యకక్షుడు లక్ష్మణాచార్‌ చనిపోయాడు. మాయవరం వైద్యనాధయ్యర్‌ అనే వీణ విద్వాంసుడు అధ్యకక్షుడయ్యాడు. కానీ కొద్ది వారాలకే ఆయనా మరణించాడు. తంజావూరు గోవింద భాగవతార్‌ అధ్యకక్షుడయ్యాడు. ఆయనా కొద్ది కాలంలోనే కాలధర్మం చెందాడు. దాంతో అధ్యక్షపదవికి శాపం వుందని ప్రచారమయింది.46 శూల మంగళం వైద్యనాధ భాగవతార్‌ని అధ్యక్ష పదవి అలంకరించమంటే తిరస్కరించి, కార్యదర్శిగానే కొనసాగాడు. ఆరకంగా అధ్యక్షపదవి అలాగే ఖాళీగా వుండి పోయింది. కార్యదర్శి వైద్యనాధ భాగవతారే చిన్న కచ్చి వర్గానికి ముఖ్య నాయకుడు అయ్యాడు.47 వాళ్ళ వర్గంలో తరిగి పోతున్న ధైర్యాన్ని నిలబెట్టి, విరాళాలు బాగా సేకరించి, ఆరాధన గొప్పగా జరిగేటట్టు చేశాడు. పల్లడం సంజీవరావు అనే వేణు విద్వాంసుడు ఆయనకి దన్నుగా నిలిచాడు. అప్పటికి పంజు భాగవతార్‌ చనిపోయాడు. దాంతో సమాధి దగ్గర పూజ నిర్వహించే బాధ్యత ఆయన ముఖ్య శిష్యుడు రాజగోపాల భాగవతార్‌ మిద పడింది.48

అప్పుడప్పుడే పేరులోకొస్తూన్న కళాకారుల దగ్గర రెండు వర్గాలూ ఆరాధన ప్రాముఖ్యాన్ని ప్రచారం చేశారు. కాంచీపురం ధనకోటి మేనల్లుడు కాంచీపురం నయనా పిళ్ళైని తమ వైపుకి (పెరియకచ్చి బృందం)తిప్పుకున్నారు(1918)49 ఆరాధనలో అతని కచేరీలు బాగా జనాదరణ పొందాయి. అతనికి తొమ్మండుగురు పక్కవాయిద్యగాళ్ళు వుండేవారు.50 బాగా పేరులోకి వస్తూన్న అరియకుడి రామానుజ అయ్యంగార్‌ని కూడా 1920కి వీళ్ళవైపు తిప్పుకున్నారు.51 ఆరాధన కార్యక్రమాల పట్టిక తయారు చేసేటప్పుడు గోవిందస్వామి పిళ్ళై ఒక పొరపాటు చేశాడు. నయనా పిళ్ళై తర్వాత అరియకుడి కచేరి పెట్టాడు.52 నయనా పిళ్ళైకున్న తొమ్మండుగురు పక్కవాద్యగాళ్ళూ తమ వంతు వాయించేసరికి నయనా కిచ్చిన సమయం దాటి పోయింది. నిర్దేశించిన సమయాన్ని నిక్కచ్చిగా పాటించే ‘టెలిగ్రాఫ్‌’ మణి వెంటనే నయనా శిష్యుడి చేతిలోంచి తంబురా తీసుకుని కచేరి అర్ధాంతరంగా ఆపించేశాడు.53 నయనా పిళ్ళై కంగుతిన్నాడు. కాని ఆయన వైపే న్యాయం వున్నట్టయింది. ఎందుకంటే అతను పాడిన తర్వాత మిగిలిన వాళ్ళ గానం రాణించలేదు. నయనా పిళ్ళై అద్భుత గానం తర్వాత, సంప్రదాయబద్ధంగా ప్రారంభించిన అరియక్కుడి గానం జనానికి నచ్చలేదు. అసహనం ప్రదర్శించారు. గోవిందస్వామి పిళ్ళై కుట్రపన్ని ఇలా చేశాడనుకుని అరియకుడి పెరియకచ్చి ఒదిలేసి చిన్నకచ్చి వర్గంలో చేరాడు. అతనికి అక్కడ ఘన స్వాగతం లభించింది. కామధేనువు తమకి దక్కిందని శూలమంగళం వైద్యనాధ భాగవతార్‌ పొంగిపోయాడు. అతని కచేరీ అయిన తర్వాత శూలమంగళం, అరియకుడి గురించి గంటసేపు వుపన్యసించాడు. అరియకుడి ఆనందంతో ఈ కమిటీలో ఉపకార్యదర్శి అయ్యాడు. అతని చేరికతో వీళ్ళు బాగా పుంజుకున్నారు. అతని కీర్తి పెరిగిపోతూండడంతో వీళ్ళ ఆరాధనకి డబ్బు బాగా పోగయింది.

