ఓయినం

Gowri jajula మొగులయ్య ఆ దెబ్బల నుంచి కోలుకోవటానికి నెలరోజులు పట్టింది. అదే సమయంలో కూతుర్ని చూడటానికి వచ్చిన ఎల్లమ్మ అల్లుణ్ణి కూతుర్ని పిల్లనూ, ఇల్లునూ చూసి గుండెలు బాదుకుంది.ఇంత జరుగుతుంటే తన దగ్గరికి రాక ఇక్కడే ఉండి అష్టకష్టాలు పడ్తున్న కూతుర్ని నిందిస్తూనే అక్కున చేర్చుకుని కన్నీళ్ళ పర్యంతం అయింది.జరిగింది తల్చుకుని నీలమ్మ కుమిలిందేకానీ ఎవరిని నిందించలేదు. ”నా తలరాత సక్కగుంటే గిట్లెందుకైతదమ్మ ఎవరిని ఏమనుకోనీకి లేదు” అని తల్లితో అంటుంటే…

”గిట్ల రాయిలెక్కనుంటే ఎట్టా బిడ్డా యింగనన్న బత్కనేర్చుకోండ్రి” అంటూ ఐదువందలు కూతురి చేతిలో పెట్టి ఇంటికి పయాణమైంది.
తల్లి ఇచ్చిన డబ్బులతో ఇంట్లోకి రాషను తెచ్చింది నీలమ్మ.
అందరి ముందు ముఖం చెల్లక మొగులయ్య గడపదాటలేదు.
ఇక పోచమ్మ సత్తెన్నల నోటికి అడ్డుఅదుపు లేకుండా పోయింది.
వాళ్ళకు జడిసి పాలోళ్లందరు కన్నెత్తి చూడక పన్నెత్తి పలుకరించక ముఖాలు చాటేస్తుంటే దుర్గమ్మ, అంజమ్మ, కనకలచ్చిమి, దుర్గమ్మ కూతురు నాగమణిలు అడపాదడపా నీలమ్మను పలుకరించసాగారు.
వారం రెండు వారాల తర్వాతే నీలమ్మ సుక్కమ్మ, పోచమ్మల యిండ్లకు పోయింది. వాళ్ళు బహిరంగంగా మాట్లాడుకున్నా లోపల నీలమ్మను కూర్చోపెట్టుకుని సంసారాన్ని చక్కదిద్దుకోమని హితబోధ చేశారు.
నీలమ్మ భర్తను పిల్లలనూ తీసుకుని తల్లిగారింటికి వెళ్ళి ఓ వారం రోజులు ఉండి వచ్చింది.

కాలం భారంగా గడుస్తున్న సమయంలో…
ఒకనాడు దుర్గమ్మ ఇంట్లో కూరగాయల గంప నుంచి రాత్రికి రాత్రి కూరగాయలు మాయం అయ్యాయి.
తెల్లారి లేచి అది చూసిన దుర్గమ్మ లబోదిబోమంటూ ”నా కూరగాయలు తీసుకున్నోళ్ల నోట్లో మన్నువడ, ఆని నోట్ల దుమ్మువడ” అంటూ శాపనార్థాలు పెట్టసాగింది.

మళ్ళీ అందరూ గుమిగూడారు. కాని అక్కడ ఆడవాళ్ళు మాత్రమే ఉన్నారు. ”దొంగతనం జేసినోళ్ళు ఎవలో గిప్పుడే తెలుస్తది లోతుకుంటపోయి బియ్యం మంత్రిచుకొస్తా దొంగకొడుకులు దెబ్బకు సావాలే” అంటూ తిట్టిన తిట్టు తిట్టకుండా తిడ్తున్నది.
అదే సమయంలో కిరాయోళ్ళకీ పాలు పోయనీకి వచ్చిన పాపయ్య మధ్యన కల్పించుకుని అసలు సంగతేంటని అడిగాడు.
‘దుర్గమ్మ గంపల నుంచి కూరగాయలను రాత్రి ఎవలో దొంగిలించిండ్రట మంత్రబియ్యం దెచ్చి అందరికి పంచుతానంటుంది” అన్నది కనకమ్మ కోపంగా. ”ఇగో ఒదినా మంత్రబియ్యం పెడ్తనని కోపమొచ్చి అన్నగాని గట్ల జేస్తనా ముందే కిరాయి దాన్ని మీకిస్తనా” అని అంటూనే ”ఇగో పాపయ్య ఎట్ల జేద్దు సెప్పు గియ్యల కూరగాయలు దొంగిలించినోళ్లు రేపు నా యింట్ల ఇంకేదన్నా దొంగులుకుంటరు ఎట్ల జెయ్యాలో జెర నువ్వే సెప్పరాదూ” అన్నది బాధపడ్తూ.

విషయమంతా విని ”నీకు ఎవల మీదన్నా సెక్కు ఉన్నదామ్మ” అన్నాడు అతను.
”ఎవల మీద సెక్కు లేదు పాపయ్య గాని దొంగతనమైతే జరిగి నా కూరగాయలు పోయినయి” అంటూ కూరగాయల గంపను అందరి ముందుపెట్టింది.అందరి మనస్సుల మాత్రం అరవలచ్చిమోల్లమీద అనుమానం కల్గింది కాని నెలరోజుల కిందట జరిగిన సంఘటను బట్టి మొగులయ్య మీద కూడా పిసరంత అనుమానం ఉన్నా అసలు దొంగెవరో ఎవరికి అర్ధం కాలేదు.
అందరు ఆలోచనలోపడటం గమనించిన పాపయ్య ”ఇగో నేనొక పని జేస్తాగాని నన్ను గలతు అనొద్దు అది గూడా మీకందరికి సమ్మతమైతేనే’ అన్నడు.

”దొంగనతం జెయ్యనప్పుడు మేమెందుకు బయపడ్తాము పాపయ్య నువ్వేం జేస్తావో చెయ్యిగాని దొంగను పట్టించాలే” అన్నది పోచమ్మ.
”ఇగో ఎవలన్నా జెర పుస్తెల తాడు ఇయ్యుండ్రి” అన్నాడు అందరి దిక్కుచూస్తూ
అతడే చేయబోతున్నాడోననే ఆత్రుత అందరిలోనూ తొంగిచూసింది. వెంటనే సుక్కమ్మ కోడలు శాంతమ్మ మెడలోంచి పుస్తెల తాడును తీసి పాపయ్య చేతికిచ్చారు.

పాపయ్య పుస్తెను తాడును చేత్తో పట్టుకుంటూ ”ఇగో గీ తాడుని కదలకుండా నేను పట్టుకుంట గప్పుడు కూరగాయల లచ్చిమొచ్చి ఆమెకు డౌటున్నోళ్ళ పేర్లు గీ పుస్తెనూ జూస్తూ సెప్పమను అప్పుడు ఈ పుస్తె కదలకుండా ఉంటే ఆళ్ళు దొంగలు కారు, పుస్తె కదిలిందో ఆళ్ళు దొంగలే” అంటూ ”మల్లా గిట్ల చేద్దామంటారా” అని అందరి సమ్మతి కోసం చూశాడు.
అందరికి ఆ ఐడియా నచ్చి సరే అన్నారు. దుర్గమ్మ పుస్తె దగ్గరకు వంగి పుస్తెను చూస్తూ ముందు అంజమ్మ పేరు చెప్పింది. తాడు కదలలేదు.

నీలమ్మ పేరు చెప్పింది. వెంటనే పుస్తె మెల్లగా కదిలింది. అంతే అందరి చూపులు భారాభర్తల్ని శూలాల్లా గుచ్చాయి.
”ఇది జూటమాట ఇది జూటమాట కావాలంటే నా ఇద్దరి పిల్లలమీదొట్టు. నేను దొంగతనం జెయ్యలే నేను దొంగతనం జెయ్యలే కావాలంటే నా ఇల్లు సోదజేయుండ్రి అంటూ” అరచినట్లుగా అంది నీలమ్మ.
”ఇగో సెక్కు ఉంటే మల్లా జేస్తా నేనే కదిలిచ్చినని నువ్వన్కుంటున్నవేమో నీమీదా నాకు పగమ్మా” అంటూ ”ఇగో దుర్గమ్మ మల్ల జెప్పు” అన్నాడు.

ఇంగో కొందరి పేర్లు జెప్పి కొందరి పేర్లు సెప్పకుంటే ఎట్టొదినా అందరి పేర్లు కలేసి సెప్పు గప్పుడు దొంగెవరో దొర్కుతరు రాళ్ళు పడ్డోళ్ళ మీద మల్లా రాళ్లేస్తే ఎట్ల” అన్నది సుక్కమ్మ.
మళ్ళీ తాళిముందు నిల్చొని ఈసారి అందరిపేర్లు చెప్పటం మొదలుపెట్టింది దుర్గమ్మ.
”పోచమ్మ” తాళి ఊగలేదు.
”సుక్కమ్మ” తాళి ఊగలేదు.
”కనకలచ్చిమి” తాళి ఊగలేదు.
”కనకమ్మ” తాళి ఊగలేదు.
”సత్యమ్మ” తాళి ఊగలేదు.
”అంజమ్మ” తాళి ఊగలేదు.
”నీలమ్మ” తాళి మళ్ళీ మళ్ళీ ఊగింది.
రెండోసారి కూడా నీలమ్మ పేరుచెప్పెసరికే తాళి ఊగడంతో ఈసారి దొంగతనం కూడా వాళ్ళే చేశారని అందరు నిర్ధారణకు వచ్చేశారు.

నీలమ్మకు కాళ్ళకింద భూమి చీలి అగాథంలో కూరుకుపోతున్నట్లు విలవిల లాడింది. మొగులయ్య ముఖంలో రంగులు మారి ముఖం కళతప్పింది.చేయని నేరాన్ని అనుభవించాల్సి వస్తున్నందుకు సిగ్గుతో చావాలన్పించింది. తన నీడను తానే అనుమానించుకోవాల్సిన పరిస్థితుల మధ్య పాపయ్య చెయ్యిని పట్టి గబగబా తన ఇంట్లోకి తీసుకుపోయి ”సూడన్నా సూడు నాయింట్ల కూరగాయలున్న యేమో సూడు” అని బట్టల సంచులు, పెట్టెలు, కుండలు అన్ని చూపిస్తుంటే అందరు వెనకాలే పరుగెత్తుకొచ్చారు.

నీలమ్మ అలా చేస్తుందని ఊహించని పాపయ్య నింపాదిగా మీసాలు దువ్వుకుంటూ ”దొంగతనం జేసిన వాళ్ళు ఒక్కసారి దొర్కుతరు గాని మల్లా మల్లా దొర్కుతరా ఏంది” అంటూ బయటకు నడుస్తుంటే ఆ మాటలు అగ్గికి ఆజ్యం పోసినట్లయ్యాయి.
యింతవరకు సుక్కమ్మ, పోచమ్మ, దుర్గమ్మ, అంజమ్మ, కనక లచ్చిమి దృష్టిలో అయ్యోపాపం అనేటట్లుగానైనా ఉండేవారు. కానీ ఈ సంఘటన జరిగాక మాత్రం అందరి జాలిని కూడా మొగులయ్య నీలమ్మలు కోల్పోయారు.

మారుమాట్లాడకుండా ఒక్కొక్కరే అక్కడ్నించి పోతుంటే భర్తను పిల్లలను పట్టుకుని కుమిలికుమిలి ఏడ్చింది నీలమ్మ.
తన తలరాతను రాసిన దేవుడ్ని నిందిస్తూ కన్నీళ్ళు కార్చింది. మొగులయ్య భార్యను నిర్లిప్తంగా చూస్తుండిపోయాడు.
ఆరోజు రాత్రి భార్యద్వారా మొగులయ్యకి జరిగిన అవమానం తెల్సుకున్న సత్తయ్య పొట్టచెక్కలయ్యేలా నవ్వుకున్నాడు.
ఓరోజు పొద్దున్నే బజార్లో పనిపడి పోతున్న సత్తయ్య, ఎల్లయ్యలకు పాలక్యాన్లతో సైకిలు మీదొస్తున్న పాపయ్య దారిలో తారసపడ్డాడు.

వెంటనే ఇద్దరు సైకిలుకు ఎదురెళ్ళి హ్యాండిల్‌ని పట్టుకుని ఆపుతూ ”ఏందే పాపన్నా బాగున్నావా” అంటూ దీర్ఘాలు తీస్తూ ఇద్దరు ఒకేసారి అడిగేసరికి పై ప్రాణాలు పైనేపోతుండగా పాపయ్య టక్కున సైకిల్‌ దిగి స్టాండ్‌ వేశాడు. ఊహించన విధంగా సత్తయ్య తనని దార్లో పట్టుకునేసరికి, తన తమ్ముని కొడుకును నిందల పాలుజేశాడని ఎక్కడ తంతాడోనని వణకసాగాడు.
”అరే గిదేంది బై గిట్లొన్కుతున్నవు, నన్ను జూసేటాళ్ళకు నోట్ల మాటొస్త లేదేంది”.

”గ… గ… గదేంకాదు సత్తెన్న మిమ్మల్ని సూసి శానారోజులైందిగా గిప్పుడు సడెనుగా కన్పించేటాళ్ళకు హ్హి…. హ్హి… హ్హి….” అంటూ వెకిలి నవ్వు నవ్వాడు.
”అవునుగాని మా బాయిగడ్డ మీదొచ్చి శానా నాయాలు సెప్తున్నవంట ఏంది సంగతి’ అన్నాడు ఎల్లయ్య గడ్డం గోక్కుంటూ.
”నే…. నేనా నాయాలు జెప్పేంత పెద్దోడినా అన్నా మొన్న దుర్గమ్మ కూరగాయలు పోతే ఏదో నాకు తెల్సింది సేసినా” అంటూ నసిగాడు.
”ఆ గాకత మాకు తెల్సింది లేవోయ్‌ ఔనూ నువ్వుగంత నిక్కచ్చైనోడివైతే ఆ పుస్తెను ఏడన్నా సూరుకు తగిలిస్తే పోతదిగా గప్పుడు ఎవలు దొంగని సరిగ్గా తెలుస్తది, గట్లగాక నీ సేతిల పట్టుకునే అవసరం ఏంది” అంటూ అసలు మాటకు వచ్చాడు సత్తయ్య.
తానే అక్కడ కుట్రజేశాడని సత్తయ్యకు తెల్సిపోయిందని గ్రహించాడు పాపయ్య. అమాంతం కాళ్లమీద పడి ”అన్నా నన్ను శమించే. నా బుద్ది గడ్డితిని గట్లజేసినా” అన్నాడు. ”సరే మంచి పని జేసినావుగానీ ఎందుకు గట్ల జేసినవో జెరసెప్పు” అంటూ ఓరగా చూశాడు.
ఇక చెప్పక తప్పని పరిస్థితుల్లో ”మీకాడ దాసుడేందన్నా నేను అంజమ్మకి, కనక లచ్చిమికి పాలుబోస్తా మీకెర్కెగా”
”ఆ ఎర్కనే అయితేంది” అన్నాడు.
”కనక లచ్చిమికి పాలు పొయ్యంగా పొయ్యంగా మా యిద్దరికి లింకు గల్సిందే గదంటే నాకు నేనంటే దానికి మస్తు ఇష్టం” అంటూ నసిగాడు.

                                ”ఐతే కనికి మీ మొగులయ్య గానిమీద దొంతనం మోపమన్నదా దాంట్ల దానికేం లాభం” అన్నాడు కోపంగా.”అహ… అహ… గట్ల కాదన్నా ఆయాల్ల రాతిరేల కూరగాయలు దొంగిలించింది దాని కొడుకు. తెల్లారేదాకా దానికి గాసుద్ది ఎర్కలే తీరా అవి కంట్లపడే తాళ్ళకు పోచమ్మ తిట్టుడు సుర్వుజేసిందట గప్పుడు కూరగాయలను దీస్కపోయి ఉన్న జాగలనే ఎట్ల పెడ్తది జెప్పు మొన్న జొన్నకంకులు దేవులాడినట్లు కూరగాలయను ఇండ్లల్ల లెంకితే ఉన్న ఇజ్జతుపోయి ఇల్లు ఖాళీజెయ్యమంటరని ఆరోజు పాలుబొయ్యవోతే యింట్లకు పిల్సిజెప్పింది. ఇంగ ఎట్ల జెయ్యాలా అని సోంచాంచినా గీ దొంగతనం ఎవలమీదకు నూకినా నన్ను తంతరు గాని మొగులయ్యోల్ల మీద యింతకు ముందే దొంగగా పేరుపడింది గిదిగూడా ఆళ్ళమీద ఏస్తే పెద్ద మోపేంకాదు కాని కనకలచ్చిమి బయటపడ్తే దానికి నిలువనీడుండదని గిట్లజేసినా అన్నా దాని సుద్దిల పడి నీలమ్మను దొంగగా అందరి ముందు నిలవెట్టినా కావాలంటే బాయికాడికొచ్చి అందరి ముందు ఆళ్ళు అట్ల జెయ్యలేదని సెప్తా” అంటూ కాళ్ళు గట్టిగా పట్టుకున్నాడు.

                      ”నువ్వు మళ్ళా వచ్చి మా మొగులయ్యగానికి సంజాయిషీలు ఏం చెప్పొద్దు గిప్పటిదాకా చేసిన అర్కతులు సాలుగాని నీ లెక్కలు మొగులయ్యగాని మీద సెల్లినయి గాని మల్లా మా బాయి గడ్డమీదికొచ్చి ఇంకొకల మీద గిట్లాంటి చాలుబాజు లెక్కలు సూపిస్తివో పానం తీస్తా నడువు ఇడ్కేని” అంటూ పాపయ్యను తరిమేసరికి వెనుతిరిగి చూడకుండా పోయాడు.
అతన్ని చూసి పకపకా నవ్వుతూ ”ఒరేయ్‌ ఎల్లిగా ఇంకా యిద్దరు మన సేతిల సిక్కిండ్రురా కాని మొగులయ్య గానికి తగిన శాస్తే జరిగింది. గిప్పుడు నా దిల్ల మస్తు కుషిగుందిరా” అంటుంటే ”అవునన్నా సత్తెన్ననా తంటమజాకానా” అంటూ అతని సంతోషంలో పాలుపంచుకున్నాడు.

                       చేయని దొంగతనం మీద పడేసరికి నీలమ్మ మానసికంగా కుంగిపోయి అన్న పానీయాలకు దూరం అయింది. ఎంతసేపు జరిగిన సంఘటనను తల్చుకుని కుమిలిపోతూ శారీరకంగా కృశించి అది జ్వరానికి దారితీసింది.రెండు మూడురోజులు గవర్నమెంటు ఆసుపత్రికి తీసుకెళ్ళినా నీలమ్మ జ్వరం తగ్గలేదు. తల్లి జ్వరాన పడటంతో ఆలనాపాలనా లేక పిల్లలు కృశించారు. జ్వరం తగ్గే సూచనలు లేకపోవడంతో భార్యను అత్తగారింట్లో వదిలివచ్చిన మొగులయ్యకి భార్యాపిల్లలు ఇంట్లో లేకపోయేసరికి అదోలా అన్పించి మళ్లీ పొలం దగ్గరకు పోవటం మొదలుపెట్టాడు.పొద్దుంతా పొలం దగ్గర చెట్టుకింద కూర్చొని పొద్దుపుచ్చటం రాత్రిళ్ళు ఇంటికి వచ్చి, ఇష్టం ఉంటే ఇంత ఉడకేసుకు తినటం లేకుంటే పస్తులు పడుకోవటం చేస్తుండగా…ఓ అర్ధరాత్రి తలుపు చప్పుడైతే వెళ్ళి తలుపు తీశాడు. ఎదురుగా చంద్రయ్య, రంగయ్యలు గబగబా లోపలికి వచ్చి తలుపు తీసి ఇంట్లో కూర్చున్నారు.

                         ”ఏందే గింత రాత్రొచ్చిండ్రు పిలిస్తే నేనొస్తుంటిగా” అన్నడు జీరగొంతుతో.
”ఏం లేదురా శానా దినాలైపోయే నిన్ను గలువక పొద్దుగాళ్ళపోతే పొద్దుమింకి వస్తుంటిమి నిన్ను ఏడన్నా కలుద్దామంటే నువ్వేమో ఏ మబ్బులనో పోయి ఎప్పుడో రాత్రికి వస్తున్నట్లున్నవు, ఎప్పుడు జూసినా తలుపుకు తాళం కప్ప ఏలాడుతుంది. గది సరే నీలమ్మకు జరమని దెల్సింది మల్లా పోతివా” అన్నడు చంద్రయ్య.
”లే కాకా ఆడ్కి మల్ల పోలే” అని తలొంచుకున్నాడు.

                    ”పండ్లున్న సెట్టుకే దెబ్బలెక్కువ కొడ్కా బుగులు పడకు నీకు మల్లా మంచి దినాలొస్తయి. రేపట్నించి మనకాడ పనుంది వస్తవా” అన్నాడు రంగయ్య. ఆ మాటకి మొగులయ్య చప్పుడు చేయకపోవటం చూసి ”ఇగో బిడ్డా మేం ఏం జెప్పినా నీ మంచికే సెప్తం కూకుని తింటే సంపాయించే టోళ్ళు ఎవరురా. నువ్వు పని జెయ్యాలా మల్లా నల్గుట్ల నువ్వు తిర్గాలని మా పానం తన్కులాడ్తది” అన్నాడు చంద్రయ్య మొగులయ్య సందేహాన్ని చూసి.మొగులయ్య కొంచెంసేపు ఆలోచించి ‘సరే వస్త తియ్యి” అన్నాడు.మర్నాటినుంచి మొగులయ్య మళ్ళీ పనికిపోవటం ప్రారంభించాడు.జ్వరం నుంచి కోలుకుని నెల తర్వాత యింటికి వచ్చిన నీలమ్మకి ఇంట్లో మళ్ళీ బిందెలు, వంట సామాన్లు దర్వనమిచ్చేసరికి భర్తలో వచ్చిన మార్పుకు సంతోషించింది.
భర్త మారి మళ్ళీ మొదటిరోజులు రావాలని అట్లయితే యాదగిరి గుట్టకు అందరం కల్సివచ్చి సత్యనారాయణ కత చెప్పిస్తానని నరసింహ్మస్వామికి ముడుపుకట్టి దేవుడి పటం దగ్గర రాగిచెంబులో వేసింది.

               మొగులయ్య తిరిగి చూడకుండా కష్టం చేస్తూ, చేసిన కష్టం అంతా తెచ్చి భార్య చేతిలో పెట్టాడు. ఇంట్లోకి గీసిగీసి ఖర్చుచేస్తూ పొలాల్లో మళ్ళీ పనులు సురువు అయ్యేసరికి నాలుగువేలు జమచేసి రెండువేలు కరెంటు బిల్లు కట్టి, మిగతా రెండువేలు పొలం కూళ్ళకని భద్రం చేసింది.మిర్గం అయిపోగానే మొగులయ్య మళ్ళీ పొలంలో నాగలిని కట్టాడు. బురద పొలంలో నాగలిని కట్టడం చూసి మళ్ళీ ఇట్ల చేస్తున్నాడేందని విస్తుపోతూనే ”ఏందయ్య ఆ పొలం దున్నరాదూ బురద మడుగు మనకు అచ్చిరాదే” అన్నది.”బురదమడ్గు అయితే ఏంది నీలా. యిండ్ల బంగారం పండుతది. ఆ పొలంల సారం సచ్చిపోయిందే గందుకే గిండ్ల ఏద్దామన్కుంటున్న” అని అంటుంటే అన్నంపెట్టిన తల్లి మీదనే అబద్దం ఆడినందుకు అతని మనస్సు తల్లడిల్లిపోయింది.
నీలమ్మకు పొలం గురించి మెల్లమెల్లగా నచ్చజెప్పాలనుకున్నాడు. భర్తకు ఏది ఇష్టమైతే తనకు అదే ఇష్టం అనుకుంది నీలమ్మ.
చివరిసారి బురదమడిని అతివృష్టి ముంచేస్తే ఈసారి అనావృష్టి పీడించింది. మిర్గం దాటినా తొలకరి జల్లులు పడలేదు. మొగులయ్య ఎండలోనే పొలం దున్నుతున్నాడు.

                            ఇన్నిరోజులు ఉప్పరిపని, ఇప్పుడు పొలంపని, దానికి తోడు మానసిక కుంగుబాటు అతన్ని అతలాకుతలం చేస్తున్న తరుణంలో ఎండదెబ్బ తగిలి జ్వరం పట్టుకుంది.పదిరోజుల పాటు పీడించిన జ్వరం మలేరియాకు దారితీసి చలిజ్వరంగా అతన్ని వణికించసాగింది. మెల్లగా తొలకరి జల్లులు మొదలై ఊపందుకుంటుంటే అందరు పొలాల్లో పనుల్లోకి దిగారు. మొగులయ్య జ్వరంతో పడుకున్నా భార్య ద్వారా పొలం దగ్గరి విషయాలు తెల్సుకుంటున్నాడు.అందరు పొలాలు దున్నుతూ నారుమడిని సిద్ధంచేసి నారుపోశారు అని తెల్సిన రోజున అతని మనస్సు ఆరాటపడింది. ”అయ్యా ఈసారి పంట పోతే పోయింది తియ్యి మల్లసారి ఏసుకుందాం” అంటూ నీలమ్మ ఊరడించినా మొగులయ్యలో ఆత్రుత దగ్గలేదు.మొగులయ్యకి జ్వరం తగ్గి పొలానికి అందరి పొలాల్లో వరి విత్తనాలు నాటుకొని పచ్చని మొలకలు దర్శనం ఇచ్చాయి. వెంటనే నీలమ్మను వడ్లు నానపొయ్యమని చెప్పి పొలంలో నాగలి కట్టాడు. వర్షం అడపాదడపా పడ్తూనే ఉంది. జ్వరం వచ్చి నీరసం ఆవహించినా మొగులయ్య వెనుకకు తగ్గక పొలం దున్నటానికే నిర్ణయించుకున్నాడు.
నీలమ్మ నానిన వడ్లను తీసి గంపలో వేసిపెట్టింది. ”మొలకలొచ్చిన తర్వాత పొలంలో చల్లుడే తర్వాయి జెల్ది పొలం దున్నుడైతే బాగుండు దేవుడా” అనుకుంది.

                        అటు మొగులయ్య పొలం దున్నటం పూర్తయి ఇక చివరగా గోర్రుకొట్టి నారుమడి దున్నటమే తరువాయి. ఆరోజు పొద్దుటి నుంచి సాయంత్రం దాకా నాగలిని ఇడువకుండా దున్నింది దున్నినట్లు దున్నుతూనే ఉన్నాడు.”రేపు పొద్దుగాళ్ళకీ వచ్చి గొర్రుకొడ్తే నారు చల్లొచ్చు” అనుకుంటూ చీకటి పడిన వేళకి నాగలిని విడిచి కాళ్ళు చేతులు కడుక్కొని ఎడ్లను ఇంటికి కొట్టుకొస్తుంటే వెన్నులోంచి చలి తడలు తడలుగా రావట్టింది.రెండు గొంగళ్ళు రెండు దుప్పట్లు ఒక బొంతను కప్పినా మొగులయ్యకి చలి తగ్గలేదు. భర్త వీపుకి ఆనుకుని అతన్ని రెండుచేతులతో అదిమి పట్టుకుని చలిని ఆపే ప్రయత్నం చేసింది. అయినా మొగులయ్యకి చలి తగ్గలేదు.

                       రాత్రంతా చలితో వణుకుతూ తెల్లారేసరికి బాగా నీరసించిపోయాడు. జ్వరం మళ్లీ రోజురోజుకు ఎక్కువైంది. విపరీతమైన జ్వరం విడవకుండా పట్టేసరికి ఎవరైనా మంత్రాలు చేశారేమోనని పాలోళ్లలో అనుమానం మొదలైంది.మొగులయ్య మీద పగబట్టేవాడు. సత్తెన్ననే మొగులయ్యకీ మంత్రాలు చేయించాడ ని పాలోళ్ళందరు గుసగుసలాడారు. నీలమ్మ భర్తకు నయం కావాలని ఎవరు ఎక్కడికి తీసుకెళ్ళమంటే అక్కడికి తీసుకెళ్ళింది.సర్కారు దవాఖానాకీ, దర్గాలకీ, బాబాల దగ్గరకీ ఆఖరికి మంత్రగాళ్ళ దగ్గరికి భర్తను తిప్పేసరికి పరిస్థితి మళ్ళీ మొదటికొచ్చింది. పొలం పనులకని దాచిన డబ్బులు హారతి కర్పూరంలా హరించుకుపోయాక చివరికి ఇంట్లో బిందెలను కూడా మళ్ళీ కుదువపెట్టింది.ఈ పరిస్థితుల్లో పాలోళ్ళు అడపాదడపా వచ్చి పలుకరించిపోతుంటే సత్తయ్య, పోచమ్మ అటు కాలు ఇటు పెట్టలే. మంత్రాలు చేశానని పాలోళ్ళు అనుకుంటున్నా రనే విషయం ఎల్లయ్య ద్వారా విని అగ్గిమీద గుగ్గిలం అయ్యాడు.తానొకటి తలిస్తే మరొకటి జరగవట్టెనని చిటపటలాడాడు.

       ”ఇడుంటే యింటికొచ్చినోళ్ళంతా ఏదో ఒక మాట అంటారురా నేను ఈ రాత్రికే ఎడ్లబ్యారెంకు పోతా” నన్నడు. తెల్లారుజాముననే అంగడికి పోయాడు.మెల్లమెల్లగా మొదలైన వాన కుంభవృష్టిగా మారింది. నీలమ్మ మొగులయ్య దగ్గరే కూర్చుని అతనికి సపర్యలు చేస్తోంది. అతను అడిగినప్పుడల్లా డికాషను కాచి ఇస్తోంది. వారం రోజుల నుంచి మొగులయ్య కొంచెం రాగిజావ, డికాషను తప్ప మరోటి ముట్టడం లేదు ఒకవేళ బలవంతంగా ఏదన్నా తినిపించినా అది వెంటనే వాంతుల రూపంలో బయటికి వస్తోంది.మొగులయ్యకి ఆ రోజు కాస్త చలి తగ్గింది. పిల్లలకూ అన్నంపెట్టి పక్కేసి పడుకోబెట్టాక మొగులయ్యకి మళ్ళీ డికాషను కాచి పోసింది. అది తాగి మొగులయ్య నిశ్చింతగా పడుకోవటం చూసి కాస్త ఎంగిలి పడదామని గిన్నె కడుక్కొని అన్నం పెట్టుకోబోయింది.

                   అంతే పడుకున్న మొగులయ్య ఒక్క ఉదుటన లేచి కూర్చుంటూ పెద్దపెట్టున అరిచి ఆత్రంగా గుండెలను నిమురుకోసాగాడు.భర్త అరుపు విని నీలమ్మ ఒక్కసారే అదిరిపడి ఒక్క అంగలో అతని చేరి ”ఏందయ్యా ఏంది గట్ల లేసినవేంది ఏమైంది” అంటూ భుజాన్నిపట్టి కుదుపుతుంటే మొగులయ్య వెర్రిచూపులు చూస్తూ పసివాడిలా రోదించాడు. ఆ అలికిడికి పిల్లలు లేచి తల్లిదండ్రుల గాబరా చూచి ఒక్కసారే ఏడుపు లంకించుకున్నారు.నీలమ్మ భర్తను ఒక దిక్కు సముదాయిస్తూనే మరోదిక్కు ”సురేందరు నాయినెట్లనో జేస్తుండు బిడ్డా పోయి నాయినమ్మ తాతోల్లని పిల్సుకురా” అని గట్టిగా అరిచేసరికి సురేందరు వర్షంలోనే బయటికి పరుగెత్తి అందరి ఇండ్లకు పోయి ”మా నాయినెట్లనో జేస్తుండు జెల్దీ రండ్రి జెల్దీ రండ్రి” అని ఏడుస్తూనే చెప్పి వెళ్ళినంత వేగంగానే తిరిగొచ్చి తల్లి వెనకాలే చేరి తండ్రిని చూడసాగాడు.

                      అతని వెనకాలే ఒకరెనక ఒకరు మొగులయ్య దగ్గరికి పరుగెత్తుకొచ్చేసరికి చలితో వణికిపోతున్న మొగులయ్య నీలమ్మ చేతుల్లో ఉండటం చూసి ”మొగులయ్య ఏమైంది కొడ్కా ఏమైంది నీకు ఎట్లుంది అని ఒకరెనక ఒకరు ఆదుర్దాపడుతూ అడిగేసరికిమొగులయ్య చలితో ఎగిరెగిరి పడ్తు భార్యాబిడ్డల దిక్కు చూస్తుంటే ఇద్దరి కొడుకుల్ని దగ్గరకు చేర్చేసరికి మొగులయ్య భార్యాపిల్లలనూ మార్చిచూస్తున్నాడు.”ఏమైందయ్యా ఏమైంది నీకేమైంది నాతోటి మాట్లాడయ్యా” అంటూ నీలమ్మ తలబాదుకుంటూ భర్తని గుండెలకు అదుముకుని ”నేనున్న నేనున్నా” అంటూ చేతులని గట్టిగా పట్టుకున్నది.
మొగులయ్య భార్యాపిల్లల వంకా మార్చిమార్చి చూస్తూ ”నీలా… నీలా… నీ…” అంటూ కన్నీళ్ళనూ రాలుస్తూ ప్రాణాలు వదిలాడు.

భర్త కన్నీళ్ళను చేత్తో తుడుస్తూ ఒక్కపెట్టున గావుకేక పెట్టింది నీలమ్మ. కళ్ళముందే భర్త ప్రాణంపోవటం చూసి పొగిలి పొగిలి ఏడుస్తుంటే మిగతా వాళ్ళు ఆమెతో శృతి కలిపారు.ఏమి జరిగిందో తెలియక పసివాళ్ళు, పెద్దవాళ్ళని చూసి ఏడుస్తూ మరికాస్సేపు మౌనంగా తండ్రిని చూస్తూ ఉండిపోయారు.పోచమ్మ కడపలనే కూర్చొని ”నా కొడుకా” అంటూ సోకాలు పెడ్తూనే అందరిని గమనించసాగింది.మొగులయ్య పోయాడన్న బాధలో ఎవ్వరూ ఆమెను పట్టించుకోక ఎవరి ఏడుపులో వాళ్ళున్నారు.
నీలమ్మ తల్లిదండ్రులకీ, చుట్టాలకీ ఆ రాత్రే కబురు పంపారు. భజన మందిరం నుంచి వచ్చిన వాళ్ళు చావు భజన చేస్తూ…

”సుక్కాలాంటి సుక్కాల్లో లక్షలాది సుక్కాల్లో
నువ్వు ఏ సుక్కాల ఉన్నావో జాజుల మొగులయ్య || సు ||
మీ అమ్మ భూమమ్మ నెత్తినోరు కొట్టుకుంట
నా కొడుకు ఏడాని మమ్ములాను అడిగింది
మేమేమని సెప్పాలే జాజులా మొగులయ్య || సు ||
మీ నాయిన ఈరయ్య గోడుగోడు ఏడ్సుకుంటా
నా మొగులయ్య ఏడాని అంతటా ఎతికిండు
మేమేమని సెప్పాలే జాజుల మొగులయ్య || సు ||
నీ భార్యా నీలమ్మ పట్టలేని దుఃఖంతో
పొగిలి పొగిలి ఏడుస్తుంటే
మేమెట్లాని ఆపాలే జాజుల మొగులయ్య || సు ||
నీ కొడుకు సురేందరు నాయినేడాని జూస్తుంటే
మేమెట్లాని జెప్పాలే జాజుల మొగులయ్య” || సు ||
అని పాడేసరికి అందరి దుఃఖం కట్టలు తెంచుకుంది.
ఆ రాత్రి అందరికి శవ జాగారం అవుతుంటే చుట్టుపక్కల వాళ్ళు అందరికి డికాషన్‌ కాసిపోశారు.
నీలమ్మ మొగులయ్య దగ్గరనుంచి పక్కకు జరుగలేదు. పచ్చి మంచినీళ్ళు ముట్టలే మనస్సంతా భర్తేనిండి జరిగిపోయిన జ్ఞాపకాలనూ నెమరేసుకుంటూ గుండె పగిలేలా ఏడుస్తూంటే, భర్తలేని భవిష్యత్తుని ఎలా గడపాలా అని మనస్సులో వణికిపోయింది.

వచ్చిన సుట్టాపక్కాలు అందరూ కూడా మొగులయ్య శవంపై పడిఏడుస్తూ, కొందరను దగ్గరకొచ్చి చూస్తూ, కొందరు అతనికున్న ఆత్మీయతను గుర్తుచేసుకుంటున్నారు.తెల్లారేసరికి అందరి ముఖాలు పీక్కుపోయాయి. అంతదూరం నుంచే ”నా బిడ్డ నీ రాత గిట్లయిందేంది” అంటూ ఎల్లమ్మ పరుగునొస్తున్న తల్లిగోడు విన్న నీలమ్మ ”ఓయ్యో మా అమ్మొచ్చిందే లేయే” అంటూ బిగ్గరగా అరిచి తల్లి దిక్కు చేతులు చాపంగానే ఎల్లమ్మ ఒక్క ఉదుటన ఇంట్లోకి వచ్చి బిడ్డను పట్టుకుని బోరుమన్నది.
తల్లిని చూస్తుండగానే నీలమ్మ దుఃఖం కట్టలు తెంచుకుంది. పదకొండు పన్నెండయ్యేసరికి చుట్టాలు పక్కాలందరు వచ్చారు. సత్తయ్య వాకిలంతా ఏడ్పులు పెడబొబ్బలతో నిండిపోయింది.పెద్దలందరు ఒక్కదగ్గర చేరి ”ఇంగో ఆళ్ళ పెద్దనాయిన ఉర్లో లేడు నిన్న పొద్దుగాల్ళనే బర్లబారంకి పోయిండట. ఏ వూరికి పోయిండో తెల్వదు గిప్పుడు సావుదినాలు ఎట్ల జేస్తరు చెప్పండ్రి” అన్నారు.

”ఎట్లంటే మేమందరం లేమా” అన్నాడు చంద్రయ్య.
”గదికాదు కొడ్కా సత్తిగాడు ఇంకా రాకపాయే ఆడు వచ్చేదాకా ఆపుదామా” అన్నాడు.
”గట్లేం వద్దు ఇప్పటికే రాత్రింపగళ్ళు రెండు పూటలాయే ఇంకెంతసేపు పీనుగుని ఇంట్ల పెడ్త జెప్పండ్రి. చలో సావు ఎవళ్ళు జేస్తరో జెప్తె కట్టెబట్ట తీసుకొద్దాం” అన్నాడు ఇంకొకతను.పక్కనే నిలవడ్డ ముత్తమ్మ ”ఎవలో ఎందుకే నా తమ్ముని సావు నేనూ జేస్త ఆడు నా తోడ పుట్టకున్నా నా పెద్దనాయిన కొడుకే నా తమ్ముని సావు నేను చేస్తా” అని ముందుకు వచ్చింది.”మీ యింటి ఆడపిల్ల సావుజేస్తానంటోంది. ఒకలెక్క తీర్గనైతే యింటి ఆడపిల్లలకీ సావుజేసే హక్కుంది మూడోద్దులు దినాలు ఇంగ మీరు సోంచాంచుకోండ్రి చంద్రయ్య కట్టెబట్టుకు పోదాం నడ్వండ్రి” అంటూ పెద్దలంతా లేచారు.ముత్తమ్మ రూపాలు ఇయ్యంగానే పెద్దలందరు బజారుకు పోయి కట్టెబట్ట తెచ్చారు. ఇంటి బయట డప్పుల మోత మొదలై ముందుకు కదులుతుండగా సురేందరుకు తెల్ల రుమాలు కట్టించి బాయి దగ్గరకు తీసుకుపోయి నీళ్ళుపోసి నుదుటన విబూది రుద్ది కొత్త కుండలో నీళ్ళు తీసుకువచ్చి బయటనున్న నిప్పుల మీద నీళ్ళు కాచారు.డప్పుల మోతను వింటుంటే నీలమ్మ గుండెల్లో గునపాలు గుచ్చినట్లుగా ఉంది ఇంకా కొద్దిసేపటి వరకే భర్త రూపు తన కళ్ళముందు ఉంటుందని అర్థమయి ఆమె దుఃఖం మరింత కట్టలు తెంచుకుంది.

శవంపైన ఏడుస్తున్న వాళ్ళనందరిని పక్కకు జరిపి వాకిట్లో పీటమీద కూర్చోపెట్టి మొగులయ్యకి కుండలోని నీళ్ళుపోస్తుంటే
మరోదిక్కు నీలమ్మకు ఆడవాళ్ళంతా కల్సి నీళ్ళుపోసి చెరోదిక్కు ఇద్దరికి బట్టలు కట్టించి బయట అరుగుమీద పీటలేసి పంచకు కూర్చోబెట్టాకఎల్లమ్మ సాలయ్య కూతురు అల్లుడికి ఓడిబియ్యం పోస్తూ, నీలమ్మను పసుపు బట్టల్లో చూసి ”బిడ్డా నాతోటి బియ్యం పోసుకొనుడు ఇదే ఆకరా” అంటూ గుండెలవిసేలా ఏడ్చింది.అప్పటికే మరోదిక్కు పాడె సిద్దమైంది. మొగులయ్యని పాడెపై పడుకోబెట్టి బట్టకప్పి సుతిలి తాళ్ళతో బిగించాక పాడేలేచింది. లేచిన పాడెవెంట పాడెకట్టను పట్టుకొని భర్తవెంట చివరిసారిగా జీవచ్ఛవంలా అడుగులేస్తు.”ఓయ్యా నీముందే నా పానం పోవాలన్కున్ననే, నా ముందలనే నువ్వు గిట్లయి నన్ను యిడిసి పోతున్నవా నువ్వులేక నేను ఎట్ల బత్కలేనే, నన్ను కూడా నీ ఎంట తీస్కపోరాదే, నీ దిక్కెల్లి పిల్లలడిగితే నేనేం సెప్పాలే నేనెట్ల బత్కాలే” అంటూ దారంతా తలబాదుకున్నది.

”నీలమ్మ ఇంగ ఊకో ఊకో పిల్ల, నువ్వుగూడా సస్తే నీ పిల్లగాలేంగావాలే జెర ధైర్యం తెచ్చుకో నీలమ్మ” అంటూ సంగమ్మ ఓదార్చినా నీలమ్మనూ ఆపటం ఎవరి తరం కాలేదు.శ్మశానం దగ్గరకు వెళ్ళాక దింపుడుకళ్ళెం చేసి మొగులయ్యని చితిపైకి చేర్చారు. సురేందరు చేత్తో చితికి మంట అంటించేసరికి ఆ దృశ్యాన్ని చూసిన నీలమ్మ స్పృహ తప్పింది.మూడొద్దులు జరిగే నాటికి కూడా సత్తయ్య ఇంటికి రాలేదు.చుట్టుపక్కల గుసగుసలు పోచమ్మ చెవిన పడంగనే ”అడ్డమైనోళ్ళంతా నువ్వు మంత్రాలు జేసిన వంటుండ్రయ్య, నువ్వు ఏ పనిమీద ఏ ఊరికి పోయినవో గాని ఆ పత్తా నాకెర్కలేదయ్య, మంది నోర్లుగట్ట నాతరమా, ఈళ్ళమీద మన్ను వడనయ్యో, ఈళ్ళ మీద దుమ్ముపడనయ్యో” అంటూ అందరు వినేట్టుగానే వాకిట్లో కూర్చుని సోకాలు పెట్టింది.

 – జాజులగౌరి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

75
UncategorizedPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో