రచయిత్రి;సి.ఉమాదేవి
ఉమాదేవి గారు జూనియర్ కాలేజిలో పబ్లిక్ అడ్మినిస్రేషన్ లెక్చరర్ గా,అనుబంధ పాఠశాలకు కో ఆర్డినేటర్ గా,వైస్ ప్రిన్సిపల్ గా విద్యారంగానికి తగిన సేవలందించి,ఆపై ఫౌండర్ ప్రిన్సిపల్ గా శ్రీనగర్ విద్యానికేతన్ స్తాపించి తన పర్యవేక్షణలో విద్యార్ధినీ , విధ్యార్ధులకు విద్య నందించారు.ఎన్ని పనులున్నా మనసు మాత్రం రచనాభిలాష నుంచి మరలిపోలేదు.అన్ని ప్రక్రియలలోను రచనలు చేసారు. స్కూల్ పిల్లలకై చిన్నచిన్న నాటికలు,లలితగీతాలు,కవితలు రాసి బాలానందంలో పిల్లల ద్వారా ప్రసారం చెయ్యడం,ఆకాశవాణిలో చదివిన కథలు,మహిళాసమాజంలో పాలుపంచుకున్న చర్చా కార్యక్రమాలు , విస్సా టి.విలో ఇంటర్వ్యూ, ఈటివిలో కొన్ని మహిళా కార్యక్రమాలు,వనితాజ్యోతి నిర్వహించిన వ్యాసపోటీకి న్యాయనిర్ణేతగా వ్యవహరించడం మొదలైనవి ఆవిడ ఖాతాలో వున్నాయి. కవితలలో ‘అమ్మతనం’ కవితకు పోతుకూచి సాంబశివరావుగారి అవార్డు,‘మనషి నిర్వచనం’ కవితకు ఆరాధన-ఆంధ్రప్రభ అవార్డు,
‘మానవతకు చిరునామా’ కవితకు ఎక్స్ రే అవార్డు లభించాయి. తన రచనలు , మనవడు, మనవరాలు చదవాలనే కోరిక తో అన్నీ ఒకే చోట పొందుపరచాలని ,అన్నింటిని పుస్తకాలుగా మలిచారు.ఇదివరకే ‘శిలా పుష్పాలు’ నవల, ‘ చిన్నిగుండె చప్పుళ్లు’ కథా సంపుటం ప్రచురించారు.ఇటీవల జులై ఇరవైన తెలుగు విశ్వవిద్యాలయ ఉపకులపతి,ఆచార్య ఎల్లూరి శివారెడ్డిగారు, ఆరు పుస్తకాలను ఆవిష్కరించారు.అవి ‘సాగరకెరటం’, ‘కేర్ టేకర్’ నవలలు, ‘అమ్మంటే’ కవితల సంపుటి, ‘మాటేమంత్రం’ కథల సంపుటి, ‘మంచి మాట-మంచి బాట’ వ్యాస సంపుటి, ‘ ఏకథలో ఏముందో’ అనే శీర్షికతో కథ,కవిత,నవల,వ్యాసాల సమీక్షాసంకలనం.
ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాము. మొదటగా కేర్ టేకర్ నవల గురించి తెలుసుకుందాము.
కేర్ టేకర్ :
కాలం మారింది అంటారు. టెక్నాలజీ ఇంప్రూవ్ అయ్యింది, యువత ఉత్సాహంగా ముందుకు దూసుకు వెళుతున్నారు. ఎంత అభివృద్ది జరిగినా అమ్మయిల పట్ల తల్లి తండ్రుల దృక్పథం అంతగా మారలేదు. అమ్మాయి అనగానే , తగిన విద్య చెప్పించి, పెళ్ళి చేసి ఓ అయ్యచేతిలో పెడితే తమ భాద్యత తీరినట్లుగా భావించి ఊపిరిపిల్చుకుంటారు.అనూష తండ్రీ అలాగే అనుకున్నారు. అనూషకు వివాహము కుదిరింది. కాని చివరి నిమిషం లో వరుడు , అనూష ఉద్యోగం కాని వ్యాపారం కాని చేయవద్దన్నాడని , పెళ్ళి కాన్సిల్ చేస్తుంది అనూష. అది తండ్రికి నచ్చదు.కూతురుకు నచ్చ చెప్పేందుకు ప్రయత్నిస్తాడు కాని అనూష వినదు. బూటిక్ తెరిచి తనేమిటో నిరూపించుకుంటాను అంటుంది. తండ్రి చివరకు రాజీకి వచ్చి , వక సంవత్సరం గడువు ఇచ్చి, లక్షరూపాయల చెక్ ఇచ్చి అమెరికా వెళుతాడు. తన ఆశయాలకు తగ్గట్టుగానే “ఫాషన్ బగ్”స్థాపిస్తుంది. మానేజ్ మెంట్ కు, స్టాఫ్ కు మధ్యన వుండే కేర్ టేకర్ అని వక కొత్త పోస్ట్ సృష్టించి , దానికి రాజేంద్రను ఎంపిక చేస్తుంది. ప్రత్యర్ధులు సృష్టించే సమస్యలను అధిగమిస్తూ, ఎక్స్ పోర్ట్ లైసన్స్ కూడా సంపాదిస్తుంది.ఓ అమ్మాయైవుండి ఎంత నైపుణ్యముగా, ధైర్యంగా వ్యాపారాన్ని అభివృద్ధి చేసింది అనేదే ఇందులో రచయిత్రి నేర్పుగా చెప్పారు. అంతేకాదు బంధాలు అనుభందాలను గురించి చక్కగా చూపించారు. అనూష తాత ,అమ్మమ్మలు వకరిమీద వకరు చూపించుకునే అభిమానము, రాజేంద్ర తల్లి పట్ల చూపించే అభిమానము , భాద్యత, తల్లి రాజేంద్ర కోసము తన ఆరోగ్యము బాగు చేసుకోవటము, సత్యం , రాజేంద్ర ల మధ్య వుండే స్నేహపు పరిమళము అన్నీ ఆహ్లాదంగా వున్నాయి.
మాటే మంత్రము :
మనిషి జీవితం లో మాటకు చాలా ప్రాధాన్యం వుంది. వక్క పూట ఏమీ మాట్లాడకుండా నిశబ్ధం గా వుండటము చాలా కష్టం.తన మనసులోని భావాలను పంచుకునేందుకు ఇంకో మనిషి తప్పనిసరి. ఎవరితోనూ మాట్లాడకుండా వుండలేడు. కొడుకు , కోడలు, మనవడు, మనవరాలు తనతో మాట్లాడరని బాధ పడిపోతూవుంటాడు. తండ్రికి తోచక అందరినీ విసిగిస్తున్నాడని పరిష్కారంగా టి.వి తెచ్చి పెడతాడు కొడుకు వంశీ!మాటలు వినగలడు కాని , మాటలు ఎవరితో మాట్లాడాలి ? అచ్యుతం బాధే అది. మరి తీరేదెట్లా ఇది శీర్షిక కథ “మాటే మంత్రము.”
భార్యా భర్తల మధ్య ఏదైనా గొడవ జరగ గానే విడాకులే పరిష్కారమా ? కాదు సద్దుబాటు వుండాలి అని సున్నితంగా చెపుతారు రచయిత్రి “మరో దిద్దుబాటు” కథ లో.
భార్యా పిల్లలకు కావలసినది సమకూరుస్తూ , ఏది అడిగితే అమరుస్తూ , ఇరవైనాలుగు గంటలూ సంపాదన మత్తులో మునిగిపోయి కన్నకూతురు పుట్టినరోజున శుభాకాంక్షలు చెప్పేందుకు కూడా తీరికలేని ఓ తండ్ర్ కూతురిని ఏమి బహుమతి కావాలి అని అడిగినప్పుడు , ఆ చిన్నారి ఆర్తి గా ప్రశ్నిస్తుంది “నాన్నా నీకేమి కావాలి?” అని “నాన్నా నీకేమి కావాలి ?” కథలో.
మధ్యతరగతి వాళ్ళ కల సొంత ఇల్లు వుండాలని. అంతేనా టి.వి, డి.వి.డి, కూలర్,స్కూటర్ అలా అన్నీ సమకూర్చుకోవాలని వుంటుంది. ఆ కోరికలకు గాలవేసి మరీ ఫైనాన్సియర్స్ వాయిదా పద్దతుల మీద తీర్చేట్టుగా అప్పులు ఇస్తున్నారు. అలాంటి గాలానికి చిక్కుకున్న ఆనంద్ కథ “అప్పిచ్చువాడు.”
ఫోన్ నంబర్ల లో చివరి నాలుగు అంకెలు వకటే కావటము తో జరిగిన గడబిడల సరదా కథ “ఏం చేస్తున్నావు బుజ్జీ ?”
తన ఆస్తి మొత్తం పిల్లల అభివృద్దికై ఖర్చు పెట్టి తన కొరకై ఏమీ మిగుల్చుకోక చివరి రోజులలో ఇబ్బంది పడ్డ తండ్రి జానకిరాం. చివరకు చనిపోయినా కూడా రాక , పదోరోజు వచ్చి తండ్రి ఇంకా తమకేమి మిగిల్చాడు అని లెక్కలు చూసుకొనే కొడుకులు. మనస్సు ను పట్టివేసే దయనీయమైన ఈ కథ “వర్షించని కన్నులు.”
ఇలా మొత్తం ఇరవై ఎనిమి కథలు ఈ “మాటే మంత్రము “అనే కథా సంకలనం లో వున్నాయి.జీవితపు విలవలను కాచి వడపోసిన , వక్కో కథ వక్కో ఆణిముత్యము.
సాగరకెరటం :
“బ్రతుకు బాధ్యత ముందు సామాజిక బాధ్యత కనుమరుగవుతుంది.ఇక్కడ ప్రవేశిస్తుంది అసహనం.అటు తల్లి తండ్రులు, ఇటు పిల్లలు ఇద్దరూ అవస్తకు లోనవుతారు.పెద్దరికం పెదవి దాటనివ్వదు, పిల్లల పసితనపు ఊహలు పెద్దలకు ఊహాతీతాలు.సన్నటి పొరలావున్న బాంధవ్యాలు పుటుక్కుమంటాయి.కాని సాగరమంత విశాలమైన తల్లి తండ్రుల మనసులో పిల్లలు ఉవ్వెత్తున ఎగిరే కెరటాలు.సాగరాన్ని విడిచి పోగలవా ? ఉహూ పోలేవు.ఎంత దూరం వెళ్ళినా కెరటం వెనక్కి రావలసిందే.అనుబంధాలు , ఆప్యాయతలూ కనుమరుగవుతున్నట్లు అనిపించినా సాగరం కెరటాన్ని అక్కున చేర్చుకున్నట్లు తల్లితండ్రులు పిల్లలను అక్కున చేర్చుకుంటారు.కెరటం ఎగిసిపడిన హుషారు తగ్గి మళ్ళీ సాగరం వైపుకే అడుగులు వేస్తూ పరిగెడుతుంది. పిల్లలనుండి దూరం అవటం కూడా పెద్దలు భరించలేరు.అలాగే పిల్లలు పెద్దలకు దూరం కారు.దూరమైనట్లు కనిపిస్తారు.కాని అంతరాంతరాల్లో సాగర కెరటం నిత్య నూతనంగా చలిస్తూనే వుంటుంది.”
తల్లి తండ్రుల పిల్లల మధ్య జరిగే ఆటుపోట్లను ప్రతిబింబించే ఈ వాక్యాలు సి.ఉమాదేవి గారు రచించిన నవల “సాగరకెరటం”లోనివి.తన కొడుకులు జగన్ , పవన్ బాగా చదివి పెద్ద ఇంజనీర్ లు కావాలని, అందరిలా అమెరికా వెళ్ళి బాగా సంపాదించుకోవాలని , తను వారిద్దరి వద్దా సేద తీరాలని ఆశించే మధ్యతరగతి తండ్రి జనార్ధన్.అందుకని చాలా అప్పులు చేస్తాడు. పిల్లల తో కఠినంగా వుంటాడు.ఈ క్రమం లో కూతురు పూజను చదివించలేక పెళ్ళి చేస్తాడు. తను కలలు కన్నట్టుగానే జగన్ ను ఇంజనీర్ చేసి పెద్దింటికి ఇల్లరికపు అల్లుడుగా పంపుతాడు. పవన్ అమెరికా వెళుతాడు.తల్లి రాజ్యం మనసులో పిల్లలు దూరమయ్యారని బాధ, అసంతృప్తి. ఆ సంధర్భం లోనే ఈ వాక్యాలు తల్లి కి చెప్పి ఓదారుస్తుంది కూతురు పూజ.తల్లి తండ్రులకు పిల్లల పట్ల కలలు, ప్రేమానురాగాలు , తల్లితండ్రులు పిల్లల మధ్య వున్న సున్నితమైన అనుబంధాలు, బాందవ్యాలను గురించి సున్నితంగా వివరిస్తారు రచయిత్రి ఈ నవలలో.
(సశేషం)
– మాలా కుమార్
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`
One Response to కేర్ టేకర్