సమాజానికి ఉత్తమ పౌరుల్ని అందించే బాధ్యత తల్లితో పాటు పాఠాలు నేర్పే ఉపాద్యాయులది కూడా . భారత దేశంలో గ్రామ స్థాయి లో అక్షరాస్యత అనుకున్నంత స్థాయిలో లేని చోట్ల తల్లి దండ్రులు కేవలం జీవిత జీవిత పాఠాల్ని మాత్రమే బోధించగలరు . అక్షరాలు నేర్పి విద్యావంతులుగా ఉన్నత విలువలతో కూడిన వ్యక్తులుగా తీర్చి దిద్దే పని ఉపాద్యాయులదే అని ఒప్పుకోక తప్పదు .
‘ బ్రతక లేక బడిపంతులు ‘ అనే సామెత విస్తృతంగా వాడకంలో ఉన్న రోజుల్లో విద్యార్ధుల్ని బిడ్డల్లా చూసుకోవటం , తాము పస్తులున్న , మాసికలు బట్టలు ధరించిన అన్నింటిని తమ మనసుల్లోను , తమ కండువాల క్రింద కప్పుకుని సౌమ్యంగా , సహనంగా , చిరునవ్వుతో కన్పిస్తూ ఏ స్థాయి పిల్లల్నైనా ఉన్నత స్థాయికి చేర్చాలనే ఆరాటం కన్పిస్తూ ఉండేది .
ఇప్పుడు రోజులు మారాయి . విద్యార్ధుల , ఉపాధ్యాయుల మానసిక దృక్పధాల్లో ఎన్నో మార్పులు వచ్చాయి . ఈ పరిణామం ఒక ఎత్తు అయితే , గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి లో నివసించే తల్లిదండ్రుల దృక్పధాల్లో అనూహ్యమైన మార్పులెన్నో చేసుకున్నాయి . పూర్వం తన పిల్లలకి నాలుగు అక్షర ముక్కలు వస్తే చాలు అని , పాఠశాలలకి వెళ్తే చదువుతో పాటు అబ్బుతుందని , రానివాడు వింత పశువని రకరకాలుగా ఆలోచించేవారు . పరీక్షల్లో ఉత్తీర్ణత పొందక పోతే పై తరగతికి పంపడానికి ఉపాధ్యాయుల మనసు ఒప్పేది కాదు .తల్లిదండ్రులు ,పిల్లలు కూడా ఉత్తీర్ణత కాలేమేమో అనే భావనతో కష్టపడి చదవడానికి ఇష్ట పడే వారు .
ఈ ధోరణిలోను ఇప్పుడు చాలా మార్పు వచ్చిందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు . ఉపాద్యాయులు బళ్లో పాఠాలతో పాటు , కోచింగ్ సెంటర్లో కూడా వారి స్థాయిని బట్టి రేట్లు నిర్ణయించి విద్యను అందిస్తున్నారు . విద్యార్ధులు కళాశాలకు వెళ్లకపోయినా పర్వాలేదు . కోచింగ్ సెంటర్లే జీవితాలుగా తీవ్రమైన ఒత్తిడితో ఆటపాటలకు దూరమై వీనస్ భూగోళాన్ని మోస్తునట్లుగా పుస్తకాల సంచుల్నే మోస్తున్నారు .
ఇక ఇప్పటి తల్లిదంద్రులైతే ఏ స్థాయి లేకుండా అందరి గురి ఒకటే . తమ పిల్లల మేధా శక్తీ ఎంత వరకు ఉందొ , ఏ అంశం వారికి ఆసక్తి ఉందో , ఏ రంగంలో రాణించగలరో అనేవి ఆలోచించడానికి తావులేని పరిస్థితి . బాణం వేసే వాడి దృష్టి ఎదుటి వాడి తలపై ఉన్న యాపిల్ మీదే అన్నట్లు అందరి దృష్టి ఇంజనీరింగ్ , డాక్టర్ వృత్తుల పైనే ఉంటుంది . బలవంతంగా రుద్దబడ్డ కోర్సులతో కుస్తీలు పడుతూ తమకి ఇష్టమైన చిత్ర కళ , నాట్యం , సంగీతం వంటి లలిత కళల్ని వదిలేసుకుని తల్లిదండ్రుల కోసం పోరాడుతున్నారు .
అవగాహన సదస్సులు నిర్వహించే పాఠశాలలు , కళాశాలల యాజమాన్యాలు తాము నిర్వహించే విద్యలతో పాటి విద్యార్ధులకు అసలు ఏ కోర్సులు ఇష్టం , ఏ ఏ రంగంలో మక్కువ తెలుసుకుని అలాంటి కోర్సులును కూడా ప్రారంభించి వారి మానసిక వికాసానికి తోడ్పడే విధంగా ఉంటే పిల్లలపై ఒత్తిడి ఉండదు . రంగాలలోను పిల్లాలు రాణిస్తారు .
తమ పిల్లలు పలానా రంగంలో రాణించాలని కోరుకునే తల్లిదండ్రులకి ఉపాద్యాయులు క్రింది స్థాయి విద్యాభ్యాసం నుంచి వారికి అర్ధమయ్యేలా చెప్పే బాధ్యత ఉపాద్యాయులపైన ఉంది .
— హేమలత పుట్ల
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`