54 సంగీత ప్రపంచంలో బాగాదూసుకొస్తున్న మహారాజపురం విశ్వనాధ అయ్యర్‌ని పెరియకచ్చి బృందం గాలం వేసి పట్టేశారు. కాని స్వతంత్ర దృక్పథంగల విశ్వనాధఅయ్యర్‌ ఈ విభేదాల జోలికి పోకుండా రెండు వర్గాల కార్యక్రమాల్లో పాల్గొనేవాడు.55 చివరికి భోజనం ఏర్పాట్లలో కూడా రెండు వర్గాలూ ఆధిపత్యం కోసం హోరా హోరీగా పోటీ పడ్డారు. అరిటాకులూ, బియ్యపు బస్తాలూ, కూరగాయలూ, మసాలా దినుసులు బళ్ళతో తెచ్చి తిరువయ్యారులో వేర్వేరు చోట్ల జాగ్రత్త చేసేవారు. చిన్నకచ్చివారి భోజన ఏర్పాట్లు కల్యాణపురం విశ్వనాధశాస్త్రి చూసుకునేవాడు. మధ్వులు వంట బాగా చేస్తారు. అలాంటి ఒకతన్ని వంటకి ఏర్పాటు చేశాడు పల్లడం సంజీవరావు. సీతాబాయి సత్రంలో భోజనాలు పెట్టేవారు. ఉదయం వేడి వేడి ఇడ్లీ, సాంబారు తినేందుకు వందలాది జనంవచ్చేవారు. పెరియకచ్చి వాళ్ళకి విక్రవంది ‘మోట్టై’ అనే బ్రహ్మాండమైన వంటతను వుండేవాడు. అతను వండిన అన్నం, పచ్చళ్ళు, వంకాయ, గుమ్మడి, చిక్కుళ్ళతో చేసిన సాంబారు బ్రహ్మాండంగా వుండేది. సారవంతమైన కావేరీ తీర ప్రాంతం నుంచి మంచి కూరలు, బియ్యం రావడంతో అన్నీ చాలా రుచిగా వుండేవి.56

ఈ స్పర్ధలు ఇలా వున్నా ఇరువర్గాల విద్వాంసులు ఒకరితో ఒకరు స్నేహంగానే వుండేవాళ్ళు. పెళ్ళిళ్ళకీ పేరంటాలకి కలిసి వెళ్ళేవాళ్ళు, కలిసి కచేరీలిచ్చేవారు. ఒకోసారి కలిసి తీర్ధయాత్రలకికకూడా వెళ్ళేవాళ్ళు.57 కానీ అక్టోబరు వచ్చేసరికి ఎవరి వర్గంకోసం వాళ్ళు విస్తృత ప్రచారం చేసేవాళ్ళు. జనం పెరగడంతో ఖర్చూ పెరిగింది. గొప్ప కోసం ఇరు పక్షాలూ పోటీల మిద ఖర్చు పెట్టేవారు58.

త్యాగరాజు సమాధి మిద మంచి కట్టడం కోసం మాత్రం ఎవరిదగ్గరా డబ్బు మిగిలేది కాదు. అందరూ దానికోసం ప్రణాళికలైతే వేసేవారు. సంవత్సరం పొడుగునా సమాధి శిథిలావస్థలో వుండేది. ఆరాధన సమయానికి మాత్రం దానిమిద తాత్కాలికంగా వేదిక కట్టేవారు. మిగతారోజుల్లో అక్కడికి ఎవరన్నా వెళ్ళాలంటే ముళ్ళపొదలమధ్యలోంచి నడవాల్సి వచ్చేది. ఎక్కడ ఏపాము మిద అడుగు వెయ్యాల్సివస్తుందోనని భయంగా వుండేది. తీరా అక్కడికి వెళితే సమాధి మిద రెట్టలూ, చెత్తా చెదారం వుండేవి. నాగరత్నమ్మకి రాసిన వుత్తరంలో బిడారం కృష్ణప్ప ఈ దుస్థితి గురించే వాపోయాడు.

– వి.శ్రీరాం

అనువాదం:టి.పద్మిని

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ఈ పుస్తకాన్ని ప్రచురించడానికి అనుమతించిన హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారికి , గీతా రామస్వామి గారికి కృతజ్ఞతలు .

Gita Ramaswamy,

Plot No. 85, Balaji Nagar, Gudimalkapur,

Hyderabad 500 006

ధారావాహికలు, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో