ముకుతాడు

టి.వి.యస్ .రామానుజరావు

టి.వి.యస్ .రామానుజరావు

(చివరి భాగం)

“ చంద్రా, గుర్తు చేసుకో! నన్ను ఈ పెళ్ళికి బలవంత పెట్టింది నువ్వే. నువ్వే దగ్గరుండి ఈ పెళ్లి జరిపించావు. ఇప్పుడేమో నన్నొక రాక్షసుడిగా చిత్రిద్దామని చూస్తున్నావు. ఏమనుకుంటున్నావు? నీ మాటలు తేలిగా తీసుకుంటానని అనుకుంటున్నావా? చూడు, నీ తల పగలకొట్టి, పళ్ళు రాలగొడతాను. నిన్ను చంపి పారేస్తాను ఏమనుకుంటున్నావో?” హుంకరించాడు.
మనో కుర్చీ లోంచి లేవబోయాడు. చంద్ర అతన్ని ఆపుచేసింది.

“అలాగేం? ప్రయత్నించి చూడు మూర్తీ! మర్చిపోబోకు, మనో ఇక్కడే వున్నాడు. ఇప్పుడు నీ కన్నా వాడు చాలా బలవంతుడు. ఇలాగే ఇరవై అయిదు సంవత్సరాలు నన్ను బెదిరించావు. ఇంతకాలం నీ అహంకారం, నీ కోపతాపాలు భరించాను. ఇప్పుడు కూడా దాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోలేననుకున్నావా ?. పాత జ్ఞాపకాలు ఆమె కళ్ళలో కదలాడుతూ బాధపెడుతున్నాయి. ఇన్నాళ్ళుగా దాచుకున్న ఆగ్రహం ఇక ఇప్పుడు బయటపెట్టే సమయం వచ్చేసింది.

“ నేను కార్చిన కన్నీళ్ళు, నేను అనుభవించిన నరకం నాకు మాత్రమే తెలుసు. జీవితాంతం దీన్ని భరిస్తూ ఉండాల్సి వస్తుందేమో అనుకున్నాను. కానీ, నా కొడుకు మనో నీ విచ్చలవిడితనాన్ని ఇన్నాళ్ళు భరించినందుకు, నేను పిరికిదాన్నని ఆరోపించాడు. నా కళ్ళు తెరిపించాడు. నా కూతుళ్ళ జీవితాలు కూడా ప్రమాదంలో పడబోతున్నా యని గుర్తు చేశాడు. ఈ సమాజంలో చెడు తిరుగుళ్ళు తిరిగే వాడి కూతుళ్ళను చేసుకోవడానికి ఎవరూ ముందుకు రారు. ఇన్నాళ్ళూ నువ్వు ఎలా నడిపిస్తేఅలా నడిచాను. సతీ సావిత్రి లాగా, భర్తను అనుసరించే భార్యగా నా అదృష్టమింతే అనుకుని భరించాను. నాలో నేనే క్రుంగి పోయాను. కానీ ఇప్పుడు నేను పాతకాలపు ఆలోచనలు వదుల్చుకున్నాను.”
చంద్ర నవ్వింది. కానీ, ఆమె నవ్వులో బాధే మిగిలింది.

“అదృష్టవశాత్తు మంజు ఇంకా చిన్నదే. దాని పెళ్ళికి చాలా సమయంవుంది. దానికి పెళ్లి సంబంధాలు చూసే సమయానికి ఈ సమాజం మరో కొత్త విషయం గురించి పట్టించుకుంటుంది. నీ రెండవ పెళ్లి జ్ఞాపకాలు అప్పటికి మరిచిపోతుంది. అందువల్ల, దాని పెళ్ళికి ఏ విధంగాను నాకు ఇబ్బంది లేదు. మన సమాజం ఆడదానికి విలువ ఇవ్వదు. కానీ ఆమె పెళ్లి చేసుకుందంటే, అది రెండవ భార్యగా అయినా సరే, ఆమెకీ సమాజంలో ఒక స్థానం ఏర్పడుతుంది. ఇది బుద్దిలేని సమాజం అని నాకు తెలుసు. కానీ, అదంతే. అదే మగాడైతే రెండైనా, మూడైనా పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు. ముస్లింలు అయితే నలుగురు భార్యలను చేసుకోవచ్చు,ఒకే ఇంట్లో కలిసి ఉండవచ్చు. కానీ, దానికి ఓ పద్ధతి వుంది.”

తను తెలివిగా మాట్లాడుతున్నందుకు అబ్బురపడుతూ ఒక క్షణం ఆగింది.
“మన దేవుళ్లందరికీ ఇద్దరు భార్యలు. కార్తికేయు భగవానుడికి ఇద్దరు భార్యలు, చెరొక పక్కా. అది అందరికి ఆమోదయోగ్యమే. నా కూతుళ్ళ భవిష్యత్తు ఆలోచించి నేను కూడా దీన్ని అంగీకరించి, నీకు నళినీ నిచ్చి చేశాను. ఆమెను నీ రెండవ భార్యగా చూసుకో. ఆమె నీ కోర్కెలు, అవసరాలూ తీర్చడానికి ఇరవై నాల్గు గంటలూ నీతోనే వుంటుంది.అంతే కాదు, నిన్ను అనుక్షణం కనిపెట్టుకుని, నీ ప్రతి కదలిక పరిశీలిస్తూ వుంటుంది. నువ్వు ఇక ఆమెకు జవాబుదారి అవుతావు. అలా వుండకపోయావో, ఆమె నిన్ను వేదిస్తుంది. నీకు అదే తగినది.” ఆగి చంద్ర కాసిని మంచి నీళ్ళు తాగింది.మూర్తి ఏదో చెప్పబోయాడు. కానీ, చంద్ర చెయ్యి ఎత్తి అతన్ని ఆపింది.

“ ఇప్పుడు నీకు, ఈ పెళ్లి ఎందుకు చేశానో అర్ధమయ్యిందా? లేక, ఇంకా చెప్పాలా?
“ఇంకా ఏమైనా ప్రశ్నలున్నాయా?” ఆమె పెదాలపై నవ్వు మెరిసింది.
మూర్తి మోహంలో ఒక క్షణం ఎదో కోల్పోయిన భావం కనబడింది. తను ఇప్పుడు అనాల్సిన మాటలేవో అనేసేయ్యాలి. ఆ తర్వాత మళ్ళీ అనే అవకాశం వస్తుందో రాదో. అతని మొహం కోపంతో బిగుసుకుంది. “అయితే, ‘పాపం నళినీ’ అంటూ చూపించిన జాలి, ‘ఇదంతా ఆమె మీరు సుఖంగా వుండాలని చేస్తున్నా’నని చెప్పడం నీ ప్లాన్లో భాగమే అన్న మాట! నేను మొదటి నుంచి ఈ వ్యవహారంలో అంత ఆసక్తి చూపించ లేదు. నువ్వే నన్ను బలవంతాన ఇందులో ఇరికించావు, కుట్ర పన్నావు, యూ, బ్లడి వుమన్!” గొంతులో కాఠీన్యం తొంగి చూసింది.

కోపంగా లేచి, తన కసి తీర్చుకుంటానికి గదంతా కలయ చూశాడు. బహుశా కొరడా లేకపోయేనే అని విచారి స్తున్నాడేమో అనుకుంది చంద్ర. కింద పడిన చీర, ఒక దిండు తప్ప ఏమి కనబడలేదు. దిండు తీసి చంద్రపై విసిరేశాడు.
“ ఈ ఆడ వాళ్లకు… ఈ ఆడ వాళ్లకు.. “రెండు నిముషాలు గొణిగి, “అది సరే,” అంటూ ఏదో కొత్త ఆలోచన వచ్చినట్లు ఆమె వైపు తిరిగాడు.

“అవును, ఆమెను పెళ్లి చేసుకున్నాను, అదీ నీ మూలంగా! ఇప్పుడు ఇక్కడే వుంటాను. ఈ రెండూ కలపాల్సిన అవసరం ఏంటి?” అతని గొంతులో స్థిరత్వం వినిపించింది. అతని దృష్టిలో అది సరైన పరిష్కారం.
“కుదరదు. ఎట్టి పరిస్థితులలో అది కుదిరే పని కాదు. నీకు అర్ధం కాకపోతే, మరో వెయ్యి సార్లు చెబుతాను. ఎందుకో తెలుసా? నేను పాతిక సంవత్సరాలుగా అసహ్యించు కుంటున్నది ఆడ దాని శరీరం మీద నీకున్న వ్యామోహాన్ని! ఆ రోగం ముదిరి నిన్ను మింగేయక మునుపే, ఏ డాక్టర్ కో చూపించుకో.”

చంద్ర అటు ఇటూ తిరుగుతూ మాట్లాడడం మొదలుపెట్టింది. ప్రస్తుత విషయాలకు వచ్చే సరికి ఆమె గొంతులో విషాదం తొంగి చూసింది. మాట్లాడుతున్న కొద్దీ, తను చెప్పే దానిలో స్పష్టత పెరిగడం ఆమె గమనించింది. బహుశా తన గుండెలో బాధను, ఆక్రోశాన్ని, నిజాలను బయట పెట్టడం వల్ల కావచ్చు. “నీకు తెలుసా,మూర్తి? ఇదివరకు నాకొక కల వచ్చింది. ఆ కలలో నువ్వొ ఎద్దుగా కనిపించావు. పొగరెక్కిన ఎద్దు. దాన్ని మచ్చిక చేసుకోవడానికి, పనిచేయించుకోవడానికి దాని ముక్కులలో రంద్రాలు చేసి, ఆ రంధ్రాల గుండా తాడు పోనిస్తారు. ఆ గొడ్డు దారి మార్చితే, ఆ తాడు లాగుతారు. పాపం, అప్పుడు దానికి నిజంగా చాలా బాధ కలుగుతుంది. అందువల్ల, అది వెంటనే యజమాని చెప్పిన మాట వింటుంది. నువ్వు అలాంటి ఎద్దువు. నీ ముకుతాడు నళినీ చేతిలో వుంది. ఆమెకు నచ్చినట్లు నువ్వుండకపోతే, ఆమె తాడు బిగిస్తుంది. నువ్వు ఆమె మెడలో కట్టిన తాళి ,అది నిజంగా నీ ముక్కుకు వేసిన తాడు! అవును, ఆమె ఏమాత్రం సందేహించదు. ఆమె దుర్మార్గంగాను వుండ గలదు, నీచంగానూ ప్రవర్తించ గలదు. ఎందుకంటే ఆమె ఒక బజారు మనిషి. ఆమె నాకు మల్లే మొగుడు ఇంటికి వచ్చే దాక పడిగాపులు గాసి, అతని చేత తన్నులు తినే మనిషి కాదు. నీతో ఇరవై నాలుగు గంటలు వుంటుంది. ఒక డేగ లాగా నిన్ను కాపలా కాస్తుంది. నీకు అదే సరైన పద్ధతి! ఈ ఇరవై అయిదేళ్ళు నువ్వు కోరుకుంది కూడా అదేగా! నేను అలా ఉండలేను, బహుశా నేను పెరిగిన వాతావరణం కారణమేమో…”

చంద్ర కళ్ళు తుడుచుకుని, మళ్ళీ మొదలు పెట్టింది.
“ ఆమె తెలివితక్కువదేమి కాదు. తనకు నీతోఅవసరం తీరిందనుకున్నప్పుడు, నీ కళ్ళు పీకేస్తుంది. ఆమె చాలా తొందరగానే నిన్ను పట్టుకోగలదు. ఇది ఆమెను చూడగానే గ్రహించాను. ఆమె పెంపకం సరైంది కాదు. అది ఆమె తప్పూ కాదు. ఎందుకంటే ఆమె అలాంటి వాతావరణంలో పుట్టింది.ఆమె చాలా అహంకారి, స్వార్ధపరురాలు . ప్రస్తుతం ఆమె పై వ్యామోహం లో పడికొట్టుకు పోతున్నావు. కానీ హనీమూన్ ఆనందం ఎక్కువ కాలం వుండదు. నీ కళ్ళ ముందున్న రంగుల కల కరిగిపోతుంది. అప్పుడు ఆమేమిటో నీకు తెలుస్తుంది. నీ భవిష్యత్తు ఇక పూల బాట కాదు. నీ స్వేచ్చ, స్వాతంత్రం ముగిసిపోయాయి. ఒక్క సారి ఇవన్నీ అనుభవం అయ్యాక, అప్పుడు తల గోడ కేసి కొట్టుకుంటావు. నీ తప్పేమిటో నీకు తెలిసి వస్తుంది. ఇక నా విషయానికొస్తే, నా పిల్లల గురించి,వాళ్ళ బాగోగుల గురించి చూసుకుంటాను. ఇక వాళ్ళ కోసమే నేను బతకదల్చుకున్నాను. ఇంతకుమించి నాకు కోరికలు లేవు. ఇప్పుడు నేనొక సన్యాసిని, నువ్వు లేకుండా వుంటే. అందుకే, దయ చేసి వెళ్ళిపో ,మూర్తి,వెళ్ళిపో!”
మనో అక్కడే కూర్చుని తలెత్తి ఆమె వంక చూడకుండానే తల్లి చెప్పేది వింటున్నాడు. చంద్ర గొంతు అంత బాధలోనూ ప్రశాంతంగా, మృదువుగా,స్థిరంగా వుంది. ఆమె తను ఏం చెయ్యాలో నిశ్చయించుకుంది. అనేక రోజులుగా ఆమె ఆలోచించి అమలు చేసిన ప్లాను ఇది.

మనో ఇక సమయం వృధా చేయ దలుచుకోలేదు. లేచి నిలబడ్డాడు.
“మనోహర్, నువ్వు ఇప్పుడు వెళ్ళవద్దు. నేను చెప్పేది అది పూర్తి అయినాక ఇద్దరం కలిసి వెళ్లి పోదాం. కాసేపు ఆగు. ఇక నేను ఇతనితో ఏమాత్రం వంటరిగా వుండడం ఇష్టపడను.”
“చంద్రా వాడ్ని పోనియ్యి! మన మధ్య వున్నది వాడేందుకు వినడం?”

“లేదు, వాడు నేను చెప్పేది అంతా వినాలి. ఒక మగవాడు తన భార్యను ఎన్ని రకాలుగా హింసిస్తాడో వాడు తెలుసుకోవాలి. రేపు వాడు అలా కాకుండా సున్నితంగా వుండాలి. క్షణం క్షణం హింసకు గురయ్యే స్త్రీ చివరికి ఎంతకైనా తెగించ గలదు. ఇంటిపట్టున వుండే సామాన్య స్త్రీ కూడా భద్రకాళి అవుతుంది..” ఆమె కళ్ళ నుంచి నీళ్ళు కారిపోయాయి. అంతలోనే సంబాళించుకున్నది. కన్నీళ్లను అదిమిపెట్టింది. ‘ఇక కన్నీళ్ళతో పని లేదు. అంతా సంతోషమే’ఆమె తనకు తాను చెప్పుకుంది. మూర్తి తననొక దుర్బల హృదయం కలదిగా అనుకోవడం ఆమెకు ఇష్టం లేదు. గ్లాసుతో మంచి నీళ్ళు తాగి స్థిమితంగా తన కుర్చీలో కూర్చుంది.
మూర్తి చేష్టలుడిగిన వాడిలా కూర్చుండి పోయాడు. అతన్ని అలా చూసి చంద్ర మనసులో ఏ మాత్రం బాధ కలగలేదు.
కొన్నేళ్ళుగా పీడిస్తున్న బాధ చంద్రకు ఇప్పుడు తీసేసినట్లు అనిపించింది. ఒక్క సారిగా స్వాత్రంత్యం వచ్చినట్లుంది. శరీరం తేలికైనట్లు అనిపించి ఆమె పెదాలపై చిరునవ్వు మెదిలింది.

“ఇక నా కష్టాలు పోయినట్లే మూర్తి! నాకు డబ్బుంది. కారు, ఇల్లు వున్నాయి. అదృష్ట వశాత్తూ నా డబ్బంతా నీ చేతిలో పెట్ట లేదు. మా తండ్రి ముందు చూపు వల్ల నాకు జరిగిన మేలు అది. నువ్వు నీ జీతంతోనే సరిపెట్టుకోవాలి. నీకు ఇప్పుడొక రెడీమేడ్ కుటుంబం వుంది. నీ పైన గద్దల్లా వాలిపోయే వాళ్ళు వాళ్ళంతా. కంగ్రాట్స్, మూర్తి! ఇక ఇప్పుడు నీ పరుగు పందెం మొదలవుతుంది. ఏమో, ఒక వేళ నీ అదృష్టం బాగుంటే నేను అన్నవన్నీ జరగకపోవచ్చు. అయినా, నీకు వచ్చే ….”
ఆమె చాలా సేపు మాట్లాడి అలసిపోయింది. తను కూర్చున్న కుర్చీలో వెనక్కి జారిగిలబడి తల వాల్చి కళ్ళు మూసుకుంది. ఆమె మనసంతా ప్రశాంతతతో నిండిపోయింది. ఆవేదన, ఆగ్రహం చల్లారిన తర్వాత, వెలుగుతో నిండిన ప్రశాంతత అది .
చంద్ర తన కుర్చిలోంచి లేచింది. మనో వెనకాల నడుస్తుంటే మెల్లగా గదిలోంచి వెళ్ళిపోయింది. మనోకు ఇప్పుడు అతని తల్లి ఒక హీరో. ఆమెలో దాగివున్న బలం ఇప్పుడతను గుర్తించాడు.

మూర్తి చాలాసేపు ఒంటరిగా ఆ గదిలో ఉండిపోయాడు. అతని మనసంతా శూన్యమై పోయింది. తాను ఎప్పుడూ నిందిస్తూ వచ్చిన తన కుటుంబం ఇప్పుడు తనని కాదుపోమ్మంది. తన భార్య ఇక ఇప్పుడు తనది కాదు. ఒక్కగానొక్క కొడుకు తనకు దూరమయ్యాడు. తను వంచించ బడ్డాడు. అతని మనసు ముక్కలైంది. చివరకు అతను చేసిన తప్పు అతనిపైనే తిరగబడింది.
` ఆ గది ఖాళీగా మిగిలిపోయింది. అతని బాగ్గులో బట్టలన్నీ అడ్డదిడ్డంగా పడేసి వున్నాయి. చంద్ర కోసం తెచ్చిన చీర నేల మీద కుప్పగా పడివుంది. బయట రోడ్డు మీద వాహనాల రోద వినిపిస్తోంది.

మూర్తి కళ్ళ ముందొక దృశ్యం- తన ముక్కుకు తాడు తగిలించి, చర్నాకోలతో నళినీ బండిపై నుంచి తనను అదిలిస్తోంది. చర్నాకోల ఆమె తల చుట్టూ తిప్పి బలంగా కొడుతోంది. ముకుతాడు మెలిపెడుతోంది. అది తనను నిజంగా చాలా బాధ పెడుతోంది. అవును, చంద్రా! నిజంగా ఇది బాధే!

బయట చీకటి చుట్టుముట్టుతోంది. అంటే మూర్తి వెళ్ళిపోవాల్సిన సమయం అయిపోయింది .

                 ———————

అయిపోయింది…

తమిళ మూలం: శివశంకరి
తెలుగు :టి.వి.యస్ . రామానుజరావు

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ధారావాహికలు, , , , , , , , , , , , , , Permalink

One Response to ముకుతాడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో